“శ్రేష్ఠమైన సమయం” పరిమిత వ్యవధుల్లో వినియోగించబడుతుంది
ఈ రోజుల్లో కొద్దిమంది తలిదండ్రులే వారి పిల్లల కొరకు సరిపడినంత సమయాన్ని తీసుకుంటున్నారు. చాలామంది ఒంటరిగా భర్త లేదా భార్య సహాయం లేకుండానే వారి సంతానాన్ని పోషించడానికి ప్రయాసపడుతున్నారు. క్షీణించుచున్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా, కుటుంబానికి ఆర్ధికంగా సరిపడునంత పొందటానికిగాను, తలిదండ్రులిద్దరూ బయట పనిచేయాల్సిందని చాలామంది తలిదండ్రులు గుర్తిస్తున్నారు. అయితే, శ్రేష్ఠమైన సమయం అనే తలంపు వృద్ధియైందనుటలో ఆశ్చర్యమేమీ లేదు.
అందరికీ తెలిసినట్లే సాధారణంగా శ్రేష్ఠమైన సమయం అనే దానిలో, తరచూ ఒక కచ్ఛితమైన కార్యక్రమాన్ని అనగా జంతు ప్రదర్శనశాలకు వెళ్లడంవంటి కొన్ని విశేష యాత్రలకు వెళ్లే కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని, కొంత సమయాన్ని పిల్లవానితో గడపడానికి పట్టిక వేసుకోవడం యిమిడివుంది. ఈ తలంపు యోగ్యమైనదనుట విశదమే. పిల్లలకు వారు పొందగల్గినంత ఏదోరకమైన ప్రత్యేక అవధానం అవసరమైనప్పటికి, శ్రేష్ఠమైన సమయం అనే సాధారణ అభిప్రాయం అనేది శిశు సంరక్షక నిపుణులకు మరెక్కువ విశదమౌతున్న కొన్ని లోపాలను కల్గివున్న భావనే.
ఉద్యోగంలో నిమగ్నమైన చాలామంది తలిదండ్రులు, ఏర్పాటు చేసిన, పట్టిక వేసిన కొంచెం సమయాన్ని పిల్లవానితో గడపినట్లైతే అది పిల్లవాని అవసరతలన్నింటిని తీర్చుతుందనే మోసకర తలంపును కల్గియున్నారనేది విశదమే. కాబట్టి, అమెరికాలో కార్నెల్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్‌నందు ప్రొఫెసర్ అయిన డా. లీ సాక్ యిలా అంటున్నాడని న్యూయార్క్‌లోని డైలీ న్యూస్ ఉదహరిస్తున్నది: “శ్రేష్ఠమైన సమయం అనే అభిప్రాయం అర్థరాహిత్యం.” ఆయన యింకా ఇలా వివరిస్తున్నాడు: “తలిదండ్రుల అపరాధం మూలంగానే ఈ పదం ఉనికిలోకి వచ్చింది. ప్రజలు వారి పిల్లలతో తక్కువ సమయం గడపడానికే సిద్ధంగావున్నారు.
కాని తలిదండ్రులు పిల్లవానిపై కేంద్రీకరించిన చెక్కుచెదరని అవధానంతో కూడిన శ్రేష్ఠమైన సమయం అనేది దాని కాలవ్యవధి లోటు కలిగించదా? లేదు, ఎందుకంటే తలిదండ్రులు వారి పిల్లలకు తాము చూపే మాదిరిద్వారా అత్యంత ప్రభావశీలంగా బోధిస్తారు. అధిక జనసాంద్రతగల పట్టణ యౌవనులను గూర్చిన అధ్యయనం ద్వారా ఈ వాస్తవం గట్టిగా దృష్టాంత పరచబడింది. కుటుంబ సభ్యులు కారాగారంలో వుంటూండగా పెరిగిపెద్దవారైనవారు, వారికంటే రెండింతలు తామే కారాగారంలో చిక్కుకొన్నారు. అదేరకంగా, త్రాగుబోతులు లేదా మాదకద్రవ్యాలు సేవించేవారి సంరక్షణలో పెరిగితే, అట్టివారు వారివలెనే రెండింతలు అలాంటి మరణకర అలవాట్లకు లోనయ్యారు.
మంచి తలిదండ్రుల మాదిరి కూడ అలాగే ప్రభావవంతమైంది కాగలదు. సమస్యేమిటంటే, ఒక మంచి నమూనా పెట్టడానికి కావల్సింది సమయం, ఎక్కువ కాలవ్యవధులతో కూడిన సమయమే కాని చక్కగా తక్కువ వ్యవధులున్న శ్రేష్ఠమైన సమయం కాదు. న్యూయార్క్ డైలీ న్యూస్ యిలా చెబుతుంది: “శ్రేష్ఠమైన సమయం అనే తలంపు దోషపూరితమైంది, ఎందుకంటే తల్లి లేదా తండ్రికి పిల్లవానికి మధ్య మధుర క్షణాలు, అంటే సంభాషణలు, మనసులో భద్రత, విలువ, స్వగౌరవాన్ని నాటింపజేసే నిర్ణయాలనేవి స్వాభావికమైనవై యుండాలి.” ఆ స్వాభావిక మధురక్షణాన్ని ఎవరూ పట్టికవేసి పాటించలేరు. ఒక తల్లి లేదా తండ్రి పిల్లవానితో 15నిమిషాల శ్రేష్ఠమైన సమయాన్ని గడపడానికి కేటాయించవచ్చు, కాని తల్లి లేదా తండ్రి, పిల్లవాడు ఆ సమయంలో ఒక మంచి సన్నిహితత్వానికి చేరుకుంటారని ఎవరికైనా ఎలా తెలుసు? ఒకవేళ దినమంతటిలోనూ కేవలం ఆ కొన్ని నిమిషాలే తల్లి లేదా తండ్రితో గడపినట్లైతే, పిల్లవాడు ఎలా వారి మాదిరిద్వారా నేర్చుకుంటాడు?
తలిదండ్రులకు పిల్లలతో గడపటానికి చాలా కొద్ది సమయమే వుంది గనుక మరి పరిష్కారం ఏమిటి? సరళమైన జవాబులేమీ లేవు. పిల్లలను పెంచడాన్ని ఈ లోకం ఒక అతి కష్టమైన కార్యంగా చేసిన నిజాన్ని ఏదీ మార్చజాలదు. కొంతమంది తలిదండ్రులు వారి ఉద్యోగానికి తక్కువ అవధానమివ్వగలరు. పిల్లల సంరక్షణ గూర్చిన ఇటీవలి పుస్తక రచయిత తలిదండ్రులెవరైతే వారి ఉద్యోగానికి తక్కువ అవధానమివ్వగలరో అట్టివారిని పిల్లలతోపాటు యింటివద్దనే ఉండమని ఉద్బోధిస్తున్నాడు. కాని చాలామంది తలిదండ్రులకు, అలాంటి ఎన్నికలేదు. సులభమైన పని కల్గినవారు కూడ లేదా ఏ ఉద్యోగం లేనివారు కూడ, వారి పిల్లలతో గడపటానికి చాలినంత సమయం పొందడం కష్టమని గుర్తిస్తున్నారు.
శుభ్రంచేయుట, వంటచేయుట, వస్తువుల సంరక్షణ, వాహనాలను జాగ్రత్తగా చూచుకోవడం, బట్టలు ఉతుకుట, సామానులను కొనుటవంటి ఇంటి దగ్గర చేసే పనులలో కొన్నింటిని తలిదండ్రులు వారి పిల్లలతో కలిసి చేయగల్గుటకు ప్రయత్నించవలెనని కొందరు నిపుణులు ఉద్బోధిస్తున్నారు. చాలా చిన్న సంసారిక చిల్లరపనులను కూడ కలిసి చేయడం, లేదా కలిసి విశ్రాంతి తీసుకోవడం, ఒకవేళ తలిదండ్రులు సంభాషించుటకు కావల్సిన సమయాన్నివ్వడానికి, మంచి మాదిరిని చూపడానికి వీలౌతుంది. క్రైస్తవ తలిదండ్రులు వారి పిల్లలతోసహా కలిసి చేయాలనుకునే యితర పనికూడ వారికున్నది. క్రైస్తవ కూటములు, పరిచర్య, కుటుంబ బైబిలు పఠనం, తోటివిశ్వాసులతో సహవాసం మొదలైనవన్నీ తలిదండ్రులకు వారి పిల్లలతో గడిపే కీలక సమయాన్ని అందిస్తాయి.
సుమారు 3,000 సంవత్సరాలకు పూర్వం ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన న్యాయకట్టడ కూడ ఇదేరకమైన విషయాన్ని గుర్తించిందనుట ఆసక్తికరం. ద్వితీయోపదేశకాండము 6:6, 7వచనాల్లో మనమిలా చదువగలం: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” ప్రాచీనకాలంలో జీవితం సులభంగా వుండేదని కచ్ఛితంగా చెప్పలేము. ప్రతిదినం కుటుంబానికి అవసరమైన వాటిని ఏర్పాటు చేయటానికి కావల్సిన సమయమంతటిని గూర్చి, అంటే తండ్రి తన కుటుంబాన్ని పోషించడానికి ఎంత పని చేయాలో, లేదా వంటచేయటం, బట్టలు ఉతకటం వంటి పనులు చేయటానికి ఎంత కష్టపడాలో ఆలోచించండి! కాని యెహోవాను ప్రేమించిన తలిదండ్రులు వారి పిల్లలతో కలిసి చేయగల్గిందంతా చేశారు, తద్వారా దేవుని నీతినియమాలను వారి చిన్నారుల హృదయాలలో నాటడానికి ప్రతిదినం ఎన్నో మధురక్షణాలను పొందారు.
ఈనాటి క్రైస్తవ తలిదండ్రులు కూడ అలాగే చేయవలసివుంది. వారి పిల్లలతో గడిపే సమయంలో, కేవలం ఎక్కువ అనుకూలంగానున్నట్లు కన్పించేవాటినే చేయకుండా వారు జాగ్రత్త పడాలి. “గంగగోవు పాలు గరిటెడైనను చాలు” అనే పాతసామెత పిల్లల పెంపకంలో అన్వర్తించదు. ప్రాముఖ్యంగా వారు ఎదిగే సంవత్సరాలలో, పిల్లలకు కేవలం ప్రత్యేక సమయం కాదుగాని “కలిసిగడిపే” సమయం కూడ అవసరము. (g93 5/22)
[27వ పేజీలోని చిత్రం]
కుటుంబం పిల్లలతోపాటు ఇంటిపనిలో, పిల్లలు నిమగ్నమయ్యారు
[27వ పేజీలోని చిత్రం]
యెహోవాను కలిసి సేవించుట