యుద్ధం అంతమొందడానికి ఏ నిరీక్షణ వుంది?
పందొమ్మిది వందల పద్నాలుగు నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం, సమస్త యుద్ధాలను అంతమొందించే యుద్ధమని పిలువబడింది. అయిననూ, అప్పటినుండి ఇంతవరకూ జరిగిన యుద్ధాలలోకెల్లా అతి గొప్పదైన రెండవ ప్రపంచ యుద్ధంతో సహా 200 యుద్ధాలకంటే ఎక్కువ యుద్ధాలే జరిగాయి.
యుద్ధాలను ఆపివేయాలన్న మానవ ప్రయత్నం విఫలమైందన్నది తేటపడింది. అందుకే, “యుద్ధాలు ఎల్లప్పుడూ వుంటాయా?” అని అనేకులు అడగడంలో ఆశ్చర్యం లేదు. మీరు కూడా అదే నమ్ముతారా?
యుద్ధమంటేనే విసుగెత్తిపోయిన మానవులకు యుద్ధాలు లేని లోకాన్ని ప్రసాదించాలన్న ఉద్దేశంతో, మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. న్యూయార్క్ పట్టణంలో యు. ఎన్ ప్లాజా గోడపైన వ్రాయబడిన దానిలో ఈ భావం వ్యక్తమౌతోంది. అక్కడ యిలా వుంది: వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
శాంతి నిరీక్షణకై యింత అద్భుతంగా వ్యక్తపర్చబడిన దానిని జనములు తమ యుద్ధపిపాసతో వెక్కిరించడం విచారకరం. అయినప్పటికీ, ఈ వాక్యాలు నెరవేరుతాయి! ఎందుకంటే అవి 2,500 సంవత్సరాల క్రితం అపరిపూర్ణ మానవుని కంటే చాలా ఉన్నతమైన మూలం నుండి వచ్చాయి. అవి సర్వోన్నతుడైన దేవుని వాగ్దానాన్ని సూచిస్తున్నాయి.—యెషయా 2:4.
ఒక అసత్య నిరీక్షణ
యుద్ధ విముక్తి లోకానికై అనేకులు చర్చీలవైపు చూశారు. అయితే వాస్తవానికి చర్చీలు ప్రపంచంలోకెల్లా అతి విచ్ఛిన్నకర, యుద్ధోన్మాద శక్తులుగా నిరూపించబడ్డాయి. ఉదాహరణకు, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటీషు బ్రిగేడర్ జనరలైన ఫ్రాంక్ పి. క్రూజర్ యిలా అన్నాడు: “మనకున్న వాటిలో క్రైస్తవ చర్చీలే రక్తపాతాన్ని సృష్టించడంలో దిట్టలు, మరి వాటిని మనం పూర్తిగా ఉపయోగించు కున్నాము.”
కాబట్టి, నిజమైన క్రైస్తవత్వమేదో అబద్ధ క్రైస్తవత్వమేదో మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. దీన్ని మనం గ్రహించడానికి యేసు ఒక చక్కటి సామాన్య సూత్రాన్ని యిచ్చాడు: “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు” (మత్తయి 7:16) వట్టి మాటలు, లేదా నమ్ముతున్నామని చెప్పడం మాత్రమే సరిపోదు. దీనిని ఉదహరించడానికి వాన్‌కోవర్ సన్ స్టాఫ్ రచయిత స్టీవ్ వైసెల్ యిలా పేర్కొన్నాడు: “ఆయిలు మరకలున్న నీలం రంగు డాంగ్రీని వేసుకున్న వారందరూ . . . మెకానిక్కుల్లా కనిపించినా, . . . ‘మేము మెకానిక్కులము’ అని వారు చెప్పుకున్నా సరే, వారు మెకానిక్కులు కాజాలరు.”
అతని ఉపమానాన్ని క్రైస్తవత్వానికి అన్వయిస్తూ వైసెల్ యిలా అన్నాడు: “క్రైస్తవత్వం పేరులో అది యిది చేసారు, మరి అది ఎంత అసహ్యమైంది, అని ప్రజలు చెప్పుకోవడాన్ని మీరు అనేకసార్లు వినివుంటారు. అవును నిజమే, అది చాలా అసహ్యమైంది. . . . ఈ కార్యాలను చేసిన వారిని క్రైస్తవులని ఎవరంటున్నారు?
“ఓహో, మీరనేది, స్థాపించబడిన చర్చీలు అలా అంటాయనా. మరి, స్థాపించబడిన చర్చీలు క్రైస్తవులని ఎవరన్నారు?
“పోపు ముస్సోలినీని ఆశీర్వదించాడు, అంతేకాక యితర పోపులు గతంలో ఘాతక కృత్యాలు చేసారన్న ఆధారాలున్నాయి. కాబట్టి వారు క్రైస్తవులని ఎవరన్నారు?
“ఆ మనిషి పోపు గనుక అతను క్రైస్తవుడని మీరనుకుంటున్నారా? తాను ఒక మెకానిక్ అని చెప్పుకునే వాడు మెకానిక్ కానట్లే—‘నేను క్రైస్తవుడను’ అని ఒకడు అన్నంత మాత్రాన అతడు క్రైస్తవుడవుతాడని కాదు.
“క్రైస్తవులమని నటించేవారిని గూర్చి కూడా బైబిలు హెచ్చరిస్తోంది. . . . ఏ క్రైస్తవుడు కూడా మరో క్రైస్తవున్ని చంపలేడు—అది తన్ను తాను చంపుకున్నట్టు అవుతుంది.
“నిజమైన క్రైస్తవులు యేసుక్రీస్తు నందు సోదర సోదరీలు. . . . వారు ఎన్నడూ ఒకరికొకరు ఉద్దేశపూర్వకంగా హాని చేసుకోరు.”
కాబట్టి మనం యేసు నియమాన్ని అన్వయించి, చర్చీలు ఫలించే ఫలాలను గమనించాలి. అయితే అవి ఎలాంటి ఫలములు? బైబిలు ప్రత్యేకంగా ఒక దాని గూర్చి చెబుతోంది. “దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా? మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను.”—1 యోహాను 3:10-12.
చర్చీలు, ఒకని సహోదరుని ప్రేమించేందుకు ప్రోత్సహించకుండా, ఒకని సహోదరున్ని చంపడానికి ప్రోద్బలాన్నివ్వడమే కాకుండా దాన్ని ప్రేరేపించాయి. ఆ విధంగా, ఐగుప్తు, అస్సీరియా, బబులోను, రోమాల వలే వారు అపవాదియైన సాతాను పాలయ్యారు. యేసుక్రీస్తు సాతానును “ఈ లోకాధికారి” అన్నాడు. మరి యేసు తన యథార్థ అనుచరులను గూర్చి యిలా అన్నాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 12:31; 17:16; 2 కొరింథీయులు 4:4) అయినా, చర్చీలు తమ్మును తాము లోకంలో భాగంగా చేసుకొన్నవి.
కాబట్టి యుద్ధ విముక్తి లోకాన్ని తేవాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు చర్చీలను ఉపయోగించుకోడన్నది స్పష్టమైంది. సైనిక మతాధికారులు, యితర చర్చి ప్రతినిధులు ఏమి చెప్పినా, జాతీయ యుద్ధాల్లో మాత్రం దేవుడు ఒకరి పక్షం వహించడు.
యుద్ధాన్ని నిర్మూలించాలన్న దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? ఏ ప్రజలైనా తమ ఖడ్గములను నాగటి నక్కులుగా నిజంగా మలచుకున్నారా? కొందరు అలాగే చేశారు.
దేవుని వాగ్దానాన్ని నెరవేర్చే ప్రజలు
ప్రఖ్యాతిగాంచిన చర్చి చరిత్రకారుడైన ఎస్. జె. కడూ యిలా పేర్కొన్నాడు: “తొలి క్రైస్తవులు యేసును నమ్మారు . . . వారు తమ మతాన్ని శాంతితో ముడిపెట్టారు; రక్తపాతానికై జరిపే యుద్ధాలనూ, రక్తపాతంతో కూడిన యుద్ధాలను వారు ఖండించారు; యుద్ధోపకరణాలు వ్యవసాయ పనిముట్లుగా మారుతాయన్న పాత నిబంధనా ప్రవచనానికి తగినట్లు వారు నడుచుకొన్నారు.”—యెషయా 2:4.
మరి ఈ రోజు మాటేమిటి? యేసును నమ్మి, ఒకరినొకరు నిజంగా ప్రేమించుకునే ప్రజలున్నారా? తద్వారా వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా మలచుకొన్నారా? ఎన్‌సైక్లోపీడియా కెనెడియోనా ఇలా చెబుతోంది: “మన శకంలో, మొదటి, రెండవ శతాబ్దాల్లోని తొలి క్రైస్తవులూ యేసు క్రీస్తు శిష్యులు ఆచరించిన పద్ధతిని పునరుద్ధరించి, పునఃస్థాపించడమే యెహోవాసాక్షుల పని. . . . యెహోవాసాక్షులందరూ సోదరులే.”
కాబట్టి, క్రీస్తు శాసనాన్ని గైకొనినవారై, యితర జాతి లేక రాష్ట్రానికి చెందిన వారైనప్పటికి యెహోవాసాక్షులు తమ సోదరులను ద్వేషించరు, చంపరు. (యోహాను 13:34, 35) “శతాబ్దాలుగా [చర్చీలు] తమ శత్రువులను సంహరించడానికి అతి క్రైస్తవేతరంగా ప్రార్థించి, తమ యుద్ధాన్ని, సైన్యాన్ని, ఆయుధాలను ఆశీర్వదించడానికి [చర్చీలు] స్వేచ్ఛామోదాన్నిచ్చాయి” అని జర్మనీలో ప్రొటెస్టెంటు నాయకుడైన మార్టిన్ నిమోల్లర్ పేర్కొన్నాడు. అయినప్పటికీ, అతను యిలా అన్నాడు: “వందల వేలమంది” సాక్షులు “యుద్ధాల్లో పాల్గొన నందుకుగానూ మనుషులను కాల్చి చంపడానికి తిరస్కరించినందుకుగాను కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లోకి వెళ్లి, మరణించారు.”
అవును, యితర ప్రజల్లాకాక, యెహోవాసాక్షులు నిజంగా ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టుకున్నారు. క్రీస్తు చెప్పినట్లుగా వారు “లోక సంబంధులు కారు”, వారు నిజంగానే యితర మతాలనుండి ప్రత్యేకంగావున్నారు. (యోహాను 15:19) రోమన్ కాథోలిక్ సెంట్. అన్‌థొనీస్ మెసెంజర్ యిలా పేర్కొంది: “యెహోవాసాక్షులు ‘లౌకిక సమాజంలో’ ఏమాత్రం పాలుపంచుకోరు, లౌకిక సమాజం చేసిన ఏ తీర్మానాన్ని ఆశీర్వదించే బాధ్యతను వారు తీసుకోరు.”
అంటే అన్ని దేశాలనుండి కొన్ని లక్షలమంది వ్యక్తులు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టడంతోనే, నిరాయుధీకరణ అనే దేవుని వాగ్దానం నెరవేరుతుందా? ఎన్నటికీ కాదు! దేవుని వాగ్దానం యింకా పెద్ద మోతాదులో, చెప్పుకోదగిన విధంగా నెరవేరుతుంది.
యుద్ధాంతం ఎలా వస్తుంది
యుద్ధ సామగ్రినీ దానికి కారకులైన వారిని నాశనం చేయడం ద్వారా సృష్టికర్తయైన యెహోవా దేవుడు యుద్ధాన్ని అంతమొందిస్తాడు. ఈ ఉప్పొంగించే ఉత్తరాపేక్షను పరిశీలించడానికి బైబిలు కీర్తన రచయిత, చదువరులను ఆహ్వానిస్తున్నాడు. “యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.” (కీర్తనలు 46:8, 9) ఎంత అద్భుతమైన ఉత్తేజభరిత ప్రకటన!
యుద్ధ రహిత లోకాన్ని గూర్చిన ఉత్తరాపేక్ష నమ్మరానిదా? భౌతికవాదులు అలా భావించవచ్చు. ఈ పత్రికలోని 9 నుండి 13 పేజీల్లో కనిపించే జీవిత కథలోని సైనిక చరిత్రకారుడు కూడా అలాగే భావించాడు. అయితే, ఆధారాలను పరీక్షించడానికి ఆయన కొంత సమయాన్ని తీసుకున్నాడు. తత్ఫలితంగా, బైబిలు విశ్వసనీయమని ఆయన గ్రహించాడు. చరిత్రలో, గతంలోని బైబిలు ప్రవచనాలు తప్పకుండా సరైన సమయానికి నెరవేరాయని అతను కనుగొన్నాడు. ఇప్పటికింకా నెరవేరనైయున్న ప్రవచనాలు సరైన సమయానికి సంభవిస్తాయని నమ్మడానికి అవి అతనికి తగిన కారణాలను యిచ్చాయి.
ఉదాహరణకు, ఈ విధానం అంత్యదినాలను సూచించే బైబిలు ప్రవచనాలు, ఈనాడు సంభవించే సంఘటనలకు ఎలా సరిగ్గా సరిపోతున్నాయో పరిశీలించండి. (మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5) అంటే, యేసుక్రీస్తు తన శిష్యులకు “పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని నేర్పించిన ప్రార్థన యొక్క నెరవేర్పుగా దేవుని రాజ్యం సమీపింపబోతున్న సమయంలో మనమున్నాము.—మత్తయి 6:9, 10.
దేవుని రాజ్యం ఎలా వస్తుందని మనం అనుకోవాలి? ఈ విషయాన్ని గూర్చి ఒక బైబిలు ప్రవచనం యిలా అంటోంది: “ఆ రాజుల కాలములలో [అంటే, యిప్పుడు పరిపాలనలోనున్న ప్రభుత్వాలు] పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.
అవును, నోవహు కాలంలో ప్రవచించబడిన లోకవ్యాప్త జలప్రళయము సంభవించినట్లు, ప్రస్తుత రాజ్యాలను నిర్మూలించడానికి దేవుని రాజ్యము అకస్మాత్తుగా వస్తుంది. (మత్తయి 24:36-39; 1 యోహాను 2:17) ప్రస్తుత ప్రభుత్వాలు, దానికి మద్దతునందించే మతాలన్నీ నాశనమయ్యే సమయ మాసన్నమైన దృష్ట్యా, వ్యక్తిగతంగా మన స్వంత పరిస్థితిని మనం పరిశీలించుకోవడం ప్రాముఖ్యం. యెహోవా దేవుని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి నేర్చుకొని, వారు మననుండేమి కోరుతున్నారో అది చేయడానికి మనం కృషిచేస్తున్నామా? (యోహాను 17:3) మన తోటి మనుషులకు హాని తలపెట్టకుండా, ప్రేమను కనపర్చుట ద్వారా మనం మన ఖడ్గములను నాగటి నక్కులుగా మలుచుకున్నామని మనం చూపించగలమా?
యుద్ధం న్యాయ సమ్మతమైంది కాదని మీరు భావించి, శాంతి అంతటా వ్యాపించిన ఈ భూమిపై మీరు జీవించాలనుకుంటే యెహోవాసాక్షులను సంప్రదించండి. దేవుని రాజ్య పరిపాలన క్రింద యుద్ధం యిక ఎన్నటికీ లేకుండా ఎలా ఉంటుందన్న విషయాన్ని మీకింకా విశదంగా తెలుపడానికి వారు ఎంతో సంతోషిస్తారు. (g93 4/22)
[7వ పేజీలోని బాక్సు]
యెహోవాసాక్షుల కొరకు హిమ్లర్ యోచన
హెన్‌రిచ్ హిమ్లర్, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ ఎస్. ఎస్ లేక ఎలైట్ గార్డులకు అధికారిగావుండేవాడు. జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ తర్వాత అతనే అధికారంగలవాడు. ప్రపంచాన్ని జయించాలన్న నాజీ యోచనలో యెహోవాసాక్షులు పాల్గొననందుకు వారిని ద్వేషించినా, అతను వారిని గౌరవించేవాడు. గెస్టాపో ప్రధానియైన ఎర్‌నెస్ట్ కాల్‌టెన్‌బర్‌నర్‌కు హిమ్లర్ వ్రాసిన ఒక లేఖలో యిలా వ్రాశాడు:
“ఇటీవల లభించిన కొంత సమాచారం, పరిశీలనను బట్టి నేను తలపెట్టిన పథకాలు కొన్ని నీ దృష్టికి తీసుకురావాలను కుంటున్నాను. ఇది యెహోవాసాక్షులకు సంబంధించింది. . . . అనేక ప్రాంతాలను స్వాధీనపరచుకొని . . . మనం రష్యాను ఎలా పరిపాలించగలం, ఎలా శాంతిని చేకూర్చగలం? . . . అన్ని రకాల మతాలకూ శాంతి శాఖలకూ, . . . ప్రాముఖ్యంగా యెహోవాసాక్షుల విశ్వాసానికి . . . మనం మన మద్దతునివ్వాలి. మనకు అద్భుతంగా మేలు చేసే లక్షణాలు యెహోవాసాక్షులకు వున్నాయన్నది అందరికీ తెలిసినదే; సైన్య సేవలో, మరి యుద్ధానికి సంబంధించిన దేనిలోకూడా వారు పాల్గొనకపోవడమేకాక . . . వారు చాలా విశ్వసనీయులు, అమితంగా తాగరు, పొగత్రాగరు; కష్టపడి పనిచేయడమేకాక వారు ఎంతో నిజాయితీపరులు. వారి మాట నమ్మదగింది. ఇవి శ్రేష్ఠమైన లక్షణాలు . . . ఇతరులకు ఈర్ష్యకలిగించే లక్షణాలు.”
లేదు, ఎన్నడు కూడా నాజీలకొరకు పనిచేయమని సాక్షులను హిమ్లర్ బలవంత పెట్టలేదు. శాంతిని కోరే లక్షణం తనకు, తన ప్రజలకు కావాలని వాంఛించలేదు కానీ, ఈ శ్రేష్ఠమైన లక్షణాలు రష్యా దేశీయులు నేర్చుకోవాలని కోరుకున్నాడు. వారి ఖడ్గములను నాగటి నక్కులుగా మలచుకొనేలాగున అది వారిని శాంతియుత ప్రజలుగా చేస్తుంది.
[8వ పేజీలోని చిత్రం]
దేవుని రాజ్యం యుద్ధ సామగ్రిని సంపూర్ణంగా తీసివేసి, ప్రజలను శాంతియుత నూతన లోకంలోకి నడిపిస్తుంది