సైనిక చరిత్రకారునిగా నా గతస్మృతులు
అది ఆగస్టు 25, 1944. స్థలం: పారిస్, ఫ్రాన్సు. మా జీపు చాంప్స్ ఎలిసిస్ సువిశాలమార్గం గుండా వెళుతుండగా, దొంగచాటుగా కాల్చే నాజీ సైనికులు పేలుస్తున్న తూటాలు వీధి కిరుప్రక్కలనుండి వస్తున్నాయి కాబట్టి మేము అనేకసార్లు జీపు దిగి ఇళ్లలో దాక్కొన వలసివచ్చింది.
రెండవ ప్రపంచ యుద్ధసమయంలో పారిస్‌ను హిట్లరు సైన్యం నుండి విడిపించడం ఆరోజే ప్రారంభమయ్యింది, పట్టణంలోకి ప్రవేశించిన మొదటి అమెరికన్లలో నేనొకడిని. స్వాతంత్ర్య యోధులుగా మాకు స్వాగతం చెప్పటానికి ఫ్రెంచి స్త్రీపురుషుల అఖండ జనసమూహాలు ప్రవాహంలా వీధుల్లోకి వచ్చాయి. ఉన్నతస్థాయి జర్మను ఆఫీసర్లచే ఆ ఉదయమే త్వరత్వరగా ఖాళీ చేయించబడిన విలాసవంతమైన హోటల్‌లో మేము ఆ రాత్రి గడిపాము.
నేను యూరపులో, జనరల్ జార్జ్ ఎస్. పాటన్, జూనియర్ నాయకత్వం క్రిందనున్న అమెరికా మూడవ సైనిక కార్యకలాపాలలో రికార్డు సృష్టిస్తున్న చారిత్రాత్మక పోరాటవర్గ సభ్యుడిగా వుండేవాణ్ణి.
యుద్ధం రేకెత్తించిన ప్రశ్నలు
పారిస్‌లోకి ప్రవేశించడానికి కొన్ని రోజుల ముందు, జర్మను సాయుధవాహనాల కాలిపోయిన స్థూలభాగాలు ఇటీవలనే తీసివేయబడిన ఇరుకు రోడ్లగుండా మేము ప్రయాణించాము. అడవిలో ఈమధ్యనే అమెరికా సైనికులచే ఆక్రమించుకొనబడిన స్థావరంవద్ద మేము ఆగాము. జర్మను సైనికుల శరీరాలు మెలికలు తిరిగిపోయి, చితికిపోయి పడివున్నాయి. వారి బెల్టుబక్క్‌ల్స్‌పై “దేవుడు మాతో ఉన్నాడు” అని వ్రాసివుంది. ఇంకా, దగ్గరలో వున్న రాతిగోడపై ఒక జర్మను సైనికుడు వంకరటింకర వ్రాతతో “నాయకుడా, [హిట్లర్] మాకు సహాయం చేయు”మని వ్రాశాడు.
ఆ రెండు వ్యాఖ్యలు నాపై చెరగని ముద్ర వేశాయి. ఒకవైపు, నాజీ పాలన దేవుడు తమతో వున్నాడని బలంగా నమ్మితే ఇంకోవైపు ఒక సైనికుడు, నాయకుడైన హిట్లరును రక్షణ కొరకు అర్థించడం. జర్మన్లలో ఈ విరుద్ధత క్రొత్తేమి కాదని నేను గ్రహించాను. ఈ భయంకరమైన పోరాటంలో ఇరువర్గాల వైపు యిది విశేషంగా వుంది. అయితే ‘యుద్ధాల్లో దేవుడు ఒకరి పక్షం వహిస్తాడా? దేవుడు ఎవరి పక్షాన వున్నాడు?’ అని నేను ఆశ్చర్యపోయాను.
యుద్ధాలు, యుద్ధ దుశ్శకునాలు
అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రవేశించిన సంవత్సరంలో, అనగా 1917లో మోన్‌టానాలోని బుట్టేలో నేను జన్మించాను. ప్రైవేటు విద్యాసంస్థ నుండి పట్టభద్రుడ్నయిన తరువాత నేను కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించాను. భూవ్యాప్తంగా జరుగుతున్న ఉత్తేజకరమైన సంఘటనలతో పోలిస్తే, మొదటి సంవత్సరం విద్య బోరుకొట్టేదిగా వున్నట్లు నేను గ్రహించాను. జపాను చైనాపైకి దండెత్తింది, ముస్సోలినే ఇతియోపియాపై విజయం సాధించాడు, స్పానిష్ పౌరయుద్ధం తీవ్రతరమైంది. ఆ యుద్ధంలో నాజీలు, ఫాసిస్టులు, కమ్యూనిస్టులు తమతమ ఆయుధాలను, వ్యూహరచనా విద్యను రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించటానికి పరీక్షిస్తున్నారు, అయినా నానాజాతి సమితి ఏమీ చేయలేదు.
నా చదువు కొరకు ప్రక్కనుంచిన డబ్బును యూరపు, ఆఫ్రికా దేశాలకు ప్రయాణించటానికి ఉపయోగించటం కొరకు నా తండ్రి అంగీకారం తీసుకుని, రెండు సెమిస్టర్లు అయిపోయాక నేను కళాశాలవిద్య మానేసాను. డోయెక్లాంట్ అనే ఒక జర్మను ఓడలో 1938 ముగింపు కాలానికి నేను అట్లాంటిక్‌ను దాటి, హిట్లరు యొక్క జర్మనీకి విరుద్ధంగా వున్న బ్రిటిష్ మరియు ఫ్రెంచి సామ్రాజ్యాల బలాబలాలను గూర్చి ఓడలోనున్న యౌవన జర్మను ఆఫీసర్లతో పెద్దపెద్ద చర్చలు చేసేవాడిని. పారిస్‌లో హిట్లరు యొక్క ఆధునిక బెదిరింపులు, ప్రగల్భాలు, వాగ్దానాలను గూర్చి ప్రజలు మాట్లాడుకునే వారు, అయినా దినచర్య అలాగే కొనసాగుతూనే వుండేది. ఆఫ్రికాలోని టాంగ్యర్‌ను దర్శిస్తున్నప్పుడు, సముద్ర మార్గమైన జిబ్రాల్టర్ అవతల పౌరయుద్ధంతో నలిగిపోయిన స్పెయిన్‌లో అప్పుడప్పుడు యుద్ధశబ్దాలు వినగల్గేవాడిని.
నేను 1939లో అమెరికాకు తిరిగివచ్చినప్పుడు, మన కాలాన్ని గూర్చిన దుశ్శకునాలుండినవి. డిశంబరు 1941లో జపానీయులు పెరల్ నౌకాశ్రయంపై దాడిచేసి, అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించేలా చేసినప్పుడు నేను సైనిక రవాణా సంస్థలో పౌరునిగా చేరాను. నేను 1942లో అలాస్కా నందున్నప్పుడు, తప్పనిసరి సైనికసేవలో చేరటానికి పురుషులను నమోదు చేసుకుని వర్గీకరించి, ఎన్నుకునే సంస్థ నుండి ఒక నోటీసు అందుకున్నాను.
బ్రిటిష్ ద్వీపానికి
ఒకసారి ఇంటికి వెళ్లివచ్చిన తరువాత, సైన్యంలో చేర్చుకొనబడి ఒక సంవత్సరం పాటు అమెరికాలోనే వున్నాను. తరువాత నేను ఓడలో ఇంగ్లాండుకు వెళ్లాను, మా నౌక 1944 వసంతకాలంలో అమెరికా తూర్పు తీరప్రాంతాన్ని వదిలి బయల్దేరింది. మా ప్రక్కనేవున్న ఓడను జర్మను జలాంతర్గామినౌక ముంచేసినప్పుడు, ఉత్తర అట్లాంటిక్‌లో నేను మొట్టమొదట యుద్ధాన్ని చవిచూసాను. మా వాణిజ్యనౌకల సమూహం విడిపోయింది, అక్కడి నుండి లివర్‌పూల్‌కు ప్రతి ఓడ దేనికది వెళ్లాల్సిందే.
ఇంగ్లాండులోని ఒక డిపోనొద్ద పనికొరకు వేచివున్నప్పుడు, ఒక సైనిక మతాధికారి ప్రసంగాన్ని వినుటకు సైనిక దళాలు సమావేశమయ్యాయి. పోరాటంలో దేవుడు తమకు మద్దతు నిస్తున్నాడని చెప్తున్నప్పటికీ, అవతలివైపు తమ స్వంత మతసంస్థలకు చెందిన సభ్యులతో యుద్ధం చేయమని ఆ మతనాయకుడు ఉద్బోధించడం నాకు విచారం కలుగజేసింది. స్పష్టంగా, ఇరువర్గాలకూ దేవుని మద్దతు ఉండడం అసాధ్యం.
బ్రిటిష్ ద్వీపాలు 1944 వసంతకాలంలో తమ సామానుతో వచ్చి చేరిన అమెరికా, బ్రిటిష్ సైనికులతో క్రిక్కిరిసి పోయింది. సిసిలియన్, ఉత్తర ఆఫ్రికాలలో ఆయన చేసిన దండయాత్రలలో తానుపయోగించిన సాహసోపేతమైన యుద్ధకుశలతకు పేరుగాంచిన జనరల్ పాటన్, విజయం సాధించేంతవరకు, దొరికిన ప్రతి ఆయుధంతోను వీలైనంతమంది శత్రువులను చంపాలనే పనికొరకే తామున్నామని సైన్యం గ్రహించుకునేలా ప్రేరణాత్మక ప్రసంగాలను ఇచ్చాడు. పాటన్ శిక్షణపొందిన ఆధునిక యోధుని పోలి ఉండెను; ఆయన ఎత్తుగా ఉండి, ఆయుధాలు మరియు శిరస్త్రాణం, హోదాను, సైనిక యోగ్యతను తెలియజేసే నక్షత్రాకార ఆభరణాలతో ప్రకాశిస్తున్న మడత చెరగని సైనిక దుస్తులను ధరించాడు. ఆయన ఇతరులను బాగా ప్రేరేపించేవాడు కూడా, ఆయన కఠినంగా, మొరటుగా మాట్లాడేవాడు. మతాసక్తిగలవాడు, ఆయన యుద్ధానికి ముందు ప్రార్థించేవాడు.
జనవరి 1, 1944న జరిగిన తన “సైనిక ప్రార్థన”లో పాటన్ ఇలా ప్రార్థించాడు: “మేము సముద్రము ద్వారా, నేల ద్వారా ఎల్లప్పుడూ విజయం సాధించ గలిగేలా నడిపించిన మా పితరుల దేవా, మా గొప్ప యుద్ధంలో మాకు మీ ప్రేరణాత్మక నడిపింపునిస్తూనే వుండండి . . . ప్రభువా మాకు విజయం అనుగ్రహించు.”
యూరపును ముట్టడించుట
ప్రపంచం మునుపెన్నడూ చూడని అత్యంత గొప్ప యుద్ధనౌకా సమూహంతో మిత్రరాజ్యాల సేనలు 1944 జూన్ 6న ఇంగ్లీషు చానల్‌ను దాటివచ్చి, జర్మను సైన్యం ఎదురు దాడి చేస్తుండగానే నార్‌మాండి సముద్రతీరంవద్ద దిగాయి. ముప్పయి రోజుల తరువాత మా మూడవ సైనికదళం వచ్చి చేరినప్పుడు తీరప్రాంతం అసలు సరిపోలేదు. జర్మను విమానాలు ఆ ప్రాంతంలో ఉదృతంగా బాంబులు కురిపిస్తుంటే ఆ రాత్రి మేము కందకములలో గడిపాము.
జూలై 25న మిత్రరాజ్యాల సేనలు తీరప్రాంతం నుండి బయలుదేరాయి, ఒక వారం తరువాత మా మూడవ సైనికదళం బ్రిట్టాని ద్వీపకల్పం చేరింది. ఆ పిమ్మట పారిస్ వద్దనున్న సైనీ నదివైపుకు జర్మను సేనలను తిరోగమింప జేస్తూ తూర్పుకు దూసుకు వెళ్లాము. సెప్టెంబరు నాటికి పాటన్ టాంకులు, సేనలు తూర్పు ఫ్రాన్సుకు చేరాయి. ఇది ఆధునిక చరిత్రలో పేర్కొనదగిన సైనిక దండయాత్రల్లో ఒకటి. త్వరలో యుద్ధం ముగియ బోతుందని మేము సంతోషించాము.
అయితే, ఉత్తరప్రాంతపు యుద్ధ రంగమందున్న బ్రిటిష్ సర్వసైన్యాధిపతి అయిన మోన్‌టెగ్‌మోరీ సేన వైపుకు హఠాత్తుగా చాలా సామాగ్రి, సేనలు మళ్లింపబడడంతో అలాంటిది సాధ్యం కాకుండా పోయింది. హాలెండులో జర్మను విభాగాలపై తీవ్రమైనదాడి పెచ్చుపెరిగి పోయింది. అయితే శక్తివంతమైన జర్మను సాయుధ సైనికదళం మధ్యన మిత్రరాజ్యాల వాయుసైన్య విభాగాలు తెలియకుండ దిగడంతో వినాశం సంభవించి, వారు ఓడింపబడ్డారు. మిత్రరాజ్యాల సైన్యాల విభాగాల శేషం ఇక ముందుకు వెళ్లలేక పోవడంతో వాటి ప్రయత్నం విఫలమయ్యింది.
బల్జ్ యుద్ధం
హిట్లరు, ఆయన సేనానాయకులు తిరిగి కూడుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అమెరికా సేనలు తక్కువగా వున్న ప్రాంతాలకు క్రొత బలగాలను పిలిచి, సాయుధ టాంకుల గుంపును రహస్యంగా సమావేశపరచారు. బల్జ్‌యుద్ధం అని పిలువబడిన నాజీ ఆక్రమణ, డిశంబరు 16న దట్టమైన మేఘాలు అలుముకొని వుండగా ప్రారంభమైంది. మిత్రరాజ్య సేనలను విడగొడుతూ, ఉత్తర సముద్రం వరకు వారిని తరుమవలెనని, వారి ముఖ్య సరఫరా కేంద్రాన్ని ఆక్రమిస్తూ జర్మను సాయుధ దళం చొచ్చుకు వెళ్లాలని ఆలోచన చేయబడింది.
బాస్టోగ్నే వద్ద జర్మను సాయుధ ధళాలు దురాక్రమణ చేసినప్పటికీ త్వరలోనే అమెరికా సేనలకు లొంగిపోయాయి. జనరల్ పాటన్ క్రిందవున్న మూడవ సేన తన మార్గాన్ని మళ్లించుకుని, చాలాదూరం ప్రయాణం చేసిన తరువాత సాయుధ ట్యాంకులపై తీవ్రంగా దాడి చేయగలిగాము. ఒక వారంపాటు వున్న దట్టమైన మేఘాలు, వర్షంవల్ల వైమానికదళాన్ని ఉపయోగించటానికి వీలులేకపోయింది.
పాటన్ ప్రార్థన
ఆత్మీయ సందిగ్థతలో వున్న నా హృదయాన్ని తాకిన ఒక సంఘటన డిశంబరు 22న సంభవించింది. కొన్ని వారాలముందు జనరల్ పాటన్, రైనినది యొక్క పశ్చిమ భాగానికి వ్యాపించియున్న జర్మను సేగ్‌ఫొడ్ లైన్ స్థావరాల దగ్గర ఉపయోగించుటకై ప్రార్థనాపత్రాన్ని తయారు చేయమని సైనిక మతాధికారుల్ని అడిగాడు. కాని ఇప్పుడు మూడవ సేనలోని ప్రతి సైనికునికి ఒకటి చొప్పున పాటన్ దాదాపు 3,50,000 కాపీలు పంచిపెట్టించాడు. “ఈ విపరీత వర్షాలను నిరోధించి, యుద్ధానికి తగిన వాతావరణాన్ని ఇవ్వమని”, అప్పుడు అమెరికా సేనలు “శత్రువుల దుష్టత్వాన్ని, దురాగతాన్ని నాశనంచేసి ప్రజలు మరియు జనాంగాల మధ్య మీ న్యాయాన్ని స్థాపించేలా చేయుము” అని అందులో తండ్రికి విన్నవించబడింది.
అసాధారణంగా, ఆ రాత్రి ఆకాశం నిర్మలమై, తరువాతి ఐదు రోజుల వరకు అలాగే వుండింది. నాజీ సైనికులపై పూర్తిగా దాడిచేసి వారికి భారీనష్టాన్ని కలుగజేసే అవకాశాన్ని ఇది మిత్రరాజ్య యుద్ధవిమానాలకు, బాంబర్లకు వీలుకల్గించింది. హిట్లరు తుది రాకెట్ యుద్ధానికి ఇదే ముగింపయ్యింది, చెల్లాచెదురైన ఆయన సైన్యం వెనక్కి వెళ్లిపోవడం మొదలెట్టింది.
పాటన్ అమితానందం చెంది యిలా అన్నాడు: “ఇంకా 1,00,000 ప్రార్థనాపత్రాలు ముద్రించాలని నేననుకుంటున్నాను, ప్రభువు మనవైపున్నాడు, మనకేమవసరమో ఆయనకు తెలియజేయాలి.” ‘ఒక వేళ ప్రార్థనాపత్రం పంచిపెట్టబడినా, పంచిపెట్ట బడకపోయినా డిశంబరు 23న ఆకాశం నిర్మలమై వుండేదికాదా?’ అని నేనాశ్చర్యపోయాను. రష్యా పచ్చికమైదానాల నుండి చల్లనిగాలులు వీచి మేఘాలు చెల్లాచెదరయ్యేలా చేసాయని వాతావరణ విభాగం వివరించింది.
జర్మను లొంగిపోవడం యుద్ధానంతర జర్మను
పందొమ్మిది వందల నలభైఐదు వసంతకాలంలో జరిగిన మిత్రదేశాల విజయభేరి వల్ల 1945 మే 7,న హిట్లరు సామ్రాజ్యానికి ముగింపు, పరాజయం సంభవించింది. బెల్జియం నుండి తప్పిపోయి వచ్చిన లిల్లీ, అంటే సౌందర్యవతి అయిన నా కాబోయే భార్యను జర్మను గ్రామమైన రైన్‌ల్యాండులో నేనదేరోజు కలిశాను. నవంబరు 1945లో నేను సైనికబాధ్యతల నుండి తొలగి, జర్మనులో వున్న అమెరికా సైన్యవృత్తిలోని చారిత్రక విభాగంలో చేరాను. ఫ్రాంక్‌ఫర్ట్ నగరాధ్యక్షుడి ద్వారా డిశంబరులో లిల్లీకి, నాకు వివాహం జరిగింది.
వృత్తులకు సంబంధించిన చరిత్రను సంరక్షించే పని చారిత్రక విభాగానికి ఉండేది. అది జర్మన్లవైపునుండి యుద్ధ చరిత్రను వ్రాయటానికి బంధీలుగా పట్టుబడిన వందలాది జర్మను సేనా నాయకులను ఉపయోగించు కొన్నది. జర్మనులో నేను ఐదేళ్లు చీఫ్ ఆర్కీవిస్ట్‌గా ఉన్నాను. తరువాత, మా ఇద్దరు పిల్లలు గారీ, లిజ్జెట్‌లను తీసుకుని అమెరికాకు తిరిగివెళ్లాము.
మా తలిదండ్రులను దర్శించిన తరువాత, మోన్‌టానా విశ్వవిద్యాలయంలో నా పేరు నమోదు చేసుకున్నాను. సైన్యంతో నా సంబంధం ముగిసిందనుకున్నాను. అయినా, 1954 వసంతకాలంలో నేను మానవశాస్త్రంలో నా పట్టా తీసుకొనబోతుండగా, ఓక్ల్‌హామాలోని అమెరికా సైనిక ఫిరంగిదళ క్షిపణికేంద్ర సంగ్రహాలయంలో డైరెక్టరు/సంరక్షకుని స్థానం ఖాళీగా వుందని మునుపటి నాతోటి పనివారిద్దరు తెలియజేశారు. నేను ధరఖాస్తు చేసుకున్నాను, వారు అంగీకరించడంతో మేము అక్కడికి వెళ్లాము.
సైనిక సంగ్రహాలయ కార్యాలు
మరలా నేను సైనికచరిత్రకు సంబంధించిన పని చూస్తున్నాను. పరిశోధన చేయడం, సాంకేతిక, ప్రదర్శిత వస్తువులను స్వాధీనం చేసుకోవడం, ప్రయాణాలు, ప్రసంగాలు, పురావస్తు త్రవ్వకాలు, సైనిక, చారిత్రక వేడుకలకు హాజరు కావడం వంటివాటిలో మునిగిపోయాను. వాషింగ్టన్ డి.సి.లో 1973లో జరిగిన ప్రెసిడెన్షియల్ ప్రారంభ కవాతు ప్రదర్శనలో భాగం వహించటానికి ప్రాచీనకాల చారిత్రాత్మకమైన సైనిక దుస్తులను ధరించిన గుఱ్ఱపురౌతులను, గుఱ్ఱాలను తీసుకువెళ్లి కవాతు ప్రదర్శన చేయించాను. సైనిక పతాకాల, జాతీయ పతాకాల చరిత్రను, పారంపర్యాన్ని తెలియజేసే పతాకాలుండే ప్రదర్శనశాలను కూడ నేను స్థాపించాను. ఒకే బంగళాగా ఉన్న ఫిరంగుల సంగ్రహాలయం సంవత్సరాల తరువాత దేశంలోకే అత్యంత పెద్దదైన సైనిక సంగ్రహాలయ మయ్యేంతగా విస్తరించింది.
ఈ మధ్యకాలంలో, మా పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. నా కుమారుడు గారీ, ఉన్నతపాఠశాలవిద్య ముగించుకుని ఏంచేయాలో తోచని స్థితిలో వున్నాడు. ఆయన మెరైన్ సైనికదళంలో చేరి వియత్నాం యుద్ధంలో పాల్గొన్నాడు. ఆయన రెండేళ్లు సముద్రంపై పనిచేసి క్షేమంగా ఇల్లుచేరి నందుకు మేము కృతజ్ఞులమై వున్నాము. స్పష్టంగా, శాంతిని కాపాడడంలో యుద్ధాలు విఫలమయ్యాయి. ఐక్యరాజ్యసమితి యొక్క సభ్యదేశాలు ఒకదానితో ఒకటి పోరాడటంలో కొనసాగుతుండగా, ఆ దేశాల ప్రజలు ఆకలి, అనారోగ్యంతో అలమటించిపోతున్నారు.
ఉద్యోగ విరమణ, నిరుత్సాహం
సైన్యంతో 33 సంవత్సరాల సహచర్యం తరువాత, ఇక ఇది విరమించుకోవలసిన సమయమని నేను నిర్ణయించుకున్నాను. సైనికదళ సేనానాయకుడు, ఇతర ఉద్యోగులు నా కొరకు ప్రత్యేకమైన ఉద్యోగ విరమణ వేడుకను నిర్వహించారు. ఓక్లహామా రాష్ట్ర గవర్నరు నా పేరట ఒకదినాన్ని అంటే, 1979 జూలై 20ని ప్రకటించాడు. సైనిక చరిత్ర, సంగ్రహాలయ క్షేత్రాలలో నేను చేసిన సేవను అభినందిస్తున్న ఉత్తరాలను అందుకున్నాను.
నేనెంతో సంతోషంగా ఉండాల్సింది. అయితే, నా గతాన్ని గురించి తలంచినప్పుడు నాకేమాత్రం సంతోషంలేదు. యుద్ధం యొక్క భయంకరమైన వాస్తవాలను వెల్లడి చేయటానికి బదులు, దాన్ని ఘనపర్చడానికి, దాని సాంప్రదాయాలను, దుస్తులను, పతకాలను, ఆయుధాలను, కుతంత్రాలను, ఆచారాలను, వేడుకలను, వైభవాన్ని, ఉత్సవాన్ని గూర్చి నొక్కిచెప్పటానికే నా జీవిత గమనమంతా అర్పించబడింది. అమెరికా 34వ అధ్యక్షుడైన జనరల్ డ్వైయిట్ డి. ఐసెన్‌హోవర్ సహితం ఇలా అన్నాడు: “యుద్ధ సారాంశం అగ్ని, కరువు, విపత్తు . . . నేను యుద్ధాన్ని ద్వేషిస్తున్నాను. యుద్ధం దేనిని పరిష్కరించలేదు.”
ఐసెన్‌హోవర్ తల్లి యెహోవాసాక్షుల్లో ఒకరై ఉండెనని తరువాత నేను తెలుసుకున్నాను, సాక్షులతో బైబిలును పఠిస్తున్న నా భార్య ద్వారా అప్పటికే ఆ విశ్వాసం నన్ను ప్రభావితం చేస్తున్నది. నా ఉద్యోగ విరమణకు ఆరునెల్ల ముందు, 1979లో ఆమె బాప్తిస్మం పొందిన సాక్షి అయ్యింది. ఆమె చాల మార్పు చెందినట్లు కనిపించింది. నేర్చుకున్న వాటిని ఇతరులతో పంచుకోవాలన్న ఉల్లాసం, కోరిక ఆమెలో ఎంతగా ఉండెనంటే, నా కుమారుడు, అతని భార్య కారిన్ బైబిలు పఠించడం మొదలెట్టి, ఒక సంవత్సరంలో వారు కూడా బాప్తిస్మం పొందిన సాక్షులయ్యారు.
అయినా, నేను సందేహాస్పదంగానే ఉన్నాను. దేవుడు నిజంగా మానవుల విషయాల్లో జోక్యం చేసుకుని ఈ ప్రపంచాన్ని అంతమొనర్చి, ఓ నూతన యుద్ధంలేని ప్రపంచాన్ని స్థాపిస్తాడనేది నమ్మశక్యం కాదనిపించింది. అయినా, వారి మతనమ్మకాలకు ఏదైనా తగిన ఆధారముందేమో తెలుసుకోవటానికే ప్రాముఖ్యంగా నేను కూడా సాక్షులతో పఠించడం మొదలెట్టాను. నా గత అనుభవాన్ని, పరిశోధించడంలో గల తర్ఫీదుపొందిన సామర్థ్యాలను బట్టి వారి నమ్మకాలలోని లోపాలను, వ్యతిరేకతలను త్వరగానే గుర్తించగలనని ఊహించాను.
ఒక క్రొత్త జీవిత విధానం
నా బైబిలు పఠనం కొనసాగుతుండగా, నేనెంత తప్పుచేశానో త్వరగా గ్రహించగలిగాను. మత అజ్ఞానపు పొరలు నా కళ్లనుండి రాలిపోగా నా అవిశ్వాసం తొలగిపోయింది. నీతియుక్తమైన నూతన లోకాన్ని గూర్చిన దేవుని వాగ్దానాన్ని నమ్మటానికి తగిన ఆధారమున్నట్లు నేను తెలుసుకోగలిగాను. (2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) ఇప్పుడు మానవజాతిలో పెచ్చుపెరిగిపోతున్న దుష్టత్వాలు, అన్యాయాలకు మూలం దేవుడుకాదు గాని ఈ యుగ సంబంధమైన దేవత అయిన సాతానని తెలుసుకోవడం ఎంతటి ఉపశమనాన్ని కలిగిస్తుంది! (యోహాను 14:30; 2 కొరింథీయులు 4:4) ఆ విధంగా, దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల్లో యెహోవా దేవుడు ఎవరి పక్షం వహించనప్పటికీ, ఆయన మానవుల యందు శ్రద్ధ కలిగి వున్నాడు.—యోహాను 3:16.
యెహోవాకు నా సమర్పణను సూచిస్తూ, 1983లో బిల్లింగ్స్, మోన్‌టానాలో జరిగిన యెహోవాసాక్షుల సమావేశంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. నా కుమారుడు గారీ నేను, మా మా సంఘాలలో పెద్దలుగా సేవచేస్తున్నాము. తన వాక్యం మరియు సాక్షుల ద్వారా బైబిలు సత్యాలను తెలుసుకుని, ఈ తరాన్ని గుర్తిస్తున్న విపత్కర సంఘటనల భావాన్ని అర్థం చేసుకొనేలా మా హృదయాలను తెరిచిన యెహోవాకు నేను, లిల్లీ ఎంతో కృతజ్ఞులమై యున్నాము. (మత్తయి 24:3-14; 1 యోహాను 2:17)—జెలెట్ గ్రిజ్‌వెల్డ్ చెప్పినది. (g93 4/22)
[Picture Credit Line on page 9]
Parisians scatter as German snipers open fire, August 1944 (U.S. National Archives photo)
[Picture Credit Line on page 10]
U.S. National Archives photo
[11వ పేజీలోని చిత్రం]
కాలిపోయి, పాడైపోయిన జర్మను సాయుధ రక్షణ నౌకలు, ఫ్రాన్సు, 1944
[క్రెడిట్ లైను]
U.S. Department of Defense
[12వ పేజీలోని చిత్రం]
నా భార్య, కుమార్తెతో 1947లో