మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే . . .
ప్రకృతికి హాని చేయని, సహోదరులకు మేలు చేసే కొన్ని పద్ధతులు
ఏప్రిల్ 1, 2025
మనుషులు భూమిని పాడుచేస్తున్నారు. అయితే, యెహోవా దేవుడు త్వరలోనే చర్య తీసుకుని ఈ భూమిని బాగుచేస్తాడని యెహోవాసాక్షులమైన మనకు తెలుసు. (ప్రకటన 11:18) భూమిని కాపాడడానికి మన వంతు కృషి కూడా మనం చేస్తున్నాం. ఉదాహరణకు, మన బిల్డింగ్‌లను కట్టేటప్పుడు ప్రకృతికి హాని జరగకుండా కొన్ని పద్ధతుల్ని వాడుతున్నాం.
మా లక్ష్యం ఏంటంటే, ప్రకృతికి ఎక్కువ నష్టం కలగకుండా తెలివైన పద్ధతుల్ని ఉపయోగించడం. మనం ఇప్పటి వరకు ఎలాంటి పద్ధతుల్ని ఉపయోగించాం? మన విరాళాలను తెలివిగా వాడడానికి ఈ పద్ధతులు ఎలా సహాయం చేస్తున్నాయి?
భగభగ మండే పైకప్పుకు, ఒక చల్లని పరిష్కారం
ఇదివరకు, మొజాంబిక్‌లోని మటోలా అసెంబ్లీ హాలుకు గోడలు లేకుండా కేవలం రేకులతో పైకప్పు మాత్రమే ఉండేది. ఎండల వల్ల ఆ పైకప్పు బాగా వేడెక్కిపోయి హాలులోకి వేడి సెగలు వచ్చేవి. అక్కడ ఉంటున్న ఒక బ్రదర్ ఇలా అన్నాడు, “ఆ వేడి వల్ల చాలా ఉక్కపోతగా అనిపించేది. సమావేశం అవ్వగానే బ్రదర్స్ అందరూ చల్లగాలి కోసం త్వరత్వరగా బయటికి వెళ్లేవాళ్లు.” మన బ్రదర్స్-సిస్టర్స్ సమావేశాన్ని ఆనందిస్తూ మనసుపెట్టి వినడానికి హాలును ఎలా మారిస్తే బాగుంటుంది?
ప్రకృతికి హాని చేయని పద్ధతుల్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాం. వేడి గాలి బయటికి పోయి చల్ల గాలి లోపలికి వచ్చేలా టర్బో ఫ్యాన్లను బిగించాం, సూర్యుని నుండి వచ్చే వేడిని తగ్గించేలా ఇన్సులేషన్ కూడా పెట్టాం. ఆ ఫ్యాన్ల వల్ల బిల్డింగ్‌లోకి మంచి గాలి వస్తూ ఉంటుంది, వాటికి కరెంట్ కూడా అవసరం లేదు. ఇవి ఒక్కొక్కటి దాదాపు 50 డాలర్లుa (దాదాపు 4,000 రూపాయలు) ఉంటాయి.
మటోలా సమావేశ హాలులో టర్బో ఫ్యాన్లు
దీనివల్ల సమావేశ హాలులో చక్కగా గాలి ఆడుతుంది. హాలుకి చెమ్మ, బూజు లాంటివి పట్టవు. కార్బన్-డై-ఆక్సైడ్ తగ్గి, ఆక్సిజన్ ఎక్కువగా ఉండడం వల్ల హాజరైనవాళ్లు హుషారుగా, హాయిగా వింటున్నారు. పై పేరాల్లో ప్రస్తావించిన బ్రదర్ ఇలా అంటున్నాడు: “మేమిప్పుడు సమావేశం అయిన వెంటనే త్వరత్వరగా బయటికి వెళ్లే పని తప్పింది. హాలులోనే కూర్చుని తీరిగ్గా భోంచేస్తూ, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటున్నాం. కొత్తగా మార్చిన ఈ పైకప్పు వల్ల ఒక పెద్ద చెట్టు నీడలో హాయిగా కూర్చున్నట్టు అనిపిస్తుంది.”
మటోలా సమావేశ హాలులో టర్బో ఫ్యాన్లు మన బ్రదర్స్ ఇప్పుడు సమావేశాలను హాయిగా వినగలుగుతున్నారు
సూర్యుడి నుండి వచ్చే శక్తిని కరెంట్‌గా మార్చడం
ప్రపంచవ్యాప్తంగా యెహోవా ఆరాధన కోసం ఉపయోగించే చాలా బిల్డింగ్‌లలో సోలార్ ప్యానెల్స్‌ను పెట్టించాం. ఇవి సూర్యుడి నుండి వచ్చే శక్తిని కరెంట్‌గా మారుస్తాయి. అంతేకాదు ఆ శక్తి ఎప్పటికీ ఆగిపోదు. దాంతో కరెంట్ కోసం కాలుష్యాన్ని పెంచే బొగ్గు, గ్యాస్, చమురు (fuel oil) లాంటివి వాడడం తగ్గించాం. ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల కాలుష్యం తక్కువగా ఉంటుంది, విరాళాలు కూడా ఆదా అవుతాయి.
2023లో స్లోవేనియా బ్రాంచి ఆఫీసులో సోలార్ ప్యానెల్స్‌ను పెట్టించాం. అవి బిల్డింగ్‌కి అవసరమయ్యే కరెంట్‌ని దాదాపు 30 శాతం వరకు ఇస్తాయి. ఒకవేళ బ్రాంచికి అవసరమైన దానికంటే ఎక్కువ కరెంట్ వస్తే దాన్ని స్థానిక మున్సిపాలిటీకి పంపిస్తారు. దీనికి మొత్తం 3,60,000 డాలర్లు (దాదాపు 3 కోట్ల రూపాయలు) ఖర్చు అయింది. అయితే ఇప్పుడు బ్రాంచికి కరెంట్ బిల్ బాగా తగ్గడంతో నాలుగు సంవత్సరాలు గడిచే లోపే, దీనికి ఖర్చు అయిన డబ్బులు తిరిగొస్తాయి, తర్వాత నుండి డబ్బులు బాగా ఆదా అవుతాయి.
స్లోవేనియా బ్రాంచి
2024లో మేము శ్రీలంక బ్రాంచి ఆఫీసులో సోలార్ ప్యానెల్స్‌తో పాటు, ఒక పెద్ద బ్యాటరీ పెట్టించాం. ఆ ప్రాజెక్ట్‌కి దాదాపు 30 లక్షల డాలర్లు (దాదాపు 26 కోట్ల రూపాయలు) ఖర్చు అయింది. అది బ్రాంచికి అవసరమయ్యే కరెంట్‌ని దాదాపు 70 శాతం వరకు ఇస్తుంది. మూడు సంవత్సరాల లోపే, దీనికి ఖర్చు అయిన డబ్బులు తిరిగొస్తాయి, తర్వాత నుండి మనకు డబ్బులు బాగా మిగులుతాయి. అదే సంవత్సరం, నెదర్లాండ్స్ బ్రాంచి ఆఫీసులో కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. దానికి 11 లక్షల డాలర్లు (దాదాపు 9 కోట్ల రూపాయలు) ఖర్చు అయింది. అది బ్రాంచికి అవసరమయ్యే కరెంట్‌ని దాదాపు 35 శాతం వరకు ఇస్తుంది. తొమ్మిది సంవత్సరాల లోపే, దీనికి ఖర్చు అయిన డబ్బులు తిరిగొస్తాయి, తర్వాత నుండి డబ్బులు బాగా ఆదా అవుతాయి.
నెదర్లాండ్స్ బ్రాంచి
మెక్సికోలోని చాలా RTOల్లో సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. వాటిలో చిహువాహువాలో ఉన్న టారాహుమారా (సెంట్రల్) RTO ఒకటి. అక్కడ చలికాలంలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతుంది, ఎండాకాలంలోనేమో 40 డిగ్రీల వరకు వెళ్తుంది. అయినాసరే కరెంట్ బిల్ బాగా పెరిగిపోతుందని చాలామంది బ్రదర్స్ ఏసీలు, హీటర్లు లాంటివి వాడరు. RTOలో పనిచేస్తున్న జానతన్ ఇలా అంటున్నాడు: “చలికాలంలో రగ్గులు, స్వెటర్లు వాడేవాళ్లం, ఎండాకాలంలో కిటికీలు తెరుచుకునే వాళ్లం.”
2024లో ఈ RTOలో సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. దానికి 21,480 డాలర్లు (దాదాపు 18 లక్షల రూపాయలు) ఖర్చు అయింది. కానీ, ఐదు సంవత్సరాల లోపే, దీన్ని వాడడం వల్ల ఆదా అయ్యే డబ్బులు, ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మన బ్రదర్స్ ఏసీలు, హీటర్లు లాంటివి ఎక్కువ వాడగలుగుతున్నారు. జానతన్ ఇలా అంటున్నాడు: “మేము మా పనిని ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకా ఎక్కువ పని చేయగలుగుతున్నాం. సంస్థ డబ్బుల్ని ప్రకృతికి హాని జరగకుండా తెలివిగా ఉపయోగిస్తున్నందుకు సంతోషంగా ఉంది.”
ఇప్పుడు టారాహుమారా (సెంట్రల్) RTOలో పనిచేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి
వర్షం నీళ్లు సేకరించడం
ఆఫ్రికాలోని కొన్ని రాజ్యమందిరాల్లో నీటి సరఫరా సరిగ్గా ఉండదు, నీళ్లు అంత శుభ్రంగా కూడా ఉండవు. దాంతో కొన్ని చోట్లలో, మన బ్రదర్స్ ఎంతో దూరం నుండి నీళ్లను రాజ్యమందిరానికి తెచ్చేవాళ్లు. ఇంకొన్ని రాజ్యమందిరాల్లో బ్రదర్స్ ట్యాంకర్ల ద్వారా నీళ్లను కొనుక్కునేవాళ్లు. దానివల్ల ఖర్చు ఎక్కువ అవ్వడమే కాదు, కాలుష్యం కూడా పెరుగుతుంది.
ఈ నీటి కొరతను తగ్గించడానికి ఆఫ్రికాలో బ్రదర్స్ వర్షం నీళ్లను సేకరించే ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడైతే రాజ్యమందిరాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంటుందో బ్రదర్స్ ముందుగా తెలుసుకుంటారు. దాన్నిబట్టి రాజ్యమందిరాల పైకప్పులకు వర్షం నీళ్లను సేకరించే పైపులను బిగిస్తారు, పెద్ద వాటర్ ట్యాంక్‌లను కూడా పెట్టిస్తారు. ఒక్క రాజ్యమందిరానికి 600 నుండి 3,000 డాలర్లు (దాదాపు 50,000 రూపాయల నుండి 3 లక్షల రూపాయలు) వరకు ఖర్చు అవ్వొచ్చు. అయితే బ్రదర్స్‌కు ఇక నీళ్లు కొనుక్కునే పని ఉండదు కాబట్టి రాజ్యమందిరాలకు అయ్యే ఖర్చులు తగ్గుతాయి.
దక్షిణ ఆఫ్రికాలోని ఒక రాజ్యమందిరంలో వాటర్ ట్యాంక్
ఈ ఏర్పాటు వల్ల మన బ్రదర్స్‌కు చాలా మేలు జరిగింది. మొజాంబిక్‌లో ఉంటున్న నోయేమ్యా అనే సిస్టర్ ఇలా అంటుంది: “అంతకుముందు నీళ్లు తెచ్చుకోవడానికి మేము కాళ్లు అరిగిపోయేలా తిరిగేవాళ్లం. మందిరానికి వచ్చేసరికి బాగా అలసిపోయేవాళ్లం. నీళ్ల కొరత వల్ల శుభ్రంగా ఉండడం కూడా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు అందరూ చేతులు కడుక్కోగలుగుతున్నారు. అలుపు-సొలుపు లేదు, మీటింగ్స్ హాయిగా వింటున్నాం. చాలాచాలా థ్యాంక్స్!”
దక్షిణ ఆఫ్రికాలో ఒక తల్లి-కొడుకు, సేకరించిన వర్షం నీళ్లు వాడుతున్నారు
ప్రకృతికి హాని చేయని ఈ పద్ధతుల కోసం అయ్యే డబ్బంతా ఎక్కడి నుండి వస్తుంది? donate.jw.orgలో ఉన్న వేర్వేరు మార్గాల ద్వారా మీరు ప్రపంచవ్యాప్త పనికి విరాళాలు ఇవ్వడం వల్లే ఇది సాధ్యమౌతుంది. పెద్ద మనసుతో మీరిచ్చే విరాళాలకు చాలా థ్యాంక్స్!
a ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించిన డాలర్లు, U.S. డాలర్లు.