ఆగస్టు 24-30, 2026
పాట 65 ప్రగతి సాధిస్తూ ఉండండి
క్షేత్రసేవా గుంపు ఏర్పాటు నుండి పూర్తి ప్రయోజనం పొందండి
“నా నిండు హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను; నిజాయితీపరుల సమావేశంలో, వాళ్ల సమాజంలో ఆయన్ని స్తుతిస్తాను.”—కీర్త. 111:1.
ముఖ్యాంశం
క్షేత్రసేవా గుంపు ఏర్పాటు నుండి ఎలా పూర్తి ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుంటాం.
1-2. ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ గురించి చాలామందికి ఏమనిపిస్తుంది?
మీరు ప్రచారకులు (పబ్లిషర్) అయిన రోజు మీకు గుర్తుందా? అప్పుడు ఎంత సంతోషంగా అనిపించి ఉంటుందో కదా! ఆ రోజు నుండి మీరు యెహోవా పేరును స్తుతించే ఒక పెద్ద గుంపులో ఒకరయ్యారు. (కీర్త. 148:1, 2, 12, 13) అంతేకాదు, ఇంకో చిన్న గుంపులో కూడా మీరు ఒకరయ్యుంటారు; అదే క్షేత్రసేవా గుంపు (ఫీల్డ్ సర్వీస్ గ్రూప్). చెప్పాలంటే, క్షేత్రసేవా గుంపు ఏర్పాటు వల్లే “భూమంతటా” మంచివార్తను ప్రకటించే పని సాధ్యమౌతుంది.—మత్త. 24:14.
2 ఈ ఏర్పాటు గురించి మీకేమనిపిస్తుంది? విన్నీa అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఏర్పాటు నాకు చాలా సహాయం చేసింది. నేను ఇతరుల నుండి ప్రకటించే-బోధించే విషయంలో నైపుణ్యాలు నేర్చుకున్నాను, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోగలిగాను, మంచి స్నేహితుల్ని చేసుకోగలిగాను. ఇదంతా ఈ చక్కని ఏర్పాటు వల్లే సాధ్యమైంది.” రిచర్డ్ అనే బ్రదర్ ఇలా చెప్తున్నాడు: “గుంపు పర్యవేక్షకుడిగా (గ్రూప్ ఒవర్సీర్‌గా) సేవ చేయడం నిజంగా ఒక గొప్ప బాధ్యత. సాధారణంగా, బైబిలు విద్యార్థులు బాప్తిస్మం వరకు వెళ్లేలా ప్రచారకులు సహాయం చేయగలుగుతారు. కానీ, గుంపు పర్యవేక్షకుడు మాత్రం బాప్తిస్మం తర్వాత కూడా, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించేలా సహాయం చేయగలుగుతాడు.” దీనా అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఏర్పాటు నిజంగా తిరుగులేనిది! మా గ్రూప్‌లోని వాళ్లు నాకు కుటుంబం అయిపోయారు.”
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 ఈ ఆర్టికల్‌లో ముందుగా మనం గుంపు పర్యవేక్షకుడికి, ఆయన సహాయకుడికి ఉండే బాధ్యతలు ఏంటో, గ్రూప్‌లో ఉన్న బ్రదర్స్-సిస్టర్స్‌ని వాళ్లు ఎలా చూసుకుంటారో తెలుసుకుంటాం. తర్వాత, ఫీల్డ్ సర్వీస్ గ్రూప్‌లో ఉన్నవాళ్లకు మన వంతుగా మనం సహాయం చేయడానికి ఏం చేయవచ్చో చూస్తాం. చివరిగా, ఈ చక్కని ఏర్పాటు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకుంటాం.
గుంపు పర్యవేక్షకుడు, ఆయన సహాయకుడు
4. (ఎ) గ్రూప్ ఓవర్సీర్ ఏమేం చేయాలి? (బి) తన గ్రూప్‌లో ఉన్నవాళ్లను ఆయన ఎలా చూసుకుంటాడు? (“గ్రూప్ ఓవర్సీర్ కోసం సలహాలు” అనే బాక్సు చూడండి.)
4 ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఓవర్సీర్ ఒక సంఘపెద్ద అయ్యుండాలి.b పెద్దలసభ ఆయనకు ఒక గ్రూప్‌ని అప్పగించి, అందులోని బ్రదర్స్-సిస్టర్స్ ఆధ్యాత్మికంగా ఎదిగేలా సహాయం చేయమని చెప్తుంది. దానికోసం ఆయన ఏమేం చేస్తాడు? ముందుగా, తన గ్రూప్‌లో ఉన్న ప్రతీ ఒక్కరిని పట్టించుకుంటాడు. (సామె. 27:23) ఆయన ఒక మంచి కాపరిలా వాళ్ల బాగోగులు తెలుసుకుంటూ, వాళ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. అలా తన గ్రూప్‌లో ఉన్నవాళ్లు యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేస్తాడు, తన మాటలతో-పనులతో వాళ్లను ప్రోత్సహిస్తాడు. (సామె. 12:25; యెష. 32:2; యాకో. 2:15-17) రెండవదిగా, తన గ్రూప్‌లో ఉన్న ప్రతీ పబ్లిషర్ చక్కగా పరిచర్య చేసేలా సహాయం చేస్తాడు. ఆయన పరిచర్యను ముందుండి నడిపిస్తాడు, ముఖ్యంగా శని-ఆదివారాలు అలా చేస్తాడు. అంతేకాదు తన గ్రూప్‌లో ఉన్న వాళ్లందరితో క్రమంగా పనిచేస్తూ, వాళ్లకు అవసరమైన ప్రోత్సాహాన్ని-ట్రైనింగ్‌ని ఇస్తాడు. ఎప్పుడైనా, ఆయన పరిచర్యకు రాలేకపోతే తన సహాయకుడు గానీ, అర్హతగల ఇంకో పబ్లిషర్ గానీ గ్రూప్‌ని నడిపించేలా ఏర్పాటు చేస్తాడు. మూడవదిగా, బాప్తిస్మం తీసుకున్న బ్రదర్స్ సంఘంలో బాధ్యతల్ని చేపట్టేలా అర్హత సాధించడానికి సహాయం చేస్తాడు. (1 తిమో. 3:1) తన గ్రూప్‌లో ఉన్న బ్రదర్స్ సంఘ పరిచారకులుగా, సంఘపెద్దలుగా అర్హత సాధించడానికి వాళ్లకు లేఖనాల నుండి సలహాల్ని, ట్రైనింగ్‌ని క్రమంగా ఇస్తాడు. అంతేకాదు వాళ్లను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాడు. గ్రూప్ ఓవర్సీర్‌ది చాలా పెద్ద బాధ్యతే అని చెప్పాలి. అందుకే, ఈ పనిని చక్కగా చేయడానికి అర్హతగల పెద్దల్ని మాత్రమే పెద్దలసభ ఎంచుకుంటుంది.
5. కొన్నిసార్లు గ్రూప్ ఓవర్సీర్‌గా పని చేయడం ఎందుకు కష్టంగా అనిపిస్తుంది?
5 గ్రూప్ ఓవర్సీర్‌కు చాలా పనులు ఉంటాయి కాబట్టి, అందరి బాగోగులు చూసుకోవడం కష్టంగా ఉండవచ్చు. జర్మనీలో ఉంటున్న యోర్గ్ అనే బ్రదర్ అనుభవమే తీసుకోండి, పెద్దలందరిలాగే సంఘంలో ఆయన చాలా పనులు చేస్తూ ఉంటాడు. ఆయన ఇలా అంటున్నాడు: “గ్రూప్ ఓవర్సీర్‌గా పనిచేస్తూ, సంఘంలోని మిగతా పనులు చేయడం అంత సులభం కాదు. దానివల్ల మా గ్రూప్‌లోని వాళ్లందరితో మాట్లాడాలనే నా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాను.” ఏబేల్ అనే 70 ఏళ్ల సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “మా దగ్గర సంఘపెద్దలు, సంఘ పరిచారకులు చాలా తక్కువమంది ఉండడం వల్ల మా ఫీల్డ్ సర్వీస్ గ్రూపుల్లో పబ్లిషర్‌లు చాలా ఎక్కువమంది ఉంటారు. కాబట్టి ప్రతీఒక్కర్ని నేను అనుకున్నంత ఎక్కువగా కలవడం, ప్రోత్సహించడం కుదరట్లేదు.” అలాగే, సూరినామ్‌లో ఉంటున్న ఓబెద్ అనే పెద్ద కూడా ఇలా చెప్తున్నాడు: “ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వడమంటే నాకు ఇష్టమే. కానీ దానికోసం చాలా శక్తిని, సమయాన్ని పెట్టాలి; పైగా ఫలితాలు కూడా వెంటనే కనిపించవు. ఇంకా వేరే పనులు కూడా ఉండడం వల్ల ట్రైనింగ్‌ని పక్కనపెట్టేస్తూ ఉంటాను.” ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి సంఘపెద్దలకు ఏది సహాయం చేస్తుంది?
6. ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ చిన్నగా ఉండడం గ్రూప్ ఓవర్సీర్‌కు ఎలా సహాయం చేస్తుంది?
6 ఫీల్డ్ సర్వీస్ గ్రూప్‌లు పెద్దవిగా ఉంటే, ఓవర్సీర్‌కు తన గ్రూప్‌లో ఉన్న వాళ్లందర్నీ పట్టించుకోవడం, యెహోవాకు దగ్గరయ్యేలా వాళ్లకు సహాయం చేయడం కష్టమవ్వచ్చు. కాబట్టి, గ్రూప్‌లు చిన్నగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ సంఘంలో ఎక్కువమంది పెద్దలు లేకపోతే ఏం చేయవచ్చు? పెద్దలసభ, ఒక సంఘ పరిచారకుడిని కొంతకాలం పాటు గ్రూప్ బాధ్యతలు చూసుకోమని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రూప్ చాలా పెద్దగా ఉంటే ఓవర్సీర్ తన బాధ్యతల్ని సరిగ్గా చేయలేకపోవచ్చు. ఫీల్డ్ గ్రూప్ ఎంత చిన్నగా ఉంటే, ఓవర్సీర్ తన గ్రూప్‌లోని వాళ్లను అంత బాగా పట్టించుకోగలుగుతాడు. చెప్పాలంటే, అదే తన ముఖ్యమైన బాధ్యత.
7. పెద్దలు తక్కువగా ఉన్న సంఘంలో గ్రూప్ ఓవర్సీర్‌గా పనిచేస్తున్నప్పుడు, గ్రూప్‌లో ఉన్నవాళ్లందర్నీ పట్టించుకోవడానికి ఏం చేయవచ్చు? (1 పేతురు 5:2) (చిత్రం కూడా చూడండి.)
7 పెద్దలు తక్కువగా ఉన్న సంఘంలో మీరు గ్రూప్ ఓవర్సీర్‌గా పని చేస్తున్నారా? అయితే, దేవుని మందని కాయడానికి మీ సహాయకుడికి ట్రైనింగ్ ఇవ్వండి. (1 పేతురు 5:2 చదవండి.) ఆయనకు కొన్ని పనులు అప్పగించండి. ఉదాహరణకు, ఆయన్ని అప్పుడప్పుడు ఫీల్డ్ మీటింగ్ చేయమని, పరిచర్యకు సంబంధించిన ఏర్పాట్లు చేయమని అడగండి. ఆయనతో కలిసి ప్రార్థించి, మీ గ్రూప్‌లో ఉన్నవాళ్లు పరిచర్యలో నైపుణ్యాల్ని పెంచుకోవడానికి, దేవునికి దగ్గరవ్వడానికి ఇంకెలా సహాయం చేయవచ్చో ఆలోచించండి. అలాగే కాపరి సందర్శనాలు చేసేటప్పుడు, మీ సహాయకుడిని కూడా తీసుకెళ్లండి. వెళ్లేముందు, వాళ్లను ఎలా ప్రోత్సహించాలో మాట్లాడుకోండి. వచ్చేశాక, మీ సహాయకుడిని మెచ్చుకుంటూ ఇంకా బాగా ఎలా చేయవచ్చో చెప్పండి. అలా చేస్తుంటే, కొంతకాలానికి ఆయన కూడా గ్రూప్ ఓవర్సీర్ అయ్యే అర్హత సంపాదిస్తాడు. (2 తిమో. 2:2) అలాగే పయినీర్లను, పరిచర్య బాగా చేసేవాళ్లను కూడా సహాయం అడగండి. సంభాషణలు ఎలా మొదలుపెట్టాలి, మళ్లీ కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, బైబిలు స్టడీలు ఎలా చేయాలి అనే విషయాల్లో వాళ్లు అంతగా అనుభవం లేనివాళ్లకు, కొత్తగా సత్యంలోకి వచ్చిన వాళ్లకు సహాయం చేస్తారు. ఇప్పుడు, మీరు మీ గ్రూప్‌లో ఉన్నవాళ్లకు సహాయం చేయగల మూడు మార్గాల గురించి చూద్దాం.
ఒక సంఘపెద్ద తన గ్రూప్‌లో ఉన్న సంఘ పరిచారకుడికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయనకు కొన్ని పనులు అప్పగించవచ్చు, ఉదాహరణకు ఫీల్డ్ సర్వీస్ మీటింగ్ చేయమని అడగవచ్చు (7వ పేరా చూడండి)
మీ ఫీల్డ్ సర్వీస్ గ్రూప్‌లో ఉన్నవాళ్లకు సహాయం చేయండి
8. మీ గ్రూప్‌లో ఉన్నవాళ్లకు మీరు ఎలా సహాయం చేయవచ్చు? (రోమీయులు 1:12)
8 మీ గ్రూప్‌తో పరిచర్యకు వెళ్లండి. మనం ఇతరులతో కలిసి పరిచర్యకు వెళ్తే, ‘ఒకరి నుండి ఒకరం ప్రోత్సాహం పొందుతాం.’ (రోమీయులు 1:12 చదవండి.) మన గ్రూప్‌లో ఉన్నవాళ్లతో కలిసి పరిచర్యకు వెళ్లినప్పుడు ఇంకాస్త ధైర్యంగా మాట్లాడతాం, సురక్షితంగా కూడా అనిపిస్తుంది. ఒకవేళ ఉద్యోగం వల్ల గ్రూప్‌తో కలిసి పరచర్య చేయలేకపోతుంటే మీ బాస్‌తో మాట్లాడి, ఆ టైంలో చేయాల్సిన పనిని తర్వాత చేయవచ్చా అని అడిగి చూడండి, ఆయన ఒప్పుకోవచ్చేమో. (నెహె. 2:4-6) ఆరోగ్యం పాడవ్వడం వల్ల, వయసు పైబడడం వల్ల మీ గ్రూప్‌తో కలిసి పరిచర్య చేయలేకపోతున్నారా? అయితే, ఒకసారి మీ గ్రూప్ ఓవర్సీర్‌తో మాట్లాడి చూడండి. మీకోసం ఆయన కొన్ని ఏర్పాట్లు చేయవచ్చు. ఉదాహరణకు జూమ్ లాంటి వాటి ద్వారా మీరు గ్రూప్‌తో కలిసి పనిచేసేలా ఆయన ఏర్పాటు చేయవచ్చు. అప్పుడు మీరు గ్రూప్‌తో కలిసి ఉత్తరాల సాక్ష్యం, ఫోన్ సాక్ష్యం చేయవచ్చు. మీకు మంచి వయసు, ఆరోగ్యం ఉన్నాసరే పరిచర్య చేయడం కుదరట్లేదా? అయితే, ప్రతీవారం గ్రూప్‌లో ఉన్న ఒక్కరితో అయినా కలిసి పరిచర్య చేసేలా ప్లాన్ చేసుకోండి. మీకున్న ముఖ్యమైన పనులు ఏంటో, మీ టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో ఇంకొకసారి ఆలోచించుకోండి. (రోమా. 12:11; కొలొ. 4:5) పరిచర్య కోసం మీరు చేసే ప్రతీ ప్రయత్నానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. అలాగే యెహోవాకు ప్రార్థించండి, ఆయనే మీకు ఆ పని చేయాలనే “కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని” ఇస్తాడు.—ఫిలి. 2:13.
9. మన ఫీల్డ్ గ్రూప్‌లో ప్రేమ-ఆప్యాయతలు పెరగాలంటే మనం ఏం చేయాలి? (రోమీయులు 12:13)
9 ఇచ్చేవాళ్లుగా ఉండండి. మీ ఫీల్డ్ గ్రూప్‌లో ఉన్న వాళ్లకు “ఆతిథ్యం ఇస్తూ” ఉండడం వల్ల మీ మధ్య ఉన్న ప్రేమ-ఆప్యాయతలు పెరుగుతాయి. (రోమీయులు 12:13 చదవండి.) ఫీల్డ్ మీటింగ్ కోసం మీ ఇంటిని అందుబాటులో ఉంచగలరేమో ఆలోచించండి. కొన్ని ప్రాంతాల్లో, వేరే సంఘం నుండి ప్రసంగీకులు వచ్చినప్పుడల్లా, ఒక్కో ఫీల్డ్ గ్రూప్ ఆతిథ్యం ఇస్తుంది. అలా ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు, గ్రూప్‌లో ఉన్న వాళ్లందరూ కలిసి భోజనం చేయడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ రోజు ప్రసంగీకుడు వచ్చినా, రాకపోయినా వాళ్లు మాత్రం కలుసుకుంటారు. శారా అనే ప్రత్యేక పయినీరు ఇలా చెప్తుంది: “ఆతిథ్యం ఇవ్వాలంటే నాకు కాళ్లు, చేతులు ఆడవు. అందుకే నేను ఎక్కువ వంటలు పెట్టుకోను. వంట బాగా కుదురుతుందా లేదా అని టెన్షన్ పడే బదులు వచ్చేవాళ్ల గురించి ఎక్కువ తెలుసుకోవడం మీదే మనసుపెడతాను.” మన గ్రూప్‌లో ఉన్నవాళ్లకు ఆతిథ్యం ఇస్తూ ఉండడం వల్ల ఒక కుటుంబంలా అవుతాం. అలా యెహోవాకే కాదు, ఒకరికొకరం కూడా దగ్గరవుతాం.—నెహె. 8:10; అపొ. 20:35.
10. ఫలానా విషయంలో పరిచర్య ఇంకా బాగా చేయాలని మీకు అనిపిస్తే ఏం చేయవచ్చు? (సామెతలు 1:5; 27:17) (చిత్రం కూడా చూడండి.)
10 మీరే సహాయం అడగండి. ప్రకటించే-బోధించే పనిలో మీరు ఎంత ఎక్కువగా నైపుణ్యం సాధిస్తే, అంత ఎక్కువగా మీ గ్రూప్‌తో కలిసి పరిచర్య చేయడాన్ని ఇష్టపడతారు. ఫలానా విషయంలో పరిచర్య ఇంకా బాగా చేయాలని అనిపిస్తే, మీరే వెళ్లి మీ గ్రూప్‌లో ఉన్న ఒక పయినీరుని గానీ, బాగా పరిచర్య చేసే ఒక పబ్లిషర్‌ని గానీ సహాయం చేయమని అడగండి. (సామెతలు 1:5; 27:17 చదవండి.) మీ గ్రూప్ ఓవర్సీర్‌కి మీరు పెట్టుకున్న లక్ష్యం గురించి చెప్పండి. దాన్ని చేరుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన్నే కాదు, ఇతరుల్ని కూడా అడగవచ్చు. హన్నా అనే సిస్టర్ అదే చేసింది. ఆమెకు కాస్త సిగ్గు ఎక్కువ, తను ఏం చెప్తుందంటే: “రిటన్ విజిట్‌లు చేసే విషయంలో సహాయం కావాలని ఒక పయినీరుని అడిగాను. ఆమె చాలా ప్రేమగా, దయగా ఉండేది. నాతో క్రమంగా కలిసి పరిచర్య చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంది. ఒక రిటన్ విజిట్‌ని బైబిలు స్టడీగా మార్చుకోవడానికి కూడా నాకు సహాయం చేసింది. అలా సహాయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు నేను పరిచర్యను బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను.” నిజమే, ఫీల్డ్ సర్వీస్ గ్రూప్‌లో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ఫీల్డ్ సర్వీస్ గ్రూప్‌లో తక్కువమంది ఉంటారు కాబట్టి, ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోగలుగుతారు, కలిసి పరిచర్య చేయగలుగుతారు (10వ పేరా చూడండి)
మీ ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ వల్ల వచ్చే ప్రయోజనాలు
11-12. ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఏర్పాటు వల్ల యెహోవాకు ఇంకా ఎలా దగ్గరవ్వవచ్చు? ఒక అనుభవం చెప్పండి.
11 మీరు యెహోవాకు దగ్గరౌతారు. ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఏర్పాటు వల్ల మనలో ప్రతీ ఒక్కరం యెహోవాకు ఇంకా దగ్గర అవ్వవచ్చు. ఉదాహరణకు, యెహోవా కంటికి రెప్పలా చూసుకునే విధవరాళ్లకు, అనాథలకు, వయసు పైబడినవాళ్లకు గ్రూప్ ఓవర్సీర్ కావాల్సిన సహాయాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాడు. (1 థెస్స. 2:8; యాకో. 1:27) ప్రకటించే-బోధించే పనిలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కూడా మనకు కావాల్సిన సహాయం దొరుకుతుంది. బాప్తిస్మం తీసుకున్న సహోదరులు సంఘంలో మరిన్ని బాధ్యతలు చేపట్టేలా అర్హత సాధించడానికి కావాల్సిన ట్రైనింగ్ పొందుతారు.—1 తిమో. 3:10.
12 ముందు పేరాల్లో చూసిన విన్నీ అనే సిస్టర్, ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ నుండి ఎలా ప్రయోజనం పొందిందో చెప్తుంది. ఆమె ఏం అంటుందంటే: “మా నాన్న మమ్మల్ని వ్యతిరేకించేవాడు. దానివల్ల మా అమ్మ శని-ఆదివారాల్లో గ్రూప్‌తో కలిసి పరిచర్యకు వెళ్లలేకపోయేది. కానీ నేను వెళ్లడానికి నాన్న ఒప్పుకునేవాడు. మా గ్రూప్‌లో ఉన్న ఒక పెద్దవయసు పయినీరు నాకు ఒక ఫ్రెండ్‌లా ఉంటూ, మంచి నైపుణ్యాల్ని నేర్పించింది. అవి నాకు పరిచర్యలో, సంఘంలో బాగా ఉపయోగపడ్డాయి. అప్పట్లో మా గ్రూప్ ఓవర్సీర్ బైబిలు నుండి ఇచ్చిన సలహాలు నాకు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి.”
13. ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఏర్పాటు వల్ల మనం ఒకరికొకరం ఎలా దగ్గరౌతాం? (చిత్రం కూడా చూడండి.)
13 మీరు ఒకరికొకరు దగ్గరౌతారు. మన గ్రూప్‌లో ఉన్నవాళ్లతో “కలిసికట్టుగా” పరిచర్య చేసినప్పుడు వాళ్లతో మనకున్న స్నేహాలు ఇంకా బలపడతాయి. (ఫిలి. 1:27) ఎక్కువమందిని చూసి భయపడే వాళ్లకు, సిగ్గుపడే వాళ్లకు ఈ చిన్నచిన్న గుంపుల వల్ల స్నేహితుల్ని చేసుకోవడం తేలికౌతుంది. (2 కొరిం. 6:13) మనకు ఆరోగ్యం బాలేనప్పుడు, బాధలో కూరుకుపోయినప్పుడు లేదా ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు మన గ్రూప్‌లో ఉన్నవాళ్లు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. (1 థెస్స. 5:14) మహాశ్రమ వచ్చినప్పుడు మనకు ఇలాంటి స్నేహాలు ఇంకా అవసరం. (మత్త. 24:21) నిజమే, ఇప్పుడు మనకు సమస్యలు రాక తప్పవు. కానీ మనల్ని ప్రేమించే, మన భుజం తట్టే బ్రదర్స్-సిస్టర్స్ ఉన్నారనే భరోసాతో వాటిని ఇంకా ఈజీగా సహించగలుగుతాం.—సామె. 17:17.
ఒకే ఫీల్డ్ సర్వీస్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరు సిస్టర్స్ కలిసి పరిచర్యకు వెళ్తున్నారు (13వ పేరా చూడండి)
14. కష్టాలు, విపత్తులు వచ్చినప్పుడు మన ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఎలా సహాయం చేస్తుంది?
14 మీకు అవసరమైన సహాయం అందుతుంది. అంటువ్యాధులు-ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, హింస చెలరేగినప్పుడు, అనుకోకుండా ఆరోగ్యం పాడైనప్పుడు, దేశం ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఏర్పాటు మనల్ని సమయానికి ఆదుకుంటుంది. ఉదాహరణకు, సంఘంలో అవసరం ఎక్కువ ఉన్నవాళ్లకు ఎలా సహాయం చేయాలనే దాని గురించి సంఘ సేవా కమిటీతో పాటు గ్రూప్ ఓవర్సీర్‌లు కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు. గ్రూప్ ఓవర్సీర్‌లు తమ గ్రూపుల్లో ఉన్న కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని, వాళ్ల అవసరాలు ఏంటో కనుక్కుంటారు. దాన్నిబట్టి మందులు, ఆహారం, నీళ్లు, ఇళ్లు, బట్టలు లాంటివి ఏర్పాటు చేస్తారు. నిజంగా, మన ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఇచ్చే సహాయం-ప్రేమ వెలకట్టలేనిది!
15. యెహోవా సంస్థలో ఉన్న మనందరం ఐక్యంగా ఏం చేస్తున్నాం?
15 యెహోవా సంస్థ చాలా పెద్దదని మనకు బాగా తెలుసు. అందులోని పరలోక భాగంలో కోటానుకోట్ల మంది నమ్మకమైన దేవదూతలు ఉన్నారు. భూభాగంలో అయితే 90 లక్షల కన్నా ఎక్కువమంది ఉన్నారు; ఆ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది. (జెక. 8:23; ప్రక. 5:11) దేవుని రాజ్యం గురించిన మంచివార్తను యెహోవా ఆరాధకులు ఐక్యంగా ప్రకటిస్తున్నారు. (ప్రక. 14:6, 7) యెహోవాను నిండు హృదయంతో ఆరాధించడానికి ఫీల్డ్ సర్వీస్ గ్రూప్ ఒక మంచి ఏర్పాటు, దాన్నుండి పూర్తి ప్రయోజనం పొందుదాం!—కీర్త. 111:1
పాట 61 సాక్షులారా, రాజ్యవార్తతో దూసుకెళ్లండి
a కొన్ని పేర్లను మార్చాం.
b గ్రూప్‌ని చూసుకునే బాధ్యతను ఒక సంఘపెద్ద చేపట్టేంతవరకు, సమర్థుడైన ఒక సంఘ పరిచారకుడు ఆ స్థానంలో సేవ చేయవచ్చు. అలా సేవచేసే సంఘ పరిచారకుడిని, గుంపు సేవకుడు అంటాం. ఎందుకంటే, ఆయన ఒక పర్యవేక్షకుడు కాదు. ఆయన పెద్దల నిర్దేశం కింద ఆ పని చేస్తాడు.