ఆగస్టు 31–సెప్టెంబరు 6, 2026
పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి
మీరు మనసుపెట్టి వింటున్నారా?
“మీరు ఎలా వింటున్నారనే దానిమీద మనసుపెట్టండి.”—లూకా 8:18.
ముఖ్యాంశం
మీటింగ్స్‌లో, సమావేశాల్లో మనం మనసుపెట్టి ఎందుకు వినాలో, దాన్ని ఎలా చేయవచ్చో చూస్తాం.
1-2. (ఎ) యెహోవా మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇచ్చే ఒక విధానం ఏంటి? (కీర్తన 23:1, 2, 5) (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?
యెహోవా మన ముందు చాలా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఉంచుతున్నాడు. బైబిలు గురించి నేర్చుకోవడానికి అవసరమైన ప్రతీది ఆయన మనకు ఇచ్చాడు. కాబట్టి, దావీదు పాడిన పాటలోని ఈ మాటల్ని మనం కూడా ఒప్పుకుంటాం: “యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ ఉండదు.”—కీర్తన 23:1, 2, 5 చదవండి.
2 యెహోవా మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇచ్చే ఒక విధానం, మన మీటింగ్స్. అక్కడ కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన విషయాల్ని మళ్లీమళ్లీ వింటాం. అయితే మనకు ఎంత బైబిలు జ్ఞానం ఉన్నా, మనం ‘సత్యంలో ఎంత దృఢంగా’ ఉన్నా వాటిని మళ్లీ వినాలి. అది మన మంచికే! (2 పేతు. 1:12) అలా వినడం మీకు కష్టంగా అనిపిస్తుందా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఇందులో మనం మీటింగ్స్‌ని ఎందుకు మనసుపెట్టి వినాలో చూస్తాం. ఆ తర్వాత, అందరూ శ్రద్ధగా వినేలా మీటింగ్స్‌లో బోధించేవాళ్లు ఎలా సహాయం చేయవచ్చో చూస్తాం. అంతేకాదు, ఇంకా బాగా వినడానికి కావాల్సిన సలహాల్ని కూడా చూస్తాం. ముందుగా, మనకు అసలు ఎవరు బోధిస్తున్నారో చూద్దాం.
మనకు యెహోవాయే బోధిస్తున్నాడని మర్చిపోకండి
3. యెహోవా మనకు ఎలా బోధిస్తున్నాడు? ఆయన సేవకులు లేఖనాల్ని ఎలా ఉపయోగిస్తున్నారు?
3 యెహోవాయే తన వాక్యమైన బైబిలు ద్వారా మనకు బోధిస్తున్నాడు. (2 తిమో. 3:16, 17) ఈ విషయం యేసుకు కూడా బాగా తెలుసు. ఆయన దేవుని వాక్యాన్ని ఎంత బాగా ఉపయోగించాడంటే ఆయన బోధ విన్నవాళ్లు ఇలా అన్నారు: “పాఠశాలల్లో చదువుకోని ఈయనకు లేఖనాలు ఇంత బాగా ఎలా తెలుసు?” (యోహా. 7:15) సరైన హృదయ స్థితి ఉన్న వాళ్లయితే ఆయన బోధ విన్నప్పుడు చాలా సంతోషించారు. అపొస్తలుడైన పౌలు, అపొల్లో లాంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా ఏదైనా వివరించాలన్నా, రుజువు చేయాలన్నా లేఖనాల్ని బాగా ఉపయోగించేవాళ్లు. (అపొ. 17:2, 3; 18:24, 28) మన ఆర్టికల్స్, ప్రసంగాల ఔట్‌లైన్‌లు, వీడియోలు, JW బ్రాడ్‌కాస్టింగ్ లాంటి వాటన్నిటికీ బైబిలే ఆధారమని మనకు తెలుసు. మనం మీటింగ్స్‌లో ఏది చెప్పినా బైబిలు నుండే చెప్తాం; అది కొత్తవాళ్లను ఆకట్టుకుంటుంది. స్టేజీ మీద నుండి బోధించేవాళ్లు బైబిలు నుండే బోధిస్తారు. వాళ్లు కేవలం లేఖనాల్ని చదవడమే కాదు, వాటిని ఎలా పాటించాలో కూడా చెప్తారు.—లూకా 24:32.
4. “వినడం” అనే పదానికి అర్థం ఏంటి?
4 బైబిల్లో “వినడం” అనే పదానికి చాలాసార్లు “లోబడడం” అనే అర్థం ఉంది. మీటింగ్స్‌లో మనం బైబిల్ని చదువుతున్నాం అంటే, యెహోవా మాట వింటున్నాం అన్నట్టే! అలా యెహోవా ఇష్టాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం; దానివల్ల ఆయనకు లోబడడం ఈజీ అవుతుంది. మనం యెహోవా మాట విని, దానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటే ఆయన చాలా సంతోషిస్తాడు.—సామె. 27:11.
మనం మీటింగ్స్‌లో ఎందుకు మనసుపెట్టి వినాలి?
5. యెహోవా మీద ప్రేమ ఏం చేసేలా కదిలిస్తుంది? (యోహాను 4:23, 24; 1 యోహాను 5:3)
5 మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి వింటాం. (మత్త. 22:37) యెహోవా గురించి మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే, ఆయన మీద ప్రేమ అంత ఎక్కువ పెరుగుతుంది. ఆయన చెప్పేది వినేలా, లోబడేలా, ఆయనకు నచ్చినట్టు ఆరాధించేలా ఆ ప్రేమే కదిలిస్తుంది.—యోహాను 4:23, 24; 1 యోహాను 5:3 చదవండి.
6. ప్రజలకు సహాయం చేయడం గురించి మీటింగ్స్‌లో ఏం నేర్చుకుంటాం?
6 మనం ప్రజల్ని ప్రేమిస్తాం కాబట్టి వింటాం. (మత్త. 22:39) మన బ్రదర్స్-సిస్టర్స్‌కే కాదు, యెహోవా గురించి తెలియని వాళ్లకు కూడా ఎలా సహాయం చేయాలో ఆయన మనకు మీటింగ్స్‌లో నేర్పిస్తున్నాడు. ఉదాహరణకు, మనం పరిచర్యలో ఎలాంటి లక్షణాలు చూపించాలో తెలుసుకోవడానికి ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం అనే బ్రోషుర్ బాగా ఉపయోగపడుతుంది. మీకు ప్రజలతో మాటలు కలపడం కష్టంగా ఉందా? అయితే, మన బ్రదర్స్-సిస్టర్స్ చేసే ప్రదర్శనల్ని గమనించండి, వాళ్లు దాన్ని ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకోండి.
7. యెహోవా మాట వినడం ఎందుకు ముఖ్యం?
7 మనం జీవానికి విలువిస్తాం కాబట్టి వింటాం. బైబిలు కాలాల్లోని తన సేవకులు సంతోషంగా చాలాకాలం జీవించాలంటే, తన ఆజ్ఞలకు లోబడాలని యెహోవా చెప్పాడు. మన విషయంలో కూడా అంతే. (ద్వితీ. 32:44-47) మనం మీటింగ్స్‌లో శ్రద్ధగా వింటే, కొత్తలోకం వచ్చేవరకు ఓపిగ్గా ఉండడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని పొందుతాం. (రోమా. 8:25) మనం చివరి రోజుల్లో జీవిస్తున్నాం కాబట్టి యెహోవా మాట వినడం, ఆయన సేవలో బిజీగా ఉండడం ఇప్పుడు ఇంకా ముఖ్యం.—మత్త. 24:42-44; ప్రక. 1:3.
అందరూ శ్రద్ధగా వినేలా బోధించేవాళ్లు ఏం చేయవచ్చు?
8. స్టేజీ మీద నుండి బోధించే బ్రదర్స్ తమ బోధించే సామర్థ్యాన్ని ఎందుకు పెంచుకుంటూ ఉండాలి?
8 స్టేజీ మీద నుండి బోధించేవాళ్లు, ముఖ్యంగా బహిరంగ ప్రసంగాలు ఇచ్చే బ్రదర్స్ తమ బోధించే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఒక బ్రదర్ తన ప్రసంగాన్ని బాగా సిద్ధపడి ఇస్తే, అది కేవలం సాక్షులుకాని వాళ్లు సత్యంలోకి రావడానికే కాదు, అప్పటికే సాక్షులుగా ఉన్నవాళ్లు సత్యంలో కొనసాగడానికి కూడా సహాయం చేస్తుంది. కాబట్టి మీటింగ్స్‌లో మీకు ఉండే భాగాలను తక్కువ అంచనా వేయకండి, అవి ఎవరో ఒకరికి సహాయం చేయగలవు. ఒకవేళ మీకు బోధించే అవకాశం వస్తే తర్వాతి పేరాల్లో ఉన్న సలహాలు పాటించి చూడండి. అవి ముఖ్యంగా బహిరంగ ప్రసంగాలు ఇచ్చే బ్రదర్స్ కోసమే అయినా, వేరే భాగాలు చేసేవాళ్లకు కూడా ఉపయోగపడతాయి.—2 తిమో. 4:2; తీతు 1:9.
9. ప్రసంగం తేలిగ్గా అర్థమయ్యేలా ఎందుకు తయారు చేసుకోవాలి?
9 ప్రసంగం తేలిగ్గా అర్థమయ్యేలా తయారు చేసుకోండి. మీరు బోధించేది వినేవాళ్లకు వెంటనే అర్థమవ్వాలని అనుకుంటారు కదా. కానీ మరీ ఎక్కువ సమాచారం చెప్తే, వినేవాళ్లు ప్రసంగం మీద మనసు పెట్టలేకపోవచ్చు. అలా జరగకూడదంటే మీ ప్రసంగాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇలా చేసి చూడండి: (1) మీరు ప్రసంగం మొత్తంలో వివరించే ముఖ్యమైన పాయింట్లను ప్రసంగం మొదట్లోనే చెప్పండి. (2) ఒక పాయింట్ పూర్తయ్యాకే తర్వాతి పాయింట్‌లోకి వెళ్లండి. మీరు ఒక పాయింట్ చెప్పాక కాసేపు ఆగండి. అలా చేస్తే, మీరు తర్వాతి పాయింట్‌లోకి వెళ్తున్నారని వినేవాళ్లు అర్థం చేసుకుంటారు. (3) ప్రసంగం చివర్లో పాయింట్లన్నీ ఒకసారి గుర్తుచేయండి.
10. ప్రసంగం మీద ఇష్టం ఎందుకు పెంచుకోవాలి?
10 ప్రసంగం మీద ఇష్టం పెంచుకోండి. ప్రసంగంలో మీరు చెప్పాలనుకుంటున్న పాయింట్స్ మీద ఇష్టం పెంచుకుంటే మీరు ఉత్సాహంగా చెప్పగలుగుతారు. దానికోసం ఔట్‌లైన్‌లో ఉన్న లేఖనాల్ని, సమాచారాన్ని బాగా ధ్యానించండి. అప్పుడు ఆ ప్రసంగంలో ఉన్న పాయింట్‌లన్నీ మీకు బాగా నచ్చుతాయి, ప్రసంగం ఇచ్చేటప్పుడు మీ ఉత్సాహం వినేవాళ్లకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. (సామె. 2:4, 5; అపొ. 4:20) అమెరికాలో ఉంటున్న ఒక బ్రదర్ అనుభవం గమనించండి. 70 ఏళ్లు దాటిన ఆ బ్రదర్, తన టీనేజ్‌లో విన్న ప్రసంగం గురించి ఇలా చెప్తున్నాడు: “నాకు ఒక ప్రసంగం బాగా గుర్తుండిపోయింది. ఆ ప్రసంగం ఇచ్చిన బ్రదర్ చాలా ఉత్సాహంగా చెప్పాడు. బైబిల్ని లోతుగా ధ్యానించమని ఆయన ప్రోత్సహించాడు, దాన్ని ఎలా చేయాలో కూడా ఆయన వివరించాడు. ఆ ప్రసంగం నా జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే, అప్పటినుండి నేను బైబిలు చదివే విధానం మారిపోయింది, యెహోవాతో నా స్నేహం కూడా పెరిగింది.”
11. ప్రసంగంలో, వినేవాళ్లకు తగ్గట్టు ఏం చేయవచ్చు? (1 తిమోతి 4:13-16)
11 వినేవాళ్లకు ఏం అవసరమో ఆలోచించండి, వాళ్లకు పనికొచ్చే సలహాలు ఇవ్వండి. సమాచారాన్ని చెప్పుకుంటూ పోయే బదులు, లేఖనాల్ని ఉపయోగించి వినేవాళ్లకు అవసరమైన ప్రోత్సాహాన్ని, సలహాల్ని ఇవ్వండి. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు మనకు మంచి ఆదర్శం. తిమోతి ఎఫెసులో తన నియామకాన్ని చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి తిమోతికి సరిగ్గా అవసరమైన సలహాల్ని పౌలు ఇచ్చాడు. (1 తిమోతి 4:13-16 చదవండి.) అదేవిధంగా, మీ ప్రసంగాన్ని వినేవాళ్లకు ఏం అవసరమో ఆలోచించండి. వాళ్లు ఏం చేయాలో అర్థం చేసుకునేలా కొన్ని సలహాలు ఇవ్వండి.
12. ప్రసంగాన్ని సహజంగా ఎందుకు ఇవ్వాలి?
12 ప్రసంగాన్ని బయటకు అనుకుంటూ సిద్ధపడితే సహజంగా ఇవ్వగలుగుతారు. మీరు ఇవ్వాలనుకున్న ప్రసంగం గురించి నోట్స్ తయారు చేసుకుంటున్నప్పుడు ప్రతీ మాటను రాసుకొని, ఉన్నది ఉన్నట్టు చదివే బదులు సహజంగా మాట్లాడండి. అప్పుడు వినేవాళ్లకు అది ఈజీగా అర్థమౌతుంది. చక్కగా చదువుదాం, బోధిద్దాం అనే బ్రోషుర్ ఇలా చెప్తుంది: “మీరు చెప్తున్న విషయం గురించి, వినేవాళ్ల గురించి మీకు ఏమి అనిపిస్తుందో తెలిసేలా సహజంగా, నిజాయితీగా మాట్లాడండి.” మీరు ఎప్పుడైతే మనసులో నుండి మాట్లాడతారో వినేవాళ్లకు ఆసక్తిగా అనిపిస్తుంది, మీరు ప్రసంగిస్తున్నట్టు కాకుండా వాళ్లతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతారు, మీరు చెప్పే విషయాన్ని పాటించాలని కూడా అనుకుంటారు.
13. అనుభవం ఉన్న మంచి ప్రసంగీకుడి సలహా ఎందుకు అడగాలి? (చిత్రం కూడా చూడండి.)
13 అనుభవం ఉన్న మంచి ప్రసంగీకుడి సలహా అడగండి. ప్రసంగం వినేవాళ్లకు మనం చెప్పేది అర్థమౌతుందో లేదో, ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో కొన్నిసార్లు మనం సొంతగా గుర్తించలేం. కాబట్టి మీ ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నాక, అనుభవం ఉన్న ఒక మంచి ప్రసంగీకుడికి మీ నోట్స్ చూపించండి. అలాగే ఆయన ముందు ప్రసంగం ఇవ్వండి, తర్వాత ఎక్కడెక్కడ సరిచేసుకోవాలో అడగండి. (సామె. 1:5) అలా చేసినప్పుడు మీరు మంచి బోధకుడిగా, ప్రసంగీకుడిగా తయారౌతారు. మీ ప్రసంగాల ద్వారా, వినేవాళ్లు బైబిల్లో ఉన్న అమూల్యమైన రత్నాల గురించి తెలుసుకోవడమే కాదు వాటిని పాటించడం కూడా నేర్చుకుంటారు.a
మంచి బోధకుడిగా అవ్వడానికి, అనుభవం ఉన్న ఒక ప్రసంగీకుడి సలహా అడగండి (13వ పేరా చూడండి)
మీటింగ్స్‌లో ఇంకా బాగా వినడానికి ఏం చేయవచ్చు?
14. దేవుని జ్ఞాపికల విషయంలో మనకు ఏ అభిప్రాయం ఉండాలి? (కీర్తన 119: 24, 111, 167)
14 యెహోవా ఇచ్చే జ్ఞాపికల మీద కృతజ్ఞత పెంచుకోండి. మనం ‘ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. (2 తిమో. 3:1) కాబట్టి మనకు వచ్చే కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా మీటింగ్స్ ద్వారా ఒకే విషయాన్ని పదేపదే గుర్తుచేస్తున్నాడు. ఆ జ్ఞాపికలు మనకు చాలా అవసరం. ఒకవేళ మీటింగ్స్‌లో, విన్న విషయాన్నే మళ్లీమళ్లీ వింటున్నామని మీకు అనిపిస్తే 119వ కీర్తన రాసిన రచయితలా ఉంటూ, దేవుని జ్ఞాపికల గురించి సరైన విధంగా ఆలోచించడానికి ప్రయత్నించండి.—కీర్తన 119:24, 111, 167 చదవండి.
15. ఆధ్యాత్మిక ఆహారం మీద కృతజ్ఞతను ఎలా పెంచుకుంటూ ఉండాలి?
15 ఆధ్యాత్మిక ఆహారం యెహోవా మనకు ఇచ్చిన గిఫ్ట్. కాబట్టి మీటింగ్స్‌లో మనం నేర్చుకునే వాటిని సరైన విధంగా చూడాలి. లేకపోతే ఇశ్రాయేలీయులకు జరిగినట్టే మనకూ జరిగే ప్రమాదం ఉంది. ఎడారిలో ఉన్నప్పుడు, వాళ్లకు యెహోవా మన్నాను ఆహారంగా ఇచ్చాడు. (నిర్గ. 16:15, 31) మొదట్లో, వాళ్లు దాన్ని యెహోవా ఇచ్చిన గిఫ్ట్‌లా చూశారు. పైగా వాళ్లకు అది నచ్చింది, అది తినడం వల్లే ప్రాణాలతో ఉండగలిగారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, రోజూ అదే తినాలా అని వాళ్లు విసుక్కున్నారు. (సంఖ్యా. 21:5) పాఠం ఏంటి? మనకు కూడా మీటింగ్స్‌లో విన్నదాన్నే మళ్లీమళ్లీ వింటున్నప్పుడు ఇశ్రాయేలీయుల్లా అనిపించవచ్చు. కానీ ఆధ్యాత్మిక ఆహారం యెహోవా నుండే వస్తుందని, యెహోవా సంస్థ ఎంతో ఆలోచించి దాన్ని తయారు చేస్తుందని గుర్తుంచుకోవాలి. అంతేకాదు, మీటింగ్స్‌లో పదేపదే నేర్చుకునే విషయాల వల్ల మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతామని, శాశ్వత జీవితం పొందుతామని మర్చిపోవద్దు.—సామె. 3:13, 16-18; యోహా. 17:3.
16. ఎంతోకాలంగా సత్యంలో ఉన్న కొంతమందికి మీటింగ్స్‌లో మనసుపెట్టి వినడానికి ఏం సహాయం చేసింది? (“శ్రద్ధగా వినడానికి కొన్ని సలహాలు” అనే బాక్సు కూడా చూడండి.)
16 కొన్ని సలహాలు పాటించి చూడండి. ఎంతోకాలంగా సత్యంలో ఉన్న కొంతమంది, మీటింగ్స్‌లో మనసుపెట్టి వినడానికి ఏం సహాయం చేసిందో గమనించండి. 30 ఏళ్లకు పైగా సత్యంలో ఉన్న ఆష్‌లీ అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “నేను మీటింగ్స్‌కి బాగా సిద్ధపడి వెళ్తాను, అదే నేను మనసుపెట్టి వినేలా సహాయం చేస్తుంది. ఒకవేళ నేను అలా సిద్ధపడి వెళ్లకపోతే కామెంట్స్ చెప్పలేను, నా ఆలోచనలు కూడా ఎటో వెళ్లిపోతాయి.” 52 ఏళ్లుగా సత్యంలో ఉన్న జోసెఫ్ అనే బ్రదర్ ఇలా అంటున్నాడు: “మీటింగ్స్‌లో పదేపదే ఒకే విషయం గురించి విన్నా, నాకు నచ్చుతుంది. ఎందుకంటే, ఆ విషయాన్నే ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చెప్తారు. కాబట్టి నాకు ఎప్పుడూ కొత్త విషయాన్ని వింటున్నట్టే అనిపిస్తుంది. ఎవరైనా బ్రదర్‌కి ప్రసంగం ఇచ్చే సామర్థ్యం అంతగా లేకపోతే, ఆయన చెప్పే విధానం మీద మనసుపెట్టకుండా ఆయన బైబిలు నుండి చెప్తున్నవాటి మీదే దృష్టి పెడతాను. అది యెహోవా నుండి వస్తుందని గుర్తుంచుకుంటాను.”
17. మీరు మనసుపెట్టి వినడానికి ఇంకా ఏం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
17 మీరు మనసుపెట్టి వినడానికి ఈ సలహాలు కూడా ఉపయోగపడవచ్చు: (1) మీటింగ్‌కి వెళ్లేముందు మరీ ఎక్కువ తినకండి, అప్పుడు మీకు నిద్ర రాదు. (2) మీటింగ్ లేదా సమావేశానికి కాస్త ముందే వెళ్లి సీటు పెట్టుకోండి. (3) మీ ఫోన్‌లు, ట్యాబ్‌లు సైలెంట్‌లో పెట్టుకోండి, వాటివల్ల మీ దృష్టి పక్కకు వెళ్లకుండా చూసుకోండి. (4) ప్రసంగంలో ఏమేం చెప్తారో ముందే ఆలోచించండి. (5) ప్రసంగీకుడు చెప్తున్నప్పుడు ఆయన వైపు చూడండి. (6) ముఖ్యమైన పాయింట్‌లను నోట్స్ రాసుకోండి లేదా చిన్నచిన్న బొమ్మలు గీసుకోండి. (7) ప్రసంగంలో చెప్పిన బైబిలు వచనాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఆలోచించండి. (8) ‘సంఘంలో వాళ్లకు లేదా పరిచర్యలో కలిసేవాళ్లకు సహాయం చేయడానికి ఈ పాయింట్‌ని నేను ఎలా ఉపయోగించవచ్చు?’ అని ప్రశ్నించుకోండి. (9) సమావేశానికి వెళ్లకముందే ప్రోగ్రాం షీట్‌లో ఆ రోజు అంశం ఏంటో, ఏయే ప్రసంగాలు ఉన్నాయో, ముఖ్య లేఖనాలు ఏంటో చూసుకోండి. (10) కార్యక్రమం మొదలవ్వకముందే మీ సీట్లలో కూర్చొని, సంగీతాన్ని లేదా దానికి సంబంధించిన వీడియోను ఆస్వాదిస్తూ, మీ మనసును సిద్ధం చేసుకోండి.
దేవుడు ఇచ్చే జ్ఞాపికల్ని వింటూ ఉండండి, ఫోన్-ట్యాబ్ లాంటివాటి వల్ల మీ దృష్టి పక్కకు వెళ్లనివ్వకండి (17వ పేరా చూడండి)
యెహోవా చెప్పేది వింటూ ఉండండి
18. మీటింగ్స్‌లో యెహోవా చెప్పేది ఎందుకు వింటూ ఉండాలి?
18 మనం యెహోవా చెప్పేది వింటూ ఉండాలి. అలా చేస్తేనే ఆయన మనల్ని ‘నీతి మార్గాల్లో నడిపించేలా’ అనుమతించినట్టు అవుతుంది. (కీర్త. 23:3; 31:3) మనం సరైనది చేస్తూ ఉండాలంటే ఆయనిచ్చే సలహాలు మనకు చాలా అవసరం. లేకపోతే, పెద్దపెద్ద గాలులకు ఓడ కొట్టుకుపోయినట్టే మనం కూడా కొట్టుకుపోతాం. కాబట్టి ‘మనం ఎలా వింటున్నామనే దానిమీద మనసుపెట్టాలి’, మీటింగ్స్‌లో నేర్చుకున్న వాటిని పాటించాలి. (లూకా 8:18) ఎవరైతే యెహోవా మాట వింటారో వాళ్లు ఇప్పుడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.—కీర్త. 119:2, 14.
పాట 87 రండి, సేదదీర్పు పొందండి!
a మంచి ప్రసంగీకులుగా, బోధకులుగా అవ్వడానికి మరిన్ని సలహాల కోసం చక్కగా చదువుదాం, బోధిద్దాం అనే బ్రోషుర్‌ను అలాగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకాన్ని చూడండి.