కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 మే పేజీలు 2-7
  • బైబిలు సూత్రాలు ఎందుకంత ప్రాముఖ్యం?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు సూత్రాలు ఎందుకంత ప్రాముఖ్యం?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు సూత్రాలు అంటే ఏంటి?
  • బైబిలు సూత్రాలు ఎందుకు ప్రాముఖ్యం?
  • బైబిలు సూత్రాల్ని ఎలా గుర్తుపట్టవచ్చు?
  • బైబిలు సూత్రాల ప్రకారం జీవిస్తూ ఉండండి
  • మీ మనస్సాక్షికి బైబిలు సూత్రాలతో శిక్షణ ఇవ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • మీ అడుగులు దైవిక సూత్రాలచేత నడిపించబడనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • బైబిలు సూత్రాలు మనకు ఎలా మేలు చేస్తాయి?
    దేవుడు చెప్తున్న మంచివార్త!
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 మే పేజీలు 2-7

జూలై 6-12, 2026

పాట 98 లేఖనాల్ని దేవుడు ప్రేరేపించాడు

బైబిలు సూత్రాలు ఎందుకంత ప్రాముఖ్యం?

“మీ శరీరాల్ని . . . బలిగా అప్పగించండి, మీ ఆలోచనా సామర్థ్యాల్ని ఉపయోగించి పవిత్రసేవ చేయండి.”—రోమా. 12:1.

ముఖ్యాంశం

బైబిలు సూత్రాలు అంటే ఏంటో, బైబిలు చదువుతున్నప్పుడు వాటిని ఎలా గుర్తుపట్టవచ్చో తెలుసుకుంటాం.

1-2. (ఎ) బైబిలు చాలా పాత పుస్తకం అని ఎందుకు చెప్పవచ్చు? (బి) అది ఇప్పటికీ పనికొస్తుందా?

బైబిలు ఎన్నో తరాల క్రితం రాసిన ఒక పుస్తకం. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం దాన్ని రాయడం మొదలుపెట్టారు. ఇంచుమించు 2,000 సంవత్సరాల క్రితం దాన్ని రాయడం పూర్తిచేశారు. బైబిల్ని ఎప్పుడో రాశారన్న మాట నిజమే గానీ, దానిలో ఉన్న విషయాలు ఇప్పటికీ పనికొస్తాయి. (హెబ్రీ. 4:12; 2 తిమో. 3:16, 17) ఈరోజుల్లో కూడా లక్షలమంది బైబిలు సలహాల్ని పాటిస్తున్నారు. దానివల్ల తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు.

2 అంత పాత పుస్తకం మనకు ఇప్పటికీ పనికొస్తుందా? పనికొస్తుంది, అలా అనడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, బైబిల్ని ఇచ్చింది “జీవంగల” సృష్టికర్త. ఆయనకు ఉన్నంత తెలివి విశ్వంలో ఎవ్వరికీ లేదు. (1 తిమో. 4:10; రోమా. 16:26, 27) రెండు, ఎన్ని తరాలు మారినా అందులో సూత్రాలు ఎప్పటికీ పనికొచ్చేలా దేవుడు దాన్ని రాయించాడు. ఒకవ్యక్తి ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అవి ఉపయోగపడతాయి.

3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 బైబిలు సూత్రాలు అంటే ఏంటి? అవి ఇప్పుడు కూడా ఎందుకు చాలా ప్రాముఖ్యం? బైబిలు చదువుతున్నప్పుడు సూత్రాల్ని ఎలా గుర్తుపట్టవచ్చు? వీటి గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే యేసు బోధల్లో సూత్రాలకు ఉన్న విలువ ఎలా కొట్టొచ్చినట్టు కనిపించిందో కూడా చూస్తాం.

బైబిలు సూత్రాలు అంటే ఏంటి?

4. బైబిలు సూత్రాలు అంటే ఏంటి?

4 బైబిలు సూత్రాలు అంటే ప్రాథమిక సత్యాలు. దేవుని నియమాలు వీటి మీదే ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు, నియమంలోనే సూత్రం ఏంటో స్పష్టంగా అర్థమైపోతుంది. (మత్త. 22:37) అయితే, సూత్రాలు నియమాల కన్నా చాలా గొప్పవి. కొన్ని నియమాలకు పరిమితులు ఉండొచ్చు. అవి ఫలానా టైమ్‌కు, ఫలానా పరిస్థితులకే వర్తించవచ్చు. కానీ సూత్రాలు మాత్రం అలాకాదు. అవి యెహోవా ఆలోచనల్ని అన్నివైపుల నుండి అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తాయి. సూత్రాలు ఒక నియమం వెనకున్న కారణాన్ని వివరిస్తాయి. యెహోవా ఇచ్చే ప్రతీ నియమం వెనక ఒక మంచి కారణం ఉంటుంది. ఈ సూత్రాలు వేర్వేరు పరిస్థితుల్లో, వేర్వేరు కాలాల్లో పనికొస్తాయి. (కీర్త. 119:111) నియమాలు మారొచ్చేమో గానీ, సూత్రాలు మాత్రం అస్సలు మారవు. అవి ఎప్పటికీ ఉంటాయి!—యెష. 40:8.

5. నియమాలకు సూత్రాలకు మధ్య ఉన్న తేడాను ఒక ఉదాహరణతో చెప్పండి. (చిత్రాలు కూడా చూడండి.)

5 నియమాలకు, సూత్రాలకు మధ్య ఉన్న తేడాను చక్కగా అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పిల్లోడికి వాళ్ల అమ్మ, ‘స్టవ్‌ ముట్టుకోవద్దు!’ అని చెప్పింది. ఇది ఒక రూల్‌ లేదా నియమం. కానీ ఈ నియమం వెనకున్న సూత్రం లేదా ఉద్దేశం ఏంటి: వేడిగా ఉన్న దేన్నీ ముట్టుకోవద్దు; ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. ఇక్కడ సూత్రం కేవలం స్టవ్‌కే పరిమితం కాదు. అది ఇస్త్రీపెట్టెకు, హీటర్‌కు లేదా వేడిగా ఉన్న దేనికైనా వర్తిస్తుంది. అలాగే, ఈ సూత్రం ఇంట్లోనే కాదు ఎక్కడైనా పనికొస్తుంది. నిజానికి ఆ అబ్బాయి పెద్దౌవుతున్న కొద్దీ, స్టవ్‌ వాడతాడు కానీ వేడిగా ఉన్నవాటిని ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాడు. కాబట్టి నియమం మారవచ్చేమో గానీ దాని వెనకున్న సూత్రం ఎప్పటికీ మారదు.

చిత్రాలు: ఒక తల్లి తన కొడుకుతో కలిసి కిచెన్‌లో వంట చేస్తుంది. 1. ఆ అబ్బాయి చిన్నప్పుడు, వేడిగా ఉన్న స్టవ్‌ని ముట్టుకోవద్దని తల్లి వంట చేస్తూ చెప్తుంది. 2. కొన్నేళ్లు గడిచాక, ఆ తల్లికొడుకులు కలిసి స్టవ్‌ మీద వంట చేస్తున్నారు.

నియమం మారొచ్చేమో గానీ, దాని వెనుకున్న సూత్రం మాత్రం మారదు (5వ పేరా చూడండి)


బైబిలు సూత్రాలు ఎందుకు ప్రాముఖ్యం?

6. (ఎ) యెహోవా తన వాక్యంలో ఏం ఇచ్చాడు? (బి) ఆయన మనల్ని ఎలా గౌరవిస్తున్నాడు?

6 యెహోవాకు మనమంటే చాలా ఇష్టం, అందుకే మనల్ని ప్రమాదాల నుండి కాపాడడానికి కొన్ని నియమాల్ని ఇచ్చాడు. (యాకో. 2:11) వీటితోపాటు, ఆ నియమాల వెనకున్న సూత్రాన్ని అర్థంచేసుకోవడానికి కూడా సహాయం చేస్తున్నాడు. అయితే, కొన్ని విషయాల్లో సూటైన నియమాలు ఉండవు. కానీ యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా ఆ విషయాల్లో కూడా మనకు నిర్దేశాలు ఇస్తున్నాడు. నిజానికి బైబిలు సూత్రాల వల్లే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం, సరైనది చేయగలుగుతాం. వాటిని ఇచ్చి యెహోవా మనల్ని గౌరవించాడు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందని చూపించాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని, ఆయన మాట వినాలనుకుంటున్నామని మన నిర్ణయాల్లో చూపించవచ్చు.—గల. 5:13.

7. బైబిలు సూత్రాలు మనకెలా సహాయం చేస్తాయో అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పండి. (చిత్రం కూడా చూడండి.)

7 బైబిలు సూత్రాలు మనకెలా సహాయం చేస్తాయో అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. సాధారణంగా, కొన్ని రకాల హైవేల్లో ఎంత స్పీడ్‌లో వెళ్లాలో, బండి ఎక్కడ ఆపాలో చెప్పే సైన్‌బోర్డ్‌లు ఉంటాయి. ఒకవేళ వాటిని పాటించకపోతే ఫైన్‌ కట్టాలి. అవి కాకుండా, ఇంకొన్ని సైన్‌బోర్డ్‌లు కూడా ఉంటాయి. ఉదాహరణకు, ‘ఇది యాక్సిడెంట్లు జరిగే స్థలం,’ ‘ఇక్కడ జంతువులు రోడ్డు దాటతాయి’ లాంటి బోర్డ్‌లు ఉంటాయి. వీటికి ఫైన్‌ ఉండదు, కానీ పాటించకపోతే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తాయి. వాటిని చూసినప్పుడు ఒక అనుభవంగల డ్రైవర్‌ వివేచనతో బండిని కాస్త జాగ్రత్తగా నడుపుతాడు. అదేవిధంగా, కొన్ని పనులు చేయవద్దని బైబిలు సూటిగా చెప్తుంది. క్రైస్తవులు వాటి జోలికి అస్సలు వెళ్లరు. అంతేకాదు, దేవుని నియమాలను మీరేలా చేసే ఆలోచనలు, పనుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని బైబిలు చెప్తుంది. మనం అలా ఉండాలంటే మంచి వివేచన చూపించాలి.

కొండప్రాంతంలోని వంపులు తిరిగిన దారిలో ఒక కారు వెళ్తుంది. దాని ముందున్న లైట్ల వల్ల హెచ్చరికలు ఉన్న సైన్‌బోర్డులు కనిపిస్తున్నాయి.

రోడ్డు పక్కనుండే కొన్ని సైన్‌బోర్డ్‌లు ప్రమాదాల గురించి హెచ్చరిస్తాయి. బైబిలు సూత్రాలు కూడా అంతే (7వ పేరా చూడండి)


8. రోమీయులు 12:1, 2 ప్రకారం, మనం బైబిలు సూత్రాల కోసం వెదికితే ఏ ప్రయోజనం ఉంటుంది?

8 అయితే, బైబిలు సూత్రాల కోసం వెతికి, వాటి ప్రకారం జీవించినప్పుడు మనకు ఇంకొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఒక ప్రయోజనం ఏంటంటే, ఫలానా విషయంలో యెహోవా ఆలోచన ఏంటో అర్థం చేసుకోగలుగుతాం. బైబిలు చదువుతున్నప్పుడు మనకు పనికొచ్చే పాఠాల కోసం వెతుకుతూ ఇలా ప్రశ్నించుకుంటాం: ‘యెహోవా దీన్ని బైబిల్లో ఎందుకు రాయించాడు? దాన్నుండి నేను ఏం నేర్చుకోవచ్చు?’ ఇలా చేసినప్పుడు, మన “ఆలోచనా సామర్థ్యాల్ని” ఉపయోగించడం నేర్చుకోగలుగుతాం. అలాగే “మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోగలుగుతాం.”—రోమీయులు 12:1, 2 చదవండి.a

9. బైబిలు సూత్రాల ప్రకారం బ్రతికితే, మనకు ఇంకా ఏ ప్రయోజనం ఉంటుంది? (హెబ్రీయులు 5:13, 14)

9 బైబిలు సూత్రాల ప్రకారం బ్రతకడం నేర్చుకుంటే, మనం పరిణతిగల క్రైస్తవులుగా అవుతాం. మనం బైబిలు సూత్రాల ప్రకారం బ్రతికితే, యెహోవాతో మనకున్న స్నేహం పెరుగుతుంది. (హెబ్రీయులు 5:13, 14 చదవండి.) సాధారణంగా, చిన్నపిల్లలకు ఏం చేయాలన్నా ఒక పెద్ద రూల్స్‌ లిస్ట్‌ కావాలి. శిక్ష పడుతుందనే భయంతోనే వాళ్లు అవి పాటించవచ్చు. కానీ యెహోవా మనల్ని చిన్నపిల్లల్లా కాదు, పెద్దవాళ్లలా చూస్తున్నాడు. మనం తన ఇష్టానికి తగ్గట్టు మంచి నిర్ణయాలు తీసుకుంటామని నమ్ముతున్నాడు. మనం అలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఆయన మనసు గెలుచుకుంటాం.—కీర్త. 147:11; సామె. 23:15, 26; 27:11.

బైబిలు సూత్రాల్ని ఎలా గుర్తుపట్టవచ్చు?

10. మనం బైబిలు సూత్రాలను ఎలా గుర్తుపట్టవచ్చు?

10 మనం బైబిలు చదువుతున్నప్పుడు, అందులో ఏ పాఠాలు నేర్చుకోవచ్చో వెదకాలి. అలా చేసినప్పుడు, ఫలానా విషయంలో యెహోవా ఎలా ఆలోచిస్తాడో, ఆయనకు ఎలా అనిపిస్తుందో అర్థంచేసుకునే సూత్రాలు దొరుకుతాయి. అలాగే, ఒక నియమం వెనకున్న కారణం కోసం చూసినప్పుడు కూడా సూత్రాలు దొరుకుతాయి. ఆ కారణాల్ని మనం ఎంత బాగా అర్థంచేసుకుంటే, యెహోవాను మనం అంత బాగా అర్థంచేసుకోగలుగుతాం. అయితే, అలా అర్థంచేసుకోవడానికి సహాయం కోసం ఆయన్నే అడగాలి. అలాగే మన ఆలోచనా సామర్థ్యాల్ని కూడా పెంచుకోవాలి. (సామె. 2:10-12) దానికోసం మనం ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘యెహోవా ఈ నియమం ఎందుకు ఇచ్చాడు? ఒకవేళ ఫలానా పని ఆయన ఇష్టపడట్లేదంటే, అలాంటిది ఇంకేదైనా చేస్తే ఆయనకు ఎలా అనిపిస్తుంది? ఈ బైబిలు కథ నుండి నేను ఏం నేర్చుకున్నాను? దీన్ని నేను ఎలా పాటించవచ్చు?’ మనం ఒక్కసారి నియమాల వెనకున్న కారణాల్ని, బైబిలు కథలో ఉన్న పాఠాల్ని గుర్తుపట్టగలిగితే యెహోవా ఇష్టానికి తగ్గట్టు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

11. బైబిలు సూత్రాల్ని గుర్తుపట్టడానికి యేసు కొండమీది ప్రసంగంలో ఏం చెప్పాడు? (చిత్రం కూడా చూడండి.)

11 యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో, బైబిలు సూత్రాల్ని ఎలా గుర్తుపట్టవచ్చో చెప్పాడు. ఇప్పుడు దానికి సంబంధించి మూడు ఉదాహరణలు చూద్దాం. ప్రతీ దాంట్లో, యేసు ముందు ఒక నియమం చెప్పి, ఆ తర్వాత దాని వెనకున్న సూత్రం లేదా ఉద్దేశం చెప్తాడు. వాటిగురించి లోతుగా ఆలోచించినప్పుడు, ఆ సూత్రాలు మనకాలానికి ఎలా పనికొస్తాయో, వాటిని మనం ఎలా పాటించవచ్చో చూస్తాం.

యేసు చెట్టు కింద కూర్చుని తన శిష్యులకు బోధిస్తున్నాడు.

దేవుని నియమాల వెనుకున్న సూత్రాల్ని ఎలా గుర్తుపట్టవచ్చో యేసు కొండమీది ప్రసంగంలో చెప్పాడు (11వ పేరా చూడండి)


12. మత్తయి 5:21, 22 లోని నియమం వెనకున్న ఒక సూత్రం ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

12 మత్తయి 5:21, 22 చదవండి. “హత్య చేయకూడదు.” ఈ నియమం వెనకున్న సూత్రం ఏంటి? మన పనుల్లో, మాటల్లో, ఆఖరికి ఆలోచనల్లో కూడా ఎవ్వరినీ ద్వేషించకూడదని యెహోవా కోరుకుంటున్నాడు. ఒకవ్యక్తి హత్య చేసేంత దూరం వెళ్లకపోయినా, తన సహోదరుడిని ద్వేషిస్తే అతను ఈ నియమం వెనకున్న కారణాన్ని లెక్కచేయనట్టే అని యేసు చెప్పాడు. ఒకవ్యక్తి, “తన సహోదరుని మీద మనసులో కోపం” పెట్టుకున్నా లేదా తిట్టినా, అతను దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి ఆలోచనలు, పనులే హత్య దాకా తీసుకెళ్తాయి.—1 యోహా. 3:15.

13. మత్తయి 5:21, 22 లో ఉన్న సూత్రాన్ని ఇప్పుడు మనమెలా పాటించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

13 మత్తయి 5:21, 22 లో ఉన్న సూత్రాన్ని ఇప్పుడు మనమెలా పాటించవచ్చు? మనం ఎదుటివ్యక్తి మీద కోపాన్ని మనసులో ఉంచుకోకూడదు. (లేవీ. 19:18; యోబు 36:13) ఎందుకంటే, అది ద్వేషాన్ని నూరిపోస్తుంది. అది ఏదోకరోజు మాటల్లోనో, పనుల్లోనో బయటపడుతుంది. (సామె. 10:12) ఒకవ్యక్తి మంచిపేరు పాడుచేయడానికి లేనిపోనివి కల్పించి చెప్పడం, పుకార్లు పుట్టించడం కూడా ఇందులో ఉంది. (సామె. 20:19; 25:23) నిజానికి, యేసు ఆ మాటలు చెప్పినప్పుడు ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్లు లేవు. కానీ, ఈ కంప్యూటర్‌ యుగంలో వాటిని వాడుతున్నప్పుడు మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడానికి ఆయన సలహా మనకు పనికొస్తుంది. మనం ఎప్పుడూ ఎదుటివ్యక్తి మీద ద్వేషాన్ని మనసులో ఉంచుకుని మాట్లాడకూడదు. అలా చేస్తే, బహుశా మనం ఆ వ్యక్తిని చంపకపోవచ్చేమో గానీ, ఆ వ్యక్తికి ఉన్న మంచి పేరును చంపేస్తాం.

చిత్రాలు: 1. అక్కడ ఈ బైబిలు నియమం ఉంది: “హత్య చేయకూడదు.” 2. ఇద్దరు సిస్టర్స్‌ చాడీలు చెప్పుకుంటున్నారు, వాళ్లు చెప్తున్నది వింటున్న ఇంకో సిస్టర్‌కి ఇబ్బందిగా అనిపిస్తుంది.

(12-13 పేరాలు చూడండి)


14. మత్తయి 5:27, 28 లోని నియమం వెనకున్న సూత్రం ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

14 మత్తయి 5:27, 28 చదవండి. “వ్యభిచారం చేయకూడదు.” ఈ నియమం వెనకున్న సూత్రం ఏంటి? యెహోవా అనైతికతనే కాదు, దానికి నడిపించే ఆలోచనల్ని కూడా అసహ్యించుకుంటున్నాడు. ఒక పెళ్లయిన వ్యక్తి తన భార్యను కాకుండా వేరే స్త్రీని తప్పుగా చూస్తుంటే, అతను పాపం చేసినట్టే అని యేసు చెప్పాడు. కాబట్టి, అనైతిక ఆలోచనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వొద్దు. ఒకవేళ వచ్చినా వాటిని చంపేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లాలి. (మత్త. 5:29, 30) ఈ సూత్రం పెళ్లికాని క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది.

15. మత్తయి 5:27, 28 లో ఉన్న సూత్రాన్ని ఇప్పుడు మనమెలా పాటించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

15 మత్తయి 5:27, 28 లో ఉన్న సూత్రాన్ని ఇప్పుడు మనమెలా పాటించవచ్చు? మనం అనైతిక ఊహల్లో తేలిపోవద్దు. (2 సమూ. 11:2-4; యోబు 31:1-3) ఒక పరిణతిగల క్రైస్తవుడు ఎలాంటి అశ్లీల చిత్రాల జోలికి వెళ్లడు. ‘నేను కేవలం చూస్తున్నాను గానీ తప్పేం చేయట్లేదు కదా’ అని అనుకోడు, లేదా ‘నేను చూసేవి అంత అశ్లీలమైనవి ఏం కావులే’ అని కుంటిసాకులు చెప్పడు. అయితే యేసు కాలంలో ఫోన్లు, సినిమాలు, ఫోటోలు లాంటివి లేవు. కానీ, ఆయన చెప్పిన సూత్రాన్ని బట్టి మనకాలంలో ఉన్న అశ్లీల చిత్రాల గురించి యెహోవా ఆలోచన ఏంటో తెలుస్తుంది. అంటే అశ్లీల చిత్రాల్ని ఫోన్‌లో పంపించుకోవడం లేదా ఫోన్లో గానీ, మెసేజ్‌ల్లో గానీ అలా తప్పుగా మాట్లాడుకోవడం యెహోవాకు అసహ్యం అని దీన్నిబట్టి అర్థమౌతుంది. ఈ సూత్రాన్ని పాటిస్తే, ఒకవ్యక్తి తన భర్తకు లేదా తన భార్యకు నమ్మకద్రోహం చేయకుండా ఉంటారు. (మలా. 2:15) అలాగే పెళ్లయినా, కాకపోయినా క్రైస్తవులందరూ లైంగిక పాపానికి నడిపించే దేన్నీ చేయకుండా ఉండగలుగుతారు.—సామె. 5:3-14.

చిత్రాలు: 1. అక్కడ ఈ బైబిలు నియమం ఉంది: “వ్యభిచారం చేయకూడదు.” 2. ఒక బ్రదర్‌ తన ఫోన్‌లో ఉన్న సోషల్‌ మీడియా యాప్‌ని డిలీట్‌ చేస్తున్నాడు.

(14-15 పేరాలు చూడండి)


16. మత్తయి 5:43, 44 లోని నియమం వెనకున్న సూత్రం ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

16 మత్తయి 5:43, 44, అధస్సూచి చదవండి. “నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.” ఈ నియమం వెనకున్న సూత్రం ఏంటి? మనం అందర్నీ మన పొరుగువాళ్లలా చూడాలని, వాళ్లను ప్రేమించాలని యెహోవా కోరుకుంటున్నాడు. బాధాకరంగా, యేసు కాలంలో ఉన్న యూదులు ఈ నియమాన్ని తప్పుగా అర్థంచేసుకుని శత్రువుల్ని ద్వేషించాలని అనుకున్నారు. కానీ ఈ నియమం ఉద్దేశం అది కాదని యేసుకు తెలుసు. దేశం, మతం, కులం అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కర్ని మన పొరుగువాళ్లలా చూస్తూ వాళ్లను ప్రేమించాలన్నదే యెహోవా కోరికని యేసుకు తెలుసు.—మత్త. 5:45-48.

17. మత్తయి 5:43, 44 లో ఉన్న సూత్రాన్ని ఇప్పుడు మనం ఎలా పాటించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

17 మత్తయి 5:43, 44 లో ఉన్న సూత్రాన్ని ఇప్పుడు ఎలా పాటించవచ్చు? పొరుగువాళ్లను ప్రేమిస్తే, మనం లోకంలో జరుగుతున్న యుద్ధాల్లో-గొడవల్లో తలదూర్చం. (యెష. 2:4; మీకా 4:3) అలాగే అవతలి వ్యక్తి ఏ దేశం, మతం, కులం నుండి వచ్చినా వాళ్లతో దయగా ప్రవర్తించేలా ఈ సూత్రం సహాయం చేస్తుంది. (అపొ. 10:34, 35) అంతేకాదు మనల్ని గానీ, మనకు ఇష్టమైనవాళ్లను గానీ ఎవరైనా బాధపెట్టినా, మనం వాళ్లను క్షమించేలా అది సహాయం చేస్తుంది.—మత్త. 18:21, 22; మార్కు 11:25; లూకా 17:3, 4.

చిత్రాలు: 1. అక్కడ ఈ బైబిలు నియమం ఉంది: “నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.” 2. ఒక జంట మార్కెట్‌లో పరిచర్య చేస్తూ, వేరే జాతికి చెందిన ఒకతనికి “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” అనే బ్రోషుర్‌ని చూపిస్తున్నారు.

(16-17 పేరాలు చూడండి)


బైబిలు సూత్రాల ప్రకారం జీవిస్తూ ఉండండి

18. (ఎ) మనం ఏమని నిర్ణయించుకోవాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

18 యెహోవా ప్రతీదానికి ఒక నియమం పెట్టి, మనల్ని చిన్నపిల్లల్లా చూడట్లేదు. దానికి ఆయనకు ఎంత థ్యాంక్స్‌ చెప్పాలో కదా! మనం బైబిలు సూత్రాల ప్రకారం మంచి నిర్ణయాలు తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 కొరిం. 14:20) అయితే, అలా చేస్తున్నప్పుడు మనం “యెహోవా ఇష్టం ఏమిటో అర్థంచేసుకుంటూ” ఉండాలని గట్టిగా నిర్ణయించుకుందాం. (ఎఫె. 5:17) మనం ఆయన ఇష్టప్రకారం నిర్ణయాలు తీసుకునేది ఆయన మీద ప్రేమతోనే గానీ, ఆయన శిక్షిస్తాడనే భయంతో కాదు. ఈ విషయంలో మనకు సహాయం చేసే ఇంకో బహుమతి కూడా యెహోవా ఇచ్చాడు, అదే మనస్సాక్షి! దానిగురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

మీరెలా జవాబిస్తారు?

  • బైబిలు సూత్రం అంటే ఏంటి?

  • బైబిలు సూత్రాలకు, నియమాలకు మధ్య తేడా ఏంటి?

  • యేసు కొండమీది ప్రసంగంలో నేర్పించిన కొన్ని సూత్రాలు ఏంటి?

పాట 95 వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది

a చాలా విషయాల్లో, యెహోవా మనకు సూటైన నియమాలు ఇవ్వలేదు. కాబట్టి, మన పరిస్థితికి సరిపోయే వేర్వేరు బైబిలు సూత్రాల గురించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే యెహోవా మనకిచ్చిన “ఆలోచనా సామర్థ్యాల్ని” ఉపయోగిస్తే, ఆయన ఆమోదించే, దీవించే నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మొదటి శతాబ్దంలో ఒకప్పుడు యూదులుగా ఉన్న క్రైస్తవులకు అలా ఆలోచించి సొంతగా నిర్ణయాలు తీసుకోవడం కొత్తగా అనిపించి ఉంటుంది. ఎందుకంటే, వాళ్లకు మతనాయకులు పెట్టిన చాలా నియమాల్ని పాటించడం అలవాటైంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి