కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 ఏప్రిల్‌ పేజీలు 14-19
  • కష్టాల్ని సరైన దృష్టితో చూడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కష్టాల్ని సరైన దృష్టితో చూడండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన కష్టాల్ని సరైన దృష్టితో ఎలా చూడాలి?
  • కష్టాల్ని సరైన దృష్టితో చూడకపోతే వచ్చే నష్టాలు ఏంటి?
  • కష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సిన కొన్ని పనులు ఏంటి?
  • యెహోవా “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఏమేం ఇచ్చాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మనం అస్సలు ఒంటరివాళ్లం కాదు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 ఏప్రిల్‌ పేజీలు 14-19

జూన్‌ 15-21, 2026

పాట 122 విశ్వాసంలో సుస్థిరం అవ్వండి

కష్టాల్ని సరైన దృష్టితో చూడండి

“కష్టాలు, ఇబ్బందులు వచ్చినా నేను నీ ఆజ్ఞల్ని ప్రేమిస్తూనే ఉంటాను.”—కీర్త. 119:143.

ముఖ్యాంశం

కష్టాల్ని సరైన దృష్టితో చూడడం వల్ల వాటిని ఎలా తట్టుకుని నిలబడవచ్చో చూస్తాం.

1-2. కష్టాల్ని తట్టుకుని నిలబడాలంటే మనం ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

విశ్వాసం వల్ల ప్రస్తుతం మీరు అన్యాయాన్ని, ఇంట్లోవాళ్ల వ్యతిరేకతను, లేదా హింసను ఎదుర్కొంటున్నారా? ఒంట్లో బాగోకపోవడం లేదా వయసు పైబడడం వల్ల మీకు కొంచెం కష్టంగా ఉందా? ఇష్టమైనవాళ్లు చనిపోవడం వల్ల లేదా ఏదైనా ఒక విషాదం వల్ల మీరు బాధలో కూరుకుపోయారా? యెహోవా అపురూపంగా చూసుకుంటున్న చాలామంది ప్రజలు ఇలాంటి కష్టాలే పడుతున్నారు. వాళ్లలాగే మీ జీవితం కూడా ‘కష్టాలతో, కన్నీళ్లతో నిండిపోయి’ ఉండవచ్చు.—కీర్త. 90:10.

2 కష్టాల్ని తట్టుకుని నిలబడాలంటే వాటిని సరైన దృష్టితో చూడాలి. దాన్ని ఎలా చేయవచ్చు? ఈ ఉదాహరణ చూడండి: మన జీవితంలో వచ్చే కష్టాల్ని, కారు నడుపుతున్నప్పుడు వచ్చే ప్రమాదాలతో పోల్చవచ్చు. ప్రమాదాన్ని బట్టి మనం కారును కుడి వైపుకో ఎడమ వైపుకో తిప్పుతాం, మెల్లగా పోనిస్తాం, లేదా కొన్నిసార్లు అక్కడే ఆపేస్తాం. వీటిలో మనం ఏది చేయాలన్నా, అసలు ప్రమాదం ఏంటో స్పష్టంగా చూడాలి. ఒకవేళ కారు అద్దం మీద మంచు గానీ, దుమ్ము గానీ పడితే మనకు ఏదీ సరిగ్గా కనిపించదు. అదేవిధంగా మనం కష్టాల్ని చక్కగా తట్టుకోవాలంటే, వాటిని యెహోవా చూసినట్టు చూడాలి. మనం ఈ ఆర్టికల్‌లో వీటి గురించి చూస్తాం: (1) మన కష్టాల్ని సరైన దృష్టితో ఎలా చూడాలి? (2) అలా చూడకపోతే వచ్చే నష్టం ఏంటి? (3) కష్టాలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన కొన్ని పనులు ఏంటి?

కారుకు ఉన్న ముందు అద్దం మురికిగా ఉన్నా ఒకతను దాన్ని నడుపుతున్నాడు. ఆ మసకలో, దారికి అడ్డుగా పెట్టిన బారికేడ్‌ కనిపించేసరికి షాక్‌ అవుతున్నాడు.

కష్టాల్ని తట్టుకోవాలంటే మనం వాటిని సరైన దృష్టితో చూడాలి (2వ పేరా చూడండి)


మన కష్టాల్ని సరైన దృష్టితో ఎలా చూడాలి?

3. చెడ్డ లోకంలో జీవితం గురించి మనం ఏ చేదు నిజాన్ని ఒప్పుకోవాలి?

3 ఈ చెడ్డ లోకంలో మనకు కష్టాలు తప్పవు. మనం అపరిపూర్ణులుగా ఉన్నంతకాలం, సాతాను ఈ లోకాన్ని పరిపాలించినంత కాలం, మనకు కష్టాలు తప్పవు. ఈ లోకాంతం దగ్గరపడేకొద్దీ, మనం ఇంకా ఎక్కువ కష్టాలు పడతాం. ఉదాహరణకు, మనం ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కొంటాం. అవి వాతావరణ మార్పుల వల్ల వచ్చినవి కావచ్చు లేదా మనుషుల ప్రమేయం వల్ల వచ్చినవి కావచ్చు. దీనికితోడు, ఈ లోకంలోని చెడ్డ ప్రజల వల్ల కూడా మనం ఇబ్బందులు పడతాం. (మత్త. 24:8; 2 తిమో. 3:13) ఒకవేళ యెహోవా ఇప్పుడే ఈ సమస్యలన్నిటినీ సరిచేసుకుంటూ పోతే, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న సాతానుకు సహాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి, ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ‘విపత్తుల్లో చిక్కుకోవడం’ తప్ప చేసేదేమీ లేదు.—ప్రసం. 9:12.

4. క్రైస్తవులకైతే ఇంకా ఏ కష్టాలు కూడా వస్తాయి?

4 క్రైస్తవులు మిగతావాళ్ల కన్నా ఓ మెట్టు ఎక్కువ కష్టాలే పడతారు. శిష్యులు తమ విశ్వాసం కారణంగా హింసలు పడతారని యేసు చాలాసార్లు చెప్పాడు. (మత్త. 24:9; యోహా. 16:2) ఇది తెలుసుకోవడం వల్ల, కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసం ‘బలహీనపడదు.’ (1 థెస్స. 3:3, 4) మనం బలమైన విశ్వాసంతో కష్టాల్ని సహించినప్పుడు, శాశ్వత జీవితానికి నడిపించే దారిలోనే మనం ఉన్నాం అనే నమ్మకం కలుగుతుంది. అంతేకాదు యెహోవాకు, సాతానుకు మధ్య జరుగుతున్న వివాదంలో మనం ఎవరి వైపు ఉన్నామో చూపిస్తాం. సాతాను దేవుని పేరు మీద బురద చల్లడంలో భాగంగా, మనుషులు స్వార్థంతోనే దేవుణ్ణి ఆరాధిస్తారని ఆరోపించాడు. దాన్ని నిరూపించడం కోసమే, అతను యెహోవా ప్రజలపై విపరీతంగా దాడులు చేస్తున్నాడు. (యోబు 1:9-11) కానీ యెహోవా మీద ప్రేమతో మనం వాటన్నిటిని సహిస్తే, దేవుని హృదయాన్ని సంతోషపెడతాం.—సామె. 27:11.

5. ప్రసంగి 7:13, 14 నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

5 యెహోవా కష్టాల్ని అనుమతిస్తాడు. యెహోవా ఎప్పుడూ చెడు చేయడు, లేదా చెడ్డవాటితో మనల్ని పరీక్షించడు. (యాకో. 1:13) అయితే, ‘కష్టం వచ్చిన రోజును దేవుడే చేశాడు’ అని సొలొమోను రాశాడు. (ప్రసంగి 7:13, 14 చదవండి.) బైబిల్లో చాలావరకు ఏదైనా ఒక పనిని దేవుడే చేశాడు అని అంటున్నప్పుడు, ఆయన దాన్ని కేవలం అనుమతిస్తున్నాడు అని అర్థం. సొలొమోను ఇచ్చిన ఈ చక్కటి సలహా, కష్టాల్ని సరైన దృష్టితో చూసేలా మనకు సహాయం చేస్తుంది. అదెలా? మొదటిగా, మనం అపరిపూర్ణులం, పైగా సాతాను లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకు ‘సంతోషంగా ఉండే రోజులు’ ఉంటాయి, ‘కష్టంగా ఉండే రోజులు’ ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. మనం సంతోషంగా ఉన్న రోజున దేవుని మంచితనాన్ని గుర్తుచేసుకుని, ఆయనకు థ్యాంక్స్‌ చెప్పి, ఆ రోజును ఒక గిఫ్ట్‌లా చూడాలి. రెండవదిగా, ఇక్కడ సొలొమోను ‘ఏ రోజు ఏం జరుగుతుందో’ అంటే మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో మనకు తెలీదని చెప్పాడు. కాబట్టి, ఊహించని సమస్యలు అటు మంచివాళ్లకు, ఇటు చెడ్డవాళ్లకు వస్తాయి.

చిత్రాలు: ఒకతను సంతోషంగా ఉండే రోజుల్ని, కష్టంగా ఉండే రోజుల్ని రెండిటినీ అనుభవిస్తున్నాడు. 1. పచ్చగా కళకళలాడుతున్న తోటలో అతను నిగనిగలాడే టమాటాల్ని సంతోషంగా కోస్తున్నాడు. 2. వేరే రోజు, ఎండిపోతున్న తోటలో పాడైన టమాటాని చూసి బాధపడుతున్నాడు.

సాతాను లోకంలో మనకు సంతోషంగా ఉండే రోజులు, కష్టంగా ఉండే రోజులు రెండూ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి (5వ పేరా చూడండి)


6. మనం కష్టాలు పడేలా యెహోవా ఎందుకు అనుమతించవచ్చు? (హెబ్రీయులు 12:7, 11)

6 కష్టాల్ని సరైన దృష్టితో చూసినప్పుడు, మన మీద కాదుగానీ తనమీద ఆధారపడడం యెహోవా నేర్పిస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటాం. యెహోవా మన కష్టాల్ని చూస్తాడు, మన బాధను పట్టించుకుంటాడు. “గాఢాంధకార లోయలో” నడిచేలా మనల్ని అనుమతించినా ఆయన మన చేయి పట్టుకుంటాడు, తన ప్రేమను గుర్తుచేస్తూ ఉంటాడు, కష్టాల్ని తట్టుకునే బలాన్ని ఇస్తాడు. (కీర్త. 23:4) అంతేకాదు, మన బలహీనతల్ని గుర్తించేలా, దేవుని సహాయంతో మన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునేలా కష్టాలు మనకు సహాయం చేస్తాయి. (హెబ్రీయులు 12:7, 11 చదవండి.) ఉదాహరణకు యోబు విషయమే తీసుకుంటే, ఆయన వినయం పెంచుకోవాల్సి వచ్చింది. యెహోవా యోబుకు కష్టాలు తీసుకురాలేదు గానీ, ఆయన వాటిని అనుమతించాడు. వాటిని ఉపయోగించి ఆయనకు విలువైన పాఠాలు నేర్పించాడు. (యోబు 42:1-6) అయితే, యెహోవా ఏ కష్టాన్ని అనుమతించినా అది శాశ్వత హాని చేయదని మనకు తెలుసు. మనం కష్టాల్ని నమ్మకంగా సహించినప్పుడు “పూర్తి విజయం” సాధిస్తాం.—రోమా. 8:35-39.

7. విశ్వాసం కారణంగా మీరు హింసలు పడుతున్నా, ఎందుకు సంతోషంగా ఉండవచ్చు?

7 హింసలు పడుతున్నప్పుడు మనం సంతోషంగా ఉండవచ్చు. విశ్వాసం కారణంగా మీరు హింసలు పడుతుంటే, మీకు దేవుని ఆమోదం పోయిందని అనుకోకండి. నిజానికి అలా హింసలు పడుతున్నారంటేనే, మీకు దేవుని ఆమోదం ఉన్నట్టు. (మత్త. 5:10-12) కష్టాల్ని సరైన దృష్టితో చూసినప్పుడు, అపొస్తలుల్లాగే మీకు కూడా, క్రైస్తవులుగా ఉన్నందుకు హింసించబడే గొప్ప అవకాశం దక్కిందనే సంతోషం, సంతృప్తి ఉంటాయి. (అపొ. 5:40-42) అంతేకాదు, మిమ్మల్ని చూసి బయటివాళ్లు కూడా సత్యం నేర్చుకుని ‘దేవుణ్ణి మహిమపర్చగలుగుతారు.’ (1 పేతు. 2:12) యోసేపు తన కష్టాలు ముగిసినప్పుడే కాదు, కష్టాలు పడుతున్నప్పుడు కూడా విజయం సాధించాడు. మీరు కూడా అలా విజయం సాధించవచ్చు!—ఆది. 39:3, 23.

8. కష్టాల్ని నమ్మకంగా సహించడానికి ఇంకో కారణం ఏంటి?

8 కష్టాలు తప్పకుండా ముగుస్తాయి. మన కష్టాలకు ఒక ముగింపు ఉందని యోబు ఉదాహరణ చూపిస్తుంది. నిజానికి, “యెహోవా యోబు జీవితంలోని తర్వాతి సంవత్సరాల్ని ముందటి సంవత్సరాల కన్నా ఎక్కువగా దీవించాడు.” (యోబు 42:12) అదేవిధంగా, మన జీవితంలోని “తర్వాతి సంవత్సరాల్ని” దీవిస్తానని యెహోవా మాటిస్తున్నాడు. అంటే కష్టాలతో మొదలైన మన జీవితం ఆనందంగా ముగుస్తుంది. కష్టాలు కొద్దికాలమే ఉంటాయి, కానీ ఆనందం మాత్రం చిరకాలం ఉంటుంది. ఇదే ఉత్తేజంతో, మనలో ప్రతీఒక్కరం అంతం వరకు సహిద్దాం!—మత్త. 24:13.

కష్టాల్ని సరైన దృష్టితో చూడకపోతే వచ్చే నష్టాలు ఏంటి?

9. కష్టాల్ని సరైన దృష్టితో చూడకపోతే వచ్చే నష్టం ఏంటి?

9 కష్టం ఎలాంటిదైనా, మనం దాన్ని సరైన దృష్టితో చూడకపోతే కొత్త కష్టాల్ని కొనితెచ్చుకుంటాం. కొన్నిసార్లు మన కష్టాలకు యెహోవా కారణం అనిపించవచ్చు. మొదట్లో యోబు కూడా తన కష్టాలకు కారణం యెహోవానే అనుకున్నాడు. ఆ తప్పుడు అభిప్రాయం వల్లే, యోబు ‘దేవుని కంటే తనను తాను నీతిమంతునిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు.’ (యోబు 32:2) మొదట్లో నయోమి కూడా, తనకు వచ్చిన కష్టాలకు యెహోవాయే కారణం అనుకుంది. (రూతు 1:13, 20, 21) ఒకవేళ యోబు గానీ, నయోమి గానీ ఆ తప్పుడు అభిప్రాయంతోనే ఉంటే యెహోవాతో ఉన్న సంబంధం పాడయ్యేది. (సామె. 19:3) కానీ యెహోవా సహాయంతో వాళ్లకు వచ్చిన కష్టాల్ని సరైన దృష్టితో చూడగలిగారు, నమ్మకంగా ఉన్నందుకు దీవెనలు పొందారు.

10. కష్టాలు వచ్చినప్పుడు మనకు ఏ సందేహం రావచ్చు?

10 మన కష్టాలకు కారణం యెహోవా కాదని తెలిసినా, కొన్నిసార్లు ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడా అనే సందేహం మనలో మొదలవ్వవచ్చు. ఆ తప్పుడు ఆలోచన మన శక్తినంతా పీల్చేస్తుంది. (సామె. 24:10) దావీదు రాజు, హబక్కూకు ప్రవక్త కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. కొన్నిసార్లు అలా కష్టాలు పడుతున్నప్పుడు, యెహోవా మా గోడు వింటున్నాడా అని సందేహపడ్డారు. (కీర్త. 10:1; హబ. 1:2) కానీ వాళ్లు ప్రార్థించడం మాత్రం ఆపలేదు. యెహోవా వాళ్ల ప్రార్థనలు విని సహాయం చేశాడు. ఆయన మీకు కూడా సహాయం చేస్తాడు.—కీర్త. 10:17.

11. కష్టాల్ని సరైన దృష్టితో చూడకపోతే ఏమౌతుంది?

11 కష్టాల్ని సరైన దృష్టితో చూడకపోతే అవి వచ్చినప్పుడు షాక్‌ అవుతాం, మనకు ఏదో జరగకూడనిది జరుగుతున్నట్టు ఆశ్చర్యపోతాం. (1 పేతు. 4:12) ఎన్నో హింసలు పడాల్సి వస్తుందని యేసు చెప్పినప్పుడు, శిష్యులు దాన్ని నమ్మలేకపోయారు. (లూకా 18:33, 34) ముందుముందు తనకు ఏం జరుగుతుందో యేసు అంత స్పష్టంగా చెప్పినా, పేతురు మాత్రం ‘అలా ఎందుకు జరుగుతుందిలే’ అనుకున్నాడు. అలాంటి ఆలోచన దేవుని ఇష్టాన్ని చేయకుండా తనను ఆపేస్తుందని యేసుకు తెలుసు కాబట్టే పేతురును సరిదిద్దాడు. (మార్కు 8:31-33) యేసు చనిపోయిన తర్వాత కూడా, శిష్యులు ఆ విషయాల్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ యేసు వాళ్లమీద ఆశ వదులుకోలేదు. ఆయన పునరుత్థానమైన తర్వాత, వాళ్లకు “లేఖనాల అర్థాన్ని విడమర్చి” చెప్పడం ద్వారా తన కష్టాల్ని సరైన దృష్టితో చూసేలా వాళ్లకు సహాయం చేశాడు. (లూకా 24:25-27, 32, 44-48) యేసు చెప్పినవాటి గురించి ధ్యానించడం వల్ల, ఆయన అనుచరులుగా వాళ్లు త్వరలో ఎదుర్కోబోయే వ్యతిరేకతకు సిద్ధంగా ఉండగలుగుతారు. మనం కూడా బైబిల్లో ఉన్న సత్యాల గురించి పరిశీలించడం వల్ల కష్టాలకు సిద్ధంగా ఉండగలుగుతాం.

12. మన పరిస్థితిని సరైన దృష్టితో చూడకపోతే ఎలా అనిపిస్తుంది?

12 మన పరిస్థితిని సరైన దృష్టితో చూడకపోతే, మన సమస్యను ఉన్నదానికంటే పెద్దదిగా ఊహించుకుంటాం. ఇదెలా జరుగుతుందో చెప్తూ, యేసు ద్రాక్షతోటలో పని చేసేవాళ్ల ఉదాహరణ చెప్పాడు. యజమాని తమకు ఏదో తక్కువ చేస్తూ, అన్యాయం చేస్తున్నాడని కొంతమంది పనివాళ్లు సణిగారు. అప్పుడు ఆ యజమాని వాళ్లలో ఒకరితో ఇలా అన్నాడు: “స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు.” (మత్త. 20:10-13) నిజంగానే, ఆయన వాళ్లకు అన్యాయం చేయలేదు. కానీ, వాళ్లే లేనిపోని ఊహలు పెట్టుకోవడం వల్ల ఆయన అన్యాయం చేస్తున్నాడని అనుకున్నారు. మన కాలంలోని కొంతమంది యెహోవాసాక్షులు కూడా ఇలాంటి ఆలోచనతో పోరాడాల్సి వచ్చింది. ఉదాహరణకు, వాళ్లకు ఫలానా సేవావకాశం రాలేదనో, ఉన్న నియామకం పోయిందనో వాళ్లు బాధపడ్డారు. మరి కష్టాల్ని సరైన దృష్టితో చూసేలా మనకు సహాయం చేసే కొన్ని పనులు ఏంటి?

కష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సిన కొన్ని పనులు ఏంటి?

13. కష్టాలు మన దాకా వచ్చినప్పుడు మనకు ఏం అనిపించవచ్చు?

13 కష్టాల గురించి బైబిలు ఏం చెప్తుందో మీకు తెలిసే ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాళ్లను ఓదార్చడానికి మీరు ఆ లేఖనాల్ని ఉపయోగించి ఉంటారు కూడా. కానీ కష్టం మీ దాకా వచ్చినప్పుడు మాత్రం, మీరు దాన్ని సరైన దృష్టితో చూడలేకపోవచ్చు. ఉదాహరణకు, యెహోవా మిమ్మల్ని శిక్షిస్తున్నాడనో, మీ ప్రార్థనల్ని వినట్లేదనో మీకు అనిపించవచ్చు. అలాంటప్పుడు, కష్టాల్ని సరైన దృష్టితో చూడడానికి మీరు ఏం చేస్తే బాగుంటుంది?

14. కష్టంలో ఉన్నప్పుడు మీరు ఏమని ప్రార్థించవచ్చు? (ఫిలిప్పీయులు 4:13)

14 సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. మీ కష్టం ఏంటో, దానివల్ల మీకు ఎలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. యెహోవా మీకు ఏవిధంగా సహాయం చేయాలని మీరు అనుకుంటున్నారో ఆయనకు చెప్పవచ్చు. కష్టాల్ని తట్టుకోవడానికి కావాల్సిన బలం కోసం, తెలివి కోసం పవిత్రశక్తిని ఇవ్వమని ఆయన్ని ప్రార్థనలో అడగండి. కానీ గుర్తుంచుకోండి, అన్నిసార్లూ మీరు ఊహించిన విధంగా యెహోవా మీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవచ్చు. (ఎఫె. 3:20) ఆయన దేవదూతల్ని లేదా బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఉపయోగించి కూడా మీకు సహాయం చేయవచ్చు. (కీర్త. 34:7) యెహోవా ఎలా సహాయం చేసినా మీరు దాన్ని తీసుకోండి. ఆయన పవిత్రశక్తిని ఎంత కావాలంటే అంత ఇస్తాడు. అప్పుడు, మీ కష్టం ఎంత పెద్దదైనా దానికి ధీటుగా నిలబడగలుగుతారు.—ఫిలిప్పీయులు 4:13 చదవండి.

15. కష్టాలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తూ ఉండాలి? (చిత్రం కూడా చూడండి.)

15 ఆధ్యాత్మిక పనుల్ని ఆపకండి. “కష్టాలు, ఇబ్బందులు” వచ్చినప్పుడు, ఇంతకుముందు చేసినంతగా ఆధ్యాత్మిక పనులు మీరు చేయలేకపోవచ్చు. కానీ, అలాంటప్పుడే మీ మనసును ఇంకెక్కువగా యెహోవా ఆలోచనలతో నింపుకోవాలి. (కీర్త. 119:143) ముందులాగే మానకుండా బైబిలు చదవండి, లోతుగా అధ్యయనం చేయండి, చదివిన వాటిగురించి ధ్యానించండి. పరిచర్యను చేయగలిగినంత ఎక్కువ చేయండి, మీటింగ్స్‌కి వెళ్లండి, కామెంట్స్‌ చెప్పండి. ఎప్పుడూ బ్రదర్స్‌సిస్టర్స్‌ చుట్టే ఉండండి. ఒకవేళ మీకు ఒంటరిగా ఉండాలని అనిపించినా, దయచేసి అలా ఉండకండి.—సామె. 18:1.

ఒక బ్రదర్‌ హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉండి, జూమ్‌లో “కావలికోట” అధ్యయనానికి హాజరౌతున్నాడు. “కావలికోట” జరుగుతుంటే ఆయన తన సొంత కాపీలో, బైబిల్లో చూస్తున్నాడు.

ఏం జరిగినా ఆధ్యాత్మిక పనుల్ని మాత్రం ఆపకండి (15వ పేరా చూడండి)


16. కష్టాలు వచ్చినప్పుడు మనకు ఏ సందేహాలు రావచ్చు? ఆ సందేహాల్ని మనమెలా తీసేసుకోవచ్చు? (2 కొరింథీయులు 10:4, 5)

16 సందేహాల్ని తీసేసుకోండి. కష్టాలు వచ్చినప్పుడు, మీ గురించి లేదా యెహోవా గురించి మీలో ‘బలమైన కోటల్లా’ పాతుకుపోయిన సందేహాల్ని తీసేసుకోవాల్సి రావచ్చు. (2 కొరింథీయులు 10:4, 5 చదవండి.) బైబిల్లో, మన ప్రచురణల్లో ఉన్న ‘దేవుని జ్ఞానాన్ని’ ఉపయోగించడం ద్వారా మీరు ఆ సందేహాల్ని తీసేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇప్పటికీ యెహోవా ఆమోదం నా మీద ఉందా అనే సందేహం మీకు వస్తే, అపొస్తలుడైన పౌలు ఉదాహరణ గురించి అధ్యయనం చేయవచ్చు. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఘోరమైన కష్టాలు అనుభవించాడు. కానీ, అవన్నీ ఆయన క్రీస్తు పరిచారకుడు అనే నమ్మకాన్ని ఆయనలో ఇంకా పెంచాయి. (2 కొరిం. 11:23-27) మీరు గతంలో చేసిన తప్పుల్ని యెహోవా నిజంగానే క్షమించాడా అనే సందేహం మీకు వస్తే, యెహోవా మన పాపాల్ని క్షమిస్తాడు అని చెప్పే లేఖనాల లిస్టు రాసుకోండి. (యెష. 43:25) తర్వాత ఆ లేఖనాల్ని చదివి, ధ్యానించండి. (కీర్త. 119:97) మీ జీవితంలో జరిగిన చేదు అనుభవం వల్ల, యెహోవా మాటిచ్చినట్టు తన నమ్మకమైన సేవకుల్ని నిజంగానే కాపాడతాడా అనే సందేహం వచ్చిందా? అయితే, దేవుడు బాధల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో, మనకు ఏం జరిగినా యెహోవా ఎలా ఆధ్యాత్మికంగా కాపాడుతూనే ఉంటాడో పరిశోధించండి. (కీర్త. 91:9-12) దాంతోపాటు, ఘోరమైన కష్టాల్ని సంతోషంగా సహించిన బ్రదర్స్‌సిస్టర్స్‌ ఉదాహరణల్ని చదవండి.a

17. కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?

17 ఇప్పుడు మీ జీవితంలో పెద్దపెద్ద కష్టాలేమీ లేకుండా, మీ రోజులు సంతోషంగా గడుస్తున్నాయా? అలాగైతే యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పి, ఈ సమయాన్ని ఉపయోగించుకుని యెహోవా మంచితనం గురించి ఆలోచించండి. (ప్రసం. 7:14) కానీ కష్టం వచ్చినప్పుడు దాన్ని సరైన దృష్టితో చూడండి, యెహోవాను బలంగా నమ్మండి. మీరు అలా చేసినప్పుడు, ఆయన “దాన్నుండి తప్పించుకునే మార్గం కలగజేస్తాడు, సహించడానికి సహాయం చేస్తాడు.” (1 కొరిం. 10:13) మరి మన బ్రదర్స్‌సిస్టర్స్‌ విషయమేంటి? వాళ్లు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, మనం వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో దాని గురించి చూస్తాం.

మీరెలా జవాబిస్తారు?

  • కష్టాల్ని సరైన దృష్టితో చూసేలా మనకు ఏది సహాయం చేస్తుంది?

  • కష్టాల్ని సరైన దృష్టితో చూడకపోతే వచ్చే నష్టం ఏంటి?

  • కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?

పాట 150 రక్షణ కోసం యెహోవా వైపు చూడండి

a ఉదాహరణకు, jw.orgలో “విషాదం అలుముకున్న కుటుంబం మళ్లీ నిలదొక్కుకుంది” అనే జీవిత కథ చదవండి. కొడుకు చనిపోయినప్పుడు బ్రదర్‌ డేవిడ్‌ మాజా, ఆయన కుటుంబం ఆ బాధను ఎలా తట్టుకుని నిలబడ్డారో అందులో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి