జూన్ 8-14, 2026
పాట 8 యెహోవా మనకు ఆశ్రయం
‘సత్యవంతుడైన దేవుడు’ తన సంకల్పాన్ని తప్పక నెరవేరుస్తాడు
“యెహోవా, సత్యవంతుడివైన దేవా, నువ్వు నన్ను విడిపించావు.”—కీర్త. 31:5.
ముఖ్యాంశం
తను మాటిచ్చినవన్నీ యెహోవా నెరవేరుస్తాడని, దేవుని రాజ్యం త్వరలోనే అబద్ధాలకు, మోసాలకు ముగింపు పలుకుతుందని ఎందుకు నమ్మవచ్చో చూస్తాం.
1. కీర్తన 31:2-5 ప్రకారం, మనం యెహోవాను ఎందుకు నమ్మవచ్చు?
మనం సాతాను గుప్పిట్లో ఉన్న లోకంలో జీవిస్తున్నాం. అందుకే ఎక్కడ చూసినా అబద్ధాలు, మోసాలు, ద్రోహం రాజ్యమేలుతున్నాయి. అసలు ఎవర్ని నమ్మాలో కూడా అర్థంకావట్లేదు. వ్యాపారం చేసేవాళ్లు ఒకర్ని మించిపోయి ఒకరు మోసాలు చేస్తున్నారు. వస్తువులు అమ్మేవాళ్లేమో, వాటిని జనాలకు ఎలాగైనా అంటగట్టాలని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్నారు. ఆఖరికి, ప్రాణ స్నేహితుల మాట కూడా నమ్మలేని పరిస్థితి ఉంది. కానీ, మనం యెహోవాను ఖచ్చితంగా నమ్మవచ్చని తెలుసుకోవడం ఎంత సంతోషంగా ఉందో కదా! ఆయన ‘సత్యవంతుడైన దేవుడు.’ (కీర్తన 31:2-5 చదవండి.) సత్యం అనేది ఆయన స్వభావంలో, అంటే ఆయన నైజంలో అల్లుకుని ఉంది. ఆయన ఏది చెప్పినా, ఏది చేసినా మనం ఆయన్ని పూర్తిగా నమ్మవచ్చు.
2. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
2 ఈ ఆర్టికల్‌లో, మనం యెహోవాను ఎందుకు పూర్తిగా నమ్మవచ్చో కొన్ని కారణాల్ని చూస్తాం. అలాగే సత్యవంతుడైన దేవుడు త్వరలో ఈ సాతాను లోకాన్ని ఎలా తీసేస్తాడో, తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ఇప్పుడే ఏం చేస్తున్నాడో చూస్తాం. వీటి గురించి మాట్లాడుకోవడం వల్ల, మనం యెహోవాకు ధైర్యవంతులైన సాక్షులుగా ఉంటాం.
సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఎందుకు నమ్మవచ్చు?
3. మనం ఎందుకు యెహోవాను పూర్తిగా నమ్మవచ్చు?
3 మనం యెహోవాను నమ్మవచ్చు, ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. ఆయన భూమిని, ఆకాశాన్ని, సమస్త జీవరాశుల్ని సృష్టించాడు. (ఆది. 1:1; కీర్త. 36:9; ప్రక. 4:11) అంతేకాదు, ఆ ప్రాణులన్నిటికీ ఆయనే ఊపిరి పోస్తున్నాడు. అవి జీవించడానికి వీలుగా, ఆయన ఈ భూమిని తయారుచేశాడు. ఇప్పుడు, ఎప్పుడూ ఈ విశ్వమంతా పూర్తిగా ఆయన అధీనంలోనే ఉంటుంది. కాబట్టి మన జీవితాన్ని, మన భవిష్యత్తును అపారమైన తెలివి-శక్తి ఉన్న మన సృష్టికర్త చేతుల్లో కళ్లు మూసుకుని పెట్టేయవచ్చు.
4. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని మనకెలా తెలుసు?
4 మనం యెహోవాను నమ్మవచ్చు, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. జీవం అనే అద్భుతమైన వరాన్ని యెహోవా మనుషులతో పంచుకోవాలని అనుకున్నాడు కాబట్టే వాళ్లను సృష్టించాడు. ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన చెప్పిన ఈ మాటల్లో తెలుస్తుంది: “మన స్వరూపంలో, మనలా మనిషిని తయారుచేద్దాం.” (ఆది. 1:26) ఆయన మనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. అంతేకాదు, కేవలం మన కోసమే ఒక అందమైన ఇంటిని తయారుచేసి ఇచ్చాడు. (కీర్త. 115:16) మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వల్ని దీవించి, ఈ భూమిని పరదైసులా మార్చే ఒక సంతోషకరమైన పనిని అప్పగించాడు. (ఆది. 1:28; 2:15) ఆయన వాళ్లకు పుష్కలంగా ఆహారాన్ని, ఎన్నో రకాల మొక్కల్ని, జంతువుల్ని, ఇంకా చాలా వాటిని వాళ్ల ముందు పెట్టాడు. ఇదంతా వాళ్లు సంతోషంగా ఉండి, జీవితాన్ని ఆనందించడం కోసమే ఇచ్చాడు. నిజంగా, “ఆయన విశ్వసనీయ ప్రేమ శాశ్వతకాలం ఉంటుంది” అనడానికి ఇవన్నీ రుజువులు.—కీర్త. 103:17.
5. (ఎ) మానవ కుటుంబాన్ని నాశనం చేయడానికి సాతాను విశ్వ ప్రయత్నాలు చేసినా, యెహోవా తన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు? (బి) దేవుడు మాటిచ్చిన కొన్ని విషయాలు ఏంటి? అవి ఎలా నెరవేరాయి? (“దేవుడు మాట మీద నిలబడ్డాడు” అనే బాక్సు చూడండి.)
5 మనం యెహోవాను నమ్మవచ్చు, ఎందుకంటే ఆయన మాట మీద నిలబడతాడు. యెహోవా “భూమిని ఊరికే చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశాడు.” (యెష. 45:18, 19) ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసి, మరణాన్ని కొనితెచ్చుకున్నారు. కాబట్టి, దేవుని సంకల్పం ఇక ఆగిపోయిందేమో అన్నట్టు అనిపించవచ్చు. కానీ యెహోవా ఏదైనా మాటిస్తే ఖచ్చితంగా చేసి తీరతాడు. (యెష. 46:10, 11) ఈ భూమిని నీతిమంతులైన స్త్రీపురుషులతో నింపాలన్న ఆయన సంకల్పం అస్సలు మారలేదు. అందుకే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టేలా యెహోవా అనుమతించాడు. అంతేకాదు ఆదాము పిల్లల్ని రక్షించడానికి, వాళ్లకు శాశ్వతకాలం జీవించే గొప్ప అవకాశం ఇవ్వడానికి తన ఒక్కగానొక్క కుమారుడిని విమోచన క్రయధనంగా అర్పించాడు.—యోహా. 3:16.
సత్యవంతుడైన దేవుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు
6. ఏదెనులో తిరుగుబాటు జరిగిన తర్వాత యెహోవా ఏమని చెప్పాడు?
6 ఆదాముహవ్వలు దేవునికి ఎదురుతిరిగేలా “మొదటి సర్పం” రెచ్చగొట్టింది. “దానికి అపవాది, సాతాను అనే పేర్లు ఉన్నాయి.”a (ప్రక. 12:9; ఆది. 3:4, 5; యోహా. 8:44) సాతాను చేసిన పనికి అతన్ని నాశనం చేస్తానని యెహోవా తీర్పును ప్రకటించాడు. (ఆది. 3:15) అయితే, ఈలోపు చాలామంది సాతాను వెనకే వెళ్లి అతనిలా తయారౌతారు. కానీ, కొంతమంది మాత్రం యెహోవాను నమ్మకంగా అంటిపెట్టుకుని ఉంటారు.
7. సాతాను వెనక ఎవరు వెళ్తారు? వాళ్లకు ఏమౌతుంది?
7 సాతాను వెనక వెళ్లేవాళ్లలో చెడ్డదూతలు, మనుషులు ఉన్నారు. వాళ్లు దేవుని సంకల్పాన్ని వ్యతిరేకిస్తారు లేదా ఎదిరిస్తారు కాబట్టి, వాళ్లు సాతాను వైపు ఉంటారు. కానీ దేవుడు అనుకున్న సమయంలో, సాతాను అలాగే అతనితో చేతులు కలిపిన వాళ్లందరూ నాశనమౌతారు.—దాని. 2:44; రోమా. 16:20.
8. యేసు 1914 లో ఏం చేశాడు? (చిత్రాలు కూడా చూడండి.)
8 సాతానును, అతనితో చేతులు కలిపినవాళ్లను నాశనం చేయాలన్న దేవుని సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని మనం ఎలా నమ్మవచ్చు? 1914లో యేసు సాతానుతో, అతని చెడ్డదూతలతో యుద్ధం చేసి వాళ్లను భూమ్మీదికి పడేశాడు. (ప్రక. 12:7-9) ఆ యుద్ధం పరలోకంలో జరిగినప్పటికీ, దాని సెగ మాత్రం భూమి వరకు తాకింది. బైబిలు ఇలా చెప్తుంది: “భూమీ, సముద్రమా, మీకు శ్రమ. ఎందుకంటే అపవాది తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి చాలా కోపంతో మీ దగ్గరికి దిగివచ్చాడు.” (ప్రక. 12:12) 1914 నుండి సాతాను భూమినే గురిగా పెట్టుకున్నాడు. అందుకే, లోక పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారయ్యాయి. అవును, నిజంగానే ‘భూమికి శ్రమ’! కానీ త్వరలోనే యేసు తన ‘విజయాన్ని పూర్తి చేసి,’ సాతానును అలాగే అతనితో చేతులు కలిపిన వాళ్లందర్నీ నాశనం చేస్తాడు. (ప్రక. 6:2) సాతాను చెడ్డవాడని, యెహోవా గురించి అబద్ధాలు వ్యాప్తి చేశాడని యేసు అందరికీ స్పష్టంగా తెలిసేలా చేస్తాడు. (కీర్త. 45:4-6) అప్పుడు, యెహోవా సత్యవంతుడైన దేవుడని ప్రతీఒక్కరు తెలుసుకుంటారు!—యెహె. 38:23.
World War I: U.S. National Archives photo; bomb: USAF photo; pandemic: blvdone/stock.adobe.com; riot: inhauscreative/E+ via Getty Images
1914 నుండి, ప్రపంచంలో పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి (8వ పేరా చూడండి)
సత్యాన్ని ప్రేమించే వాళ్లందర్నీ సత్యవంతుడైన దేవుడు సమకూరుస్తాడు
9. ఈ రోజుల్లో యెహోవా ఎవర్ని సమకూరుస్తున్నాడు?
9 ఈలోపు, యెహోవా “పరలోకంలో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని క్రీస్తులో ఐక్యం చేయడానికి” సమకూరుస్తున్నాడు. (ఎఫె. 1:10) “పరలోకంలో ఉన్నవి” అంటున్నప్పుడు, క్రీస్తుతో కలిసి పరలోకంలో పరిపాలించడానికి యెహోవా ఎంచుకునే అభిషిక్తులు వస్తారు. “భూమ్మీద ఉన్నవి” అంటున్నప్పుడు, పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించేవాళ్లు వస్తారు. ఈ రెండు గుంపులవాళ్లు కలిసి సాతాను అబద్ధాల్ని బయటపెట్టడంలో, సత్యం తెలుసుకునేలా మంచి మనసున్న వాళ్లకు సహాయం చేయడంలో చురుగ్గా పనిచేస్తారు.
10. అబద్ధ మతాలు చెప్పే అబద్ధాల నుండి ప్రజల్ని యెహోవా ఎలా విడిపిస్తున్నాడు? (ప్రకటన 14:6, 7)
10 సత్యాన్ని ప్రేమించే ఈ రెండు గుంపులవాళ్లను యెహోవా ప్రకటనా పని ద్వారా సమకూరుస్తున్నాడు. ఆ పని, చరిత్రలో ముందెప్పటికన్నా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. (ప్రకటన 14:6, 7 చదవండి.) మంచివార్త ప్రకటించడానికి యెహోవా మనుషుల్ని ఉపయోగించుకున్నా, మంచి మనసున్న ప్రజల్ని క్రైస్తవ సంఘంలోకి తీసుకురావడానికి ఆయన దేవదూతల్ని కూడా ఉపయోగిస్తున్నాడు. ఈ ప్రకటనా పని ద్వారా ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను చెప్పే అబద్ధాల్ని మనం బయటపెడుతున్నాం. సాతాను వందల సంవత్సరాలుగా ఈ సామ్రాజ్యాన్ని ఉపయోగించుకునే యెహోవా గురించి అబద్ధాలు వ్యాప్తి చేశాడు. (ప్రక. 18:2, 4) త్వరలోనే అబద్ధ మతాలన్నీ పూర్తిగా నాశనమౌతాయి. ఇక అప్పుడు, సత్యవంతుడైన దేవుణ్ణి ప్రేమించే వాళ్లందరూ ఆయనకు ఇవ్వాల్సిన మహిమను ఇస్తారు.—ప్రక. 17:16.
11. నిజమైన ఆరాధకుల్ని మనం ఎలా గుర్తుపట్టవచ్చు?
11 సత్యాన్ని ప్రేమించేవాళ్లు అన్ని వర్గాల, హోదాల, సంస్కృతుల, దేశాల నుండి వస్తారు. (ప్రక. 7:9, 10) వాళ్లు “మంచివార్త” వినగానే ఇదే సత్యం అని గుర్తుపట్టి, సంతోషంగా యెహోవా ప్రజల్లో చేరిపోతారు. (మార్కు 13:10) సమయం గడిచేకొద్దీ, దేవునికి నచ్చే విధంగా ఆరాధించేవాళ్లు ఎవరో, ఆరాధించనివాళ్లు ఎవరో అంతకంతకూ స్పష్టమౌతుంది. మలాకీ ప్రవక్త ముందుగానే ఇలా చెప్పాడు: “అప్పుడు మీరు నీతిమంతునికి, దుష్టునికి; దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తికి, సేవించని వ్యక్తికి మధ్య తేడాను మళ్లీ చూస్తారు.” (మలా. 3:18) యెహోవా సేవకులు తమ ప్రవర్తన ద్వారా, ప్రకటనా పని ద్వారా సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చూపిస్తారు.
12. యెహోవా సంకల్పాన్ని నెరవేర్చడంలో ప్రకటనా పని ఎలా సహాయం చేస్తుంది?
12 మనం ‘రాజ్య సువార్తను ప్రకటించడం’ ద్వారా ఒక పక్క యేసు ఆజ్ఞకు లోబడుతూనే, ఇంకో పక్క ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాం. (మత్త. 24:14; 28:18-20) పైగా ఈ ప్రకటనా పని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు క్రీస్తుకు శిష్యులు అవుతున్నారు, శాశ్వతకాలం పాటు సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధించే అవకాశాన్ని పొందుతున్నారు. యెహోవా సంకల్పాన్ని నెరవేర్చడంలో మనకు వంతు ఉండడం ఎంత గొప్ప గౌరవమో కదా!
కొండంత నమ్మకంతో భవిష్యత్తు వైపు చూడండి
13. ప్రత్యేకించి సాతాను ఎవర్ని గురిగా చేసుకున్నాడు? ఎందుకు?
13 అపవాది అయిన సాతాను చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే, తన ప్రపంచం నాశనం అవ్వడానికి ఇంకా “కొంచెం సమయమే ఉందని” అతనికి తెలుసు. (ప్రక. 12:12, 13) అతను ప్రత్యేకించి అభిషిక్తుల్ని గురిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే, వాళ్లు ‘దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ యేసు గురించి సాక్ష్యమివ్వడానికి నియమించబడ్డారు.’ (ప్రక. 12:17; 14:12) అంతేకాదు, అభిషిక్తులు చేస్తున్న పనికి మద్దతిస్తున్న వాళ్లను కూడా సాతాను గురిగా పెట్టుకున్నాడు.
14. సాతాను యెహోవా ప్రజల మీద దాడి చేసినప్పుడు ఏం జరుగుతుంది? (చిత్రం కూడా చూడండి.)
14 మహాబబులోను నాశనమైన తర్వాత, సాతాను అనుచరులు యెహోవా ప్రజలందరి మీద ఒక్కసారిగా విరుచుకుపడతారు. అది హార్‌మెగిద్దోన్ యుద్ధానికి దారి తీస్తుంది. (ప్రక. 16:13, 14, 16) యేసు, అలాగే పరలోక సైన్యాలు యెహోవా ఆరాధకుల్ని రక్షిస్తారు. అంతేకాదు, సాతాను లోకంలోని మిగతా సంస్థల్ని కూడా పూర్తిగా నాశనం చేస్తారు. (ప్రక. 19:19-21) అప్పుడు అబద్ధాలకోరులు, చెడ్డవాళ్లు, మోసగాళ్లు ఎవ్వరూ ఇక ఉండరు. (ప్రక. 21:8) సత్యానికి, నీతికి యెహోవా మారుపేరు అని ప్రతీఒక్కరు తెలుసుకుంటారు.
హార్‌మెగిద్దోన్ యుద్ధంలో దేవుని శత్రువుల్ని నాశనం చేయడానికి యేసు, ఆయన పరలోక సైన్యం స్వారీ చేసుకుంటూ వస్తున్నారు (14వ పేరా చూడండి)
15. మనం ఎందుకు భవిష్యత్తు వైపు నమ్మకంతో చూడవచ్చు? (యెషయా 65:16, 17) (చిత్రం కూడా చూడండి.)
15 ఈ లోకం ముందెప్పటికన్నా ఇప్పుడు ముక్కలుముక్కలు అవుతోంది. కానీ యెహోవా సహాయంతో, ఆయన సేవకులు మాత్రం ఐక్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. ప్రజల్ని సమకూర్చే పని శరవేగంగా దూసుకెళ్తుంది. తన ప్రజల్ని, వాళ్లు చేస్తున్న పనిని దీవించకుండా యెహోవాను ఏదీ ఆపలేదు. (యెషయా 65:16, 17 చదవండి.) మనం కొండంత నమ్మకంతో భవిష్యత్తు వైపు చూడవచ్చు. రోమీయులు 8:38, 39 లో అపొస్తలుడైన పౌలు ఇలా భరోసా ఇచ్చాడు: “మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన ఇంకేదైనా మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేవని నాకు నమ్మకం కుదిరింది.”
ఈరోజు ఉన్న సమస్యలు కొత్తలోకంలో గుర్తురావు (15వ పేరా చూడండి)
16. మనం ఎందుకు యెహోవాను మనస్ఫూర్తిగా నమ్మవచ్చు?
16 సత్యవంతుడైన యెహోవాను నమ్మడానికి మనకు చాలా కారణాలు ఉన్నాయి. ఆయన మన సృష్టికర్త. ఆయన మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తనను ఆరాధించేలా, ప్రపంచ నలుమూలల నుండి చాలా అంటే చాలామందిని ఆయన సమకూరుస్తున్నాడు. (యెష. 60:22; జెక. 8:23) ఆయన తన సంకల్పాన్ని నెరవేరుస్తాడని మనకు తెలుసు. అలాగే మోసాలతో, అబద్ధాలతో సాతాను అల్లుకున్న గూడును ఆయన త్వరలోనే చెదరగొడతాడు. దావీదులాగే మనం ఇలా ప్రార్థిస్తాం: “యెహోవా స్తుతించబడాలి, ఆయన మాత్రమే అద్భుత కార్యాలు చేస్తాడు. మహిమగల ఆయన పేరు ఎప్పటికీ స్తుతించబడాలి, భూమంతా ఆయన మహిమతో నిండిపోవాలి.”—కీర్త. 72:18, 19.
పాట 2 యెహోవా నీ పేరు
a ఈ చెడ్డదూత పేరేంటో బైబిలు చెప్పట్లేదు. కానీ “అపవాది” [నిందలు వేసేవాడు] అలాగే “సాతాను” [వ్యతిరేకించేవాడు] లాంటి పదాలతో బైబిలు అతన్ని పిలుస్తుంది.