కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 ఏప్రిల్‌ పేజీలు 2-7
  • యెహోవా నాకు చిన్నప్పటి నుండి శిక్షణ ఇచ్చాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా నాకు చిన్నప్పటి నుండి శిక్షణ ఇచ్చాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • శిక్షణ కొనసాగింది
  • పయినీరు సేవలో ఆనందాలు
  • సెనెగల్‌కు వెళ్లడం
  • న్యూ బ్రున్‌స్విక్‌లో, క్విబెక్‌లో పయినీరు సేవ
  • కష్టపడి పనిచేసిన వాళ్లను గుర్తుచేసుకోవడం
  • నమ్మకమైన బ్రదర్స్‌ నుండి నేర్చుకున్న పాఠాలు
  • అమెరికా బెతెల్‌లో సేవచేయడం
  • మంచి ఆదర్శాల నుండి నేర్చుకోవడం ఎన్నో దీవెనల్ని తీసుకొచ్చింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ఇతరుల మీద శ్రద్ధ చూపిస్తే చిరకాలం ఉండే దీవెనలు వస్తాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • సరైన ఎంపికలు చిరకాల ఆశీర్వాదాలను తెచ్చాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 ఏప్రిల్‌ పేజీలు 2-7
తన డెస్క్‌ దగ్గర పని చేసుకుంటున్న బ్రదర్‌ డేవిడ్‌ స్ప్లేన్‌.

జీవిత కథ

యెహోవా నాకు చిన్నప్పటి నుండి శిక్షణ ఇచ్చాడు

డేవిడ్‌ స్ప్లేన్‌ చెప్పినది

ఒక బ్రదర్‌ వచ్చి చిన్న పేపర్‌ నా చేతిలో పెట్టాడు. దానిమీద “డేవిడ్‌ స్ప్లేన్‌, ఏప్రిల్‌ 8, 1953: ‘లోకాంతం గురించి ప్రకటించడం’” అని రాసివుంది. “ఏంటిది?” అని అడిగాను. ఆ బ్రదర్‌, “ఇది దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోa నువ్వు ఇవ్వాల్సిన ప్రసంగం నియామకం” అన్నాడు. “నాకు మీటింగ్స్‌లో ప్రసంగం ఇవ్వాలనుంది అని నేను చెప్పలేదే!” అన్నాను.

తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముందు, నా కథ మొదటి నుండి చెప్తాను. నేను రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కెనడాలోని కాల్గరీలో పుట్టాను. 1940ల చివర్లో డోనల్డ్‌ ఫ్రేజర్‌ అనే యువ పయినీరు మా ఇంటి తలుపు తట్టినప్పుడు, అమ్మ బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. బైబిలు సత్యాలు నేర్చుకోవడం ఆమెకు బాగా నచ్చింది. కానీ తీవ్రమైన అనారోగ్య సమస్యల వల్ల తరచూ మీటింగ్స్‌కి వెళ్లలేకపోయేది. అయినాసరే, ప్రగతి సాధించి 1950లో బాప్తిస్మం తీసుకుంది. కానీ విచారకరంగా, రెండేళ్లు కూడా గడవకుండానే ఆమె చనిపోయింది. అప్పటికి నాన్న సత్యం తెలుసుకోలేదు, కానీ యెహోవాసాక్షులు అంత్యక్రియల ప్రసంగం ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత, ఆలిస్‌ అనే పెద్ద వయసు అభిషిక్త సహోదరి నన్ను మీటింగ్‌కి రమ్మని ఆహ్వానించింది. అమ్మకు ఒంట్లో బాగున్నప్పుడు ఆమెతో పాటు మీటింగ్స్‌కి వెళ్లేవాడిని కాబట్టి ఆ సిస్టర్‌కి నేను తెలుసు. నేను మీటింగ్‌కి వెళ్లనా అని నాన్నను అడిగాను. ఆయన ఒప్పుకున్నాడు. అంతేకాదు, అమ్మ అంత్యక్రియల ప్రసంగం ఇచ్చిన బ్రదర్‌కి థాంక్స్‌ చెప్పడానికి “ఈ ఒక్కసారికి” తను కూడా నాతో వస్తానని అన్నాడు. ఆ రోజు రాత్రి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూటం అనే కూటాలు జరిగాయి. మా నాన్న మొదటిసారి హాజరవడానికి అదే బెస్ట్‌ మీటింగ్‌ అని చెప్పాలి. ఆయన వేదిక మీద ప్రసంగాలు ఇవ్వడంలో కోర్సు తీసుకున్నాడు, కాబట్టి మీటింగ్‌లో ఇచ్చిన ప్రసంగాలు చూసి ఆశ్చర్యపోయాడు. ప్రతీవారం ఆ మీటింగ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మెల్లమెల్లగా వారంలో జరిగే మిగతా మీటింగ్స్‌కి కూడా వెళ్లడం మొదలుపెట్టాడు.

ఆ రోజుల్లో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల సేవకుడు మీటింగ్‌ మొదలుపెట్టేటప్పుడు అందులో చేరినవాళ్ల పేర్లు పిలిచేవాడు, వాళ్లలో ప్రతీ ఒక్కరు “వచ్చాను” అని చెప్పేవాళ్లు. ఒకరోజు, ఈసారి మీటింగ్‌లో నా పేరు కూడా పిలవండి అని అడిగాను. ఆ బ్రదర్‌ నన్ను ఆప్యాయంగా మెచ్చుకున్నాడు, కానీ అలా పిలవడం అంటే అర్థమేంటో తెలుసా అని నన్ను అడగలేదు.

మీటింగ్‌లో నా పేరు పిలవమని అడగడం అంటే, అందులో నాకు ప్రసంగాలు ఇవ్వమని అడగడం అని నాకు అస్సలు తెలీదు! తర్వాతి వారం నా పేరు కూడా పిలిచారు. నేను గర్వంగా, “వచ్చాను” అని చెప్పాను. మీటింగ్‌ అయ్యాక బ్రదర్స్‌సిస్టర్స్‌ నన్ను మెచ్చుకున్నారు. కొన్ని వారాల తర్వాత, నేను ఈ ఆర్టికల్‌ మొదట్లో చెప్పిన ప్రసంగ నియామకం నా చేతిలో పెట్టారు.

నేను చాలా కంగారుపడ్డాను! ఆ రోజుల్లో విద్యార్థి ప్రసంగాలు ఆరు నుండి ఎనిమిది నిమిషాలపాటు ఉండేవి. బైబిలు చదివే నియామకం ఉండేది కాదు. నా ప్రసంగం సిద్ధపడడానికి నాన్న సహాయం చేశాడు, ఓ 20 సార్లు ప్రాక్టీస్‌ చేయించాడు. ప్రసంగం తర్వాత, పర్యవేక్షకుడు నాకు విలువైన సలహా ఇచ్చాడు. తర్వాతి సంవత్సరాల్లో యెహోవా మా నాన్న ద్వారా, సమర్థులైన బ్రదర్స్‌సిస్టర్స్‌ ద్వారా, తన సంస్థ ద్వారా నాకు శిక్షణ ఇచ్చాడు.

శిక్షణ కొనసాగింది

నేను ప్రీచింగ్‌ మొదలుపెట్టినప్పుడు, మొదట్లో చెప్పిన ఆలిస్‌ సిస్టర్‌ నాకు సహాయం చేసింది. అప్పట్లో ప్రీచింగ్‌ చేసేటప్పుడు, ఇంటివాళ్లకు మూడు లేఖనాలు చదివి వినిపించి, తర్వాత ఒక పుస్తకం ఇచ్చేవాళ్లు. నా వంతు వచ్చినప్పుడు ఆలిస్‌ సిస్టర్‌ తనను పరిచయం చేసుకొని, సంభాషణ మొదలుపెట్టి, నన్ను మొదటి లేఖనం చదవమని అడిగేది. అక్కడినుండి నేను మాట్లాడడం మొదలుపెట్టి, మిగతా రెండు లేఖనాలు చదివి, ప్రచురణ ఇచ్చేవాణ్ణి. ఆ తర్వాత నేనే మొదటినుండి మాట్లాడడం నేర్చుకున్నాను. 1954 చివర్లో మా నాన్న బాప్తిస్మం తీసుకున్నాక, ఆయన కూడా ప్రీచింగ్‌లో నాకు శిక్షణ ఇచ్చాడు. ఒంటరి తండ్రిగా, నన్ను సత్యంలో పెంచడానికి ఆయన చేయగలిగినదంతా చేశాడు. మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు. కాబట్టి మేము అన్ని మీటింగ్స్‌కి, వారాంతాల్లో జరిగే ప్రీచింగ్‌కి తప్పకుండా వెళ్తామని నాకు తెలుసు.

స్కూల్లో నా చదువు అంతంతమాత్రమే. కానీ 12 ఏళ్ల చదువులో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు జీవితాంతం ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు లెక్కలు చేయడం, ఇంగ్లీష్‌ వ్యాకరణం లాంటివి. అలాగే నేను ఇంగ్లీష్‌ కోర్సులు, కథలు రాయడంలో క్లాస్‌లు కూడా తీసుకున్నాను. అవి రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పుడు నేను చేస్తున్న పనికి సహాయం చేస్తున్నాయి.

ప్రజలు తరచూ, నాకు సంగీతం అంటే ఎందుకు ఇష్టమని అడుగుతుంటారు. మా అమ్మానాన్నలు ఇద్దరికీ సంగీతం అంటే ప్రాణం. ఏడేళ్ల వయసులో కొంతకాలం పియానో నేర్చుకున్నాను; కానీ అది నేర్చుకోవడం నా వల్ల కాదని మా టీచర్‌కి అనిపించింది. కాబట్టి మా నాన్నతో, మాన్పించడం మంచిదని చెప్పింది. ఆమె అలా ఎందుకు చెప్పిందో నేను అర్థంచేసుకోగలను. నిజంగానే ఆ సమయంలో నేను అంతగా ఆసక్తి చూపించలేదు.

కొన్ని నెలల తర్వాత, మా నాన్న ఇంకో టీచర్‌ని వెతికాడు. ఈసారి నేను పియానోతో పాటు పాడడం కూడా నేర్చుకున్నాను, అందులో రాణించాను. చిన్నప్పుడు నా గొంతు మధురంగా ఉండేది, కొన్ని పోటీల్లో గెలిచాను కూడా. సంగీతంలో ఒక డిగ్రీ పొంది, ఇతరులకు సంగీతం నేర్పించి, వచ్చే డబ్బుతో పూర్తికాల సేవ చేయాలనేది నా లక్ష్యం. కానీ డిగ్రీ పొందే సమయం దగ్గర పడుతున్నప్పుడు, సంగీతం గురించి చదవడానికి, పరీక్షల కోసం సిద్ధపడడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుందని అర్థమైంది. కాబట్టి చదువు ఆపేసి, క్రమ పయినీరు సేవ కోసం అప్లై చేశాను. అది 1963వ సంవత్సరం.

పయినీరు సేవలో ఆనందాలు

ఒక సంవత్సరం క్రమ పయినీరు సేవ చేశాక, ఒంటారియోలోని కాపుస్కేసింగ్‌లో నన్ను ప్రత్యేక పయినీరుగా నియమించారు. నా పయినీరు పార్ట్‌నర్‌, డానియెల్‌ స్కిన్నర్‌ అనే పెద్ద వయసు బ్రదర్‌. సంఘం ఎలా పని చేస్తుందనే దాని గురించి ఆయన నాకు చాలా విషయాలు నేర్పించాడు. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు, సంఘ సేవా కమిటీలో పనిచేసే బాధ్యత వచ్చింది, కాబట్టి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యౌవన సహోదరులకు శిక్షణ ఇవ్వడం ప్రాముఖ్యం అని ఇప్పుడు సంస్థ మళ్లీ నొక్కిచెప్పడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లు బాగా కృషిచేస్తే, చిన్న వయసులో కూడా యెహోవాకు చక్కగా ఉపయోగపడతారు!

కాపుస్కేసింగ్‌లో జీవించడం కొన్నిసార్లు కష్టంగా ఉండేది. చలికాలంలో అప్పుడప్పుడు ఉష్ణోగ్రత బాగా పడిపోయేది. డానియెల్‌, నేను ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కువగా నడిచే వెళ్లేవాళ్లం. ఇన్ని సవాళ్లున్నా, ఆ నియామకంలో చాలా సంతోషాల్ని సొంతం చేసుకున్నాను. వాటిలో ఒకటి, లిండా కోల్‌ అనే సిస్టర్‌ని కలవడం. ఆమే ఆ తర్వాత లిండా స్ప్లేన్‌ అయింది.

లిండాకు పరిచర్య అంటే చాలా ఇష్టం, తనకు ఎన్నో మంచిమంచి రిటన్‌ విజిట్‌లు ఉండేవి. ఆమె పెద్దమనసుతో ఇచ్చేది, చాలా దయగా, కలుపుగోలుగా ఉండేది. వాళ్లమ్మ పేరు గోల్డీ, ఆమె నమ్మకమైన సిస్టర్‌. వాళ్ల నాన్న పేరు అలెన్‌, అతను మొదట్లో సత్యాన్ని వ్యతిరేకించాడు. అతను వ్యతిరేకిస్తున్నా కూడా వాళ్లమ్మ లిండాను, ఆమె తమ్ముళ్లు జాన్‌-గోర్డన్‌లను రాజ్యమందిరానికి తీసుకొచ్చేది. అంతేకాదు ఎలా పరిచర్య చేయాలో నేర్పించేది. అందరూ ఒకేసారి కాకపోయినా, ఏదోక సమయంలో వాళ్లు నలుగురూ పయినీరు సేవ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత, వాళ్ల నాన్న కూడా యెహోవాసాక్షి అయ్యి సంఘంలో కష్టపడి పనిచేశాడు.

1965లో అదనపు శిక్షణ తీసుకోవడానికి నన్ను కెనడా బెతెల్‌లో నెలరోజుల పాటు జరిగిన రాజ్య పరిచర్య పాఠశాలకు ఆహ్వానించారు. అక్కడ ఉన్నప్పుడు, గిలియడ్‌ పాఠశాల కోసం అప్లికేషన్‌ నింపమని నాకు చెప్పారు. నేను మిషనరీ సేవ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ అప్లికేషన్‌ నింపాను. 42వ తరగతికి నన్ను ఆహ్వానించారు. గిలియడ్‌ ఉపదేశకులు మాకు తరచూ ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇచ్చేవాళ్లు. మొదటి రిపోర్టులో, ఈ పాఠశాలలో ఉన్నప్పుడు సంస్థ గురించి నేర్చుకోగలిగే ప్రతీది నేర్చుకోమని నన్ను ప్రోత్సహించారు. అప్పుడు నా వయసు 21 ఏళ్లు, కాబట్టి అది నాకొక మంచి సలహా.

గిలియడ్‌లోని ఒక కోర్సులో మీడియాతో, అంటే రేడియో స్టేషన్‌లు, టీవీ స్టేషన్‌లు, వార్తాపత్రికల వాళ్లతో ఎలా వ్యవహరించాలో నేర్పించారు. ఆ కోర్సు నాకు బాగా నచ్చింది. అది ముందుముందు నాకు ఎంత ఉపయోగపడుతుందో అప్పుడు నాకు తెలీదు. దాని గురించి కాసేపట్లో వివరిస్తాను.

సెనెగల్‌కు వెళ్లడం

గ్రాడ్యుయేషన్‌ పూర్తైన కొన్ని రోజులకు, నేనూ నా మిషనరీ పార్ట్‌నర్‌ మైకల్‌ హోలె మా విదేశీ నియామకం కోసం ఆఫ్రికాలోని సెనెగల్‌కు బయల్దేరాం. అప్పట్లో ఆ దేశంలో దాదాపు 100 మంది ప్రచారకులు ఉండేవాళ్లు.

అక్కడ చాలా నెలలు సేవచేశాక, వారానికి ఒకరోజు బ్రాంచి కార్యాలయంలో సేవ చేయమని నన్ను ఆహ్వానించారు. “బ్రాంచి కార్యాలయం” అంటే అదేదో పెద్ద భవనం అనుకోకండి, అది మిషనరీ హోమ్‌లో ఒక గది మాత్రమే. అంత సింపుల్‌గా ఉన్నాసరే, అది ఆ దేశంలో యెహోవా సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందని బ్రాంచి సర్వెంట్‌ ఎమ్మానువెల్‌ పటెరాకిస్‌ నాకు గుర్తుచేశాడు. ఒక సందర్భంలో బ్రదర్‌ పటెరాకిస్‌, మిషనరీలు అందరికీ ప్రోత్సహించే ఒక ఉత్తరం రాయాలని నాతో అన్నాడు. ఆ రోజుల్లో కాపీలు తీయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, ఒక్కో ఉత్తరాన్ని విడిగా టైప్‌ చేయాల్సి వచ్చేది. తప్పులు వస్తే చెరిపేయడం కుదరదు కాబట్టి అది చాలా కష్టమైన పని.

ఆ రోజు సాయంత్రం నేను మా మిషనరీ హోమ్‌కి తిరిగి వెళ్లేటప్పుడు, బ్రదర్‌ పటెరాకిస్‌ నాకు ఒక కవర్‌ ఇచ్చి, “డేవిడ్‌, సంస్థ నీకు ఉత్తరం పంపింది” అన్నాడు. తర్వాత నేను దాన్ని తెరిచి చూశాను, అది నేను టైప్‌ చేసిన ఉత్తరాల్లో ఒకటి! ఆ సంఘటన, స్థానిక బ్రాంచి ఎంత పెద్దది లేదా చిన్నది అని చూడకుండా దాన్ని గౌరవించాలని నాకు నేర్పించింది.

బ్రదర్‌ స్ప్లేన్‌ అలాగే కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్‌ నవ్వుతూ ఫోటో దిగుతున్నారు.

1967లో సెనెగల్‌లో తోటి మిషనరీలతో పాటు

సంఘంలోని చాలామంది ప్రచారకులు నాకు స్నేహితులు అయ్యారు, శనివారం సాయంత్రాలు ఎక్కువగా వాళ్లతోనే సమయం గడిపేవాణ్ణి. అవి మరపురాని రోజులు! ఇప్పటికీ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. సెనెగల్‌లో అధికారిక భాష ఫ్రెంచ్‌ కాబట్టి ఆ భాష నేర్చుకున్నాను. ప్రపంచ నలుమూలలా ఉన్న బ్రాంచీలను సందర్శిస్తున్నప్పుడు అది నాకు ఉపయోగపడింది.

1968లో నాకు, లిండాకు నిశ్చితార్థం అయింది. తర్వాత చాలా నెలలపాటు నేను పార్ట్‌టైమ్‌ ఉద్యోగం వేటలో పడ్డాను. అది దొరికితే, మేమిద్దరం కలిసి సెనగల్‌లో పయినీరు సేవ చేయగలుగుతాం. కానీ అక్కడి యజమానులు స్థానిక ప్రజల్నే పనిలో పెట్టుకునేవాళ్లు, విదేశీయుల్ని పెట్టుకునేవాళ్లు కాదు. చివరికి నేను కెనడాకి తిరిగివచ్చాక లిండాను పెళ్లి చేసుకున్నాను. మమ్మల్ని న్యూ బ్రున్‌స్విక్‌లో ఉన్న ఎడ్మండ్‌స్టన్‌లో ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. ఎడ్మండ్‌స్టన్‌ అనేది క్విబెక్‌ ప్రాంత సరిహద్దు దగ్గరున్న చిన్న నగరం.

చుట్టూరా పూలతో అలంకరించిన దారిలో డేవిడ్‌ స్ప్లేన్‌ అలాగే లిండా నవ్వుతూ నిలబడ్డారు.

1969లో మా పెళ్లిరోజున

న్యూ బ్రున్‌స్విక్‌లో, క్విబెక్‌లో పయినీరు సేవ

ఎడ్మండ్‌స్టన్‌లో ఒక్క స్థానిక ప్రచారకుడు కూడా లేడు. మాకు కొన్ని బైబిలు స్టడీలు ఉండేవి అంతే. క్యాథలిక్‌ మత ప్రభావం ప్రజల జీవితాల మీద చాలా ఎక్కువగా ఉండేది. దాదాపు ప్రతీ ఇంటిపైన యెహోవాసాక్షులు రాకూడదు అనే గుర్తు ఉండేది. అప్పట్లో మేము ఇలాంటి గుర్తుల్ని పట్టించుకునేవాళ్లం కాదు కాబట్టి, ఆ గుర్తు ఉన్నా లేకున్నా ప్రతీ ఇంటికి వెళ్లేవాళ్లం. ప్రతీవారం ఒక క్యాథలిక్‌ సంస్థ స్థానిక వార్తాపత్రికలో, “పదండి, యెహోవాసాక్షుల్ని వెతికి, వేటాడదాం” అనే నోటీసు వేసేది. ఆ సమయంలో ఎడ్మండ్‌స్టన్‌లో నలుగురు యెహోవాసాక్షులే ఉన్నారు: విక్టర్‌ నోర్బర్గ్‌, వెల్డా నోర్బర్గ్‌ (మాలాగే అక్కడ సేవ చేయడానికి నియమించబడిన జంట), ఇంకా లిండా, నేను. కాబట్టి ఆ నోటీసు మా గురించే అని మాకు బాగా తెలుసు!

ప్రాంతీయ పర్యవేక్షకుడి మొదటి సందర్శనాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన ఒక వారం మాతో ఉన్నాక ఇలా అన్నాడు: “మీరు ఇక్కడ చేయగలిగే ఒకేఒక్క పని, ఇక్కడివాళ్లకు యెహోవాసాక్షుల గురించి ఉన్న అభిప్రాయం మార్చడానికి ప్రయత్నించడమే.” అప్పటినుండి మేము అదే చేశాం, దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి! మెల్లమెల్లగా ప్రజలు వినయస్థులైన యెహోవాసాక్షులకు, గర్విష్ఠులైన క్యాథలిక్‌ చర్చి నాయకులకు మధ్య తేడా చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ నగరంలో ఒక చిన్న సంఘం ఉంది.

ఆ మారుమూల ప్రాంతంలో దాదాపు ఒక సంవత్సరం సేవ చేశాక, క్విబెక్‌ నగరంలోని ఒక పెద్ద సంఘానికి మద్దతు ఇవ్వమని మమ్మల్ని పంపించారు. చక్కని ఆతిథ్య స్ఫూర్తి ఉన్న అక్కడి బ్రదర్స్‌సిస్టర్స్‌తో మేము సంతోషంగా ఆరు నెలలు గడిపాక, మమ్మల్ని ప్రయాణ సేవ చేయమని ఆహ్వానించారు.

తర్వాతి 14 ఏళ్లు మేము క్విబెక్‌ ప్రాంతంలోని సర్క్యూట్‌లలో సేవచేశాం. ఆ రోజులు చాలా ఆసక్తికరంగా గడిచిపోయాయి! క్విబెక్‌లో ప్రకటనా పని వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చాయి. మేము సందర్శించిన సంఘాల్లో, ఇంట్లో వాళ్లందరూ ఒకేసారి బైబిలు స్టడీ తీసుకోవడం తరచూ కనిపించేది!

కష్టపడి పనిచేసిన వాళ్లను గుర్తుచేసుకోవడం

క్విబెక్‌లోని బ్రదర్స్‌సిస్టర్స్‌ని వెంటనే ఇష్టపడతాం. వాళ్లు ఫ్రెంచ్‌ భాష మాట్లాడతారు. వాళ్లు ముక్కుసూటిగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. కానీ సత్యాన్ని అంగీకరించడం వాళ్లకు అన్నిసార్లూ తేలికేం కాలేదు. కుటుంబం నుండి చాలా వ్యతిరేకత వస్తుంది. కొంతమంది పిల్లలతో సత్యంలోలేని వాళ్ల అమ్మానాన్నలు, “యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మానేయి లేదా ఇంట్లో నుండి వెళ్లిపో!” అన్నారు. అంత వ్యతిరేకత ఉన్నాసరే వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉన్నారు. వాళ్లను చూసి యెహోవా ఖచ్చితంగా చాలా గర్వపడతాడు!

అప్పట్లో క్విబెక్‌లో సేవచేసిన నమ్మకమైన క్రమ పయినీర్లు, ప్రత్యేక పయినీర్ల గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. వాళ్లలో ఎక్కువమంది, కెనడాలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చినవాళ్లు. ఆ పయినీర్లు, ఫ్రెంచ్‌ భాష నేర్చుకోవడంతో పాటు అక్కడి ప్రజల సంస్కృతి, ఆలోచనా తీరు గురించి కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. అక్కడ క్యాథలిక్‌ మత ప్రభావం ఎక్కువ.

అప్పట్లో, ప్రత్యేక పయినీర్లను ప్రచారకులు లేని మారుమూల ప్రాంతాలకు తరచూ నియమించేవాళ్లు. స్థానిక ప్రజలు సాక్షుల్ని ఇష్టపడేవాళ్లు కాదు కాబట్టి, వాళ్లకు ఉండడానికి చోటు దొరకడం కష్టంగా ఉండేది. ఇక పార్ట్‌టైమ్‌ పని దొరకడమంటే మరీ కష్టం. అద్దె ఎక్కువగా ఉండడం వల్ల కొత్తగా పెళ్లయిన దంపతులు కూడా నలుగురు, ఆరుగురు, లేదా ఎనిమిదిమంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. విడిగా ఉండడానికి వాళ్ల దగ్గర డబ్బులు సరిపోయేవి కాదు. ఉత్సాహవంతులైన ఈ పయినీర్లు చాలా కష్టపడి పనిచేసేవాళ్లు. ఒక స్టడీ మొదలుపెడితే, దానిమీద పూర్తిగా దృష్టి పెట్టేవాళ్లు. ఇప్పుడు క్విబెక్‌లో చాలామంది ప్రచారకులు ఉన్నారు కాబట్టి, ఆ పయినీర్లలో చాలామంది అవసరం ఎక్కువున్న వేరే ప్రాంతాలకు వెళ్లారు.

ప్రాంతీయ పనిలో సంఘాలను సందర్శిస్తున్నప్పుడు, శనివారం ఉదయాలు మేము ఎక్కువగా టీనేజర్లతో కలిసి పనిచేసేవాళ్లం. దానివల్ల, వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకునేవాళ్లం. మేము కలిసి పనిచేసిన కొంతమంది టీనేజర్లు ఇప్పుడు వేరే దేశాల్లో మిషనరీలుగా ఉన్నారు లేదా బాధ్యతాయుత స్థానాల్లో సేవచేస్తున్నారు.

ఆ రోజుల్లో, కొన్ని సంఘాలు మా ప్రయాణ ఖర్చులు పెట్టుకోలేకపోయేవి, దానివల్ల ఒక్కోసారి నెల గడవకముందే మా దగ్గర డబ్బులు అయిపోయేవి. అలాంటి సందర్భాల్లో యెహోవా మీద పూర్తిగా ఆధారపడాల్సి వచ్చేది, ఎందుకంటే మా పరిస్థితి ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఎప్పుడూ మా చెయ్యి విడిచిపెట్టలేదు. ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి ప్రయణించలేని పరిస్థితి మాకు ఎప్పుడూ రాలేదు.

నమ్మకమైన బ్రదర్స్‌ నుండి నేర్చుకున్న పాఠాలు

గిలియడ్‌లో ఇచ్చిన పబ్లిక్‌ రిలేషన్స్‌ కోర్సు నుండి ఎంత ప్రయోజనం పొందానో ముందే చెప్పాను కదా. నేను క్విబెక్‌లో ఉన్నప్పుడు రేడియోలో, టీవీలో, వార్తాపత్రికల్లో సాక్ష్యం ఇవ్వడానికి చాలా అవకాశాలు దొరికాయి. నన్ను తరచూ లేయోన్స్‌ క్రేప్యోల్ట్‌ అనే తోటి ప్రయాణ పర్యవేక్షకుడితో కలిసి పనిచేయమని చెప్పేవాళ్లు. ఆయనకు మీడియాతో పనిచేయడంలో చాలా అనుభవం ఉంది. వార్తా పరిశ్రమకు చెందిన ముఖ్యమైన వాళ్లతో మాట్లాడేటప్పుడు ఆయన ప్రొఫెషనల్‌లా మాట్లాడే బదులు ఇలా అనేవాడు: “సర్‌, నేనూ ఇతనూ కేవలం పరిచారకులం. మాకు టీవీలో, రేడియోలో మాట్లాడడం గురించి పెద్దగా తెలీదు. జరగబోతున్న యెహోవాసాక్షుల పెద్ద సమావేశం గురించి ప్రజలకు తెలిసేలా చేయండి అని మా సంస్థ మమ్మల్ని పంపించింది. మీరేమైనా సహాయం చేస్తే ఎంతో మేలు చేసినవాళ్లౌతారు.” అలా వినయంగా మాట్లాడడం వల్ల, మామూలుగా అయితే సహాయం చేయని చాలామంది మాకు సహాయం చేశారు.

తర్వాత బ్రాంచి నన్ను మన లాయర్లలో ఒకరైన బ్రదర్‌ గ్లెన్‌ హౌతో కలిసి పనిచేయమని చెప్పింది. మీడియా దృష్టిని ఆకర్షించే సున్నితమైన కేసులు మేము చూసుకోవాలి. గిలియడ్‌ శిక్షణ, లేయోన్స్‌తో కలిసి పనిచేయడం వల్ల పొందిన అనుభవం నాకు ఎంతో సహాయం చేశాయి. బ్రదర్‌ హౌతో కలిసి పనిచేయడం సాటిలేని ఒక గొప్ప అవకాశం. ఆయన న్యాయ వ్యవస్థతో వ్యవహరించడానికి ఏమాత్రం భయపడేవాడు కాదు, అంతకన్నా ముఖ్యంగా యెహోవాను చాలా ప్రేమించేవాడు.

1985లో, మమ్మల్ని పశ్చిమ కెనడాలోని ఒక సర్క్యూట్‌కి నియమించారు. దానివల్ల అక్కడికి దగ్గర్లోనే ఉంటున్న మా నాన్న బాగోగులు చూసుకోగలిగాం. మేము వెళ్లిన మూడు నెలలకు ఆయన చనిపోయాడు. తర్వాత 1989 వరకు అక్కడి సర్క్యూట్‌లలోనే సేవచేశాం. అప్పుడు మాకు అమెరికా బెతెల్‌లో సేవ చేయమని ఆహ్వానం వచ్చింది! దాంతో దాదాపు 19 ఏళ్లుగా చేస్తున్న ప్రయాణ పని వదిలేయాల్సి వచ్చింది. ఆ సమయమంతటిలో మేము వందల ఇళ్లలో బస చేశాం, ఆతిథ్య స్ఫూర్తి చూపించిన బ్రదర్స్‌సిస్టర్స్‌తో కలిసి వేలసార్లు భోజనం చేశాం. మా కోసం తమ ఇంటి తలుపులు తెరిచిన, భోజనం సిద్ధం చేసిన వాళ్లందరికీ మేమెంతో కృతజ్ఞులం!

అమెరికా బెతెల్‌లో సేవచేయడం

మేము బ్రూక్లిన్‌కి చేరుకున్నాక, నన్ను సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయమని నియమించారు. అక్కడ పొందిన శిక్షణ కోసం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. నేను నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే, వాస్తవాలన్నీ తెలుసుకోవాలి, దేని గురించీ ఊహాగానాలు చేయకూడదు. తర్వాత 1998లో నన్ను రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కి నియమించారు, ఇప్పుడు అక్కడే సేవచేస్తూ ఇంకా నేర్చుకుంటున్నాను. నాకు కొన్ని సంవత్సరాలు, రైటింగ్‌ కమిటీ సమన్వయకర్తగా ఉన్న బ్రదర్‌ జాన్‌ బార్‌కి సహాయం చేసే గొప్ప అవకాశం దక్కింది. ఆయన దగ్గర పొందిన శిక్షణ, ఆయనతో గడిపిన సమయం వెలకట్టలేనివి. ఆయన నిజంగా యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడిచాడు.

డేవిడ్‌ స్ప్లేన్‌ అలాగే లిండా, జాన్‌ బార్‌ అలాగే మిల్డ్రడ్‌ బార్‌లతో ఫోటో దిగుతున్నారు.

జాన్‌ బార్‌ అలాగే మిల్డ్రడ్‌ బార్‌లతో

రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లోని వినయస్థులైన బ్రదర్స్‌సిస్టర్స్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్లు చేసే పనిలో సహాయం చేయమని ఎప్పుడూ యెహోవాను అడుగుతారు; వాళ్లు సాధించే ఏ మంచైనా అది సొంత సామర్థ్యంతో కాదుగానీ యెహోవా పవిత్రశక్తి వల్లే అని వాళ్లకు తెలుసు.

బ్రదర్‌ స్ప్లేన్‌ 20 మంది బ్రదర్స్‌సిస్టర్స్‌తో వాచ్‌టవర్‌ కోరస్‌ నిర్వహిస్తున్నాడు, ఒక సిస్టర్‌ పియానో వాయిస్తుంది.

2009 వార్షిక కూటంలో వాచ్‌టవర్‌ కోరస్‌ నిర్వహిస్తున్నాను

బ్రదర్‌ స్ప్లేన్‌ సంతోషంగా ఒక సిస్టర్‌కి బైబిలు అందిస్తున్నాడు.

2014లో కొరియాలోని షియోల్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో బైబిళ్లు అందిస్తున్నాను

అలాగే 110 దేశాల్లోని నమ్మకమైన బ్రదర్స్‌సిస్టర్స్‌ని సందర్శించడం నాకు, లిండాకు దొరికిన గొప్ప గౌరవం. మేము మిషనరీల, బ్రాంచి కమిటీ సభ్యుల, ఇతర పూర్తికాల సేవకుల ప్రేమను స్వయంగా చవిచూశాం. అంతేకాదు యుద్ధం, ఆర్థిక కష్టాలు, హింస ఉన్నా కూడా రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే స్థానిక ప్రచారకుల ఉత్సాహాన్ని, నమ్మకత్వాన్ని చూడడం కూడా ఒక పెద్ద ఆశీర్వాదం. యెహోవా వాళ్లను ఎంతో ప్రేమిస్తాడు అనడంలో సందేహమే లేదు!

గడిచిన సంవత్సరాల్లో, నా నియామకాలు నిర్వర్తిస్తున్నప్పుడు లిండా నాకు ఎంతో సహాయం చేసింది. ఆమె ప్రజల్ని ప్రేమిస్తుంది, వాళ్లకు ఎలా సహాయం చేయాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంది. ప్రజలతో సంభాషణ మొదలుపెట్టడం కూడా బాగా వచ్చు. యెహోవా గురించి నేర్చుకోవడానికి చాలామందికి సహాయం చేసింది, అలాగే యెహోవా సేవ ఆపేసిన కొంతమంది తిరిగి రావడానికి కూడా సహాయం చేసింది. లిండా నిజంగా యెహోవా ఇచ్చిన బహుమతి! ఇప్పుడు మాకు వయసు పైబడుతుంది కాబట్టి ప్రయాణాల్లో, మిగతా విషయాల్లో యౌవన బ్రదర్స్‌సిస్టర్స్‌ సహాయం చేస్తున్నారు. వాళ్ల సహాయాన్ని మేము చాలా విలువైనదిగా చూస్తున్నాం.—మార్కు 10:29, 30.

ఒకసారి వెనక్కి తిరిగి గడిచిన 80 ఏళ్ల గురించి ఆలోచించినప్పుడు, నాలో కృతజ్ఞత ఉప్పొంగుతుంది. “దేవా, చిన్నప్పటి నుండి నువ్వు నాకు బోధించావు, ఇప్పటివరకు నేను నీ అద్భుతమైన పనుల గురించి చెప్తూనే ఉన్నాను” అని చెప్పిన కీర్తనకర్తలాగే అనిపిస్తుంది. (కీర్త. 71:17) నేను బ్రతికున్నంత కాలం అలా చెప్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.

a ఆ శిక్షణ ఇప్పుడు వారం మధ్యలో జరిగే కూటంలో పొందుతున్నాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి