మే 11-17, 2026
పాట 7 యెహోవా, మన బలం
విశ్వ సర్వాధిపతిని నమ్మండి
“యెహోవా . . . నువ్వు మాత్రమే భూమంతటి పైన మహోన్నతుడివి.”—కీర్త. 83:18.
ముఖ్యాంశం
యెహోవాయే విశ్వ సర్వాధిపతి అని, ఇప్పుడు అలాగే భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని తట్టుకోవడానికి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడని ఎందుకు నమ్మవచ్చో చూస్తాం.
1. యోబుకు ఎలాంటి కష్టాలు వచ్చాయి?
దేవుణ్ణి నమ్మకంగా సేవించిన యోబు తన పిల్లల్ని, ఆరోగ్యాన్ని, ఆస్తిని అన్నీ పోగొట్టుకున్నాడు. ఇంకా ఆయన మీద లేనిపోని నిందలుపడ్డాయి. ఆయన “స్నేహితులు” సూటిపోటి మాటలతో ఆయన్ని బాధపెట్టారు. ఆయన భార్య కూడా ఎంతగా నిరుత్సాహపడిందంటే, “దేవుణ్ణి దూషించి చచ్చిపో” అంది. (యోబు 2:9; 15:4, 5; 19:1-3) ఇవన్నీ చూసి సత్యదేవుని మీద యోబుకున్న నమ్మకం తగ్గిపోయే అవకాశం ఉంది. యెహోవాను ప్రేమించి, ఆయన్ని సేవిస్తున్న వాళ్లను ఆయన కాపాడతాడా అనే సందేహం కూడా యోబుకు వచ్చి ఉండవచ్చు.
2-3. కష్టాలు వచ్చినప్పుడు మనకు ఏ సందేహం రావచ్చు? యోబు పుస్తకం నుండి మనం ఏం నేర్చుకుంటాం?
2 మనకు కూడా కొన్నిసార్లు కష్టాల వల్ల, యెహోవా మీదున్న నమ్మకం తగ్గిపోయే ప్రమాదం ఉంది. మనం “ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో” జీవిస్తున్నాం. (2 తిమో. 3:1) కష్టాలు చుట్టుముట్టినప్పుడు మనం ఉక్కిరిబిక్కిరి అయిపోయి, వాటిని తట్టుకోవడం ఇక మనవల్ల కాదని అనుకోవచ్చు. అలాంటి కష్టాలు అనుభవించిన కొంతమందికి, అసలు యెహోవా వాళ్లను పట్టించుకుంటాడా అనే సందేహం కూడా వచ్చింది.
3 మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తే నిరుత్సాహపడకండి. తనకు నమ్మకంగా ఉన్నవాళ్లను యెహోవా రక్షిస్తాడని యోబు నేర్చుకున్నాడు. మనం కూడా యోబులాగే, మన పరలోక తండ్రైన యెహోవా మీద చెక్కుచెదరని నమ్మకాన్ని పెంచుకోవచ్చు. అలా చేయాలంటే మనం యోబు పుస్తకాన్ని తెరవాల్సిందే, అది చెప్పే రెండు ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవాల్సిందే. (1) యెహోవా మాత్రమే ఈ విశ్వానికి సర్వాధిపతి. (2) సర్వశక్తిగల దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం అలాగే తన ప్రజలకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా శాశ్వత హాని జరగకుండా కాపాడడం కోసం ఈ లోకంలోని సంఘటనల్ని మలచగలడు.
సాతాను వాళ్లతోపాటు వచ్చాడు
4. పరలోకంలో యెహోవా ముందుకు ఎవరెవరు వచ్చారు?
4 ఒక రోజు పరలోకంలో, ఒక మీటింగ్ కోసం “సత్యదేవుని కుమారులు” యెహోవా ముందుకు వచ్చారు. అప్పుడు “సాతాను కూడా వాళ్లతోపాటు వచ్చి నిలబడ్డాడు” అని బైబిలు చెప్తుంది. (యోబు 1:6) “సాతాను” అనే పదానికి “ఎదిరించేవాడు” అని అర్థం. యెహోవాను వ్యతిరేకిస్తాడు కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది. ఈ సందర్భంలో, సాతాను యెహోవా ముందుకు వచ్చి నిలబడే సమయానికి, అతను దేవుని నమ్మకమైన కుమారుల్లో ఒకడిగా లేడు. అతను యెహోవాకు, నమ్మకమైన దేవదూతలకు, నమ్మకమైన మనుషులకు శత్రువు అయ్యాడు. ఆదికాండం 3:15 లో ఉన్న యెహోవా మాటల్నిబట్టి, సాతాను అప్పటికే యెహోవా కుటుంబంలో భాగంగా లేడని అర్థమౌతుంది. కాబట్టి ఏ “స్త్రీ” నుండైతే “సంతానం” వస్తుందో, ఆ స్త్రీలో సాతాను భాగం కాదు. ఇక్కడ “స్త్రీ” అంటే, పరలోక ప్రాణులున్న దేవుని కుటుంబం.
5. పరలోకంలో జరిగిన సంఘటనల్ని బట్టి ఏ విషయాలు అర్థమౌతున్నాయి?
5 ఆ రోజు ఆ మీటింగ్‌లో ఏం జరిగిందో యెహోవా బైబిల్లో రాయించాడు. అక్కడ సాతాను చెప్పిన మాటల్ని బట్టి, అతను నోటికొచ్చిన నిందల్లా వేసేసే దుష్టుడు అని అర్థమౌతుంది. (యోబు 1:9; ప్రకటన 12:10 పోల్చండి.) పరలోకంలో జరిగిన ఈ మీటింగ్ గురించి యెహోవా బైబిల్లో రాయించడం వల్ల మనం ఒక భరోసాతో ఉండవచ్చు. అదేంటంటే, యెహోవా తనకున్న అపారమైన శక్తిని సరైనది, న్యాయమైనది చేయడం కోసం ఉపయోగిస్తాడు. అలాగే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే హద్దుల్ని కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు పెడతాడు.
యెహోవా హద్దులు పెడతాడు
6. పరలోకంలో జరిగిన మీటింగ్ అంతా, యెహోవా కనుసైగల్లోనే నడిచిందని ఎలా చెప్పవచ్చు? (యోబు 1:7, 8)
6 యోబు 1:7, 8 చదవండి. ఆ రోజు పరలోకంలో జరిగిన మీటింగ్ అంతా, యెహోవా కనుసైగల్లోనే నడిచింది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? యెహోవాయే మాటల్ని మొదలుపెడుతూ, “నువ్వు నా సేవకుడైన యోబును గమనించావా?” అని సాతానును అడిగాడు. అవును, నమ్మకస్థుడైన యోబు మీద సాతాను కన్ను పడిందని యెహోవాకు బాగా తెలుసు కాబట్టే ఆ ప్రశ్న అడిగాడు. అయితే, యెహోవా తన అపారమైన శక్తిని యోబు కోసం ఎలా ఉపయోగిస్తాడో ఇప్పుడు చూద్దాం.
7. యోబు 1:10, 11 ప్రకారం, మనుషులు యెహోవాను ఎందుకు ఆరాధిస్తున్నారని సాతాను అన్నాడు?
7 యోబు 1:10, 11 చదవండి. యెహోవా సర్వశక్తిగల దేవుడు, విశ్వ సర్వాధిపతి. ఆయన తన అధికారాన్ని, శక్తిని పరిస్థితులకు తగ్గట్టు సరిగ్గా ఉపయోగిస్తాడు. (యిర్మీ. 32:17; దాని. 4:35) కానీ సాతానేమో, యెహోవా తన శక్తిని సరిగ్గా ఉపయోగించట్లేదని అన్నాడు. ఒకవిధంగా సాతాను ఇలా అన్నాడు: యెహోవా యోబుకి, మనుషులందరికి లంచం ఇచ్చి తనను ఆరాధించేలా చేసుకుంటున్నాడు. అంతేకాదు, మనుషులు కూడా యెహోవా నుండి ఏదో ఆశించే ఆయన్ని ఆరాధిస్తున్నారని వాళ్లమీద బురద చల్లాడు. మరి అప్పుడు యెహోవా ఏం చేశాడు?
8-9. యెహోవా సాతానుకు ఏ హద్దులు పెట్టాడు? ఎందుకు? (యోబు 1:12) (చిత్రం కూడా చూడండి.)
8 యోబు 1:12 చదవండి. ఆ మాటల్ని నిరూపించుకునే అవకాశాన్ని యెహోవా అపవాదికి ఇచ్చాడు. కాకపోతే, కొన్ని హద్దులు పెట్టాడు. “అతనికి [యోబుకి] మాత్రం ఏ హానీ చేయకు!” అని యెహోవా స్పష్టంగా చెప్పాడు. యెహోవా ఆ దూతలందరి ముందు, సాతాను ఎంతవరకు దాడిచేయాలి అనే విషయంలో హద్దులు పెట్టాడు. యెహోవా గీసిన ఆ గీతను దాటి, ఒక్క అడుగు కూడా బయటికి వేసే సత్తా సాతానుకు లేదు. కాబట్టి ఏం చేసినా ఆ హద్దుల్లోనే చేయాలి. అలా యోబును కాపాడడం కోసం, తన పేరు పాడవ్వకుండా చూసుకోవడం కోసం యెహోవా తన అధికారాన్ని, శక్తిని ఉపయోగించాడు. ఈ రోజుల్లో కూడా యెహోవా పెట్టిన హద్దుల్లోనే సాతాను ఉండాలి.
9 సాతాను చేసిన మొదటి ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. యోబు తన పరలోక తండ్రికి నమ్మకంగానే ఉన్నాడు. (యోబు 1:22) అయితే, సాతాను ప్రయత్నాలు అంతటితో ఆగలేదు.
అందరి ముందు తన వాదనను వినిపించుకునే అవకాశాన్ని యెహోవా సాతానుకు ఇచ్చాడు (8-9 పేరాలు చూడండి)
10. సాతాను యోబు మీద మళ్లీ దాడిచేయడానికి యెహోవా ఎందుకు ఒప్పుకున్నాడు? (యోబు 2:2-6)
10 యోబు 2:2-6 చదవండి. ఈసారి యోబును దెబ్బతీయడానికి సాతాను తన ప్రయత్నాల్ని రెట్టింపు చేశాడు. తన ప్రాణాల మీదకు వస్తే, యోబు ఖచ్చితంగా యెహోవాను దూషిస్తాడని సాతాను ఆరోపించాడు. ఈ విషయాన్ని తేల్చేయాలని, సాతాను యోబు మీద దాడిచేయడానికి యెహోవా ఒప్పుకున్నాడు. కానీ, ఈసారి కూడా కొన్ని హద్దులు పెట్టాడు. “అతని ప్రాణం మాత్రం తీయకు!” అని యెహోవా చెప్పాడు. యెహోవా చెప్పిన మాటలకు లోబడడం, ఆయన పెట్టిన హద్దుల్లో ఉండడం తప్ప సాతానుకు వేరే దారి లేదు. దీన్నిబట్టి యెహోవాయే మహోన్నతుడని, అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయని మనకు మరోసారి అర్థమౌతుంది.
యోబు కష్టాలకు యెహోవా తెర దించాడు
11. యోబుకు వచ్చిన కష్టాల్ని ఆపేసిన తర్వాత, యెహోవా ఆయన్ని ఎలా ఆశీర్వదించాడు? (యోబు 42:10-13)
11 యోబు 42:10-13 చదవండి. ఏం జరిగినా యోబు మాత్రం రాజీపడడని అర్థమైపోయింది. అందుకే, యోబు మీద సాతాను దాడులకు యెహోవా అడ్డుకట్ట వేశాడు. తన నమ్మకమైన సేవకుడు పడుతున్న కష్టాలకు యెహోవా ముగింపు పలికాడు. ఈసారి కూడా, యెహోవా నిర్ణయానికి తలొగ్గడం తప్ప సాతాను ఏమీ చేయలేకపోయాడు. తన ప్రియమైన సేవకుడి మీద నేరుగా దాడిచేసేలా యెహోవా ఇక సాతానుకు అనుమతి ఇవ్వలేదు.
12. తనను నమ్మిన కొంతమందిని యెహోవా ఎలా కాపాడాడు? ఉదాహరణ చెప్పండి.
12 ఈ చివరి రోజుల్లో కూడా, యెహోవా తన శక్తిని ఉపయోగించి తన సేవకుల్లో చాలామందిని కాపాడాడు. ఉదాహరణకు, 1945లో నాజీ పరిపాలకులు 230 మంది యెహోవాసాక్షుల్ని కాన్సన్‌ట్రేషన్ క్యాంప్ నుండి సముద్రం వరకు ఎన్నో కిలోమీటర్లు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. వాళ్లను ఓడలోకి ఎక్కించి, సముద్రంలో ముంచేయాలి అనుకున్నారు. కానీ ఒక్కరు కూడా చనిపోలేదు. ఆ భయానక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఒక తీర్మానంలో ఆ సాక్షులు ఇలా రాశారు: ‘ఓ సుదీర్ఘ పరీక్షా సమయం ముగిసింది. అందులో నుండి ప్రాణాలతో బయటపడిన మేము ఏ హానీ కలగకుండా, మండుతున్న కొలిమి నుండి బయటికి లాగబడినట్టు కాపాడబడ్డాం. కనీసం, అగ్ని వాసన కూడా మాకు అంటలేదు. పరిస్థితికి భిన్నంగా, మేమందరం యెహోవా నుండి సంపూర్ణ బలాన్ని, శక్తిని పొందాం.’ వాళ్లు ఇంకా ఇలా అన్నారు: ‘మేము సింహాల గుహలో నుండి వచ్చిన తర్వాత మా కోరిక ఒకటే, జీవితాంతం యెహోవాను సేవించేలా మమ్మల్ని అనుమతిస్తే చాలు. అంతకుమించి ఇంకేమీ వద్దు.’—దానియేలు 3:27; 6:22 పోల్చండి.
13. కష్టాలు వచ్చినప్పుడు మీరు ఏ నమ్మకంతో ఉండవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
13 మన జీవితంలో కూడా, కొన్నిసార్లు కష్టాల వల్ల మనకు సింహాల గుహలో ఉన్నట్టు అనిపించవచ్చు. (1 పేతు. 5:8-10) కొన్నిసార్లు మనం డీలాపడిపోయి, అసలు ఈ కష్టాలకు అంతేలేదా అని అనుకోవచ్చు. అలాంటి సమయాల్లో, మనం యోబు అనుభవాన్ని గుర్తుచేసుకోవడం మంచిది. ఇప్పుడైనా, రాబోయే కొత్తలోకంలోనైనా యెహోవా తన శక్తిని ఉపయోగించి మన కష్టాల్ని తీసేస్తాడనే పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. ఆయన అనుకున్న సమయం వచ్చిన తర్వాత, ఇక అర క్షణం కూడా ఈ వ్యవస్థను ఉండనివ్వడు!
యెహోవా తన విశ్వసనీయ సేవకుల కష్టాలకు ముగింపు పలుకుతాడు (13వ పేరా చూడండి)
తనకు విశ్వసనీయంగా ఉండేవాళ్లంటే యెహోవాకు ఇష్టం
14-15. తనకు విశ్వసనీయంగా ఉండేవాళ్లను యెహోవా ఎలా ఆశీర్వదిస్తాడు? (యోబు 14:15) (చిత్రం కూడా చూడండి.)
14 యోబు 14:15 చదవండి. తనకు విశ్వసనీయంగా ఉండేవాళ్లకు యెహోవా కూడా విశ్వసనీయంగా ఉంటాడు. ఆయన వాళ్లను ఎంతగా ప్రేమిస్తాడంటే, ఒకవేళ వాళ్లు చనిపోయినా వాళ్లను తిరిగి బ్రతికిస్తాడు. మరణం మిగిల్చిన కన్నీళ్లను తుడిచేసి ఆనందంతో ముంచేస్తాడు.—యెష. 65:17.
15 కష్టాలు ముగిసిన తర్వాత కూడా, యోబు సాతాను లోకంలోనే బ్రతికాడు. అయితే, యెహోవా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, ముందుకన్నా రెట్టింపు ఆశీర్వాదాల్ని ఇచ్చాడని బైబిలు చెప్తుంది. యెహోవా యోబుకు భవిష్యత్తులో ఇవ్వబోయే ఆశీర్వాదాలకు అది శాంపిల్ మాత్రమే. తనకు విశ్వసనీయంగా ఉండేవాళ్లు అంతులేని సంతోషంతో జీవితాన్ని ఆనందించాలన్నదే యెహోవా కోరిక అని, యోబు ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. నిజానికి తనకు విశ్వసనీయంగా ఉండే వాళ్లందరికీ, పరదైసు భూమ్మీద పరిపూర్ణ జీవితాన్ని ఆనందించే అవకాశాన్ని యెహోవా ఇస్తాడు. (ప్రక. 21:3, 4) విశ్వ సర్వాధిపతిగా ఆయనకు అలా చేయాలనే కోరిక ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మాట మనకు ఎంత ఊరటనిస్తుందో కదా!
కష్టాలు ముగిసిన తర్వాత యోబు, ఆయన భార్య యెహోవా ఇచ్చిన మెండైన ఆశీర్వాదాల్ని అనుభవించారు (14-15 పేరాలు చూడండి)
16. యెహోవాను విశ్వ సర్వాధిపతిగా నమ్మడానికి ఇంకో కారణం ఏంటి?
16 చాలా ఏళ్లు బ్రతికి చివరికి యోబు చనిపోయాడు. విశ్వ సర్వాధిపతిగా, సర్వశక్తిమంతుడిగా యెహోవాకు మరణం మీద కూడా శక్తి ఉంది. (ద్వితీ. 32:39) కాబట్టి తను ప్రేమించేవాళ్లను తిరిగి బ్రతికించకుండా ఆయన్ని ఎవ్వరూ ఆపలేరు, తను అనుకున్న సమయంలో దాన్ని చేసి చూపిస్తాడు.—రోమా. 8:38, 39.
యెహోవాను పూర్తిగా నమ్మండి
17. యెహోవా ప్రజల్ని తుడిచేయడానికి సాతాను వేసిన ఎత్తులు చిత్తుచిత్తు అయ్యాయని ఎలా చెప్పవచ్చు?
17 యెహోవాను పూర్తిగా నమ్మడానికి గల బలమైన కారణాల్ని యోబు పుస్తకంలో చూస్తాం. యెహోవా ప్రజల్ని తుడిచేయడానికి సాతాను ఎన్ని ఎత్తులు వేసినా, అవన్నీ చిత్తుచిత్తు అయినందుకు మనకు ఎంత సంతోషంగా ఉందో కదా! యెహోవాయే అసలైన విశ్వ సర్వాధిపతి అనడానికి, ఇప్పుడు దాదాపు 90 లక్షలమంది నమ్మకమైన దేవుని సేవకులు సజీవ సాక్ష్యంగా ఉన్నారు. ఆయన సేవకులకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమైనా అస్సలు వర్ధిల్లదు అని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. (యెష. 54:17) గడ్డిపోచలా కనిపించే యెహోవా ప్రజలపై దేశాలు, మత సంస్థలు ఉక్కుపాదం మోపాయి. అయినా, వాళ్లను ఏమీ చేయలేకపోయాయి. యెహోవా గురించిన సత్యాన్ని చెప్పకుండా అలాగే సాతాను అబద్ధికుడు, హంతకుడు అనే నిజాన్ని బయటపెట్టకుండా మనల్ని ఏదీ ఆపలేదు. ఆఖరికి మరణం కూడా ఆపలేదు. ఎందుకంటే, తనకు విశ్వసనీయంగా ఉండి చనిపోయినవాళ్లను యెహోవా తిరిగి బ్రతికిస్తాడు.—హోషే. 13:14.
18. మనం కొండంత నమ్మకంతో భవిష్యత్తు వైపు ఎందుకు అడుగులు వేయవచ్చు?
18 యోబు జీవితాన్ని ధ్యానిస్తే, విశ్వాసాన్ని పెంచుకుని కొండంత నమ్మకంతో భవిష్యత్తు వైపు అడుగులు వేస్తాం. మహాశ్రమ సమయంలో యెహోవా ప్రజలు బలహీనంగా ఉన్నట్టు, సాతాను-అతని అనుచరులు పైచేయి సాధిస్తున్నట్టు కనిపించవచ్చు. కానీ, యోబు కాలంలోలాగే అన్నీ యెహోవా చేతుల్లోనే ఉంటాయి, మనకు శాశ్వత హాని చేసేలా ఆయన సాతానును అనుమతించడు. సాతాను మనుషులకు తెచ్చిన కష్టాలకు అంతం దగ్గరపడుతోంది. సాతాను, అతనితో ఉన్న చెడ్డ దూతలందర్నీ యేసు 1,000 సంవత్సరాలు అగాధంలో బంధిస్తాడు. (లూకా 8:31; ప్రక. 20:1-3) చివరికి యెహోవా సాతాను, అతనితో చేతులు కలిపిన వాళ్లందరి అంతు చూస్తాడు. (ప్రక. 20:10) యెహోవా ముందే చెప్పినట్టు, యేసు సాతాను తలను చితగ్గొడతాడు, అతన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాడు.—ఆది. 3:15; రోమా. 16:20.
19. యెహోవాను పూర్తిగా నమ్మేవాళ్ల కోసం ఏ బహుమతి ఎదురుచూస్తోంది? (చిత్రం కూడా చూడండి.)
19 కొత్తలోకంలో పరిపూర్ణ జీవితం కోసం, నిజమైన సంతోషం కోసం మనందరం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ఆ జీవితం, మన ఊహలకు మించి ఉంటుంది. యెహోవా ఇలా మాటిస్తున్నాడు: “ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.” (ప్రక. 21:5) ఆ మాటకు అర్థం ఏంటి? ఇన్ని వేల సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా సాతాను వల్ల, అతని చెడ్డదూతల వల్ల మనుషులకు పట్టిన తుప్పు-చెద వదిలిపోతుంది. అప్పుడు మనకు ఎంత హాయిగా ఉంటుందో కదా! ఈ లోకంలోని ఆందోళనల వల్ల, మనం గడిపిన నిద్రలేని రాత్రులు ఇక ఉండవు. హార్‌మెగిద్దోను నుండి బయటపడినవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ అద్భుతరీతిలో బాగవ్వడాన్ని చూస్తారు. అంతేకాకుండా, చనిపోయిన మన ప్రియమైనవాళ్లు తిరిగి బ్రతకడం మొదలౌతుంది. చివరికి, మనం ఎలా జీవించాలని మన పరలోక తండ్రి కోరుకున్నాడో అలా జీవిస్తాం!
గతంలో కష్టాల్ని సహించిన నమ్మకమైన సేవకులు యెహోవా ఇచ్చే మెండైన ఆశీర్వాదాల్ని అనుభవిస్తారు (19వ పేరా చూడండి)
20. మీరు ఏం నిర్ణయించుకున్నారు?
20 ఈ చివరి రోజుల్లో కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొంటుండగా, యెహోవాను పూర్తిగా నమ్మాలని, ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థించాలని నిర్ణయించుకుందాం. మన పరలోక తండ్రి మీద ప్రేమ చూపిద్దాం, సాతాను అబద్ధికుడని నిరూపిద్దాం. అవును, మన సర్వాధిపతి అయిన యెహోవా పరిపాలన కింద ఉండే అందమైన జీవితం కోసం మనం ఎదురుచూడవచ్చు. ఎందుకంటే తన నమ్మకమైన సేవకులకు, ఊహకందని ఆశీర్వాదాల్ని ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు!
పాట 153 యెహోవాయే నా ధైర్యం