మే 4-10, 2026
పాట 53 సువార్త చాటడానికి మనస్సు సిద్ధం చేసుకోండి
పరిచర్యలో మీ ‘బోధనా కళను’ సానబెట్టుకోండి
‘సంపూర్ణమైన ఓర్పుతో, బోధనా కళతో వాక్యాన్ని ప్రకటించు.’—2 తిమో. 4:2.
ముఖ్యాంశం
పరిచర్యలో మన బోధనా సామర్థ్యాన్ని ఎలా సానబెట్టుకోవచ్చో మూడు విధానాలు చూస్తాం.
1. మనం ఏ కళను పెంచుకోవాలి? ఎందుకు? (2 తిమోతి 4:2) (చిత్రం కూడా చూడండి.)
యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “శిష్యుల్ని చేయండి … నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు బోధించండి.” (మత్త. 28:19, 20, అధస్సూచి) దీన్నిబట్టి క్రైస్తవులందరూ బోధకులుగా ఉండాలని అర్థమౌతుంది. నిజమే, “తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్లను యెహోవా ఆకర్షిస్తాడు. అలాంటివాళ్ల దగ్గరికి నడిపించడంలో దేవదూతలు కూడా మనకు సహాయం చేస్తారు. (అపొ. 13:48; యోహా. 6:44; ప్రక. 14:6) కానీ, మన వంతు ప్రయత్నం మనం చేయాల్సిందే. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన బర్నబా ఉంచిన మంచి ఆదర్శాన్ని గమనించండి. వాళ్లు ఈకొనియలోని సమాజమందిరంలో ప్రకటిస్తున్నప్పుడు, “అక్కడ ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులు, గ్రీకువాళ్లు విశ్వాసులయ్యారు” అని బైబిలు చెప్తుంది. (అపొ. 14:1) పౌలు, బర్నబా ‘బోధనా కళను’ పెంచుకున్నారు అనడంలో సందేహమే లేదు. (2 తిమోతి 4:2 చదవండి.) క్రైస్తవులందరూ వాళ్లలాగే ఆ కళను పెంచుకోవడం మంచిది.
యేసు, అలాగే పౌలు, బర్నబా లాంటి కొంతమంది శిష్యులు ఉంచిన ఆదర్శం నుండి మనం ‘బోధనా కళ’ గురించి చాలా నేర్చుకోవచ్చు (1వ పేరా చూడండి)
2. తమ బోధనా నైపుణ్యాల్ని పెంచుకోలేమని కొంతమంది ఎందుకు అనుకోవచ్చు?
2 కొంతమంది వాళ్లు తక్కువ చదువుకున్నారనో, వాళ్లకు ఆ టాలెంట్ లేదనో బోధనా కళను పెంచుకోలేమని అనుకుంటారు. బైబిల్లో ఉన్న కొంతమంది పురుషులు కూడా, వాళ్లకు అంత సామర్థ్యం లేదని అనుకున్నారు. (నిర్గ. 4:10; యిర్మీ. 1:6) ఇంకొంతమందైతే, పరిచర్యలో వేరేవాళ్లకు వచ్చినంత మంచి ఫలితాలు తమకు రావట్లేదని నిరుత్సాహపడతారు. నిజమే మనం మాట్లాడే ప్రతీఒక్కరు, మనం కలిసే ప్రతీఒక్కరు మంచివార్త విని యెహోవాసాక్షి అయిపోరు. పైగా, మనకు వచ్చే ఫలితాలు అన్నిసార్లూ మనం చేసే ప్రయత్నాల మీద ఆధారపడి ఉండవు. పై పేరాలో చూసినట్టు, యెహోవా దేవుడు అలాగే దేవదూతలు మంచి మనసున్న వాళ్ల దగ్గరికి మనల్ని నడిపిస్తారు. అయినా, ప్రజలకు నచ్చేలా మాట్లాడడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. పరిచర్యలో మన బోధనా కళను పెంచుకోవడానికి సహాయం చేసే మూడు విధానాల్ని మనం ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
ప్రజల మీద శ్రద్ధ చూపించండి
3. యేసు మాటలు ప్రజల హృదయాల్ని ఎందుకు తాకాయి?
3 యేసుకు “మనుషుల స్వభావం” తెలుసని బైబిలు చెప్తుంది. (యోహా. 2:25) అంటే మనుషులు ఎలా ఆలోచిస్తారో, వాళ్ల ఉద్దేశాలేంటో యేసుకు తెలుసు. ప్రజల అవసరాలేంటో ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టే, ప్రజల హృదయాల్ని తాకేలా మాట్లాడగలిగాడు. ప్రజలు ఆధ్యాత్మిక పోషణలేక బక్కచిక్కిపోయారని; లెక్కలేనన్ని ఆచారాల వల్ల, మనుషుల సొంత నియమాల వల్ల నలిగిపోయారని ఆయన గమనించాడు. (మత్త. 9:36; 23:4) వాళ్లకు సహాయం చేసే విషయాల గురించే ఆయన కొండమీది ప్రసంగంలో మాట్లాడాడు. యేసు వాళ్లకు ఉపయోగపడే విషయాలే చెప్పాడు కాబట్టి చాలామందికి ఆ విషయాలు బాగా నచ్చాయి.
4. ప్రజల మీద శ్రద్ధ ఉందని మనమెలా చూపించవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
4 ప్రజల అవసరాల్ని అర్థంచేసుకోవడం ద్వారా మనం వాళ్ల మీద శ్రద్ధ చూపించవచ్చు. పరిచర్యలో మనం కలిసే ప్రతీఒక్కరు ఏదోక విధంగా సాతాను లోకం వల్ల అవస్థలు పడుతున్నవాళ్లే. దాన్ని మనసులో ఉంచుకున్నప్పుడు, వాళ్ల స్థానంలోకి వెళ్లి వాళ్ల బాధను అర్థం చేసుకోవడం మనకు తేలికౌతుంది. ఉదాహరణకు, ఈమధ్య వార్తల్లో వచ్చిన ఒక విషయం గురించి మీ ప్రాంతంలో ఉన్నవాళ్లు కంగారుపడుతున్నారా? తల్లిదండ్రులైతే, స్కూల్లో తమ పిల్లల భద్రత గురించి టెన్షన్ పడుతున్నారా? ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు దొరకట్లేదా? బైబిలు ఇచ్చే నిరీక్షణ లేకుండా, ఈ “కష్టమైన కాలాల్లో” ప్రజల జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికి ప్రయత్నించండి.—2 తిమో. 3:1; యెష. 65:13, 14.
మీ ప్రాంతంలోని ప్రజల పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, వాళ్ల మీద శ్రద్ధ చూపించడం నేర్చుకోండి (4వ పేరా చూడండి)
5. యేసుకు, పరిసయ్యులకు మధ్య తేడా ఏంటి? (మత్తయి 11:28-30)
5 యేసు ప్రజల మీద శ్రద్ధ చూపించాడు. అది ఆయన ప్రవర్తించిన విధానంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయనకు, పరిసయ్యులకు ఎంత తేడా ఉందో చూడండి. పరిసయ్యులు సామాన్య ప్రజల్ని చిన్నచూపు చూసేవాళ్లు, చీదరించుకునేవాళ్లు. (మత్త. 23:13; యోహా. 7:49) కానీ యేసు మాత్రం ప్రజలతో దయగా, గౌరవంగా ఉండేవాడు. ఆయన ‘సౌమ్యుడు, వినయస్థుడు’ కాబట్టే ఒక మంచి బోధకుడు అవ్వగలిగాడు. (మత్తయి 11:28-30 చదవండి.) మనం కూడా పరిచర్యలో కలిసేవాళ్ల మీద దయ, గౌరవం చూపించాలి.
6. మంచివార్తను వద్దనుకున్న లేదా వ్యతిరేకించిన వాళ్ల మీద మనం దయ, గౌరవం ఎలా చూపించవచ్చు?
6 మనం చెప్పే మంచివార్తను కొంతమంది వద్దంటారు, మరికొంతమంది వ్యతిరేకిస్తారు. మరి మనం ఏం చేయాలి? వ్యతిరేకతను భరించడంతో పాటు ఇంకా ఏం చేయాలో యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “మిమ్మల్ని ద్వేషించేవాళ్లకు మంచి చేస్తూ ఉండండి. మిమ్మల్ని శపించేవాళ్లను దీవిస్తూ ఉండండి, మిమ్మల్ని అవమానించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి.” (లూకా 6:27, 28) మన సందేశాన్ని ప్రజలు ఎందుకు వద్దు అనివుంటారో ఆలోచించినప్పుడు, యేసు చెప్పింది చేయడం మనకు తేలికౌతుంది. నిజమే, కొంతమంది మనల్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటారు. కానీ ఇంకొంతమంది, కుటుంబ సమస్యల వల్ల నలిగిపోతుండవచ్చు, లేదా మనకు సంబంధంలేని ఏదో విషయం గురించి కంగారుపడుతూ ఉండవచ్చు. లేదా మనమే వాళ్ల మనసు బాలేనప్పుడు వాళ్ల తలుపు తట్టి ఉండవచ్చు. పరిస్థితులు ఏవైనా సరే, మనం మాత్రం ఈ సలహా పాటించాలి: “మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. అప్పుడు, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.” (కొలొ. 4:6) మనం ప్రజల మీద సహానుభూతితో వాళ్ల అవసరాల్ని అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ల మాటల్ని బట్టి నొచ్చుకోం గానీ ఇంకా మంచి బోధకులుగా అవ్వగలుగుతాం.
దేవుని వాక్యం ఆధారంగా బోధించండి
7. యేసు దేవుని వాక్యం ఆధారంగానే బోధించాడని ఎలా చెప్పవచ్చు? (యోహాను 7:14-16)
7 యేసు సొంత జ్ఞానం మీద ఆధారపడలేదు, దేవుని వాక్యం ఆధారంగా బోధించాడు, అందులో ఉన్న విషయాలు ప్రజల జీవితాల్లో ఎలా ఉపయోగపడతాయో చెప్పాడు. అదికూడా, ప్రజలు తేలిగ్గా అర్థంచేసుకుని గుర్తుపెట్టుకునేలా ఆయన బోధించాడు. యేసు, “శాస్త్రుల్లా కాకుండా అధికారం ఉన్నవాడిలా బోధించాడు” అని బైబిలు చెప్తుంది. ఆయన బోధించే తీరు చూసి ప్రజలు “ఎంతో ఆశ్చర్యపోయారు.” (మార్కు 1:22) ఆ కాలం నాటి శాస్త్రులైతే, చాలా పేరున్న రబ్బీలు చెప్పిన మాటల్ని ఆధారం చేసుకుని బోధించేవాళ్లు. కానీ యేసు మాత్రం, దేవుడు ప్రేరేపించి రాయించిన లేఖనాల్ని ఉపయోగిస్తూ బోధించాడు. యేసు భూమ్మీదికి రాకముందు దేవుని కుమారుడిగా పరలోకంలో జీవించాడు కాబట్టి, ఆయన కావాలనుకుంటే తనకున్న అపారమైన తెలివిని వాడి ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తవచ్చు, ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. కానీ ఆయన ఎప్పుడూ అలా చేయలేదు. బదులుగా ఆయన దేవుని ఇష్టానికి తగ్గట్టు, వాక్యానికి తగ్గట్టు బోధించాడు. (యోహాను 7:14-16 చదవండి.) యేసు తన అనుచరులకు ఎంత గొప్ప ఆదర్శం ఉంచాడో కదా!
8. యేసులాగే అపొస్తలుడైన పేతురు కూడా ఎలా బోధించాడు?
8 యేసు శిష్యులు కూడా దేవుని వాక్యం ఆధారంగా బోధించారు. ఉదాహరణకు, క్రీస్తు శకం 33 పెంతెకొస్తు రోజున, అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ప్రసంగాన్ని గమనించండి. పేతురు పెద్దగా చదువుకున్న వ్యక్తేం కాదు. అయినా ప్రవచనాలు యేసు విషయంలో ఎలా నెరవేరాయో అతను లేఖనాలు ఉపయోగించి చెప్తుంటే, ఆ మాటలు ప్రేక్షకుల హృదయాల్ని తాకాయి. (అపొ. 2:14-37) అప్పుడు ఏమైంది? “అతని మాటను సంతోషంగా అంగీకరించినవాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ రోజు దాదాపు 3,000 మంది వాళ్లతో చేరారు.”—అపొ. 2:41.
9. మనం ఎందుకు దేవుని వాక్యం ఆధారంగా బోధించాలి?
9 ప్రజల హృదయాల్ని చేరుకోవడానికి దేవుని వాక్యానికి మించిన పనిముట్టు లేదు. (హెబ్రీ. 4:12) కాబట్టి, మనం బోధిస్తున్నప్పుడు బైబిలు మీద ఆధారపడాలి. మనం ‘వాక్యాన్ని ప్రకటించాలి’ గానీ, మన సొంత ఆలోచనల్ని కాదు. (2 తిమో. 4:2) సామెతలు 2:6 ఇలా చెప్తుంది: “తెలివిని ఇచ్చేది యెహోవాయే; ఆయన నోటి నుండే జ్ఞానం, వివేచన వస్తాయి.” కాబట్టి, మనం బైబిల్ని ఉపయోగించి బోధించినప్పుడు ఒకవిధంగా యెహోవానే మాట్లాడనిస్తాం. (మలా. 2:7) బైబిల్లో, మనుషులు ఇచ్చే దానికన్నా ఎన్నో రెట్లు తెలివైన సలహాలు ఉన్నాయి అని మనం ప్రజలకు చెప్పాలనుకుంటాం. బైబిల్ని దేవుడే ప్రేరేపించి రాయించాడు. మన సృష్టికర్తను సంతోషపెట్టాలన్నా, మనం సంతోషంగా-సంతృప్తిగా జీవించాలన్నా ఏం చేయాలో బైబిలు చెప్తుంది.—2 తిమో. 3:16, 17.
10. బైబిలు విద్యార్థి దృష్టిని మనం ఎలా దేవుని వాక్యం వైపు మళ్లించవచ్చు?
10 మీరు బైబిలు స్టడీకి సిద్ధపడుతున్నప్పుడు, మీ విద్యార్థి దృష్టిని ఏయే విధాలుగా బైబిలు వైపుకు మళ్లించవచ్చో ఆలోచించండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి చిత్రాలు-వీడియోలు సహాయం చేసినప్పటికీ, మనం స్టడీ చేస్తుంది బైబిల్నే అని మీ విద్యార్థికి అర్థమవ్వాలి. కాబట్టి ముఖ్యమైన లేఖనాల్ని తీసి చూపించండి, దాంట్లో వాళ్లకు ఏం అర్థమైందో అడగండి. అలాగే చిత్రాలు-వీడియోలు చూపిస్తున్నప్పుడు, పాఠంలో ఉన్న ముఖ్యమైన బైబిలు సూత్రాల్ని మీ విద్యార్థి అర్థం చేసుకునేలా సహాయం చేయండి. దానికోసం మీరే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, పుట్టెడు-పుట్టెడు లేఖనాలు చూపించాల్సిన అవసరం లేదు. బదులుగా చదివిన ప్రతీ లేఖనాన్ని అర్థం చేసుకునేలా కాస్త టైం ఇవ్వండి. అవసరమైతే చదివిన లేఖనాన్ని మళ్లీ చదివించవచ్చు. అలా చేసినప్పుడు మనం పుస్తకాన్ని, చిత్రాన్ని, వీడియోని కాదుగానీ బైబిల్ని స్టడీ చేస్తున్నట్టు అవుతుంది.—1 కొరిం. 2:13.
11-12. (ఎ) మన బైబిలు విద్యార్థులతో ఎలా ఓపిగ్గా ఉండవచ్చు? (అపొస్తలుల కార్యాలు 17:1-4) (చిత్రం కూడా చూడండి.) (బి) కొంతమందికి బైబిలు గురించి ఏం తెలియకపోవచ్చు? అలాంటివాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?
11 ఒకవేళ మీ విద్యార్థికి ఏదైనా ఒక విషయం అర్థం చేసుకోవడం లేదా నమ్మడం కష్టంగా ఉంటే, ‘సంపూర్ణమైన ఓర్పుతో వాక్యాన్ని ప్రకటించాలని’ గుర్తుంచుకోండి. విషయాల్ని అందరూ ఒకేలా అర్థం చేసుకోలేరు. బహుశా మనకు త్వరగా అర్థమైన బైబిలు సత్యాలు, మన విద్యార్థుల్లో కొంతమందికి అర్థమవ్వడానికి కాస్త టైం పట్టొచ్చు. ఉదాహరణకు, పౌలు చెప్పిన విషయాలు థెస్సలొనీకలో ఉన్న యూదులకు వెంటనే అర్థం కాలేదు. ఆయన వాళ్లను చాలాసార్లు కలిసి, లేఖనాలు ఏం చెప్తున్నాయో వివరించాడు. అప్పుడు గానీ వాళ్లల్లో కొంతమందికి ఆ విషయాలు అర్థం కాలేదు.—అపొస్తలుల కార్యాలు 17:1-4 చదవండి.
12 మనం ఓర్పు చూపించడానికి ఇంకో మార్గం ఏంటంటే, మనమే ఎక్కువ మాట్లాడే బదులు మన విద్యార్థుల హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రశ్నలు వేయడం. వాళ్లు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి, వాళ్ల ఆలోచన ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత, ఫలానా విషయంలో దేవుని అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసే లేఖనాల్ని చదివి చర్చించండి. కొంతమంది బైబిల్ని ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు, అసలు అందులో ఏముంటుందో కూడా వాళ్లకు తెలీదు. అలాంటివాళ్లకు ముద్రిత బైబిలు తీసుకెళ్తే బాగుంటుందేమో ఆలోచించండి. బహుశా, మీరు కొత్త లోక అనువాదం బైబిల్లోని ముందు పేజీల్లో ఉన్న “దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి” అనేది చూపించి, బైబిల్లో ఎంత విలువైన సంపద ఉందో చెప్పవచ్చు. ఉదాహరణకు, 15వ ప్రశ్న కిందున్న ఒకట్రెండు లేఖనాలు చూపించి, సంతోషంగా ఉండడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో వాళ్లకు వివరించవచ్చు. ఒక్కముక్కలో చెప్పాలంటే, దేవుని వాక్యానికి ఉన్న శక్తిని మీ బైబిలు విద్యార్థులకు పరిచయం చేసినప్పుడు మీరు మంచి బోధకులు అవుతారు.
మంచి బోధకులు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు (11-12 పేరాలు చూడండి)
యెహోవా వైపు దృష్టి మళ్లించండి
13. మనం బోధిస్తున్నప్పుడు ఎవరి వైపుకు ప్రజల దృష్టిని మళ్లించాలి? ఉదాహరణ చెప్పండి.
13 మన విద్యార్థులు యెహోవాను తెలుసుకుని, ఆయనకు దగ్గరయ్యేలా సహాయం చేయాలన్నదే మన లక్ష్యం. (యాకో. 4:8) ఈ విషయంలో మిమ్మల్ని మీరు, చీకట్లో ఉన్న వస్తువును చూడడానికి టార్చ్ వేసే వ్యక్తితో పోల్చుకోవచ్చు. మనకు ఏ వస్తువైతే కనబడాలో ఆ వస్తువు పైనే లైట్ వేస్తాం గానీ, మనవైపు వేసుకోం. అదేవిధంగా, మనం బోధిస్తున్నప్పుడు మనవైపు కాదుగానీ, యెహోవా వైపు ప్రజల దృష్టిని మళ్లించాలి.
14. యెహోవా మీద దృష్టి పెట్టేలా బైబిలు విద్యార్థికి మనమెలా సహాయం చేయవచ్చు?
14 మీరు బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు, మీ విద్యార్థికి యెహోవాను సంతోషపెట్టాలనే కోరిక పుట్టేలా చేయండి. (సామె. 27:11) ఫలానా మార్పులు చేసుకోవాలని మీ విద్యార్థికి చెప్తున్నప్పుడు, యెహోవాసాక్షుల్లో చేరాలంటే ఇవన్నీ చేయాలి అనే ఫీలింగ్ రానివ్వకండి. బదులుగా, యెహోవాను సంతోషపెట్టడానికే మార్పులు చేసుకోవాలని మీ విద్యార్థి అర్థం చేసుకునేలా సహాయం చేయండి. ఉదాహరణకు, ఏదైనా ఒక చెడ్డ అలవాటును మానుకోవడం మీ విద్యార్థికి కష్టంగా ఉంటే, ఇలాంటి ప్రశ్నలు వేయండి: “ఈ అలవాటును యెహోవా ఎందుకు అసహ్యించుకుంటున్నాడు? నీకు నచ్చే ఒక విషయాన్ని వదిలిపెట్టమని యెహోవా ఎందుకు చెప్తున్నాడంటావ్? దాన్ని మానుకోమని చెప్పడంలో యెహోవాకు నీ మీద ప్రేమ ఉందని నీకు అనిపించట్లేదా?” ఇలా యెహోవా గురించి ఆలోచించేలా సహాయం చేసినప్పుడు, మీ విద్యార్థి ఆయన్ని ఒక ప్రేమగల తండ్రిలా చూడగలుగుతాడు. అప్పుడు, ఆయన్ని సంతోషపెట్టాలనే కోరిక మీ విద్యార్థికే సొంతగా కలుగుతుంది.
మీ బోధనా కళను సానబెట్టుకుంటూ ఉండండి
15. మీ బోధనా కళను ఎలా సానబెట్టుకుంటూ ఉండవచ్చు?
15 మీ బోధనా కళను ఎక్కడ మెరుగుపర్చుకోవాలో గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థనలో యెహోవాను అడగవచ్చు. (1 యోహా. 5:14) తర్వాత, మీ ప్రార్థనలకు తగ్గట్టు కొన్ని పనులు చేయవచ్చు. ఉదాహరణకు, సంఘ కూటాల్లో యెహోవా ఇస్తున్న ట్రైనింగ్‌ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అలాగే, అనుభవం ఉన్న బోధకుల్ని మీ బైబిలు స్టడీకి తీసుకెళ్లవచ్చు. మీరు ఎక్కడ మార్పులు చేసుకోవాలో చెప్పమని వాళ్లను అడగవచ్చు. మీరు చెప్పే సమాచారం మీకు బాగా తెలుసు గానీ, మీ విద్యార్థికి మాత్రం అది కొత్త అని గుర్తుంచుకోండి. ఆ సమాచారాన్ని మీ కళ్లతో కాకుండా, మీ విద్యార్థి కళ్లతో చూడడానికి ప్రయత్నించండి. తర్వాత, మన సందేశం నిజంగానే ఒక మంచివార్త అని అర్థం చేసుకునేలా విద్యార్థికి సహాయం చేయండి. అలా చేస్తే ఆయన యెహోవాకు దగ్గరవ్వాలని కోరుకుంటాడు, నిజమైన సంతోషాన్ని సొంతం చేసుకుంటాడు.—కీర్త. 1:1-3.
16. మనం బోధనా కళను సానబెట్టుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి?
16 యెహోవా గురించి వేరేవాళ్లకు చెప్పడంలో ఉన్న ఆనందమే వేరు. సంతోషాన్నిచ్చే ఈ బోధనాపని, భవిష్యత్తులో కొత్తలోకంలో కూడా చాలా అవసరమౌతుంది. కాబట్టి మనం మంచివార్త ప్రకటిస్తుండగా ప్రజల మీద శ్రద్ధ చూపిస్తూ, దేవుని వాక్యం మీద ఆధారపడుతూ, యెహోవా వైపు వాళ్ల దృష్టిని మళ్లిస్తూ ఉందాం. అలా చేయడం ద్వారా పరిచర్యలో మన బోధనా కళను ఇంకా సానబెట్టుకోవచ్చు.
పాట 65 ప్రగతి సాధిస్తూ ఉండండి