పిల్లలు “యెహోవా ఇచ్చే ఆస్తి”
“ఆస్తి” అనే మాట వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఎంతోకాలంగా మీ కుటుంబానికి చెందిన డబ్బు, స్థలం, లేదా అలాంటి విలువైనది ఏదైనా మీకు గుర్తుకురావచ్చు. అది ఏ రూపంలో ఉన్నాసరే ఆస్తి చాలా విలువైనది, మీరు తప్పకుండా దాన్ని ఎంతో అపురూపంగా చూసుకోవాలని అనుకుంటారు.
బైబిలు పిల్లల్ని “యెహోవా ఇచ్చే ఆస్తి” అని పిలుస్తుంది. (కీర్త. 127:3) యెహోవాను ప్రేమించే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆయనిచ్చిన వెలకట్టలేని బహుమతుల్లా చూస్తారు. వాళ్లకు ఆహారం-బట్టలతో పాటు ఆరోగ్యంగా-సంతోషంగా ఉండడానికి, యెహోవాకు దగ్గరి స్నేహితులు అవ్వడానికి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చడానికి శక్తి లోపం లేకుండా కృషిచేస్తారు.
అయితే, బాధాకరంగా ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని దేవుడిచ్చిన ఆస్తిలా చూడట్లేదు. (యెష. 49:15; 2 తిమో. 3:1-3) ఇంకొంతమంది తమ పిల్లల్ని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు, కానీ కొన్నికొన్ని ఇబ్బందుల వల్ల అలా చూసుకోవడం వాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి కొన్ని ఇబ్బందులు ఏంటి? తల్లిదండ్రుల నుండి యెహోవా ఏం ఆశిస్తున్నాడు? పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ల జీవితం సంతోషంగా ఉంటుంది?
ఇబ్బందులు
బంధువుల, ఇతరుల ఒత్తిడి. కొన్ని ప్రాంతాల్లో, ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రుల్ని బాగా గౌరవిస్తారు. అందుకే బంధువులు, చుట్టుపక్కల వాళ్లు గంపెడు పిల్లల్ని కనమని పెళ్లయిన వాళ్లను ఒత్తిడి చేస్తుంటారు. దానివల్ల, పెంచడం కష్టమైనా సరే దంపతులు నలుగుర్నీ సంతోషపెట్టడానికి ఎక్కువమందిని కనాలని ఆలోచిస్తారు.
భవిష్యత్తు గురించి ఆందోళన. కొన్ని దేశాల్లో సరిపడా ఆహారం లేకపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం, వ్యాధులు ఎక్కువగా ఉండడం వల్ల శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఎక్కువమంది పిల్లల్ని కంటే కనీసం కొంతమందైనా పెద్దయ్యేవరకు బ్రతికుంటారని అక్కడి దంపతులు ఆలోచిస్తారు. ఇంకొంతమందేమో తమకు వయసు పైబడినప్పుడు తమను చూసుకుంటారనే ఉద్దేశంతో ఎక్కువమంది పిల్లల్ని కంటారు. ప్రభుత్వం నుండి వృద్ధులకు ఎలాంటి పింఛను గానీ, సహాయం గానీ దొరకని దేశాల్లో ఇలా ఎక్కువగా జరుగుతుంది.
కుటుంబ నియంత్రణ. ఇంకొన్ని ప్రాంతాల్లో, కుటుంబ నియంత్రణ పాటించడానికి ఎక్కువ ఉత్పత్తులు అందుబాటులో ఉండవు. కొంతమందేమో, అలాంటివి అందుబాటులో ఉన్నాసరే, నాసిరకం గర్భనిరోధకాలు వాడితే ఆరోగ్యం దెబ్బతింటుందని భయపడతారు. ఇంకొంతమందికి, అలాంటివాటి ఖరీదు ఎక్కువ ఉండడం వల్ల వాటిని కొనుక్కునే స్తోమత ఉండదు.a
తల్లిదండ్రుల నుండి యెహోవా ఏం ఆశిస్తున్నాడు?
మీ పిల్లల్లో ప్రతీ ఒక్కరితో సమయం గడపండి
మీ పిల్లల అవసరాలు తీర్చండి. పిల్లలు పెద్దయ్యేవరకు వాళ్లకు కావల్సిన ఆహారం, బట్టలు, వసతి ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలని, అందుకోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. అంతేకాదు, తల్లిదండ్రులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని కూడా యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల్ని హాస్టళ్లకు పంపి చేతులు దులిపేసుకోరు గానీ, పిల్లలు ఎదిగేవరకు వాళ్లను తమ దగ్గరే ఉంచుకొని, బ్రతకడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకునేలా సహాయం చేస్తారు. ప్రతీ బిడ్డతో సమయం గడుపుతూ వాళ్లకు సురక్షితంగా ఉన్నామని, అమ్మానాన్నలు తమను ప్రేమిస్తున్నారని అనిపించేలా చూసుకుంటారు. అదే సమయంలో, తల్లిదండ్రులకు బాగా డబ్బు ఉండాలని మాత్రం యెహోవా ఆశించట్లేదు. నిజానికి యెహోవా తన సొంత కుమారుణ్ణి, ఎక్కువ డబ్బు లేకపోయినా చెమటోడ్చి కష్టపడే తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు.—మత్త. 13:55, 56; లూకా 2:24.
బైబిలు సూత్రం: “ఎవరైనా తన వాళ్లకు, ముఖ్యంగా తన ఇంటివాళ్లకు అవసరమైనవి సమకూర్చకపోతే, అతను విశ్వాసాన్ని విడిచిపెట్టినట్టే; అతను అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.”—1 తిమో. 5:8.
వయసు పైబడిన తల్లిదండ్రులకు సహాయం అవసరమని యెహోవాకు తెలుసు. నిజానికి పిల్లలు తమ అమ్మానాన్నల్ని గౌరవించే ఒక పద్ధతి ఏంటంటే, వయసు పైబడినప్పుడు వాళ్లకు అవసరమైనవి అందుబాటులో ఉండేలా చూడడమే. (నిర్గ. 20:12; 1 తిమో. 5:4) అయితే, తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు తమను ఎలా చూసుకుంటారు అనేదాని గురించి కాకుండా, తాము పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేదాని గురించి ఆలోచిస్తే యెహోవా సంతోషిస్తాడు.—2 కొరిం. 12:14.
మీ పిల్లలకు యెహోవా గురించి నేర్పించండి. పిల్లలకు యెహోవాను ప్రేమించడం, ఆరాధించడం నేర్పించాల్సిన బాధ్యత కూడా క్రైస్తవ తల్లిదండ్రులకు ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సిన వాటిలో ఇది అన్నిటికన్నా ముఖ్యమైనదని యెహోవా చెప్తున్నాడు.—ద్వితీ. 6:6, 7.
బైబిలు సూత్రం: “యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని ఇస్తూ వాళ్లను [మీ పిల్లల్ని] పెంచండి.”—ఎఫె. 6:4.
యెహోవా మీకు సహాయం చేయాలని అనుకుంటున్నాడు
ఎంతమంది పిల్లలు కావాలో ముందే మాట్లాడుకోండి
ముందే ప్లాన్ చేసుకోండి. మీరు పిల్లల్ని కనాలని అనుకుంటే, మీ పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఉదాహరణకు, ఎక్కువమంది పిల్లల్ని కంటే వాళ్లందర్నీ పోషించడానికి, బట్టలు కొనడానికి, చదువు చెప్పించడానికి కావల్సిన డబ్బులు మీ దగ్గర ఉంటాయా? అలా లేకపోతే, భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకొని ఎంతమందిని కనాలో నిర్ణయించుకోండి. అలా మాట్లాడుకునేటప్పుడు, పిల్లల్లో ప్రతీ ఒక్కరిని యెహోవా కోరినట్టు పెంచగలరా అని జాగ్రత్తగా ఆలోచించండి. నిజమే, జీవితంలో ప్రతీది మనం అనుకున్నట్టు జరగదని యెహోవాకు తెలుసు. (ప్రసం. 9:11) అయితే, తాను కోరిన విధంగా పిల్లల్ని పెంచడానికి మీరు మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నాలన్నిటినీ ఆయన దీవిస్తాడు.
బైబిలు సూత్రాలు: “శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి, తొందరపాటుగా పనిచేసే వాళ్లంతా ఖచ్చితంగా పేదవాళ్లౌతారు.”—సామె. 21:5.
“మీలో ఒక వ్యక్తి భవనం కట్టాలనుకుంటే, దాన్ని పూర్తిచేయడానికి కావాల్సినంత డబ్బు తన దగ్గర ఉందో లేదో చూడడానికి ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోడా?”—లూకా 14:28.
మీ జీవితంలో యెహోవాకు మొదటి స్థానం ఇవ్వండి. మీ ఇంటివాళ్లకు యెహోవాను ఆరాధించడమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయంగా ఉండేలా చూసుకోండి. మీకు ఇప్పటికే పిల్లలు ఉంటే, సమయం తీసుకొని వాళ్లలో ప్రతీ ఒక్కరికి యెహోవాను ప్రేమించడం నేర్పించండి. మీటింగ్స్‌లో చెప్పేది శ్రద్ధగా విని అర్థంచేసుకునేలా సహాయం చేయండి. ప్రతీవారం తప్పకుండా కుటుంబ ఆరాధన చేసుకోండి. ప్రీచింగ్ ఎలా చేయాలో మీ పిల్లలకు నేర్పించండి. తల్లిదండ్రులుగా మీకున్న ఈ బాధ్యతల్ని మీ ఇంట్లో ఉన్న పెద్ద పిల్లలకో, బంధువులకో అప్పగించకండి. యెహోవాను ప్రేమించేలా పిల్లల్ని పెంచడానికి సమయం, కృషి అవసరమౌతాయి. కానీ దానివల్ల మీరు ముందుముందు చాలా సంతోషంగా ఉంటారు.
బైబిలు సూత్రం: “నా పిల్లలు సత్యంలో నడుస్తున్నారని వినడం కన్నా నాకు సంతోషకరమైన విషయం ఇంకొకటి లేదు.”—3 యోహా. 4.b
యెహోవా మీద నమ్మకం ఉంచండి. మీకు ఇప్పటికే పిల్లలు ఉన్నా, లేదా మీరు పిల్లల్ని కనాలని ఆలోచిస్తున్నా, స్థానిక కట్టుబాట్ల కన్నా యెహోవా ప్రమాణాలే ముఖ్యం అనే నమ్మకంతో ఉండండి.
యెహోవాను ఆరాధించడం-ప్రేమించడం పిల్లలకు నేర్పించడానికి సమయం, కృషి అవసరం
ఒకవేళ మీరు తక్కువమంది పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటే, అప్పుడు కూడా మీకు వయసు పైబడినప్పుడు యెహోవా మీ బాగోగులు చూసుకుంటాడనే నమ్మకంతో ఉండండి. ఇతరుల ఆలోచన ఎలా ఉన్నా, మీరు మాత్రం పిల్లల్ని ఒక “రిటైర్మెంట్ ప్లాన్‌గా” చూడకండి. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరని మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. యెహోవా మిమ్మల్ని చూసుకుంటానని మాటిచ్చాడు, ఆయన ఆ మాట మీద నిలబడతాడు.—యెహో. 23:14.
బైబిలు సూత్రాలు: “నీ నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు, నీ సొంత అవగాహన మీద ఆధారపడకు. నీ మార్గాలన్నిట్లో ఆయన్ని పరిగణనలోకి తీసుకో, అప్పుడు ఆయన నీ జీవితాన్ని సఫలం చేస్తాడు.”—సామె. 3:5, 6.
“ఒకప్పుడు నేను చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి, అయితే ఒక్క నీతిమంతుడైనా విడిచిపెట్టబడడం గానీ, అతని పిల్లలు ఆహారం కోసం భిక్షమెత్తుకోవడం గానీ నేను చూడలేదు.”—కీర్త. 37:25.
“కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు.”—మత్త. 6:33.
తల్లిదండ్రులకు యెహోవా ఇచ్చిన ఎంతో విలువైన బహుమతులే పిల్లలు. యెహోవా చెప్పిన విధంగా వాళ్లు పిల్లల్ని చూసుకుంటే ఆయన ఎంత సంతోషిస్తాడో కదా! అలాంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైనవి ఇస్తూ, వాళ్లు సంతోషంగా ఉండేలా, యెహోవాను ప్రేమించేలా పెంచుతారు. వాళ్లు ఎంతమందిని కనాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకుంటారు. అలాగే చుట్టుపక్కల వాళ్ల అభిప్రాయాల కన్నా, యెహోవా అభిప్రాయానికే ప్రాముఖ్యత ఇస్తారు. అలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో విలువైన బహుమతిగా, ‘యెహోవా ఇచ్చిన ఆస్తిగా’ చూస్తున్నామని చెప్పకనే చెప్తారు.
a ఎంతమందిని కనాలి, ఎప్పుడు కనాలి, గర్భనిరోధకాలు వాడాలా వద్దా అనేది భార్యాభర్తలే నిర్ణయించుకుంటారు. వాళ్ల వ్యక్తిగత నిర్ణయాల విషయంలో ఎవ్వరూ వాళ్లకు తీర్పుతీర్చకూడదు. (రోమా. 14:4, 10-13) అంతేకాదు, ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, పెళ్లయిన క్రైస్తవులు 1 కొరింథీయులు 7:3-5 లో ఉన్న సలహాను మనసులో ఉంచుకోవాలి.
b ఈ వచనంలో “పిల్లలు” అనే మాట, యోహాను సత్యం నేర్పించిన శిష్యుల గురించి చెప్తుంది. అయితే, యెహోవాను ప్రేమించే పిల్లల గురించి వాళ్ల తల్లిదండ్రులు కూడా అలాగే ఫీలౌతారు.