కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 ఫిబ్రవరి పేజీలు 20-25
  • బాప్తిస్మం తర్వాత వచ్చే సవాళ్లకు సిద్ధంగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బాప్తిస్మం తర్వాత వచ్చే సవాళ్లకు సిద్ధంగా ఉండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక బ్రదర్‌ లేదా సిస్టర్‌ మిమ్మల్ని బాధపెడితే
  • వదిలేసిన వాటిమీద మనసు మళ్లితే
  • వేరేవాళ్లు యెహోవాను వదిలేసి వెళ్లిపోతే
  • యెహోవా “విరిగిన హృదయంగల వాళ్లను” బాగుచేస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి దగ్గరవ్వడం మనకు మంచిది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 ఫిబ్రవరి పేజీలు 20-25

ఏప్రిల్‌ 27–మే 3, 2026

పాట 99 వేవేల ఈ ఐక్య బృందం

బాప్తిస్మం తర్వాత వచ్చే సవాళ్లకు సిద్ధంగా ఉండండి

“నన్ను నీ మార్గాల్లో నడవనివ్వు.”—కీర్త. 17:5.

ముఖ్యాంశం

కొత్తగా బాప్తిస్మం తీసుకున్నవాళ్లు, బాప్తిస్మం తర్వాత వచ్చే సవాళ్లకు ఎలా సిద్ధంగా ఉండవచ్చో చూస్తాం.

1-2. బాప్తిస్మం తీసుకున్న కొత్తలో వచ్చే సవాళ్లకు ఎలా సిద్ధపడవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

సాతాను లోకంలో మనకు తిప్పలు తప్పవు. యేసు తన అనుచరుల్ని ఇలా హెచ్చరించాడు: “ఇతరులు పాపం చేయడానికి కారణమయ్యేవి తప్పకుండా వస్తాయి.” (మత్త. 18:7) మనం ఈ హెచ్చరికను మనసులో ఉంచుకుని, ముందుముందు వచ్చే సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు ఆ సవాళ్లు తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ నుండి కూడా రావచ్చు.

2 ఈ ఉదాహరణ ఆలోచించండి. ప్రకృతి విపత్తులకు సిద్ధంగా ఉండమని సంస్థ మనకు చెప్తుంది. దానికోసం, ముందుగా మనం ఉంటున్న ప్రాంతంలో ఎలాంటి విపత్తులు రావచ్చో ఆలోచించాలి. మనం ఈమధ్యే ఊరు మారితే అలా చేయడం ఇంకా ప్రాముఖ్యం. ఎలాంటి విపత్తులు రావచ్చో ఆలోచించిన తర్వాత, అవి వస్తే ఏం చేయాలో కూడా ప్లాన్‌ చేసుకోవాలి. (సామె. 21:5) అదేవిధంగా మనం ఈమధ్యే సత్యంలోకి వస్తే, బాప్తిస్మం తీసుకున్న కొత్తలో ఎలాంటి సవాళ్లు రావచ్చో ఆలోచించాలి. ఒకవేళ అవి వస్తే ఏం చేయాలో కూడా ఇప్పుడే ఆలోచించి పెట్టుకోవాలి. అలా చేస్తే అవి నిజంగా వచ్చినప్పుడు మనల్ని కుదిపేయవు, యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేయవు. (కీర్త. 17:5) అయితే, మనకు రాగల మూడు సవాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం. వాటిలో ఒక్కోదానికి ఎలా సిద్ధపడాలో కూడా చూద్దాం.a

ఒక బ్రదర్‌ లేదా సిస్టర్‌ మిమ్మల్ని బాధపెడితే

3. బాప్తిస్మం తీసుకున్న కొత్తలో మనకు ఏ సవాలు రావచ్చు?

3 మీరు మొదటిసారి మీటింగ్‌కి వెళ్లినప్పుడు, యెహోవా ప్రజల మధ్య ప్రేమ చూసి మీకు ఎలా అనిపించిందో గుర్తుందా? ఇదే సత్యం అని మీకు అనిపించలేదా? (యోహా. 13:35; కొలొ. 3:12) బ్లెస్సీకిb కూడా అలాగే అనిపించింది. అయితే, ఆమె బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికే ఊహించనిది ఒకటి జరిగింది. ఆమె ఇలా అంటుంది: “ఒక సిస్టర్‌ నాతో కఠువుగా ప్రవర్తించింది. ఆమె వేరేవాళ్ల గురించి చెడుగా కూడా మాట్లాడేది. యెహోవాసాక్షులు శాంతిగా, ప్రేమగా ఉంటారని బైబిలు స్టడీలో నేర్చుకున్నాను. కానీ ఇలా ఉంటారని అస్సలు ఊహించలేదు.” నిజమే, మన బ్రదర్స్‌సిస్టర్స్‌ క్రైస్తవ లక్షణాల్ని పెంచుకోవడానికి కృషిచేస్తూ ఉంటారు. కానీ వాళ్లూ అపరిపూర్ణులే కదా. (ఎఫె. 4:23, 24; 1 యోహా. 1:8) కాబట్టి, ఏదోక సమయంలో వాళ్ల మాటలు లేదా పనులు మనల్ని నొప్పించవచ్చు. (యాకో. 3:8) బాధాకరంగా, కొంతమంది ఇలాంటి సవాళ్ల వల్లే యెహోవా సేవను కూడా ఆపేశారు.

4. ముందుముందు ఒక బ్రదర్‌ లేదా సిస్టర్‌ మిమ్మల్ని బాధపెడితే మీరు ఏం చేయవచ్చు? (ఎఫెసీయులు 4:32)

4 ముందుముందు ఒక బ్రదర్‌ లేదా సిస్టర్‌ మిమ్మల్ని బాధపెడితే మీరు ఏం చేయవచ్చు? దానికోసం మీరు ఇప్పుడే ఎలా రెడీగా ఉండవచ్చు? ఎఫెసీయులు 4:32 లోని సలహాను పాటించడం ఇప్పుడే అలవాటు చేసుకోండి. (చదవండి.) మీరు వేరేవాళ్ల మీద దయ, కనికరం చూపించడానికి కృషిచేస్తే, వాళ్లతో లేనిపోని గొడవలు రాకుండా ఉంటాయి. కాబట్టి, అవతలివాళ్ల తప్పుల్ని మనస్ఫూర్తిగా క్షమించాలనే లక్ష్యం పెట్టుకోండి. అలా చేయడానికి మీకు ఏది సహాయం చేస్తుంది? మీరు యెహోవాను ఎన్నిసార్లు క్షమించమని అడుగుతున్నారో, ఆయన మిమ్మల్ని ఎంత ధారాళంగా క్షమిస్తున్నాడో ఆలోచించండి. (మత్త. 6:12) అలా ఆలోచిస్తూ కృతజ్ఞత పెంచుకుంటే, వేరేవాళ్లను క్షమించడం మీకు తేలిక అవుతుంది.

5. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు, ఏ బైబిలు సలహా సహాయం చేస్తుంది? (సామెతలు 19:11) (చిత్రాలు కూడా చూడండి.)

5 సామెతలు 19:11 చదవండి. లోతైన అవగాహనc కోపాన్ని చల్లారుస్తుంది అని బైబిలు చెప్తుంది. ఈ సలహా ఈమధ్యే బాప్తిస్మం తీసుకున్న రోజా అనే సిస్టర్‌కి సహాయం చేసింది. ఆమె ఇలా అంటుంది: “బ్రదర్స్‌సిస్టర్స్‌ నన్ను బాధపెడితే లేదా చివుక్కుమనేలా మాట్లాడితే, నేను వెంటనే సామెతలు 19:11 గుర్తుచేసుకుంటాను. వాళ్ల పరిస్థితి-పెరిగిన విధానం గురించి ఆలోచించి, వాళ్లు ఎందుకలా చేసి ఉంటారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను వాళ్లతో కలిసి ప్రీచింగ్‌ కూడా చేస్తాను. అప్పుడు వాళ్లను ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాను.” అది ఎంత మంచి సలహానో కదా! మీ బ్రదర్స్‌సిస్టర్స్‌ గురించి ఇప్పుడే ఎక్కువ తెలుసుకోండి. వాళ్లను మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే, వాళ్లు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు క్షమించడం మీకు అంత తేలిక అవుతుంది.

చిత్రాలు: 1. రాజ్యమందిరం బయట క్లీనింగ్‌ చేస్తున్నప్పుడు, ఒక బ్రదర్‌ ఇంకో బ్రదర్‌ అనే మాటకు నొచ్చుకున్నాడు. 2. తర్వాత, నొచ్చుకున్న బ్రదర్‌ ఆ నొప్పించిన బ్రదర్‌తో కలిసి సంతోషంగా ఇంటింటి పరిచర్య చేస్తున్నాడు.

ఎవరైనా బ్రదర్‌ లేదా సిస్టర్‌తో మీకు మనస్పర్థలు ఉంటే, వాళ్లతో కలిసి ప్రీచింగ్‌ చేయండి (5వ పేరా చూడండి)


6. సంఘంలో స్నేహాలు విరబూయాలంటే ఏం చేయాలి?

6 సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌తో మంచిగా ఉండడానికి మీరు ఏం చేయవచ్చు? వాళ్లతో సమయం గడుపుతున్నప్పుడు, వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్నే చూడండి. (సామెతలు 10:12 పోల్చండి; రోమా. 12:10; ఫిలి. 2:2, 3) ఈమధ్యే బాప్తిస్మం తీసుకున్న మార్క్‌కి అదెలా సహాయం చేసిందో గమనించండి. ఆయన సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌తో సమయం గడిపేకొద్దీ, వాళ్లలో ఉన్న లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మరి వాళ్ల లోపాల్ని బట్టి అభ్యంతరపడకుండా ఉండడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? మార్క్‌ ఇలా అంటున్నాడు: “నేను వాళ్లలో ఉన్న చిన్నచిన్న లోపాల్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నానని అర్థమైంది. లోకంలో జరిగే నేరాలు-ఘోరాలతో పోల్చుకుంటే, ఇవి పెద్ద విషయమేం కాదు. అది అర్థం చేసుకున్నప్పటి నుండి బ్రదర్స్‌సిస్టర్స్‌లో ఉన్న లోపాల్ని చూడకూడదని ఫిక్స్‌ అయ్యాను. వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్నే చూడడం మొదలుపెట్టాను.” మీరు కూడా అలాగే ఆలోచిస్తే, సంఘంలో స్నేహాలు విరబూస్తాయి.

వదిలేసిన వాటిమీద మనసు మళ్లితే

7. వదిలేసిన వాటిమీదికి మన మనసు ఎప్పుడు మళ్లవచ్చు?

7 మొదటిసారి సత్యం తెలుసుకున్నప్పుడు, మీరు ఈ సాతాను లోకాన్ని సంతోషంగా వదిలేసి ఉంటారు. ‘ఇంతా తెలుసుకుని మళ్లీ ఎవరైనా సాతాను లోకం వైపు కన్నెత్తి చూస్తారా?’ అని కూడా మీరు అనుకుని ఉండవచ్చు. కానీ కష్టాలు వచ్చినప్పుడు, మీరు దేవుని సేవ కోసం దేన్నైతే వదులుకున్నారో అది మళ్లీ గుర్తుకురావచ్చు, ఆఖరికి అది కావాలని కూడా అనిపించవచ్చు. (సంఖ్యాకాండం 11:4-6 పోల్చండి.) ఉదాహరణకు కొంతమంది బ్రదర్స్‌, సమయాన్ని తినేసే ఉద్యోగాన్ని వదులుకుని ఉండవచ్చు. ఇంకొంతమంది, బైబిలు స్టడీ మొదలుపెట్టిన తర్వాత ప్రాణ స్నేహితుల్ని వదులుకుని ఉండవచ్చు. మరికొంతమంది వాళ్లకు ఒకలాంటి హాయినిచ్చే వ్యసనాన్ని వదులుకుని ఉండవచ్చు. ఇంతా వదులుకున్నాక ఒక క్రైస్తవుడు మళ్లీ వాటి వెనకే వెళ్లి, యెహోవాకు దూరమవ్వడం ఎంత బాధాకరమో కదా! అయితే, మనం వదిలేసిన వాటి వైపు అస్సలు చూడకూడదంటే ఇప్పుడే ఏం చేయాలి?

8. అబ్రాహాము, శారాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

8 బైబిల్లో, యెహోవా కోసం త్యాగాలు చేసిన కొంతమంది స్త్రీపురుషుల గురించి చూస్తాం. కావాలనుకుంటే వాళ్లు వదిలేసిన వాటి గురించి మళ్లీ ఆలోచించవచ్చు, కానీ వాళ్లు అలా చేయలేదు. ఉదాహరణకు మనం అబ్రాహాము, శారా విషయమే తీసుకుంటే, వాళ్లు యెహోవా మాట విని పెద్దపెద్ద ప్రాకారాలున్న ఊరు అనే నగరాన్ని విడిచిపెట్టి డేరాల్లో జీవించారు. (హెబ్రీ. 11:8, 9) నిజమే, వాళ్లకు అప్పుడప్పుడు ఊరులో ఉన్న సౌకర్యాలు గుర్తొచ్చి ఉంటాయి. కానీ వాళ్లు వాటినే “గుర్తుచేసుకుంటూ ఉండుంటే,” లేదా ఆశగా వెనక్కి చూసుంటే, ఏదోకరోజు తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లిపోయేవాళ్లే. వాళ్లు అలా వెనక్కి చూడలేదు గానీ, భవిష్యత్తు వైపే చూశారు.—హెబ్రీ. 11:15, 16.

9. తాను వదిలేసిన వాటిని అపొస్తలుడైన పౌలు ఎలా చూశాడు? (ఫిలిప్పీయులు 3:7, 8, 13)

9 అపొస్తలుడైన పౌలు యెహోవాను సేవించడానికి కొన్ని మార్పులు చేసుకున్నాడు. ఆయన క్రైస్తవుడిగా మారకముందు, అందరూ గౌరవించే ధర్మశాస్త్ర బోధకుడైన గమలీయేలు దగ్గర చదువుకున్నాడు. (అపొ. 22:3) పౌలు అదే కొనసాగించి ఉంటే, యూదా మతంలో ఎంతో ఎత్తుకు ఎదిగేవాడు. (గల. 1:13, 14) కానీ, ఆయన సత్యం తెలుసుకున్నాక వాటన్నిటినీ వదిలేశాడు. క్రైస్తవుడిగా మారిన తర్వాత ఆయన జీవితం ఏమైనా సాఫీగా సాగిందా? లేదు. ఆయన్ని చాలాసార్లు కొట్టారు, జైల్లో వేశారు, సొంత ప్రజలే ఆయన్ని ఛీ కొట్టారు. (2 కొరిం. 11:23-26) ఒకవేళ పౌలు కేవలం తన కష్టాల గురించే ఆలోచిస్తూ, ఇప్పటి జీవితాన్ని ఒకప్పటి జీవితంతో పోల్చుకుని ఉంటే, క్రైస్తవుడిగా మారకముందే అంతా బాగుందని అనుకునేవాడు. కానీ పౌలు అలా చేయలేదు. ప్రస్తుతం క్రీస్తుయేసుకు సేవచేయడం ఎంత గొప్ప భాగ్యమో ఆయన ఆలోచించాడు, అలాగే భవిష్యత్తులో పొందబోయే అద్భుతమైన బహుమతి మీద మనసుపెట్టాడు. ఆ ఆశీర్వాదాల్ని, తాను చేసిన త్యాగాల్ని త్రాసులో తూకం వేస్తే ఆశీర్వాదాలే ఎక్కువ తూగుతాయని పౌలు నమ్మాడు!—ఫిలిప్పీయులు 3:7, 8, 13 చదవండి.

10. మనం ఎప్పటికప్పుడు దేని గురించి ఆలోచించాలి? (మార్కు 10:29, 30) (చిత్రాలు కూడా చూడండి.)

10 మనకేంటి పాఠం? ఒకవేళ మీరు క్రైస్తవులుగా మారడం కోసం ఏమేం వదులుకున్నారో ఆలోచిస్తుంటే, మీరు వాటిని ఎందుకు వదులుకున్నారో కూడా ఆలోచించండి. (ప్రసం. 7:10) మీరు వదిలేసిన వాటిని, సత్యం తెలుసుకోవడం వల్ల మీరు పొందిన ఆశీర్వాదాలతో పోల్చి చూడండి. ఇప్పుడు మీరు విశ్వ సర్వాధిపతికే దగ్గరి స్నేహితులయ్యారు. (సామె. 3:32) మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే ఆధ్యాత్మిక కుటుంబం ఉంది. (మార్కు 10:29, 30 చదవండి.) అంతేకాదు, ఒక అందమైన భవిష్యత్తు మీ కోసం ఎదురుచూస్తోంది! (యెష. 65:21-23) యెహోవా సేవలో మీరు పొందే ఆశీర్వాదాల గురించి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటే, ఒకప్పుడు వదిలేసిన వాటిమీద బెంగ ఉండదు.

ఒకప్పుడు వదులుకున్న వాటివైపు ఆశగా చూసే బదులు, యెహోవా మీకు ఇచ్చిన పరిచర్యను సంతోషంగా చేయండి (10వ పేరా చూడండి)e


11. సిస్టర్‌ మేరీ అనుభవం నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

11 మేరీ అనే సిస్టర్‌ దాదాపు 50 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకుంది. ఒకప్పుడు వదులుకున్న వాటిమీద బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఆమె ఏం చేసిందో గమనించండి. ఆమె ఇలా అంటుంది: “మొదట్లో నేను క్రిస్మస్‌ని చాలా మిస్‌ అయ్యాను. ఎందుకంటే, అప్పుడు కుటుంబం అంతా ఒకచోట కలిసి సరదాగా సమయం గడిపేవాళ్లం. వాళ్లకు నేను బహుమతులు కూడా ఇచ్చేదాన్ని. పిల్లలు ఆ క్రిస్మస్‌ చెట్టు చుట్టూ చేరి వాళ్ల బహుమతులు తెరుస్తున్నప్పుడు, వాళ్ల కళ్లల్లో ఉండే ఆనందం నాకు బాగా నచ్చేది.” మరి ఆమెకు ఏది సహాయం చేసింది? మేరీ ఇలా చెప్తుంది: “క్రిస్మస్‌ మీద బెంగ పోగొట్టుకోవడానికి నాకు వేరే దారి దొరికింది. నేను ప్రతీ సంవత్సరం ఒకరోజు అనుకుని మా చుట్టాలందర్నీ పిలుస్తాను, వాళ్లకు బహుమతులు ఇస్తాను, నాకు వాళ్లంటే ఎంత ఇష్టమో చెప్తాను.” మేరీకి ఇంకో బెంగ కూడా ఉంది. ఆమె ఇలా అంటుంది: “నేను సత్యం నేర్చుకున్నప్పుడు నా పాత స్నేహితులు నన్ను వదిలేసి వెళ్లిపోయారు. కొన్నిసార్లు నేను వాళ్లను చాలా మిస్‌ అయ్యేదాన్ని, నాకు ఒంటరిగా అనిపించేది.”d మరి ఆమెకు ఏది సహాయం చేసింది? ఆమె వేర్వేరు సిస్టర్స్‌తో కలిసి ప్రీచింగ్‌కి వెళ్లింది. ఆమె ఇలా అంటుంది: “అలా చేయడం వల్ల నన్ను ప్రేమించే, నాకు విలువిచ్చే కొత్త స్నేహితులు దొరికారు.” ఆమె నుండి మీరు ఏం నేర్చుకోవచ్చు? మీరు సత్యం తెలుసుకున్న తర్వాత, మీకు ఇష్టమైనది ఏదైనా వదులుకుని ఉంటే, ఆ వెలితిని ఇంకా మెరుగైనదానితో భర్తీ చేయవచ్చు. (ఫిలి. 4:8, 9) ఎప్పుడూ దీన్ని గుర్తుపెట్టుకోండి: యెహోవా మీరు వదులుకున్న వాటికి వెయ్యింతలు కలిపి ఇస్తాడు.

వేరేవాళ్లు యెహోవాను వదిలేసి వెళ్లిపోతే

12. సంఘంలో వచ్చే ఏ సవాలును తట్టుకోవడం మీకు చాలా కష్టంగా ఉండవచ్చు?

12 మీరు యెహోవాసాక్షి అయినప్పుడు ఎడారిలాంటి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికంగా, నైతికంగా ఒయాసిస్‌ లాంటి నీళ్లున్న ప్రదేశంలోకి అడుగుపెట్టారు. అప్పుడు మీకు హాయిగా అనిపించి ఉండవచ్చు. (యెష. 65:14) అయితే, కొన్నిసార్లు సంఘంలో ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేయవచ్చు. ఆఖరికి ఆ వ్యక్తిని సంఘం నుండి తొలగించవచ్చు కూడా. (1 కొరిం. 5:13) అలాంటి పరిస్థితే వచ్చినప్పుడు తనకు ఎలా అనిపించిందో సోని అనే సిస్టర్‌ చెప్తుంది: “నేను బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికే ఒక సంఘపెద్ద ఘోరమైన పాపం చేసి సంఘం నుండి తొలగించబడ్డాడు. నేను షాక్‌ అయిపోయాను. ఒక సంఘపెద్ద అయ్యుండి ఆయన యెహోవాకు, సంఘానికి వ్యతిరేకంగా పాపం చేశాడంటే నేను నమ్మలేకపోయాను.” నిజమే, మన బ్రదర్స్‌సిస్టర్స్‌ యెహోవాను ప్రేమిస్తారని, ఆయన్ని అంటిపెట్టుకుని ఉండాలనే కోరిక వాళ్లకు ఉందని మనం నమ్మాలి. (1 కొరిం. 13:4, 7) కానీ విచారకరంగా, ప్రతీ సంవత్సరం కొంతమంది సంఘం నుండి తొలగించబడుతున్నారు. ఒకవేళ తప్పుచేసి సంఘం నుండి దూరమైనవాళ్లు, మీకు ఇష్టమైనవాళ్లో లేదా మీరు గౌరవించేవాళ్లో అయితే, అది మీకు ఇంకా కష్టంగా ఉంటుంది.

13. ముందుముందు మనవాళ్లు ఎవరైనా యెహోవా చేయి వదిలేసినా, మనం మాత్రం ఆయన చేతిని వదలకుండా ఉండడానికి ఇప్పటినుండే ఏం చేయవచ్చు?

13 ముందుముందు మీవాళ్లు ఎవరైనా యెహోవా చేయి వదిలేసినా, మీరు మాత్రం ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉండడానికి మీరు ఇప్పటినుండే ఎలా సిద్ధపడవచ్చు? మీకు, యెహోవాకు మధ్య ఉన్న స్నేహాన్ని పెంచుకుంటూ ఉండండి. (యాకో. 4:8) దేవునితో మీకున్న స్నేహం వేరేవాళ్ల విశ్వాసం మీద ఆధారపడి ఉండకూడదని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, మీరు మీ కుటుంబంతో కలిసి కుటుంబ ఆరాధన చేసుకుంటూ ఉండవచ్చు, సంఘంతో కలిసి మీటింగ్‌కి వెళ్తూ ఉండవచ్చు. కానీ అవి మాత్రమే సరిపోవు. మీకు మీరు సొంతగా ప్రతీరోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిలు చదువుకోవాలి.—కీర్త. 1:2; 62:8.

14. అపొస్తలుడైన పేతురు ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చు? (యోహాను 6:66-68)

14 మనం అపొస్తలుడైన పేతురు నుండి కూడా ఒక పాఠం నేర్చుకోవచ్చు. శిష్యుల్లో చాలామంది యేసును అనుసరించడం మానేసినా, పేతురు మాత్రం ఆయన వెంటే ఉన్నాడు. బహుశా పేతురుకు కూడా యేసు మాటలు అర్థమై ఉండకపోవచ్చు. కానీ ఆయన ఏమన్నాడో యోహాను 6:66-68 లో గమనించండి. (చదవండి.) వేరేవాళ్లు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోకుండా, యేసు తనకు నేర్పించిన సత్యాల మీద పేతురు మనసుపెట్టాడు. అందుకే పేతురు యేసును వదిలేయలేదు. అదేవిధంగా వేరేవాళ్లు చేసిన పనులవల్ల, యెహోవా సంస్థ ద్వారా మనం తెలుసుకున్న సత్యం విలువైతే ఏ మాత్రం తగ్గదు. కాబట్టి దాన్ని పట్టుకునే ఉండండి! మనం ముందు పేరాల్లో చూసిన సోని ఇలా అంటుంది: “ఎవరో ఒక్కరు తప్పు చేశారని సంఘం అంతా ఇలానే ఉంటుంది, సంస్థ అంతా ఇంతే, యెహోవా కూడా ఇలాంటివాడే అని అనుకోకూడదు. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను.”

15. ఎల్సా అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

15 ఎల్సా ఉదాహరణ గమనించండి. ఆమె బాప్తిస్మం తీసుకున్న వారం రోజులకే, వాళ్ల అమ్మ సంఘం నుండి తొలగించబడింది. దాంతో వాళ్ల అమ్మ కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఎల్సా ఇలా అంటుంది: “ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదే నా జీవితంలో అన్నిటికంటే పెద్ద కష్టం. నేను మా అమ్మను చాలా మిస్‌ అవుతున్నాను.” మరి ఎల్సాకి ఏది సహాయం చేసింది? ఆమె ఇలా అంటుంది: “నేను ఒంటరిదాన్ని కాదు. మా నాన్న నాకు అండగా నిలబడ్డాడు, నాన్నే కాదు సంఘంలో ఉన్న ప్రతీ ఒక్కరూ నాకు తోడుగా ఉన్నారు. వాళ్లే నా కుటుంబం అయ్యారు. జీవితంలో ఎవరి తుఫానులు వాళ్లకు ఉంటాయి. కాబట్టి మనం ఒకరికొకరం దగ్గరగా ఉంటూ, ప్రోత్సహించుకోవడం చాలా ప్రాముఖ్యం.” (1 పేతు. 5:9) అలా చేయాలంటే మీరు కష్టం వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పటినుండే మీ బ్రదర్స్‌సిస్టర్స్‌కి దగ్గరగా ఉండండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉన్నా మీకు ఒంటరిగా అనిపించదు.

16. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? (చిత్రం కూడా చూడండి.)

16 యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడని కూడా గుర్తుంచుకోండి. (హెబ్రీ. 12:6) సంఘం నుండి తొలగించబడిన వాళ్లందరూ తిరిగి రావాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు. (2 పేతు. 3:9) కాబట్టి మీకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా సంఘం నుండి తొలగించబడితే, వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి సంఘపెద్దలు చేయగలిగినదంతా చేస్తారనే నమ్మకంతో ఉండండి.—2 తిమో. 2:24, 25.

సంఘం నుండి తొలగించబడిన ఒకతన్ని ఇద్దరు పెద్దలు కలుస్తున్నారు. ఒక పెద్ద చేతిలో తెరిచివున్న బైబిలు ఉంది, ఇంకో పెద్ద ఆ వ్యక్తికి “యెహోవా దగ్గరకు తిరిగి రండి” బ్రోషురులో ఒక పాఠం చూపిస్తున్నాడు.

మీకు ఇష్టమైనవాళ్లు సంఘం నుండి తొలగించబడితే, వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి పెద్దలు సహాయం చేయాలనుకుంటున్నారని గుర్తుంచుకోండి (16వ పేరా చూడండి)f


17. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

17 బాప్తిస్మం తీసుకున్న తర్వాత వచ్చే కొన్ని సవాళ్ల గురించి మాత్రమే ఇప్పుడు చూశాం. నిజమే, వీటి గురించి విన్నప్పుడు మీకు గుండె దడగా అనిపించవచ్చు. కానీ మీరు భయపడడానికి ఏ కారణం లేదు, వాటికి సిద్ధపడితే సరిపోతుంది. కొండంత అండగా యెహోవా దేవుడు పక్కనే ఉన్నాడని మర్చిపోకండి. ఆయన ఇప్పటికే మీకు చాలా విషయాల్లో సహాయం చేశాడు. ఇకపై కూడా ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. (1 పేతు. 5:10) మీకు ఏ కష్టం వచ్చినా దాన్ని తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని, సహనాన్ని ఆయన ఇస్తాడు. మీరు యెహోవా సహాయాన్ని తీసుకుంటే, ఈ భూమ్మీద ఏ సవాలు కూడా మిమ్మల్ని ఆయన నుండి దూరం చేయలేదు!—కీర్త. 119:165; రోమా. 8:38, 39.

ఈ సవాళ్ల కోసం మీరెలా సిద్ధపడవచ్చు?

  • ఒక బ్రదర్‌ లేదా సిస్టర్‌ మిమ్మల్ని బాధపెడితే

  • వదిలేసిన వాటిమీద మనసు మళ్లితే

  • వేరేవాళ్లు యెహోవాను వదిలేసి వెళ్లిపోతే

పాట 154 ప్రేమ శాశ్వతమైనది

a ఈ ఆర్టికల్‌లోని విషయాలు కొత్తగా బాప్తిస్మం తీసుకున్నవాళ్ల కోసమే అయినా, ఇందులో ఉన్న విషయాలు అందరికీ పనికొస్తాయి.

b అసలు పేర్లు కావు.

c లోతైన అవగాహన అంటే పైకి కనిపించే దానికి మించి చూసే సామర్థ్యం. ఒక వ్యక్తి ఎందుకలా మాట్లాడాడో, ఎందుకలా చేశాడో అర్థం చేసుకోవడానికి ఈ లక్షణం సహాయం చేస్తుంది.

d స్టడీ ఇచ్చేవాళ్లే కాదు సంఘంలో ఉన్న ప్రతీ ఒక్కరూ బైబిలు విద్యార్థులకు, కొత్తగా బాప్తిస్మం తీసుకున్నవాళ్లకు సహాయం చేయాలి, వాళ్ల మీద ప్రేమ చూపించాలి. మార్చి 2021 కావలికోటలోని, “బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సంఘమంతా సహాయం చేయవచ్చు” అనే ఆర్టికల్‌లో 15-16 పేరాలు చూడండి.

e చిత్రాల వివరణ: పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సిస్టర్‌, ఆటలు ఆడుతున్నవాళ్లను చూసి, తాను క్రీడాకారిణిగా ఉన్న రోజుల్ని గుర్తుచేసుకుంటుంది. తర్వాత, వాళ్లలో ఒకామెకి ఆ సిస్టర్‌ సాక్ష్యం ఇస్తుంది. బహుశా ఆమె ఇదివరకు తన జట్టులో ఆడిన అమ్మాయే కావచ్చు.

f చిత్రాల వివరణ: సంఘం నుండి తొలగించబడిన ఒకాయన్ని ఇద్దరు పెద్దలు కలిసి, యెహోవా దగ్గరికి తిరిగి రమ్మని ప్రోత్సహిస్తున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి