ఏప్రిల్ 6-12, 2026
పాట 82 “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”
సత్యంలోలేని బంధువులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?
“మనం మానకుండా మంచిపనులు చేద్దాం.”—గల. 6:9.
ముఖ్యాంశం
సత్యంలోలేని బంధువులతో ఎలా మంచిగా ఉండవచ్చో, కుదిరితే వాళ్లకు యెహోవా గురించి ఎలా చెప్పవచ్చో చూస్తాం.
1-2. మనకు, సత్యంలోలేని మన బంధువులకు మధ్య ఎందుకు దూరం పెరిగి ఉండవచ్చు?
తనను అనుసరించాలని వచ్చిన ఒకతనితో యేసు ఇలా అన్నాడు: “మీ ఇంటికి వెళ్లి, యెహోవా నీ కోసం చేసినవాటన్నిటి గురించి . . . నీ బంధువులకు చెప్పు.” (మార్కు 5:19) ఏదైనా ఒక మంచి విషయం వినగానే, దాన్ని మనకు ఇష్టమైన వాళ్లందరికీ చెప్పాలనే కోరిక సహజంగానే మనుషులకు ఉంటుందని ఆయనకు తెలుసు. అందుకే యేసు అలా అన్నాడు.
2 మీరు మొదటిసారి మంచివార్త విన్నప్పుడు ఎలా అనిపించిందో గుర్తుతెచ్చుకోగలరా? బహుశా దాన్ని మీ మనసులోనే దాచుకోలేక, అందరికీ చెప్పేసి ఉంటారు కదా! అయితే మీకు ఇష్టమైనవాళ్లు మీరు చెప్పినదాన్ని సరిగ్గా పట్టించుకొని ఉండకపోవచ్చు. లేదా మీరు చెప్పిన విధానాన్ని బట్టి మీకు, వాళ్లకు మధ్య దూరం పెరిగి ఉండవచ్చు. అలాగైతే ఇటు యెహోవాకు నమ్మకంగా ఉంటూనే, అటు మీ బంధువులతోa ఎలా మంచిగా ఉండవచ్చు?
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 ఈ ఆర్టికల్‌లో, మనం నాలుగు విషయాలు చూస్తాం: (1) సత్యంలోలేని మన బంధువులు మనం చెప్పేది వినకపోయినా, వాళ్లమీద ఎలా కనికరం చూపించవచ్చు? (2) వాళ్ల మాటల్ని, పనుల్ని కాకుండా వాళ్ల మనసును ఎలా చూడవచ్చు? (3) మనం ఓర్పుతో, గుప్పెడు ఆశతో ఉంటే మన బంధువులు ఎలా సత్యంలోకి వచ్చే అవకాశం ఉంది? (4) బంధువుల మీద మనకున్న ప్రేమను బయటికి ఎలా చూపించవచ్చు?
కనికరంతో వాళ్లకు సహాయం చేయండి
4. తాను చెప్పేది విననివాళ్ల విషయంలో యేసు ఏం చేశాడు?
4 యేసు తాను చెప్పేది విననివాళ్ల విషయంలో ఆశ వదులుకోలేదు. ఆయన ఒక ఉదాహరణలో, ద్రాక్షతోటలో పనిచేసే ఒక తోటమాలితో తనను తాను పోల్చుకున్నాడు. ఆ ద్రాక్షతోటలో ఉన్న ఒక అంజూర చెట్టుకు ఆయన ఎరువు వేస్తూ, నీళ్లు పోస్తూ ఉన్నా దానికి కాయలు కాయట్లేదు. దానికోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. (లూకా 13:6-9) యేసు ఆ ఉదాహరణ చెప్పే సమయానికి, యూదుల్లో విశ్వాసం అనే ఫలాల్ని పండించడానికి మూడేళ్లకు పైగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకంత పట్టుదలగా ప్రయత్నించాడు? ఆయనకు ప్రజల మీద కనికరం ఉంది కాబట్టే అంత ఓర్పు చూపించాడు.
5. తోటి యూదుల మీద యేసు ఎందుకు కనికరం చూపించాడు?
5 దేవుని మీద నిజమైన విశ్వాసాన్ని పుట్టించాల్సిన మతనాయకులే తన తోటి యూదుల్ని పట్టించుకోవట్లేదని యేసు వాళ్ల మీద కనికరం చూపించాడు. ఆ ప్రజలు “కాపరిలేని గొర్రెల్లా” ఉండడం యేసు చూశాడు. (మార్కు 6:34) యేసు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, యెరూషలేము విషయంలో ఏడ్చాడు కూడా. ఎందుకంటే, విశ్వాసం లేకపోవడం వల్ల అక్కడున్న చాలామంది ప్రజలు చనిపోతారని ఆయనకు తెలుసు. (లూకా 19:41-44) మన బంధువుల మీద మనకు కూడా అలాంటి ప్రేమే ఉంటే, వాళ్లకు ఎలాగైనా సహాయం చేయాలనే తపన ఉంటుంది.
6. సత్యంలోలేని బంధువులతో మనం ఎందుకు ఓపిగ్గా ఉండాలి? (గలతీయులు 6:9)
6 గలతీయులు 6:9 చదవండి. బంధువులకు మనం చెప్పే విషయాలు ఇప్పుడు నచ్చకపోయినా, మనం వాళ్లతో ఓపిగ్గా ఉంటూ “మానకుండా మంచిపనులు” చేయాలి. వాళ్లలో బలంగా పాతుకుపోయిన నమ్మకాల్ని మార్చుకుని, యెహోవా మీద విశ్వాసాన్ని పెంచుకోవాలంటే టైం పడుతుంది. బహుశా, మీరు కూడా ఇంతకుముందు ‘ఏ నిరీక్షణ లేకుండా, దేవుడంటే తెలీకుండా’ జీవించి ఉంటారు కదా? (ఎఫె. 2:12) ఎవరో వచ్చి మీకు ఓపిగ్గా సహాయం చేసి యెహోవా గురించి నేర్పించారు. మరి అలాంటప్పుడు, మీరు మీ కుటుంబ సభ్యులకు సహాయం చేయకపోతే ఎలా?
వాళ్ల మాటల్ని, పనుల్ని మించి చూడండి
7. యేసు తమ్ముళ్లు ఆయన మీద విశ్వాసం ఉంచకపోవడానికి కారణం ఏమై ఉంటుంది?
7 గలిలయలో యేసు చేసిన అద్భుతాల గురించి ఆయన తమ్ముళ్లు వినే ఉంటారు. (లూకా 4:14, 22-24) కానీ, మొదట్లో వాళ్లు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. (యోహా. 7:5) ఎందుకు? ఎందుకో బైబిలు చెప్పట్లేదు. కానీ, ఆ కాలంలో కొంతమంది యూదులు యేసుకు శిష్యులు అవ్వకపోవడానికి కనీసం రెండు కారణాల్ని బైబిలు చెప్తుంది. సమాజం వాళ్లను ఎక్కడ వెలివేస్తుందో అని కొంతమంది భయపడ్డారు. (యోహా. 9:18-22) ఇంకొంతమంది యేసును చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నారు కాబట్టి, ఆయన్ని మెస్సీయగా ఊహించుకోలేకపోయారు. (మార్కు 6:1-4) యేసు తమ్ముళ్లు అలాంటి వాతావరణంలోనే పెరిగారు కాబట్టి, వాళ్లు కూడా అలానే ఆలోచించి ఉండవచ్చు. బహుశా మీ బంధువులకు కూడా అలాంటి కారణాలే ఉన్నాయేమో?
8. సత్యంలోలేని బంధువులు మనతో ఎందుకు దురుసుగా మాట్లాడవచ్చు లేదా కఠినంగా ఉండవచ్చు?
8 వాళ్ల మాటల్ని, పనుల్ని దాటి ఉద్దేశాల్ని చూడండి. యేసుకు “పిచ్చి పట్టింది” అని అన్న బంధువుల్లో, ఆయన తమ్ముళ్లు కూడా ఉండి ఉంటారు. (మార్కు 3:21) వాళ్లకు ఎందుకలా అనిపించింది? సందర్భాన్ని బట్టి చూస్తే, యేసుకు కనీసం తినడానికి కూడా తీరిక లేనంతగా ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. (మార్కు 3:20) ఇదంతా చూసి బంధువులకు, ఇలా తిండీతిప్పలు మానేసి పరిచర్య చేయడం పిచ్చిలా అనిపించి ఉండవచ్చు. మన బంధువులు కూడా మనకు మతపిచ్చి పట్టిందని అనుకోవచ్చు. ఒకవేళ వాళ్లకు అలా అనిపిస్తే, మనం కేవలం పరిచర్యకే కాదుగానీ వేరే విషయాలకు కూడా టైం పెడతామని మన పనుల్లో చూపించడం మంచిది.
9. మన బంధువులకు, కుటుంబ సభ్యులకు మన మీదున్న అభిప్రాయం మారాలంటే ఏం చేయవచ్చు? (1 పేతురు 3:1, 2) (చిత్రాలు కూడా చూడండి.)
9 మీ ప్రవర్తననే మాట్లాడనివ్వండి. మనం దయగా మాట్లాడితే, ప్రవర్తిస్తే మన బంధువులకు, కుటుంబ సభ్యులకు మన మీదున్న అభిప్రాయం మారవచ్చు. (1 పేతురు 3:1, 2 చదవండి.) ఒక సిస్టర్‌కి సత్యంలోలేని భర్త ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆమె మీటింగ్స్ అనీ ప్రీచింగ్ అనీ వెళ్లిపోతే, ఆయనకు ఒంటరిగా అనిపించవచ్చు లేదా కాస్త కోపం రావచ్చు. ఆయనకు అలా అనిపించకుండా ఉండడం కోసం, ఆయనతో ఎక్కువ టైం గడపడం కోసం ఆమె తన ఆధ్యాత్మిక పనుల్ని వేరే టైంకి మార్చుకోవచ్చు. ఉదాహరణకు, భర్త వేరే పనిలో ఉన్నప్పుడో లేదా ఉద్యోగానికి వెళ్లినప్పుడో ఆమె ప్రీచింగ్‌కి వెళ్లడానికి ఏర్పాటు చేసుకోవచ్చు. భార్య అలా మొండిపట్టు పట్టకుండా, మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆ భర్తకు యెహోవాసాక్షుల మీద మంచి అభిప్రాయం కలగవచ్చు.
మనం దయగా మాట్లాడితే, ప్రవర్తిస్తే సత్యంలోలేని భర్తకు/భార్యకు సాక్షుల మీదున్న అభిప్రాయం మారవచ్చు (9వ పేరా చూడండి)g
10. నలుగురూ నాలుగు రకాలుగా అన్నప్పుడు యేసులాగే మనం ఏం చేయవచ్చు?
10 నలుగురూ నాలుగు రకాలుగా అన్నా, ప్రతీ దానికి జవాబివ్వాలని చూడకండి. యేసును తిండిబోతు, తాగుబోతు అని అన్నప్పుడు ఆయన వాళ్లకు ఏ జవాబూ ఇవ్వలేదు. బదులుగా, నిజానిజాలేంటో తెలుసుకోమని ప్రజలకే వదిలేశాడు. (మత్త. 11:19) ఆయన ఏదీ అతిగా చేయట్లేదని తన జీవితం ద్వారానే చూపించాడు. (యోహాను 2:2, 6-10 పోల్చండి.) అదేవిధంగా, నలుగురూ నాలుగు రకాలుగా అన్నా ప్రతీ దానికి జవాబివ్వాలని అనుకోకండి. బదులుగా మీరు ఏదీ అతిగా చేయట్లేదని, సంతోషంగా ఉన్నారని మీ పనుల ద్వారా చూపించండి. మీ బంధువులు వాళ్లంతట వాళ్లే అది తెలుసుకునేలా చేయండి. అప్పుడు, మన గురించి విన్న విషయాలు తప్పని వాళ్లు అర్థం చేసుకునే అవకాశం ఉంది.
ఓర్పుతో, గుప్పెడు ఆశతో ఉండండి
11. యేసు తన తమ్ముళ్లతో ఎలా ఉన్నాడు?
11 యేసు తన తమ్ముళ్లతో ఓపిగ్గా ఉన్నాడని సువార్త పుస్తకాలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు, కానాలో యేసు మొదటి అద్భుతాన్ని చేసినప్పుడు, బహుశా వాళ్లు కూడా ఉండి ఉంటారు. (యోహా. 2:11, 12) కానీ, మనం ముందు పేరాల్లో చూసినట్టు వాళ్లు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. అంతమాత్రాన, యేసు వాళ్లతో బంధాలు తెంచేసుకోలేదు. కానాలో మొదటి అద్భుతం చేసిన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కూడా, యేసు తన తమ్ముళ్లతో దయగా మాట్లాడడం మనం బైబిల్లో చూస్తాం.—యోహా. 7:5-8.
12. ఏదోక రోజు మన బంధువుల్లో కొంతమంది మారతారని మనం ఎందుకు గుప్పెడు ఆశతో ఉండవచ్చు?
12 మనం యెహోవా కరుణ గురించి ఈమధ్య ఎక్కువ తెలుసుకుంటున్నాం కాబట్టి, బంధువుల విషయంలో ఒకింత ఆశతో ఉండవచ్చు. మహాశ్రమ మొదలయ్యాక కూడా కొంతమంది ప్రజలు యెహోవా వైపు నిలబడే అవకాశం ఉందని ఈమధ్యకాలంలో మనం తెలుసుకున్నాం. అబద్ధ మతం నాశనమైనప్పుడు మన బంధువులు, ‘దీని గురించే కదా వాళ్లు మనకు చెప్పింది’ అని గుర్తుచేసుకోవచ్చు.b (ప్రక. 17:16) మహాశ్రమ మొదలయ్యాక, వాళ్లు మనతో కలిసి యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకోవచ్చు. అంతేకాదు, ఇప్పుడు మన బంధువులకు ఏదైనా కష్టం వచ్చినా మనం రెక్కలు కట్టుకుని వాలిపోతాం. వాళ్ల మీద మనకు నిజమైన ప్రేమ, నిజమైన దయ ఉన్నాయని చూసినప్పుడు, వాళ్లు బైబిలు సత్యాల్ని వినడానికి ఎక్కువ ఇష్టపడవచ్చు.
మీ ప్రేమను బయటికి చూపించండి
13. యెహోవా సేవలో ఎంత బిజీగా ఉన్నా, మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?
13 మనం యెహోవా సేవలో బిజీగా ఉండవచ్చు. అంతమాత్రాన, బంధువుల కోసం టైం పెట్టట్లేదని, వాళ్లను మనం ప్రేమించట్లేదని వాళ్లకు అనిపించకూడదు. (మత్త. 7:12) మరి వాళ్లను పట్టించుకుంటున్నామని ఎలా చూపించవచ్చు? కొన్ని మార్గాల్ని ఇప్పుడు చూద్దాం.
14-15. సత్యంలోలేని బంధువుల్ని ప్రేమిస్తున్నామని చూపించడానికి ఒక మార్గం ఏంటి? ఒక ఉదాహరణ చెప్పండి.
14 ఎప్పటికప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి, ప్రేమ చూపించండి. మన బంధువులతో ఎప్పటికప్పుడు మాట్లాడడం ద్వారా మనం వాళ్ల మీద ప్రేమ చూపించవచ్చు. ఉదాహరణకు, మనం వాళ్లకు మెసేజ్ చేయవచ్చు. ఈమధ్యే ఏదైనా ఊరు వెళ్లొచ్చినా, ఫ్రెండ్స్‌తో పిక్నిక్కి వెళ్లినా, ఆ ఫోటోల్ని మనం వాళ్లకు పెట్టవచ్చు. అలాగే, వాళ్లకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వవచ్చు లేదా వాళ్లను మెచ్చుకుంటూ ఉత్తరం రాయవచ్చు. ఇవన్నీ చేస్తే, మనం వాళ్లకు ఇంకా దగ్గరౌతాం. మనమే చొరవ తీసుకుని అలా చేసినప్పుడు, మనం వాళ్లను ప్రేమిస్తున్నామని చెప్పకనే చెప్తాం.
15 అర్మేనియాలో ఉంటున్న యానా అనే సిస్టర్ ఉదాహరణ చూడండి. వాళ్ల బంధువులంతా కలిసి సమయం గడపడం వాళ్లకు అలవాటు. పుట్టిన రోజులు, పండుగలు గురించైతే వేరే చెప్పనక్కర్లేదు. యానా సత్యంలోకి వచ్చినప్పుడు, ఇక వాళ్ల బంధాలు తెగిపోతాయేమో అని బంధువులంతా కంగారుపడ్డారు. అంతేకాదు, ఆమె యెహోవాసాక్షి అవ్వడం వల్ల ఆమె భవిష్యత్తు ఏమైపోతుందో అని కూడా వాళ్లు టెన్షన్ పడ్డారు. మరి వాళ్ల భయాలు తగ్గించడానికి యానా ఏం చేసింది? ఆమె ఇలా అంటుంది: “నేను నా బంధువుల దగ్గరికి వెళ్లినప్పుడు, నా లైఫ్ ఎలా గడుస్తుందో, నేను ఎంత బిజీగా ఉంటున్నానో చెప్తాను. అంతేకాదు, వాళ్లను మా ఇంటికి పిలిచి మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని పరిచయం చేస్తాను. దానివల్ల మా బంధువుల్లో చాలామందికి మన బ్రదర్స్‌సిస్టర్స్ తెలుసు, ఇంకా వాళ్లతో సొంతవాళ్లలా కలిసిపోతారు.” ఆమె ఇంకా ఇలా అంటుంది: “చాలామంది బంధువులు నేను భలే సంతోషంగా ఉన్నాను అంటుంటారు. ఇక వాళ్లకు నా గురించి టెన్షన్ లేదు.”
16. యేసు తన తమ్ముడైన యాకోబు మీద ఎలా శ్రద్ధ చూపించాడు? (అధస్సూచి కూడా చూడండి.)
16 వాళ్ల మీద శ్రద్ధ చూపించండి. చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత, యేసు తన తమ్ముడైన యాకోబుకు విడిగా కనిపించడం ద్వారా ఆయన మీద శ్రద్ధ చూపించాడు. (1 కొరిం. 15:7) యేసు తనమీద ఇంకా శ్రద్ధ చూపిస్తున్నందుకు యాకోబుకు ఎలా అనిపించి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ క్షణంలో, యాకోబుకు యేసే మెస్సీయ అని నమ్మకం కుదిరి ఉంటుంది. ఆ తర్వాత, యాకోబు తన కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులకు కూడా యేసే మెస్సీయ అని అర్థం చేసుకునేలా సహాయం చేసి ఉంటాడు.c—అపొ. 1:14.
17. రోమీయులు 12:15 లో ఉన్న సలహాను మనం ఎలా పాటించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
17 రోమీయులు 12:15 చదవండి. మన బంధువులతో ఆటపాటల్లోనే కాదు, ఆటుపోటుల్లో కూడా వెన్నంటే ఉన్నప్పుడు వాళ్లకు మన మీదున్న అభిప్రాయం మారవచ్చు.d ఉదాహరణకు, వాళ్లకు పిల్లలు పుట్టినప్పుడు కంగ్రాట్స్ చెప్పవచ్చు, అలాగే మనం కూడా సంతోషిస్తున్నాం అని చెప్పడానికి గిఫ్ట్ ఇవ్వవచ్చు. ఇష్టమైన వాళ్లెవరైనా చనిపోయి మన బంధువులు బాధపడుతుంటే వాళ్లకు ధైర్యం చెప్పవచ్చు, అవసరమైనవి ఇవ్వవచ్చు, నాలుగు ఓదార్పు మాటల్ని కార్డు మీద రాసి ఇవ్వవచ్చు. మరిముఖ్యంగా, వాళ్లు ఏదైనా కష్టంలో ఉంటే ఎప్పటికప్పుడు ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోవచ్చు.
మీ బంధువులకు బాగా కావల్సినప్పుడు మీరు పక్కన ఉంటే వాళ్లకు మీ మీద, మీ నమ్మకాల మీద ఉన్న అభిప్రాయం మారవచ్చు (17వ పేరా చూడండి)h
18. అంద్రెయలాగే మనం కూడా ఏం చేయవచ్చు?
18 వాళ్లను బ్రదర్స్‌సిస్టర్స్‌కి పరిచయం చేయండి. శిష్యుడైన అంద్రెయ యేసును మెస్సీయ అని గుర్తుపట్టిన తర్వాత, వెంటనే వెళ్లి తన సహోదరుడైన పేతురును కూడా యేసుకు పరిచయం చేశాడు. (యోహా. 1:40-42) మనం కూడా అదే చేయవచ్చు. ఉదాహరణకు, మన బంధువుల్ని మీటింగ్‌కి రమ్మని చెప్పవచ్చు, లేదా మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో పాటు వాళ్లను కూడా భోజనానికి పిలవవచ్చు. మన బంధువుల్ని బ్రదర్స్‌సిస్టర్స్‌కి పరిచయం చేసినప్పుడు యెహోవాసాక్షులు కూడా మామూలు ప్రజలే అని, మంచి-మర్యాద తెలిసినవాళ్లే అని వాళ్లు గుర్తుపట్టగలుగుతారు.
19. మన బంధువులకు మన నమ్మకాలు పూర్తిగా అర్థం కాకపోయినా, మనం వాళ్లతో ఎలా ఉండాలి? (1 పేతురు 3:15)
19 మొదటి పేతురు 3:15 చదవండి. మనం కొన్ని పనులు ఎందుకు చేయమో మన బంధువులకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కానీ మనం దయగా, మర్యాదగా చెప్పిన విధానాన్ని మాత్రం వాళ్లు ఎప్పటికీ మర్చిపోరు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో మనం వాళ్లకు టైం ఇవ్వలేకపోయినా, వేరే సందర్భాల్లో వాళ్లతో సమయం గడపడానికి మనం కృషిచేస్తే వాళ్లు సంతోషిస్తారు. ఉదాహరణకు బైబిలుకు విరుద్ధమైన పండుగల్లో, ఆచారాల్లో మనం వాళ్లతో కలిసి పాల్గొనకపోవచ్చు. కానీ వేరే టైంలో వాళ్లను కలవవచ్చు, వాళ్లతో కలిసి భోజనం చేయవచ్చు, వాళ్లకు గిఫ్ట్స్ ఇవ్వవచ్చు.
మీ బంధువుల మీద ఆశ వదులుకోకండి
20. యాకోబు ఉదాహరణ మనలో ఏ ఆశను నింపుతుంది?
20 యాకోబు యేసుతో కలిసి పనిచేసే బంగారు అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కానీ, తర్వాత్తర్వాత ఆయన యేసుకు శిష్యుడయ్యాడు. (గల. 1:18, 19; 2:9) యాకోబు యేసు తొలి శిష్యుల్లో ఒకడు కాకపోయినా, యేసు బోధల్ని మనసుకు తీసుకున్నాడని తెలుస్తుంది. ఉదాహరణకు, ఆయన పవిత్రశక్తి ప్రేరణతో రాసిన ఉత్తరాన్ని గమనిస్తే, అందులో యేసు కొండమీది ప్రసంగంలో చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి.e
21. సత్యంలోలేని బంధువుల మీద మనం ఎందుకు ఆశ వదులుకోకూడదు?
21 మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, మన బంధువులు సత్యం మీద ఆసక్తి చూపించకపోవచ్చు. మనం వాళ్లమీద ఎంత శ్రద్ధ చూపించినా, వాళ్లు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అయినా సరే, మనం వాళ్లమీద ఎందుకు ఆశ వదులుకోకూడదు? ఎందుకంటే, వాళ్లమీద దయ చూపించిన ప్రతీసారి మన కరుణగల దేవుడైన యెహోవాను, ఆయన కుమారుడైన యేసును మనం అనుకరిస్తున్నట్టే. (లూకా 6:33, 36) అదీగాక సమయం గడుస్తుండగా, మనం చూపించే ప్రేమవల్ల వాళ్లకు మన మీదున్న అభిప్రాయం మారవచ్చు. అంతకుముందు మనం వాళ్లకు చెప్పిన నమ్మకాల్ని వాళ్లు గుర్తుపెట్టుకోవచ్చు కూడా. మనం ఆశ వదులుకోకుండా సహాయం చేస్తూనే ఉంటే, ఏదోక రోజు వాళ్లు కూడా సత్యారాధనలో మనతో కలిసి అడుగులు వేయవచ్చు. అది కళ్లారా చూసే ఆనందం మనకు దక్కుతుంది!
పాట 60 జీవాన్నిచ్చే వార్త చాటిద్దాం
a ఇక్కడ బంధువులు అంటున్నప్పుడు కేవలం చుట్టాలే కాదు, కుటుంబ సభ్యులు కూడా వస్తారు.
b మే 2024 కావలికోటలోని “భవిష్యత్తులో యెహోవా తీర్పులు” అనే ఆర్టికల్‌లో, 11వ పేజీ, 11-13 పేరాలు చూడండి.
c యేసు పునరుత్థానమైన తర్వాత ఆయన తమ్ముళ్లలో కనీసం ఇద్దరు అంటే యాకోబు, యూదా సత్యంలోకి వచ్చారు.
d “మీరు వాళ్ల పెళ్లిళ్లకు లేదా అంత్యక్రియలకు వెళ్తారా?” అనే బాక్సు చూడండి.
e యాకోబు 1:2 ని మత్తయి 5:11, 12 తో; యాకోబు 1:19 ని మత్తయి 5:22 తో; యాకోబు 1:22; 2:24 ని మత్తయి 7:21 తో; యాకోబు 2:13 ని మత్తయి 5:7; 6:14, 15 తో పోల్చండి.
f అలాంటి విషయాల్లో ఏం చేయాలో తెలుసుకోవడానికి, మే 15, 2002 అలాగే నవంబరు 15, 2007 కావలికోట పత్రికల్లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.
g చిత్రాల వివరణ: ప్రీచింగ్‌కి వెళ్లే ముందు, ఒక సిస్టర్ సంతోషంగా తన భర్తకు భోజనం సిద్ధం చేస్తుంది.
h చిత్రాల వివరణ: ఆ సిస్టర్ సమయం తీసుకుని, సత్యంలోలేని తన అత్తయ్యను చూడడానికి వెళ్లింది.