అధ్యయన ఆర్టికల్ 30
పాట 97 దేవుని మాట వల్లే జీవిస్తాం
ప్రాథమిక బైబిలు సత్యాల నుండి మీరు ఇప్పటికీ ఎంతో నేర్చుకోవచ్చు
“మీకు ఈ విషయాలు తెలిసినా సరే, మీరు నేర్చుకున్న సత్యంలో మీరు దృఢంగా ఉన్నా సరే, వాటిని మీకు గుర్తుచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.” —2 పేతు. 1:12.
ముఖ్యాంశం
కొన్నేళ్ల క్రితం నేర్చుకున్న ప్రాథమిక బైబిలు సత్యాల్ని ఇప్పటికీ ఎలా పాటించవచ్చో చూస్తాం.
1. మీరు మొదటిసారి ప్రాథమిక బైబిలు సత్యాల్ని తెలుసుకున్నప్పుడు ఎలా అనిపించింది?
ప్రాథమిక బైబిలు సత్యాలు మన జీవితాల్ని పూర్తిగా మార్చేశాయి. ఉదాహరణకు, దేవుని పేరు యెహోవా అని తెలుసుకున్నప్పుడు ఆయనతో స్నేహానికి తొలి అడుగువేశాం. (యెష. 42:8) చనిపోయినవాళ్ల పరిస్థితి తెలుసుకున్నాక ఇక వాళ్లు ఎక్కడో బాధలు పడుతున్నారు అనే అనుమానం వదిలేశాం. (ప్రసం. 9:10) భూమ్మీద అందమైన పరదైసు ఇస్తానని దేవుడు ఇచ్చిన మాట తెలుసుకున్నప్పుడు, రేపటి గురించి చింతించడం ఆపేశాం. అంతేకాదు మనం 70, 80 సంవత్సరాలు ముక్కీమూలిగి బ్రతకడం కాదు శాశ్వతకాలం సంతోషంగా బ్రతుకుతామని నమ్మకం కుదిరింది.—కీర్త. 37:29; 90:10.
2. రెండో పేతురు 1:12, 13 చెప్తున్నట్టు, సత్యంలో నాటుకుపోయిన క్రైస్తవులు కూడా ప్రాథమిక బైబిలు సత్యాల నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?
2 ప్రాథమిక బైబిలు సత్యాల్ని మనం ఎప్పుడూ చులకనగా చూడకూడదు. అపొస్తలుడైన పేతురు తన రెండో ఉత్తరాన్ని “సత్యంలో” బాగా నాటుకుపోయిన క్రైస్తవులకు రాశాడు. (2 పేతురు 1:12, 13 చదవండి.) అయితే, ఇప్పుడు వాళ్లు సంఘంలోనే అబద్ధ బోధకుల వల్ల అలాగే దైవభక్తిలేని మనుషుల వల్ల ఆధ్యాత్మిక ప్రమాదాల్ని ఎదుర్కొన్నారు. (2 పేతు. 2:1-3) వాళ్లను ఆ ముప్పు నుండి కాపాడి, బలపర్చాలని పేతురు అనుకున్నాడు. దానికోసం ఆయన వాళ్లకు అప్పటికే తెలిసిన కొన్ని సత్యాల్ని గుర్తుచేశాడు. వాటివల్ల వాళ్లు చివరివరకు నమ్మకంగా ఉండగలిగారు.
3. మనందరం ప్రాథమిక బైబిలు సత్యాల గురించి ఎందుకు ఆలోచిస్తూనే ఉండాలి? ఉదాహరణ చెప్పండి.
3 మనం సత్యంలో చాలాకాలంగా నాటుకుపోయి ఉన్నా, ప్రాథమిక బైబిలు సత్యాల నుండి కొత్తకొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉండవచ్చు. ఉదాహరణకు, వంటలు చేయడంలో చేయి తిరిగిన ఒక తల్లి అలాగే అప్పుడప్పుడే వంట నేర్చుకుంటున్న కూతురు ఒకేరకమైన పదార్థాలతో వంట చేశారు. కానీ ఆ తల్లికి ఎప్పటినుండో వంట చేసిన అనుభవం ఉంది కాబట్టి అవే పదార్థాలు ఉపయోగిస్తూ రకరకాల వంటలు ఎలా చేయాలో ఆమెకు తెలుసు. అదేవిధంగా, ఎప్పటినుండో యెహోవా సేవ చేస్తున్నవాళ్లు, కొత్తగా బైబిలు స్టడీ తీసుకుంటున్నవాళ్లు ప్రాథమిక బైబిలు సత్యాల్ని చూసే విధానం వేరుగా ఉండొచ్చు. మనం బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి మన పరిస్థితులు లేదా సేవావకాశాలు మారి ఉండవచ్చు. మనం ఒకప్పుడు నేర్చుకున్న బైబిలు సత్యాల్ని ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి అన్వయించినప్పుడు దాంట్లో కొత్త పాఠాల్ని నేర్చుకుంటాం. ఎప్పటినుండో సత్యంలో నాటుకుపోయిన క్రైస్తవులు మూడు ప్రాథమిక బైబిలు సత్యాల నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
యెహోవాయే సృష్టికర్త
4. యెహోవాయే సృష్టికర్త అని తెలుసుకున్నప్పుడు మనకు ఎలా అనిపించింది?
4 “అన్నిటినీ కట్టింది దేవుడే.” (హెబ్రీ. 3:4) భూమిని, భూమ్మీదున్న జీవాన్ని తయారుచేసింది సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు అయిన ఒక సృష్టికర్త అని మనకు తెలుసు. ఆయనే మనల్ని చేశాడు. కాబట్టి మన అణువణువూ ఆయనకు తెలుసు. అంతేకాదు ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు. మనకు ఏది బెస్ట్ అనేది ఆయనకు బాగా తెలుసు. యెహోవాయే మన సృష్టికర్త అనే వాస్తవం మన జీవితానికి ఒక నిజమైన అర్థాన్ని, ఉద్దేశాన్ని ఇస్తుంది.
5. ఏ సత్యం మనలో వినయం పుట్టిస్తుంది? (యెషయా 45:9-12)
5 యెహోవాయే మన సృష్టికర్త అనే సత్యం మనకు వినయం నేర్పిస్తుంది. ఒకానొక సందర్భంలో, యోబు తన గురించి, ఇతరుల గురించి మరీ ఎక్కువగా ఆలోచించాడు. అప్పుడు, యెహోవా తానొక సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అనే విషయాన్ని యోబుకు గుర్తుచేశాడు. (యోబు 38:1-4) దీనివల్ల యెహోవా ఏం చేసినా సరైనదే చేస్తాడని యోబు అర్థం చేసుకోగలిగాడు. ఆ తర్వాత, దీనిగురించే యెషయా ప్రవక్త కూడా రాశాడు: “బంకమట్టి కుమ్మరివాడితో, ‘నువ్వు ఏం తయారు చేస్తున్నావు?’ అని అనొచ్చా?”—యెషయా 45:9-12 చదవండి.
6. మన సృష్టికర్త ఎంత తెలివైనవాడో, శక్తిమంతుడో ఆలోచించడం ఎలాంటప్పుడు ముఖ్యం? (చిత్రాలు కూడా చూడండి.)
6 యెహోవా సేవలో ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ, కొంతమంది నిర్దేశం కోసం యెహోవా వైపు, బైబిలు వైపు చూసే బదులు తమను తామే ఎక్కువగా నమ్ముకుంటారు. (యోబు 37:23, 24) కానీ వాళ్లు సృష్టికర్తకున్న సాటిలేని తెలివి, గొప్పతనం గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? (యెష. 40:22; 55:8, 9) ఆ సత్యం, వాళ్లు నేలమీద ఉండేలా చేస్తుంది. వాళ్ల ఆలోచనల కన్నా యెహోవా ఆలోచనలే గొప్పవని గుర్తించేలా చేస్తుంది.
మన సొంత ఆలోచనలు-అభిప్రాయాల కన్నా యెహోవా ఆలోచనలు చాలా గొప్పవని గుర్తించడానికి ఏది సహాయం చేస్తుంది? (6వ పేరా చూడండి)e
7. నిర్దేశంలో వచ్చిన మార్పుకు అలవాటుపడడానికి రీటాకు ఏది సహాయం చేసింది?
7 స్లొవేనియాలో ఉంటున్న రీటాa అనే సిస్టర్ అనుభవం చూడండి. ఆమె సృష్టికర్త గురించి ఆలోచించడం వల్ల సంస్థలో వచ్చిన మార్పుల్ని జీర్ణించుకోగలిగింది. ఆమె ఇలా ఒప్పుకుంటుంది: “కొన్నిసార్లు నాయకత్వం వహిస్తున్న సహోదరులు తీసుకున్న నిర్ణయాల్ని ఒప్పుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, 2023 పరిపాలక సభ అప్డేట్ #8 చూసిన తర్వాత కూడా ఒక బ్రదర్ గడ్డంతో ప్రసంగం ఇస్తుంటే నేను షాక్ అయ్యాను. కాబట్టి ఈ మార్పుకు అలవాటుపడేలా సహాయం చేయమని యెహోవాను అడిగాను.” ఆకాశాన్ని, భూమిని సృష్టించిన యెహోవా తన సంస్థను సరైన దిశలో నడిపించగల సమర్థుడని రీటా గుర్తించింది. మీకు కూడా కొత్త అవగాహనకు లేదా కొత్త నిర్దేశానికి అలవాటుపడడం కష్టంగా ఉంటే మన సృష్టికర్తకు ఉన్న అసాధారణమైన తెలివి, శక్తి గురించి వినయంగా ఆలోచించండి.—రోమా. 11:33-36.
దేవుడు బాధల్ని ఎందుకు ఉండనిస్తున్నాడు?
8. దేవుడు బాధల్ని ఎందుకు ఉండనిస్తున్నాడో తెలుసుకోవడం మనకు ఎలాంటి ప్రయోజనాల్ని తెచ్చిపెట్టాయి?
8 దేవుడు బాధల్ని ఎందుకు ఉండనిస్తున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు తెలియని చాలామంది దేవుని మీద కోపం తెచ్చుకుని, అసలు ఆయన లేనేలేడు అనే ముగింపుకు వచ్చారు. (సామె. 19:3) కానీ మీకైతే మన బాధలకు కారణం పాపం, అపరిపూర్ణతే గానీ యెహోవా కాదని తెలుసు. అంతేకాదు, యెహోవా ఓపిక పట్టడం వల్ల లక్షలమంది ఆయన గురించి, బాధల్ని ఆయన శాశ్వతంగా ఎలా తీసేస్తాడు అనే దానిగురించి తెలుసుకోగలిగారు. (2 పేతు. 3:9, 15) ఈ సత్యాలు మీకు ఎంతో ఊరటను ఇచ్చాయి, యెహోవాకు ఇంకా దగ్గర చేశాయి.
9. యెహోవా బాధల్ని ఉండనివ్వడానికి గల కారణాల్ని మనం ఏ సందర్భాల్లో గుర్తుచేసుకోవాలి?
9 యెహోవా ఈ బాధలన్నీ తీసేంతవరకు మనం ఓపిక పట్టడం చాలా అవసరమని అర్థం చేసుకున్నాం. కానీ కొన్నిసార్లు మనకు గానీ, మనవాళ్లకు గానీ ఏదైనా బాధ, అన్యాయం, నష్టం జరిగినప్పుడు అసలు యెహోవా ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడని అనిపిస్తుంది. (హబ. 1:2, 3) అలా అనిపించినప్పుడు, యెహోవా బాధల్ని ఉండనివ్వడానికి గల కారణాల గురించి ఆలోచించడం తెలివైన పని.b (కీర్త. 34:19) అంతేకాదు, బాధల్ని శాశ్వతంగా తీసేయాలనే ఆయన సంకల్పం గురించి కూడా మనం ఆలోచించాలి.
10. అమ్మ చనిపోయిన బాధను యాన్ ఎలా తట్టుకోగలిగింది?
10 దేవుడు బాధల్ని ఎందుకు ఉండనిస్తున్నాడు అనే సత్యం తెలుసుకుంటే మనం కష్టాల్ని తట్టుకోగలుగుతాం. ఇండియన్ ఓషియన్లోని మయోటె అనే ద్వీపంలో ఉంటున్న యాన్ ఇలా గుర్తుచేసుకుంటుంది: “కొన్నేళ్ల క్రితం మా అమ్మ చనిపోయినప్పుడు నేను పడ్డ బాధ మాటల్లో చెప్పలేను. కానీ ఆ బాధకు కారణం యెహోవా కాదని నేను పదేపదే గుర్తుచేసుకుంటూ ఉన్నాను. మనకు వచ్చే ఏ బాధనైనా తీసేయడానికి, మనవాళ్లను తిరిగి బ్రతికించడానికి యెహోవా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఈ సత్యాల గురించి లోతుగా ఆలోచించినప్పుడు నాకు కలిగే మనశ్శాంతి చూసి, అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యమేస్తుంది.”
11. యెహోవా బాధల్ని ఎందుకు ఉండనిస్తున్నాడో తెలుసుకోవడం మనం ప్రీచింగ్ చేస్తూ ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది?
11 దేవుడు బాధల్ని ఎందుకు ఉండనిస్తున్నాడు అనే సత్యం తెలుసుకున్నప్పుడు, మనం ప్రీచింగ్ చేస్తూనే ఉండాలనే ప్రేరణ కలుగుతుంది. యెహోవా ఓపిక పట్టడం వల్ల, పశ్చాత్తాపం చూపించినవాళ్లకు రక్షణ దొరుకుతుందని పేతురు వివరించాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలో ఆలోచించండి. మీరు పవిత్రంగా నడుచుకుంటూ, దైవభక్తిగల పనులు చేస్తూ ఉండాలి.” (2 పేతు. 3:11) ఈ దైవభక్తిగల పనుల్లో ప్రీచింగ్ కూడా ఒకటి. మనకు కూడా మన తండ్రిలాగే ప్రజలంటే ప్రాణం. కాబట్టి వాళ్లు కూడా కొత్తలోకంలో ఉండాలని మనం కోరుకుంటాం. మీ వీధిలో ఉన్నవాళ్లకు కూడా దేవుణ్ణి ఆరాధించే అవకాశం దొరకాలని యెహోవా ఓపిక పడుతున్నాడు. అంతం రాకముందే వీలైనంత ఎక్కువమంది ఆయన గురించి తెలుసుకునేలా సహాయం చేస్తూ, దేవుని తోటి పనివాళ్లుగా ఉండే గొప్ప అవకాశం మీకు ఉంది.—1 కొరిం. 3:9.
మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నాం
12. మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామని తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం?
12 “చివరి రోజుల్లో” ప్రజలు ఎలా ఉంటారో బైబిలు స్పష్టంగా చెప్పింది. (2 తిమో. 3:1-5) బైబిలు చెప్పింది నిజం అనడానికి మన చుట్టూవున్న జనాల్ని చూస్తే సరిపోతుంది. వాళ్ల ఆలోచనలు, ప్రవర్తన రోజురోజుకూ దిగజారిపోవడం చూసినప్పుడు బైబిలు చెప్పింది నిజమనే మన నమ్మకం ఇంకా బలపడుతుంది.—2 తిమో. 3:13-15.
13. లూకా 12:15-21 లో యేసు చెప్పిన ఉదాహరణ ప్రకారం, మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి?
13 మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామనే సత్యం తెలుసుకోవడం వల్ల, జీవితంలో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలో తెలిసింది. లూకా 12:15-21 లో యేసు చెప్పిన ఉదాహరణ నుండి, మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుసుకోవచ్చు. (చదవండి.) దేవుడు ఆ ధనవంతుణ్ణి “తెలివితక్కువవాడా” అని ఎందుకు అన్నాడు? ఆయన దగ్గర బాగా డబ్బు ఉన్నందుకు కాదుగానీ, ఆయన ముఖ్యమైన వాటికి కాకుండా వేరే విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు కాబట్టి అలా అన్నాడు. ఆయన “దేవుని దృష్టిలో కాకుండా . . . తన కోసమే సంపదలు కూడబెట్టుకున్నాడు.” ఆయన తన సమయాన్ని తెలివితక్కువగా వాడడం ఎందుకంత పెద్ద తప్పు? ఎందుకంటే, ఆయన బ్రతకడానికి ఎక్కువ రోజులు లేవు. దేవుడు అతనితో ఇలా అన్నాడు: “ఈ రాత్రి నీ ప్రాణం తీసేయబడుతుంది.” ఈ కథ నుండి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ వ్యవస్థ నాశనానికి కూడా ఎక్కువ రోజులు లేవు. కాబట్టి మన సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. దానికోసం మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను అన్నిటికంటే ముఖ్యమైన విషయాల మీద మనసు పెడుతున్నానని నా లక్ష్యాలు చూపిస్తున్నాయా? నేను నా పిల్లల కోసం ఎలాంటి లక్ష్యాలు పెడుతున్నాను? నేను నా సమయాన్ని, శక్తిని, డబ్బును పరలోకంలో కాకుండా, భూమ్మీద నాకోసం సంపదలు కూడబెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నానా?’
14. మిక్కి అనుభవం చూపిస్తున్నట్టు, మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామనే రుజువుల్ని చూడడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?
14 మనం చివరి రోజుల్లో ఉన్నామనే రుజువులు చూసినప్పుడు, మనం జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. మిక్కి అనే సిస్టర్‌కి అదే జరిగింది. ఆమె ఇలా అంటుంది: “నా స్కూలు చదువు అయిపోయాక నా మనసంతా జంతుశాస్త్రం వైపు లాగింది. కానీ ఇంకోపక్క, పయినీరు సేవచేస్తూ అవసరం ఎక్కువున్న ప్రాంతానికి కూడా వెళ్లాలని ఉండేది. అయితే, సంఘంలో నా మంచి కోరుకునే కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్, ఒకవైపు అంతపెద్ద కోర్సు చేస్తూనే, అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లగలనో లేదో జాగ్రత్తగా ఆలోచించుకోమని చెప్పారు. అలాగే ఈ లోకం ఆరిపోయే దీపం లాంటిదని, కొత్త లోకంలోనైతే జంతువుల గురించి అధ్యయనం చేయడానికి నాకు కావాల్సినంత సమయం ఉంటుందని గుర్తుచేశారు. కాబట్టి తక్కువ టైంలో నాకు పనికొచ్చే ఒక చిన్న కోర్సు తీసుకుని, ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, పయినీరు సేవ కూడా చేశాను. ఆ తర్వాత అవసరం ఎక్కువున్న ప్రాంతమైన ఈక్వెడార్‌కు వెళ్లాను.” ఇప్పుడు మిక్కి, ఆమె భర్త ఈక్వెడార్‌లోనే ప్రాంతీయ సేవలో ఉన్నారు.
15. మంచివార్తకు ప్రజలు ఎలా స్పందించవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి. (చిత్రాలు కూడా చూడండి.)
15 మనం ప్రకటించే మంచివార్తకు మొదట్లో సరిగ్గా స్పందించనివాళ్లను చూసి మనం డీలాపడిపోకూడదు. ఎందుకంటే, ప్రజలు ఎప్పుడూ ఒకేలా ఉండరు. యేసు తమ్ముడైన యాకోబు గురించి ఆలోచించండి. యేసు పెరిగి పెద్దవ్వడం, మెస్సీయ అవ్వడం, ఎవ్వరూ బోధించనంత గొప్పగా బోధించడం యాకోబు కళ్లారా చూశాడు. అయినాసరే ఆయన చాలా సంవత్సరాల వరకు యేసును అనుసరించలేదు. యేసు చనిపోయి, పునరుత్థానమైన తర్వాతే యాకోబు ఒక ఉత్సాహవంతుడైన శిష్యుడు అయ్యాడు.c (యోహా. 7:5; గల. 2:9) కాబట్టి ఒకప్పుడు ఆసక్తి చూపించని బంధువుల్ని గానీ, మనం ప్రకటించిన సందేశాన్ని విననివాళ్లను గానీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మనం చివరి రోజుల్లో జీవిస్తున్నాం కాబట్టి మనం ప్రకటించే పని చాలా అత్యవసరమైనదని గుర్తుంచుకుందాం. ఇప్పుడు మనం చెప్పే మాటలు భవిష్యత్తులో, ఆఖరికి మహాశ్రమ మొదలైన తర్వాత కూడా ప్రజల హృదయాల్ని తట్టవచ్చు.d
సత్యంలో లేని బంధువుల మీద ఆశ వదులుకోకుండా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (15వ పేరా చూడండి)f
యెహోవా జ్ఞాపికలకు కృతజ్ఞత చూపించండి
16. యెహోవా ఇచ్చే జ్ఞాపికలు మీకెలా పనికొస్తాయి? (“వేరేవాళ్లకు సహాయం చేయడానికి ఉపయోగించండి” అనే బాక్స్ కూడా చూడండి)
16 సంస్థ కొంత ఆధ్యాత్మిక సమాచారాన్ని బైబిలు గురించి ఏమీ తెలియనివాళ్ల కోసం సిద్ధం చేస్తుంది. ఉదాహరణకు, ప్రతీవారం జరిగే బహిరంగ ప్రసంగం, jw.orgలో ఉండే వీడియోలు, కొన్ని ఆర్టికల్స్, కొన్ని తేజరిల్లు! అలాగే కావలికోట పత్రికలు యెహోవాసాక్షులుకాని వాళ్లకోసం తయారుచేస్తారు. అయితే, వాటినుండి మనం కూడా ప్రయోజనం పొందవచ్చు. అవి యెహోవా మీద మనకున్న ప్రేమను పెంచుతాయి, బైబిలు మీద మనకున్న విశ్వాసాన్ని బలపరుస్తాయి. బైబిలు సత్యాలు వేరేవాళ్లకు ఇంకా బాగా చెప్పేలా సహాయం చేస్తాయి.—కీర్త. 19:7.
17. ఏయే సందర్భాల్లో మనం ప్రాథమిక బైబిలు సత్యాల్ని గుర్తుచేసుకోవాలి?
17 యెహోవాసాక్షులుగా మనం, ఏదైనా లేఖన అవగాహనలో మార్పులు వస్తే చాలా సంతోషిస్తాం. కానీ ప్రాథమిక బైబిలు సత్యాల విషయంలో మనం కృతజ్ఞతతో ఉంటాం. ఎందుకంటే, వాటివల్లే మనం సత్యంలోకి వచ్చాం. ఒకవేళ సంస్థ ఇచ్చే నిర్దేశం వైపు కాకుండా, మన సొంత అభిప్రాయాల వైపు మన మనసు లాగేస్తుంటే, సంస్థను ఎవరు నడిపిస్తున్నారో మనం వినయంగా గుర్తుచేసుకోవాలి. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన యెహోవా దాన్ని నడిపిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. మనకు గానీ, మనవాళ్లకు గానీ ఏదైనా కష్టం వస్తే, ఓపిక చూపిస్తూ యెహోవా కష్టాల్ని ఎందుకు ఉండనిస్తున్నాడో ఆలోచించాలి. మన సమయాన్ని, వనరుల్ని దేనికోసం ఉపయోగించాలో నిర్ణయించుకుంటున్నప్పుడు, మనం చివరి రోజుల్లో ఉన్నామనీ, సమయం ఎక్కువ లేదనీ గుర్తుంచుకోవాలి. ఇలా యెహోవా ఇచ్చే జ్ఞాపికలు మనకు ఎప్పటికీ బలాన్ని, ప్రేరణను, తెలివిని ఇవ్వాలని కోరుకుందాం.
పాట 95 వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది
a కొన్ని పేర్లను మార్చాం.
b మే 15, 2007 కావలికోటలో, 21-25 పేజీల్లో ఉన్న “బాధలన్నీ త్వరలోనే ఎందుకు అంతమవుతాయి?” అనే ఆర్టికల్ చూడండి.
d మే, 2024 కావలికోటలో, 8-13 పేజీల్లో ఉన్న “భవిష్యత్తులో యెహోవా తీర్పులు” అనే ఆర్టికల్ చూడండి.
e చిత్రాల వివరణ:: ఒక సంఘపెద్ద చెప్పిన అభిప్రాయాన్ని, పెద్దల సభ ఒప్పుకోలేకపోయింది. తర్వాత, నక్షత్రాలు నిండిన ఆకాశం వైపు చూస్తూ తెలివి, శక్తి ఉన్న సృష్టికర్త గురించి ఆ సంఘపెద్ద బాగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు తను ఏం కోరుకుంటున్నాడో కాదు, యెహోవా ఏం కోరుకుంటున్నాడు అన్నదే ముఖ్యం అని అర్థం చేసుకుంటాడు.
f చిత్రం వివరణ : వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నప్పుడు, మనం చివరి రోజుల్లో జీవిస్తున్నాం అనే రుజువుల్ని ఒక సిస్టర్ పరిశీలిస్తుంది. తర్వాత, తన అక్కకు ఫోన్ చేసి సాక్ష్యం ఇస్తుంది.