కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 ఫిబ్రవరి పేజీలు 8-13
  • బాప్తిస్మానికి ఉన్న అర్థం తెలుసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బాప్తిస్మానికి ఉన్న అర్థం తెలుసుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాప్తిస్మానికి ఉన్న అర్థం
  • క్రైస్తవులు ఎలా బాప్తిస్మం తీసుకోవాలి?
  • “తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున”
  • బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి!
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మీ బాప్తిస్మము యొక్క భావం
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • బాప్తిస్మం—ఒక ప్రాముఖ్యమైన చర్య
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • బాప్తిస్మం అంటే ఏంటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 ఫిబ్రవరి పేజీలు 8-13

ఏప్రిల్‌ 13-19, 2026

పాట 52 క్రైస్తవ సమర్పణ

బాప్తిస్మానికి ఉన్న అర్థం తెలుసుకోండి

“శిష్యుల్ని చేయండి; . . . వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి.”—మత్త. 28:19.

ముఖ్యాంశం

బాప్తిస్మానికి ఉన్న అర్థం ఏంటో, అది ఏం చూపిస్తుందో, బాప్తిస్మం తీసుకోవాలంటే ఏమేం చేయాలో చూస్తాం.

1. బాప్తిస్మం ఒక ప్రాథమిక బైబిలు బోధ అని ఎందుకు చెప్పవచ్చు?

ఎవరైనా బాప్తిస్మం తీసుకున్నారని తెలిసినప్పుడు, మన హృదయం సంతోషంతో నిండిపోతుంది కదా! క్రైస్తవ సంఘం ఏర్పడినప్పుడు జరిగిన మొట్టమొదటి మీటింగ్‌లో కూడా ప్రజలు ఇలాగే సంతోషించారు. ఆ మొదటి మీటింగ్‌లోనే బాప్తిస్మం అనే ప్రాథమిక బోధ గురించి పేతురు ఒక ప్రసంగం ఇచ్చాడు, అలాగే వేలమంది బాప్తిస్మం తీసుకున్నారు. (అపొ. 2:38, 40, 41) తర్వాతి కాలంలో అపొస్తలుడైన పౌలు కూడా, ‘క్రీస్తు గురించిన ప్రాథమిక బోధల్లో’ “బాప్తిస్మాల గురించిన బోధ” ఉందని రాశాడు. (హెబ్రీ. 6:1, 2) బాప్తిస్మం అనేది మనకు తెలిసిన విషయమే అనిపించినా, మనం దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు?

2. మనం ఎందుకు బాప్తిస్మం గురించి బాగా అర్థం చేసుకోవాలి?

2 పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు బలంగా ఉంటుంది. అలాగే, మనం బాప్తిస్మం గురించి బాగా అర్థం చేసుకుంటేనే మన విశ్వాసం బలంగా ఉంటుంది. మనం ఇప్పుడిప్పుడే బాప్తిస్మం వైపు అడుగులు వేస్తున్నా, లేదా బాప్తిస్మం తీసుకుని చాలా సంవత్సరాలైనా దీని గురించి ఆలోచించాలి. అందుకే, మనం ఈ ఆర్టికల్‌లో ఈ ప్రశ్నలకు జవాబులు చూస్తాం: బాప్తిస్మం అంటే ఏంటి? క్రైస్తవులు ఎలా బాప్తిస్మం తీసుకోవాలి? తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున మనం ఎందుకు బాప్తిస్మం తీసుకుంటాం?

బాప్తిస్మానికి ఉన్న అర్థం

3. మీరు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏం చూపిస్తారు?

3 మీరు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా (1) యెహోవా దేవుని గురించిన, యేసుక్రీస్తు గురించిన సత్యం అంగీకరించారని, (2) మీ పాపాల విషయంలో పశ్చాత్తాపపడ్డారని, (3) యెహోవాను సేవించడానికి మీ జీవితాన్ని మార్చుకున్నారని, (4) యేసును దేవుడు పంపించిన రక్షణ మార్గంగా గుర్తించారని, (5) యెహోవా సంస్థను అంటిపెట్టుకుని ఉంటూ, ఆయన ఇష్టం చేయాలనే కోరికను ప్రార్థనలో చెప్పారని అందరిముందు చూపిస్తారు. మీరు అలా మాటిచ్చి లేదా సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుంటే, శాశ్వత జీవితానికి నడిపించే దారిలో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టే.

4. మీరు నీళ్లల్లో పూర్తిగా మునిగి పైకి లేవడం ద్వారా ఏం చూపిస్తారు? (చిత్రం కూడా చూడండి.)

4 బాప్తిస్మమప్పుడు మిమ్మల్ని నీళ్లల్లో పూర్తిగా ముంచి పైకి లేపుతారు,a అంటే ఒక విధంగా మీరు పాతిపెట్టబడి తిరిగి బ్రతికినట్టు. (కొలొస్సయులు 2:12 పోల్చండి.) మీరు మీ జీవితంలో ఎంత పెద్దపెద్ద మార్పులు చేసుకున్నారో ఆ పోలిక చూపిస్తుంది. ఎలా? మీరు నీళ్లల్లో పూర్తిగా మునిగినప్పుడు, మీ పాత జీవితాన్ని వదిలేస్తున్నారని చూపిస్తారు. అదే మీరు నీళ్లల్లో నుండి పైకి లేచినప్పుడు, దేవుని ఇష్టమే శ్వాసగా బ్రతికే కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నట్టు చూపిస్తారు.

చిత్రాలు: చాలా సవాళ్లను దాటి ఒకతను బాప్తిస్మం తీసుకుంటున్నాడు. 1. అతను టీవీలో బాక్సింగ్‌ మ్యాచ్‌ని సంతోషంగా చూస్తున్నాడు. 2. అతను సిగరెట్‌ కాలుస్తున్నాడు. 3. అతిగా మందు తాగుతున్నాడు. 4. తర్వాత, నీళ్లలో బాప్తిస్మం తీసుకుంటున్నాడు.

మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీ పాత జీవితాన్ని వదిలేసి, దేవుని ఇష్టమే శ్వాసగా బ్రతికే కొత్త జీవితాన్ని మొదలుపెడతారు (4వ పేరా చూడండి)


5. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరు చేసే ప్రయత్నాల్ని, ఓడ కట్టడానికి నోవహు చేసిన కృషితో ఎందుకు పోల్చవచ్చు? (1 పేతురు 3:18-21)

5 మొదటి పేతురు 3:18-21 చదవండి. ఒకవిధంగా బాప్తిస్మానికి ముందు మీరు చేసే ప్రయత్నాల్ని, ఓడ కట్టడానికి నోవహు చేసిన కృషితో పోల్చవచ్చు. మీరు ఇప్పుడిప్పుడే యెహోవా గురించి నేర్చుకుంటూ ఉంటే గనుక, ఇంత చేయాలా అని మీకు కంగారుగా అనిపించవచ్చు. బహుశా, అది మీకు ఓడ కడుతున్నంత పెద్ద పనిలా అనిపించవచ్చు. మరి ఇంతా కష్టపడి ఏమైనా ఉపయోగం ఉందా? ఖచ్చితంగా ఉంది. నోవహు విషయంలో అదే జరిగింది. ఓడను ఎలా కట్టాలో యెహోవా చెప్పినప్పుడు, నోవహు అచ్చుగుద్దినట్టు ఆయన చెప్పినట్టే చేసి తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు. విశ్వాసం వల్ల, యెహోవా సహాయం వల్ల నోవహు ఓడను కట్టాడు. నోవహులాగే మీరు కూడా “దేవుడు ఆజ్ఞాపించినదంతా” చేయగలరు!—ఆది. 6:22.

6. బాప్తిస్మం మిమ్మల్ని ఏ విధంగా రక్షిస్తోంది?

6 అపొస్తలుడైన పేతురు, 21వ వచనంలో ‘బాప్తిస్మం మిమ్మల్ని రక్షిస్తోంది’ అన్నాడు. అంటే ఊరికే అలా నీళ్లల్లో మునిగి లేస్తే రక్షణ వచ్చేస్తుందనీ కాదు, ఆ నీళ్లు మీ పాపాల్ని కడిగేస్తాయనీ కాదు. నిజానికి, యేసు రక్తం మాత్రమే మీ పాపాల్ని కడిగేయగలదు. (1 యోహా. 1:7) అయినాసరే, బాప్తిస్మం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, బాప్తిస్మం తీసుకోమని యెహోవాయే ఆజ్ఞాపిస్తున్నాడు. అంతేకాదు, మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు ‘మంచి మనస్సాక్షి కోసం దేవునికి విన్నపం చేసుకున్నట్టు’ అవుతుంది. అప్పుడు యెహోవా సంతోషంగా మీరు అడిగింది ఇస్తాడు, అంటే యేసు విమోచన క్రయధనం ఆధారంగా మీ పాపాల్ని క్షమిస్తాడు. ఆ విధంగా, బాప్తిస్మం ‘మిమ్మల్ని రక్షిస్తోంది’ లేదా రక్షణ వైపుకు నడిపిస్తోంది.

క్రైస్తవులు ఎలా బాప్తిస్మం తీసుకోవాలి?

7. బాప్తిస్మం ఎలా జరుగుతుంది?

7 బాప్తిస్మం తీసుకునేవాళ్లు పూర్తిగా నీళ్లల్లో మునగాలని బైబిలు చెప్తుంది గానీ, ఇక దాని గురించి ఎక్కువ వివరాలైతే ఇవ్వట్లేదు. కానీ, బాప్తిస్మమప్పుడు ఏం చేయడం సరైనది అనేది మాత్రం లేఖనాలు చెప్తున్నాయి. ఉదాహరణకు, బాప్తిస్మం తీసుకునేవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో, చూడ్డానికి వచ్చినవాళ్లు ఎలా ప్రవర్తించాలో చెప్పే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. (1 కొరిం. 14:40; 1 తిమో. 2:9) ఈ రోజుల్లో, సాధారణంగా ఒక సంఘపెద్ద బాప్తిస్మం ఇస్తారు. అయితే, అలా బాప్తిస్మం ఇచ్చేవాళ్లను మనం ప్రత్యేకంగా చూడకూడదు. (1 కొరిం. 1:14, 15) బాప్తిస్మాన్ని ఎక్కువమంది చూసినా, తక్కువమంది చూసినా దానికున్న విలువైతే తగ్గదు.—అపొ. 8:36.

8. బాప్తిస్మం తీసుకునేవాళ్లను ఏ ప్రశ్నలు అడుగుతారు? ఎందుకు? (అపొస్తలుల కార్యాలు 2:38-42) (చిత్రం కూడా చూడండి.)

8 రక్షణ పొందాలంటే ‘నోటితో బహిరంగంగా ప్రకటించాలి,’ లేదా మన విశ్వాసాన్ని మాటల్లో చెప్పాలి అని బైబిలు చెప్తుంది. (రోమా. 10:9, 10) అందుకే మనం బాప్తిస్మం తీసుకునే రోజే అలా నోటితో ఒప్పుకుంటాం. రక్షణ పొందాలంటే అది చాలా అవసరం! కాబట్టే బాప్తిస్మం తీసుకునేవాళ్లను రెండు ప్రశ్నలు అడుగుతారు. మొదటి ప్రశ్న ఏంటంటే, “మీ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవాకు సమర్పించుకుని, ఆయన యేసుక్రీస్తు ద్వారా చేసిన రక్షణ ఏర్పాటును మీరు అంగీకరించారా?” ఈ ప్రశ్న, బాప్తిస్మానికి సిద్ధపడడానికి మనం ఏమేం పనులు చేశామో గుర్తుచేస్తుంది. పెంతెకొస్తు రోజున పేతురు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాంటి ఒక విషయమే చెప్పాడు. అంటే వాళ్లు పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకోవాలని చెప్పాడు. రెండో ప్రశ్న ఏంటంటే, “మీ బాప్తిస్మం ద్వారా మీరు యెహోవాసాక్షుల్లో ఒకరిగా గుర్తించబడతారని, యెహోవా సంస్థలో భాగమౌతారని అర్థం చేసుకున్నారా?” ఈ ప్రశ్న, బాప్తిస్మం తర్వాత మనం ఎలా జీవించాలో గుర్తుచేస్తుంది. అంటే మనం యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశాలకు లోబడుతూ, తోటి క్రైస్తవులతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ, మన సమర్పణకు తగ్గట్టు జీవించాలని అది గుర్తుచేస్తుంది. పెంతెకొస్తు రోజున బాప్తిస్మం తీసుకున్నవాళ్లు అదే చేశారు. (అపొస్తలుల కార్యాలు 2:38-42 చదవండి.) ఈ రెండు ప్రశ్నలకు ఎవరైతే మనస్ఫూర్తిగా అవును అని జవాబు ఇస్తారో, వాళ్లు బాప్తిస్మానికి అర్హులౌతారు.

సమావేశంలో ముందు వరుసలో నిలబడిన వేర్వేరు వయసుల బాప్తిస్మ అభ్యర్థులు, బహిరంగంగా తమ విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నారు.

బాప్తిస్మం తీసుకోబోయే ముందు, మీరు “నోటితో బహిరంగంగా” ఒప్పుకోవాలి (8వ పేరా చూడండి)d


9. దేవుని ఆమోదం పొందాలంటే ప్రతీఒక్కరు ఏమేం చేయాలి?

9 సత్యం తెలుసుకోవడానికి ముందు కూడా మీరు పెద్దపెద్ద పాపాలు చేయకుండా, ఒక మోస్తరుగా మంచి జీవితమే గడిపి ఉంటారు. లేదా మీరు యెహోవాసాక్షుల కుటుంబంలో పెరగడం వల్ల, చిన్నప్పటి నుండి మీకు యెహోవా అంటే ఇష్టం ఉండి ఉండవచ్చు. అయినా సరే, దేవుని ఆమోదం పొందాలంటే మీరు పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకోవాల్సిందేనా? అవును. మనం పుట్టి పెరిగిన విధానం ఏదైనా, మనలో వారసత్వంగా వచ్చిన పాపం ఉందని, దానివల్ల మనం దేవుని నుండి దూరమైపోయామని మనందరం గుర్తుపెట్టుకోవాలి. (కీర్త. 51:5) అయితే, మనం యెహోవా గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ మనకు నచ్చింది కాదు, ఆయనకు నచ్చింది చేయాలనుకుంటాం. అలా నిర్ణయించుకున్న తర్వాత మనం గతంలో చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, వాటిని పూర్తిగా వదిలేసి, మన పరలోక తండ్రిని సంతోషపెట్టేలా జీవించడం మొదలుపెడతాం. అప్పుడు మనం బాప్తిస్మం తీసుకోవచ్చు.—అపొ. 3:19.

10. మీరు ఇంతకుముందు వేరే దగ్గర బాప్తిస్మం తీసుకున్నా ఏం చేయాలి?

10 మీరు ఇంతకుముందు వేరే దగ్గర బాప్తిస్మం తీసుకున్నా, ఇప్పుడు ఒక యెహోవాసాక్షిగా మళ్లీ బాప్తిస్మం తీసుకోవాలా? తీసుకోవాలి. ఎందుకంటే, అప్పట్లో మీకు యెహోవా దేవుని గురించి, యేసు గురించి సత్యం తెలీదు. పైగా మీరు, ‘నీ ఇష్టమే చేస్తాను’ అని దేవునికి ప్రార్థనలో చెప్పినా, ఆయన ఇష్టమేంటో అప్పట్లో మీకు సరిగ్గా తెలీదు. కాబట్టి మీరు అలా మాటిచ్చినా, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అపొస్తలుడైన పౌలు ఎఫెసులో కొంతమందిని కలిసినప్పుడు, వాళ్లు క్రైస్తవ బోధల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి ఆయన మళ్లీ వాళ్లకు బాప్తిస్మం ఇప్పించాడు.b (అపొ. 19:1-5) ఇప్పుడు కూడా, దేవుని ఇష్టం గురించిన సరైన జ్ఞానం తెలుసుకున్నాక బాప్తిస్మం తీసుకుంటేనే దానికి విలువ ఉంటుంది.

“తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున”

11. “తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున” బాప్తిస్మం ఇవ్వడమంటే అర్థం ఏంటి? (మత్తయి 28:18-20)

11 ప్రజల్ని శిష్యులుగా చేశాక వాళ్లకు “తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున” బాప్తిస్మం ఇవ్వమని యేసు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:18-20 చదవండి.) ఆ మాటలకు అర్థమేంటి? బైబిల్లో “పేరు” అనే పదానికి, ఒక వ్యక్తికున్న కీర్తిప్రతిష్ఠలు అనే అర్థం వస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తికున్న పాత్రను, అధికారాన్ని కూడా అది సూచించవచ్చు. కాబట్టి మనం ఎవరి పేరునైనా లేదా దేని పేరునైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు, వాళ్ల అధికారాన్ని గుర్తిస్తున్నామని చూపిస్తాం. (మత్తయి 10:41 పోల్చండి.) ఇంతకీ మనం తండ్రికి, కుమారుడికి ఉన్న అధికారాన్ని అలాగే పవిత్రశక్తికి ఉన్న పాత్రను ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు చూద్దాం.

12. తండ్రి పేరున బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి? (ప్రకటన 4:11) (చిత్రం కూడా చూడండి.)

12 తండ్రి పేరున. యెహోవా మన పరలోక తండ్రి అని, జీవదాత అని, సర్వశక్తిగల దేవుడని, ఆయన అన్నిటినీ సృష్టించాడని మనం గుర్తిస్తాం. (ప్రకటన 4:11 చదవండి.) అంతేకాదు, ఆయన ప్రార్థనలు వినే దేవుడని కూడా గుర్తిస్తాం. మనం ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు, వేరేవాళ్లతో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మర్యాదగా, స్వేచ్ఛగా ఆయన పేరును ఉపయోగిస్తాం. (కీర్త. 65:2) అయితే, తండ్రి పేరున బాప్తిస్మం తీసుకోవాలంటే మనం ఇంకో విషయాన్ని కూడా గుర్తించాలి. పెంతెకొస్తు రోజున పేతురు ప్రసంగం విన్నవాళ్లకు అప్పటికే యెహోవా గురించి తెలుసు. కానీ, ఆయన యేసుక్రీస్తు ద్వారానే శాశ్వత జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని వాళ్లు గుర్తించాలి.—రోమా. 5:8.

ముందు చిత్రంలో బాప్తిస్మ అభ్యర్థుల్లో నిలబడిన ఒక సిస్టర్‌ తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటోంది.

బాప్తిస్మం తర్వాత కూడా తండ్రికి, కుమారుడికి ఉన్న అధికారాన్ని అలాగే పవిత్రశక్తికి ఉన్న పాత్రను గుర్తిస్తూ ఉండండి (12వ పేరా చూడండి)


13. కుమారుడి పేరున బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

13 కుమారుడి పేరున. యేసు దేవుని ఒక్కగానొక్క కుమారుడని మనం గుర్తిస్తాం. యెహోవాతో స్నేహం చేయాలంటే యేసు మాత్రమే “మార్గం” అని కూడా మనం గుర్తిస్తాం. (యోహా. 14:6) యేసు మన విమోచకుడు కూడా. మనం బ్రతకడం కోసం ఆయన చనిపోయాడు. ఆ విషయం తెలుసుకున్నప్పుడు కేవలం బాప్తిస్మం తీసుకున్న రోజే కాదు, మన జీవితంలో ప్రతీరోజు ప్రతీక్షణం ఆయనలా బ్రతకాలి అనుకుంటాం. (1 యోహా. 2:6) కాబట్టి ఏది అడ్డొచ్చినా, ఆయనలాగే మనం ఉత్సాహంగా ప్రకటిస్తాం. (లూకా 4:43) అలాగే ఎంత హింస వచ్చినా, దాన్ని తట్టుకుని దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటాం. (2 తిమో. 3:12) యేసు ‘సంఘానికి శిరస్సు’ అని కూడా మనం గుర్తిస్తాం. అందుకే తన అనుచరుల్ని చూసుకోమని, వాళ్లను నడిపించమని ఆయన ఎవరికైతే బాధ్యత అప్పగించాడో వాళ్లకు మనం సంతోషంగా లోబడతాం.—ఎఫె. 4:8, 11, 12; 5:23.

ముందు చిత్రంలో బాప్తిస్మ అభ్యర్థుల్లో నిలబడిన ఒక బ్రదర్‌ ఇంటింటి పరిచర్యలో ఒకతనికి లేఖనం చూపిస్తున్నాడు.

బాప్తిస్మం తర్వాత కూడా తండ్రికి, కుమారుడికి ఉన్న అధికారాన్ని గుర్తిస్తూ ఉండండి (13వ పేరా చూడండి)


14. (ఎ) మనం ఎలా పవిత్రశక్తి పేరున బాప్తిస్మం తీసుకుంటాం? (చిత్రం కూడా చూడండి.) (బి) అభిషిక్తులు ఇంకా ఏ రకాల బాప్తిస్మాలు తీసుకుంటారు? (“అభిషిక్తులు తీసుకునే బాప్తిస్మాలు” అనే బాక్సు చూడండి.)

14 పవిత్రశక్తి పేరున. పవిత్రశక్తి గురించిన సత్యాన్ని మనం అంగీకరిస్తాం. అది ఒక వ్యక్తో త్రిత్వంలో భాగమో కాదుగానీ, దేవుని చురుకైన శక్తి అని మనం నమ్ముతాం. పవిత్రశక్తే ప్రవక్తల్ని, బైబిలు రచయితల్ని ప్రేరేపించిందని మనం గుర్తిస్తాం కాబట్టి రోజూ బైబిలు చదువుతాం, అందులో చెప్పినవి పాటిస్తాం. (2 పేతు. 1:20, 21) అలాగే మనం ఘోరమైన పాపాలు చేయకుండా దూరంగా ఉంటాం. ఎందుకంటే, అలా ఘోరమైన పాపాలు చేస్తే పవిత్రశక్తి మన మీద పనిచేయదు, సంఘం మీద కూడా పనిచేయదు.—ఎఫె. 4:30.

ముందు చిత్రంలో బాప్తిస్మ అభ్యర్థుల్లో నిలబడిన ఒక సిస్టర్‌ తన ఇంట్లో కూర్చుని బైబిలు చదువుకుంటోంది.

బాప్తిస్మం తర్వాత కూడా పవిత్రశక్తికి ఉన్న పాత్రను గుర్తిస్తూ ఉండండి (14వ పేరా చూడండి)


అభిషిక్తులు తీసుకునే బాప్తిస్మాలు

నీళ్లల్లో తీసుకునే బాప్తిస్మమే కాకుండా, అభిషిక్త క్రైస్తవులు ఈ అదనపు బాప్తిస్మాలు కూడా తీసుకుంటారు.

  • అభిషిక్త క్రైస్తవులు పరలోకంలో క్రీస్తుతోపాటు సేవ చేయడానికి ఎంచుకోబడినప్పుడు, వాళ్లు పవిత్రశక్తితో బాప్తిస్మం పొందుతారు. (మత్త. 3:11)

  • వాళ్లు క్రీస్తులోకి బాప్తిస్మం తీసుకుంటారు. అంటే వాళ్లు క్రీస్తుతో ఎంతగా ఐక్యం అవుతారంటే, వాళ్లు క్రీస్తు శరీరం అని పిలవబడతారు. (గల. 3:27, 28; 1 కొరిం. 12:27)

  • వాళ్లు క్రీస్తు మరణంలోకి బాప్తిస్మం తీసుకుంటారు. అంటే, వాళ్లు చనిపోయి పరలోకానికి పునరుత్థానమయ్యే వరకు నమ్మకంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. (రోమా. 6:3-5)

15. మనం ఏమని నిర్ణయించుకోవాలి?

15 మీరు ఇప్పటికే బాప్తిస్మం తీసుకుని ఉంటే, ‘బాప్తిస్మాల గురించిన బోధలోని’c అన్ని విషయాల్ని అర్థం చేసుకోవాలని నిర్ణయించుకోండి. యెహోవాకు మీరు చేసుకున్న సమర్పణకు, అలాగే బాప్తిస్మానికి తగ్గట్టు జీవించాలని కూడా నిర్ణయించుకోండి. కానీ ఒకవేళ మీరు ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే అప్పుడేంటి? బాప్తిస్మం తీసుకోకుండా మిమ్మల్ని ఏదైనా ఆపుతుందా? మీరు ఎలా బాప్తిస్మం వైపు అడుగులు వేయవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

మీరెలా జవాబిస్తారు?

  • బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీరు ఏం చూపిస్తారు?

  • బాప్తిస్మం తీసుకునేవాళ్లను ఏ ప్రశ్నలు అడుగుతారు? ఎందుకు?

  • “తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున” బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం ఏంటి?

పాట 161 నీ ఇష్టమే నా ఊపిరి

a బాప్తిస్మా అనే గ్రీకు పదాన్ని “బాప్తిస్మం” అని అనువదించారు. దానికి “పూర్తిగా మునగడం” లేదా “పూర్తిగా ముంచడం” అని అర్థం. కాబట్టి ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలంటే అతన్ని నీళ్లల్లో పూర్తిగా ముంచాలి గానీ, కొన్ని మతాలు చెప్తున్నట్టు కేవలం నీళ్లు చిలకరిస్తే సరిపోదు.

b వాళ్లు ‘యోహాను బోధ ప్రకారం బాప్తిస్మం తీసుకున్నారు.’ (అపొ. 19:3) మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడమని బాప్తిస్మమిచ్చే యోహాను యూదుల్ని ప్రోత్సహించాడు. దానికి ఎవరైతే స్పందించారో వాళ్లకు యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. (మార్కు 1:4, 5) అయితే, మోషే ధర్మశాస్త్రం ముగిసిపోయిన తర్వాత యోహాను బాప్తిస్మానికి విలువ లేదు. అప్పటి నుండి రక్షణకు నడిపించే ‘ఒకే ఒక్క బాప్తిస్మాన్ని’ దేవుడు ఆమోదించాడు.—ఎఫె. 4:5.

c jw.orgలో అలాగే JW లైబ్రరీలో, “బైబిలు ప్రశ్నలకు జవాబులు” అనే సిరీస్‌ కిందున్న “బాప్తిస్మం అంటే ఏంటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

d చిత్రాల వివరణ: సమావేశంలో బాప్తిస్మం తీసుకోబోయే వాళ్లు, తమ విశ్వాసాన్ని నోటితో బహిరంగంగా ఒప్పుకోవడానికి లేచి నిలబడ్డారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి