కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 జనవరి పేజీలు 14-19
  • మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరం?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరం?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విమోచన క్రయధనం వల్ల పాపక్షమాపణ దొరుకుతుంది
  • విమోచన క్రయధనం వల్ల మన పాపపు స్థితి బాగౌతుంది
  • విమోచన క్రయధనం వల్ల దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకుంటాం
  • విమోచన క్రయధనం యెహోవా కరుణకు అద్దంపడుతుంది
  • విమోచన క్రయధనం నేర్పే పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • విమోచన క్రయధనం మీద మీరు ఎలా కృతజ్ఞత చూపిస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • యెహోవా ప్రేమ తెచ్చిపెట్టిన ప్రయోజనాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—దానికి కృతజ్ఞులై ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 జనవరి పేజీలు 14-19

మార్చి 16-22, 2026

పాట 20 ప్రశస్తమైన నీ కుమారుణ్ణి ఇచ్చావు

మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరం?

“మరణానికి నడిపించే శరీరం నుండి నన్ను ఎవరు కాపాడతారు?”—రోమా. 7:24.

ముఖ్యాంశం

విమోచన క్రయధనం వల్ల మన పాపాలు ఎలా క్షమించబడతాయో, మన పాపపు స్థితి ఎలా బాగౌతుందో, దేవునితో శాంతియుత సంబంధాన్ని ఎలా తిరిగి నెలకొల్పుకోవచ్చో చూస్తాం.

1-2. మనల్ని దేని నుండి రక్షించాలి? ఎందుకు? (రోమీయులు 7:22-24) (చిత్రం కూడా చూడండి.)

ఊహించుకోండి. ఒక బిల్డింగ్‌ కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల కింద ఒకతను ఇరుక్కుపోయాడు. అతను ప్రాణాలతోనే ఉన్నాడు కానీ, శిథిలాలన్నీ మీద పడడం వల్ల ఒక్క అంగుళం కూడా కదల్లేకపోతున్నాడు. అతను చేయగలిగిందల్లా “రక్షించండి,” “రక్షించండి” అని అరవడమే. ఎవరైనా తన అరుపులు విని రక్షిస్తారేమో అని అతనికి చిన్న ఆశ.

2 మనందరి పరిస్థితి అలాంటిదే. అదెలా? ఆదాము దేవునికి ఎదురు తిరిగినప్పుడు పాపం చేశాడు. తర్వాత, ఆ పాపపు స్థితిని తన పిల్లలందరికీ ఇచ్చాడు. దానివల్ల, మొత్తం మానవజాతే పాపం అనే శిథిలాల కింద చిక్కుకుపోయింది. వాళ్లంతట వాళ్లు అందులో నుండి బయటికి రాలేరు. మన పాపపు స్థితి గురించి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో చక్కగా వివరించాడు. (రోమీయులు 7:22-24 చదవండి.) “మరణానికి నడిపించే శరీరం నుండి” తనను రక్షించమని పౌలు దేవుణ్ణి వేడుకున్నాడు. వారసత్వంగా వచ్చిన పాపంలో చిక్కుకుపోయినట్టు పౌలుకు అనిపించింది. అది ఖచ్చితంగా మరణానికే నడిపిస్తుంది. (రోమా. 6:23) మనం కూడా అందులోనే చిక్కుకుపోయాం. మనల్ని ఎవరో ఒకరు రక్షించాలి, లేకపోతే ఇక అంతే సంగతులు!

కూలిపోయిన బిల్డింగ్‌ శిథిలాల కింద చిక్కుకుపోయి గాయాలపాలైన వ్యక్తి, సహాయం కోసం చేయి చాపాడు.

కూలిపోయిన బిల్డింగ్‌ కింద చిక్కుకుపోయిన వ్యక్తిలా, మనం కూడా వారసత్వ పాపం అనే శిథిలాల కింద చిక్కుకుపోయాం. మనల్ని కూడా ఎవరో ఒకరు రక్షించాలి (1-2 పేరాలు చూడండి)


3. విమోచన క్రయధనం మనల్ని ఎలా రక్షిస్తుంది?

3 పాపంలో చిక్కుకుపోయాను అని చెప్పి పౌలు ఊరుకోలేదు కానీ, దానిలో నుండి బయట పడేసేది ఎవరో కూడా ఆయన చెప్పాడు. “మరణానికి నడిపించే శరీరం నుండి నన్ను ఎవరు కాపాడతారు?” అని అడిగిన తర్వాత, ఆ ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్తూ ఇలా అన్నాడు: “మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు!” (రోమా. 7:25) పౌలు ఇక్కడ యేసు అర్పించిన విమోచన క్రయధనంa గురించి మాట్లాడుతున్నాడు. ఆ విమోచన క్రయధనం మనల్ని రక్షిస్తుంది. ఎలాగంటే, అది (1) మన పాపాల్ని క్షమించడానికి, (2) మన పాపపు స్థితిని బాగుచేయడానికి, (3) దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ ఆర్టికల్‌లో వాటి గురించి చూస్తున్నప్పుడు, ‘నిరీక్షణను ఇచ్చే దేవుడైన’ యెహోవా మీద ప్రేమ ఉప్పొంగుతుంది. (రోమా. 15:13) అంతేకాదు, ఎవరి ‘విమోచన క్రయధనం వల్ల మనం విడుదలయ్యామో,’ ఆ యేసు మీద కృతజ్ఞత పొంగిపొర్లుతుంది.—కొలొ. 1:14.

విమోచన క్రయధనం వల్ల పాపక్షమాపణ దొరుకుతుంది

4-5. మనందరికీ విమోచన క్రయధనం ఎందుకు తప్పనిసరి? (ప్రసంగి 7:20)

4 మన పాపాలకు క్షమాపణ దొరకాలంటే, విమోచన క్రయధనం తప్పనిసరి. ప్రతీ అపరిపూర్ణ మనిషి మాటల్లోనో, పనుల్లోనో పాపం చేస్తాడు. (ప్రసంగి 7:20 చదవండి.) కొన్ని పాపాలైతే మరీ ఘోరమైనవి. ఉదాహరణకు వ్యభిచారం, హత్య లాంటి నేరాలకు మోషే ధర్మశాస్త్రం ప్రకారం మరణశిక్ష పడేది. (లేవీ. 20:10; సంఖ్యా. 35:30, 31) అయితే, చాలా పాపాలు వాటంత ఘోరమైనని కావు. కానీ చిన్నదైనా, పెద్దదైనా పాపం పాపమే. ఉదాహరణకు, కీర్తనకర్త దావీదు ఇలా అన్నాడు: “నా నాలుకతో పాపం చేయకుండా నేను జాగ్రత్తగా ఉంటాను.” (కీర్త. 39:1) అవును, కొన్నిసార్లు మన మాటల్లో కూడా పాపం చేస్తుంటాం.—యాకో. 3:2.

5 మీరు గతంలో అన్న మాటల్ని, చేసిన పనుల్ని ఒకసారి గుర్తుతెచ్చుకోండి. మీరు ఎవరినైనా అనరాని మాటలు అనేసి, ఆ తర్వాత ‘అరెరె, అనవసరంగా అన్నానే’ అని బాధపడ్డారా? మీరు ఎప్పుడైనా తప్పులు చేసి, ఆ తర్వాత తల పట్టుకున్నారా? ఈ రెండు ప్రశ్నలకు, “అవును” అనడం తప్ప మన దగ్గర వేరే ఆప్షన్‌ లేదు. ఎందుకంటే, బైబిలు ఇలా చెప్తుంది: “ఒకవేళ మనం, ‘మాలో ఏ పాపం లేదు’ అని చెప్పుకుంటే, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే, మనలో సత్యం లేనట్టే.”—1 యోహా. 1:8.

6-7. దేని ఆధారంగా యెహోవా మన పాపాల్ని క్షమిస్తాడు? (చిత్రం కూడా చూడండి.)

6 యెహోవా పరిపూర్ణ న్యాయవంతుడు కాబట్టి, మన పాపాల్ని క్షమించాలంటే ఏదోక ఆధారం ఉండాలి. విమోచన క్రయధనం యెహోవాకు ఆ ఆధారాన్ని ఇచ్చింది. (ఎఫె. 1:7) అంతమాత్రాన, ఆయన మన పాపాల్ని చూసీచూడనట్టు వదిలేస్తాడనో, మనం ఏం చేసినా ఆయనకు చీమ కుట్టినట్టు కూడా ఉండదనో మనం అనుకోకూడదు. మనం పాపం చేస్తే, యెహోవా ఖచ్చితంగా బాధపడతాడు.—యెష. 59:2.

7 ఇశ్రాయేలీయులు వాళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తంగా జంతు బలులు అర్పించాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. (లేవీ. 4:27-31; 17:11) ఆ బలులు, యేసు అర్పించబోయే గొప్ప బలికి అలాగే దానివల్ల వచ్చే దీవెనలకు గుర్తుగా ఉన్నాయి. యేసు అర్పించే విమోచన క్రయధన బలి, యెహోవా మన పాపాల్ని క్షమించడానికి ఒక ఆధారాన్నిస్తుంది. యేసు బలి ఎంత విలువైనదో పౌలు అర్థం చేసుకున్నాడని, ఆయన కొరింథులోని క్రైస్తవులకు రాసిన ఉత్తరాన్ని బట్టి అర్థమౌతుంది. గతంలో వాళ్లు ఏమేం తప్పుడు పనులు చేశారో చెప్పాక, పౌలు వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుడు మిమ్మల్ని శుభ్రం చేసి, పవిత్రపర్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు పేరున తన పవిత్రశక్తితో నీతిమంతులుగా తీర్పు తీర్చాడు.”—1 కొరిం. 6:9-11.

ఒక ఇశ్రాయేలు కుటుంబం ఆలయంలో ఉన్న యాజకునికి సంతోషంగా గొర్రెను ఇస్తున్నారు.

పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించిన జంతు బలులు, యేసు అర్పించబోయే విమోచన క్రయధనానికి, అది తీసుకొచ్చే దీవెనలకు గుర్తుగా ఉన్నాయి (6-7 పేరాలు చూడండి)


8. ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతున్నప్పుడు, మీరు దేని గురించి ఆలోచించవచ్చు?

8 ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతుండగా, యెహోవా మీ పాపాల్ని క్షమించడం వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందుతున్నారో సమయం తీసుకుని ఆలోచించండి. ఉదాహరణకు, విమోచన క్రయధనం ఉంది కాబట్టి, మీరు గతంలో చేసిన పాపాల విషయంలో ఒకసారి పశ్చాత్తాపపడ్డాక, అయ్యో తప్పు చేశానే అనే బాధతో నలిగిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ విషయాన్ని నమ్మడం మీకు కష్టంగా ఉంటే, అప్పుడేంటి? బహుశా మీరు ఇలా అనుకుని ఉంటారు: ‘యెహోవా నన్ను క్షమిస్తాడేమో గానీ, నన్ను నేను క్షమించుకోలేను.’ మీకు అలా అనిపిస్తే, ఒకటి గుర్తుపెట్టుకోండి. క్షమించేది యెహోవా, తీర్పు తీర్చే అధికారాన్ని ఆయన తన కుమారుడైన యేసుకు ఇచ్చాడు. అంతేగానీ, యెహోవా కరుణను పొందడానికి ఎవరు అర్హులో, ఎవరు కాదో నిర్ణయించే హక్కును ఆయన మీకు గానీ, వేరే ఏ మనిషికి గానీ ఇవ్వలేదు. బైబిలు ఇలా చెప్తుంది: “[యెహోవా] వెలుగులో ఉన్నట్టే మనం కూడా వెలుగులో నడుస్తుంటే . . . ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది.” (1 యోహా. 1:6, 7) వేరే బైబిలు బోధల్ని నమ్మినట్లే, ఆ విషయాన్ని కూడా మనం గట్టిగా నమ్మవచ్చు. యెహోవా మనమీద కరుణ చూపించడానికి విమోచన క్రయధనం ఒక ఆధారాన్ని ఇస్తుంది. ఆయన “క్షమించడానికి సిద్ధంగా” ఉంటాడని బైబిలు చెప్తుంది.—కీర్త. 86:5.

విమోచన క్రయధనం వల్ల మన పాపపు స్థితి బాగౌతుంది

9. పాపం అంటే తప్పుడు పనులే కాకుండా ఇంకా ఏం వస్తుంది? (కీర్తన 51:5 అలాగే అధస్సూచి)

9 బైబిల్లో “పాపం” అంటే కేవలం తప్పుడు పనులే కాదు, ఒక స్థితి కూడా. మనం తల్లి కడుపులో పడిన క్షణం నుండే ఆ పాపపు స్థితి మనకు వారసత్వంగా వచ్చింది. (కీర్తన 51:5 అలాగే అధస్సూచి చదవండి.) ఈ పాపపు స్థితి వల్ల మనం చెడు వైపు మొగ్గు చూపడమే కాకుండా, ఎంతగా బలహీనం అవుతామంటే జబ్బుపడి, ముసలివాళ్లమై, చివరికి చనిపోతాం కూడా. అందుకే, పాపమే తెలీని పసికందులు కూడా జబ్బుపడి చనిపోతున్నారు, చెడ్డవాళ్లతో పాటు మంచివాళ్లు కూడా బాధలుపడి చనిపోతున్నారు. ఆదాము నుండి వచ్చిన ప్రతీ మనిషికి వారసత్వంగా ఆ పాపపు స్థితి వచ్చింది.

10. పాపపు స్థితి ఆదాముహవ్వల్ని ఎలా దెబ్బతీసింది?

10 ఆ పాపపు స్థితి మొదటి మనుషులైన ఆదాముహవ్వల్ని ఎలా దెబ్బతీసిందో ఆలోచించండి. వాళ్ల మనసులు, హృదయాలు అతలాకుతలం అయ్యాయి. ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసిన వెంటనే, ‘వాళ్ల హృదయాల్లో రాసివున్న ధర్మశాస్త్రం,’ అంటే మనస్సాక్షి వాళ్లను బాధించడం మొదలుపెట్టింది. (రోమా. 2:15) వాళ్లలో ఏదో మారిందని వాళ్లు గమనించారు. వాళ్ల శరీరాన్ని కప్పుకున్నారు, సృష్టికర్తకు ముఖం చూపించుకోలేక నేరస్థుల్లా దాక్కున్నారు. (ఆది. 3:7, 8) వాళ్ల జీవితంలో మొట్టమొదటిసారి అపరాధభావం, ఆందోళన, అభద్రత, ఆవేదన, అవమానం అనే ఫీలింగ్స్‌ వాళ్లకు పరిచయం అయ్యాయి. ఎంతోకొంత ఆ ఫీలింగ్స్‌ అన్నీ, చనిపోయేవరకు వాళ్లను వెంటాడి ఉంటాయి.—ఆది. 3:16-19.

11. పాపపు స్థితి మనల్ని ఎలా దెబ్బతీసింది?

11 మొదటి మనుషులైన ఆదాముహవ్వల్ని దెబ్బతీసినట్టే, పాపపు స్థితి మనల్ని కూడా దెబ్బతీసింది. మన కష్టాలకు, మానసిక వేదనకు కారణం మన పాపపు స్థితే. ఈ స్థితిలో నుండి బయటపడాలని మనం ఎంత గింజుకున్నా, ఒక్క అంగుళం కూడా కదల్లేం. ఎందుకు? ఎందుకంటే, మనం “వ్యర్థమైన జీవితానికి” లోబర్చబడ్డామని బైబిలు చెప్తుంది. (రోమా. 8:20) ఒక్కొక్కరి విషయంలోనే కాదు, మొత్తం మానవజాతి విషయంలోనే ఇది నిజమని తేలిపోయింది. ఉదాహరణకు, మనుషులు పర్యావరణాన్ని కాపాడడానికి, నేరాల్ని ఆపడానికి, పేదరికాన్ని తీసేయడానికి, దేశాల మధ్య శాంతి కుదర్చడానికి కిందా-మీదా పడుతున్నారు. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయిలే అని సంబరపడే లోపే, వాళ్ల ప్రయత్నాలన్నీ బూడిదపాలు అవుతున్నాయి. మరి ఇలాంటి పాపపు స్థితి నుండి విమోచన క్రయధనం మనల్ని ఎలా రక్షిస్తుంది?

12. విమోచన క్రయధనం మనకు ఏ నిరీక్షణ ఇస్తుంది?

12 ‘సృష్టి పాపమరణాల బానిసత్వం నుండి విడుదలౌతుంది’ అనే నిరీక్షణను, విమోచన క్రయధనం మనకు ఇస్తుంది. (రోమా. 8:21) దేవుడు తీసుకురాబోయే కొత్తలోకంలో, విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాలు మనకు పూర్తిగా వర్తిస్తాయి. అప్పుడు జబ్బులు, మానసిక వేదన అడ్రస్‌ లేకుండా పోతాయి. అపరాధభావం, ఆందోళన, అభద్రత, ఆవేదన, అవమానం లాంటి ఫీలింగ్స్‌ మనల్ని వెంటాడవు. అంతేకాదు, భూమిని కాపాడడానికి, శాంతిని తీసుకురావడానికి మనం చేసే ప్రయత్నాలు బూడిదపాలు అవ్వవు గానీ, బాణాల్లా దూసుకుపోతాయి. ఎందుకంటే, మనకు విమోచన క్రయధనం ఇచ్చిన, ‘శాంతికి అధిపతైన’ యేసుక్రీస్తు పరిపాలన కింద మనం ఉంటాం.—యెష. 9:6, 7.

13. ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతున్నప్పుడు, మీరు ఇంకా దేని గురించి ఆలోచించవచ్చు?

13 పాపపు స్థితి నుండి బాగైన తర్వాత, అంటే పరిపూర్ణులుగా అయిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీరు ప్రతీరోజు పొద్దున్నే ఏ టెన్షన్స్‌ లేకుండా ప్రశాంతంగా నిద్రలేస్తారు. మీరు గానీ, మీకు ఇష్టమైనవాళ్లు గానీ ఆకలితో ఉంటారనో, జబ్బుపడతారనో, చనిపోతారనో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పుడు కూడా మీరు ఒకింత ప్రశాంతంగా ఉండవచ్చు. ఎందుకంటే, “నిశ్చయమైన, స్థిరమైన . . . నిరీక్షణ మన ప్రాణాలకు లంగరులా ఉంది.” కాబట్టి, ఆ నిరీక్షణను మీరు గట్టిగా పట్టుకుని ఉండవచ్చు. (హెబ్రీ. 6:18, 19) ఒక లంగరు ఎలాగైతే పడవను అటూఇటూ కదిలిపోకుండా స్థిరంగా ఉంచుతుందో, మీ క్రైస్తవ నిరీక్షణ కూడా మీ విశ్వాసాన్ని అటూఇటూ కదిలిపోకుండా స్థిరంగా ఉంచుతుంది. అలాగే, ఇప్పుడు మీకొచ్చే ఎలాంటి కష్టాలనైనా తట్టుకోవడానికి సహాయం చేస్తుంది. నిజానికి, “తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు” యెహోవా ప్రతిఫలం ఇస్తాడని మీరు నమ్మవచ్చు. (హెబ్రీ. 11:6) ఇప్పుడు మీరు పొందే మనశ్శాంతి గానీ, భవిష్యత్తు విషయంలో మీకున్న నిరీక్షణ గానీ కేవలం విమోచన క్రయధనం వల్లే సాధ్యమయ్యాయి.

విమోచన క్రయధనం వల్ల దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకుంటాం

14. పాపం వల్ల సృష్టికర్తతో మనకున్న బంధం ఏమైపోయింది? ఎందుకు?

14 ఆదాముహవ్వలు పాపం చేసిన క్షణం నుండి మనుషులు దేవుని నుండి వేరైపోయారు, లేదా దూరమైపోయారు. ఏకంగా మొత్తం మానవజాతికే సృష్టికర్తతో ఉన్న బంధం తెగిపోయిందని బైబిలు చెప్తుంది. (రోమా. 8:7, 8; కొలొ. 1:21) ఎందుకు? ఎందుకంటే, యెహోవా పరిపూర్ణుడు కాబట్టి పాపాన్ని ఆయన అస్సలు సహించలేడు. బైబిలు యెహోవా గురించి ఇలా చెప్తుంది: “నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి, నువ్వు దుష్టత్వాన్ని సహించలేవు.” (హబ. 1:13) అలా దేవునికి, మనుషులకు మధ్య పాపం అనే పెద్ద అడ్డుగోడ మొలిచింది. ఆ అడ్డుగోడ కూలిపోయి, మనం యెహోవాతో సమాధానపడితే తప్ప మనలో ఎవ్వరం ఆయనకు దగ్గరవ్వలేం. కానీ విమోచన క్రయధనం వల్ల అది సాధ్యమౌతుంది.

15. విమోచన క్రయధనం యెహోవాను ఎలా శాంతింపజేసింది? దానివల్ల ఏం జరిగింది?

15 యేసు “మన పాపాల కోసం ప్రాయశ్చిత్త బలిని అర్పించాడు” అని బైబిలు చెప్తుంది. (1 యోహా. 2:2) ఇక్కడ “ప్రాయశ్చిత్త” అని అనువదించిన గ్రీకు పదానికి, “శాంతింపజేసే” అని అర్థం ఉంది. విమోచన క్రయధనం యెహోవాను ఎలా శాంతింపజేస్తుంది లేదా సంతోషపెడుతుంది? అంటే, తన కుమారుడు చనిపోతే యెహోవాకు సంతోషమని మనం అనుకోవాలా? కాదు. విమోచన క్రయధనం వల్ల తనకు, మనుషులకు మధ్య ఉన్న సంబంధం తిరిగి నెలకొల్పడానికి ఒక ఆధారం దొరికినందుకు యెహోవాకు సంతోషం. (రోమా. 3:23-26) అంతెందుకు, క్రీస్తు చనిపోవడానికి ముందున్న నమ్మకమైన సేవకుల్ని కూడా యెహోవా నీతిమంతులుగా ‘లెక్కించవచ్చు.’ (ఆది. 15:1, 6, అధస్సూచి) అదెలా? భవిష్యత్తులో తన కుమారుడు విమోచన క్రయధనాన్ని ఇస్తాడని యెహోవాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి, దాని విలువను ఆయన ముందే వాడేసి వాళ్లను నీతిమంతులుగా లెక్కించాడు. (యెష. 46:10) మనుషులు దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి విమోచన క్రయధనం దారి తెరిచింది.

16. ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతున్నప్పుడు, ఇంకా దేని గురించి మీరు ఆలోచించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

16 దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడం వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందుతున్నారో ఆలోచించండి. ఉదాహరణకు, మీరు యేసు చెప్పినట్టే యెహోవాను “తండ్రి” అని పిలవవచ్చు. (మత్త. 6:9) కొన్నిసార్లయితే, యెహోవాను “ఫ్రెండ్‌” అని కూడా పిలవవచ్చు. అయితే, “తండ్రి” లేదా “ఫ్రెండ్‌” లాంటి పదాల్ని ఉపయోగించేటప్పుడు మనం చాలా గౌరవం, వినయం చూపించాలి. ఎందుకు? ఎందుకంటే, మనం పాపులం కాబట్టి యెహోవాకు ఏ కాస్త దగ్గరైనా, అది మన గొప్పతనం వల్ల కాదుగానీ విమోచన క్రయధనం వల్లే అని గుర్తుపెట్టుకోవాలి. యేసు ద్వారా ‘అన్నీ మళ్లీ తనతో శాంతియుత సంబంధం కలిగివుండేలా’ యెహోవా చేశాడు. “ఆ కుమారుడు హింసాకొయ్య మీద చిందించిన రక్తం వల్లే అది సాధ్యమైంది.” (కొలొ. 1:19, 20) అందుకే, మనం అపరిపూర్ణులమైనా ఇప్పుడు కూడా యెహోవాతో స్నేహం చేయగలుగుతున్నాం.

రోమా సైనికులు యేసును హింసాకొయ్యకు వేలాడదీయడానికి సిద్ధం చేస్తున్నారు. వాళ్లలో ఇద్దరు సైనికులేమో యేసును కొయ్య దగ్గరికి తెస్తున్నారు, ఇంకో సైనికుడేమో చేతిలో సుత్తి, మేకు పట్టుకుని ఉన్నాడు.

యేసు మరణం వల్ల మాత్రమే యెహోవాకు, మనుషులకు మధ్య తిరిగి శాంతియుత సంబంధం నెలకొల్పడం సాధ్యమైంది (16వ పేరా చూడండి)


విమోచన క్రయధనం యెహోవా కరుణకు అద్దంపడుతుంది

17. విమోచన క్రయధనం యెహోవా కరుణకు ఎలా అద్దంపడుతుంది? (ఎఫెసీయులు 2:4, 5)

17 యెహోవా “అత్యంత కరుణామయుడు” అని విమోచన క్రయధనం రుజువు చేస్తుంది. ఆయన, “పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతోపాటు బ్రతికించాడు.” (ఎఫెసీయులు 2:4, 5 చదవండి.) “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి ఉన్నవాళ్లు,” పాపం అనే శిథిలాల కింద చిక్కుకుపోయామని గుర్తించి, “రక్షించండి” “రక్షించండి” అని అరుస్తారు. (అపొ. 13:48) యెహోవా వాళ్ల అరుపులు విని, రాజ్య సందేశం ద్వారా వాళ్లకు సహాయం చేస్తాడు. అప్పుడు వాళ్లు ఆయన గురించి, ఆయన కుమారుడైన యేసు గురించి తెలుసుకుంటారు. (యోహా. 17:3) ఆదాముహవ్వల పాపం వల్ల దేవుని సంకల్పం ఇక నెరవేరదని సాతాను అనుకుంటే, అతను పప్పులో కాలు వేసినట్టే.

18. విమోచన క్రయధనం గురించి ధ్యానిస్తున్నప్పుడు, ఏ ముఖ్యమైన విషయాన్ని మనసులో ఉంచుకోవాలి?

18 విమోచన క్రయధనం వల్ల మనకు ఏ ప్రయోజనాలు వస్తాయో ఆలోచిస్తున్నప్పుడు, అంతకన్నా ముఖ్యమైన విషయాన్ని మనసులో ఉంచుకోవాలి. విమోచన క్రయధనాన్ని కేవలం మన ప్రయోజనం కోసమే చేసిన ఏర్పాటులా కాకుండా, ఏదెను తోటలో సాతాను లేవదీసిన సవాలుకు యెహోవా జవాబు ఇవ్వడానికి వాడే సాధనంలా చూడాలి. (ఆది. 3:1-5, 15) విమోచన క్రయధనం ద్వారానే యెహోవా తన పేరు మీద పడిన నిందలన్నీ కడిగేసి, దాన్ని పవిత్రపర్చుకుంటాడు. అంతేకాదు, ఆయన ప్రేమాస్వరూపి కాబట్టి మనల్ని పాపమరణాల నుండి కూడా రక్షిస్తాడు. ఆయన తన అపారదయతో, మనం పాపులమైనా సరే సాతాను సవాలుకు జవాబిచ్చే విషయంలో మనకు కూడా చిన్న వంతు ఇచ్చాడు. (సామె. 27:11) మరి మీరు విమోచన క్రయధనం మీద కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? దీనిగురించి తర్వాత ఆర్టికల్‌లో చూస్తాం.

విమోచన క్రయధనం మనకెలా సహాయం చేస్తుంది?

  • పాపక్షమాపణ పొందడానికి

  • పాపపు స్థితిని బాగుచేయడానికి

  • దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి

పాట 19 ప్రభువు రాత్రి భోజనం

a పదాల వివరణ: విమోచన క్రయధనం అంటే బందీల్ని విడిపించడానికి కట్టే ధర. యేసు చనిపోవడం వల్ల, దేవుని మాట వినే మనుషులు పాపమరణాల బందిఖానా నుండి విడుదలౌతారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి