అధ్యయన ఆర్టికల్ 49
పాట 44 ఒక దీనుడి ప్రార్థన
వేరేవాళ్లకు సలహా ఇవ్వడానికి యోబు పుస్తకం సహాయం చేస్తుంది
“యోబూ, దయచేసి నా మాటలు ఆలకించు.”—యోబు 33:1.
ముఖ్యాంశం
సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో యోబు పుస్తకం నుండి నేర్చుకుంటాం.
1-2. యోబు ముగ్గురు స్నేహితులు, ఎలీహు ముందున్న సవాలు ఏంటి?
ఒకప్పుడు సిరిసంపదలతో బాగా బ్రతికిన యోబు ఇప్పుడు అన్నీ కోల్పోయాడనే వార్త, చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది. ఆ వార్త యోబు ముగ్గురు స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరుల చెవిన పడింది. అప్పుడు వాళ్లు అసలు ఏం జరిగిందో చూసొద్దామని, యోబును ఓదారుద్దామని ఊజుకు బయలుదేరారు. అక్కడికి వెళ్లి చూసినప్పుడు వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు.
2 దీన్ని ఊహించుకోండి. యోబు, తనది అనుకున్న ప్రతీది తనకు కాకుండా పోయింది. ఆయనకున్న విస్తారమైన గొర్రెలు, ఆవులు, ఒంటెలు, గాడిదలు అన్నీ పోయాయి. ఆయన పిల్లలందరూ చనిపోయారు, ఆయన సేవకుల్లో చాలామందిని చంపేశారు, తన పిల్లలున్న ఇల్లు కూలిపోయింది. ఇది చాలదన్నట్టు, యోబుకు ఒక భయంకరమైన జబ్బు కూడా వచ్చింది. దానివల్ల ఆయనకు ఒళ్లంతా బాధాకరమైన పుండ్లు వచ్చాయి. యోబు తీవ్రమైన బాధతో బూడిదలో కూర్చోవడం ఆయన స్నేహితులు చూశారు. అది చూసి వాళ్లకు ఏమనిపించింది? వాళ్లకు ఏడురోజుల వరకు నోటమాట రాలేదు. (యోబు 2:12, 13) ఆ తర్వాత వాళ్లకన్నా చిన్నవాడైన ఎలీహు వచ్చి, వాళ్లకు దగ్గర్లో కూర్చున్నాడు. తర్వాత యోబు ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. తను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే బాగుండని, అనవసరంగా పుట్టానని అన్నాడు. (యోబు 3:1-3, 11) యోబుకు సహాయం అవసరమని స్పష్టంగా కనిపిస్తుంది! అలా సహాయం చేయడమే యోబు ముగ్గురు స్నేహితులు, ఎలీహు ముందున్న సవాలు. వాళ్లు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, అనేదాన్ని బట్టి వాళ్లు యోబుకు నిజమైన స్నేహితులా కాదా, ఆయన్ని పట్టించుకుంటారా లేదా అనేది తెలుస్తుంది.
3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?
3 యోబు ముగ్గురు స్నేహితులు అలాగే ఎలీహు ఏం మాట్లాడారో, ఏం చేశారో యెహోవా మోషేతో రాయించాడు. ఆశ్చర్యకరంగా, కొంతవరకు ఎలీఫజు చెడ్డదూత ప్రేరణతో మాట్లాడాడని అర్థమౌతుంది. కానీ ఎలీహు మాత్రం పవిత్రశక్తి ప్రేరణతో మాట్లాడాడు. (యోబు 4:12-16; 33:24, 25) అందుకే, యోబు పుస్తకంలో కొంతమంది ఇచ్చిన మంచి సలహాలు ఉన్నాయి, కొంతమంది ఇచ్చిన చెడ్డ సలహాలు కూడా ఉన్నాయి. యోబు పుస్తకం ముఖ్యంగా, ఇతరులకు ఎలా మంచి సలహాలు ఇవ్వవచ్చో చెప్తుంది. ముందుగా, యోబు ముగ్గురు స్నేహితులు ఎలాంటి చెడ్డ ఆదర్శం ఉంచారో చూస్తాం. అలాగే ఎలీహు ఉంచిన మంచి ఆదర్శాన్ని కూడా చూస్తాం. ప్రతీదాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యోబు పుస్తకం అప్పట్లో ఇశ్రాయేలీయులకు ఎలా సహాయం చేసి ఉంటుందో, నేడు మనకెలా సహాయం చేస్తుందో చూస్తాం.
యోబు ముగ్గురు స్నేహితులు ఆయనకు ఎలా సలహా ఇచ్చారు?
4. యోబు ముగ్గురు స్నేహితులు ఒకటి అనుకుని, ఇంకోటి ఎందుకు చేశారు? (చిత్రం కూడా చూడండి.)
4 యోబుకు జరిగినదాని గురించి విన్నప్పుడు, ఆయన ముగ్గురు స్నేహితులు ఆయన మీద ‘సానుభూతి చూపించడానికి, ఓదార్చడానికి’ వెళ్లారని బైబిలు చెప్తుంది. (యోబు 2:11) కానీ వాళ్లు అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. ఎందుకు? దానికి కనీసం మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్లు ముందూవెనకా ఆలోచించకుండా ఒక తప్పుడు ముగింపుకు వచ్చేశారు. ఉదాహరణకు, యోబు పాపాలు చేయడం వల్లే దేవుడు ఆయన్ని ఇలా శిక్షిస్తున్నాడని వాళ్లు అనుకున్నారు.a (యోబు 4:7; 11:14) రెండు, వాళ్లు యోబు మనసును విరిచేస్తూ, ఆయన్ని ఇంకా బాధపెట్టేలా మాట్లాడారు. ఉదాహరణకు, ఆ ముగ్గురు స్నేహితుల మాటలు కత్తిపోటుల్లా గుచ్చుకున్నాయి. (యోబు 13:12) యోబు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడని, బిల్దదు రెండుసార్లు మనసు చివుక్కుమనేలా మాట్లాడాడు. (యోబు 8:2; 18:2) యోబు తెలివితక్కువవాడు అని జోఫరు మొహం మీదే కొట్టినట్టు చెప్పాడు. (యోబు 11:12) మూడు, వాళ్లు యోబుతో మాట్లాడుతున్నప్పుడు అరవకపోయినా, వాళ్ల స్వరం మాత్రం అహంకారంగా, వెటకారంగా ఉంది. (యోబు 15:7-11) వీటన్నిటినిబట్టి, ఆ ముగ్గురు యోబు తప్పుచేశాడని నిరూపించడం మీదే పడ్డారు గానీ, ఆయన్ని ఓదారుద్దామనే ఆలోచనే వాళ్లకు లేదని తెలుస్తుంది.
సలహా ఇస్తున్నప్పుడు ఎదుటివ్యక్తికి సహాయం చేసేలా మాట్లాడాలే గానీ, అహంకారంగా కాదు (4వ పేరా చూడండి)
5. తన స్నేహితుల మాటల వల్ల యోబు ఏం చేశాడు?
5 అందుకే, వాళ్ల మాటలు చచ్చిన పామును ఇంకా చంపినట్లు యోబును కృంగదీశాయి. (యోబు 19:2) యోబు తనను తాను సమర్థించుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడో దీన్నిబట్టి మనకు అర్థమౌతుంది. దానివల్ల ఆయన సరిగ్గా ఆలోచించలేక దురుసుగా, తెలివితక్కువగా మాట్లాడాడు. (యోబు 6:3, 26) యోబు స్నేహితుల మాటలు యెహోవా ఆలోచనకు తగినట్టుగా లేవు; పైగా వాళ్ల మాటలు యోబు మీద దయ, జాలి లేనట్టుగా ఉన్నాయి. దానివల్ల, వాళ్లు సాతాను చేతిలో కీలుబొమ్మలు అయ్యారు. (యోబు 2:4, 6) యోబు కథ గతంలో ఉన్నవాళ్లకు ఎలా పనికొచ్చి ఉండొచ్చు? అది ఇప్పుడు మనకెలా పనికొస్తుంది?
6. యోబు ముగ్గురు స్నేహితుల చెడ్డ ఉదాహరణ నుండి ఇశ్రాయేలు పెద్దలు ఏం నేర్చుకొని ఉండొచ్చు?
6 యోబు కథ ఇశ్రాయేలీయులకు ఎలా పనికొచ్చి ఉండొచ్చు? ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా ఏర్పడిన తర్వాత, తన ప్రమాణాల ప్రకారం న్యాయం తీర్చడానికి యెహోవా కొంతమంది అర్హులైన పెద్దల్ని నియమించాడు. (ద్వితీ. 1:15-18; 27:1) వాళ్లు ఏదైనా సలహా ఇచ్చేముందు లేదా తీర్పు తీర్చేముందు అవతలి వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వినాలి. (2 దిన. 19:6) అంతేకాదు, వాళ్లు ఏవేవో ఊహించుకునే బదులు, వాస్తవాలన్నీ తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగాలి. (ద్వితీ. 19:18) సాయం కోరి వచ్చినవాళ్ల మీద ఇశ్రాయేలు సలహాదారులు చిరాకు పడకూడదు. ఎందుకంటే మొహం చిరాగ్గా పెట్టుకుంటే, ఎదుటివ్యక్తి తన మనసులో ఉన్నది చెప్పుకోలేడు. (నిర్గ. 22:22-24) ఇశ్రాయేలు పెద్దల్లో ఎవరైతే యోబు కథ గురించి ఆలోచించి ఉంటారో, వాళ్లు ఎన్నో మంచి పాఠాలు నేర్చుకుని ఉంటారు.
7. ఇశ్రాయేలీయుల్లోని పెద్దలే కాకుండా ఇంకా ఎవరెవరు కూడా సలహా ఇవ్వవచ్చు? యోబు కథ వాళ్లకెలా పనికొచ్చి ఉండొచ్చు? (సామెతలు 27:9)
7 నిజమే, సలహా ఇచ్చేది ఇశ్రాయేలీయుల్లోని పెద్దలు మాత్రమే కాదు. చిన్నా-పెద్దా, ఆడ-మగ అనే తేడా లేకుండా ఎవరైనా తన స్నేహితుడికి ఆరాధన విషయంలో, ప్రవర్తన విషయంలో సలహా ఇవ్వవచ్చు. (కీర్త. 141:5) నిజాయితీగా ఇచ్చే సలహా నిజమైన స్నేహానికి గుర్తు. (సామెతలు 27:9 చదవండి.) ఇశ్రాయేలీయులు సలహా ఇచ్చేటప్పుడు ఎలా మాట్లాడకూడదో, ఎలా ప్రవర్తించకూడదో యోబు ముగ్గురు స్నేహితుల్ని చూసి నేర్చుకొని ఉండొచ్చు.
8. వేరేవాళ్లకు సలహా ఇస్తున్నప్పుడు మనం ఏం చేయకూడదు? (చిత్రాలు కూడా చూడండి.)
8 యోబు కథ ఇప్పుడు మనకెలా పనికొస్తుంది? క్రైస్తవులుగా మన తోటి బ్రదర్స్-సిస్టర్స్ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు చేదోడువాదోడుగా ఉండాలని కోరుకుంటాం. అయితే, అలా చేయాలంటే మనం యోబు ముగ్గురు స్నేహితుల్లా అస్సలు ఉండకూడదు. బదులుగా మూడు పనులు చేయవచ్చు. ఒకటి, మనం సలహా ఇచ్చేముందు, వెంటనే ఒక ముగింపుకు రాకుండా వాస్తవాలన్నీ తెలుసుకోవాలి. రెండు, ఎలీఫజులా మన సొంత అనుభవాన్ని బట్టి కాదుగానీ, బైబిలు ఆధారంగా సలహా ఇవ్వాలి. (యోబు 4:8; 5:3, 27) మూడు, మనం వాళ్లతో కఠినంగా లేదా దురుసుగా మాట్లాడకూడదు. నిజమే, ఎలీఫజు అలాగే ఆయన స్నేహితులు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అంతెందుకు, వాళ్లు చెప్పిన ఒక విషయాన్ని పౌలు కూడా ఎత్తి రాశాడు. (యోబు 5:13 ని 1 కొరింథీయులు 3:19 తో పోల్చండి.) అయితే, వాళ్ల మాటలు చాలావరకు యెహోవాను తప్పుగా చూపించాయి, యోబు హృదయాన్ని ముక్కలు చేశాయి. కాబట్టి అవన్నీ అబద్ధాలని యెహోవా అన్నాడు. (యోబు 42:7, 8) ఒక మంచి సలహా ఎప్పుడూ యెహోవాను మొండివాడిలా చూపించదు; లేదా ఆయన సేవకుల్ని ప్రేమలేని వాళ్లుగా చూపించదు. ఇప్పుడు మనం ఎలీహు ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చో చూద్దాం.
సలహా ఇస్తున్నప్పుడు (1) వాస్తవాలన్నీ తెలుసుకోవాలి, (2) బైబిలు ఆధారంగా ఇవ్వాలి (3) ప్రేమగా మాట్లాడాలి (8వ పేరా చూడండి)
ఎలీహు, యోబుకు ఎలా సలహా ఇచ్చాడు?
9. తన స్నేహితులు మాట్లాడడం ఆపేసిన తర్వాత కూడా, యోబుకు ఎందుకు సహాయం అవసరమైంది? దాన్ని యెహోవా ఎలా ఇచ్చాడు?
9 యోబు, ఆయన స్నేహితుల వాదన పూర్తయ్యేసరికి అక్కడ పరిస్థితి అంతా వాడివేడిగా తయారైంది. వాళ్లు ఎంతగా మాట్లాడారంటే, వాళ్ల మాటల్ని రాయడానికి బైబిల్లో 28 అధ్యాయాలు పట్టాయి. అందులో చాలావరకు వాళ్లు కోపంతో, చిరాకుతో మాట్లాడిన మాటలే ఉన్నాయి! అందుకే యోబు బాధ రవ్వంత కూడా తగ్గలేదు. ఆయనకు ఇంకా ఓదార్పు, దిద్దుబాటు అవసరం. మరి యెహోవా, యోబుకు ఎలా సహాయం చేశాడు? ఎలీహును ఉపయోగించి యెహోవా యోబుకు సహాయం చేశాడు. మరి, ఎలీహు ముందే ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఇలా అన్నాడు: “నేను వయసులో చిన్నవాణ్ణి, మీరు పెద్దవాళ్లు. అందుకే మీ మీద గౌరవంతో మధ్యలో మాట్లాడలేదు.” (యోబు 32:6, 7) ఈ రోజుల్లోని చాలామంది యౌవనస్థుల్లాగే, యువకుడైన ఎలీహు కూడా వృద్ధులకు యౌవనుల కన్నా ఎక్కువ జ్ఞానం, అనుభవం ఉంటాయని అనుకున్నాడు. ఎందుకంటే వృద్ధులు చాలా జీవితం చూసుంటారు, వాళ్లకు చాలా విషయాలు తెలుసుంటాయి. కానీ యోబు అలాగే ఆయన స్నేహితుల మాటల్ని ఓపిగ్గా విన్నాక ఎలీహు మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఆయన ఇలా అన్నాడు: “కేవలం వయసు వల్లే ఒక వ్యక్తి తెలివిగలవాడు అవ్వడు, సరైనదేదో అర్థం చేసుకోగలిగేది వృద్ధులు మాత్రమే కాదు.” (యోబు 32:9) ఆ తర్వాత ఎలీహు ఏం చెప్పాడు? ఎలా చెప్పాడు?
10. యోబుకు సలహా ఇచ్చేముందు ఎలీహు ఏం చేశాడు? (యోబు 33:6, 7)
10 ఎలీహు, యోబుకు సలహా ఇచ్చేముందు పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉండేలా చూసుకున్నాడు. ఎలా? ముందు, ఎలీహు తన కోపావేశాల్ని కంట్రోల్ చేసుకున్నాడు. అది మనకెలా తెలుసంటే, మొదట్లో ఎలీహుకు చాలా కోపం వచ్చిందని బైబిలు చెప్తుంది. (యోబు 32:2-5) అయినా, ఆయన చిరాకులో యోబును పల్లెత్తు మాట కూడా అనలేదు, బదులుగా భరోసాను ఇస్తూ మాట్లాడాడు. ఉదాహరణకు, ఆయన యోబుతో ఇలా అన్నాడు: “చూడు! సత్యదేవుని ముందు నేను కూడా నీలాంటివాణ్ణే.” (యోబు 33:6, 7 చదవండి.) తర్వాత ఎలీహు, యోబు చెప్పినదంతా జాగ్రత్తగా విన్నానని ఆయనకు అర్థమయ్యేలా చేశాడు. నిజానికి, యోబు చెప్పుకున్న గాథ అంతటినీ ఎలీహు ఒక్కముక్కలో చెప్పాడు. (యోబు 32:11; 33:8-11) మరోసారి, యోబుకు సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఎలీహు ఇలాగే చేశాడు.—యోబు 34:5, 6, 9; 35:1-4.
11. ఎలీహు, యోబుకు ఎలా సలహా ఇచ్చాడు? (యోబు 33:1)
11 నమ్మకస్థుడైన యోబుకు సలహా ఇస్తున్నప్పుడు, ఎలీహు ఆయన మీద గౌరవం చూపించాడు. ఉదాహరణకు, ఎలీహు యోబుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పేరును ఉపయోగించాడు. బహుశా యోబు ముగ్గురు స్నేహితులు అలా ఉపయోగించి ఉండకపోవచ్చు. (యోబు 33:1 చదవండి.) యోబు, ఆయన ముగ్గురు స్నేహితులు వాదించుకుంటున్నప్పుడు, తను మాట్లాడే అవకాశం కోసం ఎలీహు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని తను సలహా ఇస్తున్నప్పుడు యోబుకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు. (యోబు 32:4; 33:32) యోబు మాటల్లో తప్పేంటో స్పష్టంగా, సూటిగా చెప్పాడు. అలాగే యెహోవాకున్న తెలివిని, శక్తిని, న్యాయాన్ని, విశ్వసనీయ ప్రేమను యోబుకు గుర్తుచేశాడు. (యోబు 36:18, 21-26; 37:23, 24) ఎలీహు ఇచ్చిన మంచి సలహా యోబు ఆలోచనను ఒక దారికి తెచ్చింది. అందుకే ఆ తర్వాత యెహోవా యోబుకు సలహా ఇచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకోగలిగాడు. (యోబు 38:1-3) ఎలీహు ఉదాహరణ అప్పటివాళ్లకు ఎలా పనికొచ్చి ఉండొచ్చో, అలాగే ఇప్పుడు మనకు ఎలా పనికొస్తుందో చూద్దాం.
12. తన ప్రజలకు సహాయం చేయడానికి యెహోవా ప్రవక్తల్ని ఎలా ఉపయోగించుకున్నాడు? ఎలీహు మంచి ఉదాహరణ, ఇశ్రాయేలీయులకు ఎలా పనికొచ్చి ఉండొచ్చు?
12 యోబు కథ ఇశ్రాయేలీయులకు ఎలా పనికొచ్చి ఉండొచ్చు? ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో యెహోవా తన ఉద్దేశాల్ని ఇశ్రాయేలీయులకు చెప్పడానికి ప్రవక్తల్ని నియమించాడు. ఉదాహరణకు, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయుల్ని ఒక తల్లిలా చేయి పట్టుకుని నడిపించడానికి యెహోవా దెబోరా ప్రవక్త్రిని ఇచ్చాడు. అలాగే సమూయేలు కూడా చిన్నప్పటి నుంచి అలసిపోకుండా యెహోవా గురించి ఉపదేశిస్తూనే ఉన్నాడు. (న్యాయా. 4:4-7; 5:7; 1 సమూ. 3:19, 20) తర్వాత రాజుల కాలంలో తన ప్రజల్ని ఆధ్యాత్మికంగా బలపర్చడానికి, సత్యారాధన నుండి దారి తప్పినవాళ్లను దారిలో పెట్టడానికి యెహోవా తన ప్రవక్తల్ని ఒకరి తర్వాత ఒకర్ని పంపిస్తూనే ఉన్నాడు. (2 సమూ. 12:1-4; అపొ. 3:24) అంతేకాదు, యోబు కథలో ఉన్న ఎలీహు ఉదాహరణ, సలహా ఇస్తున్నప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నమ్మకమైన స్త్రీ-పురుషులకు సహాయం చేసి ఉండొచ్చు.
13. ఇప్పుడు మనం మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఎలా ప్రోత్సహించవచ్చు?
13 యోబు కథ మనకెలా పనికొస్తుంది? అప్పటి ప్రవక్తల్లాగే, ఇప్పుడు కూడా మనం బైబిలు ఉపయోగించి దేవుని గురించి చెప్తాం. అంతేకాదు ఆ ప్రవక్తల్లాగే, మనం తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని మాటలతో ప్రోత్సహిస్తాం, బలపరుస్తాం. (1 కొరిం. 14:3) ముఖ్యంగా సంఘపెద్దలు, సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌తో “ఊరటనిచ్చేలా” మాట్లాడాలి. ఒకవేళ ఎవరైనా కోపంగా, “దురుసుగా లేదా ఆలోచించకుండా” మాట్లాడినా, సంఘ పెద్దలు మాత్రం దయగా, ప్రేమగానే మాట్లాడాలి.—1 థెస్స. 5:14; యోబు 6:3, అధస్సూచి.
14-15. సలహా ఇస్తున్నప్పుడు సంఘపెద్దలు ఎలీహులా ఎలా ఉండవచ్చో ఒక ఉదాహరణ చెప్పండి?
14 ఒకసారి ఇలా ఊహించుకోండి: ఒక సిస్టర్ బాధగా ఉన్నట్టు ఒక సంఘపెద్ద గమనించాడు. మంచి విషయం ఏంటంటే, ఆయన ఇంకో బ్రదర్‌తో కలిసి, ఆ సిస్టర్‌ని ప్రోత్సహించడానికి వాళ్ల ఇంటికి వెళ్లాడు. ప్రీచింగ్‌కి వెళ్తున్నా, మీటింగ్‌కి వస్తున్నా తనకు మాత్రం సంతోషం లేదని ఆ సిస్టర్ చెప్పింది. ఇప్పుడు వాళ్లు ఏం చేస్తారు?
15 మొదటిగా, ఆ సిస్టర్ బాధ వెనకున్న కారణం ఏంటో తెలుసుకోవడానికి వాళ్లు ప్రయత్నిస్తారు. దానికోసం ఆమె చెప్పేదంతా వాళ్లు ఓపిగ్గా వింటారు. ఆమె దేవుని ప్రేమను పొందడానికి అర్హురాలు కాదని అనుకుంటుందా? లేదా “జీవిత చింతల వల్ల” ఇలా మాట్లాడుతుందా? అని ఆలోచిస్తారు. (లూకా 21:34) రెండోదిగా, ఆమెకు ఎంత బాధగా ఉన్నా మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి వస్తుంది కాబట్టి ఆమెను మెచ్చుకోవడానికి చూస్తారు. మూడోదిగా, వాళ్లు ఆమె పరిస్థితిని, బాధను అర్థంచేసుకున్నాక, వాళ్లు బైబిల్ని ఉపయోగించి దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడని ధైర్యం చెప్తారు.—గల. 2:20.
యోబు పుస్తకం నుండి నేర్చుకుంటూనే ఉండండి
16. యోబు పుస్తకం నుండి నేర్చుకుంటూనే ఉండాలంటే ఏం చేయాలి?
16 యోబు పుస్తకం నుండి ఎన్ని మంచి పాఠాలు నేర్చుకున్నామో కదా! మనం ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు, దేవుడు కష్టాల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో, మనం వాటిని ఎలా సహించవచ్చో యోబు పుస్తకంలో ఉంది. అలాగే ఈ ఆర్టికల్‌లో, సలహా ఇస్తున్నప్పుడు యోబు ముగ్గురు స్నేహితుల్లా కాదుగానీ, ఎలీహులా ఉండాలని చూశాం. ఈసారి ఎప్పుడైనా, ఎవరికైనా మీరు సలహా ఇవ్వాల్సి వస్తే, ఒకసారి యోబు పుస్తకాన్ని తిరగేయండి, అందులో ఉన్న పాఠాల్ని గుర్తుచేసుకోండి. ఒకవేళ మీరు యోబు పుస్తకాన్ని చదివి చాలాకాలం అయ్యుంటే, దాన్ని మళ్లీ చదవండి. అందులోని మాటలు, అవి రాసిన రోజుకు ఎంత పనికొచ్చాయో, ఈ రోజుకీ అంతే పనికొస్తాయని మీరు గమనిస్తారు!
పాట 125 “కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు”
a యెహోవా దృష్టిలో ఏ మనిషీ నీతిమంతుడు కాదని, ఆయన్ని ఎవ్వరూ సంతోషపెట్టలేరని ఎలీఫజు చెడ్డదూత ప్రేరణతో అని ఉంటాడు. ఎలీఫజు ఈ తప్పుడు ఆలోచనను నమ్మాడు కాబట్టే అతను యోబుతో మాట్లాడిన ప్రతీసారి ఇలాంటి అర్థం వచ్చేలాగే మాట్లాడాడు.—యోబు 4:17; 15:15, 16; 22:2.