అధ్యయన ఆర్టికల్ 48
పాట 129 సహనం చూపిస్తూ ఉందాం
కష్టాల్లో యోబు పుస్తకం మీకు సహాయం చేస్తుంది
“ఈ మాట వాస్తవం, దేవుడు చెడు చేయడు.”—యోబు 34:12.
ముఖ్యాంశం
దేవుడు కష్టాల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో, మనం ఆ కష్టాల్ని ఎలా తట్టుకోవచ్చో యోబు పుస్తకం నుండి నేర్చుకుంటాం.
1-2. యోబు పుస్తకం తప్పకుండా చదవాల్సిన ఒక పుస్తకం అని చెప్పడానికి కొన్ని కారణాలేంటి?
ఈ మధ్యకాలంలో మీరు యోబు పుస్తకాన్ని చదివారా? అది దాదాపు 3,500 సంవత్సరాల క్రితం రాయబడినా, చాలామంది దాన్ని పుస్తక ప్రపంచంలో ఒక ఆణిముత్యంలా చూస్తారు. అందులో చాలా తేలిగ్గా అర్థమయ్యే, అందమైన, శక్తివంతమైన పదాలు ఉన్నాయి. అందుకే, ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి “చాలా గొప్ప రచయిత” అని ఒక రెఫరెన్సు పుస్తకం పిలుస్తుంది. నిజానికి ఈ అద్భుతమైన పుస్తకాన్ని రాసింది మోషేనే అయినా, దాన్ని రాయించింది మాత్రం యెహోవా దేవుడు.—2 తిమో. 3:16.
2 యోబు పుస్తకం బైబిల్లో అన్నిటికన్నా చాలా ముఖ్యమైన పుస్తకం. దానికి ఒక కారణం ఏంటంటే, దేవదూతలు అలాగే మనుషుల ముందున్న ఒక ముఖ్యమైన సమస్య గురించి ఈ పుస్తకంలో ఉంది. అదే, యెహోవా పేరును పవిత్రపర్చడం. అంతేకాదు యెహోవాకున్న ప్రేమ, జ్ఞానం, న్యాయం, శక్తి లాంటి అద్భుతమైన లక్షణాల గురించి కూడా ఈ పుస్తకంలో ఉంది. అలాగే బైబిల్లో, యెహోవా “సర్వశక్తిమంతుడు” అని మిగతా పుస్తకాల కన్నా యోబు పుస్తకంలోనే ఎక్కువసార్లు ఉంది. దీంతోపాటు, మనసును తొలిచేసే ఎన్నో ప్రశ్నలకు యోబు పుస్తకంలో జవాబులున్నాయి. అందులో ఒకటి, దేవుడు కష్టాల్ని ఎందుకు అనుమతిస్తున్నాడు?
3. యోబు పుస్తకం చదవడం వల్ల మనకు వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏంటి?
3 ఒక ఎత్తయిన కొండమీద నుండి చూస్తే చుట్టుపక్కలవన్నీ ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తాయో, యోబు పుస్తకం కూడా మన కష్టాల్ని చాలా ఎత్తులో నుండి చూడడానికి సహాయం చేస్తుంది. అంటే, యెహోవా దృష్టితో చూడడానికి సహాయం చేస్తుంది. అయితే ఈ ఆర్టికల్‌లో, యోబు పుస్తకం కష్టాల్లో మనకు ఎలా సహాయం చేస్తుందో చూస్తాం. అలాగే యోబు కథ ఇశ్రాయేలీయులకు ఎలా పనికొచ్చి ఉండొచ్చో, ఇప్పుడు మనకెలా పనికొస్తుందో చూస్తాం. వీటితోపాటు, యోబు పుస్తకాన్ని ఉపయోగించి వేరేవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో కూడా చూస్తాం.
యోబు కష్టాలుపడేలా దేవుడు అనుమతించాడు
4. యోబుకు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులకు ఎలాంటి తేడా ఉంది?
4 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఊజు దేశంలో, యోబు అనే వ్యక్తి ఉండేవాడు. ఈ ఊజు అనే దేశం బహుశా వాగ్దాన దేశానికి తూర్పున అలాగే అరేబియాకు ఉత్తరాన ఉండి ఉంటుంది. ఒకపక్క ఐగుప్తులో ఉన్న కొంతమంది ఇశ్రాయేలీయులు విగ్రహారాధన వైపు అడుగులు వేస్తుంటే, మరోపక్క ఊజులో ఉన్న యోబు యెహోవావైపు స్థిరంగా నిలబడి, ఆయనకు నమ్మకంగా సేవచేస్తున్నాడు. (యెహో. 24:14; యెహె. 20:8) యోబు గురించి యెహోవా ఇలా అన్నాడు: “భూమ్మీద అతని లాంటివాళ్లు ఎవరూ లేరు.”a (యోబు 1:8) యోబుకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, సమాజంలో కూడా మంచి పేరుప్రతిష్ఠలు ఉన్నాయి. తూర్పు దేశస్థులందరిలో అతనిలాంటి గొప్పవాడు లేడు. (యోబు 1:3) ఇంత ఆస్తి, పలుకుబడి ఉన్న వ్యక్తి, యెహోవాకు నమ్మకంగా సేవచేయడం చూసి సాతాను కుళ్లుకున్నాడు.
5. యోబు బాధలుపడేలా యెహోవా ఎందుకు అనుమతించాడు? (యోబు 1:20-22; 2:9, 10)
5 యోబుకు కష్టాలు వస్తే యెహోవాను వదిలేస్తాడని సాతాను నిందించాడు. (యోబు 1:7-11; 2:2-5) యెహోవాకు యోబు అంటే చాలా ఇష్టం. కానీ, సాతాను సిగ్గుమాలిన నిందలు వేసి, కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తేలా చేశాడు. కాబట్టి ఆ నిందలు నిజమో కాదో నిరూపించుకునేలా యెహోవా సాతానును అనుమతించాడు. (యోబు 1:12-19; 2:6-8) అప్పుడు సాతాను ఎంత శాడిస్ట్‌లా ప్రవర్తించాడంటే యోబుకున్న గొర్రెల్ని, పశువుల్ని లేకుండా చేశాడు. అతనికున్న పదిమంది పిల్లల్ని చంపి, గుండెకోత మిగిల్చాడు. అంతటితో ఆగకుండా, అతని అరికాలి నుండి నడినెత్తి వరకు బాధాకరమైన పుండ్లు వచ్చేలా చేశాడు. సాతాను అంత చేసినా, యోబు యథార్థత మాత్రం చెక్కుచెదర్లేదు. (యోబు 1:20-22; 2:9, 10 చదవండి.) అయితే, కొంతకాలం తర్వాత యెహోవా యోబుకు మంచి ఆరోగ్యాన్ని, ఆస్తిపాస్తుల్ని, పేరుప్రతిష్ఠల్ని తిరిగిచ్చాడు. అలాగే పదిమంది పిల్లల్ని కూడా ఇచ్చాడు. అంతేకాదు, అద్భుతరీతిగా యోబు ఆయుష్షును 140 సంవత్సరాలు పొడిగించాడు. దానివల్ల యోబు తన వంశంలో నాలుగో తరాన్ని కూడా చూడగలిగాడు. (యోబు 42:10-13, 16) యోబు కథ ఒకప్పుడున్న వాళ్లకు ఎలా పనికొచ్చి ఉండొచ్చో, ఇప్పుడు మనకెలా పనికొస్తుందో చూద్దాం.
6. ఇశ్రాయేలీయులు యోబు కథ తెలుసుకుని, దాన్ని పాటించి ఉంటే ఎలా ప్రయోజనం పొంది ఉండేవాళ్లు? (చిత్రం కూడా చూడండి.)
6 యోబు కథ ఇశ్రాయేలీయులకు ఎలా పనికొచ్చి ఉండొచ్చు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో క్షణం ఒక యుగంలా బ్రతికారు. యెహోషువ, కాలేబు విషయమే తీసుకుంటే, వాళ్లు తమ యౌవనమంతా దాసులుగానే గడిపారు. వాళ్లు ఏ తప్పూ చేయకపోయినా, 40 సంవత్సరాలు ఎడారిలో తిరిగారు. ఒకవేళ ఇశ్రాయేలీయులకు యోబు పడిన కష్టాల గురించి, దేవుడు అతనికి ఇచ్చిన దీవెనల గురించి తెలిసుంటే, ఖచ్చితంగా వాళ్లు ప్రోత్సాహం పొందుంటారు. దాంతోపాటు కష్టాలకు అసలు కారణం ఎవరో ఇశ్రాయేలీయులు అలాగే తర్వాతి తరాలు తెలుసుకుని ఉంటారు. అంతేకాదు, దేవుడు కష్టాల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో వాళ్లు ఇంకా బాగా అర్థంచేసుకుని ఉండొచ్చు. మనుషులు చూపించే యథార్థతకు, నమ్మకత్వానికి యెహోవా ఎంతో విలువిస్తాడని కూడా వాళ్లు తెలుసుకుని ఉండొచ్చు.
ఎంతోకాలంగా ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులు, తర్వాత్తర్వాత యోబు గురించి తెలుసుకుని ఉండొచ్చు. యోబు కథ నుండి వాళ్లు ఎంతో నేర్చుకొని ఉండొచ్చు (6వ పేరా చూడండి)
7-8. యోబు పుస్తకం మనకెలా సహాయం చేస్తుంది? ఒక అనుభవం చెప్పండి.
7 యోబు కథ మనకెలా పనికొస్తుంది? బాధాకరంగా, మంచివాళ్లకు చెడు ఎందుకు జరుగుతుందో అర్థంకాక చాలామంది దేవున్ని నమ్మడం మానేస్తున్నారు. రువాండాలో ఉంటున్న గ్రేస్b ఉదాహరణ గమనించండి. ఆమెకు చిన్నప్పుడు దేవుడంటే నమ్మకం ఉండేది. కానీ తర్వాత్తర్వాత ఆమె పరిస్థితులు మారాయి. ఆమె అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారు. దానివల్ల ఆమె పెంపుడు తండ్రి దగ్గర పెరిగింది. అతను ఆమెను బాగా కొట్టేవాడు, తిట్టేవాడు. ఆ తర్వాత ఒకరోజు ఒక దుర్మార్గుడు ఆమెను రేప్ చేశాడు. గ్రేస్ ఓదార్పు కోసం ఆమె నమ్ముకున్న దేవుని మందిరానికి వెళ్లింది కానీ, అక్కడ ఆమెకు ఓదార్పు దొరకలేదు. ఆ తర్వాత గ్రేస్ దేవునికి ఒక ఉత్తరం రాసింది. అందులో ఆమె ఇలా అంది: “దేవుడా! నేను నీకు ప్రార్థన చేశాను, మంచిపనులు చేశాను. కానీ నేను చేసిన మంచికి నువ్వు నాకు తిరిగి చెడే చేశావు. ఇక నిన్ను వదిలేస్తున్నా! ఇప్పటినుండి నాకు నచ్చినట్టే బ్రతుకుతా.” తమ కష్టాలకు దేవుడే కారణం అనే ముగింపుకు వచ్చిన గ్రేస్ లాంటివాళ్లను చూస్తే, మన గుండె ఎంత తరుక్కుపోతుందో కదా!
8 అయితే, మన బాధలకు కారణం దేవుడు కాదుగానీ సాతానని యోబు పుస్తకం నుండి నేర్చుకున్నాం. అలాగే ఎవరైనా కష్టాలు పడుతున్నారంటే, వాళ్లు ఏదో తప్పు చేయడం వల్లే కష్టాలు వచ్చాయని మనం అనుకోకూడదు. బైబిలు చెప్తున్నట్టు “అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు” ఎవరికైనా, ఎప్పుడైనా జరగవచ్చు. (ప్రసం. 9:11; యోబు 4:1, 8) మనం కష్టాల్ని నమ్మకంగా సహిస్తే, సాతాను అబద్ధికుడని నిరూపిస్తూ యెహోవా వైపు నిలబడతాం. మనం నేర్చుకున్న ఈ విషయాలన్నిటినీ తేలిగ్గా తీసుకోం. (యోబు 2:3; సామె. 27:11) ఎందుకంటే ఈ సత్యాల వల్ల మనం, మన తోటివాళ్లు కష్టాలు ఎందుకు పడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ముందు పేరాలో చూసిన గ్రేస్ అనే సిస్టర్, యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకుని, ఆమె బాధలకు దేవుడు కారణం కాదని అర్థంచేసుకుంది. ఆమె ఇలా చెప్తుంది: “నేను మళ్లీ దేవునికి నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేశాను. ఆయన్ని నేను వదిలిపెడుతున్నాను అని పైకి అన్నానే గానీ నిజంగా నా మనసులో ఆ ఉద్దేశం లేదని యెహోవాకు చెప్పుకున్నాను. నిజానికి, అప్పుడు నాకు యెహోవా అంటే ఎవరో తెలీదు. కానీ ఇప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకర్థమైంది. మొత్తానికి నేను సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను.” దేవుడు కష్టాల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకోవడం వల్ల, మనం కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. అయితే, కష్టాలు వచ్చినప్పుడు యోబు కథ మనకు ఎలా సహాయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
సహించడానికి మనకు యోబు కథ ఎలా సహాయం చేస్తుంది?
9. యోబు పరిస్థితిని వివరించండి. (యాకోబు 5:11)
9 విపరీతమైన నొప్పితో విలవిలలాడుతూ, ఒంటినిండా పుండ్లతో బూడిదలో ఒంటరిగా కూర్చున్న యోబును ఊహించుకోండి. ఆయనకున్న జబ్బు వల్ల చర్మం అంతా నల్లగా మారి, ఎముకల గూడుకు తోలు అతికించినట్టు పీలగా తయారయ్యాడు. ఆయన విపరీతంగా అలసిపోయాడు, ఇక చేసేదేమీ లేక కూర్చుని మట్టి పెంకుతో గీక్కుంటున్నాడు. బాధలో ఆర్తనాదాలు పెడుతున్నాడు. అయితే, యోబు ఏదో చచ్చేవరకు బ్రతకాలన్నట్టు లేడు గానీ తన కష్టాల్ని సహిస్తున్నాడు. (యాకోబు 5:11 చదవండి.) సహించడానికి యోబుకు ఏది సహాయం చేసింది?
10. యోబుకు దేవునితో ఎలాంటి బంధం ఉండేది? అలాగని దేన్నిబట్టి చెప్పవచ్చు?
10 యోబు తన మనసులో ఉన్నదంతా యెహోవాకు చెప్పుకున్నాడు. (యోబు 10:1, 2; 16:20) ఉదాహరణకు, 3వ అధ్యాయంలో తనమీద విరుచుకుపడ్డ కష్టాలన్నిటికీ యోబు ఎంత బాధపడ్డాడో చెప్పాడు. అలాగే అవన్నీ యెహోవానే తీసుకొచ్చాడని తప్పుగా అనుకున్నాడు. ఆ తర్వాత, యోబు ఏదో పాపం చేయడం వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయని తన ముగ్గురు స్నేహితులు పదేపదే అన్నారు. కానీ తను మాత్రం దేవునికి నమ్మకంగా ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చాడు. ఒకానొక సమయంలోనైతే, యోబు దేవునికన్నా నీతిమంతుడు అన్నట్టుగా మాట్లాడాడు. (యోబు 10:1-3; 32:1, 2; 35:1, 2) వాస్తవానికి, యోబు తన యథార్థతను నిరూపించుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు “వెర్రిమాటలు మాట్లాడాను” అని ఒప్పుకున్నాడు. (యోబు 6:3, 26) 31వ అధ్యాయంలో, తను నిర్దోషి అని యెహోవా చెప్పాలన్నట్టు యోబు మాట్లాడాడు. (యోబు 31:35) కానీ యోబు అలా అడగకుండా ఉండాల్సింది.
11. యోబు అన్న మాటల్నిబట్టి యెహోవా ఏం చేయలేదు?
11 యోబు యెహోవాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని మనకు అర్థమౌతుంది. అలాగే యెహోవా తనకు న్యాయం చేసి తీరతాడనే నమ్మకం యోబుకు ఉందని అర్థమౌతుంది. యెహోవా యోబుతో సుడిగాలి నుండి మాట్లాడినప్పుడు, యోబు కష్టాలకు కారణం ఏంటో ఆయన చెప్పలేదు. అలాగే యోబు మాటల్నిబట్టి అతన్ని తిట్టలేదు, లేదా అమాయకుడు అని చెప్పలేదు. బదులుగా, యెహోవా యోబుతో ఒక తండ్రిలా మాట్లాడాడు. నిజానికి, అదే సరైన పద్ధతి. దానివల్ల యోబుకు తెలిసింది కొంచెమేనని వినయంగా ఒప్పుకున్నాడు. ముందూవెనకా ఆలోచించకుండా మాట్లాడిన మాటల్నిబట్టి పశ్చాత్తాపపడ్డాడు. (యోబు 31:6; 40:4, 5; 42:1-6) ఈ కథ అప్పటి ప్రజలకు అలాగే మనకు ఎలా సహాయం చేస్తుంది?
12. యోబు కథ నుండి ఇశ్రాయేలీయులు ఎలా ప్రయోజనం పొంది ఉండొచ్చు?
12 యోబు కథ ఇశ్రాయేలీయులకు ఎలా పనికొచ్చి ఉండొచ్చు? యోబు గురించి ఇశ్రాయేలీయులకు తెలిసే ఉండొచ్చు. అయితే, ఇప్పుడు మోషే ఉదాహరణ గమనించండి. ఆయన ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉన్నప్పుడు చాలా బాధల్ని, నిరుత్సాహాన్ని, కష్టాల్ని సహించాల్సి వచ్చింది. తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులు యెహోవాకు వ్యతిరేకంగా సణుగుతూ ఉంటే, మోషే మాత్రం తన కష్టాలన్నిటినీ యెహోవాతో చెప్పాడు. (నిర్గ. 16:6-8; సంఖ్యా. 11:10-14; 14:1-4, 11; 16:41, 49; 17:5) యెహోవా సరిదిద్దినప్పుడు కూడా మోషే సహనం చూపించాల్సి వచ్చింది. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు కాదేషు దగ్గర ఉన్నప్పుడు, బహుశా ఎడారిలో తిరుగుతున్న 40వ సంవత్సరంలో, మోషే యెహోవా పేరుకు మహిమ తీసుకురాకుండా, “అతను తన పెదాలతో కఠినంగా మాట్లాడాడు.” (కీర్త. 106:32, 33) దానివల్ల యెహోవా మోషేను వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదు. (ద్వితీ. 32:50-52) క్రమశిక్షణ వల్ల మోషేకు బాధగా అనిపించినా, ఆయన దాన్ని వినయంగా తీసుకున్నాడు. మోషే కాలం తర్వాత జీవించిన ఇశ్రాయేలీయులకు కూడా, కష్టాలు వచ్చినప్పుడు ఎలా సహించాలో యోబు కథ నేర్పించి ఉండొచ్చు. ఈ కథ గురించి ఆలోచించినప్పుడు, మన ఆవేదనను యెహోవాకు ఎలా చెప్పుకోవాలో అలాగే యెహోవా ముందు మనల్ని మనం ఎందుకు సమర్థించుకోకూడదో తెలుసుకుంటాం. అంతేకాదు, ఆయన క్రమశిక్షణ ఇచ్చినప్పుడు వినయంగా ఎలా తీసుకోవాలో కూడా నేర్చుకుంటాం.
13. మనకు వచ్చే దేన్నైనా సహించడానికి యోబు కథ ఎలా సహాయం చేస్తుంది? (హెబ్రీయులు 10:36)
13 యోబు కథ మనకెలా పనికొస్తుంది? క్రైస్తవులుగా మనకు కూడా సహనం చాలా అవసరం. (హెబ్రీయులు 10:36 చదవండి.) ఉదాహరణకు, మనలో కొంతమందికి ఆరోగ్యం బాగోకపోవచ్చు, మానసికంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు లేదా మన కుటుంబంలో ఏదైనా కష్టం రావచ్చు. బహుశా మనకు ఇష్టమైనవాళ్లు చనిపోవడం, ఇంకా వేరే సమస్యలు కూడా మనకు ఉండొచ్చు. ఇంకొన్నిసార్లయితే, వేరేవాళ్ల మాటల్నిబట్టి, పనుల్నిబట్టి సహనం చూపించడం మనకు ఇంకా కష్టం అవ్వవచ్చు. (సామె. 12:18) మన మనసులోని లోతైన భావాల్ని యెహోవాకు చెప్పుకోవచ్చని, ఆయన వాటిని ఖచ్చితంగా వింటాడని యోబు పుస్తకం నుండి నేర్చుకున్నాం. (1 యోహా. 5:14) మనం మాట్లాడేటప్పుడు యోబులాగే కొన్నిసార్లు ‘వెర్రిమాటలు మాట్లాడినా’ యెహోవా మనల్ని తిట్టడు. బదులుగా, సహనం చూపించడానికి మనకు కావాల్సిన శక్తిని, తెలివిని ఆయన ఇస్తాడు. (2 దిన. 16:9; యాకో. 1:5) యెహోవా యోబుకు క్రమశిక్షణ ఇచ్చినట్టే మనకు కూడా కొన్నిసార్లు క్రమశిక్షణ ఇస్తాడు. దేవుని వాక్యం నుండి గానీ, ఆయన సంస్థ నుండి గానీ, పరిణతిగల స్నేహితుల నుండి గానీ ఏదైనా సలహా లేదా దిద్దుబాటు వస్తే, మనకు కలిగే బాధను ఎలా తట్టుకోవచ్చో యోబు పుస్తకం మనకు నేర్పిస్తుంది. (హెబ్రీ. 12:5-7) యోబు ఎలాగైతే తనకు ఇచ్చిన క్రమశిక్షణను వినయంగా తీసుకుని ప్రయోజనం పొందాడో, మనం కూడా మనకు దొరికే క్రమశిక్షణను తీసుకుంటే ప్రయోజనం పొందుతాం. (2 కొరిం. 13:11) యోబు పుస్తకం నుండి ఎన్ని పాఠాలు నేర్చుకున్నామో కదా! యోబు కథ నుండి వేరేవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.
యోబు పుస్తకం ఉపయోగించి వేరేవాళ్లకు సహాయం చేయండి
14. ప్రీచింగ్‌లో మిమ్మల్ని ఎవరైనా కష్టాలు ఎందుకున్నాయని అడిగితే, వాళ్లకు ఎలా జవాబు ఇవ్వవచ్చు?
14 ప్రీచింగ్‌లో మిమ్మల్ని ఎవరైనా, ‘ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి’ అని అడిగారా? దానికి మీరు ఏమని జవాబు ఇచ్చారు? మీరు బైబిలు నుండి, ఏదెను తోటలో జరిగిన విషయాన్ని చెప్పుంటారు. సాతాను అనే చెడ్డదూత మొదటి మనుషులకు అబద్ధం చెప్పి, వాళ్లు దేవునికి ఎదురుతిరిగేలా చేశాడని మీరు చెప్పుంటారు. (ఆది. 3:1-6) తర్వాత ఆదాముహవ్వలు చేసిన తిరుగుబాటు వల్లే ఈ లోకంలో బాధలు, చావు వచ్చాయని కూడా మీరు చెప్పుంటారు. (రోమా. 5:12) చివరిగా, సాతాను చెప్పింది పచ్చి అబద్ధమని నిరూపించడానికి, అలాగే భవిష్యత్తులో మనుషులందరూ శాశ్వతకాలం జీవిస్తారనే మంచివార్తను ప్రకటించడానికి దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడని చెప్పుంటారు. (ప్రక. 21:3, 4) వాళ్ల ప్రశ్నలకు ఆ జవాబు ఇవ్వడం వల్ల మీకు మంచి ఫలితాలు వచ్చి ఉంటాయి.
15. కష్టాలు ఎందుకొస్తున్నాయి అని అడిగిన వ్యక్తికి మీరు యోబు గురించి ఎందుకు చెప్పవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
15 కష్టాలు ఎందుకొస్తున్నాయి అని అడిగిన వ్యక్తికి మీరు యోబు గురించి కూడా చెప్పవచ్చేమో ఆలోచించండి. ముందుగా, అంతమంచి ప్రశ్న అడిగినందుకు ఇంటివ్యక్తిని మెచ్చుకోండి. తర్వాత, ఒకప్పుడు యోబు అనే నమ్మకమైన వ్యక్తి కూడా బాధలు పడినప్పుడు ఇలాంటి ప్రశ్నే అడిగాడని, తన బాధలకు దేవుడే కారణం అని అనుకున్నాడని చెప్పండి. (యోబు 7:17-21) అప్పుడు తనలాగే ఆలోచించేవాళ్లు చరిత్రలో ఒకరున్నారని తెలుసుకుని ఇంటివ్యక్తి సంతోషించవచ్చు. ఆ తర్వాత యోబుకు వచ్చిన కష్టాలకు కారణం సాతానే కానీ, దేవుడు కాదని వాళ్లకు వివరించండి. మనుషులు స్వార్థంతోనే దేవుణ్ణి ఆరాధిస్తారని నిరూపించడానికి సాతాను అలా యోబుకు కష్టాలు తీసుకొచ్చాడు. అయితే, మనుషులు స్వార్థంతో కాదుగానీ తనమీద ప్రేమతోనే తనను ఆరాధిస్తున్నారని యెహోవాకు నమ్మకం ఉంది. అందుకే ఆయన కష్టాల్ని అనుమతించి, సాతాను అబద్ధం చెప్పాడని నిరూపించే అవకాశం మనకు ఇస్తున్నాడు. చివరికి, యోబు నమ్మకంగా ఉన్నందుకు కొంతకాలం తర్వాత దేవుడు ఆయన్ని దీవించాడు. అలా ఆ విషయాలన్నీ చెప్పాక, ఈ లోకంలో ఏ కష్టమూ యెహోవా నుండి రాదని వాళ్లకు ధైర్యం చెప్పి, ఓదార్చండి.
యోబు పుస్తకాన్ని ఉపయోగించి “దేవుడు చెడు చేయడు” అని వేరేవాళ్లకు ఎలా భరోసా ఇవ్వవచ్చు? (15వ పేరా చూడండి)
16. బాధలో ఉన్నవాళ్లకు యోబు పుస్తకం ఎలా సహాయం చేస్తుందో ఒక అనుభవం చెప్పండి.
16 మారియో అనే ఒకతనికి యోబు పుస్తకం ఎలా సహాయం చేసిందో గమనించండి. 2021 లో ఒకరోజు మన సిస్టర్ టెలిఫోన్ విట్నెసింగ్ చేసింది. ఆమె మొదటిసారి కాల్ చేసినప్పుడు మారియోకి ఒక లేఖనం చెప్పి, దేవుడు మన ప్రార్థనలు వినడమే కాదు, భవిష్యత్తు మీద ఒక ఆశను కూడా ఇస్తాడని చెప్పింది. దానిగురించి మారియో ఏమనుకుంటున్నాడో అడిగినప్పుడు, నిజానికి మన సిస్టర్ కాల్ చేసే టైమ్‌కి ఆయన ఒక సూసైడ్ నోట్ రాస్తున్నాను అని చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నేను దేవుణ్ణి నమ్ముతాను, కానీ ఈ రోజు పొద్దున్నే ఎందుకో దేవుడు నన్ను వదిలేసినట్టు అనిపించింది.” మన సిస్టర్ రెండోసారి కాల్ చేసినప్పుడు యోబు గురించి, ఆయన అనుభవించిన కష్టాల గురించి చెప్పింది. అప్పుడు మారియో యోబు పుస్తకం అంతా చదవాలనుకున్నాడు. కాబట్టి, మన సిస్టర్ కొత్త లోక అనువాదం లింక్‌ని పంపించింది. ఆ తర్వాత ఏమైంది? మారియో బైబిలు స్టడీకి ఒప్పుకున్నాడు. తనను నిజంగా పట్టించుకునే ప్రేమగల దేవుని గురించి ఆయన ఎక్కువ తెలుసుకోవాలనే కోరికతో ఉన్నాడు.
17. యోబు పుస్తకాన్ని యెహోవా బైబిల్లో రాయించినందుకు మీరు ఎందుకు కృతజ్ఞతతో ఉన్నారు? (యోబు 34:12)
17 ప్రజలందరికీ, అందులోనూ బాధలో ఉన్నవాళ్లకు సహాయం చేసే గొప్ప శక్తి బైబిలుకు ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. (హెబ్రీ. 4:12) యెహోవా యోబు కథను బైబిల్లో రాయించినందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా! (యోబు 19:23, 24) “ఈ మాట వాస్తవం, దేవుడు చెడు చేయడు” అనే అభయం యోబు పుస్తకం మనకు ఇస్తుంది. (యోబు 34:12 చదవండి.) అలాగే దేవుడు బాధల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో, మనం వాటిని ఎలా తట్టుకోవచ్చో ఆ పుస్తకం నేర్పిస్తుంది. దీంతోపాటు, బాధలో ఉన్నవాళ్లను ఓదార్చడానికి కూడా ఆ పుస్తకం పనికొస్తుంది. అయితే, తర్వాతి ఆర్టికల్‌లో మనం ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడానికి యోబు పుస్తకం ఎలా సహాయం చేస్తుందో చూస్తాం.
పాట 156 విశ్వాసంతో భవిష్యత్తును చూడండి
a నమ్మకస్థుడైన యోసేపు చనిపోవడానికి (క్రీ.పూ. 1657) అలాగే ఇశ్రాయేలీయుల మీద మోషేను నాయకునిగా నియమించడానికి (దాదాపు క్రీ.పూ. 1514) మధ్యకాలంలో యోబు జీవించి ఉంటాడు. యెహోవాకు, సాతానుకు మధ్య చర్చలు అలాగే యోబు కష్టాలు ఆ కాల వ్యవధిలోనే జరిగి ఉంటాయి.
b కొన్ని పేర్లను మార్చాం.