యోబు యొక్క ప్రతిఫలం—నిరీక్షణకు ఒక మూలం
“యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను.”—యోబు 42:12.
1. శ్రమలు వారిని ఎంతో బలహీనపర్చినప్పుడు కూడా, యెహోవా తన ప్రజల కొరకు ఏమి చేస్తాడు?
యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు.” (హెబ్రీయులు 11:6) శ్రమలు సమర్పిత ప్రజలను మరణించిన వారివలె బలహీనపర్చినప్పటికీ, వారు ధైర్యంగా సాక్ష్యమివ్వడానికి కూడా ఆయన వారిని పురికొల్పుతాడు. (యోబు 26:5; ప్రకటన 11:3, 7, 11) హింస ననుభవిస్తున్న యోబు విషయంలో అది నిజమని నిరూపించబడింది. ముగ్గురు అబద్ధ ఆదరణకర్తలచే దూషింపబడినప్పటికీ, మనుష్యులకు భయపడి ఆయన మౌనంగా ఉండలేదు. బదులుగా, ఆయన ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు.
2. యెహోవా సాక్షులు హింసను, కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ శ్రమల నుండి ఎలా తప్పించుకున్నారు?
2 అనేకమంది ప్రస్తుత దిన యెహోవా సాక్షులు దాదాపు మరణాన్ని ఎదుర్కొన్నంతగా, అలాంటి గొప్ప హింసను, శ్రమను ఎదుర్కొన్నారు. (2 కొరింథీయులు 11:23) అయితే, యోబు వలె, వారు దేవుని యెడల ప్రేమను కనపర్చారు, నీతిని అనుసరించారు. (యెహెజ్కేలు 14:14, 20) యెహోవాను ప్రీతిపర్చాలని నిశ్చయించుకుని, ధైర్యంగా సాక్ష్యమివ్వడానికి బలపర్చబడి, నిజమైన నిరీక్షణతో నింపబడినవారై వారు తమ శ్రమలను సహించారు.
యోబు ధైర్యంగా సాక్ష్యమిస్తున్నాడు
3. యోబు తన చివరి ప్రసంగంలో ఎలాంటి సాక్ష్యమిచ్చాడు?
3 తన చివరి ప్రసంగంలో, యోబు మునుపు యిచ్చిన దానికన్నా గొప్పగా సాక్ష్యమిచ్చాడు. ఆయన తన అబద్ధ ఆదరణ కర్తల నోరు పూర్తిగా మూయించాడు. కఠినమైన అపహాస్యంతో ఆయనిలా అన్నాడు: “శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి?” (యోబు 26:2) తన శక్తితో మన భూగోళాన్ని శూన్యంపై వ్రేలాడదీసి, నీళ్లుగల మేఘాలను భూమికిపైగా ఉంచిన యెహోవాను యోబు ఉన్నతపర్చాడు. (యోబు 26:7-9) అయినప్పటికీ, అలాంటి అద్భుతాలు ‘యెహోవా కార్యములలో స్వల్పములు’ అని యోబు చెప్పాడు.—యోబు 26:14.
4. యథార్థతను గూర్చి యోబు ఏమి చెప్పాడు, ఆవిధంగా ఆయన ఎందుకు చెప్పగలిగాడు?
4 తన నిర్దోషత్వం గురించి బాగా తెలిసిన యోబు యిలా ప్రకటించాడు: “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.” (యోబు 27:5) తనపై వేయబడిన అబద్ధ ఆరోపణలకు విరుద్ధంగా, తనపైకి వచ్చినదానికి తగినట్లుగా ఆయన ఏదీ చేయలేదు. మతభ్రష్టుల ప్రార్థనలు యెహోవా వినడు కాని యథార్థపరులకు ప్రతిఫలమిస్తాడని యోబుకు తెలుసు. త్వరలోనే ఆర్మగిద్దోను యొక్క సంక్షోభము దుష్టులను తమ అధికార స్థానం నుండి పడగొడుతుందని, వారు దేవుని ఉగ్రతా హస్తాన్ని తప్పించుకోలేరని యిది మనకు గుర్తు చేస్తుంది. అంతవరకు, యెహోవా ప్రజలు యథార్థంగా నడుచుకుంటారు.—యోబు 27:11-23.
5. యోబు నిజమైన జ్ఞానాన్ని ఎలా నిర్వచించాడు?
5 భూమి మరియు సముద్రములోవున్న బంగారం, వెండి, మరితర సంపదలను కనుగొనడానికి మనిషి తన సామర్థ్యాలను ఉపయోగించాడని యోబు చూపిస్తుండగా లోక సంబంధ జ్ఞానులైన ముగ్గురు వినడాన్ని ఊహించండి. “కాని, జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది” అని ఆయన అన్నాడు. (యోబు 28:18) యోబు యొక్క అబద్ధ ఆదరణకర్తలు నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయారు. గాలి, వర్షం, మెరుపులు, ఉరుముల సృష్టికర్తయే దానికి మూలము. వాస్తవానికి, ‘యెహోవా యందలి భక్తితో కూడిన భయమే జ్ఞానము, దుష్టత్వము విడుచుటయే వివేకము.’—యోబు 28:28.
6. తన మునుపటి జీవితాన్ని గూర్చి యోబు ఎందుకు మాట్లాడాడు?
6 ఎన్ని బాధలున్నప్పటికీ, యోబు యెహోవాను సేవించడం విడిచిపెట్టలేదు. సర్వోన్నతుని నుండి దూరమయ్యే బదులు, యథార్థవంతుడైన ఈ వ్యక్తి తనకు మునుపు ‘దేవునితో గల సన్నిహితత్వం’ కొరకు అపేక్షించాడు. (యోబు 29:4) యోబు తాను ఎలా ‘దీనులను విడిపించాడో, నీతిని వస్త్రముగా ధరించాడో, దరిద్రులకు తండ్రిగా ఉండెనో’ గుర్తు చేసుకున్నప్పుడు ఆయన గొప్పలు చెప్పడంలేదు. (యోబు 29:12-16) బదులుగా, యెహోవా యొక్క యథార్థమైన సేవకునిగా తన జీవితంలోని వాస్తవాలను ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. మీరు అలాంటి మంచి పేరును సంపాదించుకున్నారా? బహుశా, యోబు తనకు ఓదార్పునిచ్చుటకు వచ్చిన ముగ్గురు వంచకుల కపటాన్ని కూడా బహిర్గతం చేస్తున్నాడు.
7. యోబు ఎలాంటి వ్యక్తియై యుండెను?
7 వారి ‘తండ్రులను తన మందలను కాయు కుక్కలతో నుంచుటకు’ యిష్టపడని యౌవనులచే యోబు ఎగతాళి చేయబడ్డాడు. అతడు అసహ్యించుకోబడి, ఉమ్మివేయబడ్డాడు. అతడు ఎంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ, యోబు యెడల దయ చూపించబడలేదు. (యోబు 30:1, 10, 30) అయితే, ఆయన యెహోవాకు పూర్తిగా సమర్పించుకున్నాడు గనుక ఆయన పవిత్రమైన మనస్సాక్షిని కలిగివుండి యిలా చెప్పగలిగాడు: “నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసికొనునట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక.“ (యోబు 31:6, 7) యోబు వ్యభిచారి కాదు లేక కుట్ర పన్నేవాడు కాదు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా వుండలేదు. ఆయన ధనవంతుడైనప్పటికీ, ఆయన ఎన్నడూ వస్తుసంపద యందు నమ్మకముంచలేదు. అంతేకాకుండా, చంద్రుని వంటి నిర్జీవమైన వాటిని పూజించడం ద్వారా యోబు విగ్రహారాధన చేయలేదు. (యోబు 31:26-28) దేవుని యందు విశ్వాసముంచి యథార్థతను కాపాడుకోవడంలో మంచి మాదిరి నుంచాడు. ఎన్నో బాధలను, అబద్ధ ఆదరణకర్తల ఉనికిని సహించినప్పటికీ, యోబు నైపుణ్యంగా వాదించి, అద్భుతమైన సాక్ష్యం యిచ్చాడు. ఆయన తన మాటలు ముగుస్తుండగా, దేవుడు తన న్యాయాధిపతి, ప్రతిఫలమిచ్చేవాడు అని భావించాడు.—యోబు 31:35-40.
ఎలీహు మాట్లాడుతున్నాడు
8. ఎలీహు ఎవరై యుండెను, ఆయన గౌరవాన్ని, ధైర్యాన్ని ఎలా ప్రదర్శించాడు?
8 నాహోరు కుమారుడైన బూజు వంశీకుడైనందున, యెహోవా స్నేహితుడైన అబ్రాహాముకు దూరపు బంధువైన యౌవనస్థుడగు ఎలీహు దగ్గరలోనే వున్నాడు. (యెషయా 41:8) చర్చ యొక్క రెండు వైపులను వినడం ద్వారా ఎలీహు పెద్దవయస్సు వారి యెడల గౌరవం చూపాడు. అయినప్పటికీ, వారు తప్పుగా మాట్లాడిన విషయాల గురించి అతడు ధైర్యంగా మాట్లాడాడు. ఉదాహరణకు, యోబు “దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొ”న్నప్పుడు అతనికి కోపం వచ్చింది. ప్రాముఖ్యంగా, బహుశా అబద్ధ ఆదరణకర్తల యెడల ఎలీహుకు చాలా కోపం వచ్చింది. వారి వ్యాఖ్యానాలు దేవున్ని ఉన్నతపరుస్తున్నట్లుగానే వున్నాయి కాని, వారు వివాదంలో సాతాను వైపు వుండడం ద్వారా ఆయనకు నిందను తెచ్చారు. “మనస్సునిండ మాటల”తో, పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన, ఎలీహు నిష్పక్షపాత యెహోవాసాక్షి.—యోబు 32:2, 18, 21.
9. యోబు తిరిగి బాగుపడడాన్ని గూర్చి ఎలీహు ఎలా సూచించాడు?
9 యోబు దేవునికంటే ఎక్కువగా తనను ఘనపర్చుకోవడం గురించి శ్రద్ధ కలిగివున్నాడు. వాస్తవానికి, ఆయన దేవునితో వ్యాజ్యమాడాడు. అయితే, యోబుకు మరణం తప్పనిసరి అయినప్పుడు, ఆయన పశ్చాత్తాపపడిన సూచనవుంది. అదెలా? యెహోవా ఈ సమాచారంతో యోబు యందు దయ చూపించాడని చెప్పడానికి ఎలీహు ప్రేరేపించబడ్డాడు: “పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపింపుము ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.”—యోబు 33:24, 25.
10. యోబు ఎంత మేరకు పరీక్షించబడాలి, కాని 1 కొరింథీయులు 10:13 దృష్ట్యా మనం దేని గురించి ధైర్యంగా వుండవచ్చు?
10 యథార్థతను కాపాడుకోవడం ద్వారా దేవుని యందు ఆనందించడంలో ప్రయోజనం లేదని యోబు చెప్పడాన్ని ఎలీహు సరిచేసాడు. ఎలీహు యిలా అన్నాడు: “దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును.” యోబు తన స్వంత నీతిని నొక్కిచెప్పడంలో కఠినంగా ప్రవర్తించాడు, కాని ఆయన తగినంత జ్ఞానం, వివేకం లేకుండానే అలా చేశాడు. ఎలీహు యింకా యిలా అన్నాడు: “దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను.” (యోబు 34:10, 11, 35, 36) అలాగే, మన విశ్వాసం మరియు యథార్థత ఏవిధంగానైనా ‘తుదముట్ట శోధింప’ బడితేనే పూర్తిగా నిరూపించబడుతుంది. అయినప్పటికీ, మన ప్రేమగల పరలోకపు తండ్రి మనము సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధింపబడనియ్యడు.—1 కొరింథీయులు 10:13.
11. పూర్తిగా పరీక్షించబడినప్పుడు, మనం ఏమి గుర్తుంచుకోవాలి?
11 ఎలీహు కొనసాగిస్తూ, యోబు తన స్వంత నీతిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడని మళ్ళీ తెలియజేశాడు. మన మహాగొప్ప నిర్మాణకుని యెడల శ్రద్ధ కనపర్చబడాలి. (యోబు 35:3, 6, 10, 11) ఎలీహు యిలా చెప్పాడు, దేవుడు “భక్తిహీనుల ప్రాణమును . . . కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును.” (యోబు 36:6) ఎవరూ కూడా దేవుని విధానాన్ని ప్రశ్నించి, ఆయన అనీతిమంతుడని అనలేరు. మనము తెలిసికొనగలిగినదాని కంటే ఆయన ఎంతో ఉన్నతుడు, ఆయన సంవత్సరాల సంఖ్య మితిలేనిది. (యోబు 36:22-26) పూర్తిగా పరీక్షించబడినప్పుడు, మన నిత్యుడగు దేవుడు నీతిమంతుడని, ఆయనకు ఘనత కలిగేలా మనం చేసే నమ్మకమైన కార్యాలకు ఆయన ప్రతిఫలమిస్తాడని గుర్తుంచుకోండి.
12. దుష్టులపై దేవుడు తీర్పుతీర్చడాన్ని గూర్చి ఎలీహు వ్యక్తపర్చిన ముగింపు మాటలు ఏమి సూచిస్తున్నాయి?
12 ఎలీహు మాట్లాడుతుండగా, పెనుగాలి వీచింది. అది సమీపిస్తుండగా, అతని హృదయం వణకడం, గంతులు వేయడం ప్రారంభించింది. ఆయన యెహోవా చేసిన గొప్ప సంగతుల గురించి మాట్లాడి యిలా అన్నాడు: “యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.” యోబు వలె, మనం దేవుని అద్భుతమైన కార్యాలను గూర్చి, భయాన్ని కలిగించే ఘనతను గూర్చి గమనించవలసిన అవసరత వుంది. ఎలీహు యిలా అన్నాడు: “సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగియుందురు.” (యోబు 37:1, 14, 23, 24) దేవుడు త్వరలోనే దుష్టులకు తీర్పుతీర్చునప్పుడు, ఆయన న్యాయాన్ని, నీతిని చెరపడని, ఆయన భక్తిగల ఆరాధికులుగా ఆయనకు భయపడేవారిని కాపాడుతాడని ఎలీహు ముగింపు మాటలు మనకు గుర్తు చేస్తాయి. యెహోవాను విశ్వ సర్వాధిపతిగా గుర్తించే అలాంటి యథార్థపరుల మధ్యన వుండడం ఎంతటి ఆధిక్యత! యోబు వలె సహించండి, ఈ సంతోషకరమైన గుంపుల మధ్య మీ ఆశీర్వాదకరమైన స్థలం నుండి అపవాది మిమ్మల్ని దూరం చేయడానికి ఎన్నడూ అనుమతించకండి.
యెహోవా యోబుకు జవాబిస్తున్నాడు
13, 14. (ఎ) యెహోవా దేన్ని గూర్చి యోబును ప్రశ్నించడం ప్రారంభిస్తాడు? (బి) దేవుడు యోబును అడిగిన మిగతా ప్రశ్నల నుండి ఏ విషయాలను నేర్చుకోవచ్చు?
13 యెహోవా యోబుతో సుడిగాలిలో నుండి మాట్లాడినప్పుడు యోబు ఎంత ఆశ్చర్యపోయి వుండవచ్చు! ఆ సుడిగాలి, యోబు ఇల్లు కూలిపోయేలా చేసి ఆయన పిల్లలు చనిపోయేలా చేయడానికి సాతాను ఉపయోగించిన గొప్ప గాలి కాదుగాని, అది దేవుని చర్య. దేవుడు యిలా అడిగినప్పుడు, యోబు ఏమీ మాట్లాడలేకపోయాడు: “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి? . . . ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?” (యోబు 38:4, 7) సముద్రం, భూమిని ఆవరించియున్న మేఘాలు, మంచు, మరణ ద్వారాలు, వెలుగు మరియు చీకటి, నక్షత్ర సముదాయము వంటివాటి గురించి యెహోవా యోబును ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నించాడు. యిలా అడిగినప్పుడు యోబు ఏమి చెప్పలేకపోయాడు: “ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా?”—యోబు 38:33.
14 ఇతర ప్రశ్నలు, మానవుడు సృష్టింపబడక మునుపు చేపలు, కోళ్లు, మృగాలు, ప్రాకెడి జీవులు వంటి వాటిపై మనిషికి ఆధిపత్యం యివ్వకమునుపు, ఏ మానవ సహాయం లేక సలహా లేకుండానే దేవుడు వాటికి అన్నీ అనుగ్రహించేవాడని సూచించాయి. యెహోవా యొక్క మిగతా ప్రశ్నలు, అడవి ఎద్దు, నిప్పుకోడి, గుర్రం వంటి జీవులకు కూడా సంబంధించినవి. యోబును యిలా అడిగాడు: “పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?” (యోబు 39:27) ఎంతమాత్రం కాదు! దేవుడు యోబును యిలా ప్రశ్నించినప్పుడు, అతని ప్రతిస్పందనను గూర్చి ఊహించండి: “ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా?” యోబు యిలా చెప్పాడంటే ఆశ్చర్యం లేదు: “చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.” (యోబు 40:2, 4) యెహోవా ఎల్లప్పుడూ సరియే గనుక, మనం ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి శోధింపబడినప్పుడు, మనం ‘మన నోటిపై మన చేతిని ఉంచుకోవాలి.’ దేవుని ప్రశ్నలు సృష్టిలో వ్యక్తం చేయబడిన ఆయన ఉన్నతత్వాన్ని, ఘనతను, బలాన్ని ఘనపర్చాయి.
బెహమోత్, లెవ్యతాన్
15. బెహమోత్ (నీటి గుర్రం) సాధారణంగా ఏ జంతువుగా పరిగణింప బడుతుంది, దాని కొన్ని గుణలక్షణాలు ఏమిటి?
15 తర్వాత యెహోవా సాధారణంగా నీటి గుర్రముగా పరిగణింపబడే, బెహమెత్‌ను గూర్చి ప్రస్తావించాడు. (యోబు 40:15-24 NW) పెద్ద పరిమాణం, గొప్ప బరువు, బిరుసైన చర్మం వంటివాటికి విశేషమైనదైన ఈ శాఖాహార జంతువు ‘గడ్డి మేస్తుంది.’ దాని శక్తి, బలానికి మూలం దాని నడుములో, దాని కడుపు నరములలో వుంది. దాని కాళ్ల ఎముకలు “ఇత్తడి గొట్టము” లంత బలంగా వున్నాయి. బెహమోత్ (నీటి గుర్రము) నదీప్రవాహము పొంగి పొర్లినను భయపడదు, సుళువుగా అలలకు ఎదురీదగలదు.
16. (ఎ) లెవ్యతాన్‌ను (మకరాన్ని) గూర్చిన వివరణ ఏ జీవానికి సరిపోతుంది, దాన్ని గూర్చిన కొన్ని వాస్తవాలేమిటి? (బి) బెహమోత్ (నీటి గుర్రం) మరియు లెవ్యతాన్ (మకరం) యొక్క శక్తి యెహోవా సేవలో మన పనులను నెరవేర్చడాన్ని గూర్చి ఏమి సూచిస్తుంది?
16 దేవుడు యోబును యింకా యిలా అడిగాడు: “నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?” లెవ్యతాన్‌ను (మకరమును) గూర్చిన వర్ణన మొసలికి సరిపోతుంది. (యోబు 41:1-34) అది ఎవరితోను సమాధాన ఒప్పందాన్ని చేసుకోదు, జ్ఞానముగల ఏ మానవుడు ఈ ప్రాకెడి జీవిని రేపుటకై తెగింపలేడు. బాణాలు దానిని పారద్రోలజాలవు, “అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.” అతి ఉగ్రమైన మకరము సముద్రమును మరుగుతున్న తైలమువలె కాగజేయును. యోబు కంటె నీటి గుర్రము, మకరము ఎంతో బలముగలవన్న వాస్తవం ఆయన తనను తాను తగ్గించుకోడానికి సహాయం చేసింది. మనంతట మనం ఉన్నతులము కామని మనము కూడా వినయంగా అంగీకరించాలి. సర్పమైన సాతాను కోరల నుండి తప్పించుకొని, యెహోవా సేవలో మన పనులను నిర్వర్తించడానికి మనకు దేవుడిచ్చే జ్ఞానము, బలము అవసరము.—ఫిలిప్పీయులు 4:13; ప్రకటన 12:9.
17. (ఎ) యోబు ఎలా ‘దేవున్ని చూశాడు’? (బి) యోబు జవాబు చెప్పలేకపోయిన ప్రశ్నలవల్ల ఏమి నిరూపించబడింది, యిది మనకెలా సహాయం చేయగలదు?
17 పూర్తిగా తగ్గించుకుని, యోబు తన తప్పుడు దృక్పథాన్ని అంగీకరించి, జ్ఞానము లేకుండా మాట్లాడానని ఒప్పుకున్నాడు. అయినప్పటికీ, తాను “దేవుని చూచెదనన్న” నమ్మకాన్ని ఆయన వ్యక్తపర్చాడు. (యోబు 19:25-27) ఏ మానవుడు యెహోవాను చూచి జీవించలేడు గనుక, అదెలా సాధ్యం? (నిర్గమకాండము 33:20) నిజానికి, యోబు దైవిక శక్తి యొక్క వ్యక్తీకరణను చూశాడు, దేవుని మాటను విన్నాడు, యెహోవాను గూర్చిన సత్యాన్ని తెలుసుకోడానికి ఆయన జ్ఞాన నేత్రాలు తెరువబడ్డాయి. కాబట్టి, యోబు ‘తనను తాను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడ్డాడు.’ (యోబు 42:1-6) ఆయన అనేక ప్రశ్నలకు జవాబివ్వలేకపోవడం, దేవుని సర్వోన్నతత్వాన్ని నిరూపించి, మానవుని, చివరికి యోబువలె యెహోవాకు సమర్పించుకున్నవారి అల్పత్వాన్ని చూపించింది. యెహోవా నామాన్ని పరిశుద్ధ పరచడం, ఆయన సర్వాధిపత్యాన్ని ఉన్నతపర్చడం కంటె మన ఆసక్తులను ముందుంచకుండా ఉండడానికి యిది మనకు సహాయం చేస్తుంది. (మత్తయి 6:9, 10) యెహోవా యెడల యథార్థంగా వుండడం, ఆయన నామాన్ని గౌరవించడం మన ముఖ్య ఉద్దేశాలైయుండాలి.
18. యోబు యొక్క అబద్ధ ఆదరణకర్తలు ఏమి చేయవలసిన అవసరం ఉంది?
18 అయితే, స్వనీతిపరులైన అబద్ధ ఆదరణకర్తల మాటేమిటి? యోబు వలె తన గురించి సత్యము మాట్లాడనందుకు యెహోవా ఎలీఫజు, బిల్దదు, జోఫరులను న్యాయంగా చంపేయగలిగేవాడే. దేవుడిలా చెప్పాడు: “యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును.” రాజీపడడానికి ఆ ముగ్గురు తమను తాము తగ్గించుకోవాలి. యథార్థతను కాపాడుకున్న యోబు వారి కొరకు ప్రార్థించాలి, యెహోవా ఆయన ప్రార్థనను అంగీకరించదగినదిగా కనుగొన్నాడు. (యోబు 42:7-9) దేవుని దూషించి మరణము కమ్మని యోబును కోరిన అతని భార్య విషయమేమిటి? దేవుని దయ వలన ఆమె ఆయనకు అనుగ్రహించబడినట్లు కనిపిస్తుంది.
వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు మనకు నిరీక్షణ నిస్తాయి
19. యోబుకు సంబంధించి, అపవాదిపై తన ఉన్నతత్వాన్ని యెహోవా ఎలా చూపించాడు?
19 యోబు తన బాధల గురించి చింతించడం మానివేసి, దేవుని సేవలో మళ్లీ చురుకుగా వుండడం ప్రారంభించిన వెంటనే, యెహోవా ఆయన కొరకు పరిస్థితులను మార్చివేశాడు. ఆ ముగ్గురి కొరకు యోబు ప్రార్థించిన తర్వాత, దేవుడు ‘అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసి, పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా’ యిచ్చెను. రోగాన్ని కలుగజేసే సాతాను హస్తాన్ని ఆపి, యోబును అద్భుతరీతిగా స్వస్థపర్చడం ద్వారా యెహోవా అపవాదిపై తన ఉన్నతత్వాన్ని చూపించాడు. మళ్లీ తన దూతల ద్వారా యోబు చుట్టూ కంచె వేయడం ద్వారా దేవుడు సాతాను సమూహాన్ని ఎదిరించి, వారిని కావలిలో ఉంచాడు.—యోబు 42:10; కీర్తన 34:7.
20. యెహోవా ఏ విధాలుగా యోబుకు ప్రతిఫలమిచ్చి ఆశీర్వదించాడు?
20 యోబు సహోదరులు, సహోదరీలు, అతని పూర్వపు పరిచయస్థులు ఆయనతో కలిసి తినడానికి, ఆయనపై జాలి చూపించడానికి, ఆయనపైకి వచ్చుటకు యెహోవా అనుమతించిన కష్టాన్నిబట్టి ఆయనను ఓదార్చడానికి వస్తూవున్నారు. ప్రతి ఒక్కరు ఆయనకు డబ్బు, ఒక్కో బంగారు ఉంగరము యిచ్చారు. యోబును మునుపటి కంటె రెండింతలు ఎక్కువగా యెహోవా ఆశీర్వదించాడు, కాబట్టి ఆయనకు 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడుగాడిదలు కలిగివుండెను. యోబుకు మునుపున్నట్లుగానే ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కూడా కలిగారు. ఆయన ముగ్గురు కుమార్తెలైన యెమీమా, కెజీయా, కెరెంహప్పు ఆ దేశమంతటిలో సౌందర్యవతులు, యోబు వారికి వారి సహోదరులతోపాటు స్వాస్థ్యమిచ్చాడు. (యోబు 42:11-15) అంతేకాకుండా, యోబు మరో 140 సంవత్సరాలు జీవించి, తన సంతానము యొక్క నాలుగు తరాలను చూశాడు. వృత్తాంతం యిలా ముగిస్తుంది: “యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.” (యోబు 42:16, 17) ఆయన జీవితం పొడిగింపబడటం యెహోవా దేవుని అద్భుతమైన కార్యము.
21. యోబును గూర్చిన లేఖనాధార వృత్తాంతం ద్వారా మనకు ఎలా సహాయం చేయబడుతుంది, మనం ఏమి చేయడానికి నిశ్చయించుకోవాలి?
21 యోబును గూర్చిన లేఖనాధార వృత్తాంతం సాతాను ఎత్తుగడలను గూర్చి మనల్ని జాగ్రత్తపరుస్తుంది, విశ్వ సర్వాధిపత్యం మానవ యథార్థతతో ఎలా సంబంధాన్ని కలిగివుందో తెలుసుకోడానికి మనకు సహాయం చేస్తుంది. యోబు వలె, దేవుని ప్రేమించే వారందరు పరీక్షింపబడతారు. కాని మనం యోబు వలెనే సహించగలము. ఆయన తన శ్రమల నుండి విశ్వాస, నిరీక్షణలతో తప్పించుకున్నాడు, ఆయనకు అనేక ఆశీర్వాదాలు లభించాయి. యెహోవా సేవకులుగా నేడు మనకు నిజమైన విశ్వాసం, నిరీక్షణ వున్నాయి. గొప్ప ఆశీర్వాదాలనిచ్చే వాడు మనలో ప్రతి ఒక్కరియెదుట ఎంత గొప్ప నిరీక్షణనుంచాడు! పరలోక నిరీక్షణను మనస్సులో వుంచుకోవడం అభిషక్తులు భూమిపై తమ తర్వాతి జీవితమంతా దేవున్ని యథార్థంగా సేవించడానికి సహాయం చేస్తుంది. భూ నిరీక్షణగల అనేకులు అసలు ఎన్నటికీ మరణించరు, కాని మరణించేవారు యోబుతో పాటు, పరదైసు భూమిపైకి పునరుత్థానం చేయబడే ప్రతిఫలాన్ని పొందుతారు. అలాంటి నిజమైన నిరీక్షణను మనస్సులో, హృదయంలో వుంచుకుని, దేవుని ప్రేమించే వారందరు యథార్థతను కాపాడుకొనేవారిగా యెహోవావైపు దృఢంగా నిలబడి, ఆయన విశ్వ సర్వాధిపత్యానికి మద్దతు నిచ్చేవారిగా వుండడం ద్వారా సాతాను అబద్ధికుడని నిరూపించుదురు గాక.
మీరెలా ప్రత్యుత్తరమిస్తారు?
◻ తన అబద్ధ ఆదరణకర్తలకు తన చివరి జవాబులో యోబు చెప్పిన కొన్ని విషయాలేమిటి?
◻ ఎలీహు ఎలా నిష్పక్షపాత యెహోవాసాక్షిగా నిరూపించుకున్నాడు?
◻ యోబుకు దేవుడు వేసిన కొన్ని ప్రశ్నలు ఏమైయుండెను, అవి ఏ ప్రభావాన్ని కలిగివున్నాయి?
◻ యోబును గూర్చిన లేఖనాధార వృత్తాంతం నుండి మీరెలా ప్రయోజనం పొందారు?
[18వ పేజీలోని చిత్రాలు]
బెహమోత్ (నీటి గుర్రము) మరియు లెవ్యతాన్‌ను (మకరం) గూర్చిన యెహోవా వ్యాఖ్యలు యోబు తనను తాను తగ్గించుకోడానికి సహాయపడ్డాయి