పాఠకుల ప్రశ్న
అతిత్వరలో నాయకుల హృదయాల్లో యెహోవా ఏ “ఆలోచన” పెడతాడు?
మహాశ్రమ మొదలవ్వడం గురించి, ప్రకటన 17:16, 17 ఇలా చెప్తుంది: “నువ్వు చూసిన ఆ పది కొమ్ములు, అలాగే ఆ క్రూరమృగం ఈ వేశ్యను ద్వేషించి, ఆమెను కొల్లగొట్టి, ఆమె బట్టలు తీసేసి, ఆమె మాంసాన్ని తిని, అగ్నితో ఆమెను పూర్తిగా కాల్చివేస్తాయి. ఎందుకంటే తాను అనుకున్నట్టు జరగాలని దేవుడే తన ఆలోచనను వాళ్లలో పెట్టాడు. వాళ్లందరికీ ఒకే ఆలోచన ఉంది . . . తమ రాజ్యాన్ని క్రూరమృగానికి ఇవ్వాలన్నదే ఆ ఆలోచన.” అబద్ధమతాన్ని నాశనం చేయాలన్నదే నాయకుల హృదయాల్లో యెహోవా పెట్టే “ఆలోచన” అని గతంలో మన ప్రచురణలు చెప్పాయి.
అయితే, ఆ అవగాహనలో మార్పు అవసరమైంది. అదేంటంటే, “తమ రాజ్యాన్ని క్రూరమృగానికి ఇవ్వాలన్నదే” నాయకుల హృదయాల్లో యెహోవా పెట్టే ఆలోచన! ఇది ఎలా నెరవేరుతుందో అర్థంచేసుకోవడానికి, ఈ ప్రశ్నల్ని పరిశీలిద్దాం.
ఈ ప్రవచనంలో ఎవరెవరు ఉన్నారు? “వేశ్య.” ఈ వేశ్యను “మహాబబులోను” అని కూడా పిలుస్తారు; ఆమె ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. “ఎర్రని క్రూరమృగం,” ఐక్యరాజ్య సమితిని సూచిస్తుంది. అది 1919లో, ప్రపంచ శాంతిని తీసుకురావడానికి నానాజాతి సమితిగా మొదలై, ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిగా కొనసాగుతుంది. (ప్రక. 17:3-5) “పది కొమ్ములు,” ఆ క్రూరమృగానికి మద్దతిస్తున్న ప్రభుత్వాల్ని సూచిస్తున్నాయి.
వేశ్యకు, ఎర్రని క్రూరమృగానికి ఉన్న సంబంధం ఏంటి? ఆ వేశ్య, క్రూరమృగం “మీద కూర్చొని ఉంది.” అంటే, ఆమె క్రూరమృగానికి మద్దతిస్తుంది, దాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తుంది.
వేశ్యకు ఏం జరుగుతుంది? క్రూరమృగం, దానికి మద్దతిచ్చే పది కొమ్ములు, ‘వేశ్యను ద్వేషిస్తాయి,’ వాళ్ల కోపాన్ని వెళ్లగక్కి, ఆమె సంపదల్ని కొల్లగొట్టి, ఆమె దుష్టత్వాన్ని బట్టబయలు చేస్తాయి. ఆమెను పూర్తిగా నాశనం చేయాలనే యెహోవా తీర్పును వాళ్లు అమలు చేస్తారు. (ప్రక. 17:1; 18:8) అది, అబద్ధమత సంస్థలకు ఒక ముగింపు. అయితే, అది జరగడానికి ముందు, మానవ పరిపాలనా చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక పని చేసేలా యెహోవా నాయకుల్ని కదిలిస్తాడు.
నాయకులు ఏం చేసేలా యెహోవా కదిలిస్తాడు? పది కొమ్ముల లేదా ప్రభుత్వ అధికారుల హృదయాల్లో యెహోవా ఒక “ఆలోచన” పెడతాడు. దానివల్ల, “వాళ్లు తమ శక్తిని, అధికారాన్ని ఆ క్రూరమృగానికి” అంటే ఐక్యరాజ్య సమితికి ఇస్తారు. (ప్రక. 17:13) దానర్థం ఏంటో ఆలోచించండి. మానవ ప్రభుత్వాలు తమంతట తామే సొంతగా నిర్ణయించుకొని తమ శక్తిని, అధికారాన్ని క్రూరమృగానికి ఇచ్చేస్తారా? లేదు! ఆ ప్రవచనం చెప్తున్నట్టు, వాళ్లు అలా చేసేలా యెహోవాయే ప్రేరేపిస్తాడు. (సామె. 21:1; యెషయా 44:28 తో పోల్చండి.) ఈ మార్పు మెల్లిమెల్లిగా జరుగుతుందా? లేదు! ఉన్నపళంగా, హఠాత్తుగా జరుగుతుంది. తర్వాత, కొత్తగా బలం చేకూరడంతో ఆ క్రూరమృగం, అబద్ధమత సంస్థల మీద యెహోవా తీర్పును అమలుచేస్తూ వాటిని ఒక్కసారిగా నామరూపాల్లేకుండా నాశనం చేస్తుంది.
అతిత్వరలో ఏం జరుగుతుందని మనం ఎదురుచూడవచ్చు? ఇక ప్రభుత్వాలు మెల్లిమెల్లిగా ఐక్యరాజ్య సమితితో చేతులు కలపడం గురించిన వార్తల కోసం మనం ఎదురుచూడాల్సిన అవసరంలేదు. కానీ మనం దీని కోసం ఎదురుచూడవచ్చు: ఉన్నపళంగా, ప్రభుత్వాలన్నీ తమ శక్తిని ఐక్యరాజ్య సమితి చేతిలో పెట్టేలా యెహోవా చేస్తాడు. అది జరిగినప్పుడు, ఇక మహాశ్రమ మొదలవ్వబోతుందని మనకు తెలుస్తుంది. ఈలోగా, మనం “మెలకువగా ఉందాం, మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం.” ఎందుకంటే, అతిత్వరలోనే మార్పులు ఉన్నపళంగా జరుగుతాయి.—1 థెస్స. 5:6.