కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 అక్టోబరు పేజీలు 24-29
  • ఇతరుల కోసం ప్రార్థిద్దాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరుల కోసం ప్రార్థిద్దాం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వేరేవాళ్ల గురించి ఎందుకు ప్రార్థించాలి?
  • మన ప్రార్థనలు వాళ్లకు అవసరం
  • ఒక్కో వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు
  • మన ప్రార్థనల గురించి సరిగ్గా ఆలోచిద్దాం
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • మనస్ఫూర్తిగా ప్రార్థించడం ఎలా నేర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • “ఒకరికొరకు ఒకరు ప్రార్థనచేయుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 అక్టోబరు పేజీలు 24-29

అధ్యయన ఆర్టికల్‌ 43

పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు

ఇతరుల కోసం ప్రార్థిద్దాం

“ ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి . . . నీతిమంతుడు పట్టుదలగా చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది.”—యాకో. 5:16.

ముఖ్యాంశం

ఇతరుల కోసం ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యమో, దాన్ని ఎలా చేయవచ్చో చూస్తాం.

1. మన ప్రార్థనలు యెహోవాకు ఎంత ప్రాముఖ్యం?

ప్రార్థన వెలకట్టలేని వరం. ఒకసారి ఆలోచించండి: యెహోవా కొన్ని పనుల్ని దేవదూతలకు అప్పగించాడు. (కీర్త. 91:11) తన కొడుకుకు కూడా చాలా పెద్దపెద్ద బాధ్యతలు అప్పగించాడు. (మత్త. 28:18) మరి ప్రార్థనలు వినే పని ఎవరికి ఇచ్చాడు? అది మాత్రం యెహోవా ఎవరికి ఇవ్వలేదు. అవును, “ప్రార్థనలు వినే” దేవుడైన యెహోవా మన ప్రార్థనల్ని స్వయంగా వింటాడు.—కీర్త. 65:2.

2. ఇతరుల కోసం ప్రార్థించే విషయంలో అపొస్తలుడైన పౌలు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

2 మన కష్టాలు, బాధల గురించి మనసువిప్పి యెహోవాకు ప్రార్థిస్తూనే ఇతరుల కోసం కూడా ప్రార్థించాలి. అపొస్తలుడైన పౌలు అదే చేశాడు. ఆయన గుంపు కోసం ప్రార్థన చేశాడు. ఉదాహరణకు, ఎఫెసు సంఘం గురించి ప్రార్థించి ఇలా అన్నాడు: “ఎప్పుడూ నా ప్రార్థనల్లో మిమ్మల్ని గుర్తుచేసుకుంటున్నాను.” (ఎఫె. 1:16) ఆయన గుంపు కోసమే కాదు ఒక్కొక్కరి గురించి కూడా ప్రార్థన చేశాడు. ఉదాహరణకు తిమోతితో ఇలా అన్నాడు: “దేవునికి నేను కృతజ్ఞుణ్ణి . . . నేను రాత్రింబగళ్లు పట్టుదలతో చేసే ప్రార్థనల్లో మానకుండా నిన్ను గుర్తుచేసుకుంటున్నాను.” (2 తిమో. 1:3) తన సమస్యల గురించి చెప్పుకోవడానికే పౌలుకు సమయం సరిపోదు. (2 కొరిం. 11:23; 12:7, 8) అలాంటిది, ఆయన ఇతరుల కోసం ప్రార్థించడానికి సమయం తీసుకున్నాడు.

3. వేరేవాళ్ల గురించి ప్రార్థన చేయడం ఎందుకు మర్చిపోతుంటాం?

3 కొన్నిసార్లు మనం ఇతరుల గురించి ప్రార్థన చేయడం మర్చిపోతుంటాం. ఎందుకు? సరితాa అనే సిస్టర్‌ ఒక కారణాన్ని వివరిస్తుంది. ఆమె ఇలా అంటుంది: “ఈ లోకంలో మనం ఊపిరాడనంత బిజీగా ఉన్నాం. మన సమస్యలు మనల్ని ఎంతగా చుట్టేస్తాయంటే మన ప్రార్థనలన్నీ వాటి చుట్టే తిరుగుతాయి.” మీకు కూడా అలాగే అనిపించిందా? అయితే, ఈ ఆర్టికల్‌ మీ కోసమే. ఇందులో మనం ఇతరుల గురించి ఎందుకు ప్రార్థించాలో చూస్తాం. అలాగే దాన్ని ఎలా చేయాలో సలహాలు కూడా చూస్తాం.

వేరేవాళ్ల గురించి ఎందుకు ప్రార్థించాలి?

4-5. వేరేవాళ్ల కోసం చేసే ప్రార్థనలకు “చాలా శక్తి” ఉందని ఎలా చెప్పవచ్చు? (యాకోబు 5:16)

4 వేరేవాళ్ల కోసం చేసే ప్రార్థనలకు “చాలా శక్తి ఉంటుంది.” (యాకోబు 5:16 చదవండి.) ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనలు వాళ్ల పరిస్థితిని మారుస్తాయా? అవును, మారుస్తాయి. తనెవరో తెలీదని పేతురు అంటాడని యేసుకు తెలిసే ఇలా అన్నాడు: “అయితే నీ విశ్వాసం బలహీనపడకుండా ఉండాలని నేను నీ కోసం పట్టుదలగా ప్రార్థించాను.” (లూకా 22:32) అంతేకాదు, ప్రార్థనల వల్ల మార్పు వస్తుందని పౌలుకు కూడా తెలుసు. ఆయన్ని రోములో అన్యాయంగా జైల్లో వేసినప్పుడు ఫిలేమోనుకు ఇలా రాశాడు: “మీ ప్రార్థనలు ఫలించి నేను మీ దగ్గరికి వస్తానని అనుకుంటున్నాను.” (ఫిలే. 22) ఫిలేమోను ప్రార్థించినట్టుగానే పౌలు విడుదలయ్యాడు, తన పరిచర్యను మళ్లీ ప్రారంభించాడు.

5 అయితే దీని అర్థం, ప్రార్థనల్లో ఫలానా పని చేయమని మనం యెహోవాను బలవంతపెట్టవచ్చని కాదు. కానీ తన సేవకులు దేనిగురించి అడుగుతున్నారో యెహోవా గమనిస్తాడు కాబట్టి, కొన్నిసార్లు వాళ్లు అడిగింది చేయాలని కూడా ఆయన అనుకోవచ్చు. ఇది తెలుసుకోవడం వల్ల, మనం ఒక విషయం గురించి పట్టుదలగా ప్రార్థన చేసిన తర్వాత, ఇక దాన్ని యెహోవా చూసుకుంటాడనే నమ్మకంతో వదిలేయవచ్చు.—కీర్త. 37:5; 2 కొరిం. 1:11.

6. వేరేవాళ్ల కోసం ప్రార్థన చేస్తే, ఏ లక్షణం పెంచుకుంటాం? (1 పేతురు 3:8)

6 వేరేవాళ్ల కోసం ప్రార్థన చేస్తే, “కనికరాన్ని” పెంచుకున్న వాళ్లమౌతాం. (1 పేతురు 3:8 చదవండి.) కనికరం చూపించే వ్యక్తి ఇతరుల కష్టాల్ని గమనిస్తాడు. వాళ్లకు ఏదోక సహాయం చేయాలని చూస్తాడు. (మార్కు 1:40, 41) మైఖేల్‌ అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “నేను ఇతరుల అవసరాల గురించి ప్రార్థించినప్పుడు, వాళ్ల సమస్యల గురించి ఇంకా బాగా అర్థం చేసుకోగలిగాను. వాళ్లను ఎక్కువ ప్రేమించగలిగాను. ఇవన్నీ వాళ్లకు తెలియకపోయినా నేను వాళ్లకు చాలా దగ్గరయ్యాను.” రిచర్డ్‌ అనే సంఘపెద్ద ఇంకో ప్రయోజనం గురించి చెప్పాడు. ఆయన ఇలా అంటున్నాడు: “ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు వాళ్లకు ఏదోక సహాయం చేయాలనే కోరిక కలుగుతుంది. మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామో, వాళ్లకు మనమే సహాయం చేసినప్పుడు, ఒకవిధంగా మనం చేసే ప్రార్థనలకు మనమే జవాబు అవుతాం.”

7. ఇతరుల కోసం ప్రార్థించడం వల్ల మన సమస్యల గురించే అతిగా ఆలోచించకుండా ఎలా ఉంటాం? (ఫిలిప్పీయులు 2:3, 4) (చిత్రాలు కూడా చూడండి.)

7 ఇతరుల కోసం ప్రార్థించడం వల్ల మన సమస్యల గురించే అతిగా ఆలోచించం. (ఫిలిప్పీయులు 2:3, 4 చదవండి.) ఈ సాతాను లోకంలో సమస్యలు లేని మనిషి అంటూ లేడు. (1 యోహా. 5:19; ప్రక. 12:12) ఇతరుల కోసం ప్రార్థన చేయడం ఒక అలవాటుగా చేసుకున్నప్పుడు, “ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సహోదరులందరూ ఇలాంటి బాధలే అనుభవిస్తున్నారని” మనకు గుర్తొస్తుంది. (1 పేతు. 5:9) క్యాథరీన్‌ అనే పయినీరు సిస్టర్‌ ఇలా చెప్తుంది: “ఇతరుల కోసం ప్రార్థించడం వల్ల వాళ్లకు కూడా కష్టాలు ఉన్నాయని గుర్తొస్తుంది. దీనివల్ల నా సమస్యల గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా ఉండగలుగుతున్నాను.”

చిత్రాలు: వాళ్లకే పుట్టెడు సమస్యలు ఉన్నా వేరేవాళ్ల కోసం ప్రార్థన చేస్తున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌. 1. ఓ చిన్ని పాప తన బెడ్‌ మీద కూర్చొని ప్రార్థన చేస్తుంది; సర్కిల్‌లో ఉన్న చిత్రంలో వరదల్లో బోటు మీద ఇల్లు వదిలి వెళ్తున్న ఒక కుటుంబం. 2. ముందు చిత్రంలో ఉన్న కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు; సర్కిల్‌లో ఉన్న చిత్రంలో ఒక బ్రదర్‌ జైల్లో ఉన్నాడు. 3. ముందు చిత్రంలో జైల్లో ఉన్న బ్రదర్‌ తన సెల్‌లో ప్రార్థన చేస్తున్నాడు; సర్కిల్‌లో ఉన్న చిత్రంలో ఒక పెద్ద వయసు సిస్టర్‌ హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉంది. 4. ముందు చిత్రంలో ఉన్న ఆ సిస్టర్‌, ప్రార్థన చేస్తుంది; సర్కిల్‌లో ఉన్న చిత్రంలో, మొదటి చిత్రంలో ఉన్న చిన్ని పాప ఒక్కత్తే కూర్చుంది. క్లాస్‌లో మిగతా పిల్లలు పుట్టినరోజు పార్టీ చేసుకుంటున్నారు.

ఇతరుల కోసం ప్రార్థించడం వల్ల మన సమస్యల గురించే అతిగా ఆలోచించం (7వ పేరా చూడండి)d


మన ప్రార్థనలు వాళ్లకు అవసరం

8. మనం ఎవరెవరి కోసం ప్రార్థించవచ్చు?

8 మనం ఎవరెవరి కోసం ప్రార్థించవచ్చు? అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకోసం, స్కూల్లో ఒత్తిడిని-ఎగతాళిని ఎదుర్కొంటున్న పిల్లల కోసం, ముసలితనంతో బాధపడుతున్న వాళ్లకోసం ప్రార్థించవచ్చు. కుటుంబం నుండి, ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న చాలామంది బ్రదర్స్‌-సిస్టర్స్‌ కోసం కూడా ప్రార్థించవచ్చు. (మత్త. 10:18, 36; అపొ. 12:5) రాజకీయ అలజడుల వల్ల ఇల్లు వదిలేసి వెళ్లిపోయిన సహోదరుల కోసం, అలాగే ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన బ్రదర్స్‌-సిస్టర్స్‌ కోసం ప్రార్థన చేయవచ్చు. వాళ్ల ఊరు, పేరు తెలియకపోయినా వాళ్లకోసం ప్రార్థించినప్పుడు, “ఒకరినొకరు ప్రేమించుకోవాలి”అని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటించినట్టే.—యోహా. 13:34.

9. యెహోవా సంస్థలో కష్టపడి పనిచేస్తున్న బ్రదర్స్‌ కోసం, వాళ్ల భార్యల కోసం ఎందుకు ప్రార్థించాలి?

9 యెహోవా సంస్థలో కష్టపడి పనిచేస్తున్న బ్రదర్స్‌ కోసం ప్రార్థించవచ్చు. అందులో పరిపాలక సభ సభ్యులు, వాళ్ల సహాయకులు, బ్రాంచి కమిటీ సభ్యులు, బ్రాంచీల్లో వేర్వేరు డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న బ్రదర్స్‌, ప్రాంతీయ పర్యవేక్షకులు, సంఘపెద్దలు, సంఘ పరిచారకులు ఉన్నారు. వీళ్లలో చాలామంది బ్రదర్స్‌కి, వాళ్ల బాధలు వాళ్లకు ఉన్నాసరే మనకోసం, మన తరఫున చెమటోడ్చి కష్టపడుతున్నారు. (2 కొరిం. 12:15) ఉదాహరణకు, మార్క్‌ అనే ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా అంటున్నాడు: “వయసు పెరుగుతున్న మా అమ్మానాన్నలకు దూరంగా ఉండడం నాకు కష్టంగా అనిపిస్తుంది. వాళ్లిద్దరి ఆరోగ్యం అంతంత మాత్రమే. వాళ్లను చూసుకోవడానికి మా అక్క, బావ ఉన్నాసరే నేను దగ్గరుండి చూసుకోలేకపోతున్నానే అనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది.” అయితే, అంత కష్టపడి పనిచేస్తున్న బ్రదర్స్‌ జీవితాల్లో ఎన్ని బాధలున్నాయో మనకు తెలిసినా, తెలియకపోయినా మనం మాత్రం వాళ్ల గురించి ప్రార్థించడం అస్సలు మర్చిపోకూడదు. (1 థెస్స. 5:12, 13) అంతేకాదు, ఆ బ్రదర్స్‌ కష్టపడి పనిచేసేలా వాళ్లకు నమ్మకంగా తోడున్న వాళ్ల భార్యల కోసం కూడా ప్రార్థించడం మర్చిపోకూడదు.

10-11. ఫలానా వ్యక్తి గురించి అని కాకుండా, బ్రదర్స్‌-సిస్టర్స్‌ అందరి గురించి కలిపి ప్రార్థనలో అడిగితే యెహోవా ఇష్టపడతాడా? వివరించండి.

10 మనం ఇప్పటివరకు చూసినట్టు తరచూ మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ గురించి ప్రార్థన చేస్తాం. ఉదాహరణకు, ఫలానా వ్యక్తి గురించి అని కాకుండా జైల్లో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ అందరికీ లేదా ఇష్టమైన వాళ్లను కోల్పోయిన వాళ్లందరికీ సహాయం చేయి యెహోవా అని ప్రార్థనలో అడుగుతూ ఉంటాం. డోనాల్డ్‌ అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు, “కష్టాలు పడే బ్రదర్స్‌-సిస్టర్స్‌ చాలామంది ఉన్నారు. కాబట్టి మన ప్రార్థనలో వాళ్లందర్నీ ఒక్క ‘గూటికి’ తెచ్చి, బాధలుపడే వాళ్లందరికీ సహాయం చేయమని అడగవచ్చు.”

11 అలాంటి ప్రార్థనలు యెహోవా ఇష్టపడతాడా? ఖచ్చితంగా! ఎందుకంటే మన తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఏమేం అవసరమో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్లందరి గురించి కలిపి ప్రార్థన చేయడంలో తప్పులేదు. (యోహా. 17:20; ఎఫె. 6:18) అలా ప్రార్థన చేసినప్పుడు, “ప్రపంచవ్యాప్త సహోదర బృందాన్ని” ప్రేమిస్తున్నాం అని మనం చూపిస్తాం.—1 పేతు. 2:17.

ఒక్కో వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు

12. మనం గమనించేవాళ్లుగా ఉంటే మన ప్రార్థనలు ఎలా ఉంటాయి?

12 గమనిస్తూ ఉండండి. మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ అందరి గురించి ప్రార్థన చేస్తూనే, అందులో ఒక్కో వ్యక్తి పేరు ఉపయోగించి ప్రార్థన చేయడం కూడా మంచిది. ఉదాహరణకు, మీ సంఘంలో ఎవరైనా పెద్ద జబ్బుతో బాధపడుతున్నారా? ఒక పిల్లాడు స్కూల్లో వచ్చే ఒత్తిడివల్ల డీలాపడిపోయాడా? ఎవరైనా ఒంటరి తల్లి లేదా తండ్రి తమ పిల్లాడిని, “యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను” ఇస్తూ పెంచడానికి కష్టపడుతున్నారా? (ఎఫె. 6:4) మనం గమనించేవాళ్లుగా ఉంటే వాళ్లు పడే కష్టాల్ని అర్థం చేసుకుంటాం, వాళ్ల గురించి ప్రార్థన చేస్తాం.b—రోమా. 12:15.

13. మనం ఇప్పటివరకు కలవని వాళ్ల గురించి కూడా ఎలా ప్రార్థన చేయవచ్చు?

13 పేరుపేరున ప్రార్థన చేయండి. మనం ఇప్పటివరకు కలవని వాళ్ల గురించి కూడా ప్రార్థన చేయవచ్చు. ఉదాహరణకు క్రిమియా, ఎరిట్రియా, రష్యా, సింగపూర్‌ లాంటి ప్రాంతాల్లో జైల్లో మగ్గుతున్న మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ గురించి ఆలోచించండి. jw.orgలో వాళ్ల పేర్లుంటాయి.c రియాన్‌ అనే ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా చెప్తున్నాడు: “నేను ఆ బ్రదర్స్‌-సిస్టర్స్‌ పేర్లను ఒక పుస్తకంలో రాసుకుని, వాటిని బయటికి చదువుతాను. దానివల్ల నా వ్యక్తిగత ప్రార్థనలో వాళ్ల పేర్లు ప్రస్తావిస్తూ ప్రార్థన చేయగలుగుతాను.”

14-15. మనం సరిగ్గా అవసరమైన వాటి గురించి ఎలా ప్రార్థించవచ్చు?

14 సరిగ్గా అవసరమైనవి అడగండి. పై పేరాలో చూసిన మైఖేల్‌ ఇలా చెప్తున్నాడు: “జైల్లో ఉన్న మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ గురించి jw.orgలో చదివినప్పుడు, వాళ్ల స్థానంలో నేనుంటే నాకెలా అనిపిస్తుందో ఆలోచించేవాణ్ణి. నేను ఖచ్చితంగా నా భార్య గురించి ఆలోచిస్తాను. ఆమె ఎలా ఉందా? ఆమె బాగోగులు ఎవరు చూసుకుంటున్నారా? అని ఆందోళనపడతాను. కాబట్టి నా ప్రార్థనలో పెళ్లయిన బ్రదర్స్‌ ఎవరైనా జైల్లో ఉంటే, వాళ్ల కోసం ఏం అడగాలో నాకు తెలుసు.”—హెబ్రీ. 13:3, అధస్సూచి.

15 జైల్లో మన బ్రదర్స్‌కి ఒక్కోరోజు ఎలా గడుస్తుందో ఆలోచించినప్పుడు, వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రార్థన చేయగలుగుతాం. ఉదాహరణకు, జైలు గార్డులు వాళ్లతో దయగా ఉండాలని, వాళ్లు స్వేచ్ఛగా ఆరాధించడానికి అధికారులు అనుమతించేలా సహాయం చేయమని ప్రార్థన చేయవచ్చు. (1 తిమో. 2:1, 2) అలాగే, విశ్వాసం కారణంగా జైల్లో ఉన్న బ్రదర్స్‌ని చూసి, స్థానిక సంఘంలో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ ప్రోత్సాహం పొందేలా సహాయం చేయమని ప్రార్థన చేయవచ్చు. లేదా జైల్లో ఉన్న మన బ్రదర్స్‌ మంచి ప్రవర్తన చూసి యెహోవాసాక్షులుకాని వాళ్లు, సత్యం తెలుసుకునేలా సహాయం చేయమని ప్రార్థన చేయవచ్చు. (1 పేతు. 2:12) వేరే కష్టాలు పడుతున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించవచ్చు. మనం గమనించేవాళ్లుగా ఉంటూ, వేరేవాళ్ల పేరు ప్రస్తావిస్తూ ప్రార్థన చేస్తే, వాళ్లకు సరిగ్గా అవసరమైన వాటిగురించి అడిగితే, మనకు ‘తోటి విశ్వాసుల మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువౌతుంది.’—1 థెస్స. 3:12.

మన ప్రార్థనల గురించి సరిగ్గా ఆలోచిద్దాం

16. మన ప్రార్థనల గురించి మనం ఎలా సరిగ్గా ఆలోచించవచ్చు? (మత్తయి 6:8)

16 మనం ముందే చూసినట్టు, ప్రార్థన చేయడం వల్ల ఎదుటివ్యక్తి పరిస్థితులు మారవచ్చు. అయితే, ఈ విషయంలో మనం సరిగ్గా ఆలోచించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు యెహోవాకు అప్పటికే తెలియందేదో మనం చెప్తున్నట్టు కాదు. కాకపోతే ఎప్పుడు, ఏం చేయాలో యెహోవాకు సలహా ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. తన సేవకులకు ఏది అవసరమో యెహోవాకు తెలుసు. అది మనకన్నా, ఆ పరిస్థితిని ఎదుర్కొనే వాళ్లకన్నా ముందే యెహోవాకు తెలుసు. (మత్తయి 6:8 చదవండి.) మరైతే మనం వేరేవాళ్ల గురించి ఎందుకు ప్రార్థించాలి? పైన మనం చెప్పుకున్న కారణాలతో పాటు, ఎదుటివ్యక్తిని పట్టించుకునేవాళ్లు అలా చేస్తారు. ప్రేమ ఉంటే మనం ఒకరి గురించి ఒకరం ప్రార్థన చేసుకుంటాం. తనలాగే, తన సేవకులు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం చూస్తే యెహోవాకు ముచ్చటేస్తుంది.

17-18. తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ కోసం చేసే ప్రార్థనల్ని ఎలా పోల్చవచ్చు?

17 మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వ్యక్తి పరిస్థితులు మారకపోయినా మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మనకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రార్థనలు చూపిస్తాయి. యెహోవా వాటిని గమనిస్తాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ గమనించండి: ఒక కుటుంబంలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ అబ్బాయికి జ్వరం వచ్చినప్పుడు, ఆ చెల్లి వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి, “డాడీ అన్నయ్య కోసం ఏదో ఒకటి చేయి ప్లీజ్‌” అని అడుగుతుంది. ఆ తండ్రి అప్పటికే ఆ అబ్బాయికి కావాల్సిన ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తున్నాడు, ప్రేమతో అతని బాగోగులు చూసుకుంటున్నాడు. అయినాసరే, ఈ పాప వాళ్ల అన్నయ్య గురించి అడిగినప్పుడు, ఆ తండ్రి ఎంత మురిసిపోతాడో కదా!

18 మనం కూడా అదే చేయాలని యెహోవా ఆశిస్తున్నాడు. ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. అలా చేస్తే మన ప్రార్థనలు ఎదుటివ్యక్తి నుండి ఏమీ ఆశించకుండా, నిస్వార్థంగా చేస్తున్నామని చూపిస్తాయి. అప్పుడు మనం యెహోవా మనసును గెల్చుకుంటాం. (2 థెస్స. 1:3; హెబ్రీ. 6:10) అంతేకాదు, ఇప్పటివరకు చూసినట్టు, కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేయడం వల్ల ఎదుటివ్యక్తి పరిస్థితులు కూడా మారవచ్చు. కాబట్టి ఏదేమైనా, ఎప్పుడూ ఒకరి కోసం ఒకరం ప్రార్థిద్దాం!

మీరెలా జవాబిస్తారు?

  • మన ప్రార్థనలకు “చాలా శక్తి” ఉంది అంటే అర్థమేంటి?

  • మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ అందరి గురించి ఎందుకు ప్రార్థించాలి?

  • ఒక్కో వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్లకు సరిగ్గా అవసరమైన దానిగురించి ప్రార్థించడం ఎందుకు మంచిది?

పాట 101 ఐకమత్యంతో పనిచేద్దాం

a కొన్ని పేర్లను మార్చాం.

b టికాషి షిమిజు: యెహోవా “ప్రార్థనలు వినే” దేవుడు అనే వీడియోని jw.orgలో చూడండి.

c జైల్లో ఉన్న మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ పేర్లు తెలుసుకోవాలంటే, jw.orgలో “విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాల వారిగా” అని వెతకండి.

d చిత్రాల వివరణ: వాళ్లకే పుట్టెడు సమస్యలు ఉన్నా వేరేవాళ్ల కోసం ప్రార్థన చేస్తున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి