అధ్యయన ఆర్టికల్ 42
పాట 44 ఒక దీనుడి ప్రార్థన
మనస్ఫూర్తిగా ప్రార్థించడం ఎలా నేర్చుకోవచ్చు?
“ నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. యెహోవా, నాకు జవాబివ్వు. నీ నియమాల్ని నేను పాటిస్తాను.”—కీర్త. 119:145.
ముఖ్యాంశం
బైబిల్లో దేవుని సేవకులు చేసిన ప్రార్థనల నుండి నేర్చుకుని, మన ప్రార్థనలు ఇంకా బాగా ఎలా చేయవచ్చో చూస్తాం.
1-2. (ఎ) యెహోవాతో మనమెందుకు మనసువిప్పి మాట్లాడలేకపోవచ్చు? (బి) మన ప్రార్థనల్ని ఆయన జాగ్రత్తగా వింటాడని మనకెలా తెలుసు?
కొన్నిసార్లు మీ ప్రార్థనలు ఒకేలా ఉంటూ, ఏదో చేయాలి కదా అన్నట్టు పైపైన చేస్తున్నట్టు అనిపిస్తున్నాయా? అలాగైతే మీ ఒక్కరికే కాదు చాలామందికి అలానే అనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ ఉరుకులపరుగుల జీవితంలో మనం ప్రార్థనల్ని గబగబా చేస్తూ ఉండే అవకాశం ఉంది. లేదా కొన్నిసార్లు యెహోవాతో మాట్లాడే అర్హత లేదనుకొని, ఆయనతో మనసువిప్పి మాట్లాడడం మనకు కష్టంగా అనిపించవచ్చు.
2 మనం ప్రార్థనలో పెద్దపెద్ద పదాలు ఉపయోగిస్తేనే యెహోవాకు నచ్చుతుందని కాదుగానీ, మనస్ఫూర్తిగా చేస్తేనే అది నచ్చుతుందని బైబిలు చెప్తుంది. ఆయన “సాత్వికుల ప్రార్థన” వింటాడు. (కీర్త. 10:17) అవును, మనం ప్రార్థనలో చెప్పే ప్రతీమాటను యెహోవా జాగ్రత్తగా వింటాడు. ఎందుకంటే ఆయనకు మనమీద శ్రద్ధ ఉంది.—కీర్త. 139:1-3.
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 అయితే, మనకు ఈ ప్రశ్నలు రావచ్చు: మనం ఏ మొహమాటం లేకుండా యెహోవాకు ఎందుకు ప్రార్థన చేయవచ్చు? మన ప్రార్థనలు మనస్ఫూర్తిగా ఉండేలా ఎలా చూసుకోవచ్చు? ఈ విషయంలో, బైబిల్లో ఉన్న దేవుని నమ్మకమైన సేవకుల ప్రార్థనలు మనకెలా సహాయం చేస్తాయి? మన మనసులో ఉన్న భావాల్ని మాటల్లో చెప్పలేకపోతుంటే అప్పుడేం చేయాలి? ఈ ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు చూస్తాం.
ఏ మొహమాటం లేకుండా యెహోవాకు ప్రార్థన చేయండి
4. ఏ మొహమాటం లేకుండా యెహోవాకు ప్రార్థన చేయడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (కీర్తన 119:145)
4 యెహోవా మన మంచి కోరుకునే ఒక నమ్మకమైన స్నేహితుడని మనం అర్థంచేసుకుంటే, ఏ మొహమాటం లేకుండా ఆయనకు మనం ప్రార్థించగలుగుతాం. 119వ కీర్తన రాసిన వ్యక్తి యెహోవాతో అలాంటి ఒక మంచి స్నేహం కావాలని కోరుకున్నాడు. ఆయన జీవితం పూలబాటలా ఏంలేదు. కొంతమంది ప్రజలు ఆయన గురించి లేనిపోని అబద్ధాలు వ్యాప్తి చేశారు. (కీర్త. 119:23, 69, 78) వీటికి తోడు ఆయన కొన్ని పొరపాట్లు చేసి, వాటివల్ల డీలా పడిపోయాడు. (కీర్త. 119:5) అయినాసరే, యెహోవాతో ఆయన మనసువిప్పి మాట్లాడడానికి ఏమాత్రం భయపడలేదు.—కీర్తన 119:145 చదవండి.
5. యెహోవాకు ప్రార్థన చేయడానికి ఏదీ అడ్డుపడకుండా ఎందుకు చూసుకోవాలి? ఉదాహరణ చెప్పండి.
5 ఆఖరికి ఘోరమైన పాపాలు చేసినవాళ్లను కూడా తనకు ప్రార్థన చేయమని యెహోవా ఆహ్వానిస్తున్నాడు. (యెష. 55:6, 7) కాబట్టి యెహోవాకు ప్రార్థన చేయకుండా మనల్ని ఏదీ ఆపకుండా చూసుకోవాలి. దీన్ని అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ గమనించండి, ఒక పిల్లవాడు చేయొద్దన్న తుంటరి పనిచేసి దెబ్బ తగిలించుకుంటే, అతనికి ఇబ్బందిగా అనిపించినా సరే, సహాయం కోసం అమ్మానాన్నల దగ్గరకు వెళ్లాలి. అదేవిధంగా మనం ఏదైనా పొరపాటు గానీ, పాపం గానీ చేస్తే ఇబ్బంది అనిపించినా సరే, సహాయం కోసం యెహోవా దగ్గరకు ధైర్యంగా వెళ్లాలి.—కీర్త. 119:25, 176.
మన ప్రార్థనలు మనస్ఫూర్తిగా ఉండేలా ఎలా చూసుకోవచ్చు?
6-7. యెహోవా లక్షణాల గురించి ఆలోచించడం వల్ల మనం ఎలా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయవచ్చు? ఉదాహరణ చెప్పండి. (అధస్సూచి కూడా చూడండి.)
6 మనం మనసులో ఏదీ దాచుకోకుండా యెహోవాకు చెప్పుకోవాలి. అంటే, మన లోలోపల ఉన్న ఆలోచనలు, భావాలు నిర్మొహమాటంగా యెహోవాకు చెప్పుకోవాలి. అప్పుడే మన ప్రార్థనలు మనస్ఫూర్తిగా ఉంటాయి. అయితే దాన్నెలా చేయవచ్చు?
7 యెహోవా లక్షణాల గురించి ఆలోచించండి.a ఆయన లక్షణాల గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, మన లోపల ఉన్న భావాలను ఆయనకు అంత ఎక్కువగా చెప్పుకోగలుగుతాం. (కీర్త. 145:8, 9, 18) క్రిస్టీనా సిస్టర్ ఉదాహరణ గమనించండి, ఆ సిస్టర్ వాళ్ల నాన్న చాలా క్రూరంగా ఉండేవాడు. ఆమె ఇలా చెప్తుంది: “యెహోవాను ఒక తండ్రిగా ఊహించుకుంటూ మాట్లాడడం నాకు కష్టంగా అనిపించేది. నాలో ఉన్న లోపాల్ని బట్టి, నా పొరపాట్లను బట్టి ఆయన నన్ను వదిలేస్తాడేమో అని నాకు అనిపించేది.” మరి యెహోవాలో ఉన్న ఏ లక్షణం గురించి ఆలోచించడం ఆమెకు సహాయం చేసింది? ఆమె ఇలా చెప్తుంది: “యెహోవా విశ్వసనీయ ప్రేమ గురించి ఆలోచించడం వల్ల, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మకం కలిగింది. ఆయన నా చెయ్యి ఎప్పుడూ వదిలిపెట్టడని నాకు తెలుసు. ఒకవేళ నేను పడిపోయినా, ఆయన నన్ను ప్రేమతో పైకి లేపుతాడు. దీనివల్ల నేను పట్టలేనంత సంతోషం వచ్చినా, తట్టుకోలేనంత బాధ వచ్చినా యెహోవాకు చెప్పుకోగలుగుతున్నాను.”
8-9. ప్రార్థన చేసే ముందు ఏం చెప్పాలో ఆలోచించడం ఎందుకు మంచిది? ఉదాహరణ చెప్పండి.
8 ఏం మాట్లాడాలో ముందే ఆలోచించండి. ప్రార్థన చేసే ముందు మీరు కొన్ని ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు. ఉదాహరణకు: ‘ఇప్పుడు నేను ఎలాంటి సమస్యలతో పోరాడుతున్నాను? నేను ఎవరినైనా క్షమించాలా? ఈ మధ్యకాలంలో నా జీవితంలో వచ్చిన మార్పువల్ల యెహోవా సహాయం నాకు అవసరమా?’ (2 రాజు. 19:15-19) ఈ ప్రశ్నలతోపాటు, యేసు మనకు నేర్పించిన ప్రార్థన గుర్తు చేసుకుంటూ యెహోవా పేరు గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన ఇష్టం గురించి మనం ఏం అడగవచ్చో ఆలోచించండి.—మత్త. 6:9, 10.
9 అలెస్కా అనే సిస్టర్ ఉదాహరణ చూడండి. తన భర్త బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇక ఎక్కువకాలం బ్రతకడని తెలుసుకున్నప్పుడు, ఆమెకు ప్రార్థన చేసుకోవడం కష్టంగా అనిపించింది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటుంది: “తల పగిలిపోయేంత ఒత్తిడి వల్ల ప్రార్థనలో ఏం మాట్లాడాలో, ఎలా చెప్పుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు.” మరి, ఆమెకు ఏది సహాయం చేసింది? ఆమె ఇలా వివరిస్తుంది: “ప్రార్థన చేసుకునే ముందు నేను కొద్ది క్షణాలు ఆగి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఆలోచించేదాన్ని. దానివల్ల కేవలం నా పరిస్థితి గురించి, నా భర్తకున్న సమస్య గురించే ప్రార్థించకుండా చూసుకునేదాన్ని. అలా చేయడం వల్ల నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నా మనసులో ఉన్నదంతా యెహోవాకు చెప్పుకోగలుగుతున్నాను.”
10. హడావిడిగా కాకుండా మనం ప్రార్థనలో సమయం ఎందుకు గడపాలి? (చిత్రాలు కూడా చూడండి.)
10 హడావిడిగా కాకుండా ప్రార్థనలో సమయం గడపండి. మనం చేసుకునే చిన్నచిన్న ప్రార్థనలు కూడా మనస్ఫూర్తిగానే చేస్తుండవచ్చు. కానీ, మన మనసు లోలోతుల్లో ఉన్నవి చెప్పాలంటే మాత్రం, హడావిడిగా కాకుండా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి.b పైన చూసిన అలెస్కా వాళ్ల భర్త ఎలైజా ఇలా అంటున్నాడు: “నేను రోజులో చాలాసార్లు చిన్నచిన్న ప్రార్థనలు చేస్తాను. కానీ నేను ఎప్పుడైతే ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతానో, అప్పుడే యెహోవాకు ఇంకా దగ్గరైనట్టు అనిపిస్తుంది. యెహోవా కూడా నేను ప్రార్థన ఎప్పుడు ఆపేస్తానో అన్నట్టు చూడడు కాబట్టి, నాకు కావాల్సినంతసేపు ప్రార్థన చేసుకుంటాను.” మీరు ఇలా చేసి చూడండి: మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా, ప్రార్థన బయటికి చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక సమయాన్ని, ప్రశాంతమైన చోటును చూసుకోండి. అలా చేస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపడాన్ని అలవాటుగా చేసుకోండి.
ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేలా మంచి సమయం, స్థలం చూసుకోండి (10వ పేరా చూడండి)
బైబిల్లో ఉన్న దేవుని సేవకుల ప్రార్థనల గురించి ఆలోచించండి
11. బైబిల్లో దేవుని సేవకులు మనసారా చేసిన ప్రార్థనల గురించి ఆలోచించడం వల్ల మనకేంటి ఉపయోగం? (“మీకూ వాళ్లలాగే అనిపిస్తుందా?” అనే బాక్స్ కూడా చూడండి.)
11 బైబిల్లో మనసారా చేసిన ప్రార్థనలు, పాడిన పాటలు లేదా కీర్తనలోని మాటలు మీకు ఉపయోగపడవచ్చు. బైబిల్లో దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ల లోలోపలి ఆలోచనలు ఎలా చెప్పారో గమనిస్తే, మీకు కూడా వాళ్లలాగే యెహోవాతో మనసువిప్పి మాట్లాడాలనే ప్రేరణ కలుగుతుంది. అంతేకాదు, మీ ప్రార్థనలో చేర్చడానికి కొన్ని కొత్తకొత్త పదాలు, మీ పరిస్థితికి సరిగ్గా సరిపోయే ప్రార్థనలు అందులో దొరుకుతాయి.
12. లేఖనాల్లో ఉన్న ప్రార్థనలు చదువుతున్నప్పుడు ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?
12 లేఖనాల్లో ఉన్న ప్రార్థనలు చదువుతున్నప్పుడు ఇలా ఆలోచించుకోండి: ‘ఈ మాటలు ఎవరన్నారు? ఎలాంటి పరిస్థితిలో అన్నారు? వాళ్ల పరిస్థితి, నా పరిస్థితి ఒక్కటేనా? దీన్నుండి నేను ఏం నేర్చుకోవచ్చు?’ వీటికి జవాబులు తెలియాలంటే ఇంకాస్త పరిశోధన చేయాల్సి రావచ్చు, కానీ మీ కృషికి తప్పకుండా మంచి ప్రతిఫలం దొరుకుతుంది. కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం.
13. ప్రార్థన గురించి హన్నా నుండి మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటి? (1 సమూయేలు 1:10, 11) (చిత్రం కూడా చూడండి.)
13 మొదటి సమూయేలు 1:10, 11 చదవండి. హన్నా ఈ ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ఈ రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆమెకు పిల్లలు పుట్టలేదు. రెండు, ఆమె భర్తకున్న ఇంకో భార్య ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. (1 సమూ. 1:4-7) మీకు కూడా ఏదైనా తీరని సమస్య ఉంటే హన్నా ప్రార్థనల నుండి ఏమైనా నేర్చుకోవచ్చా? ఆమె ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ హృదయంలో ఉన్న భారమంతా యెహోవా మీద వేసినప్పుడు ఆమె ఊపిరి పీల్చుకుంది. (1 సమూ. 1:12, 18) మీకు సరిగ్గా ఏ సమస్య ఉందో, దానివల్ల ఎలా అనిపిస్తుందో యెహోవాకు చెప్తూ మీ ‘భారాన్నంతా ఆయన మీద వేస్తే,’ మీరు కూడా కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.—కీర్త. 55:22.
ఒకవైపు పిల్లలు పుట్టక, మరోవైపు పెనిన్నా పోరు తట్టుకోలేక హన్నా తన హృదయంలో ఉన్న బాధను యెహోవాకు చెప్పుకుంది (13వ పేరా చూడండి)
14. (ఎ) హన్నా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (బి) లేఖనాల గురించి లోతుగా ఆలోచించడం వల్ల, ప్రార్థనలు ఇంకా బాగా ఎలా చేయవచ్చు? (అధస్సూచి చూడండి.)
14 సమూయేలు పుట్టిన కొన్నేళ్లకే, హన్నా ఆ బాబును తీసుకెళ్లి ప్రధాన యాజకుడైన ఏలీ చేతుల్లో పెట్టింది. (1 సమూ. 1:24-28) యెహోవా తన నమ్మకమైన స్నేహితుల్ని కాపాడతాడని, కంటికి రెప్పలా చూసుకుంటాడనే నమ్మకం ఆమె మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనలో కనిపిస్తుంది.c (1 సమూ. 2:1, 8, 9) ఆమె సమస్యలు అప్పటికప్పుడు ఏమీ మాయం అవ్వలేదు కానీ, యెహోవా తనను ఎలా దీవించాడు అనే దానిమీద హన్నా మనసుపెట్టింది. ఇందులో మనకేంటి పాఠం? ఇప్పటివరకు యెహోవా మన చెయ్యి పట్టుకుని ఎలా నడిపించాడు అనే దానిమీద మనసుపెడితే, మనకున్న కష్టాల్ని తేలిగ్గా తట్టుకోగలుగుతాం.
15. మనకు అన్యాయం ఎదురైనప్పుడు యిర్మీయా ప్రార్థనల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (యిర్మీయా 12:1)
15 యిర్మీయా 12:1 చదవండి. యిర్మీయా ప్రవక్త తన జీవితంలో ఒకానొక సమయంలో చెడ్డవాళ్లు ఎదగడం చూసి తట్టుకోలేకపోయాడు. అంతేకాదు, తోటి ఇశ్రాయేలీయులు ఆయన్ని ఎగతాళి చేశారు. (యిర్మీ. 20:7, 8) మనకు కూడా అవినీతిపరులు బాగుపడినా, ఎవరైనా మనల్ని ఎగతాళి చేసినా యిర్మీయాలాగే అనిపించవచ్చు. యిర్మీయా తన చిరాకంతా యెహోవాకు చెప్పుకున్నా, దేవుడు అన్యాయం చేశాడని మాత్రం అనలేదు. తిరుగుబాటు చేసిన ప్రజలకు యెహోవా ఎలా క్రమశిక్షణ ఇచ్చాడో కళ్లారా చూశాక, దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడనే నమ్మకం యిర్మీయాకు బోలెడంత పెరిగింది. (యిర్మీ. 32:19) అదేవిధంగా, మనం ఎదుర్కొంటున్న ఏ అన్యాయాన్నైనా, యెహోవా అనుకున్న సమయంలో తీసేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. ప్రార్థనలో మన చిరాకులు, పరాకులు అన్నీ యెహోవాకు చెప్పుకోవచ్చు.
16. మన పరిస్థితులు మనల్ని కట్టిపడేసినప్పుడు ఒక లేవీయుడి ప్రార్థన నుండి ఏం నేర్చుకోవచ్చు? (కీర్తన 42:1-4) (చిత్రాలు కూడా చూడండి.)
16 కీర్తన 42:1-4 చదవండి. తోటి ఇశ్రాయేలీయులతో ఆరాధించే పరిస్థితిలోలేని ఒక లేవీయుడు ఈ కీర్తన రాశాడు. దానివల్ల ఆయనకు ఎలా అనిపిస్తుందో ఆ కీర్తనలో చెప్పాడు. బహుశా మనం ఇంటికే పరిమితం అయినప్పుడు, లేదా మన విశ్వాసం కారణంగా జైల్లో మగ్గిపోతున్నప్పుడు ఆ లేవీయుడిలాగే అనిపించవచ్చు. మనకు ఒక క్షణం బాధగా, ఇంకో క్షణం సంతోషంగా, మరో క్షణం నీరసంగా ఇలా రకరకాలుగా అనిపించవచ్చు. మనకు ఎలా అనిపించినా సరే, వాటిని యెహోవాకు చెప్పుకోవడం మంచిది. దానివల్ల మన ఆలోచనల్ని పరిశీలించుకొని, విషయాల్ని సరిగ్గా చూడగలుగుతాం. ఉదాహరణకు, ఆ లేవీయుడు యెహోవాను స్తుతించడానికి తనకు కొత్త అవకాశాలు ఉంటాయని గుర్తించాడు. (కీర్త. 42:5) అలాగే యెహోవా తనను ఎలా పట్టించుకుంటున్నాడో కూడా ఆలోచించాడు. (కీర్త. 42:8) యెహోవాకు మనం పట్టుదలగా ప్రార్థన చేయడం వల్ల, మన లోలోపల ఉన్న భావాల్ని పరిశీలించుకోగలుగుతాం, దానివల్ల మన మనసు కుదుటపడుతుంది, కష్టాల్ని తట్టుకోవడానికి కావాల్సిన శక్తి దొరుకుతుంది.
42వ కీర్తన రాసిన లేవీయుడు, దేవుని ముందు తన హృదయాన్ని కుమ్మరించాడు. ప్రార్థనలో మన హృదయంలో ఉన్నదంతా యెహోవాకు చెప్పుకున్నప్పుడు విషయాల్ని సరిగ్గా చూడగలుగుతాం (16వ పేరా చూడండి)
17. (ఎ) యోనా ప్రార్థన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (యోనా 2:1, 2) (బి) కష్టాలు వచ్చినప్పుడు కీర్తనలోని కొన్ని మాటలు మనకు ఎలా సహాయం చేస్తాయి? (అధస్సూచి చూడండి.)
17 యోనా 2:1, 2 చదవండి. యోనా ప్రవక్త ఈ ప్రార్థనని ఒక పెద్ద చేప కడుపులో ఉన్నప్పుడు చేశాడు. యెహోవా మాట వినకపోవడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని యోనాకు తెలుసు. అయినా సరే, అలాంటి పరిస్థితుల్లో కూడా తన ప్రార్థనల్ని యెహోవా తప్పకుండా వింటాడనే నమ్మకం యోనాకు ఉంది. ఆయన చేసిన ఆ ప్రార్థనలో, కీర్తనల్లోని చాలా మాటల్ని ఉపయోగించాడు.d బహుశా ఆ కీర్తనలు ఆయనకు కొట్టినపిండి అయ్యుంటాయి. యోనా ఆ లేఖనాల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు, యెహోవా తన చెయ్యి ఇంకా వదల్లేదని ఆయనకు గట్టిగా అనిపించి ఉంటుంది. అలాగే మనం కూడా కొన్ని బైబిలు లేఖనాల్ని గుర్తుపెట్టుకుంటే, కష్టాల్లో యెహోవాకు ప్రార్థించినప్పుడు ఆ లేఖనాలే మనకు ఊరటనిస్తాయి.
ప్రార్థనలో యెహోవాకు దగ్గరౌతూ ఉండండి
18-19. ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనసులో ఉన్నవి మాటల్లో చెప్పడం కష్టంగా ఉంటే రోమీయులు 8:26, 27 ఏ భరోసా ఇస్తుంది? ఒక అనుభవం చెప్పండి.
18 రోమీయులు 8:26, 27 చదవండి. మనం కొన్నిసార్లు ఆందోళనలతో ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతామంటే, ప్రార్థనలో మనకు మాటలు రాకపోవచ్చు. మరి, మనకు సహాయం చేసేవాళ్లే లేరా? అలా ఏంకాదు! అలాంటి సందర్భాల్లో దేవుని పవిత్రశక్తి, “మన తరఫున వేడుకుంటుంది.” ఎలా? యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగించి బైబిల్లో ఎన్నో ప్రార్థనలు రాయించాడు. మనం మన ఆలోచనల్ని ఎప్పుడైతే చెప్పలేకపోతామో, అప్పుడు యెహోవా బైబిల్లోని ప్రార్థనల్ని మన ప్రార్థనలుగా తీసుకుని వాటికి జవాబు ఇస్తాడు.
19 అలా ఆలోచించడం రష్యాలో ఉంటున్న ఎలీనా అనే సిస్టర్‌కి సహాయం చేసింది. బైబిలు చదివినందుకు, ప్రార్థన చేసినందుకు ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఎంత ఒత్తిడిలో ఉందంటే, ఆమెకు ప్రార్థన చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఆమె ఇలా చెప్తుంది: “నాకు ఉక్కిరిబిక్కిరిగా అనిపించినప్పుడు ఏం ప్రార్థించాలో కూడా నాకు తెలిసేది కాదు. అప్పుడు యెహోవా గతంలో తన నమ్మకమైన సేవకుల ప్రార్థనల్ని, నా ప్రార్థనలుగా తీసుకుంటాడని గుర్తు తెచ్చుకున్నప్పుడు నాకెంతో ఊరటగా అనిపించింది.”
20. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి ముందు మన మనసును ఎలా సిద్ధం చేసుకోవచ్చు?
20 మనం ఒత్తిడిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, మనసు కుదురుగా ఉండదు. కాబట్టి మన మనసును సిద్ధం చేసుకోవడానికి కీర్తన పుస్తకానికి ఉన్న ఆడియో రికార్డింగ్స్ వినవచ్చు. అంతేకాదు, దావీదు రాజులాగే, మన హృదయంలో ఉన్నవన్నీ పేపర్ మీద రాసుకోవచ్చు. (కీర్త. 18; 34; 142; పైవిలాసాలు.) అయితే, ప్రార్థన కోసం సిద్ధపడుతున్నప్పుడు ఇలా చేయాలి, అలా చేయాలి అనే రూల్స్ ఏమీ లేవు. (కీర్త. 141:2) మీకు ఏది బాగా పనికొస్తుందో దాన్ని చేయండి.
21. మనం మనసువిప్పి ఎందుకు ప్రార్థన చేయాలి?
21 మనం ఏం చెప్పక ముందే యెహోవాకు మన మనసు తెలుసు. అది విని మనకు ఎంత ఊరటగా ఉందో కదా! (కీర్త. 139:4) అయితే, తనమీద నమ్మకంతో మనం చేసే ప్రార్థనల్ని ఎప్పుడెప్పుడు వినాలా అని యెహోవా తపిస్తున్నాడు. కాబట్టి మీ పరలోక తండ్రితో మాట్లాడడానికి మొహమాటపడకండి. బైబిల్లో దేవుని నమ్మకమైన సేవకులు చేసిన ప్రార్థనల నుండి నేర్చుకోండి, మనసువిప్పి ప్రార్థన చేయండి, మీ సంతోషాల్ని, బాధల్ని యెహోవాకు చెప్పుకోండి. యెహోవా ఒక నిజమైన స్నేహితునిగా ఎప్పుడూ మీతోనే ఉంటాడు!
పాట 45 నా హృదయ ధ్యానం
a మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు అనే పుస్తకంలో, “యెహోవా” అనే అంశం కింద, “యెహోవాకున్న కొన్ని ముఖ్యమైన లక్షణాలు” చూడండి.
b సాధారణంగా సంఘంలో అందరి తరఫున చేసే ప్రార్థనలు చాలా చిన్నగా ఉంటాయి.
c మోషే రాసిన పుస్తకాల్లో ఉన్నలాంటి పదాల్నే, హన్నా తన ప్రార్థనలో ఉపయోగించింది. అంటే, ఆమె లేఖనాల్ని ధ్యానించడానికి సమయం తీసుకుందని అర్థమౌతుంది. (ద్వితీ. 4:35; 8:18; 32:4, 39; 1 సమూ. 2:2, 6, 7) వందల సంవత్సరాల తర్వాత, యేసు తల్లి మరియ కూడా, హన్నా ఉపయోగించిన లాంటి మాటల్నే ఉపయోగిస్తూ యెహోవాను స్తుతించింది.—లూకా 1:46-55.
d ఇంకొన్ని ఉదాహరణలు: యోనా 2:3-9 లేఖనాల్ని కీర్తన 69:1; 16:10; 30:3; 142:2, 3; 143:4, 5; 18:6 అలాగే 3:8 లేఖనాలతో పోల్చండి. యోనా ప్రార్థనలో ఉన్న వరుసక్రమంలో ఈ లేఖనాలు ఉన్నాయి.