అధ్యయన ఆర్టికల్ 41
పాట 108 దేవుని విశ్వసనీయ ప్రేమ
దేవుని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది
“ యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు; ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”—కీర్త. 136:1.
ముఖ్యాంశం
యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది ప్రాథమిక బోధ అని గుర్తుపెట్టుకుంటే, కష్టాలు వచ్చినప్పుడు ఆయన ప్రేమను అనుమానించకుండా ఉంటాం.
1-2. చాలామంది యెహోవా సేవకులకు ఎలాంటి కష్టాలు రావచ్చు?
అల్లకల్లోలంగా ఉన్న నడి సముద్రంలో ఒక ఓడను ఊహించుకోండి. అలల తాకిడికి ఆ ఓడ అటూఇటూ ఊగిసలాడుతుంది. అలలు ఎటు తీసుకెళ్తే ఓడ అటు వెళ్తుంది. ఎవరోఒకరు లంగరు వేసి ఆపేదాకా అది అలా వెళ్తూనే ఉంటుంది. లంగరు ఒక ఓడను స్థిరంగా ఉంచుతుంది, అలాగే ఎగిసిపడుతున్న అలలకు కొట్టుమిట్టాడకుండా చేస్తుంది.
2 కష్టాలు మీమీద విరుచుకుపడినప్పుడు మీ పరిస్థితి కూడా ఆ ఓడలాగే ఉండొచ్చు. మీ మనసు అటూఇటూ ఊగిసలాడుతుండవచ్చు. ఒకరోజు, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీ వెన్నంటే ఉన్నాడని గట్టిగా అనిపిస్తుంది. కానీ తర్వాతి రోజు, అసలు మీరు అనుభవిస్తున్న కష్టాల్ని యెహోవా చూస్తున్నాడా అనే అనుమానం రావచ్చు. (కీర్త. 10:1; 13:1) బహుశా ఒక ఫ్రెండ్ వచ్చి మీకు ధైర్యం చెప్పగానే కాస్త ఉపశమనంగా అనిపించవచ్చు. (సామె. 17:17; 25:11) కానీ ఆ తర్వాత వెంటనే మీ అనుమానం తిరగబెట్టవచ్చు. ఆఖరికి యెహోవా మీ చేయి వదిలేశాడేమో అని కూడా మీకు అనిపించవచ్చు. మరి కష్టాల్లో మీరు కొట్టుకుపోకుండా మిమ్మల్ని లంగరు వేసి ఆపేదేంటి? ఇంకో మాటలో, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీ వెన్నంటే ఉంటాడనే నమ్మకంతో మీరెలా ఉండవచ్చు?
3. కీర్తన 31:7 అలాగే 136:1లో ఉన్న విశ్వసనీయ ప్రేమ అంటే ఏంటి? అది చూపించడంలో యెహోవా ఆయనకు ఆయనే సాటి అని ఎందుకు చెప్పవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
3 కష్టాల్లో మీకు లంగరులా పనిచేసే ఒక విషయం ఏంటంటే, యెహోవా విశ్వసనీయ ప్రేమను గుర్తుపెట్టుకోవడం. (కీర్తన 31:7; 136:1 చదవండి.) “విశ్వసనీయ ప్రేమ” అంటున్నప్పుడు అది ఒకవ్యక్తి మీద ఎప్పటికీ ఉండే బలమైన బంధాన్ని సూచిస్తుంది. విశ్వసనీయ ప్రేమను చూపించడంలో యెహోవా ఆయనకు ఆయనే సాటి. నిజానికి యెహోవా “అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు” అని బైబిలు వర్ణిస్తుంది. (నిర్గ. 34:6, 7) అలాగే యెహోవా గురించి “నీకు మొరపెట్టే వాళ్లందరి మీద అపారమైన విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు” అని కూడా బైబిలు చెప్తుంది. (కీర్త. 86:5) దానర్థం ఏంటో ఒక్కక్షణం ఆలోచించండి: యెహోవా తన నమ్మకమైన స్నేహితులను ఎప్పుడూ విడిచిపెట్టడు! కష్టాలు మీ మీద విరుచుకుపడినప్పుడు యెహోవా నమ్మకంగా ఉంటాడనే విషయం గుర్తుపెట్టుకోవడం మీకు ఒక లంగరులా పనిచేస్తుంది.—కీర్త. 23:4.
తుఫాను ఎగిసిపడినప్పుడు ఓడ కొట్టుకుపోకుండా లంగరు స్థిరంగా ఉంచినట్టే, యెహోవా ప్రేమ మీద మనకున్న నమ్మకం కష్టాల్లో స్థిరంగా ఉండడానికి సహాయం చేస్తుంది (3వ పేరా చూడండి)
యెహోవా ప్రేమను ప్రాథమిక బైబిలు బోధలా చూడండి
4. కొన్ని ప్రాథమిక బైబిలు బోధలు ఏంటి, వాటిని ఎందుకు గట్టిగా నమ్ముతున్నాం?
4 కష్టాల్లో లంగరులా పనిచేసే ఇంకో విషయం ఏంటంటే, యెహోవా ప్రేమను ఒక ప్రాథమిక బైబిలు బోధలా చూడడం. ప్రాథమిక బైబిలు బోధ అని వినగానే మీకేం గుర్తొస్తుంది? బహుశా, దేవుని వాక్యం నుండి మీరు నేర్చుకున్న సత్యాలు మీకు గుర్తుకురావచ్చు. ఉదాహరణకు, దేవుని పేరు యెహోవా అని, యేసు దేవుని కుమారుడని, చనిపోయిన వాళ్లకు ఏమీ తెలియదని, భూమి పరదైసుగా మారుతుందని, అందులో మనుషులు శాశ్వతంగా జీవిస్తారని మీరు నేర్చుకున్నారు. (కీర్త. 83:18; ప్రసం. 9:5; యోహా. 3:16; ప్రక. 21:3, 4) ఒక్కసారి మీరు నేర్చుకున్నవి సత్యం అని మీకు అర్థమైన తర్వాత, ఇక ఎవ్వరు వచ్చి, ఏం చెప్పినా మీరు మోసపోలేదు. అలాగే, అవన్నీ వాస్తవాల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి, మీరు ఆ సత్యాల్ని గుడ్డిగా నమ్మలేదు. అయితే, యెహోవా ప్రేమను ప్రాథమిక బైబిలు బోధలా చూడడంవల్ల యెహోవా మిమ్మల్ని, మీ కష్టాల్ని పట్టించుకోవట్లేదు అనే ఆలోచనను ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పుడు చూద్దాం.
5. తప్పుడు బోధల్ని ఒకవ్యక్తి ఎలా తిప్పికొట్టగలడో వివరించండి.
5 మీరు బైబిలు స్టడీ మొదలుపెట్టిన తర్వాత, తప్పుడు బోధల్ని తిప్పికొట్టడానికి మీకేది సహాయం చేసింది? బహుశా అప్పటికే మీరున్న మతంలో నేర్చుకున్న విషయాల్ని, లేఖనాలు చెప్పిన వాటితో పోల్చి చూడడం వల్ల వాటిని తిప్పికొట్టగలిగి ఉంటారు. ఉదాహరణకు, మీరు ఒకప్పుడు యేసు దేవుడని నమ్మి ఉంటారు. కానీ బైబిలు స్టడీ తీసుకున్న తర్వాత మీరు ఇలా ఆలోచించి ఉంటారు: నేను నమ్మింది నిజమేనా? ఆ విషయాన్ని లేఖనాల ఆధారంగా పరిశీలించిన తర్వాత, అది తప్పని మీరు తెలుసుకుని ఉంటారు. దాంతో మీరు ఆ తప్పుడు బోధల్ని వదిలేసి, లేఖన సత్యాల్ని పట్టుకుని ఉంటారు. ఆ సత్యం ఏంటంటే: యేసు “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు,” “దేవుని ఒక్కగానొక్క కుమారుడు.” (కొలొ. 1:15; యోహా. 3:18) నిజమే తప్పుడు బోధలు, కూలగొట్టడానికి కష్టంగా ఉండే ఒక “బలమైన కోట” లాంటివి. (2 కొరిం. 10:4, 5) కానీ ఒక్కసారి మీరు వాటిని కూల్చేసిన తర్వాత, ఇక మళ్లీ వాటి జోలికి వెళ్లలేరు.—ఫిలి. 3:13.
6. యెహోవా ‘విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుందనే’ నమ్మకంతో మీరు ఎందుకు ఉండవచ్చు?
6 అదేవిధంగా యెహోవా ప్రేమ గురించి బైబిలు చెప్పే సత్యం ఏంటో ఆలోచించండి. మీరేదైనా కష్టాన్ని ఎదుర్కొంటూ, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానం వస్తే, ‘నేను సరిగ్గానే ఆలోచిస్తున్నానా?’ అని ప్రశ్నించుకోండి. యెహోవా ప్రేమ గురించి మీకున్న అనుమానాల్ని, ఈ ఆర్టికల్ ముఖ్య లేఖనం కీర్తన 136:1 లోని మాటలతో పోల్చండి. యెహోవా తన ప్రేమను, “విశ్వసనీయ ప్రేమ” అని ఎందుకు అంటున్నాడు? “ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది” అనే మాటలు, ఆ కీర్తనలో 26 సార్లు ఎందుకుంది? మనం ఇప్పటికే పరిశీలించినట్టు బైబిలు నుండి నేర్చుకుని, మీరు అంగీకరించిన వేరే సత్యాల్లాగే, యెహోవా తన ప్రజలమీద చూపించే విశ్వసనీయ ప్రేమ కూడా ప్రాథమిక బైబిలు సత్యాల్లో ఒకటి. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించట్లేదు, మిమ్మల్ని ఎందుకూ పనికిరానివాళ్లలా చూస్తున్నాడనే ఆలోచన పచ్చి అబద్ధం. వేరే తప్పుడు బోధలను మీరు ఎలా తిప్పికొట్టారో దీన్ని కూడా అలాగే తిప్పికొట్టండి!
7. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని ధైర్యాన్నిచ్చే కొన్ని లేఖనాలు చెప్పండి.
7 యెహోవా ప్రేమకు రుజువులు బైబిల్లో కోకొల్లలు. ఉదాహరణకు, యేసు తన అనుచరులతో ఇలా అన్నాడు: “మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.” (మత్త. 10:31) యెహోవా స్వయంగా తన ప్రజలతో ఇలా అన్నాడు: “నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను, నీతి అనే నా కుడిచేతితో నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను.” (యెష. 41:10) ఈ మాటల్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి: యేసు ఇక్కడ మీరు చాలా విలువైనవాళ్లేమో అని అనలేదు, యెహోవా కూడా నేను మీకు సహాయం చేస్తానేమో అని అనలేదు. బదులుగా వాళ్లు “మీరు చాలా విలువైనవాళ్లు,” “మీకు సహాయం చేస్తాను” అని చెప్పారు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానం వస్తే, ఇప్పుడు చూసినలాంటి లేఖనాలు యెహోవా ప్రేమను మీకు గుర్తుచేస్తాయి. ఇవి కేవలం మీ మనసుకు హాయిని ఇవ్వడమే కాదు, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని బల్లగుద్ది చెప్పేంత ధైర్యానిస్తాయి. ఎందుకంటే అవి వాస్తవాల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేసుకుని అలాంటి లేఖనాల గురించి లోతుగా ఆలోచిస్తే, మీరు కూడా 1 యోహాను 4:16 లోని మాటల్ని కాదనలేరు. అక్కడ ఇలా ఉంది: “దేవునికి మనమీద ఎంత ప్రేమ ఉందో మనం తెలుసుకున్నాం, దాన్ని నమ్ముతున్నాం.”a
8. యెహోవా ప్రేమిస్తున్నాడా అనే అనుమానం కొన్నిసార్లు వస్తే మీరేం చేయవచ్చు?
8 అయినాసరే, కొన్నిసార్లు యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అనే అనుమానం వస్తే, అప్పుడేంటి? మీకు అనిపిస్తున్న దాన్ని, మీకు తెలిసిన దాంతో పోల్చి చూడండి. మనకు అనిపించడం-అనిపించకపోవడం పరిస్థితుల్ని బట్టి మారిపోతాయి, కానీ వాస్తవాలు మారవు. మనం బైబిల్లో తెలుసుకున్న యెహోవా ప్రేమ మార్పులేని, తిరుగులేని వాస్తవం! ఇంత తెలిసినా, మనం ఆ వాస్తవాన్ని పట్టించుకోకపోతే సాక్ష్యాత్తు యెహోవా గొప్ప లక్షణమైన ప్రేమనే శంకిస్తున్నట్టు అవుతుంది.—1 యోహా. 4:8.
యెహోవా “మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు” అనే విషయాన్ని లోతుగా ఆలోచించండి
9-10. యోహాను 16:26, 27 లో “స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు” అని యేసు చెప్పిన సందర్భం ఏంటి? (చిత్రం కూడా చూడండి.)
9 యెహోవా ప్రేమ గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి, యేసు తన అనుచరులతో అన్న ఈ మాటలు సహాయం చేస్తాయి: “స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.” (యోహాను 16:26, 27 చదవండి.) అయితే, ఆ మాటల్ని యేసు తన శిష్యుల మనసుకు ఏదో మంచిగా అనిపించాలని చెప్పలేదు. ఆ లేఖన సందర్భాన్ని గమనిస్తే ఆయన వాళ్ల ఫీలింగ్స్ గురించి మాట్లాడట్లేదు గానీ, ప్రార్థన అనే వేరే అంశం గురించి మాట్లాడుతున్నాడని తెలుస్తుంది.
10 యేసు ప్రార్థన గురించి తన శిష్యులతో మాట్లాడుతూ తనకు కాదుగానీ, తన ద్వారా ప్రార్థించాలని చెప్పాడు. (యోహా. 16:23, 24) ఈ విషయం గురించి శిష్యులు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే, యేసు పునరుత్థానమైన తర్వాత యేసుకే ప్రార్థించాలనే కోరిక వాళ్లల్లో కలిగే ప్రమాదం ఉంది. పైగా యేసును వాళ్లు స్నేహితునిగా చూశారు కాబట్టి, ‘యేసుకు మేమంటే చాలా ఇష్టం ఇక మా సమస్యలన్నీ యేసుకు చెప్పుకుంటే, ఆయనే మా బదులు తండ్రికి చెప్తాడులే’ అని ఆలోచించే ప్రమాదం కూడా ఉంది. అయితే, శిష్యులు అలాంటి ఆలోచనను రానివ్వకూడదని యేసు చెప్పాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.” ప్రార్థన గురించి బైబిలు చెప్పే ప్రాథమిక విషయాల్లో ఈ వాస్తవం కూడా ఒకటి. ఈ విషయాన్ని మీరెలా పాటించవచ్చో ఆలోచించండి. బైబిల్ని చదవడం వల్ల యేసు గురించి తెలుసుకోగలిగారు, ఆయన్ని ప్రేమించగలిగారు. (యోహా. 14:21) కానీ “స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు” అనే విషయం తెలుసుకుని మొదటి శతాబ్దంలోని శిష్యుల్లాగే, మీరు కూడా ధైర్యంగా దేవునికి ప్రార్థన చేయవచ్చు. అలా మీరు యెహోవాకు ప్రార్థించిన ప్రతీసారి, యేసు చెప్పిన మాటల మీద నమ్మకం ఉందని చూపిస్తారు.—1 యోహా. 5:14.
“స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు” అనే నమ్మకంతో మీరు యెహోవాకు ప్రార్థన చేయవచ్చు (9-10 పేరాలు చూడండి)b
అనుమానాలు ఎక్కడనుండి పుడుతున్నాయో గమనించుకోండి
11. యెహోవా ప్రేమను అనుమానిస్తే సాతానుకు ఎలా అనిపిస్తుంది?
11 యెహోవా ప్రేమ మీద అనుమానాలు ఎక్కడ నుండి పుడతాయి? బహుశా సాతాను నుండి అని మీరు జవాబు ఇవ్వవచ్చు. అది కొంతవరకు నిజమే. ఎందుకంటే సాతాను ఎవర్ని “మింగాలా” అని చూస్తున్నాడు. ఎవరైనా యెహోవా ప్రేమను అనుమానించేవాళ్లు కనబడితే సాతాను ఎగిరి గంతేస్తాడు. (1 పేతు. 5:8) ఎందుకంటే, యెహోవా ప్రేమతో ఇచ్చిన విమోచన క్రయధనం పొందడానికి మనకు అర్హత లేదు అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు. (హెబ్రీ. 2:9) అయితే, యెహోవా ప్రేమను అనుమానిస్తే ఎవరికి లాభం? సాతానుకే. కష్టాల్లో మనం చేతులెత్తేస్తే ఎవరి కళ్లు చల్లబడతాయి? సాతానువే. మనం యెహోవా ప్రేమను అనుమానించేలా సాతాను ప్రయత్నించడం ఎంత పిచ్చితనమో కదా! అసలు యెహోవా ప్రేమను పోగొట్టుకుంది, సాతాను. కానీ, అదేదో యెహోవా మనల్ని ప్రేమించట్లేదని, మనల్ని దగ్గరకు రానివ్వడని మనం అనుకోవాలని సాతాను ప్రయత్నిస్తాడు. ఇది సాతానుకు బాగా చెయ్యి తిరిగిన ‘పన్నాగాల్లో’ ఒకటి. (ఎఫె. 6:11) అయితే, మన శత్రువైన సాతాను ఎత్తుల్ని గుర్తుపడితే, అతన్ని ‘ఎదిరించాలనే’ మన గట్టి నమ్మకం బలపడుతుంది.—యాకో. 4:7.
12-13. మన అణువణువులో ఉన్న పాపం యెహోవా ప్రేమను అనుమానించేలా ఎలా చేస్తుంది?
12 యెహోవా ప్రేమను అనుమానించడం ఇంకో చోటు నుండి కూడా పుడుతుంది. ఏంటది? మన అణువణువులో ఉన్న పాపం. (కీర్త. 51:5; రోమా. 5:12) పాపం మనిషిని సృష్టికర్త నుండి వేరు చేసింది, ఆ పాపం మనసును మలినం చేసింది, హృదయాన్ని కలుషితం చేసింది, మన శరీరాన్ని హూనం చేసింది.
13 పాపం మన మనసును చెడుతో నింపేసింది. దానివల్ల అపరాధ భావాలు, ఆందోళన, అభద్రత భావం, అవమానం మనకు కలుగుతాయి. సాధారణంగా మనం ఏదైనా పాపం చేసినప్పుడు అలా అనిపించవచ్చు. కానీ యెహోవా మనల్ని సృష్టించిన దానికి పూర్తి వ్యతిరేకమైన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఆ పాపపు స్థితి గుర్తొచ్చిన ప్రతిసారీ మనలో అలాంటి భావాలు వస్తాయి. (రోమా. 8:20, 21) ఒక బండి టైరు పంచర్ అయినప్పుడు అది ఎలా సరిగ్గా నడవలేదో అలాగే, మనలో ఉన్న అపరిపూర్ణత వల్ల యెహోవా మనల్ని తయారుచేసిన స్థాయిలో మనం పని చేయలేకపోతున్నాం. అందుకే కొన్నిసార్లు యెహోవా ప్రేమ గురించి కూడా మనకు అనుమానాలు రావడంలో ఆశ్చర్యం లేదు. ఒకవేళ అదే జరిగితే యెహోవా, ‘సంభ్రమాశ్చర్యాలు పుట్టించే గొప్ప దేవుడని, ఆయన్ని ప్రేమించి తన ఆజ్ఞల్ని పాటించేవాళ్ల విషయంలో విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడని’ గుర్తుపెట్టుకోవాలి.—నెహె. 1:5.
14. విమోచన క్రయధనం గురించి ఆలోచించడం వల్ల యెహోవా మనల్ని ప్రేమించడు అనే ఆలోచనల్ని ఎలా తీసేసుకోవచ్చు? (రోమీయులు 5:8) (“‘పాపానికున్న మోసకరమైన శక్తి’ నుండి కాపాడుకోండి” అనే బాక్స్ కూడా చూడండి.)
14 నిజమే కొన్నిసార్లు యెహోవా ప్రేమ పొందడానికి మనకు అర్హత లేదని అనిపించవచ్చు. సూటిగా చెప్పాలంటే, ఆ ప్రేమ పొందే అర్హత మనకు లేదు. అయినా యెహోవా మనమీద ప్రేమ చూపిస్తున్నాడు. అదే ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యం. మన సొంత కృషితో యెహోవా ప్రేమను సంపాదించుకోలేదు కానీ, ఆయనే తన కుమారుని ప్రాణాన్ని ఇచ్చి, మన పాపాల్ని కప్పి, మన మీదున్న ప్రేమను చూపించుకున్నాడు. (1 యోహా. 4:10) అంతేకాదు, యేసు పరిపూర్ణ మనుషుల కోసం కాదు, పాపుల్ని కాపాడడానికే వచ్చాడు అని గుర్తుపెట్టుకోవాలి. (రోమీయులు 5:8 చదవండి.) మనలో ఎవ్వరం ఏ పనిని వందకు వంద శాతం చేయలేం. అలా చేయాలని కూడా యెహోవా మననుండి ఆశించడు. అయితే, యెహోవా ప్రేమను అనుమానించేలా చేసేది మనలో ఉన్న పాపపు స్థితే అని అర్థం చేసుకుంటే, అది మన ఆలోచనలకు సంకెళ్లు వేయకుండా చూసుకోగలుగుతాం.—రోమా. 7:24, 25.
యెహోవాకు విశ్వసనీయంగా ఉండండి
15-16. మనం యెహోవాకు విశ్వసనీయంగా ఉంటే ఏ నమ్మకంతో ఉండవచ్చు? ఎందుకు? (2 సమూయేలు 22:26)
15 మనం తనకు “హత్తుకొని” ఉండాలనే మంచి నిర్ణయం తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (ద్వితీ. 30:19, 20) ఒకవేళ మనం అలాచేస్తే, యెహోవా మనకు విశ్వసనీయంగా ఉంటాడు అనే నమ్మకంతో ఉండవచ్చు. (2 సమూయేలు 22:26 చదవండి.) మనం యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నంతకాలం జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, యెహోవా మన పక్కనే ఉంటాడు.
16 మనం ఇప్పటివరకు చూసినట్టు, కష్టాల్లో మనం అటూఇటూ కొట్టుకుపోకుండా స్థిరంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మన వెన్నంటే ఉంటాడని మనకు తెలుసు. బైబిలు అదే చెప్తుంది. యెహోవా ప్రేమ గురించి ఏ చిన్న అనుమానం వచ్చినా, ఆ క్షణంలో మనకు అనిపించేదాన్ని కాకుండా, యెహోవా ప్రేమ గురించిన వాస్తవం మీద మనసుపెట్టాలి. కాబట్టి యెహోవా విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుందనే బైబిలు సత్యం మీద నమ్మకంతో ఉందాం!
పాట 159 యెహోవాను మహిమపర్చండి
a ద్వితీయోపదేశకాండం 31:8, కీర్తన 94:14 అలాగే యెషయా 49:15 లేఖనాల్లో ఇంకొన్ని ఉదాహరణలు ఉన్నాయి.
b చిత్రాల వివరణ : ఒంట్లో బాలేని తన భార్య కోసం, డబ్బును తెలివిగా ఉపయోగించడం కోసం, తన పాప యెహోవాను ప్రేమించేలా శిక్షణ ఇవ్వడం కోసం ప్రార్థన చేస్తున్న ఒక బ్రదర్.