కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 అక్టోబరు పేజీలు 6-11
  • అవధుల్లేని సంతోషానికి యెహోవాయే మూలం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అవధుల్లేని సంతోషానికి యెహోవాయే మూలం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన సంతోషానికి మూలం
  • మీ సంతోషాన్ని దొంగిలించేలా దేన్నీ అనుమతించకండి
  • సంతోషం-పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ప్రీచింగ్‌లో బోలెడంత సంతోషాన్ని సొంతం చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని సొంతం చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 అక్టోబరు పేజీలు 6-11

అధ్యయన ఆర్టికల్‌ 40

పాట 111 మన సంతోషానికి కారణాలు

అవధుల్లేని సంతోషానికి యెహోవాయే మూలం

“ నాకెంతో సంతోషాన్నిచ్చే నా దేవుని దగ్గరికి వస్తాను.”—కీర్త. 43:4.

ముఖ్యాంశం

మన సంతోషాన్ని దొంగిలించేవి ఏంటో, పోగొట్టుకున్న సంతోషాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవచ్చో చూస్తాం.

1-2. (ఎ) ఈ లోకంలో చాలామంది పరిస్థితి ఏంటి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

ఈ లోకం సంతోషం వేటలో పడింది. కానీ నిజమైన సంతోషం వాళ్ల చేతికి చిక్కట్లేదు. చాలామంది విపరీతమైన బాధలో కూరుకుపోతున్నారు. వాళ్లకు అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది. యెహోవా ప్రజలుగా మనకు కూడా కొన్నిసార్లు అలా అనిపించవచ్చు. ఎందుకంటే, మనం “చివరి రోజుల్లో” ఉన్నాం కాబట్టి “కష్టమైన” పరిస్థితులు, తీవ్రమైన ఆందోళన, బాధ మనకు రావచ్చు. —2 తిమో. 3:1.

2 ఈ ఆర్టికల్‌లో మన సంతోషాన్ని దొంగిలించేవి ఏంటో, పోగొట్టుకున్న సంతోషాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవచ్చో చూస్తాం. కానీ దానికన్నా ముందు, నిజమైన సంతోషానికి మూలం ఎవరో తెలుసుకోవాలి.

నిజమైన సంతోషానికి మూలం

3. సృష్టిని చూస్తే యెహోవా గురించి ఏం అర్థమౌతుంది? (చిత్రాలు కూడా చూడండి.)

3 యెహోవా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. మనం కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సంతోషం ఈ సృష్టిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు, మన అందమైన భూమి, కళ్లను కట్టిపడేసే రంగులు, జంతువుల తుంటరి చేష్టలు, నోరూరించే రుచులు ఇలా యెహోవా మనకు అన్నీ ఇచ్చాడు. యెహోవా మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని, మనం మన జీవితాన్ని ఆస్వాదించాలని ఆయన కోరుకుంటున్నాడని అవి చూపిస్తున్నాయి.

చిత్రాలు: సరదాగా ఆటలు ఆడుతున్న వేర్వేరు జంతువులు. 1. ఒక బుజ్జి ఏనుగు నీళ్లలో కేరింతలు కొడుతుంది. 2. మంచులో దొర్లుతున్న పెంగ్విన్‌ పిల్లలు. 3. పొలాల్లో గంతులు వేస్తున్న మేక పిల్లలు. 4. నీళ్లలో ఎగిరి దూకుతున్న డాల్ఫిన్లు.

Baby elephant: Image © Romi Gamit/Shutterstock; penguin chicks: Vladimir Seliverstov/500px via Getty Images; baby goats: Rita Kochmarjova/stock.adobe.com; two dolphins: georgeclerk/E+ via Getty Images

జంతువుల ఆటలు యెహోవా సంతోషానికి అద్దంపడుతున్నాయి (3వ పేరా చూడండి)


4. (ఎ) లోకంలోని కష్టాలు చూసినా, యెహోవా ఎందుకు తన సంతోషాన్ని కోల్పోడు? (బి) ఆయన మనకు ఏ బహుమతి ఇచ్చాడు? (కీర్తన 16:11)

4 యెహోవా “సంతోషంగల” దేవుడైనా, మనం పడుతున్న కష్టాలు, బాధలు చూసి ఆయన పట్టనట్టుగా ఉండడు. (1 తిమో. 1:11) అలాగని, యెహోవా ఆ కష్టాలు చూసి తన సంతోషాన్ని కోల్పోడు. ఎందుకంటే, ఈ కష్టాలన్నీ కొంతకాలమే అని ఆయనకు తెలుసు. వాటన్నిటికీ ఒక ముగింపు తేదీని ఆయన ఫిక్స్‌ చేశాడు. కష్టం కంటికి కనిపించకుండా ఉండే రోజును తేవడానికి ఆయన ఓపికగా ఎదురుచూస్తున్నాడు. అప్పటివరకు మనం పడుతున్న కష్టాల్ని ఆయన అర్థం చేసుకుంటాడు, మనకు చేయి అందిస్తాడు. ఎలా? ఒక విధానం ఏంటంటే, ఆయన మనకు సంతోషం అనే బహుమతి ఇచ్చాడు. (కీర్తన 16:11 చదవండి.) యెహోవా తన కుమారుడైన యేసుకు ఆ సంతోషాన్ని ఎలా ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం.

5-6. యేసు సంతోషానికి రహస్యమేంటి?

5 యెహోవా తర్వాత, సృష్టిలో సంతోషంగా ఉన్నది ఎవరంటే, అది యేసే! దానికి రెండు కారణాలున్నాయి. (1) “ఆయన, కనిపించని దేవుని ప్రతిబింబం.” కాబట్టి యేసు అచ్చుగుద్దినట్టు తన తండ్రి వ్యక్తిత్వాన్నే చూపించాడు. (కొలొ. 1:15; 1 తిమో 6:15) (2) సంతోషానికి మూలమైన తన తండ్రితోనే యేసు ఎక్కువ సమయం గడిపాడు.

6 అంతేకాదు, తండ్రి మాట విన్నాడు కాబట్టి యేసు సంతోషంగా ఉన్నాడు. (సామె. 8:30, 31; యోహా. 8:29) అలా నమ్మకంగా ఉన్నందుకు యేసు, యెహోవా మనసును గెలుచుకున్నాడు, తండ్రి గర్వపడే కొడుకుగా అయ్యాడు.—మత్త. 3:17.

7. నిజమైన సంతోషం కావాలంటే ఏం చేయాలి?

7 మనం కూడా నిజంగా సంతోషంగా ఉండాలంటే, సంతోషానికి మూలమైన యెహోవాకు దగ్గరవ్వాలి. మనం ఎంతెక్కువ టైం పెట్టి యెహోవా గురించి తెలుసుకుంటూ, ఆయనలా ఉండడానికి ప్రయత్నిస్తే అంతెక్కువ సంతోషంగా ఉంటాం. అంతేకాదు, యెహోవా ఇష్టం చేయడంలో, ఆయన మనసును గెలుచుకున్నామని తెలుసుకోవడంలో ఎక్కువ సంతోషం ఉంటుంది.a (కీర్త. 33:12) అయితే, అప్పుడప్పుడు లేదా అదేపనిగా మన సంతోషం తగ్గిపోతున్నట్టు అనిపిస్తుందా? దానర్థం యెహోవా హృదయాన్ని మనం గెలుచుకోలేదనా? ఎంతమాత్రం కాదు. మనం అపరిపూర్ణులం కాబట్టి బాధ, నొప్పి, నిరాశ మనలో కలగవచ్చు. ఇది యెహోవాకు తెలుసు, ఆయన దాన్ని అర్థంచేసుకుంటాడు. (కీర్త. 103:14) అయితే మన సంతోషాన్ని దోచేసే విషయాలేంటో, వాటినుండి మన సంతోషాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

సంతోషం కావాలంటే యెహోవావైపు చూడాలి

యెహోవా పవిత్రశక్తి కోసం ప్రార్థన చేయండి. సంతోషం కావాలంటే మనం యెహోవావైపు చూడాలి. ఎందుకంటే, సంతోషం పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఒకటి. (గల. 5:22) యెహోవా పవిత్రశక్తి మనకు తోడైతే, మనం “ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ,” ఆఖరికి కష్టాల్ని కూడా సహించగలుగుతాం.—కొలొ. 1:11.

యెహోవాను ఆరాధించడం మీద మనసుపెట్టండి. ప్రతీరోజు బైబిల్ని, ప్రచురణల్ని చదవండి. “గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చే శుభవార్తను” ప్రకటించే ఏ అవకాశాన్ని వదులుకోకండి. (లూకా 2:10) యెహోవా ఆరాధనకే మొదటిస్థానం ఇచ్చేవాళ్ల సంతోషం దేనికీ సాటిరాదు.—కీర్త. 65:4.

ఎప్పుడూ యెహోవా మాటే వినండి. యెహోవా నియమాలు మన మంచికే అని గుర్తుపెట్టుకోండి. ఆయనకు లోబడడం వల్ల మన స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్టు కాదుగానీ అది సంతోషానికి దారి చూపిస్తుంది.—లూకా 11:28.

మీ సంతోషాన్ని దొంగిలించేలా దేన్నీ అనుమతించకండి

8. ఊపిరాడనివ్వకుండా చేసే సమస్యల వల్ల మనకు ఏం జరగవచ్చు?

8 దొంగ నెం. 1: ఊపిరాడనివ్వకుండా చేసే సమస్యలు. హింస, ప్రకృతి విపత్తులు, పేదరికం, అనారోగ్యం, ముసలితనం వల్ల మీరు బాధపడుతున్నారా? మన చేతుల్లో లేని ఇలాంటి సమస్యలు మన సంతోషాన్ని తేలిగ్గా దొంగిలిస్తాయి. “హృదయంలో ఉన్న బాధ మనిషిని కృంగదీస్తుంది” అని బైబిలు సరిగ్గానే చెప్తుంది. (సామె. 15:13) బాబి అనే సంఘపెద్ద గురించి ఆలోచించండి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఆయన అమ్మానాన్నలు, అన్నయ్య అందరూ చనిపోయారు. ఆయనిలా అంటున్నాడు: “నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. నాకింకా ఎవ్వరూ లేరు. మా అమ్మానాన్న, అన్నయ్య బ్రతికున్నప్పుడు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉండేది కానీ, అస్సలు గడపలేకపోయాను. అది గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు ముక్కలైపోతుంది.” అవును, జీవిత సమస్యలు మనలో ఉన్న శక్తినంతా పీల్చిపిప్పి చేస్తాయి. మనలో ఇసుమంత ఓపిక కూడా లేకుండా చేస్తాయి.

9. మన సంతోషాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవచ్చు? (యిర్మీయా 29:4-7, 10)

9 మన సంతోషాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవచ్చు? వాస్తవంలో బ్రతుకుతూ మనకున్నవాటి మీద కృతజ్ఞత చూపిస్తే, మన సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. జీవితంలో అన్నీ ఉంటేనే సంతోషంగా ఉంటామని ఈ లోకం కోడైకూస్తుంది. కానీ అది అబద్ధం. బబులోనుకు బందీలుగా వెళ్లిన యూదులకు యెహోవా ఏం చెప్పాడో గమనించండి. వాళ్లు పరాయి దేశంలో బందీలుగా ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరించి, మారిన పరిస్థితుల్లో కూడా మంచిని చూస్తూ సంతోషంగా ఉండమని ఆయన చెప్పాడు. (యిర్మీయా 29:4-7, 10 చదవండి.) దీంట్లో పాఠం ఏంటి? మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మనం మారుతూ, మనకున్న మంచివాటి మీద కృతజ్ఞత చూపించాలి. ఇలా చేస్తున్నప్పుడు యెహోవా మీ పక్కనే ఉంటాడని మర్చిపోకండి. (కీర్త. 63:7; 146:5) యాక్సిడెంట్‌ వల్ల వీల్‌ఛైర్‌కే పరిమితమైన ఈవా అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “యెహోవా, నా కుటుంబం, సంఘం నాకు తోడుగా నిలబడ్డారు. వాళ్లు చాలా సహాయం చేశారు. నేను బాధపడుతూ కూర్చుంటే వాళ్ల సహాయానికి అర్థం లేకుండా పోతుంది. అందుకే నేను సంతోషంగా ఉంటే వాళ్ల సహాయానికి నేను కృతజ్ఞత చూపించినట్టే.”

10. కష్టాలున్నా మనం ఎందుకు సంతోషంగా ఉండవచ్చు?

10 జీవితం మనం అనుకున్నట్టు లేకపోయినా, మనకు లేదా మన కుటుంబానికి ఎదురుదెబ్బలు తగిలినా, మనం సంతోషంగా ఉండవచ్చు.b (కీర్త. 126:5) ఎందుకంటే, మన సంతోషం మన పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. మారియా అనే పయినీరు సిస్టర్‌ ఇలా చెప్తుంది: “మీకు సమస్యలు వచ్చినా సంతోషంగా ఉంటున్నారంటే, మీ బాధనంతా తొక్కిపెట్టినట్టు కాదు. బదులుగా యెహోవా ఇచ్చిన మాటను మీరు మర్చిపోవట్లేదని అర్థం. మన సంతోషాన్ని కాపాడుకోవడానికి మన తండ్రి సహాయం చేస్తాడు.” అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టాల వల్ల మన జీవితం ఎంత భారంగా ఉన్నాసరే, ఈ సమస్యలన్నీ తాత్కాలికమే. అవి ఎలాంటివంటే, సముద్రతీరాన మనం వేసే అడుగుల అచ్చులాంటివి. ఆ అచ్చులు ఎప్పటికీ అలాగే ఉండవు, అలలు రాక తప్పవు, అవి తుడిచిపెట్టుకుపోకా తప్పవు. అదేవిధంగా, యెహోవా కూడా మన సమస్యల్ని ఏ ఛాయలు లేకుండా కనుమరుగు చేస్తాడు.

11. అపొస్తలుడైన పౌలు ఉదాహరణ మీకు ఎలా సహాయం చేస్తుంది?

11 యెహోవాకు మనం నచ్చట్లేదు కాబట్టే, మనకు కష్టాలు వస్తున్నాయని అనిపిస్తే ఏం చేయాలి? అలాంటి సమయాల్లో, ఇంతకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించిన దేవుని నమ్మకమైన సేవకుల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలునే తీసుకోండి. “అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు” సత్యం నేర్పించడానికి స్వయంగా యేసే పౌలును ఎంచుకున్నాడు. (అపొ. 9:15) అదెంత గొప్ప అవకాశమో కదా! అయినాసరే పౌలు జీవితం పూలబాటలా లేదు. ఎందుకంటే, పౌలు పరిష్కారమే లేని కష్టాల్ని అనుభవించాడు. (2 కొరిం. 11:23-27) పౌలుకు ఆ కష్టాలు వచ్చాయంటే ఆయన యెహోవాకు నచ్చలేదనా? కాదుగదా! దానికి బదులు, పౌలు నమ్మకంగా వాటన్నిటినీ సహించాడంటే యెహోవా దీవెన ఆయన మీద ఉందని అర్థం. (రోమా. 5:3-5) ఇప్పుడు మీ పరిస్థితి గురించి ఆలోచించండి. ఎన్ని కష్టాలున్నా మీరు వాటిని నమ్మకంగా సహిస్తున్నారంటే, యెహోవాకు మీరు నచ్చుతున్నారని అర్థం.

12. కోరుకున్నవి జరగనప్పుడు మన సంతోషం ఎలా పోతుంది?

12 దొంగ నెం. 2: కోరుకున్నవి జరగనప్పుడు. (సామె. 13:12) యెహోవా మీదున్న ప్రేమ, కృతజ్ఞత వల్ల ఆయన సేవలో మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం. అయితే, మన పరిస్థితులకు సరిపోని లక్ష్యాలు పెట్టుకుంటే మనం కుప్పకూలిపోతాం. (సామె. 17:22) హాలీ అనే పయినీరు సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నాకు SKEకి వెళ్లాలని ఉండేది, వేరే దేశంలో సేవ చేయాలని ఉండేది, లేదా రామపో నిర్మాణ ప్రాజెక్ట్‌లో పనిచేయాలని ఉండేది. కానీ నా పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి నేను ఆ లక్ష్యాలు చేరుకునే పరిస్థితిలో లేను. అప్పుడు నాకు చాలా బాధేసింది. ఎన్నో చేయాలని ఉన్నా, ఏమీ చేయలేకపోవడం ఎంత చిరాకుగా ఉంటుందో ఊహించలేం.” చాలామందికి అలానే అనిపిస్తుంది.

13. మన పరిస్థితుల్ని బట్టి యెహోవా సేవ ఎక్కువ చేయలేకపోతే మనం ఏ లక్ష్యాలు పెట్టుకోవచ్చు?

13 మన సంతోషాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవచ్చు? యెహోవా మనల్ని ఇది చేయి, అది చేయి అని డిమాండ్‌ చేయడని గుర్తుంచుకోండి. ఆయన మన నుండి మరీ ఎక్కువ ఆశించడు. లేదా తన సేవలో మనం చేసే దాన్నిబట్టి మనకు విలువ కట్టడు. యెహోవా కోరేదల్లా మనం అణకువ చూపిస్తూ, నమ్మకంగా ఉండడమే. (మీకా 6:8; 1 కొరిం. 4:2) మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా, మనం లోపల ఎలా ఉన్నామనేదే యెహోవా ఎక్కువ చూస్తాడు. కాబట్టి యెహోవా మననుండి ఆశించనిది మననుండి మనం ఆశించడం సరైనదేనా?c కాదుగదా! కాబట్టి మీ పరిస్థితుల్ని బట్టి మీరు యెహోవా సేవ ఎక్కువ చేయలేకపోతే, మీరు ఏం చేయగలరో దానిమీద మనసుపెట్టండి. బహుశా మీరు యౌవనులకు పెద్ద దిక్కుగా ఉండగలరా? లేదా ముసలివాళ్లకు చేదోడువాదోడుగా ఉండగలరా? ఎవరికైనా నేరుగా వెళ్లి లేదా ఫోన్‌లోనో, మెసేజ్‌లోనో నాలుగు మంచి మాటలు చెప్పి, ప్రోత్సహించగలరా? ఇలా మీ పరిస్థితులకు తగ్గట్టు మీరు చేరుకోగల లక్ష్యాలు పెట్టుకుంటే, యెహోవా మీ మనసుకు సంతోషాన్నిచ్చి దీవిస్తాడు. అలాగే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి: అతి త్వరలో యెహోవా తీసుకురాబోయే కొత్తలోకంలో మీకు లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి. అది ఏ స్థాయిలో ఉంటుందో కనీసం మీ ఊహకు కూడా అందదు! పై పేరాలో మాట్లాడుకున్న హాలీ ఇలా చెప్తుంది: “నేను ప్రశాంతంగా కూర్చొని ఇలా ఆలోచిస్తాను: ‘యెహోవా నాకు అంతులేని జీవితాన్ని ఇవ్వబోతున్నాడు’ కాబట్టి కొత్త లోకంలో నేను ఇంకా ఎన్నో అంతులేని లక్ష్యాలు పెట్టుకుంటాను.”

14. ఇంకేది కూడా మన సంతోషాన్ని దోచేస్తుంది?

14 దొంగ నెం. 3: ఎంజాయ్‌ చేయడమే ప్రపంచంగా బ్రతకడం. దేన్నీ పట్టించుకోకుండా మనకు నచ్చింది చేస్తేనే నిజమైన సంతోషం, సంతృప్తి ఉంటాయని సోషల్‌ మీడియా కోడైకూస్తుంది. నచ్చింది చేస్తూ, ఇష్టమైనవి కొనుక్కుంటూ, రకరకాల ప్రాంతాలకు తిరిగితేనే సంతోషంగా ఉంటామని ప్రజలు అనుకుంటారు. అయితే ఇవి చేయడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే, వాటన్నిటినీ ఎంజాయ్‌ చేసేలాగే యెహోవా మనల్ని సృష్టించాడు. కానీ ఏవి సంతోషాన్ని ఇస్తాయని అనుకుంటున్నారో, అవే వాళ్ల సంతోషాన్ని దోచేస్తున్నాయని చాలామంది గుర్తించారు. ఈవా అనే పయినీరు సిస్టర్‌ ఇలా చెప్తుంది: “ప్రతీక్షణం మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడం కోసమే పరితపిస్తే, మీరు ఎంత చేసినా ఇంకేదో వెలితిగానే ఉంటుంది.” కాబట్టి ఎంజాయ్‌ చేయడమే ప్రపంచంగా బ్రతికితే మనం కోరుకున్న సంతోషం ఎప్పటికీ దొరకదు, జీవితంలో నిరాశే మిగులుతుంది.

15. సొలొమోను రాజు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

15 ఎంజాయ్‌ చేయడమే ప్రపంచంగా బ్రతికితే బాధే మిగులుతుందని రాజైన సొలొమోను అనుభవం నుండి తెలుసుకోవచ్చు. ఆయన తన సొంత కోరికల్ని తీర్చుకోవడంలోనే సంతోషాన్ని వెతుక్కున్నాడు. అంటే నోరూరించే ఆహారం, వినసొంపుగా ఉండే సంగీతం, తన కాలంలో డబ్బుతో కొనగల ప్రతీది ఆయన అనుభవించాడు. అయినాసరే, ఆయనకు సంతృప్తి దొరకలేదు. ఆయన ఇలా అన్నాడు: “చూసేవాటితో కన్ను తృప్తిపడదు; వినేవాటితో చెవికి తృప్తి ఉండదు.” (ప్రసం. 1:8; 2:1-11) ఈ లోకం చెప్పే నిజమైన సంతోషాన్ని ఒక దొంగనోటుతో పోల్చవచ్చు. అది చూడ్డానికి అచ్చం అసలు నోటులాగే ఉంటుంది గానీ దానికి ఏ విలువ ఉండదు, అది ఎక్కడా చెల్లదు.

16. వేరేవాళ్లకు ఇవ్వడంలో మన సంతోషాన్ని ఎలా వెతుక్కోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

16 మన సంతోషాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవచ్చు? “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది” అని యేసు మనకు నేర్పించాడు. (అపొ. 20:35) ఆలెక్స్‌ అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “నేను వేరేవాళ్ల కోసం చిన్నచిన్న పనులు చేస్తుంటాను. అలా నేను వేరేవాళ్ల గురించి ఎంతెక్కువ ఆలోచిస్తే, నా గురించి అంత తక్కువ ఆలోచించుకుంటాను. దాంట్లోనే నాకు సంతోషం దొరుకుతుంది.” మీరు వేరేవాళ్ల కోసం ఏం చేయవచ్చు? ఎవరైనా కష్టాలు పడుతుంటే వెళ్లి నాలుగు మంచిమాటలు చెప్పి, వాళ్ల భుజం తట్టండి. వాళ్ల సమస్యల్ని మీరు చకచక పరిష్కరించలేకపోవచ్చు. కానీ వాళ్లు మనసువిప్పి సమస్యను చెప్తున్నప్పుడు, మీరు మనసుపెట్టి వింటే సరిపోతుంది. వాళ్లకు యెహోవా ఉన్నాడని, వాళ్ల కష్టాలన్నిటినీ ఆయన చూసుకుంటాడని గుర్తుచేయండి. (కీర్త. 55:22; 68:19) యెహోవా వాళ్లను ఇంకా వదిలేయలేదని, వాళ్ల చేయి పట్టుకునే ఉన్నాడని చెప్పండి. (కీర్త. 37:28; యెష. 59:1) వాళ్లకోసం ఇంకొన్ని చిన్నచిన్న పనులు కూడా చేయవచ్చు. అంటే వంట చేసి పెట్టవచ్చు లేదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు వాళ్లతో నడవవచ్చు, మీతోపాటు ప్రీచింగ్‌కి తీసుకెళ్లవచ్చు. అప్పుడు మీరు వాళ్లకు, వాళ్ల సంతోషాన్ని తిరిగి పరిచయం చేసినవాళ్లౌతారు. యెహోవా చేతిలో మిమ్మల్ని మీరు ఒక పనిముట్టుగా చేసుకోండి. మన గురించి కాకుండా, వేరేవాళ్ల గురించి ఆలోచించడంలోనే నిజమైన సంతోషం ఉంది.—సామె. 11:25.

చిత్రాలు: 1. ఒక సిస్టర్‌ ఒక్కర్తే కాఫీ షాపులో కూర్చొని ఫోన్‌ చూసుకుంటుంది. ఆమె చుట్టూ షాపింగ్‌ చేసిన బ్యాగులు ఉన్నాయి. 2. ఆ సిస్టర్‌ పెద్దవయసు సిస్టర్‌ ఇంటికి వెళ్లి ఆమెను ప్రేమతో పలకరిస్తూ, పూల బొకే ఇచ్చింది.

మీ కోరికల కన్నా ఎదుటివ్యక్తి అవసరాల గురించి ఆలోచించండి (16వ పేరా చూడండి)d


17. మన సంతోషానికి, యెహోవాకు దగ్గరవ్వడానికి సంబంధం ఏంటి? (కీర్తన 43:4)

17 మన పరలోక తండ్రికి దగ్గరౌతూ నిజమైన సంతోషాన్ని పొందవచ్చు. ఎందుకంటే, యెహోవాయే మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తాడని బైబిలు చెప్తుంది. (కీర్తన 43:4 చదవండి.) కాబట్టి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా మనం భయపడాల్సిన అవసరంలేదు. కాబట్టి చెక్కుచెదరని సంతోషానికి మూలమైన యెహోవా మీద మనసుపెడుతూ ఉందాం.—కీర్త. 144:15.

మీరెలా జవాబిస్తారు?

  • యెహోవా, యేసు ఎందుకు సంతోషంగా ఉంటారు?

  • ఏవి మన సంతోషాన్ని దోచేస్తాయి?

  • పోగొట్టుకున్న సంతోషాన్ని మనం ఎలా తిరిగి తెచ్చుకోవచ్చు?

పాట 155 సదా సంతోషమే

a “సంతోషం కావాలంటే యెహోవావైపు చూడాలి” అనే బాక్స్‌ చూడండి.

b ఉదాహరణకు jw.orgలో, 2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #5లోని డెన్నిస్‌, ఇరీనా క్రిస్టెన్‌సన్‌ల ఇంటర్వ్యూ చూడండి.

c ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, జూలై 15, 2008 కావలికోట పత్రికలో ఉన్న, “సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకుని సంతోషాన్ని పొందండి” అనే ఆర్టికల్‌ చూడండి.

d చిత్రం వివరణ: ఒక సిస్టర్‌ తనకు నచ్చినవి కొనుక్కున్నప్పుడు కన్నా, ప్రోత్సాహం అవసరమైన పెద్ద వయసు సిస్టర్‌కి పువ్వులు కొన్నప్పుడు ఎక్కువ సంతోషాన్ని రుచి చూసింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి