1925లో, ఇండియానాలోని ఇండియానాపొలిస్‌లో జరిగిన సమావేశం
1925—వంద సంవత్సరాల క్రితం
జనవరి 1, 1925 కావలికోట (ఇంగ్లీషు) ఇలా చెప్పింది: “క్రైస్తవులు ఈ సంవత్సరం కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.” అయితే, ఆ ఆర్టికల్ ఇంకా ఇలా చెప్పింది: “ఈ సంవత్సరం జరగబోయే దాని గురించి క్రైస్తవులు అతిగా ఆలోచించకూడదు. ఒకవేళ అతిగా ఆలోచిస్తే, వాళ్లు ప్రభువు చెప్పినదాన్ని సంతోషంగా చేయలేరు.” ఇంతకీ 1925లో ఏం జరుగుతుందని బైబిలు విద్యార్థులు ఆశ పెట్టుకున్నారు? వాళ్ల ఆశలు అడియాశలైనా, వాళ్లు ప్రభువు పనిలో ఎలా బిజీగా ఉన్నారు?
ఆశలు అడియాశలు అయ్యాయి
1925లో ఈ భూమి మొత్తం పరదైసుగా మారిపోతుందని చాలామంది బైబిలు విద్యార్థులు ఎదురుచూశారు. దానిగురించి, ఆ తర్వాత పరిపాలక సభ సభ్యుడిగా సేవ చేసిన బ్రదర్ ఆల్బర్ట్ ష్రోడర్ ఇలా చెప్పాడు: “ఇంకేముంది, ఇప్పుడు మిగిలివున్న అభిషిక్తులేమో పరలోకానికి వెళ్లిపోతారు; అబ్రాహాము, దావీదు లాంటి నమ్మకమైన పాతకాలపు సేవకులేమో పునరుత్థానమై అధిపతులుగా ఈ భూమిని పరిపాలిస్తారు అని అందరం అనుకున్నాం.” చూస్తున్నారు, చూస్తున్నారు, కానీ వాళ్లు అనుకున్నట్టు జరగనప్పుడు, పాపం కొంతమంది డీలాపడిపోయారు.—సామె. 13:12.
ఇంత ఎదురుదెబ్బ తగిలినా, చాలామంది బైబిలు విద్యార్థులైతే ప్రకటనా పనిలో వెనకడుగు వేయలేదు. యెహోవాకు సాక్షులుగా ఉండడమే అన్నిటికన్నా ముఖ్యమని వాళ్లు బాగా అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్లకు కూడా సత్యం చెవినపడేలా చేయడానికి వాళ్లు ఏం చేశారో చూద్దాం.
రేడియో ప్రసారాల హవా
ఆ ముందు సంవత్సరం డబ్ల్యూ.బి.బి.ఆర్ (WBBR) రేడియో స్టేషన్ హిట్ అయ్యేసరికి, అదే ఊపులో బైబిలు విద్యార్థులు ఇంకో పెద్ద రేడియో స్టేషన్‌ని కట్టారు. ఈసారి వాళ్లు ఇల్లినోయిస్‌లోని చికాగోలో కట్టారు. వాళ్లు ఆ రేడియో స్టేషన్‌కి డబ్ల్యూ.ఓ.ఆర్.డి (WORD) అని పేరు పెట్టారు. దాన్ని కట్టడంలో సహాయం చేసిన రాల్ఫ్ లెఫ్లర్ అనే రేడియో ఇంజినీరు ఇలా గుర్తుచేసుకున్నాడు: “చలికాలపు రాత్రులు, మారుమూల ప్రాంతాల్లోనివాళ్లు ఇంట్లో వెచ్చగా కూర్చుని డబ్ల్యూ.ఓ.ఆర్.డి ప్రసారాన్ని వినేవాళ్లు.” ఉదాహరణకు, అలాస్కాలోని పైలెట్ స్టేషన్ అనే నగరంలో అంటే 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటున్న ఒక కుటుంబం, డబ్ల్యూ.ఓ.ఆర్.డిలో అప్పుడప్పుడే ప్రసారమౌతున్న ఒక కార్యక్రమాన్ని విన్నారు. అది విన్న తర్వాత, దేవుని గురించి, బైబిలు గురించి వివరించే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు థాంక్స్ చెప్తూ, ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న వాళ్లకు ఉత్తరం రాశారు.
ఎడమ: ఇల్లినోయిస్‌లోని బటావియాలో ఉన్న డబ్ల్యూ.ఓ.ఆర్.డి రేడియో స్టేషన్ తాలూకు టవర్లు
కుడి: రేడియో స్టేషన్‌లో పనిచేస్తున్న రాల్ఫ్ లెఫ్లర్
ఈ స్టేషన్ ప్రసారాలు ఎంత దూరం వరకు వెళ్లాయో వివరిస్తూ డిసెంబరు 1, 1925 కావలికోట (ఇంగ్లీషు) ఇలా చెప్పింది: “డబ్ల్యూ.ఓ.ఆర్.డి అనేది యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న అతిపెద్ద రేడియో స్టేషన్లలో ఒకటి. దీన్ని అటు యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరంలో ఉన్నవాళ్లు, ఇటు పశ్చిమ తీరంలో ఉన్నవాళ్లు, క్యూబాలోని వాళ్లు, అక్కడెక్కడో ఉత్తరాన ఉన్న అలాస్కాలోని వాళ్లు కూడా వినగలిగారు. సత్యం గురించి ఎప్పుడూ కనీవినీ ఎరుగని చాలామందికి, ఈ రేడియో ద్వారా సత్యం మీద ఆసక్తి పుట్టింది.”
జార్జ్ నేష్
అదే టైంలో, కెనడాలో కూడా మంచివార్త అందరి చెవినపడేలా రేడియోల్ని ఎక్కువగా ఉపయోగించాలని బైబిలు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. 1924లోనే సస్కత్‌చెవాన్‌లోని సస్కటూన్‌లో సి.హెచ్.యు.సి (CHUC) అనే రేడియో స్టేషన్ కట్టారు. అది, కెనడాలో మతపరమైన విషయాల్ని ప్రసారం చేసిన తొలి రేడియో స్టేషన్లలో ఒకటి. 1925 కల్లా, ఆ రేడియో స్టేషన్ చిన్నగా ఉందని దాన్ని పెద్దదానికి మార్చాలనుకున్నారు. అందుకే, వాచ్‌టవర్ సొసైటీ ఆ స్టేషన్ హక్కుల్ని పూర్తిగా పొంది, దాని స్టూడియోల్ని సస్కటూన్‌లో రీజెంట్ బిల్డింగ్ అనే ఒక పాత థియేటర్‌కి మార్చింది. ఈ పని కోసమే దాన్ని కొని, బాగుచేశారు.
ఈ స్టేషన్ వల్ల, సస్కత్‌చెవాన్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న చాలామంది మొదటిసారి మంచివార్తను వినగలిగారు. ఉదాహరణకు, ఒక మారుమూల పల్లెలో ఉంటున్న శ్రీమతి. గ్రహమ్ మన ప్రసారాల్లో ఒకదాన్ని విన్న తర్వాత, తనకు బైబిలు ప్రచురణలు కావాలని ఉత్తరం రాసింది. దాన్ని గుర్తుచేసుకుంటూ బ్రదర్ జార్జ్ నేష్ ఇలా అన్నాడు: “ఉత్తరం చదివినప్పుడు ఆమె ఆరాటం మాకు అర్థమైంది. అందుకే మేము స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ సెట్ అంతా ఆమెకి పంపించాం.” వెంటనే, ఆమె రాజ్య సందేశాన్ని ఇంకా దూరాన ఉన్నవాళ్లకు చెప్పింది.
అవగాహనలో మార్పులు
మార్చి 1, 1925 కావలికోటలో (ఇంగ్లీషు) ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది. దాని అంశం, “జనాంగపు పుట్టుక.” ఈ ఆర్టికల్ ఎందుకంత ముఖ్యమైనది? కొంతకాలం నుంచే, సాతానుకు ఒక సంస్థ ఉందని బైబిలు విద్యార్థులకు తెలుసు. అందులో అటు పరలోకంలో ఉండే చెడ్డదూతలు, ఇటు భూమ్మీద ఉండే మత, వాణిజ్య, రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. అయితే, ఈ ఆర్టికల్ ద్వారా “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు,” సాతానుకే కాదు యెహోవాకు కూడా ఒక సంస్థ ఉందని, అది సాతాను సంస్థకు పూర్తి వ్యతిరేకమైనదని చెప్పాడు. (మత్త. 24:45) అంతేకాదు, 1914లో దేవుని రాజ్యం స్థాపించబడిందని, అప్పుడు “పరలోకంలో” జరిగిన ‘యుద్ధంలో’ సాతాను, అతని చెడ్డదూతలు పరలోకం నుండి పడేయబడ్డారని, ఇక వాళ్లు భూమికే పరిమితం అయ్యారని దాసుడు వివరించాడు.—ప్రక. 12:7-9.
కొంతమందికి ఈ కొత్త అవగాహన రుచించలేదు. అందుకనే ఆ ఆర్టికల్ ఈ సలహా ఇచ్చింది: “ఈ కావలికోట పత్రికను చదువుతున్న ఎవరికైనా, ఈ మాటల్ని నమ్మడం కష్టంగా ఉంటే ప్రశాంతంగా, ఓర్పుగా ఉండండి. ప్రభువు మీద నమ్మకం ఉంచి, మంచి మనసుతో ఉండండి.”
అయితే, ఆ ఆర్టికల్‌కి చాలామంది బైబిలు విద్యార్థులు ఎలా స్పందించారో చెప్తూ, బ్రిటన్‌లో ఉండే టామ్ ఎర్ అనే కల్‌పోర్చర్ (ఇప్పుడు పయినీరు అని అంటున్నాం) ఇలా చెప్పాడు: “ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్న ఈ విషయాన్ని తెలుసుకుని సహోదరులు ఆనందంలో మునిగితేలారు. ఇప్పటికే దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడింది అని తెలుసుకున్నప్పుడు, ఆ మంచివార్తను వేరేవాళ్లకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అనిపించింది. అది విన్నప్పుడు ఇంకా ఎక్కువగా ప్రీచింగ్ చేయాలనిపించింది, అలాగే రానున్న కాలంలో యెహోవా గొప్పగొప్ప వాటిని చేయబోతున్నాడని మాకు అర్థమైంది.”
యెహోవాకు సాక్షులుగా ఉండడం
ఈ రోజుల్లో, యెషయా 43:10 లో ఉన్న మాటలు యెహోవాసాక్షులకు కొట్టినపిండి. అక్కడ ఇలా ఉంది: “‘మీరే నా సాక్షులు’ అని యెహోవా అంటున్నాడు, ‘అవును, నేను ఎంచుకున్న నా సేవకుడివి నువ్వు.’” కానీ 1925కి ముందు, ఈ లేఖనం గురించి మన ప్రచురణల్లో తక్కువసార్లు వచ్చింది. ఆ తర్వాత అది మారింది. 1925లో కావలికోట యెషయా 43:10, 12 వచనాల గురించి 11 సంచికల్లో చర్చించింది!
1925, ఆగస్టు చివర్లో, బైబిలు విద్యార్థులు ఇండియానాలోని ఇండియానాపొలిస్‌లో సమావేశం జరుపుకున్నారు. దాని ప్రోగ్రామ్ షీట్ మీద, సమావేశానికి వచ్చేవాళ్ల కోసం బ్రదర్ జోసెఫ్. ఎఫ్. రూథర్‌ఫర్డ్ చెప్పిన ఈ మాటల్ని ప్రింట్ చేశారు: “మనం ఈ సమావేశానికి ఎందుకు వచ్చామంటే . . . ప్రభువు నుండి బలం పొంది, ఆ రెట్టింపు బలంతో తిరిగెళ్లి ఆయన సాక్షులుగా ప్రీచింగ్ చేయాలి.” ఏ చిన్న అవకాశం దొరికినా యెహోవా గురించి సాక్ష్యమివ్వమని ఆ సమావేశంలోని ఎనిమిది రోజులూ పదేపదే చెప్పారు.
ఆగస్టు 29, శనివారం రోజున బ్రదర్ రూథర్‌ఫర్డ్, “చర్య తీసుకోమనే పిలుపు” అనే అంశమున్న ప్రసంగాన్ని ఇచ్చాడు. ఆ ప్రసంగంలో, సాక్ష్యమివ్వడం ఎంత ముఖ్యమో నొక్కిచెప్తూ ఆయన ఇలా అన్నాడు: “‘మీరే నా సాక్షులు, నేనే దేవుణ్ణి’ అని యెహోవా అంటున్నాడు. తర్వాత, ‘జనాల కోసం ధ్వజాన్ని నిలబెట్టండి’ అని ఆయన ఖరాఖండిగా, సూటిగా ఆజ్ఞ ఇచ్చేస్తున్నాడు. ఈ భూమ్మీద ఎవ్వరూ అలా ధ్వజాన్ని నిలబెట్టలేరు, పవిత్రశక్తి ఉండి దేవునికి సాక్షులుగా ఉండేవాళ్లు [దేవుని ప్రజలు] తప్ప.”—యెష. 43:12; 62:10.
నిరీక్షణా సందేశం కరపత్రం
బ్రదర్ రూథర్‌ఫర్డ్ తన ప్రసంగం తర్వాత, “నిరీక్షణా సందేశం” (ఇంగ్లీషు) అనే డాక్యుమెంట్‌ని లేదా తీర్మానాన్ని చదివాడు. ఆ తీర్మానంలో, దేవుని రాజ్యం మాత్రమే “శాంతిని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని, ఆయుష్షును, స్వేచ్ఛను, అంతులేని సంతోషాన్ని” తీసుకొస్తుందని ఉంది. ఆ తీర్మానానికి ప్రేక్షకులు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. తర్వాత దాన్ని వేర్వేరు భాషల్లోకి అనువదించి, ఒక కరపత్రం రూపంలో ప్రింట్ చేయించారు. దాన్ని దాదాపు 4 కోట్ల కాపీల దాకా పంచిపెట్టారు.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా, బైబిలు విద్యార్థులు యెహోవాసాక్షులు అనే పేరు పెట్టుకోలేదు. కానీ యెహోవాకు సాక్షులుగా ఉండాలి అనే వాళ్ల బాధ్యత మాత్రం వాళ్లకు అర్థమౌతూ వచ్చింది.
ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలవడం
ప్రపంచవ్యాప్తంగా బైబిలు విద్యార్థుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ, ఎవరైతే మంచివార్తను ఆసక్తిగా విన్నారో, వాళ్లను మళ్లీ వెళ్లి కలవమని సంస్థ ప్రోత్సహించింది. నిరీక్షణా సందేశం అనే కరపత్రాన్ని పంచిపెట్టే ప్రచార కార్యక్రమం తర్వాత, బులెటిన్a ఇలా చెప్పింది: “మీరు ఏ ఇళ్లల్లో అయితే నిరీక్షణా సందేశం అనే కరపత్రాన్ని ఇచ్చి వచ్చారో, వాళ్లను మళ్లీ వెళ్లి కలవండి.”
1925, జనవరి బులెటిన్‌లో, టెక్సాస్‌లోని ప్లానోలో ఉన్న ఒక బైబిలు విద్యార్థి చెప్పిన ఈ మాటలు వచ్చాయి: “కొత్త క్షేత్రాల్లో ప్రకటించడం కన్నా, చేసిన చోటే మళ్లీ చేస్తే వచ్చే ఫలితాల్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. మా క్షేత్రంలో ఉన్న ఒక పల్లెటూరిలో మేము గత పదేళ్లలో ఐదుసార్లు ప్రీచింగ్ చేశాం. . . . అయినా మొన్న ఈమధ్య, సిస్టర్ హెండ్రిక్స్ అలాగే మా అమ్మ కలిసి అక్కడ మళ్లీ ప్రకటించినప్పుడు, ఇంతకుముందు కన్నా ఎక్కువ పుస్తకాలు వెళ్లాయి.”
అలాగే, పనామా దేశంలో ఉన్న ఒక కల్‌పోర్చర్ ఇలా రాశాడు: “నేను మొదటిసారి వెళ్లినప్పుడు మంచివార్త వినని చాలామంది రెండోసారి, మూడోసారి వెళ్లినప్పుడు మంచివార్త వినడం నేను గమనించాను. ఈ సంవత్సరమంతా, ఇలా ఆసక్తి చూపించినవాళ్లను కలవడమే పనిగా పెట్టుకున్నాను; నాకు మంచిమంచి అనుభవాలు దొరికాయి.”
వచ్చే సంవత్సరం సంగతేంటి?
1925 చివర్లో, బ్రదర్ రూథర్‌ఫర్డ్ కల్‌పోర్చర్లు అందరికీ ఉత్తరం రాసి, ఆ సంవత్సరం జరిగిన పని గురించి క్లుప్తంగా చెప్పి, రాబోయే సంవత్సరం ఏం చేయాలో చెప్పాడు. ఆయన ఇలా రాశాడు: “ఈ సంవత్సరమంతా మీరు బాధగా ఉన్నవాళ్లను ఓదారుస్తూ, పరిచర్యలో బాగా పాల్గొన్నారు. దానివల్ల చెప్పలేని సంతోషాన్ని మూటగట్టుకున్నారు. . . . ఇప్పుడు రాబోయే సంవత్సరంలో కూడా దేవునికి, ఆయన రాజ్యానికి సాక్షులుగా ఉంటూ జనాల కోసం ధ్వజాన్ని నిలబెట్టే అవకాశాలు మీకు దొరుకుతాయి. . . . కాబట్టి మనందరం కలిసి గొంతెత్తి, మన దేవుడు, రాజు అయిన యెహోవాను స్తుతిస్తూ ఉందాం.”
1925 చివరికి వచ్చేసరికి, మన బ్రదర్స్ బ్రూక్లిన్‌లో ఉన్న బెతెల్‌ని ఇంకా పెద్దది చేయాలనుకున్నారు. అలా 1926లో మన సంస్థ, ఇంతకు ముందెప్పుడూ చేయని ఒక పెద్ద నిర్మాణ ప్రాజెక్టును మొదలుపెట్టబోతుంది.
1926లో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో, ఆడమ్స్ స్ట్రీట్‌లో జరుగుతున్న నిర్మాణ పని
a ఇప్పుడు దాన్ని మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్ వర్క్‌బుక్ అంటున్నాం.