కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w22 అక్టోబరు పేజీలు 2-5
  • 1922—వంద సంవత్సరాల క్రితం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1922—వంద సంవత్సరాల క్రితం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘సాహసంతో కూడిన నిర్ణయం’
  • రేడియో ద్వారా వేలమందికి ప్రకటించారు
  • “ADV”
  • ముఖ్యమైన పని
  • 1919—వంద సంవత్సరాల క్రితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • 1924—వంద సంవత్సరాల క్రితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • అత్యంత అభివృద్ధి చెందుతున్న సంస్థతో కలిసి పనిచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • 1921—వంద సంవత్సరాల క్రితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
w22 అక్టోబరు పేజీలు 2-5
1922 సమావేశంలోని స్టేజీ. స్టేజీ మీద ఉన్న ఫ్లెక్సీ పై ఈ అర్థం ఉన్న మాటలు రాసి ఉన్నాయి: “రాజును, ఆయన రాజ్యాన్ని ప్రకటించండి.” స్టేజీ వెనక భాగంలో “ADV” అనే అక్షరాలు ఉన్నాయి.

స్టేజీ, దాని పైనున్న ఫ్లెక్సీ కనిపించే ఫోటో

1922—వంద సంవత్సరాల క్రితం

‘యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు విజయం ఇస్తాడు.’ (1 కొరిం. 15:57) అది, 1922 వార్షిక వచనం. దేవునికి నమ్మకంగా చేసే సేవను ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అనే భరోసాను ఆ వార్షిక వచనం బైబిలు విద్యార్థులకు ఇచ్చింది. నిజంగానే, ఎంతో ఉత్సాహంగా ప్రకటించిన బైబిలు విద్యార్థుల్ని యెహోవా ఆ సంవత్సరంలో ఎన్నో విధాలుగా ఆశీర్వదించాడు. వాళ్లు పుస్తకాల్ని సొంతగా ప్రింట్‌ చేయడం మొదలుపెట్టినప్పుడు, ప్రకటనా పని చేయడానికి రేడియోను ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు ఆయన వాళ్లను దీవించాడు. యెహోవా తన ప్రజల్ని దీవిస్తున్నాడనే విషయం, 1922 చివర్లో ఇంకోసారి స్పష్టమైంది. అమెరికా, ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో జరిగిన ఒక చారిత్రక సమావేశానికి బైబిలు విద్యార్థులు హాజరయ్యారు. ఆ సమావేశంలో చెప్పిన విషయాలు, ప్రకటనా పనిలో ముందుకు సాగేలా యెహోవా ప్రజల్ని అప్పటినుండి ఇప్పటివరకు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి.

‘సాహసంతో కూడిన నిర్ణయం’

ప్రకటనా పని పెరిగేకొద్దీ ప్రచురణల అవసరం కూడా పెరిగింది. బ్రూక్లిన్‌ బెతెల్‌లో సహోదరులు పత్రికల్ని తయారు చేసేవాళ్లు. కానీ, అట్ట ఉండే పుస్తకాల తయారీని ప్రింటింగ్‌ కంపెనీలకు ఇచ్చేవాళ్లు. ఒకసారి చాలా నెలల పాటు పుస్తకాల కొరత ఏర్పడింది. దాంతో ప్రకటనా పనిలో ఇవ్వడానికి పుస్తకాలు లేకుండాపోయాయి. అప్పుడు బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌, “మనమే సొంతగా పుస్తకాలు తయారు చేయగలమా?” అని బెతెల్‌లో ఫ్యాక్టరీ మేనేజర్‌గా సేవ చేస్తున్న బ్రదర్‌ రాబర్ట్‌ మార్టిన్‌ను అడిగాడు.

న్యూయార్క్‌, బ్రూక్లిన్‌లో కాన్‌కార్డ్‌ వీధిలో ఉన్న ఫ్యాక్టరీ

బ్రదర్‌ మార్టిన్‌ ఇలా గుర్తు చేసుకున్నాడు: “అది నిజంగా సాహసంతో కూడిన పని. ఎందుకంటే దానికోసం కొత్త ఫ్యాక్టరీ తెరవాలి, కొత్త మెషిన్‌లు కొనాలి.” సహోదరులు బ్రూక్లిన్‌లోని, 18 కాన్‌కార్డ్‌ వీధి దగ్గర ఒక స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. అక్కడ ప్రింటింగ్‌కు అవసరమయ్యే మెషిన్‌లను సిద్ధం చేశారు.

కానీ కొంతమందికి అది నచ్చలేదు. ఇదివరకు మన పుస్తకాల్ని తయారు చేసే కంపెనీ యజమాని కొత్త ఫ్యాక్టరీ చూడడానికి వచ్చాడు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు: “మీ దగ్గర చాలా మంచి మెషిన్‌లు ఉన్నాయి. కానీ వాటిని ఎలా వాడాలో మీలో ఎవ్వరికీ తెలీదు. చూడండి! ఆరు నెలల్లో మొత్తం పాడైపోతుంది.”

బ్రదర్‌ మార్టిన్‌ ఇలా అన్నాడు: “ఆయన వైపు నుండి ఆలోచిస్తే అదే నిజం. కానీ అది యెహోవా పని. ఆయన మాకు ఎప్పుడూ తోడుంటాడు.” బ్రదర్‌ మార్టిన్‌ చెప్పింది నిజం. కొన్ని రోజులకే ఫ్యాక్టరీలో రోజుకు 2,000 పుస్తకాలు ప్రింట్‌ చేశారు.

ఫ్యాక్టరీలో ప్రింటింగ్‌ మెషిన్‌లతో పనిచేస్తున్న సహోదరులు

రేడియో ద్వారా వేలమందికి ప్రకటించారు

యెహోవా ప్రజలు పుస్తకాల్ని సొంతగా ప్రింట్‌ చేయడంతో పాటు, మంచివార్తను ప్రకటించడానికి రేడియో ప్రసారాలు అనే కొత్త పద్ధతిని కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. 1922, ఫిబ్రవరి 26, ఆదివారం మధ్యాహ్నం బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ మొట్టమొదటిసారి రేడియోలో ప్రసంగం ఇచ్చాడు. ఆయన అమెరికా, కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఒక రేడియో స్టేషన్‌ నుండి, “ఇప్పుడు జీవిస్తున్న లక్షలమంది ఇక ఎన్నడూ మరణించరు” అనే ప్రసంగాన్ని ఇచ్చాడు.

ఆ ప్రసంగాన్ని దాదాపు 25,000 మంది విన్నారని అంచనా. కొంతమంది దాన్ని మెచ్చుకుంటూ ఉత్తరాలు కూడా రాశారు. ఆ ఉత్తరాల్లో ఒకటి, కాలిఫోర్నియాకు చెందిన విలర్డ్‌ ఆష్‌ఫర్డ్‌ అనే ఆయన రాసినది. “మీ ప్రసంగం చాలా చక్కగా, ఆసక్తికరంగా ఉంది” అని బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ని ఆయన మెచ్చుకున్నాడు. ఆయన ఇంకా ఇలా రాశాడు: “మీ ప్రసంగం వినే అవకాశం మాకు ఈ రేడియో ప్రసారం ఇచ్చింది. ఒకవేళ మీరు మా పక్క వీధికి వచ్చి ప్రసంగం ఇచ్చినా, మేము విని ఉండేవాళ్లం కాదు. ఎందుకంటే మా ఇంట్లో ముగ్గురికి ఒంట్లో బాలేదు.”

ఆ తర్వాతి వారాల్లో రేడియో ద్వారా చాలా ప్రసంగాలు ఇచ్చారు. ఆ సంవత్సరం చివరికల్లా, “రేడియో ద్వారా కనీసం 3,00,000 మంది మంచివార్త విన్నారు” అని కావలికోట పత్రిక అంచనా వేసింది.

రేడియో ప్రసంగాలకు వచ్చిన స్పందనను చూసి బైబిలు విద్యార్థులు ఒక రేడియో స్టేషన్‌ను కట్టాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్లు బ్రూక్లిన్‌ బెతెల్‌కు దగ్గర్లో ఉన్న స్టేటన్‌ ఐలాండ్‌లో ఒక స్థలాన్ని కొన్నారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో, బైబిలు విద్యార్థులు డబ్ల్యూ.బి.బి.ఆర్‌. అనే ఈ రేడియో స్టేషన్‌ను ఉపయోగించి రాజ్య సందేశాన్ని ఇంకా ఎక్కువగా ప్రకటించారు.

“ADV”

ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో 1922, సెప్టెంబరు 5-13 తేదీల్లో ఒక సమావేశం జరుగుతుందని 1922, జూన్‌ 15, కావలికోట ప్రకటించింది. సీడార్‌ పాయింట్‌కు వచ్చిన బైబిలు విద్యార్థులందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ తన మొట్టమొదటి ప్రసంగంలో ఇలా అన్నాడు: “యెహోవా ఈ సమావేశాన్ని ఆశీర్వదిస్తాడని, ప్రకటనా పని భూమ్మీద ముందెన్నడూ జరగనంత ఎక్కువగా జరిగేలా సహాయం చేస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది.” ఆ సమావేశంలో ప్రసంగీకులు ప్రకటనా పనిలో పాల్గొనమని సహోదర సహోదరీల్ని పదేపదే ప్రోత్సహించారు.

1922 లో, ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో జరిగిన సమావేశానికి హాజరైనవాళ్లు

సెప్టెంబరు 8, శుక్రవారం రోజున దాదాపు 8,000 మందితో ఆ హాలు నిండిపోయింది. అందరూ బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ ఇచ్చే ప్రసంగాన్ని వినడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమావేశ ఆహ్వాన పత్రిక మీద ఉన్న “ADV” అంటే ఏంటో ఆయన వివరిస్తాడని ఎదురుచూస్తున్నారు. హాల్లో ఉన్న వాళ్లందరూ స్టేజీ మీద, ఒక పెద్ద ఫ్లెక్సీ చుట్టి ఉండడాన్ని గమనించి ఉంటారు. అమెరికాలోని ఓక్లహామా నుండి సమావేశానికి వచ్చిన బ్రదర్‌ ఆర్థర్‌ క్లాస్‌కి, హాల్లో ప్రసంగం బాగా వినిపించే చోట సీటు దొరికింది. ఆ హాల్లో సౌండ్‌ను పెంచే పరికరాలు లేవు కాబట్టి, కొన్ని చోట్ల మాత్రమే ప్రసంగం స్పష్టంగా వినిపించేది.

“మేము ప్రతీమాటను శ్రద్ధగా వింటున్నాం”

వినేవాళ్లకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, రూథర్‌ఫర్డ్‌ ప్రసంగం మొదలయ్యాక హాల్లోకి రావడానికి ఎవ్వరికీ అనుమతి ఉండదని ఛైర్మన్‌ ముందే చెప్పాడు. ఉదయం 9:30 గంటలకు బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ ప్రసంగం మొదలుపెట్టాడు. ఆయన తన ప్రసంగాన్ని మత్తయి 4:17 లో ఉన్న “పరలోక రాజ్యం దగ్గరపడింది” అనే యేసు మాటలతో ప్రారంభించాడు. ఈ రాజ్యం గురించి ప్రజలు ఎలా తెలుసుకుంటారో వివరిస్తూ ఆయన ఇలా అన్నాడు: “తన ప్రత్యక్షత కాలంలో ఒక కోత పని జరుగుతుందని, అప్పుడు నిజమైన-నమ్మకమైన ప్రజల్ని తన దగ్గరికి చేర్చుకుంటానని యేసే స్వయంగా చెప్పాడు.”

హాల్లో కూర్చున్న బ్రదర్‌ ఆర్థర్‌ ఇలా అన్నాడు: “మేము ప్రతీమాటను శ్రద్ధగా వింటున్నాం.” కానీ ఉన్నట్టుండి ఆయనకు ఒంట్లో కాస్త ఇబ్బందిగా అనిపించడం వల్ల హాలు నుండి బయటికి వచ్చేశాడు. మళ్లీ తనను హాల్లోకి రానివ్వరు అనే బాధతోనే ఆయన బయటికి వెళ్లాడు.

కాసేపటికే ఆయనకు ఆ ఇబ్బంది తగ్గిపోయింది. ఆయన తిరిగి హాలు వైపుకు వస్తున్నప్పుడు, లోపల ఉన్న వాళ్లందరూ గట్టిగా చప్పట్లు కొట్టడం వినిపించింది. దాంతో ఆయన ఇక ఆగలేకపోయాడు. ఆ చక్కని ప్రసంగాన్ని వినడానికి హాలు పైకప్పు మీదికి ఎక్కాల్సి వచ్చినాసరే, ఎక్కేద్దామని అనుకున్నాడు. ఆయనకు అప్పుడు 23 ఏళ్లు. ఆయన ఎలాగోలా పైకప్పు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ కిటికీలు తెరిచి ఉన్నాయి. దాంతో ప్రసంగం “చాలా స్పష్టంగా వినిపించింది” అని ఆయన అన్నాడు.

కానీ అక్కడ ఆర్థర్‌ ఒక్కడే కాదు, ఆయన స్నేహితులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్లలో ఒకరు ఫ్రాంక్‌ జాన్సన్‌. ఆయన ఆర్థర్‌ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి, “నీ జేబులో చిన్న చాకు ఉందా?” అని అడిగాడు.

అప్పుడు ఆర్థర్‌, “ఉంది” అన్నాడు.

అప్పుడు ఫ్రాంక్‌ ఇలా అన్నాడు: “దేవుడు మా ప్రార్థనలు విని నిన్ను పంపించాడు. మేకులకు తగిలించిన ఈ ఫ్లెక్సీ చుట్ట కనిపిస్తుంది కదా. జడ్జిa చెప్పే మాటల్ని జాగ్రత్తగా విను. ‘ప్రకటించండి, ప్రకటించండి’ అని ఆయన అన్న వెంటనే ఈ నాలుగు తాళ్లను కోసేయి.”

బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ ఆ మాటలు అనే క్షణం కోసం ఆర్థర్‌, ఆయన స్నేహితులు ఎదురుచూస్తున్నారు. కాసేపటికే బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ తన ప్రసంగం చివర్లోకి వచ్చేశాడు. ఎంతో ఉత్సాహంగా బిగ్గరగా ఆయన ఇలా అన్నాడు: ‘ప్రభువుకు నమ్మకమైన సత్య సాక్షులుగా ఉండండి. బబులోనుకు సంబంధించినవన్నీ నాశనమయ్యేంత వరకు పోరాటంలో ముందుకు సాగండి. సందేశాన్ని సుదూర ప్రాంతాలకు చేరవేయండి. యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తు రాజులకు రాజూ, ప్రభువులకు ప్రభువూ అని లోకం తెలుసుకోవాలి. ఇదే అత్యంత ముఖ్యమైన రోజు. ఇదిగో, రాజు ఏలుతున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి.’

ఆర్థర్‌, అక్కడున్న మిగతా సహోదరులు తాళ్లను కోసిన వెంటనే ఫ్లెక్సీ చక్కగా తెరుచుకుంది. “ADV” అనే మాటకు తగ్గట్టుగానే ఆ ఫ్లెక్సీ మీద “రాజును, ఆయన రాజ్యాన్ని ప్రకటించండి” అని రాసివుంది. ఇంగ్లీష్‌లో “ADV” అనే అక్షరాలు ప్రకటించండి అనే పదాన్ని సూచిస్తాయి.

ముఖ్యమైన పని

ఎంతో ముఖ్యమైన రాజ్య ప్రకటనా పని మీద సహోదరులు మనసుపెట్టేలా సీడార్‌ పాయింట్‌లోని సమావేశం సహాయం చేసింది. ప్రకటనా పని చేయడానికి చాలామంది సంతోషంగా ముందుకొచ్చారు. అమెరికాలోని ఓక్లహామాలో సేవచేస్తున్న ఒక కల్‌పోర్చర్‌ (పయినీరు) ఇలా రాశాడు: “మేము బొగ్గు గనులు ఉన్న ప్రాంతంలో ప్రకటించే వాళ్లం. అక్కడి ప్రజలు చాలా పేదవాళ్లు. గోల్డెన్‌ ఏజ్‌ పత్రికలో ఉన్న విషయాలు విన్నప్పుడు తరచూ అక్కడి ప్రజలు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “వాళ్లను అలా ఓదార్చే అవకాశం మాకు దొరకడం ఒక గొప్ప దీవెన.”

లూకా 10:2 లో యేసు అన్న మాటలు ఎంత ముఖ్యమో ఈ బైబిలు విద్యార్థులు గుర్తించారు. అక్కడ యేసు ఇలా అన్నాడు: “కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు.” ఆ సంవత్సరం చివరికొచ్చే కొద్దీ, రాజ్య సందేశాన్ని ఇంకా ఎక్కువగా ప్రకటించాలని వాళ్లు మరింత బలంగా నిర్ణయించుకున్నారు.

a అమెరికాలోని మిస్సోరీలో బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ అప్పుడప్పుడు జడ్జిగా పనిచేసేవాడు. కాబట్టి కొన్నిసార్లు సహోదరులు ఆయన్ని “జడ్జి” అని పిలిచేవాళ్లు.

ప్రపంచమంతటా ప్రకటించారు

1922, ఫిబ్రవరి 26న బైబిలు విద్యార్థులు “ప్రపంచమంతటా ప్రకటించే” ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజున బైబిలు విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి గలవాళ్ల కోసం ప్రత్యేక మీటింగ్స్‌ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్స్‌లో “ఇప్పుడు జీవిస్తున్న లక్షలమంది ఇక ఎన్నడూ మరణించరు” అనే ప్రసంగాన్ని ఇచ్చారు.

ఆ ప్రసంగాన్ని దాదాపు 33 భాషల్లో ఇచ్చారు. బహిరంగ ప్రసంగాలు ఇస్తున్న దాదాపు ప్రతీ ఒక్క సహోదరున్ని ఈ ప్రసంగం ఇవ్వడానికి ఉపయోగించారని కావలికోట పత్రిక చెప్పింది. బైబిలు విద్యార్థులు గ్రేట్‌ బ్రిటన్‌లో 306 మీటింగ్స్‌ ఏర్పాటు చేశారు. వాటికి 67,010 మంది వచ్చారు. బెల్జియం, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లో ఫ్రెంచ్‌ భాష మాట్లాడే 15,000 కన్నా ఎక్కువమంది ఆ ప్రసంగాన్ని విన్నారు. ఆ మీటింగ్స్‌కి వచ్చిన మంచి స్పందన చూసి, ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే ప్రత్యేక కార్యక్రమాన్ని మళ్లీ అదే సంవత్సరం జూన్‌ 25న, అక్టోబరు 29న, అలాగే డిసెంబరు 10న ఏర్పాటు చేశారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి