పాఠకుల ప్రశ్న
సామెతలు 30:18, 19 రాసిన వ్యక్తి “యువతితో పురుషుడి జాడ,” “నాకు అంతుపట్టని విషయం” అని అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి?
కొంతమంది విద్వాంసులతో సహా, చాలామందికి ఆ మాటల అర్థం ఏంటో తెలియలేదు. కొత్త లోక అనువాదం బైబిల్లో ఆ రెండు వచనాల్లో ఇలా ఉంది: “నాకు అంతుపట్టని విషయాలు మూడు ఉన్నాయి, నాకు అర్థంకానివి నాలుగు ఉన్నాయి. అవేంటంటే: ఆకాశంలో గద్ద జాడ, బండ మీద పాము జాడ, నడి సముద్రంలో ఓడ జాడ, యువతితో పురుషుడి జాడ.”—సామె. 30:18, 19.
“యువతితో పురుషుడి జాడ” అనే మాట ఒక తప్పును వర్ణించడానికి ఉపయోగించిందని ఒకప్పుడు అర్థంచేసుకున్నాం. ఎందుకు? ఎందుకంటే ఆ లేఖన సందర్భం, “చాలు!” అని ఎప్పుడూ అనని తప్పుడు విషయాల గురించి మాట్లాడుతుంది. (సామె. 30:15, 16) అలాగే ఏ తప్పూ చేయలేదని చెప్పుకునే “వ్యభిచార స్త్రీ” గురించి 20వ వచనం మాట్లాడుతుంది. కాబట్టి ఆకాశంలో గద్దలా, బండమీద పాములా, నడి సముద్రంలో ఓడలా, ఒక పురుషుడు యువతితో చేసే పనికి సంబంధించి ఏ ఆనవాలు మిగల్చడని అనుకున్నాం. దాన్నిబట్టి, “యువతితో పురుషుడి జాడ” అనే మాట ఒక తప్పుడు పనిని అంటే ఒక యువకుడు, ఒక యువతిని మభ్యపెట్టి, ఆమెకు తెలియకుండానే ఆమెతో ఒక తప్పు చేస్తాడని గతంలో అర్థంచేసుకున్నాం.
అయితే, ఈ వచనాలన్నీ ఒక మంచి విషయం గురించే చెప్తున్నాయని అనుకోవడానికి సరైన కారణమే ఉంది. ఆ మాటలు రాసిన వ్యక్తికి ఆయన ప్రస్తావించిన విషయాలు కేవలం ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపించాయంతే!
ఈ వచనాల్లోని మాటలు, ఒక మంచి విషయం గురించే చెప్తున్నాయని హీబ్రూ రాత ప్రతులు కూడా చూపిస్తున్నాయి. థియోలాజికల్ లెక్సికన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం సామెతలు 30:18 లో ఉన్న “నాకు అంతుపట్టని” అని అనువదించబడిన హీబ్రూ మాట, “ఒక వ్యక్తి చూసిన అసాధారణమైన, అసంభవమైన, అద్భుతమైన సంఘటనను సూచిస్తుంది.”
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్రావ్‌ఫర్డ్ హెచ్. టోయ్ కూడా, ఈ లేఖనంలోని మాటలు తప్పుడు విషయాల గురించి చెప్పట్లేదు అనే ముగింపుకు వచ్చాడు. ఆయన ఇలా అన్నాడు: “తను ప్రస్తావించిన విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో రచయిత చెప్పాలనుకుంటున్నాడు.”
వీటన్నిటినిబట్టి సామెతలు 30:18, 19 లోని మాటలు నిజంగానే అద్భుతమైనవి, మనకు అంతుపట్టనివని నమ్మవచ్చు. ఆకాశంలో గద్ద అంత ఎత్తులో ఎలా ఎగురుతుందో, కాళ్లులేని పాము బండమీద చకాచకా ఎలా పాకుతుందో, చాలా బరువున్న ఓడ సముద్రంలో ఎలా తేలుతూ ప్రయాణిస్తుందో, ఒక యువకుడు-యువతి ఎలా ప్రేమలో పడి, సంతోషంగా కలిసి జీవిస్తారో ఆ బైబిలు రచయితలాగే మనకూ అంతుచిక్కవు, ఆశ్చర్యంగా అనిపిస్తాయి.