బైబిల్లోని మాట
యేసు “విధేయత నేర్చుకున్నాడు”
యేసు ఎప్పుడూ యెహోవాకు లోబడే ఉన్నాడు. (యోహా. 8:29) మరైతే, “తాను పడిన బాధల వల్ల విధేయత నేర్చుకున్నాడు” అని బైబిలు ఎందుకు అంటుంది?—హెబ్రీ. 5:8.
యేసు భూమ్మీదున్నప్పుడు పరిస్థితులు పరలోకంలో ఉన్నట్టు లేవు. ఆయన్ని పెంచిన అమ్మానాన్నలకు భయభక్తులు ఉన్నప్పటికీ వాళ్లు అపరిపూర్ణులే. (లూకా 2:51) యేసు అవినీతిపరులైన మతనాయకుల, అన్యాయస్థులైన పాలకుల చేతుల్లో నానా కష్టాలుపడ్డాడు. (మత్త. 26:59; మార్కు 15:15) అంతేకాదు, ఆయన “తనను తాను తగ్గించుకుని, చనిపోయేంతగా విధేయత చూపించాడు.” ఆయన చిత్రహింసలు పడి చనిపోయాడు.—ఫిలి. 2:8.
కాబట్టి, యేసు భూమ్మీదున్నప్పుడు ఒక కొత్త విధానంలో విధేయత చూపించడం నేర్చుకున్నాడు. దానివల్ల ఆయన మనల్ని అర్థంచేసుకునే మంచి రాజుగా, ప్రధాన యాజకునిగా అవ్వగలిగాడు. (హెబ్రీ. 4:15; 5:9) తాను అనుభవించిన వాటినుండి విధేయత నేర్చుకోవడం వల్ల యెహోవాకు చాలా విలువైనవాడిగా అయ్యాడు. మనం కూడా కష్టాల్లో విధేయత చూపిస్తూ ఉంటే యెహోవాకు చాలా విలువైనవాళ్లంగా, పనికొచ్చేవాళ్లంగా అవుతాం.—యాకో. 1:4.