కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 సెప్టెంబరు పేజీలు 26-30
  • యెహోవా సహాయంతో ‘నాటిన చోటల్లా ఫలిస్తూ వచ్చాము’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా సహాయంతో ‘నాటిన చోటల్లా ఫలిస్తూ వచ్చాము’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా నాకు ఊహకందని దీవెనలు ఇచ్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • యెహోవా ‘నా దారుల్ని తిన్నగా చేశాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • యెహోవాయే నాకు అభయమూ, బలమూ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • కొత్త నియామకానికి ఎలా అలవాటుపడవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 సెప్టెంబరు పేజీలు 26-30
మాట్స్‌ అలాగే ఆన్‌-కాట్రిన్‌ ఒక పల్లెటూరిలో వాళ్ల కారు పక్కన నిలబడ్డారు.

జీవిత కథ

యెహోవా సహాయంతో ‘నాటిన చోటల్లా ఫలిస్తూ వచ్చాము’

మాట్స్‌ అలాగే ఆన్‌కాట్రిన్‌ కాషోమ్‌ చెప్పినది

“నాటిన చోటల్లా ఫలించండి” అనే సలహా కొత్తగా అనిపించవచ్చు. కానీ స్వీడన్‌కు చెందిన మాట్స్‌ అలాగే ఆన్‌కాట్రిన్‌ అనే జంట చాలాసార్లు “నాటబడ్డారు.” అయితే, ఆ సలహా వాళ్లకు ఎందుకు, ఎలా ఉపయోగపడిందో చూద్దాం.

ఈ జంట 1979లో గిలియడ్‌ తరగతికి హాజరయ్యారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో వాళ్లు చాలా నియామకాల్లో “నాటబడ్డారు.” వాళ్లు ఇరాన్‌, మారిషస్‌, మియన్మార్‌, టాంజానియా, ఉగాండా, జైరే లాంటి ప్రాంతాల్లో సేవచేశారు. వాళ్ల గిలియడ్‌ ఉపదేశకుడైన జాక్‌ రెడ్‌ఫోర్డ్‌ ఇచ్చిన సలహా వాళ్లకు వేర్వేరు నియామకాల్లో ఎలా సహాయం చేసిందో చెప్పారు. దాన్ని వాళ్ల మాటల్లోనే విందాం.

మాట్స్‌, ఆన్‌ మీరు సత్యంలోకి ఎలా వచ్చారో చెప్తారా?

మాట్స్‌: రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు మేము పోలండ్‌లో ఉండేవాళ్లం. అక్కడ క్యాథలిక్‌ చర్చివాళ్లు ఒకటి చెప్పి, ఇంకొకటి చేయడం మా నాన్నకు అస్సలు నచ్చలేదు. కానీ పద్దాక ఇలా అనేవాడు: “సత్యం ఎక్కడో ఒకదగ్గర ఉండే ఉంటుంది!” కొంతకాలం తర్వాత మా నాన్న చెప్పిన మాటలు నిజమని నాకు అనిపించాయి. నేను కొన్ని పాత పుస్తకాల్ని కొన్నాను. దాంట్లో ఒక బ్లూ కలర్‌ పుస్తకం నాకు దొరికింది. దాని పేరు నిత్యజీవమునకు నడుపు సత్యము. ఈ పుస్తకం పేరు నన్ను నిద్రపోనివ్వలేదు. అందుకే, ఆ రాత్రే ఆ పుస్తకమంతా చదివేశాను. తెల్లారేసరికల్లా నాకు సత్యం దొరికిందని నాకు అర్థమైంది.

1972, ఏప్రిల్‌ నుండి నేను యెహోవాసాక్షుల ప్రచురణలు చాలా చదివాను. దాంతో నాకున్న ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరికాయి. యేసు చెప్పిన ఉదాహరణలోని వ్యాపారిలాగే నాకు అనిపించింది. అతనికి ఎంతో విలువైన ఒక ముత్యం దొరికింది. దానికోసం అతను తన దగ్గరున్నదంతా అమ్మేశాడు. నేను కూడా నాకు దొరికిన సత్యం అనే “ముత్యం” కోసం డాక్టర్‌ చదవాలన్న నా ఆలోచనను కూడా ‘అమ్మేశాను.’ (మత్త. 13:45, 46) ఆ తర్వాత 1972, డిసెంబరు 10న బాప్తిస్మం తీసుకున్నాను.

ఒక సంవత్సరం తిరిగేలోపే మా అమ్మానాన్నలు, నా తమ్ముడు సత్యాన్ని అంగీకరించి, బాప్తిస్మం తీసుకున్నారు. 1973, జూలైలో నేను క్రమపయినీరుగా సేవచేయడం మొదలుపెట్టాను. మా సంఘంలో ఒక అమ్మాయి ఉండేది. అందానికి, ఆధ్యాత్మికతకు రూపం ఉంటే అది ఆమె. ఆమె పేరు ఆన్‌కాట్రిన్‌. మా సంఘంలో ఉన్న ఉత్సాహంగల పయినీర్లలో ఆమె ఒకరు. మేమిద్దరం ప్రేమలో పడ్డాం, 1975లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మనసును దోచే ప్రకృతి అందాలతోపాటు, మనసారా సత్యాన్ని అంగీకరించే ప్రజలున్న స్వీడన్‌లోని స్ట్రోమ్‌సండ్‌ అనే ప్రాంతంలో సేవచేశాం.

ఆన్‌కాట్రిన్‌: మా నాన్న స్టాక్‌హోమ్‌లో ఉన్న యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు సత్యం తెలుసుకున్నాడు. అప్పుడు నా వయసు కేవలం మూడు నెలలు. అయినాసరే మా నాన్న నన్ను మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి తీసుకెళ్లేవాడు. మా అమ్మకు యెహోవాసాక్షులంటే అస్సలు నచ్చేదికాదు. వాళ్లు తప్పు అని నిరూపించాలని అనుకుంది. కానీ ఆమెవల్ల కాలేదు. కాబట్టి కొంతకాలం తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకుంది. నేను 13 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్నాను, 16 ఏళ్ల వయసులో పయినీరింగ్‌ మొదలుపెట్టాను. అవసరం ఎక్కువున్న ప్రాంతమైన ఉమియాలో సేవ చేసిన తర్వాత ప్రత్యేక పయినీరు అయ్యాను.

నేను మాట్స్‌ పెళ్లి చేసుకున్నాక చాలామందిని సత్యంలోకి తీసుకొచ్చామనే సంతృప్తి దొరికింది. వాళ్లలో ఒకరు మైవొర్‌ అనే ఒక టీనేజీ అమ్మాయి. ఆమెకు క్రీడల్లో మంచి భవిష్యత్తు ఉన్నా, యెహోవా కోసం దాన్ని వదులుకుని, మా చెల్లితోపాటు పయినీరు సేవ చేసింది. వాళ్లిద్దరు కలిసి 1984లో గిలియడ్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఈక్వెడార్‌లో మిషనరీలుగా సేవచేస్తున్నారు.

మీరు చేసిన చాలా మిషనరీ నియామకాల్లో “నాటిన చోటల్లా ఫలిస్తూ ఉండండి” అనే సలహాను ఎలా పాటించారు?

మాట్స్‌: మేము చాలాసార్లు కొత్తకొత్త నియామకాల్లో “నాటబడ్డాం.” కానీ యేసును అనుకరించడానికి మేము చేయగలిగినదంతా చేసినప్పుడు, ముఖ్యంగా వినయం చూపించినప్పుడు మేము నాటబడిన చోటల్లా ‘వేళ్లూనుకున్నాం.’ (కొలొ. 2:6, 7) ఉదాహరణకు, అక్కడున్న బ్రదర్స్‌సిస్టర్స్‌ మా పద్ధతులకు అలవాటుపడాలని మేము అనుకోలేదు గానీ, వాళ్ల పద్ధతులను మేము నేర్చుకోవాలని అనుకున్నాం. వాళ్లు ఎలా ఆలోచిస్తారో, వాళ్ల సంస్కృతి ఏంటో మేము తెలుసుకున్నాం. మేము ఎంతెక్కువగా యేసును అనుసరిస్తే, “నీటి కాలువల పక్కనే నాటబడిన” చెట్టులా మేము అంతెక్కువగా ఫలిస్తూ వచ్చాం.—కీర్త. 1:2, 3.

మాట్స్‌ అలాగే ఆన్‌-కాట్రిన్‌ సామాన్లు, కొంచెం ఆహారం మోస్తున్నారు.

సంఘాల్ని సందర్శించడానికి ప్రయాణాలు చేయడం మా దినచర్యలో ఒకటి అయిపోయింది

ఆన్‌కాట్రిన్‌: ఒక చెట్టును ఒక దగ్గర నుండి తీసి, ఇంకొక దగ్గర నాటినప్పుడు అది పెరగాలంటే సూర్యరశ్మి కావాలి. మా విషయంలో యెహోవాయే మా “సూర్యుడు.” (కీర్త. 84:11) ఆయన బ్రదర్స్‌సిస్టర్స్‌ రూపంలో మాకు కావాల్సిన ప్రేమాప్యాయతల్ని పంచాడు. ఉదాహరణకు, ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉన్న మా చిన్న సంఘంలో బ్రదర్స్‌సిస్టర్స్‌ చాలా పెద్ద మనసుతో ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ల ఆతిథ్యాన్ని చూశాక మేము బైబిలు కాలాల్లో ఉన్నట్టు అనిపించింది. మాకు ఇరాన్‌ బాగా నచ్చింది. అక్కడే ఉండాలని అనుకున్నాం. కానీ 1980, జూలైలో అక్కడి ప్రభుత్వం యెహోవాసాక్షుల్ని నిషేధించింది. మమ్మల్ని 48 గంటల్లో దేశం వదిలి వెళ్లాలని చెప్పారు. అప్పుడు సంస్థ మా నియామకాన్ని మార్చి, మమ్మల్ని ఆఫ్రికాలోని జైరేకి పంపించారు.

జైరేలోని ఓ పల్లెటూరిలో చిన్న ఇల్లు.

1982లో జైరేలోని మా నియామకంలో కొన్ని మధుర జ్ఞాపకాలు

మమ్మల్ని ఆఫ్రికాకు నియమించారని విన్నప్పుడు నేను ఏడ్చేశాను. ఎందుకంటే అక్కడి పాములు, జబ్బులు నన్ను భయపెట్టేశాయి. కానీ అక్కడ చాలాకాలంగా సేవచేసిన ఇద్దరు ఫ్రెండ్స్‌ మాతో ఇలా అన్నారు: “నువ్వు ఇంకా అసలు ఆఫ్రికాలో అడుగుపెట్టలేదు కదా, ఒక రాయి వేసి చూడు. నీకు నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పు.” వాళ్లన్నట్లే నాకు ఆఫ్రికా తెగ నచ్చేసింది. అక్కడ బ్రదర్స్‌సిస్టర్స్‌ వాళ్ల ప్రేమతో చంపేశారు. నిజానికి ఆరేళ్ల తర్వాత జైరేలో ఉన్న నిషేధం వల్ల మేము ఆ ప్రాంతాన్ని వదిలి వస్తున్నప్పుడు యెహోవా “ప్లీజ్‌ మమ్మల్ని ఇక్కడే ఉంచు” అని ప్రార్థించడం చూసి నాకే నవ్వొచ్చింది. ఎందుకంటే, ఒకప్పుడు ఆఫ్రికాను వద్దనుకున్న కానీ ఇప్పుడు వదల్లేకపోతున్న!

ఈ గడిచిన సంవత్సరాల్లో మీకు దొరికిన ఆశీర్వాదాలు చెప్తారా?

కారు బయట ఒక మడత కుర్చీ వేసుకొని కూర్చున్న ఆన్‌-కాట్రిన్‌.

1988లో టాంజానియాలోని మా “బెడ్‌రూమ్‌”

మాట్స్‌: వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన చాలామంది మిషనరీలు మాకు స్నేహితులు అయ్యారు. అంతేకాదు, కొన్ని నియామకాలు చేస్తున్నప్పుడైతే పట్టలేనంత ఆనందం వచ్చింది. ఎందుకంటే మేము చాలా బైబిలు స్టడీలు చేసేవాళ్లం. కొన్నిసార్లయితే, చెరో 20 స్టడీలు ఉండేవి. వీటితోపాటు ఆఫ్రికాలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ చూపించిన ప్రేమ, ఆతిథ్యం ఇప్పటికీ మరచిపోలేం. టాంజానియాలోని సంఘాల్ని మేము సందర్శించడానికి వెళ్లినప్పుడు చాలామంది బ్రదర్స్‌సిస్టర్స్‌ వాళ్ల స్తోమతకు మించి మాకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ల ఇంటిపక్కన మేము మా కారును పార్కు చేసుకుని అందులో పడుకునేవాళ్లం. (2 కొరిం. 8:3) అలాగే రోజంతటిలో నాకు బాగా నచ్చే సమయం, సాయంత్రం మేము కూర్చొని కబుర్లు చెప్పుకునే సమయం. అప్పుడు నేను, ఆన్‌కాట్రిన్‌ కూర్చొని ఆ రోజంతా ఏమేమి జరిగాయో మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత యెహోవా మాకు తోడుగా ఉన్నందుకు ప్రార్థనలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పేవాళ్లం.

ఆన్‌కాట్రిన్‌: నాకైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీల మధ్య ఉండడమే గొప్ప వరం. మేము ఫార్సీ, ఫ్రెంచ్‌, లుగాండ, స్వాహిలీ లాంటి కొత్తకొత్త భాషలు నేర్చుకున్నాం. వేర్వేరు సంస్కృతుల్ని చూశాం. మేము కొత్త శిష్యుల్ని తయారుచేశాం. నిజమైన స్నేహితుల్ని సంపాదించుకున్నాం. వాళ్లందరితో యెహోవా సేవలో “ఐక్యంగా” పనిచేశాం.—జెఫ. 3:9.

వీటితోపాటు యెహోవా సృష్టిలో ఉన్న అందాలని కూడా మేము చూడగలిగాం. మేము కొత్తకొత్త నియామకాల్ని ఒప్పుకున్న ప్రతీసారి, మేము వేసే ప్రతీ అడుగులో యెహోవా మా వెన్నంటే ఉన్నాడు. మా అంతట మేము నేర్చుకోలేని పాఠాల్ని, పొందలేని అనుభవాల్ని యెహోవా మాకు ఇచ్చాడు.

చిత్రాలు: 1. మాట్స్‌ అలాగే ఆన్‌-కాట్రిన్‌ ఒక తల్లికి, ఆమె పిల్లలకి ప్రీచింగ్‌ చేస్తున్నారు. 2. ఆన్‌-కాట్రిన్‌ మాసాయి తెగకు చెందిన అబ్బాయికి సాక్ష్యం ఇస్తుంది.

టాంజానియాలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రీచింగ్‌

మీకు ఎలాంటి కష్టాలు వచ్చాయి? వాటిని ఎలా తట్టుకున్నారు?

మాట్స్‌: మేము మలేరియా లాంటి రకరకాల జబ్బుల బారినపడ్డాం. అలాగే ఆన్‌కాట్రిన్‌కు కొన్ని ఊహించని సర్జరీలు జరిగాయి. వీటికితోడు, వయసుపైబడుతున్న మా అమ్మానాన్నల గురించి కూడా మేము ఆందోళనపడేవాళ్లం. కానీ మా తోబుట్టువులు వాళ్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. నమ్మకంగా, ఓర్పుగా, సంతోషంగా, ప్రేమగా ఆ పని చేస్తున్నందుకు మేము వాళ్లకు కృతజ్ఞులం. (1 తిమో. 5:4) అయినాసరే, కొన్నిసార్లు మా అమ్మానాన్నల్ని దూరం నుండి కాకుండా దగ్గరుండి చూసుకుంటే బాగుండని ఆలోచించి బాధపడుతుంటాం.

ఆన్‌కాట్రిన్‌: 1983లో మేము జైరేలో సేవ చేస్తున్నప్పుడు నాకు కలరా వ్యాధి వచ్చింది. డాక్టర్‌ మాట్స్‌తో “ఇప్పటికిప్పుడు ఈమెను ఈ దేశం నుండి తీసుకెళ్లిపోండి” అన్నారు. ఆ తెల్లారే వేరేదారిలేక మేము సామాన్లు తరలించే విమానంలో స్వీడన్‌కు వచ్చాం.

మాట్స్‌: ఇక మా మిషనరీ సేవ ఆపేయాల్సి వస్తుందేమో అని గుక్కపెట్టి ఏడ్చేశాం. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. కానీ ఆన్‌కాట్రిన్‌ మాత్రం చక్కగా కోలుకుంది. ఇక సంవత్సరం తర్వాత మేము తిరిగి జైరేకి వెళ్లగలిగాం. అయితే ఈసారి మేము లుబుంబాషిలోని స్వాహిలీ భాష మాట్లాడే ఒక చిన్న సంఘానికి వెళ్లాం.

ఆన్‌కాట్రిన్‌: మేము లుబుంబాషిలో ఉన్నప్పుడు నాకు కడుపులోనే బిడ్డ చనిపోయింది. మాకు పిల్లల్ని కనాలనే ఆలోచన లేకపోయినా ఆ సంఘటన మాకు తీరని బాధను మిగిల్చింది. ఈ బాధ నుండి తేరుకోవడానికి యెహోవా మాకు ఊహించని బహుమతిని ఇచ్చాడు. అదేంటంటే, మేము ముందెప్పటికన్నా ఎక్కువ బైబిలు స్టడీలను మొదలుపెట్టగలిగాం. ఒక సంవత్సరం తిరిగేలోపు, సంఘంలో ప్రచారకుల సంఖ్య 35 నుండి 70కి చేరుకుంది. మీటింగ్‌కి వచ్చేవాళ్ల సంఖ్య 40 నుండి 220కి పెరిగింది. ప్రీచింగ్‌లో మేము ఊపిరాడనంత బిజీగా ఉండేవాళ్లం. యెహోవా దీవెనలతో నా మనసుకు కావాల్సిన ఓదార్పు కూడా దొరికింది. అయినప్పటికీ అప్పుడప్పుడు మా బిడ్డ గురించి ఆలోచిస్తుంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. పరదైసులో మా మనసులో ఉన్న బాధంతా యెహోవా ఎలా తీసేస్తాడో చూడాలని ఎంతో ఎదురుచూస్తున్నాం.

మాట్స్‌: ఒకానొక సమయంలో ఆన్‌కాట్రిన్‌ బాగా బలహీనమైపోయి, అలసిపోయినట్టుగా ఉండేది. నాకేమో పేగు క్యాన్సర్‌ వచ్చి ఆ జబ్బు బాగా ముదిరిపోయింది. దానికి ఒక పెద్ద సర్జరీ అవసరమైంది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఆన్‌కాట్రిన్‌ కూడా యెహోవా సేవలో చేయగలిగినదంతా చేస్తుంది.

కష్టాలు మా ఒక్కరికే లేవని మాకర్థమైంది. 1994లో రువాండాలో జాతి పేరుతో జరిగిన విధ్వంసం తర్వాత, మేము శరణార్థ శిబిరంలో ఉన్న చాలామంది మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని కలిశాం. వాళ్ల విశ్వాసం, సహనం, అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆతిథ్యం ఇవ్వాలన్న వాళ్ల స్ఫూర్తిని చూశాక, యెహోవా తన ప్రజల్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా చూసుకుంటాడని మాకు అర్థమైంది.—కీర్త. 55:22.

ఆన్‌కాట్రిన్‌: 2007లో ఉగాండాలో ఒక బ్రాంచి కార్యాలయం ప్రారంభానికి మేము వెళ్లినప్పుడు ఇంకో చేదు జ్ఞాపకం మిగిలింది. ఆ కార్యక్రమం తర్వాత మేము 25 మంది బ్రదర్స్‌సిస్టర్స్‌ కలిసి ప్రయాణిస్తున్నాం, అందులో మిషనరీలు, బెతెలైట్లు ఉన్నారు. మేము కెన్యాలోని నైరోబికి వెళ్తున్నాం. ఇంకా మేము కెన్యా సరిహద్దు చేరుకునేలోపే, ఎదురుగా ఒక లారీ వచ్చి మమ్మల్ని గుద్దేసింది. డ్రైవరు అలాగే ఐదుగురు మన బ్రదర్స్‌సిస్టర్స్‌ అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొక సిస్టర్‌ హాస్పిటల్‌లో చనిపోయింది. వీళ్లందర్నీ మేము పరదైసులో కలవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం.—యోబు 14:13-15.

నాకు తగిలిన గాయాలు మెల్లిమెల్లిగా మానాయి. కానీ నాకు, మాట్స్‌కు మాత్రం ఆ ప్రయాణం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఆందోళన అనే జబ్బును తెచ్చిపెట్టాయి. నా విషయంలోనైతే, మధ్య రాత్రిలో ఆందోళన వల్ల ఉలిక్కిపడి లేచేదాన్ని. అప్పుడు నాకు గుండెపోటు వచ్చినట్లుగా అనిపించేది. అది చాలా భయంకరంగా ఉండేది. కానీ పట్టుదలగా ప్రార్థన చేయడం, ఇష్టమైన లేఖనాల గురించి ఆలోచించడం వల్ల వాటిని తట్టుకోగలిగాం. వీటితోపాటు డాక్టర్ల సహాయం కూడా తీసుకున్నాం. ఇప్పుడు మా ఆందోళన కాస్త తగ్గింది. తీవ్రమైన ఆందోళనలతో బాధపడేవాళ్లకు ఓదార్పునిచ్చేలా సహాయం చేయమని యెహోవాను అడుగుతున్నాం.

మీ కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేశాడో చెప్తూ, ఆయన మిమ్మల్ని “కోడి గుడ్లలా” మోశాడు అన్నారు కదా, దాని అర్థమేంటో కాస్త చెప్తారా?

మాట్స్‌: మమ్మల్ని కోడి గుడ్లలా మోశారు అనేది ఒక స్వాహిలీ సామెత. కోడి గుడ్లు పగలకుండా ఒకవ్యక్తి ఎలా జాగ్రత్తగా మోస్తాడో యెహోవా కూడా మా ప్రతీ నియామకంలో అంతే జాగ్రత్తగా మోశాడు. మాకు ఎప్పుడూ, ఏదీ తక్కువ కాలేదు. చెప్పాలంటే కొన్నిసార్లు ఎక్కువే అయ్యాయి. పరిపాలకసభ మమ్మల్ని అర్థం చేసుకున్న దాన్నిబట్టి యెహోవా ప్రేమను, మద్దతును రుచి చూడగలిగాం.

ఆన్‌కాట్రిన్‌: యెహోవా మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్న ఒక సందర్భం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఏమైందంటే, నాకొక ఫోన్‌ కాల్‌ వచ్చింది. స్వీడన్‌లో ఉన్న మా నాన్న ఐసియూలో ఉన్నాడని చెప్పారు. మాట్స్‌ ఏమో అప్పుడే మలేరియా నుండి కోలుకున్నాడు. మేము స్వీడన్‌కు విమానంలో వెళ్లడానికి మా దగ్గర డబ్బుల్లేవు. కాబట్టి మా కారు అమ్మేయాలి అనుకున్నాం. కానీ అంతలోనే మాకు రెండు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఒక ఫోన్‌ కాలేమో ఒక జంట నుండి వచ్చింది. వాళ్లు మా పరిస్థితి తెలుసుకుని ఒకరికి విమానం టికెట్‌ కొనివ్వాలని వాళ్లు అనుకున్నారు. ఇంతలోనే ఒక పెద్ద వయసు సిస్టర్‌ నుండి కూడా కాల్‌ వచ్చింది. ఆ సిస్టర్‌ ఒక డబ్బా మీద, “అవసరంలో ఉన్నవాళ్ల కోసం” అని రాసి, అందులో డబ్బులు దాచింది. వాటిని మాకు ఇస్తానని చెప్పింది. ఇలా మాకు కష్టం వచ్చిన కొన్ని క్షణాల్లోనే యెహోవా మా పక్కన వచ్చి నిలబడినట్లు అనిపించింది.—హెబ్రీ. 13:6.

గడిచిన 50 ఏళ్ల పూర్తికాల సేవలో మీరేం నేర్చుకున్నారో చెప్తారా?

మాట్స్‌ అలాగే ఆన్‌-కాట్రిన్‌ సంతోషంగా పక్కపక్కన నిలబడ్డారు.

మియన్మార్‌లో మా కొత్త నియామకం

ఆన్‌కాట్రిన్‌: “కంగారుపడకుండా నమ్మకం చూపిస్తే అదే” మాకు బలమని నేను అర్థం చేసుకున్నాను. మేము యెహోవా మీద నమ్మకం ఉంచినప్పుడు, మా కష్టాన్ని తన కష్టమని ఆయన అనుకున్నాడు. (యెష. 30:15; 2 దిన. 20:15, 17) ప్రతీ నియామకంలో మా శక్తి లోపం లేకుండా యెహోవా సేవ చేశాం. ఈ లోకంలో వేరే ఏ పని చేసినా ఇన్ని దీవెనలు, ఇంత సంతోషం మేము పొంది ఉండేవాళ్లం కాదు.

మాట్స్‌: ప్రతీ సందర్భంలో యెహోవా మీద ఆధారపడుతూ, నా తరఫున ఆయనెలా చర్య తీసుకుంటాడో చూడాలనే ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. (కీర్త. 37:5) నా విషయంలో ఆయన ఎప్పుడూ ఇచ్చిన మాటను తప్పలేదు. మియన్మార్‌లో ప్రస్తుతం మేము చేస్తున్న బెతెల్‌ నియామకంలో కూడా ఆ మాటలు ఎంత నిజమో కళ్లారా చూడగలుగుతున్నాను!

తమ పరిచర్యను విస్తృతం చేసుకోవాలని అనుకున్న చాలామంది యౌవనస్థులు మాలాగే యెహోవా విశ్వసనీయ ప్రేమను రుచి చూడాలని కోరుకుంటున్నాను. వాళ్లు ఎక్కడ నాటబడితే అక్కడ ఫలిస్తూ ఉండేలా యెహోవా సహాయం తీసుకుంటే, వాళ్లు ఖచ్చితంగా ఆ ప్రేమను చూస్తారనే నమ్మకం మాకుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి