మీకు తెలుసా?
మొదటి శతాబ్దంలో, జంతు బలుల్ని అర్పించినప్పుడు వచ్చిన రక్తాన్ని యాజకులు ఏం చేసేవాళ్లు?
ఒకప్పటి ఇశ్రాయేలులో ప్రతీ సంవత్సరం, యాజకులు ఆలయంలోని బలిపీఠం మీద వేలకొద్దీ జంతువుల్ని అర్పించేవాళ్లు. మొదటి శతాబ్దానికి చెందిన యూదా చరిత్రకారుడైన జోసిఫస్ చెప్పినదాని ప్రకారం, పస్కా పండుగ రోజు 2,50,000 కన్నా ఎక్కువ గొర్రె పిల్లల్ని బలిచ్చేవాళ్లు. దానివల్ల చాలా రక్తం బలిపీఠం మీద పారేది. (లేవీ. 1:10, 11; సంఖ్యా. 28:16, 19) మరి ఆ రక్తమంతా ఏమయ్యేది?
హేరోదు కట్టిన ఆలయంలో ఒక మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉందని సైంటిస్టులు కనుక్కున్నారు. ఈ ఆలయం క్రీ.శ. 70 లో నాశనమైంది. ఆలయంలో అర్పించిన జంతువుల రక్తమంతా ఆ కాలువల నుండే చక్కగా బయటికి వెళ్లేది.
ఆ డ్రైనేజీ వ్యవస్థకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి.
బలిపీఠం అడుగున రంధ్రాలు ఉండేవి: బలిపీఠం కోసం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ గురించి మిష్నాలో ఒక మంచి వివరణ ఉంది. మిష్నా అంటే ఒకప్పటి యూదుల నియమాలు, ఆచారాలు రాసివున్న ఒక పుస్తకం. దాన్ని క్రీ.శ. మూడో శతాబ్దం తొలినాళ్లలో రాశారు. ఆ పుస్తకం ఇలా చెప్తుంది: “బలిపీఠానికి ఒక మూల రెండు రంధ్రాలు ఉండేవి. జంతువుల్ని బలిచ్చినప్పుడు వచ్చిన రక్తం, బలిపీఠాన్ని కడిగినప్పుడు వచ్చిన నీళ్లు ఈ రంధ్రాల గుండా కిద్రోను లోయలోకి పారేవి.”
బలిపీఠం “రంధ్రాల” గురించి ఆ పుస్తకంలో రాసున్న దానికి, మన కాలంలోని సైంటిస్టులు కనిపెట్టిన దానికి పొంతన ఉంది. ది కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ జుడాయిజం అనే పుస్తకం కూడా, ఆలయం దగ్గర చక్కగా ఏర్పాటు చేసిన ఒక డ్రైనేజీ వ్యవస్థ ఉండేదని చెప్తుంది. “బహుశా జంతువుల్ని బలిచ్చినప్పుడు వచ్చిన రక్తం, బలిపీఠం కడగడానికి ఉపయోగించిన నీళ్లు ఈ కాలువల ద్వారానే బయటికి వెళ్లేవి.”
నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండేవి: యాజకులు బలిపీఠం అడుగుభాగాన్ని అలాగే డ్రైనేజీ కాలువల్ని శుభ్రంగా ఉంచడానికి చాలా నీళ్లు కావాల్సి వచ్చేది. అయితే నగరం నుండి వాగులు, పిల్లకాలువల ద్వారా ఆలయానికి నిరంతర నీటి సరఫరా ఉండేది. దానివల్లే యాజకులు ఈ ముఖ్యమైన పని చేయగలిగారు. పాతకాలం వాటిని పరిశోధన చేసే జోసెఫ్ ప్యాట్రిక్ ఇలా చెప్పాడు: “ఒక ఆలయానికి నిరంతరం మంచినీటి సరఫరా అలాగే డ్రైనేజీ వ్యవస్థ ఉండడం చాలా అరుదు. ఈ ఆలయానికి తప్ప, అప్పట్లో ఉన్న ఏ ఆలయానికీ ఈ ప్రత్యేకత లేదు.”