జీవిత కథ
“యుద్ధం యెహోవాది”
జనవరి 28, 2010. ఆరోజు నేను ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ అనే ఒక అందమైన పట్టణంలో ఉన్నాను. అయితే నేను అక్కడికి ఎంజాయ్ చేయడానికి వెళ్లలేదు. యూరోపియన్ మానవ హక్కుల కోర్టు (ECHR) ముందు యెహోవాసాక్షుల హక్కుల్ని సమర్థించడానికి వచ్చిన లీగల్ టీమ్‌లో నేనూ ఒకణ్ణి. ఫ్రాన్స్ ప్రభుత్వం అక్కడున్న యెహోవాసాక్షులు 640 లక్షల యూరోలు అంటే 582 కోట్ల, 48 లక్షల, 96 వేల రూపాయల టాక్స్ కట్టాలని ఆదేశించింది. అది చట్టవిరుద్ధమని నిరూపించడానికి అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా పేరు, ఆయన ప్రజల పేరు, ఆరాధన కోసం వాళ్లకున్న స్వేచ్ఛ కోసం పోరాడడానికి మేము అక్కడికి వెళ్లాం. ఆరోజు కోర్టులో జరిగినదాన్నిబట్టి “యుద్ధం యెహోవాది” అనే నమ్మకం మాకు మళ్లీ కలిగింది. (1 సమూ. 17:47) అలా ఎందుకు అన్నానో చెప్తాను.
ఇదంతా ఇప్పటిది కాదు. 1990లలో ఫ్రాన్స్ ప్రభుత్వం, మన బ్రాంచి కార్యాలయానికి 1993 నుండి 1996 మధ్య వచ్చిన విరాళాలకు భరించలేనంత టాక్స్ విధించింది. మేము న్యాయం కోసం ఫ్రాన్స్ కోర్టును ఆశ్రయించాం కానీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పీల్ కోర్టులో కూడా ఓడిపోవడంతో ప్రభుత్వం ఫ్రాన్స్ బ్రాంచ్ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న 45 లక్షల యూరోలు సీజ్ చేసింది. ఇక మాకు ECHR ఒక్కటే దిక్కు! అయితే, ECHR కేసును వినడానికి ముందు, ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారుల, కోర్టు అధికారుల సమక్షంలో ఒక సెటిల్‌మెంట్ కోసం హాజరవ్వమని చెప్పింది.
ఆ టాక్స్‌లో కొంత డబ్బయినా కట్టమని కోర్టు అధికారి మమ్మల్ని ఒత్తిడి చేస్తుందేమో అని మేము ఊహించాం. అయితే దాంట్లో ఒక్క యూరో మేము కట్టినా బైబిలు సూత్రాల్ని మీరినట్టే అని మాకు తెలుసు. ఎందుకంటే ఆ డబ్బంతా బ్రదర్స్‌సిస్టర్స్ రాజ్య పని కోసం ఇచ్చిన విరాళాలు. కాబట్టి వాళ్ల విరాళాల్లో ఒక్క పైసా కూడా ప్రభుత్వానిది కాదు. (మత్త. 22:21) అయినాసరే, కోర్టు పద్ధతుల్ని గౌరవించి మేము అక్కడికి వెళ్లాం.
2010 లో ECHR ముందు మా లీగల్ టీమ్
మేము ఆ కోర్టులో ఒక పెద్ద కాన్ఫరెన్స్ రూములో కలుసుకున్నాం. ఆ చర్చ అంత మంచిగా మొదలవ్వలేదు. యూరోపియన్ కోర్టు ప్రతినిధి వచ్చీరాగానే, యెహోవాసాక్షులు ఫ్రాన్స్ ప్రభుత్వం అడిగే టాక్స్‌లో కొంతైనా కట్టాల్సి ఉంటుంది అని తేల్చి చెప్పేసింది. అప్పుడు వెంటనే పవిత్రశక్తి ప్రేరణతో ఇలా అడిగాం: “ఇప్పటికే ప్రభుత్వం మా బ్యాంక్ అకౌంట్లో నుండి 45 లక్షల యూరోల్ని లాగేసుకుందని మీకు తెలుసా?”
ఆ మాట విని ఆ కోర్టు ప్రతినిధి అవాక్కయింది. ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆ విషయం ఒప్పుకునేసరికి మన కేసు విషయంలో ఆమె అభిప్రాయం పూర్తిగా మారింది. ఆమె వాళ్లను తిట్టి మీటింగ్‌ని అప్పటికప్పుడే ఆపేసింది. కేసు మనం గెలిచేలా యెహోవా విషయాల్ని తారుమారు చేశాడని మాకు అర్థమైంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము ఆశ్చర్యంతో, ఆనందంతో బయటికి వచ్చాం.
2011, జూన్ 30న ECHR ఏకగ్రీవంగా మనకు అనుకూలమైన ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకు మనకు విధించిన టాక్స్‌లన్నీ చట్టవిరుద్ధమని, ప్రభుత్వం లాగేసుకున్న డబ్బంతా వడ్డితోసహా తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం చరిత్రను తిరగరాసింది, ఫ్రాన్స్‌లో ఈరోజు వరకు కూడా స్వచ్ఛారాధనను కాపాడుతూ వచ్చింది. మేము అడుగుదాం అని అస్సలు సిద్ధపడని ఒక చిన్న ప్రశ్న, గొల్యాతును నేలమట్టం చేసిన చిన్న రాయి లాంటిది. అది ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పింది. మన విజయానికి కారణం, దావీదు గొల్యాతుతో అన్న ఈ మాటలే: “యుద్ధం యెహోవాది.”—1 సమూ. 17:45-47.
మనం కేసులు గెలిచింది ఈ ఒక్క సందర్భంలోనే కాదు. ఇప్పటివరకు ఎన్ని శక్తివంతమైన ప్రభుత్వాలు అడ్డుపడినా, మతాలు వ్యతిరేకించినా 70 వేర్వేరు దేశాల్లోని ఉన్నతమైన కోర్టుల్లో అలాగే ఎన్నో అంతర్జాతీయ కోర్టుల్లో మనం 1,225 కేసుల్ని గెలిచాం. ఈ చట్టపరమైన విజయాలన్నీ యెహోవాసాక్షులుగా మనకున్న మతపరమైన స్వేచ్ఛను, బహిరంగంగా పరిచర్య చేసే స్వేచ్ఛను, జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, రక్తాన్ని ఎక్కించుకోకపోవడం లాంటి ప్రాథమిక హక్కుల్ని కాపాడాయి.
అమెరికాలోని, న్యూయార్క్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్న నేను, ఆ కేసు విషయంలో అసలు యూరప్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్తాను వినండి.
మిషనరీల ఉత్సాహంతో ఊపిరి పోసుకున్నాను
మా నాన్న పేరు జార్జ్, అమ్మ పేరు లూసి. వాళ్లిద్దరూ 12వ గిలియడ్ తరగతికి హాజరయ్యారు. 1956 లో నేను పుట్టే సమయానికి వాళ్లు ఇతియోపియాలో సేవచేస్తున్నారు. వాళ్లు నాకు మొదటి శతాబ్దంలో ఉన్న సువార్తికుడైన ఫిలిప్పును చూసి, నాకు ఫిలిప్పు అనే పేరు పెట్టారు. (అపొ. 21:8) ఆ తర్వాతి సంవత్సరం అక్కడి ప్రభుత్వం మన ఆరాధనను నిషేధించింది. నాకు ఊహ తెలిసిన తర్వాత మేము మీటింగ్స్ కోసం రహస్యంగా కలుసుకోవడం నాకింకా గుర్తుంది. ఓ పిల్లాడిగా అదంతా నాకు చాలా సరదాగా అనిపించేది. కానీ బాధాకరంగా, 1960 లో మమ్మల్ని అధికారులు దేశం వదిలి వెళ్లమని చెప్పారు.
1959 లో ఇతియోపియాలోని ఆడిస్ అబాబాలో మా ఇంటికి వచ్చిన నేథన్ హెచ్. నార్ (పూర్తి ఎడమవైపు)
మా కుటుంబం అమెరికాలోని కన్సాస్‌లో ఉన్న విచిటాకు మారినప్పుడు మా అమ్మానాన్నలతోపాటు వాళ్ల మిషనరీ స్ఫూర్తిని కూడా తెచ్చుకున్నారు. వాళ్లు సత్యాన్ని శ్వాసగా చేసుకున్నారు. నాలో, మా అక్క జూలిలో, మా తమ్ముడు లెస్లీలో ఆధ్యాత్మిక విలువల్ని నాటారు. మేమందరం ఇతియోపియాలోనే పుట్టాం. నాకు 13 ఏళ్లున్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను. మూడేళ్ల తర్వాత అవసరం ఎక్కువున్న ప్రాంతమైన పెరూలోని, అరిక్విపాకు మారాం.
1974 లో నాకు 18 ఏళ్లున్నప్పుడు పెరూ బ్రాంచి నన్నూ, ఇంకో నలుగురు బ్రదర్స్‌ని ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. మేము అప్పటివరకు ప్రీచింగ్ అస్సలు చేయని ఎత్తయిన సెంట్రల్ యాండీస్ పర్వతాల్లో ప్రీచింగ్ చేయాలి. అందులో క్వెచువా, అయ్‌మారా ప్రజలు కూడా ఉన్నారు. మేము ఒక పెద్ద వ్యాన్‌ని ఇంటిలా మార్చుకున్నాం. దాన్నే మేము ముద్దుగా నోవహు ఓడ అని కూడా పిలిచేవాళ్లం. ఎందుకంటే అది ఒక డబ్బాలా ఉంటుంది. మేము అక్కడ ప్రీచింగ్ చేస్తున్నప్పుడు పేదరికాన్ని, జబ్బును, చావును యెహోవా తీసేస్తాడని లేఖనాలు చూపించి ప్రజలతో మాట్లాడడం నాకు ఇంకా గుర్తుంది. (ప్రక. 21:3, 4) అక్కడ చాలామంది సత్యం తెలుసుకుని యెహోవాసాక్షులయ్యారు.
1974, మా “నోవహు ఓడ”
ప్రపంచ ప్రధాన కార్యాలయానికి
1977 లో పరిపాలక సభ సభ్యుడైన ఆల్బర్ట్ ష్రోడర్ పెరూకు వచ్చాడు. ప్రపంచ ప్రధాన కార్యాలయంలో బెతెల్ సేవకు అప్లయి చేయమని నన్ను ప్రోత్సహించాడు. ఆయన చెప్పినట్టే నేను అప్లయి చేశాను. ఆ తర్వాత నాకు బెతెల్‌కి ఆహ్వానం వచ్చింది. 1977, జూన్ 17 నుండి నేను బ్రూక్లిన్ బెతెల్‌లో సేవచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాతి నాలుగు సంవత్సరాల్లో నేను క్లీనింగ్ అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్‌లలో పనిచేశాను.
1979 లో మా పెళ్లి రోజు
1978, జూన్‌లో నేను లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఎలిసబెత్ యావల్లోన్‌ని కలిశాను. నాలాగే ఆమె కూడా చిన్నప్పటి నుండి సత్యంలో పెరిగింది. వాళ్ల అమ్మానాన్నలు కూడా మా అమ్మానాన్నల్లాగే సత్యమే జీవితంగా బ్రతికారు. ఎలిసబెత్ అప్పటికే నాలుగు సంవత్సరాల నుండి క్రమపయినీరుగా సేవచేస్తూ ఉంది. ఆమెకు పూర్తికాల సేవ అంటే ప్రాణం. ఆ తర్వాత కాలంగడిచే కొద్దీ, మేము ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. మా స్నేహం కాస్త ప్రేమగా మారి 1979, అక్టోబరు 20న పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి బెతెల్ సేవ మొదలుపెట్టాం.
పెళ్లి తర్వాత మేము వెళ్లిన మొట్టమొదటి సంఘం, బ్రూక్లిన్ స్పానిష్ సంఘం. వాళ్లు మా మీద చాలా ప్రేమ కురిపించారు. ఆ తర్వాత మేము ఇంకో మూడు సంఘాల్లో కూడా సేవచేశాం. వాళ్లు కూడా మా బెతెల్ సేవకు ఎంతో మద్దతిచ్చారు. వాళ్లు, మా స్నేహితులు, కుటుంబం మా వెన్నంటే ఉంటూ వృద్ధులైన మా అమ్మానాన్నల్ని చూసుకోవడానికి ఎంతో సహాయం చేశారు.
1986 లో బ్రూక్లిన్ స్పానిష్ సంఘంలో ఉన్న బెతెలైట్లు
చట్టానికి చుట్టం అయ్యాను
ఆశ్చర్యకరంగా 1982, జనవరిలో నన్ను లీగల్ డిపార్ట్‌మెంట్‌కి నియమించారు. మూడు సంవత్సరాల తర్వాత నన్ను లాయర్ అవ్వడానికి లా కోర్సు చేయమని చెప్పారు. ఆ కోర్సు చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, యెహోవాసాక్షులు గెలిచిన కేసుల వల్లే అమెరికాలో అలాగే వేరే దేశాల్లో చాలాచోట్ల ప్రజలకు కొన్ని ప్రాథమిక హక్కులు వచ్చాయి. ఈ కేసుల గురించి మేము మా కోర్సులో చాలా వివరంగా చదివాం.
1986 లో నాకు 30 ఏళ్లున్నప్పుడు నన్ను లీగల్ డిపార్ట్‌మెంట్‌కి ఓవర్సీయర్‌గా నియమించారు. నాకంత అనుభవంలేదు, ముందుముందు ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఒకవైపు పెద్ద బాధ్యత అనిపిస్తూనే, ఇంకోవైపు చాలా భయమేసింది.
1988 లో నేను లాయర్ అయ్యాను. కానీ అది నా ఆధ్యాత్మికతను ఎంత దెబ్బ తీస్తుందో నేను గుర్తించలేకపోయాను. ఉన్నతవిద్య ‘మనమే గొప్ప’ అనే ఆలోచనను పెంచిపోషిస్తుంది. అలాగే ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉంటే, మనలాంటి నైపుణ్యంలేని వాళ్లను చిన్నచూపు చూసే ముప్పు ఉంది. నేను మళ్లీ కోలుకోవడానికి నా భార్య ఎలిసబెత్ నాకు సహాయం చేసింది. నేను లాయర్ అవ్వకముందు ఉన్న నా ఆధ్యాత్మిక అలవాట్లను తిరిగి మొదలుపెట్టేలా ఆమె సహాయం చేసింది. దానికి కాస్త సమయం పట్టింది. కానీ మెల్లిమెల్లిగా ఒక్కో మెట్టు ఆధ్యాత్మికంగా కోలుకున్నాను. నా అనుభవంతో నేను చెప్పేదేంటంటే, జీవితానికి నిజమైన విలువ తెచ్చేది తెలివితేటలు కాదుగానీ యెహోవాతో ఉన్న స్నేహం, ఆయన మీద అలాగే ఆయన ప్రజల మీదున్న ప్రేమే!
మంచివార్త తరఫున వాదించడానికి, చట్టబద్ధమైన హక్కును సంపాదించడానికి చేసిన పోరాటం
ఇప్పుడు నేను లాయర్ అయ్యాను కాబట్టి, బెతెల్‌లో చట్టపరమైన విషయాల్ని చూసుకోవడం, కోర్టులో రాజ్య సంబంధమైన పనుల తరఫున వాదించడం నా పని. శరవేగంతో దూసుకెళ్తున్న సంస్థకు మద్దతివ్వడం చాలా ఆసక్తిగా ఉంది, ఇంకోపక్క కష్టంగా కూడా ఉంది. ఉదాహరణకు, ఒకప్పుడు మన ప్రచురణలు ఇస్తున్నప్పుడు విరాళాల్ని అడిగేవాళ్లం. కానీ 1991 నుండి అలా విరాళాలు అడగకూడదని సంస్థ నిర్దేశించింది. అయితే, ఆ విషయంలో ఏం చేస్తే బాగుంటుందని లీగల్ డిపార్ట్‌మెంట్‌ని సంస్థ అడిగింది. ఇక ఆ తర్వాత నుండి యెహోవాసాక్షులు ప్రచురణల్ని ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టారు. దీనివల్ల బెతెల్‌లో అలాగే క్షేత్రంలో జరిగే పని చాలావరకు తేలికైంది. అంతేకాదు, సంస్థకు అనవసరమైన టాక్స్ భారం పడకుండా ఆపింది. అయితే, కొంతమంది ఈ మార్పు వల్ల మన వనరులు తగ్గిపోతాయని, పరిచర్య కుంటుపడుతుందని అనుకున్నారు. కానీ ఇంకా రెట్టింపు అయ్యింది. 1990 నుండి యెహోవాను ఆరాధించే ప్రజల సంఖ్య ఊహకందనంత పెరిగింది. ఇప్పుడు ప్రాణాల్ని కాపాడే ఆధ్యాత్మిక ఆహారం అందరూ ఉచితంగా తీసుకోగలుగుతున్నారు. ఇవి అలాగే ఇంకెన్నో సంస్థాపరమైన మార్పులు చక్కగా అమలయ్యాయంటే, కేవలం యెహోవా ఇచ్చే సహాయం, నమ్మకమైన దాసుని ద్వారా ఆయనిచ్చే నిర్దేశం వల్లే అని నేను కళ్లారా చూడగలిగాను.—నిర్గ. 15:2; మత్త. 24:45.
చట్టపరమైన విజయాలన్నీ కోర్టులో చక్కగా వాదిస్తే మాత్రమే వచ్చినవి కావు. ఎక్కువశాతం అధికారులు యెహోవా ప్రజల మంచి ప్రవర్తన చూసి కదిలించబడతారు. దానికొక ఉదాహరణ 1998 లో జరిగిన ఒక సమావేశంలో చూశాను. క్యూబాలో జరిగిన సమావేశానికి ముగ్గురు పరిపాలక సభ సభ్యులు, వాళ్ల భార్యలు వచ్చారు. అయితే మనం రాజకీయాల్లో తలదూర్చమని అధికారుల్ని కూర్చోబెట్టి ఎంతసేపు వివరించినా అర్థం అవ్వని విషయం, వాళ్లు నేరుగా వచ్చి పరిపాలకసభ సభ్యులు ఎంత దయగా, గౌరవపూర్వకంగా మాట్లాడారో చూసిన తర్వాత అర్థమైంది.
అయితే, కొన్ని చట్టపరమైన విషయాల్ని సామరస్యంగా పరిష్కరించుకోలేకపోతే మంచివార్త తరఫున అలాగే ‘ప్రకటించడానికి చట్టబద్ధమైన హక్కును సంపాదించుకోవడానికి’ కోర్టులో వాదించాల్సి రావచ్చు. (ఫిలి. 1:7) ఉదాహరణకు యూరప్‌లో, సౌత్ కొరియాలో మన బ్రదర్స్ ఆర్మీలో చేరకుండా ఉండే హక్కును అధికారులు దశాబ్దాలపాటు ఒప్పుకోలేదు. దానివల్ల, యూరప్‌లో 18,000 మంది బ్రదర్స్, సౌత్ కొరియాలో 19,000 కన్నా ఎక్కువమంది బ్రదర్స్ జైల్లో ఉండాల్సి వచ్చింది.
ఆఖరికి 2011, జూలై 7న ECHR బయాట్యాన్ vs అర్మేనియాకు సంబంధించిన కేసులో చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం యూరప్ అంతటా ఎవరైతే ఆర్మీ కాకుండా వేరే సేవ చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఆ అవకాశం ఇవ్వడం తప్పనిసరి అని కోర్టు తేల్చి చెప్పింది. సౌత్ కొరియన్ కాంస్టిస్ట్యూషనల్ కోర్టు కూడా 2018, జూన్ 28న అలాంటి నిర్ణయమే తీసుకుంది. మన యౌవన సహోదరుల్లో ఒకరిద్దరు రాజీపడినా, చరిత్రలో నిలిచిపోయే ఈ విజయం సాధ్యమై ఉండేదికాదు!
ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అలాగే వేర్వేరు బ్రాంచీలలో ఉన్న లీగల్ డిపార్ట్‌మెంట్లు, ఆరాధన కోసం మనకున్న హక్కును అలాగే ప్రీచింగ్ చేయడానికి మనకున్న స్వేచ్ఛను సమర్థించే పనిలో రాత్రీపగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. అధికారుల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్న బ్రదర్స్‌సిస్టర్స్ తరఫున నిలబడడం మాకు దొరికిన గొప్ప గౌరవం. కోర్టులో మనం గెలిచినా గెలవకపోయినా మన కేసుల వల్ల అధికారులకు, రాజులకు, దేశాలకు గొప్ప సాక్ష్యం ఇస్తాం. (మత్త. 10:18) జడ్జీలు, ప్రభుత్వ అధికారులు, మీడియా, ప్రజలు వీళ్లందరూ మనం కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో, మన వాదనలో ఉపయోగించిన లేఖనాల్ని చూస్తారు, వింటారు. వాటివల్ల యెహోవాసాక్షులు ఎవరో, వాళ్ల నమ్మకాలు దేని ఆధారంగా ఉన్నాయో మంచి మనసున్నవాళ్లు తెలుసుకోగలుగుతారు. అందులో కొంతమంది యెహోవాసాక్షులుగా కూడా మారారు.
థాంక్యూ యెహోవా!
గడిచిన 40 సంవత్సరాల్లో చట్టపరమైన విషయాల్లో వేర్వేరు బ్రాంచీలతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం నాకు దొరికింది. అలాగే ఎన్నో హైకోర్టుల్లో, పెద్దపెద్ద అధికారుల ముందు మన తరఫున మాట్లాడి, వాదించే అవకాశం దొరికింది. ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఉన్న లీగల్ డిపార్ట్‌మెంట్‌లో నాతో కలిసి పనిచేసేవాళ్లన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాళ్లన్నా నాకెంతో ఇష్టం, అభిమానం. యెహోవా నా జీవితాన్ని చాలా దీవించాడు. నా జీవితం చాలా సంతృప్తిగా ఉంది.
గత 45 సంవత్సరాలుగా నా కష్టసుఖాల్లో ఎలిసబెత్ నన్ను ఎంతో ప్రేమించి, నాకు నమ్మకంగా మద్దతిచ్చింది. ఆమె ఆరోగ్యం అంతంతమాత్రమైనా ఆమె నాకిచ్చే మద్దతుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.
మన విజయాలకు, మన బలానికి కారణం మన సొంత తెలివితేటలు కాదు. దావీదు చెప్పినట్టు, “యెహోవా తన ప్రజలకు బలం” అని నేను కళ్లారా చూశాను. (కీర్త. 28:8) అవును, “యుద్ధం యెహోవాది.”