పాఠకుల ప్రశ్నలు
సౌలు సైనికులు మాంసంతో పాటు రక్తాన్ని కూడా తిన్నప్పుడు, దేవుని నియమం ప్రకారం వారు చంపబడాలి గానీ, వారెందుకు చంపబడలేదు?
ఈ మనుష్యులు రక్తం విషయంలో దేవుని నియమాన్ని ఉల్లంఘించారన్నది నిజమే, అయితే వారికి రక్తం యెడల గౌరవం ఉంది గనుక, అటువంటి గౌరవాన్ని చూపడంలో మరింత కృషిచేయాల్సి ఉన్నప్పటికి వారికి కనికరం చూపబడింది.
అక్కడి పరిస్థితిని పరిశీలించండి. రాజైన సౌలు, అతని కుమారుడైన యోనాతాను ఆధ్వర్యంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. “ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిన” ఆ సమయంలో, తమ శత్రువులను జయించక ముందు తమ మనుష్యులు భోజనం చేయకూడదనే ఒక ప్రమాణాన్ని సౌలు తొందరపాటుతో చేయించాడు. (1 సమూయేలు 14:24) ఆయన చేసిన ఈ ప్రమాణం వెంటనే సమస్యలను తెచ్చిపెట్టింది.
అతని మనుష్యులు అతి భీకర పోరాటంలో గెలుపునొందుతున్నారు, అయితే ఈ శ్రమకర ప్రయత్నం హానికర ప్రభావాలను కనపర్చింది. వారు కడుపును పిండి చేసే ఆకలితో ఉన్నారు, పూర్తిగా అలసిపోయారు. వారా తీవ్ర పరిస్థితిలో ఏం చేశారు? “జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱెలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించిరి.”—1 సమూయేలు 14:32.
“జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారు,” అని కొందరు సౌలుతో చెప్పినట్లుగా అది రక్తం యెడల దేవుడేర్పర్చిన నియమాన్ని ఉల్లంఘించడమే. (1 సమూయేలు 14:33) అవును, జంతువులు వధించబడినప్పుడు వాటి మాంసం తినడానికి ముందు వాటి రక్తము నేల మీద ఒలికించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రక్తాన్ని ఒలికించడానికి విపరీత ధోరణిని అవలంభించాలని దేవుడు కోరలేదు. రక్తం ఒలికించడానికి తగిన చర్యలు గైకొంటే, తన సేవకులు రక్తం యొక్క ప్రాముఖ్యతకు గౌరవాన్ని చూపినవారౌతారు. (ద్వితీయోపదేశకాండము 12:15, 16, 21-25) జంతు రక్తం బలి కొరకు బలిపీఠంపై అర్పించవచ్చు కానీ దాన్ని తినకూడదు. ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పిపోవడం మరణ శిక్షకు పాత్రమైందే, కారణం దేవుని ప్రజలకు యిలా చెప్పబడింది: “రక్తము దేహమునకు ప్రాణము . . . కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదు.”—లేవీయకాండము 17:10-14.
రాజైన సౌలు సైనికులు ఈ నియమాన్ని ఉద్దేశపూర్వకంగా అతిక్రమించారా? రక్తంపైగల దైవిక నియమానికి వారు పూర్తి అగౌరవాన్ని ప్రదర్శించారా?—సంఖ్యాకాండము 15:30 పోల్చండి.
మనం అలా నిర్ణయించ నవసరం లేదు. ‘జంతువులను నేలమీద వధించి రక్తముతోనే భక్షించిరి’ అని వృత్తాంతం తెలియజేస్తోంది. కాబట్టి వారు రక్తం ఒలికించడానికి కొంత ప్రయత్నం చేస్తుండవచ్చు. (ద్వితీయోపదేశకాండము 15:23) అయితే, అలసిపోయి ఆకలిగొన్న ఆ పరిస్థితుల్లో చంపబడిన శవాలను పైన కట్టేసి రక్తం సహజంగా ఒలకడానికి అవసరమైనంత సమయాన్ని వారు అనుమతించలేదు. వారు గొర్రెలనూ ఎడ్లను “నేలమీద” చంపారు, అది రక్తం పారే గమనాన్ని తగ్గిస్తుంది. రక్తంలో ఉన్న శవాల నుండి మాంసాన్ని వారు త్వరగా కోసి ఉండవచ్చు. కాబట్టి, దేవుని నియమం వారి మనస్సులో ఉన్నప్పటికి దాన్ని సరైన పద్ధతిలోగాని లేక కావల్సినంత మేరకు అమలుపర్చలేదు.
ఫలితంగా “జనులు రక్తముతోనే తినిరి,” అది పాపము. సౌలు దీన్ని గ్రహించి ఓ పెద్ద బండ తన దగ్గరకు తీసుకు రాబడాలని ఆజ్ఞాపించాడు. తన సేవకులకు ఆయన యిలా ఆజ్ఞాపించాడు: “అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱెలను నాయొద్దకు తీసికొని వచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడి.” (1 సమూయేలు 14:33, 34) పాపం చేసిన సైనికులు లోబడ్డారు, అప్పుడు “సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను.”—1 సమూయేలు 14:35.
రాతి మీద జంతువులను వధించడం అవసరమైనంతమేరకు రక్తాన్ని ఒలికిస్తుంది. వధించడం జరిగిన చోటనుండి దూరంగా తీసుకుపోబడి జంతువుల మాంసం భక్షించబడుతుంది. ఒలికిన కొంత రక్తాన్ని పాపం చేసినవారి పక్షంలో దేవుని దయను పొందడానికి సౌలు దాన్ని బలిపీఠంపై ఉపయోగించి ఉండవచ్చు. యెహోవా కనికరం కనుపర్చాడు, బహుశ సైనికులు అలసిపోయి ఆకలిగొని వున్నప్పటికి వారు చేసిన ప్రయత్నం ఆయనకు తెలుసు. సౌలు చేసిన కఠినమైన ప్రమాణం వారిని గత్యంతరంలేని ఈ పరిస్థితికి నడిపిందనే విషయాన్ని దేవుడు పరిగణలోకి తీసుకొని ఉండవచ్చును.
అయితే ఈ వృత్తాంతం, అత్యవసర పరిస్థితుల్లో దైవిక నియమాలను త్రోసిపుచ్చవచ్చు అనడానికి ఓ సాకుకాదు. మనం ఓ ప్రమాణం చేస్తే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేయాలని చూపడానికి కూడా అది మనకు సహాయం చేస్తుంది, ఎందుకంటే, తొందరపడి చేసిన ప్రమాణాలు వ్యక్తిగతంగానూ యితరులకు సమస్యలను తేగలవు.—ప్రసంగి 5:4-6.