కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 జూన్‌ పేజీలు 14-19
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంతం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు
  • యెహోవా ఖచ్చితంగా ఎలా సహాయం చేస్తాడో మనకు తెలీదు
  • రేపు ఏమవుతుందో మనకు తెలీదు
  • యెహోవాకు మనగురించి ఎంతబాగా తెలుసో మనం అంచనా కూడా వేయలేం
  • యెహోవా గురించి తెలుసుకుంటూనే ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • యెహోవా “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 జూన్‌ పేజీలు 14-19

అధ్యయన ఆర్టికల్‌ 26

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి

“సర్వశక్తిమంతుణ్ణి అర్థంచేసుకోవడం మన శక్తికి మించింది.”—యోబు 37:23.

ముఖ్యాంశం

కష్టాల్ని తట్టుకోవాలంటే మనకు కొన్ని విషయాలు తెలియవని వినయంగా ఒప్పుకోవాలి. తెలిసిన వాటిమీద మనసు పెట్టాలి. యెహోవా మీద నమ్మకం ఉంచాలి.

1. యెహోవా మనల్ని ఏ సామర్థ్యాలతో సృష్టించాడు? ఎందుకు?

యెహోవా మనల్ని అద్భుతంగా సృష్టించాడు. మనకు ఆలోచించే, అర్థంచేసుకునే, నేర్చుకునే, పాటించే సామర్థ్యాల్ని ఇచ్చాడు. ఎందుకు? ఎందుకంటే, “దేవుని గురించిన జ్ఞానం” సంపాదించుకొని, గుడ్డిగా కాకుండా ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి, తనను ఆరాధించాలని అలా తయారు చేశాడు.—సామె. 2:1-5; రోమా. 12:1.

2. (ఎ) మనం అన్నీ తెలుసుకోగలమా? (యోబు 37:23, 24) (చిత్రం కూడా చూడండి.) (బి) ఆ విషయాన్ని ఒప్పుకోవడం మనకే ఎందుకు మంచిది?

2 మనం బోలెడన్ని విషయాలు నేర్చుకునేలా యెహోవా మనల్ని తయారు చేశాడు. కానీ మనం అన్నీ తెలుసుకోలేకపోవచ్చు. (యోబు 37:23, 24 చదవండి.) యోబు గురించి ఆలోచించండి. యెహోవా ఆయన్ని చాలా ప్రశ్నలు అడిగాడు. ఆ తర్వాత, తనకు తెలిసింది గోరంత, తెలియనిది కొండంత అని యోబు అర్థంచేసుకున్నాడు. అప్పుడు, వినయం చూపించి తన ఆలోచనను సరిచేసుకున్నాడు. (యోబు 42:3-6) మనం కూడా మనకు అన్నీ తెలియవని వినయంగా ఒప్పుకుంటే మనకే మంచిది. అలా వినయం చూపిస్తే మనకు ఎప్పుడు, ఏది అవసరమో అది యెహోవాకు తెలుసనీ, సరైన సమయంలో వాటిని మనకు చెప్తాడనీ నమ్ముతాం. దాన్నిబట్టి తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం.—సామె. 2:6.

యెహోవా యోబుతో మాట్లాడుతున్నప్పుడు ఒక వెలుగు మేఘాల్ని చీల్చుకుంటూ వచ్చింది. ఎలీహు అలాగే ముగ్గురు కపట స్నేహితులు పక్కనే ఉండి గమనిస్తున్నారు.

యోబులాగే మనం కూడా తెలియనివి తెలీదని ఒప్పుకోవడం మంచిది (2వ పేరా చూడండి)


3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 మనకు తెలియని కొన్ని విషయాల గురించి, అలా తెలియకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అంతేకాదు, కొన్ని విషయాలు తెలియకపోవడం ఎందుకు మంచిదో కూడా చూస్తాం. దానివల్ల, “పరిపూర్ణ జ్ఞానంగల” యెహోవా ఏది, ఎప్పుడు అవసరమో అప్పుడే మనకు చెప్తాడనే నమ్మకాన్ని పెంచుకోగలుగుతాం.—యోబు 37:16.

అంతం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు

4. మత్తయి 24:36 ప్రకారం మనకు తెలియనిది ఏంటి?

4 మత్తయి 24:36 చదవండి. ఈ చెడ్డ లోకం ఎప్పుడు అంతం అవుతుందో మనకు తెలీదు. ఆఖరికి భూమ్మీద ఉన్నప్పుడు యేసుకు కూడా “ఆ రోజు గురించి, ఆ గంట గురించి” తెలీదు.a యెహోవా అన్నిటిని కరెక్ట్‌ టైమ్‌కి చేస్తాడు. ఏది, ఎప్పుడు, ఎలా జరగాలో నిర్ణయించే “అధికారం” యెహోవాకు ఉందని యేసు తన శిష్యులకు చెప్పాడు. (అపొ. 1:6, 7) కాబట్టి, యెహోవా ఈ వ్యవస్థ అంతానికి కూడా ఒక టైమ్‌ ఫిక్స్‌ చేశాడు. కానీ ఆ టైమ్‌ ఎప్పుడో మనం తెలుసుకోలేం.

5. అంతం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం వల్ల మనకు ఏం అనిపించవచ్చు?

5 యేసు చెప్పినదాన్నిబట్టి అంతం కోసం ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలో మనకు తెలీదు. దానివల్ల ‘యెహోవా రోజు’ కోసం ఎదురు చూసీచూసీ కొంతమందికి ఓపిక నశించిపోవచ్చు. లేదా కుటుంబసభ్యుల నుండి, ఇతరుల నుండి వ్యతిరేకత ఎదుర్కొనేవాళ్లు డీలా పడిపోవచ్చు. (2 పేతు. 3:3, 4) ఒకవేళ అంతం ఎప్పుడు వస్తుందో కరెక్ట్‌ డేట్‌ తెలిస్తే ఇంకొంచెం ఓపిగ్గా ఉంటాం, ఎగతాళిని ఈజీగా తట్టుకుంటాం అని అనిపించవచ్చు.

6. అంతం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం ఎందుకు మనకే మంచిది?

6 నిజానికి అంతం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం మనకే మంచిది! దానివల్ల మనం స్వార్థంతో కాకుండా ప్రేమతో, నమ్మకంతో యెహోవాను ఆరాధిస్తున్నామని చూపించే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ మనకు ఆ డేట్‌ తెలిస్తే, యెహోవాను ఫలానా తేదీ వరకే ఆరాధిస్తాం అన్నట్టు లేదా మన విశ్వాసం ఫలానా తేదీ వరకే చూపిస్తాం అన్నట్టు ఉంటుంది. కానీ మనం యెహోవాను ఎప్పటికీ ఆరాధించాలని కోరుకుంటాం. కాబట్టి “యెహోవా రోజు” ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చునే బదులు, ఆ రోజు వస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించాలి. అలాచేస్తే యెహోవాకు దగ్గరౌతాం, ఆయన మనసు గెలుచుకోవడానికి చేయాల్సినదంతా చేస్తాం.—2 పేతు. 3:11, 12.

7. మనకు ఏం తెలుసు?

7 మనకు తెలిసిన విషయాల గురించి ఆలోచించడం మంచిది. ఇంతకీ మనకు ఏం తెలుసు? 1914 లో చివరి రోజులు మొదలయ్యాయి అని మనకు తెలుసు. ఖచ్చితంగా ఆ సంవత్సరంలోనే మొదలయ్యాయి అని చెప్పడానికి యెహోవా చాలా ప్రవచనాల్ని బైబిల్లో రాయించాడు. అంతేకాదు, ఆ తర్వాత నుండి లోకంలోని పరిస్థితులు ఎలా మారుతూ వచ్చాయో చెప్పడానికి ఎన్నో వివరాలు ఇచ్చాడు. అవన్నీ నిజమయ్యాయి కాబట్టి “యెహోవా మహారోజు దగ్గరపడింది!” అని మనం గట్టిగా నమ్ముతున్నాం. (జెఫ. 1:14) అంతేకాదు, యెహోవా మనకు ఒక పని ఇచ్చాడని కూడా తెలుసు. అదేంటంటే, వీలైనంత ఎక్కువమందికి ఈ “రాజ్య సువార్త” ప్రకటించే పని. (మత్త. 24:14) మనం ఈ పనిని దాదాపు 240 దేశాల్లో, 1000 కంటే ఎక్కువ భాషల్లో చేస్తున్నాం. కాబట్టి ఈ ముఖ్యమైన పనిని ఉత్సాహంగా చేయడానికి “ఆ రోజు గురించి, ఆ గంట గురించి” తెలిసి ఉండాల్సిన అవసరం మనకు లేదు.

యెహోవా ఖచ్చితంగా ఎలా సహాయం చేస్తాడో మనకు తెలీదు

8. “సత్యదేవుని పని” అంటే ఏంటి? (ప్రసంగి 11:5)

8 అన్నిసార్లు “సత్యదేవుడు” చేసే పనులు మనకు తెలీదు. (ప్రసంగి 11:5 చదవండి.) ఇక్కడ “సత్యదేవుని పని” అంటే తన ఇష్టం నెరవేర్చడానికి యెహోవా ఏం జరిగేలా అనుమతిస్తాడనే దానిగురించి చెప్తుంది. యెహోవా కొన్ని సంఘటనల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో మనం తెలుసుకోలేం. ఆయన మనకు ఖచ్చితంగా ఎలా సహాయం చేస్తాడో కూడా తెలుసుకోలేం. (కీర్త. 37:5) ఉదాహరణకు, ఒక తల్లి కడుపులో బిడ్డ ఎలా ఎదుగుతాడో ఎవ్వరికీ అర్థం కాదు. ఆఖరికి సైంటిస్టులు కూడా దాన్ని ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే యెహోవా పనుల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం మనవల్ల కాని పని.

9. యెహోవా మనకు ఖచ్చితంగా ఎలా సహాయం చేస్తాడో తెలియకపోవడం వల్ల మనకు ఎలా అనిపించవచ్చు?

9 మనకు యెహోవా ఖచ్చితంగా ఎలా సహాయం చేస్తాడో తెలియకపోవడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడుతుంటాం. ఉదాహరణకు, మనకు పరిచర్య ఎక్కువ చేయాలనే కోరిక ఉన్నా సింపుల్‌గా జీవిస్తూ, అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లడానికి తటపటాయిస్తుంటాం. లేదా మనం పెట్టుకున్న లక్ష్యాలు చేరుకోలేనప్పుడు; ఎంత ప్రీచింగ్‌ చేసినా ఒక్క స్టడీ కూడా దొరకనప్పుడు; ఎంత వెదికినా రాజ్యమందిరం కోసం స్థలం దొరకనప్పుడు, అసలు యెహోవా ఆమోదం మనకు ఉందా లేదా అనే అనుమానం రావచ్చు.

10. యెహోవా మనకు ఖచ్చితంగా ఎలా సహాయం చేస్తాడో తెలియకపోవడం వల్ల ఏ లక్షణాలు చూపిస్తాం?

10 యెహోవా మనకు ఖచ్చితంగా ఎలా సహాయం చేస్తాడో తెలియకపోవడం మనకే మంచిది. దానివల్ల వినయం, అణుకువ లాంటి లక్షణాలను చూపించడం నేర్చుకుంటాం. అప్పుడు మన ఆలోచనల కన్నా యెహోవా ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయని, మన మార్గాల కన్నా ఆయన మార్గాలు ఎత్తుగా ఉన్నాయని అర్థం చేసుకుంటాం. (యెష. 55:8, 9) అన్నిటినీ యెహోవాయే చూసుకుంటాడనే నమ్మకంతో ఆయన మీద పూర్తిగా ఆధారపడతాం. పరిచర్య లేదా నిర్మాణ పనులు బాగా జరిగినప్పుడు ఆ ఘనతంతా యెహోవాకే ఇస్తాం. (కీర్త. 127:1; 1 కొరిం. 3:7) కొన్నిసార్లు అంతా మనం అనుకున్నట్టు జరగకపోయినా, పరిస్థితులన్నీ యెహోవా చేతిలో ఉన్నాయని గుర్తుపెట్టుకుంటాం. (యెష. 26:12) మనవంతు మనం చేసినప్పుడు, యెహోవా వంతు యెహోవా చేస్తాడనే నమ్మకంతో ఉంటాం. అలాగే ఒకప్పటిలా అద్భుతాలు చేయకపోయినా, ఆయన మనకు కావాల్సిన నిర్దేశాలు ఇస్తాడనే భరోసాతో ఉంటాం.—అపొ. 16:6-10.

11. మనకు ఏ విషయాలు తెలుసు?

11 యెహోవాకు ప్రేమ, న్యాయం, తెలివి ఉన్నాయని మనకు తెలుసు. అలాగే మనం యెహోవా కోసం, తోటి బ్రదర్‌సిస్టర్స్‌ కోసం ఏం చేసినా, ఆయన దాన్ని విలువైనదిగా చూస్తాడని తెలుసు. అంతేకాదు, తనకు నమ్మకంగా ఉండేవాళ్లకు యెహోవా ఎప్పుడూ ప్రతిఫలం ఇస్తాడని కూడా మనకు తెలుసు. కాబట్టి మనకు తెలిసిన ఈ విషయాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉందాం.—హెబ్రీ. 11:6.

రేపు ఏమవుతుందో మనకు తెలీదు

12. యాకోబు 4:13, 14 లో ఉన్నట్టు మన ఏ విషయం తెలీదు?

12 యాకోబు 4:13, 14 చదవండి. వాస్తవానికి, రేపన్న రోజు ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఎప్పుడూ ఊహించని, మన చేతుల్లో లేని ఎన్నో “సంఘటనలు” మనకు ఎదురవ్వవచ్చు. (ప్రసం. 9:11) దానివల్ల భవిష్యత్తులో మనం చేయాలనుకుంటున్నది చేస్తామో లేదో, అవి చేసేంతవరకు అసలు బ్రతికుంటామో లేదో కూడా మనకు తెలీదు.

13. రేపు ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల మనకు ఎలా అనిపిస్తుంది?

13 రేపన్న రోజు ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల, కష్టమైన పరిస్థితుల్ని తట్టుకోలేం. ఉదాహరణకు, రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఈరోజు ఉన్న ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు, ప్రశాంతమైన మన జీవితంలో పిడుగు లాంటి వార్తలు వినాల్సి రావచ్చు. లేదా అనుకోకుండా మన పరిస్థితులు తలకిందులు అవ్వొచ్చు. అప్పుడు గుండె బద్దలైనట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు చిరాకుగా కూడా అనిపిస్తుంది. అంతేకాదు, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగన్నప్పుడు నవ్వాలో-ఏడ్వాలో కూడా తెలీదు. ధైర్యం చేసి ఇంకో పని చేయాలన్నా భయమేస్తుంది.—సామె. 13:12.

14. మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? (చిత్రాలు కూడా చూడండి.)

14 రేపు ఏం జరుగుతుందో తెలియకపోవడం ఒక రకంగా మనకే మంచిది. ఎందుకంటే, అలా తెలియకపోవడం వల్ల, మనం యెహోవాను స్వార్థంతో కాదుగానీ ఆయన మీద ప్రేమతోనే ఆరాధిస్తున్నామని నిరూపించే అవకాశం ఉంటుంది. బైబిలు ఉదాహరణలు చూస్తే రెండు విషయాలు అర్థం అవుతాయి. ఒకటి, మనకొచ్చే ప్రతీ కష్టం నుండి యెహోవా కాపాడతాడని మనం ఆశించకూడదు. రెండు, మన జీవితంలో ఏం జరగాలో ఆయన ముందే రాసిపెట్టడు. అయితే, రేపు ఏం జరుగుతుందో తెలిస్తేనే కాదు యెహోవా మాట వింటూ, ఆయన చెప్పిన దారిలో నడిచినప్పుడే సంతోషంగా ఉంటాం. (యిర్మీ. 10:23) కాబట్టి మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు రేపటి గురించి అతిగా ఆలోచించకుండా, ఒక రకంగా ఇలా చెప్తాం: “యెహోవాకు ఇష్టమైతే మనం ప్రాణాలతో ఉండి అదో ఇదో చేద్దాం.”—యాకో. 4:15.

చిత్రాలు: 1. గో బ్యాగ్‌ని సర్దుకుంటున్న తండ్రీకొడుకులు. అత్యవసరమైన వస్తువులతోపాటు బైబిల్ని కూడా బ్యాగ్‌లో పెట్టుకుంటున్నారు. 2. కుండపోత వర్షం పడుతున్నప్పుడు వాళ్ల కుటుంబం ఒక టెంట్‌లో తల దాచుకుంటున్నారు. గో బ్యాగ్‌లో తెచ్చుకున్నవి వాళ్లకు పనికొచ్చాయి.

యెహోవా నిర్దేశాలు పాటిస్తే మన ప్రాణాల్ని కాపాడుకుంటాం (14-15 పేరాలు చూడండి)b


15. మన భవిష్యత్తు గురించి మనకేం తెలుసు?

15 రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదుగానీ, శాశ్వత జీవితాన్ని యెహోవా మాట ఇచ్చాడని మనకు తెలుసు. అది పరలోకంలో కావచ్చు లేదా భూమ్మీద కావచ్చు. ఆయన ఇచ్చిన మాటను మనం ఎందుకు నమ్ముతాం? ఎందుకంటే, యెహోవాకు అబద్ధాలు చెప్పడం రాదు. అలాగే ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఆయన్ని ఏదీ ఆపలేదు. (తీతు 1:2) అంతేకాదు, యెహోవా మాత్రమే ‘మొదటి నుండి చివరికి ఏమౌతుందో చెప్తున్నాడు, ఎప్పటినుండో ఇంకా జరగని సంగతుల్ని చెప్తున్నాడు.’ ఆయన చెప్పినవన్నీ గతంలో పొల్లుపోకుండా నిజమయ్యాయి. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా నిజం అవుతాయి. (యెష. 46:10) మనకు ఇంకో విషయం కూడా తెలుసు. అదేంటంటే, ఆయన ప్రేమ మనకు దక్కకుండా ఏదీ అడ్డుకోలేదు. (రోమా. 8:35-39) అలాగే కష్టాల్ని తట్టుకునే శక్తిని, కావాల్సిన జ్ఞానాన్ని యెహోవా ఇస్తాడు. మనకు కావాల్సిన ఓదార్పును కూడా ఇస్తాడు. కాబట్టి ఆయన సహాయం తీసుకుంటే మన జీవితం పచ్చగా ఉంటుందనే నమ్మకంతో ఉండొచ్చు.—యిర్మీ. 17:7, 8.

యెహోవాకు మనగురించి ఎంతబాగా తెలుసో మనం అంచనా కూడా వేయలేం

16. కీర్తన 139:1-6 ప్రకారం యెహోవాకు మనగురించి ఏం తెలుసు? అది తెలిశాక మీకెలా అనిపిస్తుంది?

16 కీర్తన 139:1-6 చదవండి. మన సృష్టికర్తకు మన గురించి తెలియనిదంటూ ఏదీ లేదు. మన ఆలోచనలు, ఉద్దేశాలు, ఫీలింగ్స్‌ అన్నీ యెహోవాకు తెలుసు. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో; ఫలానా పని ఎందుకు చేస్తున్నామో, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో కూడా ఆయనకు తెలుసు. నిజానికి, యెహోవా మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడనీ, ఆయన మనకు అందనంత దూరంలో లేడనీ దావీదు రాజు అన్నాడు. ఈ విశ్వంలోనే గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి, భూమిని-ఆకాశాన్ని సృష్టించిన వ్యక్తి మనల్ని పట్టించుకోవడం ఎంత గొప్ప విషయమో కదా! దావీదు రాజుకు అనిపించినట్లే మనకు కూడా ఇలా అనిపిస్తుంది: “ఆ జ్ఞానం నా అవగాహనకు మించింది. దాన్ని నేను అంచనా వేయలేను.”—కీర్త. 139:6 అధస్సూచి.

17. యెహోవాకు మన గురించి అన్నీ తెలుసని నమ్మడం కొంతమందికి ఎందుకు కష్టంగా ఉండొచ్చు?

17 మనం పుట్టి-పెరిగిన పరిస్థితులు, పద్ధతులు, ఒకప్పటి నమ్మకాల వల్ల యెహోవాను ఒక ప్రేమగల తండ్రిలా ఊహించుకోవడం కష్టంగా ఉండొచ్చు. లేదా కొంతమంది గతంలో చేసిన తప్పుల వల్ల, యెహోవా వాళ్లను అస్సలు పట్టించుకోడని, వాళ్లకు దూరంగా ఉంటాడని అనిపించవచ్చు. దావీదుకు కూడా కొన్నిసార్లు అలానే అనిపించింది. (కీర్త. 38:18, 21) ఇంకొంతమంది, దేవునికి నచ్చినట్టు తమ జీవితాన్ని మార్చుకోవడానికి నిజాయితీగా ప్రయత్నిస్తారు. వాళ్లు బహుశా ఇలా అనుకోవచ్చు: ‘దేవుడు నన్ను నిజంగా అర్థం చేసుకుంటే, నాలో సహజంగా వచ్చే కోరికలతో పోరాడమని ఎందుకు చెప్తున్నాడు?’

18. మన గురించి మనకన్నా యెహోవాకు బాగా తెలుసని ఒప్పుకోవడం ఎందుకు మంచిది? (చిత్రాలు కూడా చూడండి.)

18 మన గురించి మనకన్నా యెహోవాకే బాగా తెలుసు. మనలో మనకి కనిపించని మంచి ఆయనకు కనిపిస్తుంది. మనలో ఎన్ని లోపాలు ఉన్నా, మనం ఏంటో యెహోవాకు తెలుసు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. (రోమా. 7:15) కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉన్నామో కాదు, రేపు ఎలా అవ్వగలమో కూడా ఆయనకు తెలుసు. ఈ నిజాన్ని మనం కొట్టిపారేయకుండా ఉంటే, ఆయన సేవలో నమ్మకంగా, సంతోషంగా కొనసాగడానికి కావాల్సిన బలం వస్తుంది.

చిత్రాలు: 1. బాధలో ఉన్న బ్రదర్‌ కిటికీ నుండి బయటికి చూస్తున్నాడు, బయట వర్షం పడుతుంది. 2. పరదైసులో అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆయన తన స్నేహితులతో కలిసి ఎత్తైన పర్వతాలు ఎక్కుతున్నాడు.

కొత్త లోకంలో మనకోసం దాగివున్న దీవెనలపై మన విశ్వాసాన్ని పెంచుతూ, ఇప్పుడున్న కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా సహాయం చేస్తున్నాడు (18-19 పేరాలు చూడండి)c


19. యెహోవా గురించి మనకు ఏమేం తెలుసు?

19 యెహోవా, ప్రేమకు నిలువెత్తు రూపమని మనకు తెలుసు. అందులో డౌటే లేదు! (1 యోహా. 4:8) యెహోవా ఏది చెప్పినా మన మీద ప్రేమతో, మన మంచి కోసమే చెప్తాడని మనకు తెలుసు. అలాగే మనకు శాశ్వత జీవితం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడని మనకు తెలుసు. అందుకే యెహోవా మనకు విమోచన క్రయధనం అనే బహుమతి ఇచ్చాడు. కాబట్టి మనలో ఎన్ని లోపాలు ఉన్నా, యెహోవాను సంతోషపెట్టగలం అనే ధైర్యాన్ని ఆ బహుమతి ఇస్తుంది. (రోమా. 7:24, 25) అంతేకాదు, యెహోవా “మన హృదయాల కన్నా గొప్పవాడని, ఆయనకు అన్నీ తెలుసని” మనకు తెలుసు. (1 యోహా. 3:19, 20) యెహోవాకు మన గురించి అణువణువూ తెలుసు. తనకు నచ్చినట్టు మనం జీవిస్తామనే నమ్మకం ఆయనకు ఉంది.

20. మనం అతిగా ఆలోచించకుండా ఏం చేయవచ్చు?

20 మనకు తెలియాల్సినవి చెప్పకుండా యెహోవా ఏదీ దాచిపెట్టలేదు. ఈ నిజాన్ని మనం వినయంగా ఒప్పుకుంటే, మన చేతుల్లో లేని వాటిగురించి అతిగా ఆలోచించే బదులు, మన చేతుల్లో ఉన్నవాటి మీద మనసుపెడతాం. అలా చేయడం వల్ల “పరిపూర్ణ జ్ఞానం కలిగిన” యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచుతున్నామని చూపిస్తాం. (యోబు 36:4) నిజమే మనం ఇప్పుడే అన్నీ తెలుసుకోలేం. కానీ మన గొప్ప దేవుడైన యెహోవా గురించి కొత్తకొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్తలోకం కోసం ఎదురుచూద్దాం!—ప్రసం. 3:11.

ఈ విషయాలు మనకు తెలీదని ఒప్పుకోవడం ఎందుకు మంచిది?

  • అంతం ఎప్పుడు వస్తుంది?

  • రేపు ఏం జరుగుతుంది?

  • యెహోవాకు మనగురించి ఎంతబాగా తెలుసు?

పాట 104 పవిత్రశక్తి దేవుడిచ్చే బహుమానం

a ఈ లోకాన్ని నాశనం చేసే హార్‌మెగిద్దోన్‌ యుద్ధానికి యేసు నాయకత్వం వహిస్తాడు. కాబట్టి యేసుకు ఆ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో, అలాగే “తన విజయాన్ని” ఎప్పుడు పూర్తి చేస్తాడో ఇప్పుడు తెలుసనే ముగింపుకు రావచ్చు.—ప్రక. 6:2; 19:11-16.

b చిత్రాల వివరణ:: అత్యవసర పరిస్థితికి సిద్ధపడుతూ ఒక తండ్రీకొడుకులు గో బ్యాగ్‌ సర్దుతున్నారు.

c చిత్రం వివరణ: కష్టాల్లో ఉన్న బ్రదర్‌ కొత్త లోకంలో ఉండే ఆనందాల కోసం ఎదురుచూస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి