కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 జూన్‌ పేజీలు 8-13
  • యాకోబు చివరి మాటల్లో పాఠాలు—2వ భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యాకోబు చివరి మాటల్లో పాఠాలు—2వ భాగం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జెబూలూను
  • ఇశ్శాఖారు
  • దాను
  • గాదు
  • ఆషేరు
  • నఫ్తాలి
  • యోసేపు
  • బెన్యామీను
  • యాకోబు చివరి మాటల్లో పాఠాలు​​—1వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ప్రమాదానికి ఎదురెళ్లాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • యాకోబు ఏశావు కలిసిపోయారు
    నా బైబిలు పుస్తకం
  • తప్పు చేయాలనే ఆలోచన కూడా రానివ్వలేదు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 జూన్‌ పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 25

పాట 96 యెహోవాయే ప్రేరేపించి రాయించిన గొప్ప గ్రంథం

యాకోబు చివరి మాటల్లో పాఠాలు—2వ భాగం

“అతను వాళ్లలో ప్రతీ ఒక్కరికి తగిన దీవెనను ఇచ్చాడు.”—ఆది. 49:28.

ముఖ్యాంశం

చనిపోయే ముందు తన ఎనిమిదిమంది కొడుకుల గురించి యాకోబు చెప్పిన ప్రవచనం నుండి మనకున్న పాఠాలు.

1. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

యాకోబు కొడుకులు ఆయన మంచం చుట్టూ చేరారు. వృద్ధుడైన వాళ్ల తండ్రి ఇచ్చే దీవెనల్ని మనసుపెట్టి విన్నారు. ముందటి ఆర్టికల్‌లో యాకోబు తన కొడుకులైన రూబేను, షిమ్యోను, లేవీ, యూదాకు ఇచ్చిన దీవెనల గురించి చూశాం. అయితే, అవి విన్న తర్వాత బహుశా ఆయన కొడుకులందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. ఇక మిగిలిన ఎనిమిదిమంది కొడుకులు తమకోసం యాకోబు ఏ దీవెన ఇస్తాడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే యాకోబు తన మిగతా కొడుకులైన జెబూలూను, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, యోసేపు, బెన్యామీనుకు ఏ దీవెనలు ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం. వాటినుండి మనకు ఉన్న పాఠాల్ని కూడా చూద్దాం.a

జెబూలూను

2. యాకోబు జెబూలూనుకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? అది ఎలా నెరవేరింది? (ఆదికాండం 49:13) (బాక్స్‌ కూడా చూడండి.)

2 ఆదికాండం 49:13 చదవండి. జెబూలూను వంశస్థులు వాగ్దాన దేశానికి ఉత్తరం వైపు సముద్ర తీరాన నివసిస్తారని యాకోబు చెప్పాడు. దాదాపు 200 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత జెబూలూను వంశస్థులు తమ స్వాస్థ్యాన్ని పొందారు. అది గలిలయ సముద్రానికి, మధ్యధరా సముద్రానికి మధ్యలో ఉంది. మోషే ఇలా ప్రవచించాడు: “జెబూలూనూ, నువ్వు బయటికి వెళ్లేటప్పుడు సంతోషించు.” (ద్వితీ. 33:18) బహుశా జెబూలూను వంశస్థులు ఇరు సముద్రాల మధ్య తేలిగ్గా ప్రయాణించి, వ్యాపారం చేసుకోవడం గురించి ఆ ప్రవచనం చెప్తుండొచ్చు. ఏదేమైనా జెబూలూను వంశస్థులు సంతోషంగా ఉండడానికి మంచి కారణమే ఉంది.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

జెబూలూను.

కొడుకు

జెబూలూను

ప్రవచనం

“జెబూలూను సముద్రతీరాన . . . నివసిస్తాడు. అతని సరిహద్దు సీదోను వరకు ఉంటుంది.”—ఆది. 49:13.

నెరవేర్పు

జెబూలూను ఉత్తరం వైపు గలిలయ సముద్రానికి, మధ్యధరా సముద్రానికి మధ్యలో నివసించాడు.—యెహో. 19:10-16.

3. మనం సంతృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి?

3 మనకు ఏంటి పాఠం? మనం ఎక్కడున్నా మన పరిస్థితులు ఏవైనా మనం సంతోషంగా ఉండడానికి కారణాలు ఉన్నాయి. మనం సంతోషంగా ఉండాలంటే మనకు ఉన్నవాటితో తృప్తిపడాలి. (కీర్త. 16:6; 24:5) కొన్నిసార్లు మనకు లేని వాటిమీద మనసుపెడితే, మనకు ఉన్నవాటి మీద మనసు విరగవచ్చు. కాబట్టి మనకున్న మంచి వాటిని గుర్తిద్దాం, జీవితాన్ని ఆనందిద్దాం.—గల. 6:4.

ఇశ్శాఖారు

4. యాకోబు ఇశ్శాఖారుకు ఏ దీవెన ఇచ్చాడు? అదెలా నిజమైంది? (ఆదికాండం 49:14, 15) (బాక్స్‌ కూడా చూడండి.)

4 ఆదికాండం 49:14, 15 చదవండి. ఇశ్శాఖారు ఒళ్లొంచి కష్టపడి పనిచేస్తాడు కాబట్టి యాకోబు ఆయన్ని మెచ్చుకున్నాడు. ఆయన్ని చాలా పెద్దపెద్ద బరువులు మోసే బలమైన గాడిదతో యాకోబు పోల్చాడు. అంతేకాదు, ఇశ్శాఖారుకు స్వాస్థ్యంగా మంచి నేల దొరుకుతుందని కూడా యాకోబు చెప్పాడు. ఆయన మాటలు నిజమయ్యాయి. ఇశ్శాఖారు వంశస్థులు యొర్దాను నది పక్కన పచ్చగా, కళకళలాడే నేలను సొంతం చేసుకున్నారు. (యెహో. 19:22) వాళ్లు ఆ నేలను సాగు చేయడానికి కష్టపడి పనిచేశారు. అలాగే వేరేవాళ్ల కోసం కూడా చెమటోడ్చి కష్టపడ్డారు. (1 రాజు. 4:7, 17) ఉదాహరణకు, న్యాయాధిపతైన బారాకు అలాగే ప్రవక్త్రి అయిన దెబోరా సీసెరాతో యుద్ధం చేయడానికి సహాయం అడిగినప్పుడు ఇశ్శాఖారు గోత్రంవాళ్లు ముందుకొచ్చారు. ఈ సందర్భంలోనే కాదు ఇంకా వేరే సందర్భాల్లో కూడా వాళ్లు యుద్ధం చేయడానికి ముందుకొచ్చారు.—న్యాయా. 5:15

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

ఇశ్శాఖారు.

కొడుకు

ఇశ్శాఖారు

ప్రవచనం

“అతను బరువు మోయడానికి తన భుజం” వంచుతాడు.—ఆది. 49:14, 15.

నెరవేర్పు

ఇశ్రాయేలు జనాంగం మంచి కోసం ఇశ్శాఖారు చెమటోడ్చి కష్టపడ్డారు.—న్యాయా. 5:15; 1 రాజు. 4:1, 7, 17.

5. మనం ఎందుకు కష్టపడి పనిచేయాలి?

5 మనకు ఏంటి పాఠం? కష్టపడి పనిచేసిన ఇశ్శాఖారు గోత్రంవాళ్లకు యెహోవా చాలా విలువిచ్చాడు. అలాగే తన సేవలో కష్టపడి పనిచేసేవాళ్లకు కూడా యెహోవా విలువిస్తాడు. (ప్రసం. 2:24) ఉదాహరణకు సంఘం కోసం చెమటోడ్చి కష్టపడే బ్రదర్స్‌ గురించి ఆలోచించండి. (1 తిమో. 3:1) వీళ్లు బహుశా యుద్ధాలు చేయకపోవచ్చు. కానీ దేవుని ప్రజల్ని ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి కాపాడడానికి చెమటోడ్చి కష్టపడతారు. (1 కొరిం. 5:1, 5; యూదా 17-23) అంతేకాదు, వాళ్లు సంఘాన్ని బలపరిచే ప్రసంగాలు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి కష్టపడి సిద్ధపడతారు, వాటిని అందిస్తారు.—1 తిమో. 5:17.

దాను

6. దాను గోత్రంవాళ్లు ఏ నియామకాన్ని చేసేవాళ్లు? (ఆదికాండం 49:17, 18) (బాక్స్‌ కూడా చూడండి.)

6 ఆదికాండం 49:17, 18 చదవండి. తనకన్నా పెద్దపెద్ద జంతువులు అంటే గుర్రాల్లాంటి జంతువుల్ని కూడా దాడిచేసే పాములా, దాను ఉన్నాడని యాకోబు చెప్పాడు. దాను ఇశ్రాయేలీయుల శత్రువులకు ప్రమాదకరం. వాళ్లు వాగ్దాన దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు దాను గోత్రంవాళ్లు ఇశ్రాయేలు జనాంగానికి “రక్షణగా” వెనక వెళ్లేవాళ్లు. (సంఖ్యా. 10:25) నిజానికి, దాను గోత్రంవాళ్లు చేసే పనిని మిగతా ఇశ్రాయేలు జనాంగం చూసినా చూడకపోయినా అది చాలా ముఖ్యమైన నియామకం.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

దాను.

కొడుకు

దాను

ప్రవచనం

‘దాను గుర్రం మడిమెల్ని కాటు వేస్తాడు.’—ఆది. 49:16-18.

నెరవేర్పు

వాగ్దాన దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు దాను గోత్రంవాళ్లు, ఇశ్రాయేలు జనాంగానికి “రక్షణగా” వెనక వెళ్లారు.—సంఖ్యా. 10:25.

7. మనం చేసే నియామకం గురించి ఏం గుర్తుపెట్టుకోవాలి?

7 మనకు ఏంటి పాఠం? మీరు ఎప్పుడైనా రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడం, దాన్ని రిపేరు చేయడం, సమావేశాల్లో వాలంటీరుగా సేవ చేయడం, లేదా ఇంకా ఏదైనా పని చేశారా? అలాగైతే మిమ్మల్ని చాలా మెచ్చుకోవాలి! బహుశా వీటిని మనుషులు ఎవ్వరూ గుర్తించకపోవచ్చు. కానీ మీరు తన కోసం చేసే ప్రతీదాన్ని యెహోవా చూస్తాడనీ, దానికి విలువ ఇస్తాడనీ ఎప్పుడూ మర్చిపోకండి. అంతేకాదు, ఎవరో మెచ్చుకోవాలని కాదుగానీ తన మీదున్న ప్రేమతోనే మీరు సేవచేస్తే యెహోవాకు బాగా నచ్చుతుంది.—మత్త. 6:1-4.

గాదు

8. గాదు వంశస్థులు శత్రువుల దాడికి ఎందుకు బలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? (ఆదికాండం 49:19) (బాక్స్‌ కూడా చూడండి.)

8 ఆదికాండం 49:19 చదవండి. దోపిడి ముఠా గాదు మీద దాడి చేస్తుందని యాకోబు చెప్పాడు. దాదాపు 200 సంవత్సరాల తర్వాత యొర్దాను నదికి తూర్పున గాదు వంశస్థులు స్థిరపడ్డారు. అది శత్రు దేశాలకు సరిహద్దు కాబట్టి గాదు వంశస్థులు శత్రువులకు బలయ్యే అవకాశాలు ఎక్కువ. అయినాసరే వాళ్లు ఆ ప్రాంతంలోనే ఉండాలనుకున్నారు. ఎందుకంటే వాళ్లకు, వాళ్ల జంతువులకు కావాల్సిన పచ్చదనం అక్కడ ఉంది. (సంఖ్యా. 32:1, 5) గాదు వంశస్థులకు గుండె ధైర్యం కూడా ఎక్కువే. అదొక్కటే కాదు, దోపిడి ముఠా నుండి యెహోవాయే వాళ్లను కాపాడతాడనే నమ్మకం కూడా ఎక్కువే. అంతేకాదు, యొర్దానుకు పడమర వైపు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మిగతా గోత్రాలు చేసే పోరాటంలో గాదు వంశస్థులు తమ సైన్యాన్ని బరిలోకి దింపారు. (సంఖ్యా. 32:16-19) వీళ్లు యుద్ధానికి వెళ్లినప్పుడు తమ భార్యాపిల్లల్ని యెహోవాయే చూసుకుంటాడని నిశ్చింతగా ఉన్నారు. వాళ్లు చూపించిన ధైర్యానికి, స్వయంత్యాగ స్ఫూర్తికి యెహోవా వాళ్లను దీవెనలతో ముంచెత్తాడు.—యెహో. 22:1-4.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

గాదు.

కొడుకు

గాదు

ప్రవచనం

“దోపిడీ ముఠా అతని మీద దాడి చేస్తుంది.”—ఆది. 49:19.

నెరవేర్పు

యొర్దాను నదికి తూర్పున గాదు వంశస్థులు స్థిరపడ్డారు. అది శత్రు దేశాలకు సరిహద్దు కాబట్టి గాదు వంశస్థులు శత్రువులకు బలయ్యే అవకాశాలు ఎక్కువ.—యెహో. 13:24-28.

9. యెహోవా మీద నమ్మకం ఉంటే మనం ఏ నిర్ణయాలు తీసుకుంటాం?

9 మనకు ఏంటి పాఠం? కష్టాల్లో కూడా యెహోవా సేవ చేయాలంటే మనకు ఆయన మీద నమ్మకం ఉండాలి. (కీర్త. 37:3) ఈ రోజుల్లో కూడా చాలామంది నిర్మాణ సేవలో, అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో లేదా ఇంకేదైనా నియామకంలో పని చేయడానికి ముందుకు వస్తున్నారు. యెహోవా తమను చూసుకుంటాడనే నమ్మకంతో వాళ్లు అలా ఇష్టంగా త్యాగాలు చేస్తున్నారు.—కీర్త. 23:1.

ఆషేరు

10. ఆషేరు గోత్రం వాళ్లు ఏం చేయడంలో విఫలమయ్యారు? (ఆదికాండం 49:20) (బాక్స్‌ కూడా చూడండి.)

10 ఆదికాండం 49:20 చదవండి. ఆషేరు గోత్రంవాళ్లు సిరిసంపదలతో తులతూగుతారని యాకోబు చెప్పాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. వాగ్దాన దేశంలో మిగతా ఇశ్రాయేలీయుల కన్నా ఆషేరు గోత్రంవాళ్లకు చాలా సారవంతమైన నేల వచ్చింది. (ద్వితీ. 33:24) వాళ్లకు వచ్చిన భాగంలో, మధ్యధరా సముద్రం ఉంది అలాగే కాసుల వర్షం కురిపించే సీదోను సముద్ర తీరం కూడా ఉంది. అయితే ఆషేరు గోత్రంవాళ్లు కనానీయుల్ని ఆ ప్రాంతం నుండి బయటికి తరిమేయలేకపోయారు. (న్యాయా. 1:31, 32) అసలే సిరిసంపదలతో తులతూగుతున్న ఆషేరు గోత్రంవాళ్లు కనానీయుల్ని చూసి చెడిపోయారు. అందుకే వాళ్లు సత్యారాధనను పెద్దగా పట్టించుకోలేదు. కనానీయులతో యుద్ధం చేయడానికి రమ్మని న్యాయాధిపతైన బారాకు అడిగినప్పుడు, ఆషేరు వాళ్లు కాళ్లు కూడా కదపలేదు. దానివల్ల “మెగిద్దో నీళ్ల దగ్గర” అద్భుతమైన విజయంలో వాళ్లకు ఏమాత్రం వంతు లేకుండా పోయింది. (న్యాయా. 5:19-21) పైగా “ఆషేరు సముద్రతీరం దగ్గర ఖాళీగా కూర్చున్నాడు” అని బారాకు అలాగే దెబోరా పవిత్రశక్తి ప్రేరణతో పాడడం ఆ గోత్రంవాళ్లకు సిగ్గుచేటు.—న్యాయా. 5:17.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

ఆషేరు.

కొడుకు

ఆషేరు

ప్రవచనం

“ఆషేరు దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటుంది.”—ఆది. 49:20.

నెరవేర్పు

ఆషేరు గోత్రంవాళ్లు సిరిసంపదలతో తులతూగారు.—ద్వితీ. 33:24.

11. మనం ఎందుకు డబ్బే లోకంగా బ్రతకం?

11 మనకు ఏంటి పాఠం? యెహోవాకు మన బెస్ట్‌ ఇవ్వాలి. అలా చేయాలంటే, ఈ లోకంలో వాళ్లలా ఆస్తిపాస్తుల గురించి ఆలోచించకూడదు. (సామె. 18:11) డబ్బు మనకు అవసరమే కానీ డబ్బే లోకంగా బ్రతకం. (ప్రసం. 7:12; హెబ్రీ. 13:5) డబ్బు వేటలో పడి యెహోవా సేవను పక్కనపెట్టం. బదులుగా, కొత్త లోకంలో యెహోవా ఒక సురక్షితమైన జీవితాన్ని ఇస్తాడని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడే మన సమయాన్ని, శక్తిని ఆయన కోసం ధారపోస్తాం.—కీర్త. 4:8.

నఫ్తాలి

12. నఫ్తాలి గురించి యాకోబు చెప్పిన మాటలు ఎలా నిజమయ్యాయి? (ఆదికాండం 49:21) (బాక్స్‌ కూడా చూడండి.)

12 ఆదికాండం 49:21 చదవండి. నఫ్తాలి “వినసొంపుగా ఉండే మాటలు” మాట్లాడతాడని యాకోబు చెప్పాడు. ఇది యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్యను సూచిస్తుండవచ్చు. ప్రజల హృదయాన్ని చేరుకునేలా బోధించే యేసు, నఫ్తాలి ప్రాంతమైన కపెర్నహూము నగరంలోనే ఎక్కువగా ఉండేవాడు. కాబట్టి అది ఆయన ‘సొంత ఊరుగా’ మారింది. (మత్త. 4:13; 9:1; యోహా. 7:46) జెబూలూను, నఫ్తాలి ప్రజలకు యేసు ‘గొప్ప వెలుగుగా’ ఉంటాడని యెషయా ప్రవచించాడు. (యెష. 9:1, 2) అవును, యేసు “అన్నిరకాల మనుషుల మీద ప్రకాశించే నిజమైన వెలుగు” అని తన బోధన ద్వారా నిరూపించుకున్నాడు.—యోహా. 1:9.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

నఫ్తాలి.

కొడుకు

నఫ్తాలి

ప్రవచనం

“అతను వినసొంపుగా ఉండే మాటలు మాట్లాడుతున్నాడు.”—ఆది. 49:21.

నెరవేర్పు

యేసు భూమ్మీద పరిచర్య చేసినప్పుడు ఎక్కువ సమయం నఫ్తాలి ప్రాంతమైన కపెర్నహూములో గడిపాడు.—మత్త. 4:13; 9:1.

13. మనం యెహోవాను సంతోషపెట్టేలా ఎలా మాట్లాడొచ్చు?

13 మనకు ఏంటి పాఠం? మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో యెహోవా చూస్తాడు. మరి ఆయన్ని సంతోషపెట్టేలా “వినసొంపుగా ఉండే మాటలు” మనం ఎలా మాట్లాడొచ్చు? ఒకటి, మనం నిజమే మాట్లాడాలి. (కీర్త. 15:1, 2) రెండోది, వేరేవాళ్లు చేసిన పనులకు వంకలుపెట్టే బదులు, మనం వాళ్లను వెంటనే మెచ్చుకోవాలి. అలా చేస్తే వాళ్లను బలపర్చిన వాళ్లమౌతాం. (ఎఫె. 4:29) మూడోది, వేరేవాళ్లకు మంచివార్త చెప్పడానికి వాళ్లతో మాటలు కలిపే నైపుణ్యం పెంచుకోవాలి.

యోసేపు

14. యోసేపు గురించి యాకోబు చెప్పిన ప్రవచనం ఎలా నిజమైంది? (ఆదికాండం 49:22, 26) (బాక్స్‌ కూడా చూడండి.)

14 ఆదికాండం 49:22, 26 చదవండి. యోసేపును చూసి యాకోబు గర్వపడ్డాడు. “తన సహోదరుల నుండి వేరుచేయబడిన” యోసేపును యెహోవా ఎంచుకొని, ప్రత్యేకంగా ఉపయోగించుకున్నాడు. అందుకే, ఆయన్ని “ఫలవంతమైన చెట్టు రెమ్మ” అని యాకోబు పిలిచాడు. ఆ చెట్టు యాకోబు, ఆ చెట్టుకున్న రెమ్మ యోసేపు. ఈ యోసేపు రాహేలుకు పుట్టిన మొదటి కొడుకు. రూబేను లేయాకు పుట్టిన మొదటి కొడుకు. అయితే, రూబేను పోగొట్టుకున్న రెండింతల ఆస్తి, యోసేపుకు వస్తుందని యాకోబు చెప్పాడు. (ఆది. 48:5, 6; 1 దిన. 5:1, 2) ఆయన చెప్పింది నిజమైంది. ఎందుకంటే యోసేపు కొడుకులు ఎఫ్రాయిము, మనష్షే ఇశ్రాయేలులో రెండు గోత్రాలుగా ఏర్పడ్డారు. ఆ రెండు గోత్రాలకు వాగ్దాన దేశంలో భాగాలు కూడా వచ్చాయి.—ఆది. 49:25; యెహో. 14:4.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

యోసేపు.

కొడుకు

యోసేపు

ప్రవచనం

“తన సహోదరుల నుండి వేరుచేయబడిన” యోసేపు మీద దీవెనలు “అలాగే నిలిచివుంటాయి.”—ఆది. 49:22-26.

నెరవేర్పు

పెద్ద కొడుకుకు వచ్చే హక్కు యోసేపుకు వచ్చింది. ఆయన ఇద్దరు కొడుకులు ఇశ్రాయేలులో రెండు గోత్రాలుగా ఏర్పడ్డారు.—యెహో. 14:4; 1 దిన. 5:1, 2.

15. తనకు అన్యాయం జరిగినప్పుడు యోసేపు ఏం చేశాడు?

15 అంతేకాదు, “విలుకాండ్రు . . . [యోసేపు] మీద బాణాలు వేశారు, అతని మీద ద్వేషం పెంచుకుంటూ వచ్చారు” అని యాకోబు చెప్పాడు. (ఆది. 49:23) అలా ద్వేషం పెంచుకుంది ఎవరో కాదు, యోసేపు అన్నలే. తనకు జరిగిన అన్యాయలన్నిటికీ వాళ్లే కారణం. అయితే యోసేపు వాళ్లమీద కోపం పెంచుకోలేదు, అలాగని యెహోవా మీద అలగలేదు. యాకోబు ఇలా చెప్పాడు: “[యోసేపు] విల్లు స్థిరంగా ఉంది, అతని చేతులు బలంగా, చురుగ్గా ఉన్నాయి.” (ఆది. 49:24) తన కష్టాలన్నిటిలో యోసేపు యెహోవా వైపు చూశాడు. అలాగే యోసేపు తన అన్నల్ని క్షమించడమే కాదు వాళ్లమీద దయ కూడా చూపించాడు. (ఆది. 47:11, 12) తనకు వచ్చిన కష్టాలన్నీ తనను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేలా యోసేపు అనుమతించాడు. (కీర్త. 105:17-19) దానివల్ల యెహోవా యోసేపును ఇంకా గొప్ప స్థాయిలో ఉపయోగించుకోగలిగాడు.

16. కష్టాలు వచ్చినప్పుడు మనం యోసేపులా ఎలా ఉండొచ్చు?

16 మనకు ఏంటి పాఠం? మనకు ఏ కష్టం వచ్చినా, యెహోవా నుండి, తోటి ఆరాధకుల నుండి దూరం అవ్వకుండా చూసుకుందాం. మన విశ్వాసానికి సంబంధించి ఏదైనా పరీక్ష వచ్చేలా యెహోవా అనుమతించాడంటే అది ఆయన మనకు ఇచ్చే శిక్షణలో భాగం. (హెబ్రీ. 12:7, అధస్సూచి) ఆ శిక్షణ వల్ల మనం యెహోవాలా దయ, క్షమాగుణాన్ని ఇంకా ఎక్కువ చూపించగలుగుతాం. (హెబ్రీ. 12:11) యోసేపులాగే మనం కూడా ఓర్పు చూపిస్తే యెహోవా మనల్ని దీవించకుండా వదిలిపెట్టడు.

బెన్యామీను

17. బెన్యామీను గురించి యాకోబు చెప్పిన ప్రవచనం ఎలా నిజమైంది? (ఆదికాండం 49:27) (బాక్స్‌ కూడా చూడండి.)

17 ఆదికాండం 49:27 చదవండి. బెన్యామీనీయులకు తోడేళ్లలా చీల్చివేసే గొప్ప సామర్థ్యం ఉంటుందని యాకోబు చెప్పాడు. (న్యాయా. 20:15, 16; 1 దిన. 12:2) ఇశ్రాయేలు రాజ్యంలో “ఉదయం” బెన్యామీను గోత్రం నుండి ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు వచ్చాడు, ఆయనే సౌలు. ఆయన ఫిలిష్తీయులతో పోరాడి శత్రువుల్ని చీల్చిచెండాడే యోధుడిగా నిరూపించుకున్నాడు. (1 సమూ. 9:15-17, 21) ఆ రాజుల చరిత్రలో “సాయంకాలం” ఇద్దరు బెన్యామీనీయులు వచ్చారు. వాళ్లెవరంటే, ఎస్తేరు రాణి అలాగే ప్రధానమంత్రి మొర్దెకై. వీళ్లు పర్షియా రాజ్యం ఇశ్రాయేలీయుల్ని మట్టుపెట్టకుండా కాపాడారు.—ఎస్తే. 2:5-7; 8:3; 10:3.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

బెన్యామీను.

కొడుకు

బెన్యామీను

ప్రవచనం

“ఉదయం అతను వేటాడిన జంతువును తింటాడు, సాయంకాలం దోపుడుసొమ్మును పంచుకుంటాడు.”—ఆది. 49:27.

నెరవేర్పు

సౌలు ఇశ్రాయేలులో మొట్టమొదటి రాజు. (1 సమూ. 9:15-17) తర్వాత ఎస్తేరు, మొర్దెకై యెహోవా ప్రజల్ని కాపాడారు.—ఎస్తే. 2:5-7; 8:3; 10:3.

18. మనం బెన్యామీనీయుల్లా ఎలా నమ్మకంగా ఉండొచ్చు?

18 మనకు ఏంటి పాఠం? తమలో ఒకడైన సౌలు రాజైనప్పుడు బెన్యామీనీయులు ఎగిరి గంతేసివుంటారు. అయితే, రాజరికాన్ని యెహోవా యూదా గోత్రానికి చెందిన దావీదు చేతిలో పెట్టినప్పుడు బెన్యామీనీయులు ఆ మార్పుకు చక్కగా మద్దతు ఇచ్చారు. (2 సమూ. 3:17-19) దశాబ్దాల తర్వాత వేరే గోత్రాలవాళ్లు తిరుగుబాటు చేసినాసరే, బెన్యామీనీయులు మాత్రం యూదాకు అలాగే యెహోవా నియమించిన రాజుకు నమ్మకంగా ఉన్నారు. (1 రాజు. 11:31, 32; 12:19, 21) మనం కూడా, ఈ రోజుల్లో యెహోవా తన ప్రజలని నడిపించడానికి ఎవ్వర్ని ఉపయోగించినా వాళ్లకు నమ్మకంగా మద్దతు ఇద్దాం.—1 థెస్స. 5:12.

19. చనిపోయే ముందు యాకోబు చెప్పిన ప్రవచనం నుండి మనందరం ఏం నేర్చుకోవచ్చు?

19 యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం నుండి మనం ఎంతో నేర్చుకున్నాం. ఆ ప్రవచనం ఎలా నిజమైందో పరిశీలించినప్పుడు బైబిల్లో ఉన్న మిగతా ప్రవచనాల మీద కూడా మన విశ్వాసం పెరుగుతుంది. అలాగే, యాకోబు కొడుకుల్ని యెహోవా ఎలా దీవించాడో చూసినప్పుడు, ఆయన్ని సంతోషపెట్టడానికి మనం ఇంకేం చేయవచ్చో కూడా అర్థమవుతుంది.

యాకోబు వీళ్లకు చెప్పిన మాటల నుండి మీరే పాఠాలు నేర్చుకున్నారు?

  • జెబూలూను, ఇశ్శాఖారు, దాను?

  • గాదు, ఆషేరు, నఫ్తాలి?

  • యోసేపు, బెన్యామీను?

పాట 128 అంతం వరకు సహిద్దాం

a రూబేను, షిమ్యోను, లేవి, యూదా ఈ నలుగుర్ని వాళ్లు పుట్టిన క్రమంలో యాకోబు దీవించాడు. కానీ మిగతా కొడుకుల్ని దీవిస్తున్నప్పుడు ఈ క్రమాన్ని పాటించలేదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి