కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 జూలై పేజీలు 14-19
  • యెహోవా గురించి తెలుసుకుంటూనే ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా గురించి తెలుసుకుంటూనే ఉండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను బాగా తెలుసుకోవడం అంటే ఏంటి?
  • యెహోవా గురించి ఎందుకు తెలుసుకుంటూ ఉండాలి?
  • మనం యెహోవా గురించి బాగా తెలుసుకోవడానికి ఏం చేయాలి?
  • మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • యెహోవా “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • “మీరు ఎవర్ని సేవిస్తారో ఈ రోజే ఎంచుకోండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 జూలై పేజీలు 14-19

సెప్టెంబరు 21-27, 2026

పాట 12 యెహోవా గొప్ప దేవుడు

యెహోవా గురించి తెలుసుకుంటూనే ఉండండి

‘నీ తండ్రి దేవుణ్ణి తెలుసుకుని, సంపూర్ణ హృదయంతో ఆయన్ని సేవించు.’—1 దిన. 28:9.

ముఖ్యాంశం

యెహోవా గురించి బాగా తెలుసుకోవడం అంటే ఏంటో, అలా ఎందుకు తెలుసుకోవాలో, దానికోసం ఏం చేయాలో చూస్తాం.

1. యెహోవాకున్న తెలివి-జ్ఞానం గురించి, ఆయన చేసిన పనుల గురించి ఆలోచించినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది?

యెహోవా గురించి ఆలోచిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఆయన తెలివికి, జ్ఞానానికి అంతేలేదు. ఆయన చేసిన పనుల్ని ఎవ్వరూ లెక్కపెట్టలేరు. నిజంగా, మన సృష్టికర్త గొప్పవాడు అనే మాట చాలా చిన్నది. మనకు కూడా అపొస్తలుడైన పౌలులాగే అనిపిస్తుంది. ఆయన ఇలా రాశాడు: “ఆహా! దేవుని ఔదార్యం, తెలివి, జ్ఞానం ఎంత లోతైనవి! ఆయన నిర్ణయాల్ని పరిశోధించడం, ఆయన మార్గాల్ని కనుక్కోవడం అసాధ్యం!”—రోమా. 11:33, 34.

2. మనం యెహోవా గురించి తెలుసుకోగలమని ఎలా చెప్పవచ్చు?

2 యెహోవా గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యంకాదు. కానీ ఆయన ఎలాంటివాడో మనం కొంతవరకు తెలుసుకోవచ్చు. రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇలా అన్నాడు: “నీ తండ్రి దేవుణ్ణి తెలుసుకుని, సంపూర్ణ హృదయంతో, ఇష్టపూర్వకంగా ఆయన్ని సేవించు . . . నువ్వు ఆయన్ని వెదికితే ఆయన్ని కనుగొంటావు.” (1 దిన. 28:9) కొన్ని వందల సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన యోహాను తోటి క్రైస్తవులకు ఇలా గుర్తుచేశాడు: ‘సత్యదేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకునేలా మనకు లోతైన అవగాహన ఇవ్వబడింది.’ (1 యోహా. 5:20) యేసు కూడా, ప్రజలకు తండ్రి గురించి “పూర్తిగా” తెలియజేస్తానని చెప్పాడు.—మత్త. 11:27.

3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

3 యెహోవాను సేవిస్తున్న మనందరికీ ఆయన గురించి ఇప్పటికే చాలా విషయాలు తెలుసు. అయినాసరే, మనం ఆయన గురించి “తెలుసుకోవడం” ఆపకూడదు. (యోహా. 17:3) ఆయన్ని సంతోషపెట్టడం, ఆయన మీద నమ్మకాన్ని పెంచుకోవడం లాంటివాటి గురించి మనం ఎప్పుడూ ఏదోక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటాం. మనం యెహోవాను ఎంతో కాలంగా సేవిస్తున్నా సరే, ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించాలి: యెహోవాను బాగా తెలుసుకోవడం అంటే ఏంటి? ఆయన గురించి ఎందుకు తెలుసుకుంటూ ఉండాలి? అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? వీటి గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

యెహోవాను బాగా తెలుసుకోవడం అంటే ఏంటి?

4. యెహోవాను బాగా తెలుసుకోవాలంటే మనకు ఏం ఉండాలి?

4 బబులోను నుండి రాబోతున్న యూదులకు యెహోవా ఇలా మాటిచ్చాడు: “నేను యెహోవానని తెలుసుకునే హృదయాన్ని వాళ్లకు ఇస్తాను.” (యిర్మీ. 24:7) దాన్నిబట్టి, ఆయన్ని బాగా తెలుసుకోవాలంటే మనకు ఏం ఉండాలో అర్థమవుతుంది. ఆ యూదులకు యెహోవా గురించి అప్పటికే కొన్ని విషయాలు తెలుసు. కానీ వాళ్లకు ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే హృదయం ఉండాలి; అంటే యెహోవాకు దగ్గరవ్వాలనే కోరిక, ఉద్దేశం వాళ్లకు ఉండాలి. దాని గురించి ఒక బైబిలు పండితుడు ఇలా అంటున్నాడు: “ప్రేమ గురించి చదవడానికి, ప్రేమలో పడడానికి చాలా తేడా ఉంది. అలాగే, దేవుని గురించి పైపైన తెలుసుకోవడానికి, ఆయన గురించి బాగా తెలుసుకోవడానికి కూడా చాలా తేడా ఉంది.” దేవుడు ఎవరు, ఆయన పేరు ఏంటి అని తెలుసుకుంటే సరిపోదు. ఆయనకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి.

5. యోషీయా రాజు యెహోవాను తెలుసుకున్నాడని ఎలా చూపించాడు?

5 యెహోవాను బాగా తెలుసుకోవాలంటే, ఆయనకు ఏం ఇష్టమో, ఏం ఇష్టం లేదో కూడా తెలుసుకోవాలి. యోషీయా రాజు ఉదాహరణే తీసుకోండి. ఆయన గురించి బైబిలు ఇలా చెప్తుంది: “యోషీయా తన పరిపాలనలోని 8వ సంవత్సరంలో, ఇంకా బాలుడిగా ఉన్నప్పుడే తన పూర్వీకుడైన దావీదు దేవుణ్ణి వెదకడం మొదలుపెట్టాడు.” (2 దిన. 34:3) అంటే, యోషీయా దేవుని వాక్యాన్ని చదివాడు. ఆయన అంతటితో ఆగిపోకుండా, నేర్చుకున్న వాటిని పాటించాడు. అందుకే, యోషీయా “నీతిని, న్యాయాన్ని సమర్థించాడు;” పేదవాళ్లకు, ఏ ఆసరా లేనివాళ్లకు అండగా ఉన్నాడు అని యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పాడు. అలా చెప్పాక, “నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?” అని ఆయన అన్నాడు.—యిర్మీ. 22:15, 16.

6. కీర్తన 9:10 ప్రకారం, యెహోవాను ఎక్కువగా తెలుసుకుంటే మనలో ఏం పెరుగుతుంది?

6 కీర్తన 9:10 చదవండి. యెహోవా గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆయన మీద మనకున్న నమ్మకం అంత ఎక్కువగా పెరుగుతుంది. అది నిజమని అపొస్తలుడైన పౌలు జీవితం రుజువుచేస్తుంది. చనిపోవడానికి కాస్త ముందు, జైల్లో ఉండగా ఆయన ఇలా రాశాడు: “నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నాకు తెలుసు.” (2 తిమో. 1:12) పౌలు తన జీవితంలో నేర్చుకున్న వాటినిబట్టి, అనుభవించిన వాటినిబట్టి దేవున్ని మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆయన నమ్మకంగా చేసిన సేవను యెహోవా అస్సలు మర్చిపోడని, ఆయన్ని తప్పకుండా గుర్తుపెట్టుకుని తిరిగి బ్రతికిస్తాడని పూర్తిగా నమ్మాడు.

యెహోవా గురించి ఎందుకు తెలుసుకుంటూ ఉండాలి?

7. కాలం గడిచేకొద్దీ ఏం జరగవచ్చు?

7 యెహోవా గురించి తెలుసుకోవాలని మనం మొదట్లో బాగా ప్రయత్నించి ఉంటాం. కానీ, ఆ ప్రయత్నాలు మెల్లమెల్లగా తగ్గిపోవచ్చు. ఎలా? మనం బైబిల్ని సొంతగా గానీ సంఘంలో గానీ చదువుతున్నప్పుడు అందులోని విషయాలు మనకెలా సహాయం చేస్తాయి, వేరేవాళ్లకు ఎలా ఉపయోగపడతాయి అనే ఎక్కువగా ఆలోచిస్తుండవచ్చు. నిజమే, అలా ఆలోచించమని లేఖనాలే చెప్తున్నాయి. (2 తిమో. 3:16, 17) అయితే బైబిల్లో అవే కాదు, దాన్ని రాయించిన యెహోవా గురించి కూడా చాలా సమాచారం ఉంది. అది తెలుసుకోవడమే మనకు అన్నిటికన్నా ముఖ్యం! (కీర్త. 25:8-10) కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఈ ప్రశ్న వేసుకుంటూ ఉండాలి: “ఇది యెహోవా గురించి నాకు ఏం నేర్పిస్తుంది?”a

8. యెహోవా గురించి ఎక్కువగా తెలుసుకుంటే ఏమౌతుంది? (కీర్తన 73:24-28)

8 యెహోవాను మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆయనతో మనకున్న స్నేహం అంత ఎక్కువగా బలపడుతుంది. ప్రతీరోజు బైబిలు చదివాక, నెలనెలా వచ్చే బ్రాడ్‌కాస్టింగ్‌ చూశాక లేదా ఏదైనా సమావేశానికి హాజరయ్యాక మీకు ఎలా అనిపిస్తుంది? యెహోవాకు ఇంకా దగ్గరైనట్టు అనిపిస్తుంది కదా! ఆయన గురించి మనం ముందుకన్నా ఎక్కువ విషయాలు నేర్చుకున్నాం కాబట్టి అలా ఫీలవుతాం. దాంతో ఆయన్ని స్తుతించాలని, ఆయనకు థాంక్స్‌ చెప్పాలని మనం కోరుకుంటాం. ఆసాపుకు కూడా మనలాగే అనిపించింది, యెహోవా తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో ధ్యానించి ఆయన ఇలా అన్నాడు: “దేవుడే నా హృదయానికి ఆశ్రయదుర్గం, ఆయనే ఎప్పటికీ నా భాగం.” (కీర్తన 73:24-28 చదవండి.) కాబట్టి, యెహోవా గురించి తెలుసుకోవడానికి మనం వేసే ప్రతీ అడుగు మనల్ని ఆయనకు ఇంకా దగ్గర చేస్తుంది. అలాంటి స్నేహం దొరికినందుకు మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది.

9. ‘మన కళ్లు ఎప్పుడూ యెహోవా వైపే చూస్తే’ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం? ఒక ఉదాహరణ చెప్పండి.

9 ‘మన కళ్లు ఎప్పుడూ యెహోవా వైపే చూడాలని’ బైబిలు మనకు చెప్తుంది. (కీర్త. 25:15) అంటే, ఆయన ఎలాంటివాడో గుర్తుచేసుకోవాలి, మన పనులు ఆయనకు నచ్చుతాయో లేదో ఆలోచించాలి. అప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ఉదాహరణకు, చాలామంది వాళ్ల భర్త లేదా భార్య ఫోటోను ఎప్పుడూ కనిపించేలా టేబుల్‌ మీద, పర్స్‌లో, ఫోన్‌లో పెట్టుకుంటారు. వాళ్లంటే ఎంత ఇష్టమో గుర్తుచేసుకోవడానికి, వాళ్ల గురించి బాగా ఆలోచించడానికి అది సహాయం చేస్తుంది. అంతేకాదు, వాళ్లకు నచ్చే నిర్ణయాలు తీసుకోవడానికి, వాళ్లకు నచ్చని పనులు చేయకుండా ఉండడానికి కూడా సహాయం చేస్తుంది. అదేవిధంగా, యెహోవా గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, ఆయనకు నచ్చే నిర్ణయాలు తీసుకోవడం మనకు అంత ఈజీ అవుతుంది.—కీర్త. 19:13, 14.

10. యెహోవా గురించి నేర్చుకునే కొద్దీ, మనకు ఏం తెలుస్తుంది?

10 యెహోవా మనల్ని తన స్వరూపంలో చేశాడు కాబట్టి ఆయనకున్న లక్షణాల్ని మనం కూడా చూపించగలం. (ఆది. 1:26) వాటి గురించి నేర్చుకునే కొద్దీ, ఆయనలా ఎలా ఉండాలో మనకు ఇంకా బాగా తెలుస్తుంది. శాస్త్రులు, పరిసయ్యులు అలా నేర్చుకోలేదు. వాళ్లు ధర్మశాస్త్రంలోని చిన్నచిన్న విషయాల్ని బాగా పట్టించుకునేవాళ్లు. కానీ, అందులో ఉన్న ‘ప్రాముఖ్యమైన విషయాల్ని అంటే న్యాయాన్ని, కరుణను, నమ్మకత్వాన్ని పట్టించుకోలేదు.’ (మత్త. 23:23) మనం వాళ్లలా కాకుండా, బైబిల్లోని నియమాలు-సూత్రాలు చదివి, అందులో యెహోవా లక్షణాలు ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు, ఆ లక్షణాల్ని మనం చూపించగలుగుతాం.—1 యోహా. 4:8, 11.

మనం యెహోవా గురించి బాగా తెలుసుకోవడానికి ఏం చేయాలి?

11. యెహోవా గురించి మీరు ఎలా తెలుసుకున్నారు?

11 మీకు యెహోవాను పరిచయం చేసింది ఎవరు? బహుశా, మీ అమ్మానాన్నలు బైబిల్లో ఉన్న కథలు చెప్పి, సృష్టిని చూపించి మీకు యెహోవా లక్షణాల గురించి చెప్పుంటారు. లేదా, మీరు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకొని ఉంటారు. మీకు స్టడీ ఇచ్చిన వ్యక్తి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! లాంటి పుస్తకాల్ని ఉపయోగించి ఉంటారు. బైబిలు లేఖనాల్ని వివరించి, సృష్టిలో ఉన్నవాటిని చూపించి యెహోవాకున్న మంచిమంచి లక్షణాల్ని మీకు పరిచయం చేసుంటారు.b (నెహె. 8:8; అపొ. 14:17) అయితే, ఆ పరిచయాన్ని ఇంకా పెంచుకుంటూ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

12-13. బైబిలు చదువుతున్నప్పుడు ఏం గుర్తుపట్టడానికి ప్రయత్నించాలి? ఒక ఉదాహరణ చెప్పండి. (యిర్మీయా 39:15-18) ( చిత్రం కూడా చూడండి.)

12 ముందుగా, యెహోవా గురించి బాగా తెలుసుకోవడానికి మనం బైబిల్ని లోతుగా చదవాలి. కొన్నిసార్లు, దేవునికి ఫలానా లక్షణం ఉందని బైబిల్లో నేరుగా కనిపిస్తుంది. (నిర్గ. 34:6, 7) కానీ ఎక్కువసార్లు మనుషుల గురించి, వాళ్లు తీసుకున్న నిర్ణయాల గురించి బైబిలు చెప్తుంది. వాటిని చదివినప్పుడు, ‘దీన్నుండి నేను యెహోవా గురించి ఏం నేర్చుకున్నాను?’ అని ఆలోచించాలి.

13 ఒక ఉదాహరణ గురించి ఆలోచించండి. యిర్మీయా 38:6-13 లో ఇతియోపీయుడైన ఎబెద్మెలెకు యిర్మీయా ప్రవక్తను కాపాడడం గురించి చదువుతాం. ఈ లేఖనాలు చదివిన వెంటనే, మనకు ఎబెద్మెలెకులో ఉన్న మంచి లక్షణాలు కనిపిస్తాయి. ఆయనలాగే మనం కూడా ఇతరుల కోసం త్యాగాలు చేయాలని, ధైర్యం-ప్రేమ చూపించాలని నేర్చుకుంటాం. అయితే మీకు, యెహోవాకున్న ఏ లక్షణాలు ఈ కథలో కనిపించాయి? (యిర్మీయా 38:6-13 చదవండి.) యెహోవా కోసం మనం చేసే ప్రతీ పనిని ఆయన గుర్తుపెట్టుకుంటాడని, న్యాయంగా ఉంటాడని, పక్షపాతం చూపించడని ఈ వచనాల్ని బట్టి కనిపెట్టగలిగారా? ఈ వచనాల్లో మీరు ఆయన గురించి ఇంకా ఏం నేర్చుకున్నారు? ఇలా బైబిల్ని చదివినప్పుడల్లా, యెహోవా లక్షణాల్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. వాటిని బట్టి ఆయన్ని స్తుతించండి, థాంక్స్‌ చెప్పండి.

ఎబెద్మెలెకు, ఇంకొంతమంది యిర్మీయాను తాడు సహాయంతో గోతిలో నుండి బయటకు లాగుతున్నారు. చుట్టూ కొంతమంది ఆయుధాలతో కాపలాగా నిలబడి ఉన్నారు.

ఎబెద్మెలెకు ధైర్యంగా యిర్మీయాను గోతిలో నుండి బయటికి తీసి కాపాడాడు (12-13 పేరాలు చూడండి)


14. సృష్టి గురించి మనం ఎందుకు బాగా ఆలోచించాలి?

14 రెండవదిగా, సృష్టి గురించి బాగా ఆలోచించినప్పుడు మనం యెహోవా గురించి ఎక్కువ తెలుసుకుంటాం. (కీర్త. 145:9, 10) కొంతమంది తమ జీవితమంతా జంతువుల గురించి, పక్షుల గురించి చదివినా, దేవుని లక్షణాల్ని గుర్తుపట్టలేరు. పైగా అసలు దేవుడే లేడని కూడా చెప్తుంటారు. కాబట్టి ప్రకృతిని చూడడం ఒక్కటే సరిపోదు. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: ‘ఆయన అదృశ్య లక్షణాలు లోకం సృష్టించబడినప్పటి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి; ఆయన చేసినవాటిని గమనించడం ద్వారా ఆ లక్షణాల్ని తెలుసుకోవచ్చు.’ (రోమా. 1:20) ఈ వచనాన్ని ఒక బైబిలు అనువాదం ఇలా వివరిస్తుంది: ‘ఆలోచించే సామర్థ్యం ఉన్నవాళ్లకు దేవుని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.’ కాబట్టి మన సృష్టికర్తకు ఉన్న లక్షణాల్ని అర్థం చేసుకోవాలంటే, మనం సృష్టిలో చూసేవాటి గురించి కాస్త ఆగి ఆలోచించాలి.

15. యెహోవా గురించి బాగా తెలుసుకోవడానికి పాట్రిక్‌ ఏం చేశాడు? దాన్నుండి ఏం నేర్చుకున్నారు? (చిత్రం కూడా చూడండి.)

15 మనలో చాలామందికి సిటీలో ఉండడం వల్ల ప్రకృతికి దూరమైపోతున్నట్టు అనిపించవచ్చు. అలా అనిపించినా, మనం ఏదోక విధంగా సృష్టి నుండి నేర్చుకోవచ్చు అని గుర్తుంచుకోండి. పాట్రిక్‌ అనే బ్రదర్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ద కాంగో అనే దేశంలో ఒక పెద్ద సిటీలో ఉంటాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను నా వరండా నుండి సృష్టిని గమనించడానికి ప్రయత్నిస్తాను. చిన్నచిన్న పురుగులు-పక్షులు ఆహారాన్ని వెతుక్కోవడానికి, గూడు కట్టుకోవడానికి వస్తూ ఉంటాయి. అలా ఒకసారి, కొన్ని పక్షులు మా ప్రాంతంలో దొరికేవాటితో తమ పిల్లల కోసం ఒక చక్కటి, మెత్తటి గూడు కట్టుకోవడం చూశాను.” పాట్రిక్‌ అది చూసి ఆనందించడమే కాదు, సృష్టికర్త గురించి కూడా ఆలోచించాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఆ చిన్నచిన్న ప్రాణుల గురించే యెహోవా అంత పట్టించుకున్నాడంటే నన్ను, నా అవసరాల్ని తప్పకుండా పట్టించుకుంటాడని అనిపించింది.’

పెద్ద సిటీలో ఉంటున్న ఒక సిస్టర్‌ తన వరండాలోని మొక్కలకు నీళ్లు పోస్తూ, పువ్వుల మీద వాలిన పక్షిని చూసి ఆనందిస్తుంది.

సృష్టిలో కనిపించేవాటి గురించి ఆలోచించడం ద్వారా యెహోవా గురించి బాగా తెలుసుకోవచ్చు (15వ పేరా చూడండి)


16. యెహోవా గురించి బాగా తెలుసుకోవడానికి యేసు తల్లి మరియకు ఏం సహాయం చేసింది? ఆమెలా మనం ఎలా ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

16 మూడవదిగా, యెహోవా ఇప్పటివరకు మనకు ఎలా సహాయం చేస్తూ వచ్చాడో ఆలోచిస్తే, ఆయన గురించి ఇంకా బాగా తెలుసుకుంటాం. యేసు తల్లి మరియ కూడా అదే చేసింది. అప్పటికే ఆమెకు యెహోవా గురించి బాగా తెలుసు, ‘ఆయన దయను కూడా పొందింది.’ (లూకా 1:30) అయితే, ఆమెకు దేవుని కుమారుని తల్లిగా ఉండే ఒక బరువైన బాధ్యత ఇవ్వబడింది. ఆ సమయంలో యెహోవా గబ్రియేలు దూతను, ఆమె బంధువైన ఎలీసబెతును ఉపయోగించుకొని మరియను బలపర్చాడు, ఆమెలో ధైర్యాన్ని నింపాడు. తర్వాత, ఆమె తనకు ఎదురైన అనుభవాల నుండి యెహోవా గురించి ఏం నేర్చుకుందో బాగా ఆలోచించింది. ఆయన శక్తి-కరుణ గల దేవుడని, ఆయన పక్షపాతం చూపించడని, తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లను పట్టించుకుంటాడని అర్థంచేసుకుంది. (లూకా 1:46-55) మనకు కూడా యెహోవా “సరిగ్గా అవసరమైనప్పుడు” సహాయం చేస్తాడు. (హెబ్రీ. 4:16, అధస్సూచి) అప్పుడు మరియలాగే మనం యెహోవాకు కృతజ్ఞత చూపించాలి. అలా సహాయం పొందినప్పుడల్లా ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ అనుభవం నుండి నేను యెహోవా గురించి ఏం నేర్చుకున్నాను? ఆయనకున్న ఏ లక్షణాలు నాకు కనిపించాయి?’

చిత్రాలు: ఒక బ్రదర్‌ తనకు యెహోవా చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుంటున్నాడు. 1. ఆయన భయంభయంగా ఒక నియామకం గురించి ప్రార్థిస్తున్నాడు. 2. తన నియామకాన్ని స్టేజీ మీద చక్కగా చేశాడు.

మీకు యెహోవా ఎలా సహాయం చేశాడో ఆలోచించడం ద్వారా ఆయన గురించి బాగా తెలుసుకోవచ్చు (16వ పేరా చూడండి)c


మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం

17-18. మనం యెహోవా గురించి ఎందుకు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం?

17 మనం కొత్త లోకంలో యెహోవా గురించి ఇంకెంత బాగా తెలుసుకుంటామో ఒక్కసారి ఆలోచించండి! ఆయన మన నుండి ఏం కోరుతున్నాడో చెప్పే కొత్త గ్రంథపు చుట్టల్ని పొందుతాం. (ప్రక. 20:12) సృష్టిని ఇంకా దగ్గరగా ఆస్వాదించగలుగుతాం. (యెష. 11:6-9) కొత్తకొత్త అనుభవాల్ని రుచిచూస్తాం; అంటే, చనిపోయిన మన కుటుంబ సభ్యులు-స్నేహితులు తిరిగి బ్రతకడాన్ని చూస్తాం, మనం రోజురోజుకూ పరిపూర్ణులం అవుతాం. వీటన్నిటి ద్వారా మనం యెహోవాను ఇంకా బాగా తెలుసుకుంటాం.

18 మనం యెహోవా గురించి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. ఆయన యుగయుగాల నుండి ఉన్నాడు కాబట్టి “ఆయన అవగాహనకు పరిమితి లేదు.” (కీర్త. 90:2; 147:5) మనం ‘సత్యదేవుడు చేసిన పనిని ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం.’ (ప్రసం. 3:11) కాబట్టి మనం ఎంతకాలంగా సత్యంలో ఉన్నా, మన ప్రేమగల తండ్రి గురించి తెలుసుకోవడానికి దొరికే ఏ అవకాశాన్నీ వదులుకోవద్దు.

మీరెలా జవాబిస్తారు?

  • యెహోవాను బాగా తెలుసుకోవడం అంటే ఏంటి?

  • యెహోవా గురించి ఎందుకు తెలుసుకుంటూ ఉండాలి?

  • మనం యెహోవా గురించి బాగా తెలుసుకోవడానికి ఏం చేయాలి?

పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

a కొత్త లోక అనువాదం బైబిల్లోని పరిచయం అనే భాగంలో “దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి” కిందున్న 20వ ప్రశ్న చూడండి.

b ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 7వ పాఠంలో, 5-7 పాయింట్లు చూడండి.

c చిత్రాల వివరణ: ప్రసంగాలు ఇవ్వడానికి బాగా భయపడే ఒక బ్రదర్‌, వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో యెహోవా తనకు ఎలా సహాయం చేశాడో ఆలోచిస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి