కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 జూన్‌ పేజీలు 2-7
  • యాకోబు చివరి మాటల్లో పాఠాలు​​—1వ భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యాకోబు చివరి మాటల్లో పాఠాలు​​—1వ భాగం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రూబేను
  • షిమ్యోను, లేవి
  • యూదా
  • యాకోబు చివరి మాటల్లో పాఠాలు—2వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ప్రమాదానికి ఎదురెళ్లాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • యాకోబు ఏశావు కలిసిపోయారు
    నా బైబిలు పుస్తకం
  • యాకోబు పెద్ద కుటుంబం
    నా బైబిలు కథల పుస్తకము
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 జూన్‌ పేజీలు 2-7

అధ్యయన ఆర్టికల్‌ 24

పాట 98 లేఖనాల్ని దేవుడు ప్రేరేపించాడు

యాకోబు చివరి మాటల్లో పాఠాలు—1వ భాగం

“అందరూ నా దగ్గరికి రండి. చివరి రోజుల్లో మీకు ఏమి జరుగుతుందో చెప్తాను.” —ఆది. 49:1.

ముఖ్యాంశం

రూబేను, షిమ్యోను, లేవి అలాగే యూదా గురించి యాకోబు చెప్పిన చివరి మాటల్లో మనకున్న పాఠాలు.

1-2. చనిపోయే ముందు యాకోబు ఏం చేశాడు? ఎందుకు? (చిత్రం కూడా చూడండి.)

యెహోవాకు నమ్మకంగా సేవ చేసిన యాకోబు తన పిల్లాపాపలతో కనాను నుండి ఐగుప్తుకి వచ్చి 17 సంవత్సరాలు దాటింది. (ఆది. 47:28) ఆ సంవత్సరాల్లో ఆయన జీవితం సంతోషంగా సాగింది. ఎందుకంటే, తన ముద్దుల కొడుకైన యోసేపును ఆయన తిరిగి కలుసుకున్నాడు. అలాగే తన కుటుంబమంతా కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు యాకోబుకు కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని అర్థమైంది. అందుకే తన కుటుంబాన్నంతా ఒక దగ్గరికి రమ్మని ఆయన పిలిచాడు.—ఆది. 49:28.

2 సాధారణంగా అప్పట్లో కుటుంబ పెద్ద చనిపోయేముందు కుటుంబాన్నంతా ఒక దగ్గరికి పిలిచి, చివరిసారి వాళ్లకు కావాల్సిన మంచి-చెడులు చెప్పడం ఒక ఆనవాయితీ. (యెష. 38:1) బహుశా అలా పిలిచినప్పుడే, తమ తర్వాత కుటుంబ పెద్ద ఎవరో కూడా చెప్పేవాళ్లు.

యాకోబు చనిపోయే ముందు తన 12మంది కొడుకులకు చివరి మాటలు చెప్తున్నాడు (1-2 పేరాలు చూడండి)


3. ఆదికాండం 49:1, 2 ప్రకారం, యాకోబు మాటలు ఎందుకు చాలా ప్రాముఖ్యమైనవి?

3 ఆదికాండం 49:1, 2 చదవండి. అయితే, యాకోబు మాత్రం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పడానికి అందర్నీ పిలిచాడు. యాకోబు ఒక ప్రవక్త. కాబట్టి ఈ సందర్భంలో, తన వంశస్థులకు భవిష్యత్తులో జరగబోయే ముఖ్యమైన సంఘటనల గురించి చెప్పేలా యెహోవా తన పవిత్రశక్తి ద్వారా ఆయన్ని ప్రేరేపించాడు. అందుకే కొన్నిసార్లు యాకోబు చెప్పిన ఈ మాటల్ని, చనిపోయేముందు చెప్పిన ప్రవచనం అని అంటారు.

4. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం? (“యాకోబు కుటుంబం” అనే బాక్స్‌ కూడా చూడండి.)

4 యాకోబు కొడుకుల్లో నలుగురితో అంటే రూబేను, షిమ్యోను, లేవి అలాగే యూదాతో ఆయన ఏం చెప్పాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. తర్వాతి ఆర్టికల్‌లో, యాకోబు తన మిగతా ఎనిమిదిమంది కొడుకులతో ఏం చెప్పాడో చూస్తాం. అయితే, యాకోబు కేవలం తన కొడుకుల గురించే కాదు, వాళ్ల వారసుల గురించి కూడా మాట్లాడాడు. ఆఖరికి వాళ్లందరూ ఇశ్రాయేలు జనాంగంగా అవుతారు. వాళ్ల చరిత్ర గమనిస్తే యాకోబు చెప్పిన ప్రవచనం నిజమైందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు, ఆయన మాటల్ని పరిశీలిస్తూ మన పరలోక తండ్రైన యెహోవాను సంతోషపెట్టడానికి ఉపయోగపడే కొన్ని విలువైన పాఠాలు నేర్చుకుందాం.

యాకోబు కుటుంబాన్ని చూపించే చార్టు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒకరు లేయా, ఇంకొకరు రాహేలు. అంతేకాదు, బిల్హా అలాగే జిల్పా అనే ఇద్దరు ఉపపత్నులు కూడా ఉన్నారు. లేయాకు పుట్టిన పిల్లలు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దీనా. రాహేలుకు పుట్టిన పిల్లలు: యోసేపు, బెన్యామీను. బిల్హాకు పుట్టిన పిల్లలు: దాను, నఫ్తాలి. జిల్పాకు పుట్టిన పిల్లలు: గాదు, ఆషేరు.

రూబేను

5. పెద్ద కొడుకుగా రూబేను ఏమేం ఆశపడి ఉంటాడు?

5 యాకోబు అందరికన్నా ముందు రూబేనుతో ఇలా అన్నాడు: “నువ్వు నా పెద్ద కుమారుడివి.” (ఆది. 49:3) రూబేను అందరికన్నా పెద్దోడు కాబట్టి మిగతావాళ్ల కన్నా ఆస్తిలో రెండింతలు ఎక్కువ వస్తుందని ఆశపడి ఉంటాడు. అలాగే యాకోబు చనిపోయిన తర్వాత తనే కుటుంబ పెద్ద అవుతాడని అనుకొని ఉంటాడు. తర్వాతి తరాల్లో కూడా కుటుంబం మొత్తాన్ని నడిపించేది తన గోత్రం వాళ్లే అని రూబేను అనుకొని ఉంటాడు.

6. రూబేను పెద్ద కొడుకుగా తన హక్కును ఎందుకు పోగొట్టుకున్నాడు? (ఆదికాండం 49:3, 4)

6 కానీ రూబేను ఒక పెద్ద కొడుకుగా తన హక్కును పోగొట్టుకున్నాడు. (1 దిన. 5:1) ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం యాకోబు ఉపపత్ని అయిన బిల్హాతో రూబేను లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ఎవరో కాదు, చనిపోయిన యాకోబు భార్య రాహేలుకు సేవకురాలు. (ఆది. 35:19, 22) అయితే, రూబేను యాకోబు ఇంకో భార్య లేయాకు పుట్టిన కొడుకు. బహుశా రూబేను బిల్హా మీద కోరిక పెంచుకొని ఉంటాడు, లేదా బిల్హా తన తల్లి స్థానాన్ని ఎక్కడ లాగేసుకుంటుందో అనే భయంతో ఆమెను పాడుచేయాలని అనుకుని ఉంటాడు. కారణం ఏదైనాసరే, అతను చేసింది మాత్రం యెహోవాకు, యాకోబుకు అస్సలు నచ్చలేదు!—ఆదికాండం 49:3, 4 చదవండి.

7. యాకోబు రూబేనుతో ఏం చెప్పాడు? మరి, ఆయన వంశస్థుల సంగతేంటి? (“యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం” అనే బాక్స్‌ కూడా చూడండి.)

7 యాకోబు రూబేనుతో ఇలా అన్నాడు: “నువ్వు వర్ధిల్లవు.” ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. రూబేను వంశస్థుల్లో ఎవ్వరూ రాజుగా, యాజకుడిగా, ప్రవక్తగా అయినట్టు బైబిల్లో లేదు. కానీ యాకోబు తన కొడుకుని అలానే వదిలేయకుండా ఆస్తిని ఇచ్చాడు. అలాగే రూబేను వంశస్థులు ఒక గోత్రంగా అయ్యారు. (యెహో. 12:6) అయితే, రూబేను వేరే సందర్భాల్లో మంచి లక్షణాలు చూపించాడు. అలాగే, బిల్హాతో తప్పు చేసిన తర్వాత ఆయన మళ్లీ లైంగిక పాపం చేసినట్టు బైబిల్లో ఎక్కడా లేదు.—ఆది. 37:20-22; 42:37.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

రూబేను.

కొడుకు

రూబేను

ప్రవచనం

“నువ్వు వర్ధిల్లవు.”—ఆది. 49:4.

నెరవేర్పు

ఇశ్రాయేలీయులకు రూబేను గోత్రంవాళ్లు ఎప్పుడూ నాయకత్వం వహించలేదు.—1 దిన. 5:1, 2.

8. రూబేను నుండి మనకు ఏంటి పాఠం?

8 మనకు ఏంటి పాఠం? మనం తప్పుడు కోరికలతో పోరాడుతూ, లైంగిక పాపం చేయకుండా ఆత్మనిగ్రహం చూపించాలని గట్టిగా నిర్ణయించుకోవాలి. ఒకవేళ మనకు ఏదైనా పాపం చేయాలనే కోరిక వస్తే అప్పుడేంటి? ఒక క్షణం ఆగి, మన పనులు యెహోవాను, మన కుటుంబ సభ్యుల్ని అలాగే వేరేవాళ్లను ఎంత బాధపెడతాయో ఆలోచించాలి. అలాగే ‘మనం ఏం విత్తుతామో అదే కోస్తాం’ అని గుర్తుంచుకోవాలి. (గల. 6:7) ఇంకోపక్క, రూబేనుకు జరిగిన దాంట్లో యెహోవా కరుణ కనిపిస్తుంది. మన తప్పుల వల్ల వచ్చే కష్టాల నుండి యెహోవా మనల్ని కాపాడడు. కానీ పశ్చాత్తాపం చూపించి, సరైనది చేయడానికి మనం చేసే ప్రయత్నాన్ని మాత్రం ఆయన దీవిస్తాడు.

షిమ్యోను, లేవి

9. షిమ్యోను, లేవి విషయంలో యాకోబుకు ఎందుకు అసంతృప్తి మిగిలింది? (ఆదికాండం 49:5-7)

9 ఆదికాండం 49:5-7 చదవండి. ఇప్పుడు, యాకోబు షిమ్యోను, లేవిలతో మాట్లాడాడు. వాళ్ల విషయంలో యాకోబుకు అసంతృప్తి మిగిలిందని అర్థమౌతుంది. కొన్నేళ్ల క్రితం యాకోబు కూతురు దీనాను కనానీయుడైన షెకెము పాడు చేశాడు. దానివల్ల యాకోబు కొడుకులందరికీ కోపం రావడంలో తప్పులేదు. కానీ షిమ్యోను, లేవికి కోపం కట్టలు తెంచుకుంది. అయితే, షెకెము నగరంలో ఉన్న పురుషులందరూ సున్నతి చేయించుకుంటే వాళ్లను వదిలేస్తామని వీళ్లు మాట ఇచ్చారు. దానికి అక్కడున్న పురుషులందరూ ఒప్పుకున్నారు. కానీ వాళ్లందరూ సున్నతి చేయించుకున్న నొప్పిలో ఉన్నప్పుడే షిమ్యోను, లేవి “తమ కత్తులు తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా నగరంలోకి ప్రవేశించి, ప్రతీ పురుషుణ్ణి చంపేశారు.”—ఆది. 34:25-29.

10. షిమ్యోను, లేవి గురించి యాకోబు చెప్పిన ప్రవచనం ఎలా నిజమైంది? (“యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం” అనే బాక్స్‌ కూడా చూడండి.)

10 తన ఇద్దరు కొడుకులు చేసిన రక్తపాతానికి యాకోబుకు విపరీతమైన కోపం వచ్చింది. అందుకే, వాళ్లిద్దరి వంశస్థులు ఇశ్రాయేలు అంతట్లో చెల్లాచెదురు అవుతారని చెప్పాడు. ఆ ప్రవచనం 200 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత అంటే ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత నిజమైంది. షిమ్యోను గోత్రంవాళ్లు యూదా క్షేత్రంలో ఉన్న కొన్ని మారుమూల ప్రాంతాల్లో స్థిరపడ్డారు. (యెహో. 19:1) లేవి గోత్రంవాళ్లు ఇశ్రాయేలు అంతట్లో చెదిరి ఉన్న 48 నగరాల్లో స్థిరపడ్డారు.—యెహో. 21:41.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

షిమ్యోను.

కొడుకు

షిమ్యోను

ప్రవచనం

“యాకోబు దేశంలో వాళ్లను చెదరగొడతాను.”—ఆది. 49:7.

నెరవేర్పు

షిమ్యోను గోత్రంవాళ్లు యూదా క్షేత్రంలో ఉన్న కొన్ని మారుమూల ప్రాంతాల్లో స్థిరపడ్డారు.—యెహో. 19:1-8.

లేవి.

కొడుకు

లేవి

ప్రవచనం

“ఇశ్రాయేలు దేశంలో వాళ్లను చెల్లాచెదురు చేస్తాను.”—ఆది. 49:7.

నెరవేర్పు

లేవి గోత్రంవాళ్లు ఇశ్రాయేలు అంతట్లో చెదిరివున్న 48 నగరాల్లో స్థిరపడ్డారు.—యెహో. 21:41.

11. షిమ్యోను అలాగే లేవి గోత్రంవాళ్లు ఎలాంటి మంచి పనులు చేశారు?

11 షిమ్యోను అలాగే లేవి చేసిన తప్పుల్ని వాళ్ల వంశస్థులు చేయకుండా జాగ్రత్తపడ్డారు. లేవి గోత్రంవాళ్లు సత్యారాధనకు చాలా నమ్మకంగా ఉన్నారు. ఒకసారి ఏమైందంటే, యెహోవా ఇచ్చే ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్లాడు. అప్పుడు కిందున్న చాలామంది ఇశ్రాయేలీయులు దూడను ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ లేవి గోత్రంవాళ్లు మాత్రం ఆరాధించలేదు. అంతేకాదు, దూడను ఆరాధించిన వాళ్లందర్నీ చంపడంలో లేవి గోత్రంవాళ్లు మోషేకు మద్దతుగా నిలబడ్డారు. (నిర్గ. 32:26-29) అందుకే, యెహోవా లేవి గోత్రంవాళ్లకి ఇశ్రాయేలులో యాజకులుగా సేవచేసే గొప్ప అవకాశం ఇచ్చాడు. (నిర్గ. 40:12-15; సంఖ్యా. 3:11, 12) షిమ్యోను గోత్రంవాళ్ల విషయానికొస్తే, వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కనానీయులతో చేసిన యుద్ధంలో షిమ్యోను గోత్రంవాళ్లు యూదావాళ్లతో చేయి కలిపారు.—న్యాయా. 1:3, 17.

12. షిమ్యోను అలాగే లేవి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

12 మనకు ఏంటి పాఠం? కోపం మనలో ఒక లోపం కాకుండా చూసుకోవాలి. మనకు గానీ, మన ఇంట్లోవాళ్లకు గానీ అన్యాయం జరిగినప్పుడు కోపం రావడం సహజమే. (కీర్త. 4:4) అయితే కోపంతో మనం చేసే పనులు, మన మాటలు యెహోవాను బాధపెడతాయని గుర్తుంచుకోవాలి. (యాకో. 1:20) సంఘం బయట గానీ, సంఘం లోపల గానీ అన్యాయం జరిగినప్పుడు మనం బైబిలు ప్రమాణాల ప్రకారం ప్రవర్తించాలి. అలాగే వేరేవాళ్లను బాధపెట్టే పని చేయకుండా, మాట అనకుండా జాగ్రత్తపడాలి. (రోమా. 12:17, 19; 1 పేతు. 3:9) ఒకవేళ మీ అమ్మానాన్నలు యెహోవాకు ఇష్టంలేని పనులు చేస్తుంటే, మీరు వాళ్లలా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మీరు యెహోవాను ఎప్పుడూ సంతోషపెట్టలేరు అని అనుకోకండి. ఏం జరిగినా సరే, సరైనది చేస్తూ ముందుకు వెళ్లడానికి మీరు చేసే ప్రతీ ప్రయత్నంలో యెహోవా మీ వెన్నంటే ఉంటాడు.

యూదా

13. యూదా ఎందుకు కంగారుపడి ఉంటాడు?

13 యాకోబు తన తర్వాతి కొడుకైన యూదాతో మాట్లాడాడు. తన అన్నలతో యాకోబు చెప్పిన మాటలు విన్న తర్వాత యూదా కాస్త కంగారుపడి ఉంటాడు. ఎందుకంటే ఈయన కూడా కొన్ని పెద్దపెద్ద తప్పులే చేశాడు. షెకెము నగరంలో ఉన్న పురుషులందరినీ చంపడంలో ఈయన హస్తం కూడా ఉండి ఉంటుంది. (ఆది. 34:27) యోసేపును అమ్మడంలో, తన తండ్రికి అబద్ధం చెప్పడంలో తన అన్నదమ్ములతో ఈయన చేయి కలిపాడు. (ఆది. 37:31-33) తర్వాత వ్యభిచారి అనుకొని తన కోడలు తామారుతో లైంగికంగా కలిశాడు.—ఆది. 38:15-18.

14. యూదా చేసిన మంచి పనులు ఏంటి? (ఆదికాండం 49:8, 9)

14 కానీ పవిత్రశక్తి ప్రేరణతో యాకోబు యూదాను మెచ్చుకున్నాడు, దీవించాడు. (ఆదికాండం 49:8, 9 చదవండి.) ఎందుకంటే, ముసలితనంలో ఉన్న యాకోబును యూదా బాగా చూసుకున్నాడు. అలాగే తన చిన్న తమ్ముడైన బెన్యామీను మీద కనికరం చూపించాడు.—ఆది. 44:18, 30-34.

15. యాకోబు యూదాకు ఇచ్చిన దీవెన ఎలా నిజమైంది?

15 యాకోబు ముందే చెప్పినట్టు, తన అన్నదమ్ములకు యూదా నాయకుడిగా ఉంటాడు. అయితే, ఆ ప్రవచనం నెరవేరడానికి 200 సంవత్సరాలు పట్టింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలై వాగ్దాన దేశానికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, యూదా గోత్రంవాళ్లే ముందు బయల్దేరారు. వాళ్ల వెనక మిగతా గోత్రాలవాళ్లు వచ్చారు. (సంఖ్యా. 10:14) కొన్ని దశాబ్దాల తర్వాత, వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కనానీయులతో చేసిన యుద్ధంలో యూదా గోత్రం వాళ్లే నాయకత్వం వహించారు. (న్యాయా. 1:1, 2) అలాగే, యూదా గోత్రం నుండి చాలామంది రాజులు వచ్చారు. వాళ్లలో దావీదు మొట్టమొదటి రాజు. అయితే, యూదా గురించిన ప్రవచన నెరవేర్పు అంతటితో ఆగిపోలేదు.

16. ఆదికాండం 49:10 లో ఉన్న ప్రవచనం ఎలా నెరవేరింది? (“యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం” అనే బాక్స్‌ కూడా చూడండి.)

16 మనుషుల్ని ఎప్పటికీ పరిపాలించే రాజు యూదా గోత్రం నుండి వస్తాడని యాకోబు చెప్పాడు. (ఆదికాండం 49:10 అలాగే అధస్సూచి చదవండి.) ఆ రాజు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయన్ని యాకోబు “షిలోహు” అని పిలిచాడు. యేసుక్రీస్తు గురించి ఒక దేవదూత ఇలా చెప్పాడు: “ఆయన తండ్రైన దావీదు సింహాసనాన్ని యెహోవా దేవుడు ఆయనకు ఇస్తాడు.” (లూకా 1:32, 33) అంతేకాదు యేసుక్రీస్తు, “యూదా గోత్రపు సింహం” అని కూడా పిలవబడ్డాడు.—ప్రక. 5:5.

యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం

యూదా.

కొడుకు

యూదా

ప్రవచనం

“షిలోహు వచ్చేవరకు యూదా దగ్గర నుండి రాజదండం తొలగిపోదు.”—ఆది. 49:10.

నెరవేర్పు

యూదా వంశస్థుడైన యేసు దేవుని రాజ్యానికి రాజుగా ఉంటాడు.—లూకా 1:32, 33.

17. ఇతరుల్ని యెహోవా చూసినట్టు మనం ఎలా చూడాలి?

17 మనకు ఏంటి పాఠం? యూదా పెద్దపెద్ద తప్పులు చేసినా యెహోవా ఆయన్ని దీవించాడు. అసలు యెహోవా ఆయనలో ఏం చూశాడా అని ఆయన అన్నదమ్ములు అనుకొని ఉండవచ్చు. వాళ్లు ఏమనుకున్నారో మనకు తెలీదు కానీ, యెహోవా యూదాలో మంచిని చూసి దీవించాడు. మరి మనం యెహోవాలా ఎలా ఉండొచ్చు? మన తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఏదైనా సేవావకాశం వస్తే, అసలు ఇలాంటివాళ్లకి యెహోవా ఆ అవకాశం ఎలా ఇచ్చాడని మనకు అనిపించవచ్చు. కానీ యెహోవాకు వాళ్లలో ఉన్న మంచి లక్షణాలు నచ్చి ఆ అవకాశం ఇచ్చాడని మనం గుర్తుంచుకోవాలి. ఆయన తన ఆరాధకుల్లో మంచినే చూస్తాడు, మనం కూడా అదే చేయాలి.

18. మనం ఎందుకు ఓర్పుగా ఉండాలి?

18 యూదాకు జరిగిన దాన్నుండి మనం ఇంకో పాఠం కూడా నేర్చుకోవచ్చు. అదేంటంటే, మనం ఓర్పు చూపించాలి. యెహోవా మాట మీద నిలబడే దేవుడు. అయితే యెహోవా చెప్పింది మనం అనుకున్న విధంగా, మనం అనుకున్న సమయంలో నిజం కాకపోవచ్చు. ఉదాహరణకు, దేవుని ప్రజల్ని నడిపించడానికి యూదా వంశస్థులు వెంటనే నాయకత్వం వహించలేదు. తమ వంతు వచ్చేవరకు యెహోవా ఎవరిని ఉపయోగిస్తే వాళ్లకు నమ్మకంగా మద్దతిచ్చారు. అంటే లేవీయుడైన మోషేకు, ఎఫ్రాయిమీయుడైన యెహోషువకు అలాగే బెన్యామీనీయుడైన సౌలు రాజుకు మద్దతిచ్చారు. మనం కూడా ఇప్పుడు, యెహోవా తన ప్రజల్ని నడిపించడానికి ఎవరిని ఉపయోగించినా ఇష్టంగా మద్దతివ్వాలి.—హెబ్రీ. 6:12.

19. యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం నుండి ఇప్పటివరకు మనమేం నేర్చుకున్నాం?

19 యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం నుండి ఇప్పటివరకు మనమేం నేర్చుకున్నాం? “మనుషులు చూసినట్టు దేవుడు చూడడు” అనేది స్పష్టంగా తెలుసుకున్నాం. (1 సమూ. 16:7) యెహోవాకు ఓర్పు, క్షమించే గుణం చాలా ఉన్నాయి. ఆయన తప్పును సహించడు. అలాగని తన ఆరాధకులు, ఒక్క పొరపాటు కూడా చేయకూడదని ఆశించడు. గతంలో పెద్దపెద్ద తప్పులు చేసి, ఇప్పుడు పశ్చాత్తాపం చూపించి, సరైనది చేయాలనుకునే వాళ్లను ఆయన దీవిస్తాడు. తర్వాతి ఆర్టికల్‌లో, మిగిలిన తన ఎనిమిదిమంది కొడుకులకు యాకోబు ఏం చెప్పాడో చూస్తాం.

యాకోబు వీళ్లకు చెప్పిన మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?

  • రూబేను?

  • షిమ్యోను, లేవి?

  • యూదా?

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి