అధ్యయన ఆర్టికల్ 17
పాట 99 వేవేల సహోదరులు
మనం అస్సలు ఒంటరివాళ్లం కాదు!
‘నేను నీకు సహాయం చేస్తాను.’—యెష. 41:10.
ముఖ్యాంశం
యెహోవా మనల్ని పట్టించుకునే నాలుగు విధానాల్ని చూస్తాం.
1-2. (ఎ) కష్టాల్లో మనం ఎప్పుడూ ఒంటరివాళ్లం కాదని ఎందుకు చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
మనకు పెద్దపెద్ద కష్టాలు వచ్చినప్పుడు, సహాయం చేసేవాళ్లు ఎవ్వరూ లేక నడిసముద్రంలో ఏకాకిగా ఉన్నట్టు మనకు అనిపించవచ్చు. కానీ కష్టాల్లో మనం ఒంటరివాళ్లం కాదు. మన ప్రేమగల పరలోక తండ్రి మనం పడే ఆటుపోట్లను చూడడమే కాదు, వాటిని గట్టెక్కడానికి సహాయం చేస్తానని కూడా మాటిస్తున్నాడు. తన నమ్మకమైన సేవకులకు ఆయన ఈ ధైర్యం చెప్పాడు: ‘నేను నీకు సహాయం చేస్తాను.’—యెష. 41:10.
2 యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. (1) ఆయన దిశానిర్దేశాలు ఇస్తాడు, (2) మనం బ్రతకడానికి కావాల్సినవి ఇస్తాడు, (3) మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు, (4) మనకు ఓదార్పు ఇస్తాడు. జీవితంలో మనకు ఎంతపెద్ద కష్టం వచ్చినాసరే మన వెనుక యెహోవా ఉంటాడు. ఆయన మనల్ని అస్సలు వదిలేయడు. కాబట్టి మనం ఎప్పుడూ ఒంటరివాళ్లం కాదు.
యెహోవా మనకు దిశానిర్దేశాలు ఇస్తాడు
3-4. యెహోవా మనకు దిశానిర్దేశాలు ఎలా ఇస్తాడు? (కీర్తన 48:14)
3 కీర్తన 48:14 చదవండి. మీది మీరు చూసుకోండి అని యెహోవా మనల్ని వదిలేయలేదు. మరి ప్రస్తుతం తన నమ్మకమైన ఆరాధకులకు యెహోవా ఎలా దిశానిర్దేశాలు ఇస్తున్నాడు? ఒక విధానం ఏంటంటే బైబిలు ద్వారా. (కీర్త. 119:105) తన పవిత్రశక్తితో రాయించిన ఆ బైబిల్లో, మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, ఇప్పుడు అలాగే భవిష్యత్తులో శాశ్వతకాలం సంతోషంగా ఉండడానికి ఏ లక్షణాలు కావాలో ఆయన నేర్పిస్తున్నాడు.a ఉదాహరణకు, మనం కోపాన్ని మనసులో పెట్టుకోవద్దని, నిజాయితీగా బ్రతకాలని, వేరేవాళ్లను మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఆయన చెప్తున్నాడు. (కీర్త. 37:8; హెబ్రీ. 13:18; 1 పేతు. 1:22) దేవునికున్న అలాంటి లక్షణాల్ని చూపిస్తే మనం మంచి అమ్మానాన్నలుగా, మంచి భార్యాభర్తలుగా, మంచి ఫ్రెండ్స్‌గా తయారౌతాం.
4 అంతేకాదు, మనలాంటి కష్టాలు-బాధలు పడ్డ వాళ్ల జీవిత కథల్ని యెహోవా బైబిల్లో రాయించాడు. (1 కొరిం. 10:13; యాకో. 5:17) వాటిని చదివినప్పుడు, వాళ్లనుండి నేర్చుకున్నవి పాటించినప్పుడు మనకు కనీసం రెండు ప్రయోజనాలు ఉంటాయి: ఒకటి మనం ఒంటరివాళ్లం కాదని అర్థమౌతుంది. ఎందుకంటే మనలాంటి కష్టాలే పడి వాటినుండి చక్కగా బయటపడ్డవాళ్లు ఉన్నారు. (1 పేతు. 5:9) రెండోది, మన కష్టాల్ని ఎలా తట్టుకోవాలో నేర్చుకుంటాం.—రోమా. 15:4.
5. మనకు దిశానిర్దేశాల్ని ఇవ్వడానికి యెహోవా ఎవర్ని కూడా ఇచ్చాడు?
5 యెహోవా మనకు దిశానిర్దేశాలు ఇవ్వడానికి బ్రదర్స్‌సిస్టర్స్‌ని కూడా ఇచ్చాడు.b ఉదాహరణకు, ప్రాంతీయ పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు సంఘాలకు వచ్చి మనల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ల ప్రసంగాలు మన విశ్వాసాన్ని పెంచుతాయి. మన మధ్యవున్న అమూల్యమైన ఐక్యతను కాపాడుకునేలా చేస్తాయి. (అపొ. 15:40–16:5) సంఘపెద్దలు కూడా ప్రతీ ప్రచారకుల బాగోగుల్ని నిజంగా పట్టించుకుంటారు. (1 పేతు. 5:2, 3) అమ్మానాన్నలు తమ పిల్లలు యెహోవాను ప్రేమించేలా, మంచి నిర్ణయాలు తీసుకునేలా, మంచి అలవాట్లను పెంచుకునేలా సహాయం చేస్తారు. (సామె. 22:6) పరిణతిగల స్త్రీలు యౌవన సహోదరీలకు మంచి ఆదర్శాన్ని ఉంచుతూ వాళ్లకు కావాల్సిన సలహాల్ని, ప్రోత్సాహాన్ని ఇస్తారు.—తీతు 2:3-5.
6. మన వైపు నుండి మనం ఏం చేయాలి?
6 తన వైపు నుండి ఏం చేయాలో అవన్నీ యెహోవా చేశాడు. మరి మన వైపు నుండి మనం ఏం చేయాలి? సామెతలు 3:5, 6 ఇలా చెప్తుంది: “నీ నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు, నీ సొంత అవగాహన మీద ఆధారపడకు.” అవును, మనం అలా చేసినప్పుడు “ఆయన [మన] జీవితాన్ని సఫలం చేస్తాడు,” అంటే చాలావరకు సమస్యలు రాకుండా చేస్తాడు, మన జీవితాన్ని సంతోషంతో నింపేస్తాడు. మనల్ని నిజంగా ప్రేమించి, మనకు సరిగ్గా అవసరమైన సలహాలు ఇస్తున్నందుకు యెహోవాకు మనం ఎంత రుణపడి ఉన్నామో కదా!—కీర్త. 32:8.
మనం బ్రతకడానికి కావాల్సినవి యెహోవా ఇస్తాడు
7. మనం బ్రతకడానికి కావాల్సినవి యెహోవా ఎలా చూసుకుంటాడు? (ఫిలిప్పీయులు 4:19)
7 ఫిలిప్పీయులు 4:19 చదవండి. యెహోవా మనకు ఆధ్యాత్మికంగా కావాల్సినవి చూసుకోవడమే కాదు. ఆహారం, బట్టలు, ఇల్లు కోసం మనం పడే కష్టాల్ని కూడా దీవిస్తాడు. (మత్త. 6:33; 2 థెస్స. 3:12) నిజమే, మనకు కావాల్సిన వాటిగురించి కాస్త కంగారుపడడం సహజమే. కానీ వాటిగురించి అతిగా ఆందోళనపడొద్దని యెహోవా చెప్తున్నాడు. (మత్తయి 6:25) ఎందుకు? ఎందుకంటే తన నమ్మకమైన ఆరాధకులు కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవా వాళ్ల చెయ్యి అస్సలు వదిలిపెట్టడు. (మత్త. 6:8; హెబ్రీ. 13:5) మనల్ని చూసుకుంటానని ఆయనే మాటిచ్చాడు. కాబట్టి యెహోవా ఉండగా మనకు టెన్షన్ దండగ!
8. యెహోవా దావీదుకు ఏం చేశాడు?
8 యెహోవా దావీదుకు కావాల్సినవి ఎలా ఇచ్చాడో చూడండి. సౌలు రాజు దగ్గర నుండి పారిపోతున్నప్పుడు దావీదుకు కొన్ని సంవత్సరాలు గడ్డుకాలం వచ్చింది. అప్పుడు ఆయన, ఆయనతోపాటు ఉన్నవాళ్లు బ్రతకడానికి కావాల్సినవి యెహోవా ఇచ్చాడు. ఆ సంవత్సరాలన్నిటిలో యెహోవా తనను ఎంతబాగా చూసుకున్నాడో ఆలోచిస్తూ దావీదు ఇలా రాశాడు: “ఒకప్పుడు నేను చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి, అయితే ఒక్క నీతిమంతుడైనా విడిచిపెట్టబడడం గానీ, అతని పిల్లలు ఆహారం కోసం భిక్షమెత్తుకోవడం గానీ నేను చూడలేదు.” (కీర్త. 37:25) బహుశా మీ జీవితకాలంలో కూడా యెహోవా తన నమ్మకమైన సేవకులకు అవసరమైనవి ఇవ్వడం మీరు కళ్లారా చూసుంటారు.
9. ఈరోజుల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు యెహోవా తన ప్రజల్ని ఎలా చూసుకుంటాడు? (చిత్రాలు కూడా చూడండి.)
9 ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు కూడా తన ప్రజలకు కావాల్సినవి యెహోవా ఇస్తాడు. మొదటి శతాబ్దంలో కరువు వచ్చినప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో ఉండే క్రైస్తవులు అవసరంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌కి కావాల్సిన వస్తువులు ఇచ్చారు. (అపొ. 11:27-30; రోమా. 15:25, 26) దేవుని ప్రజలు ఇప్పుడు కూడా పెద్ద మనసుతో అవసరంలో ఉన్నవాళ్లకు చెయ్యి అందిస్తున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లకు కావాల్సిన ఆహారం, నీళ్లు, బట్టలు, మందులు ఇచ్చేలా యెహోవా ప్రేమతో తన ప్రజల్ని కదిలిస్తున్నాడు. పాడైపోయిన ఇళ్లని, రాజ్యమందిరాల్ని రిపేరు చేయడానికి నిర్మాణ పనిలో సేవచేసే బ్రదర్స్‌సిస్టర్స్ సహాయం చేస్తారు. అలాగే ఇంటిని, తమవాళ్లని కోల్పోయిన బ్రదర్స్‌సిస్టర్స్‌కి కావాల్సిన ప్రోత్సాహం, ఊరట ఇచ్చేలా యెహోవా ప్రజలు వెంటనే ముందుకొస్తారు.c
కష్టాల్లో యెహోవా మనకు ఎలా ఓదార్పునిస్తాడు? (9వ పేరా చూడండి)e
10-11. బోరిస్ నుండి మీరేం నేర్చుకున్నారు?
10 యెహోవాది ఎంతపెద్ద మనసు అంటే, తనను ఆరాధించని వాళ్లకు కావాల్సినవి కూడా ఇస్తాడు. ఆయనలాగే మనం కూడా యెహోవా ఆరాధకులుకాని వాళ్లమీద కూడా ప్రేమ చూపించడానికి అవకాశాల కోసం వెదకాలి. (గల. 6:10) అది చాలాసార్లు ఒక మంచి సాక్ష్యంగా ఉంటుంది. యుక్రెయిన్‌లో స్కూల్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న బోరిస్ అనుభవాన్ని చూడండి. బోరిస్ ఒక యెహోవాసాక్షి కాదు. కానీ తన స్కూల్‌లో చదివే యెహోవాసాక్షుల పిల్లల్ని బాగా చూసుకునేవాడు, వాళ్ల నమ్మకాల్ని గౌరవించేవాడు. అయితే, యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని బోరిస్ అనుకున్నప్పుడు మన బ్రదర్స్ ఆయనకు చాలా హెల్ప్ చేశారు. ఆ తర్వాత బోరిస్ జ్ఞాపకార్థ ఆచరణకు కూడా వచ్చాడు. జరిగిన వాటిగురించి తలుచుకుంటూ బోరిస్ ఇలా అన్నాడు: “యెహోవాసాక్షులు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, నన్ను బాగా పట్టించుకున్నారు. వాళ్లకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా!”
11 మనం మన ప్రేమగల పరలోక తండ్రిలాగే అవసరం ఉన్నవాళ్ల మీద అంటే, వాళ్లు యెహోవాసాక్షులైనా, కాకపోయినా ప్రేమ చూపించాలి. (లూకా 6:31, 36) అలా ప్రేమతో మనం చేసే చిన్నచిన్న పనులు వాళ్లు క్రీస్తు శిష్యులుగా అవ్వడానికి వాళ్లను కదిలిస్తాయి. (1 పేతు. 2:12) అయితే, మన పనుల్ని చూసి వాళ్లు యెహోవాసాక్షులుగా మారినా, మారకపోయినా మనమే సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.—అపొ. 20:35.
యెహోవా మనల్ని కంటికి రెప్పల కాపాడతాడు
12. ఒక గుంపుగా తన ప్రజలకు ఏం చేస్తానని యెహోవా మాటిచ్చాడు? (కీర్తన 91:1, 2, 14)
12 కీర్తన 91:1, 2, 14 చదవండి. ఈరోజుల్లో యెహోవా తన ప్రజల్ని ఆధ్యాత్మికంగా ఏలోటూ లేకుండా చూసుకుంటానని మాటిచ్చాడు. అవును, సత్యారాధన కల్తీ అయ్యేలా యెహోవా సాతానును అస్సలు అనుమతించడు. (యోహా. 17:15) అలాగే “మహాశ్రమ” మొదలైనప్పుడు తన ప్రజల్ని కంటికిరెప్పలా చూసుకుంటానని యెహోవా ఇచ్చిన మాటమీద పూర్తి నమ్మకంతో మనం నిశ్చింతగా ఉండవచ్చు. అప్పుడు ప్రజలకు ఆధ్యాత్మికంగానే కాదు, వాళ్లకు కావాల్సిన ప్రతీది ఆయన ఇస్తాడు!—ప్రక. 7:9, 14.
13. యెహోవా మనలో ప్రతీఒక్కర్ని ఎలా కంటికి రెప్పల కాపాడుతున్నాడు?
13 యెహోవా మనలో ఒక్కొక్కర్నీ ఎలా కంటికి రెప్పల కాపాడుతున్నాడు? ఏది తప్పు, ఏది ఒప్పో తెలుసుకోవడానికి ఆయన మనకు బైబిల్ని ఇచ్చాడు. (హెబ్రీ. 5:14) యెహోవాతో మనకున్న బంధాన్ని కాపాడుకోవడానికి అలాగే ఈ లోకంలో ఉన్న చెడు మనకు అంటకుండా బైబిలు ప్రమాణాలు మనకు ఒక కంచెలా పనిచేస్తాయి. (కీర్త. 91:4) అంతేకాదు, యెహోవా సంఘం ద్వారా కూడా మనల్ని కాపాడుతున్నాడు. (యెష. 32:1, 2) యెహోవాను, ఆయన ప్రమాణాల్ని ప్రేమించేవాళ్లు మనచుట్టూ ఉండేలా చూసుకుంటే చెడువైపు కన్నెత్తి చూడకుండా ఉండగలుగుతాం. మనకు కావాల్సిన ప్రోత్సాహం కూడా దొరుకుతుంది.—సామె. 13:20.
14. (ఎ) మనకు కష్టాలు రాకుండా యెహోవా ఎందుకు అడ్డుపడడు? (బి) కీర్తన 9:10 మనకు ఏ ధైర్యం ఇస్తుంది? (అధస్సూచి కూడా చూడండి.)
14 యెహోవా కొన్నిసార్లు గతంలో ఉన్న తన ఆరాధకుల ప్రాణాల్ని కాపాడాడు. వాళ్లమీద ఒక్క గీత కూడా పడకుండా చూసుకున్నాడు. కానీ ఆయన ప్రతీసారి అలా చేయడు. కొన్నిసార్లు మనం ‘అనుకోని సంఘటనలకు’ బలి అవుతాం. (ప్రసం. 9:11) అంతేకాదు, చరిత్రంతటిలో సాతాను అబద్ధికుడని నిరూపించడానికి యెహోవా హింసల్ని అనుమతించాడు. ఆఖరికి తన సేవకులు చనిపోయేలా కూడా అనుమతించాడు. (యోబు 2:4-6; మత్త. 23:34) ఇప్పుడు కూడా అంతే! యెహోవా మన కష్టాల్ని తీసేయడు అలాగని కష్టంలో ఉన్నవాళ్లను మర్చిపోడు.d—కీర్త. 9: 10.
యెహోవా మనకు ఓదార్పు ఇస్తాడు
15. ప్రార్థన, బైబిలు, బ్రదర్స్‌సిస్టర్స్ మనకు ఎలా ఓదార్పును ఇస్తారు? (2 కొరింథీయులు 1:3, 4)
15 2 కొరింథీయులు 1:3, 4 చదవండి. కొన్నిసార్లు మనకు ఆందోళన, బాధ, వేదన కలగవచ్చు. బహుశా ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న కష్టాల వల్ల, జీవితం క్షణం ఒక యుగంలా గడుస్తూ, మిమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని మీకు అనిపించవచ్చు. మరి మీ మనసులో ఉన్న ఆవేదనను ఎవరైనా అర్థం చేసుకుంటారా? యెహోవా అర్థం చేసుకుంటాడు. మనకు దెబ్బ తగిలితే నొప్పి ఆయన భరిస్తాడు, అలాగే మన “కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు.” ఎలా? ప్రార్థనలో మన బాధంతా ఆయనకు చెప్పుకున్నప్పుడు, “మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి” ఆయన మనకు ఇస్తాడు. (ఫిలి. 4:6, 7) కష్టాల్లో-బాధల్లో ఉన్నప్పుడు బైబిలు చదివితే మనసుకు హాయిగా అనిపిస్తుంది. బైబిలు లేఖనాల్లో ఉన్న ప్రేమ, తెలివి, ఆశ గురించి చదివినప్పుడు మన ప్రాణం లేచినట్టు అనిపిస్తుంది. మీటింగ్స్ కూడా మనకు ఎంతో ఊరటను ఇస్తాయి. బైబిలు ఆధారంగా ఇచ్చే ప్రసంగాలు మనకు ప్రోత్సాహాన్నిస్తాయి. బ్రదర్స్‌సిస్టర్స్ ప్రేమాప్యాయతలు మన మనసుకు మందులా పనిచేస్తాయి.
16. నేతన్, ప్రిస్కిల్ల నుండి మీరేం నేర్చుకున్నారు?
16 యెహోవా బైబిలు ద్వారా మనకు కావాల్సిన ఓదార్పును, ప్రోత్సాహాన్ని ఎలా ఇస్తాడో ఒక ఉదాహరణ చూడండి. నేతన్, ప్రిస్కిల్ల అమెరికాలో ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్లు అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లాలనుకున్నారు. నేథన్ ఇలా చెప్తున్నాడు: “మా ప్రయత్నాల్ని యెహోవా దీవిస్తాడని నమ్మాం.” కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లకు అనుకోకుండా ఆరోగ్యం పాడైంది. వాళ్లకు సరిపోయే ఉద్యోగం కూడా దొరకలేదు. ఇక చేసేది ఏమీ లేక వాళ్లు తిరిగి వాళ్ల సొంతూరుకు వచ్చేశారు. అయినాసరే ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. నేతన్ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “మేము అనుకున్నట్టుగా దేవుడు ఎందుకు మా ప్రయత్నాల్ని దీవించలేదు అనుకున్నాను. ఆఖరికి ఇదంతా నేను ఏదైనా తప్పు చేయడం వల్ల జరుగుతుందా అని కూడా అనుకున్నాను.” కానీ కొంతకాలం తర్వాత యెహోవా తమ చెయ్యి వదిలిపెట్టలేదని, వాళ్లకు సరిగ్గా అవసరమైన టైంలో సహాయం చేశాడని నేతన్, ప్రిస్కిల్ల గుర్తించారు. నేతన్ ఇలా చెప్తున్నాడు: “మాకున్న ఆ కష్టమైన కాలాల్లో బైబిలు ఒక తెలివైన ఫ్రెండ్‌గా మాకు కావాల్సిన దిశానిర్దేశాలు ఇస్తూ, మమ్మల్ని ప్రోత్సహించింది. అలాగే కష్టాల్లో యెహోవా మాకు ఎలా సహాయం చేస్తున్నాడు అనే దానిమీద మనసుపెట్టడం వల్ల, భవిష్యత్తులో మాకు వచ్చే విశ్వాస పరీక్షలకు మేము చక్కగా సిద్ధపడగలిగాం.”
17. హెల్గా అనే సిస్టర్‌కి ఎలా ఓదార్పు దొరికింది? (చిత్రం కూడా చూడండి.)
17 మన బ్రదర్స్‌సిస్టర్స్ ఇంకా వేరే రకాలుగా కూడా మనల్ని ఓదారుస్తారు. ఎలా? హంగరీలో ఉంటున్న హెల్గా అనుభవాన్ని చూడండి. చాలా సంవత్సరాలుగా ఆమె రకరకాల కష్టాలతో జీవితాన్ని నెట్టుకొస్తుంది. ఇక ఎందుకు పనికిరాననే ఫీలింగ్స్ ఆమెకు వచ్చాయి. జీవితంలో అలసిపోయింది. సంఘం ద్వారా యెహోవా ఆమెను ఓదార్చాడని ఆమె గుర్తించింది. ఆమె ఇలా చెప్తుంది: “ఒక చేత్తో ఉద్యోగం, ఇంకో చేత్తో అనారోగ్యంతో ఉన్న మా అబ్బాయిని చూసుకుంటూ ఇలా రకరకాల కష్టాలు నన్ను మెలితిప్పేశాయి. కానీ యెహోవా ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నాడు. గత 30 సంవత్సరాల్లో యెహోవా మాటిచ్చినట్టు ఆయన నన్ను ఓదార్చని రోజు అంటూ ఏదీ లేదు! చాలావరకు వేరేవాళ్లు నాతో దయగా మాట్లాడేలా, నా గురించి పట్టించుకొని నన్ను మెచ్చుకునేలా చేసి యెహోవా నాకు కావాల్సిన బలాన్ని ఇచ్చాడు. నాకు సరిగ్గా అవసరమైనప్పుడు ఎవరో ఒకరు నాకు మెసేజ్ చేయడమో, ఒక కార్డు ఇవ్వడమో, నన్ను మెచ్చుకోవడమో చేసేవాళ్లు.”
వేరేవాళ్లను ఓదార్చేలా యెహోవా మిమ్మల్ని ఎలా ఉపయోగించవచ్చు? (17వ పేరా చూడండి)
18. మనం వేరేవాళ్లను ఎలా ఓదార్చవచ్చు?
18 ఇతరుల్ని ఓదార్చడం వల్ల మనం మన దేవుడైన యెహోవా అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉంది. దాన్ని ఎలా చేయవచ్చు? వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఓపిగ్గా వినడం ద్వారా, ఓదార్చేలా మాట్లాడడం ద్వారా, వాళ్లకు అవసరమైన సహాయం చేయడం ద్వారా మనం అలా చేయవచ్చు. (సామె. 3:27) మనం బాధలో ఉన్నవాళ్లందర్నీ ఓదార్చడానికి చూస్తాం. ఆఖరికి యెహోవాను ఆరాధించని వాళ్లను కూడా ఓదారుస్తాం. మన ఇరుగుపొరుగువాళ్లు ఎవరైనా దుఃఖంలో మునిగిపోయారంటే, అనారోగ్యంతో ఉన్నారంటే లేదా ఆందోళనతో ఉన్నారంటే మనం వాళ్లను వెళ్లి పలకరించి, వాళ్లు చెప్పేది వింటాం బైబిల్లో నుండి వాళ్లకు ప్రోత్సాహాన్నిచ్చే మాటల్ని చెప్తాం. “ఓదార్పునిచ్చే దేవుడైన” యెహోవాను మనం అనుకరించినప్పుడు తోటి బ్రదర్స్‌సిస్టర్స్ వాళ్ల కష్టాల్ని తట్టుకునేలా వాళ్లకు సహాయం చేసినవాళ్లమౌతాం. అలాగే యెహోవాను ఆరాధించని ప్రజల మనసు మెత్తబడి, వాళ్లు సత్యారాధన వైపు వచ్చేలా సహాయం చేసినవాళ్లమౌతాం.—మత్త. 5:16.
యెహోవా ఎప్పుడూ మనతో ఉంటాడు
19. యెహోవా మనకోసం ఏమేం చేస్తున్నాడు? మనం ఆయనలా ఎలా ఉండవచ్చు?
19 యెహోవా తనను ప్రేమించే వాళ్లందరి గురించి పట్టించుకుంటాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మన చెయ్యి వదిలి పెట్టడు. ఒక పిల్లవాణ్ణి వాళ్ల అమ్మానాన్నలు కంటికిరెప్పలా చూసుకున్నట్టే, యెహోవా కూడా తన నమ్మకమైన ఆరాధకుల్ని చూసుకుంటాడు. ఆయన మనకు దిశానిర్దేశాలు ఇస్తాడు, బ్రతకడానికి కావాల్సినవి ఇస్తాడు, కంటికిరెప్పలా కాపాడతాడు, ఓదారుస్తాడు. కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసినప్పుడు, వాళ్లను ప్రోత్సహించినప్పుడు మనం కూడా మన ప్రేమగల పరలోక తండ్రిని అనుకరించిన వాళ్లమౌతాం. అవును జీవితంలో మనకు ఎన్నో కష్టాలు రావచ్చు, మన మనసుకు ఎన్నో గాయాలు అవ్వొచ్చు. కానీ మన వెనుక యెహోవా ఉన్నాడు! ఎందుకంటే ఆయన ఈ మాటిచ్చాడు: “భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.” (యెష. 41:10) ఇది మనలో ఎంత ధైర్యాన్ని నింపుతుందో కదా! అవును, మనం అస్సలు ఒంటరివాళ్లం కాదు!
పాట 100 వాళ్లకు ఆతిథ్యం ఇవ్వండి
a 2011, ఏప్రిల్ 15 కావలికోట పత్రికలో ఉన్న “దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి” అనే ఆర్టికల్ చూడండి.
b 2024, ఫిబ్రవరి కావలికోట పత్రికలో ఉన్న “యెహోవా నడిపిస్తున్న దారిలో నడుస్తూ ఉండండి” అనే ఆర్టికల్‌లోని 11-14 పేరాలు చూడండి.
c ఈ మధ్యకాలంలో వచ్చిన అనుభవాలు తెలుసుకోవడానికి jw.orgలో “విపత్తు సహాయక చర్యలు” అని టైప్ చేసి వెతకండి.
d 2017, ఫిబ్రవరి కావలికోట సంచికలో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.
e చిత్రం వివరణ: మలావీలో ప్రకృతి విపత్తు తర్వాత మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి కావాల్సినవి అందుతున్నాయి.