అధ్యయన ఆర్టికల్ 16
పాట 87 రండి, సేదదీర్పు పొందండి!
మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి దగ్గరవ్వడం మనకు మంచిది!
“చూడండి! సహోదరులు ఐక్యంగా కలిసిమెలిసి జీవించడం ఎంత మంచిది! ఎంత మనోహరమైనది!”—కీర్త. 133:1.
ముఖ్యాంశం
మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి దగ్గరవ్వడానికి సలహాలు, అలా దగ్గరైనప్పుడు వచ్చే దీవెనలు చూస్తాం.
1-2. యెహోవాకు అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి? మనం ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు?
మనం సాటి మనిషితో ఎలా ఉంటాం అనేది యెహోవాకు చాలా ప్రాముఖ్యం. మనల్ని మనం ప్రేమించుకున్నట్టు సాటి మనిషిని ప్రేమించాలని యేసు నేర్పించాడు. (మత్త. 22:37-39) అంటే మనలాంటి నమ్మకాలు లేనివాళ్లను కూడా మనం ప్రేమిస్తూనే ఉండాలి. మనం వాళ్ల మీద దయ చూపించినప్పుడు యెహోవా దేవున్ని అనుకరించినట్టు అవుతుంది. ఎందుకంటే “ఆయన దుష్టుల మీద, మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు; నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు.”—మత్త. 5:45.
2 యెహోవా మనుషులందర్నీ ప్రేమిస్తాడు కానీ సరైంది చేసే వాళ్లంటే ఆయనకు తెగ ఇష్టం. (యోహా. 14:21) మనం కూడా తనలాగే ఉండాలని అనుకుంటున్నాడు. అందుకే మనం బ్రదర్స్‌సిస్టర్స్ మీద “ప్రగాఢమైన ప్రేమ” చూపించాలని, “వాత్సల్యాన్ని” చూపించాలని చెప్తున్నాడు. (1 పేతు. 4:8; రోమా. 12:10) ఎవరిమీదైనా అలాంటి ప్రేమ, ఆప్యాయత చూపించాలంటే మీకు ఎవరు గుర్తొస్తారు? బహుశా మన ఇంట్లోవాళ్లు లేదా మన ప్రాణ స్నేహితులు మనకు గుర్తుకురావచ్చు.
3. ప్రేమ గురించి మనం ఏ విషయం గుర్తుపెట్టుకోవాలి?
3 ప్రేమ, మనం ఇంట్లో పెంచుకునే ఒక మొక్క లాంటిది. అది పచ్చగా ఉండాలంటే ఎప్పటికీ నీళ్లు పోస్తూ ఉండాలి. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఈ సలహా ఇచ్చాడు: “సహోదర ప్రేమ చూపిస్తూ ఉండండి.” (హెబ్రీ. 13:1) మనం ఇతరుల మీద ప్రేమను పెంచుకుంటూ ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే, మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఎందుకు ఇంకా దగ్గరవ్వాలో, అలా దగ్గరౌతూ ఎలా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
మనం ఒకరికొకరం ఎందుకు ఇంకా దగ్గరవ్వాలి?
4. మన బ్రదర్స్‌సిస్టర్స్ మధ్యవున్న ఐక్యతకు విలువిస్తున్నామని కీర్తన 133:1 ప్రకారం ఎలా చెప్పవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
4 కీర్తన 133:1 చదవండి. యెహోవాను ప్రేమించే వాళ్లతో ఉండే నిజమైన స్నేహం చాలా “మంచిది!” “మనోహరమైనది!” అని కీర్తనకర్త చెప్పిన మాటల్ని మనం కూడా ఒప్పుకుంటాం. ఈ ఉదాహరణ గమనించండి: ఒకవ్యక్తి ఇంటి ముందు చాలా అందమైన, పెద్ద చెట్టు ఉంది. అయితే, అతను దాన్ని ప్రతీరోజు చూడడంవల్ల దాని గొప్పతనాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అదేవిధంగా, మనం కూడా మన బ్రదర్స్‌సిస్టర్స్ మధ్య ఉన్న ఐక్యతలో ఉన్న గొప్పతనాన్ని కొన్నిసార్లు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే, బహుశా మన బ్రదర్స్‌సిస్టర్స్ ముఖాల్ని వారంలో చాలాసార్లు చూస్తుంటాం కాబట్టి వాళ్లను మనం లైట్ తీసుకునే అవకాశం ఉంది. కానీ వాళ్లను మనం విలువైనవాళ్లుగా ఎలా చూస్తూ ఉండవచ్చు? మన బ్రదర్స్‌సిస్టర్స్‌లో ప్రతిఒక్కరూ సంఘానికి అలాగే మనకు ఎంత విలువైనవాళ్లో సమయం తీసుకుని ఆలోచించినప్పుడు వాళ్ల మీద ఉన్న ప్రేమ పెరుగుతుంది.
మన మధ్య ఉన్న ఐక్యతను ఎప్పుడూ లైట్ తీసుకోకండి (4వ పేరా చూడండి)
5. మన బ్రదర్స్‌సిస్టర్స్ మధ్య ఉన్న ప్రేమను చూసినవాళ్లకు ఏం అనిపిస్తుంది?
5 మన మీటింగ్స్‌కి మొట్టమొదటిసారి వచ్చిన కొంతమందికి మనం ఒకరిమీద ఒకరం చూపించుకున్న ప్రేమ చెరగని ముద్ర వేస్తుంది. ఆ ఒక్క కారణంతోనే తమకు సత్యం దొరికిందనే ముగింపుకు వాళ్లు రావచ్చు. యేసు ఇలా చెప్పాడు: “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.” (యోహా. 13:35) చైత్ర అనే యూనివర్సిటీ విద్యార్థి గురించి చూడండి. ఆమె యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకుంటుంది. ఆమెతో బైబిలు స్టడీ చేసే సిస్టర్ చైత్రని ప్రాదేశిక సమావేశానికి ఆహ్వానించింది. ఆమె మొదటిరోజు సమావేశం అయిపోయిన తర్వాత, తనకు బైబిలు స్టడీ ఇచ్చే సిస్టర్‌తో ఇలా చెప్పింది: “మా మమ్మీడాడీ నన్ను ఎప్పుడూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, కౌగిలించుకోలేదు. కానీ మీ సమావేశంలో, ఒక్కరోజులోనే 52 మంది నన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు! ఆ ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా యెహోవా నా మీద ప్రేమ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. నేనూ ఈ కుటుంబంలో ఉండాలని అనుకుంటున్నాను.” చైత్ర చక్కగా ప్రగతి సాధిస్తూ 2024 లో బాప్తిస్మం తీసుకుంది. అవును, కొత్తవాళ్లు మనం చేసే మంచి పనుల్ని చూసినప్పుడు అంటే, మనం ఒకరిమీద ఒకరం చూపించుకునే ప్రేమను వాళ్లు చూసినప్పుడు యెహోవా సేవ చేయడానికి కదిలి వస్తారు.—మత్త. 5:16.
6. మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి దగ్గరవ్వడం మనల్ని ఎలా కాపాడుతుంది?
6 మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి దగ్గరవ్వడం ఒక విధంగా మనల్ని కాపాడుతుంది. అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “ప్రతీరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి. అప్పుడే, పాపానికున్న మోసకరమైన శక్తి వల్ల మీలో ఎవరి హృదయమూ కఠినమైపోకుండా ఉంటుంది.” (హెబ్రీ. 3:13) ఒకవేళ మనం బాగా నిరుత్సాహంలో కూరుకుపోయి, యెహోవా మార్గాల నుండి పక్కకు వెళ్తూ తప్పటడుగులు వేస్తే దాన్ని గమనించే బ్రదర్ గానీ, సిస్టర్ గానీ మనకు సహాయం చేసేలా యెహోవా వాళ్లను కదిలించవచ్చు. (కీర్త. 73:2, 17, 23) అలాంటి సహాయం, ప్రోత్సాహం మనకు చాలా మంచి చేస్తుంది.
7. ప్రేమకు, ఐక్యతకు సంబంధం ఏంటి? (కొలొస్సయులు 3:13, 14)
7 మనం ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకోవడానికి దొరికే ఏ అవకాశాన్ని వదులుకోం. దానివల్ల ఎన్నో దీవెనల్ని సొంతం చేసుకుంటాం. (1 యోహా. 4:11) ఉదాహరణకు, మన మధ్య ప్రేమ ఉంది కాబట్టి “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ” ఉంటాం, దానివల్ల మన బ్రదర్స్‌సిస్టర్స్ మధ్య ఐక్యత ఉంటుంది. (కొలొస్సయులు 3:13, 14 చదవండి; ఎఫె. 4:2-6) అందుకనే మన మీటింగ్స్‌లో దొరికేంత మనశ్శాంతి, ప్రశాంతత ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు!
ఒకరినొకరు ఘనపర్చుకోండి
8. మనం ఐక్యంగా ఉండడానికి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడు?
8 ప్రపంచవ్యాప్తంగా మన మధ్య ఉన్న ఐక్యత ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. మనందరిలో అపరిపూర్ణతలు ఉన్నా ఐక్యంగా ఉంటున్నామంటే అది యెహోవా వల్లే! (1 కొరిం. 12:25) మనం ‘ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మనకు నేర్పిస్తున్నాడు’ అని బైబిలు చెప్తుంది. (1 థెస్స. 4:9) మరో మాటలో చెప్పాలంటే, మనం ఒకరికొకరం దగ్గరవ్వాలంటే సరిగ్గా ఏం చేయాలో యెహోవా బైబిలు నుండి మనకు నేర్పిస్తున్నాడు. యెహోవా మనకు ‘నేర్పించాలంటే’ ఆయన చెప్పేవాటిని జాగ్రత్తగా పరిశీలించాలి, వాటిని పాటించాలి. (హెబ్రీ. 4:12; యాకో. 1:25) నిజానికి యెహోవాసాక్షులు సరిగ్గా అదే చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
9. ఒకరినొకరు ఘనపర్చుకోవడం గురించి రోమీయులు 12:9-13 లో ఏం నేర్చుకున్నాం?
9 మనం ఒకరికొకరం దగ్గరవ్వాలని బైబిలు ఎలా నేర్పిస్తుంది? పౌలు రోమీయులు 12:9-13 లో దీనిగురించి ఏం చెప్పాడో గమనించండి. (చదవండి.) ముఖ్యంగా ఈ మాటల్ని గమనించండి: “ఒకరినొకరు ఘనపర్చుకునే విషయంలో ముందుండండి.” అంటే ఏంటి? మనం ఇతరుల మీద “వాత్సల్యం” చూపించడానికి చొరవ తీసుకోవాలి. దాన్ని ఎలా చేయవచ్చు? ఉదాహరణకు మనం ఇతరుల్ని క్షమించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, పెద్ద మనసుతో మనకున్నవాటిని పంచుకోవాలి. (ఎఫె. 4:32) మన బ్రదర్ గానీ, సిస్టర్ గానీ వాళ్లే వచ్చి మనకు దగ్గరయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరంలేదు. మనమే ‘ఈ విషయంలో ముందు ఉండవచ్చు.’ ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొ. 20:35.
10. “ఒకరినొకరు ఘనపర్చుకునే విషయంలో” మనం ఎలా కష్టపడి పనిచేసేవాళ్లుగా ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
10 ఆసక్తికరంగా, ఒకరినొకరు ఘనపర్చుకునే విషయంలో ముందుండండి అని చెప్పిన వెంటనే పౌలు ‘కష్టపడి పనిచేయాలని’ “సోమరులుగా ఉండకండి” అని చెప్పాడు. కష్టపడి పనిచేసే ఒక వ్యక్తి ఉత్సాహంగా, ఒళ్లు వంచి పనిచేస్తాడు. అతనికి ఏదైనా ఒక పని ఇస్తే దాన్ని నమ్మకంగా చేస్తాడు. సామెతలు 3:27, 28 ఇలా చెప్తుంది: “మేలు చేయడం నీకు చేతనైనప్పుడు, దాన్ని పొందాల్సిన వాళ్లకు ఆ మేలు చేయకుండా ఉండకు.” దీన్నిబట్టి, ఎవరైనా అవసరంలో ఉన్నారని తెలిస్తే చాలు, మనం అక్కడ వాలిపోతాం! ఆ పని తర్వాత చేద్దాంలే అని గానీ, వేరేవాళ్లు చేస్తారులే అని గానీ మనం అనుకోం.—1 యోహా. 3:17, 18.
అవసరంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయడానికి ముందుందాం (10వ పేరా చూడండి)
11. ఒకరికొకరం దగ్గరవ్వడానికి చేయాల్సిన ఇంకొక పనేంటి?
11 ఒకరినొకరు ఘనపర్చుకోవడానికి మనం చేయాల్సిన ఇంకొక పని, మనల్ని బాధపెట్టినవాళ్లను వెంటనే క్షమించడం. ఎఫెసీయులు 4:26 ఇలా చెప్తుంది: “సూర్యుడు అస్తమించే లోపే మీ కోపాన్ని తీసేసుకోండి.” ఒకవేళ తీసేసుకోకపోతే ఏమౌతుంది? 27వ వచనం చెప్తున్నట్టు మనం “అపవాదికి అవకాశం” ఇచ్చినవాళ్లం అవుతాం. ఒకరినొకరు క్షమించుకోండి అని యెహోవా బైబిల్లో పదేపదే చెప్తూ వచ్చాడు. కొలొస్సయులు 3:13 ఇలా చెప్తుంది: “మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి.” ఒకరికొకరం దగ్గరవ్వడానికి ఒక చక్కని పద్ధతి ఏంటంటే వేరేవాళ్లు చేసిన పొరపాట్లను, తప్పుల్ని పట్టించుకోకుండా వదిలేయడమే. అలా చేసినప్పుడు ‘పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నించిన’ వాళ్లమౌతాం. (ఎఫె. 4:3) ఒక్కమాటలో చెప్పాలంటే మనకు క్షమించే గుణం ఉంటే ఐక్యత, శాంతి వెల్లివిరుస్తాయి.
12. మనం ఇతరుల్ని క్షమించడానికి యెహోవా ఎలా సహాయం చేస్తాడు?
12 నిజమే, కొన్నిసార్లు మనల్ని బాధపెట్టినవాళ్లను క్షమించడానికి మనకు మనసు రాకపోవచ్చు. కానీ దేవుని పవిత్రశక్తి సహాయంతో మనం వాళ్లను క్షమించగలం. ఒకరి విషయంలో ఒకరు వాత్సల్యం చూపించుకోండి, “కష్టపడి పనిచేయండి” అని చెప్పిన తర్వాత బైబిలు ఈ మాట చెప్తుంది: “పవిత్రశక్తి మీలో ఉత్సాహం నింపనివ్వండి.” అంటే పవిత్రశక్తి వల్ల మనం క్షమించడానికి చాలా “ఉత్సాహం” చూపిస్తాం, పరుగులు తీస్తాం అని అర్థం. (రోమా. 12:11) కాబట్టి ఒకరి విషయంలో ఒకరం వాత్సల్యం చూపించుకోవడానికి, మనస్ఫూర్తిగా క్షమించుకోవడానికి యెహోవా పవిత్రశక్తి సహాయం చేస్తుంది. కాబట్టి దానికోసం ఆయన్ని అడుగుతూ ఉందాం.—లూకా 11:13.
“మీ మధ్య విభజనలు ఉండకూడదు”
13. మన మధ్య ఏవి విభజనలు సృష్టించే అవకాశం ఉంది?
13 సంఘంలో “అన్నిరకాల ప్రజలు” ఉంటారు. మనందరం పుట్టిపెరిగిన ప్రాంతాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉండవచ్చు. (1 తిమో. 2:3, 4) అలాగే బట్టలు, హెయిర్ స్టైల్స్, గడ్డం పెంచుకోవడం, ఆరోగ్య సూత్రాలు, వినోదం వంటి విషయాల్లో మనకు కొన్ని అభిరుచులు ఉండవచ్చు. ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే అవి మన మధ్య విభజనలు సృష్టించే అవకాశం ఉంది. (రోమా. 14:4; 1 కొరిం. 1:10) మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మన సొంత అభిరుచులు వేరేవాళ్ల మీద రుద్దకుండా జాగ్రత్తపడాలి.—ఫిలి. 2:3.
14. మనం ఎప్పుడూ ఎలా ఉండాలి? ఎందుకు?
14 అంతేకాదు, సంఘంలో విభజనలు రాకుండా చూసుకోవాలంటే మనం ఎప్పుడూ ఊరటను ఇచ్చేవాళ్లుగా, బలపర్చేవాళ్లుగా ఉండాలి. (1 థెస్స. 5:11) యెహోవా సేవను ఆపేసిన లేదా సంఘం నుండి తొలగించబడిన చాలామంది ఈమధ్య తిరిగి వస్తున్నారు. వాళ్లందర్నీ మనం మనసారా ఆహ్వానిస్తాం. (2 కొరిం. 2:8) పదేళ్లుగా యెహోవా సేవను ఆపేసి తిరిగి రాజ్యమందిరానికి వచ్చిన ఒక సిస్టర్‌కి ఏం జరిగిందో గమనించండి. ఆమె ఇలా చెప్తుంది: “నన్ను అందరూ చిరునవ్వుతో షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆహ్వానించారు.” (అపొ. 3:19) దయతో చేసే ఆ చిన్న పనివల్ల ఆమెకు ఎలా అనిపించింది? ఆమె ఇలా చెప్తుంది: “యెహోవా నన్ను మళ్లీ చెయ్యి పట్టుకొని సంతోషం వైపు అడుగులు వేయిస్తున్నట్టు అనిపించింది.” అవును, మనం ఎప్పుడూ బలపర్చేవాళ్లుగా ఉంటే “భారం మోస్తూ అలసిపోయిన” వాళ్లకు సేదదీర్పును ఇవ్వడానికి యేసుక్రీస్తు మనల్ని ఉపయోగించుకోవచ్చు.—మత్త. 11:28, 29.
15. ఐక్యతను పెంచడానికి ఇంకో పద్ధతి ఏంటి? (చిత్రం కూడా చూడండి.)
15 మన మధ్య ఐక్యత పెంచడానికి ఇంకొక మంచి పద్ధతి ఏంటంటే, మన మాటలు. యోబు 12:11 ఇలా చెప్తుంది: “నాలుక ఆహారాన్ని రుచి చూసినట్టు, చెవి మాటల్ని పరీక్షించదా?” వంట చేసిన తర్వాత, అది వేరేవాళ్లకు వడ్డించే ముందు, అన్నీ సరిపోయాయో లేవో తెలుసుకోవడానికి కాస్త టేస్ట్ చూస్తాం. అలాగే మన మాట పెదాలు దాటకముందే, అవి ఎలా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి. (కీర్త. 141:3) మన మాటలు బలపర్చేవిగా, సేదదీర్పును ఇచ్చేవిగా, “వినేవాళ్లకు ప్రయోజనం” కలిగించేవిగా ఉన్నాయో లేవో చూసుకోవడమే మన లక్ష్యమై ఉండాలి.—ఎఫె. 4:29.
మాటలు పెదాలు దాటకముందే అవి ఎలా ఉన్నాయో చూసుకోండి (15వ పేరా చూడండి)
16. ముఖ్యంగా ఎవరెవరు బలపర్చేలా మాట్లాడాలి?
16 ముఖ్యంగా భర్తలు, అమ్మానాన్నలు తమ మాటలు బలపర్చేవిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. (కొలొ. 3:19, 21; తీతు 2:4) అలాగే యెహోవా గొర్రెల్ని కాస్తున్న సంఘపెద్దలు కూడా తమ మాటలు ఉపశమనాన్ని, ఊరటను ఇచ్చేలా చూసుకోవాలి. (యెష. 32:1, 2; గల. 6:1) బైబిల్లో ఒక సామెత ఉంది: “సరైన సమయంలో మాట్లాడిన మాట ఎంత మంచిది!”—సామె. 15:23.
ప్రేమను “చేతల్లో చూపించాలి” అందులో “నిజాయితీ ఉండాలి”
17. బ్రదర్స్‌సిస్టర్స్ మీదున్న ప్రేమలో నిజాయితీ ఉండేలా ఎలా చూసుకోవచ్చు?
17 “మన ప్రేమను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి” అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు. (1 యోహా. 3:18) మన బ్రదర్స్‌సిస్టర్స్ మీదున్న ప్రేమ కేవలం పెదాల నుండి కాదు, హృదయంలో నుండి రావాలని మనం కోరుకుంటాం. దాన్నెలా చేయవచ్చు? మనం మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో ఎంతెక్కువ టైం గడిపితే మనం వాళ్లకు అంత దగ్గరౌతాం. మన మధ్యవున్న ప్రేమ కూడా అంతగా పెరుగుతుంది. మీటింగ్స్‌లో, ప్రీచింగ్‌లో వేరేవాళ్లతో సమయం గడపడానికి అవకాశాల కోసం వెదకండి. వాళ్లను కలవడానికి సమయం తీసుకుని వెళ్లండి. మనం అలా చేసినప్పుడు “ఒకరినొకరు ప్రేమించుకోవాలని” దేవుడు నేర్పించినదానికి తగ్గట్టు చేసినవాళ్లమౌతాం. (1 థెస్స. 4:9) అంతేకాదు, ‘సహోదరులు ఐక్యంగా కలిసిమెలిసి జీవించడం ఎంత మంచిదో ఎంత మనోహరమైనదో’ స్వయంగా రుచి చూస్తాం!—కీర్త. 133:1.
పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి