కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఏప్రిల్‌ పేజీలు 8-13
  • “దేవునికి దగ్గరవ్వడం” మనకు మంచిది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవునికి దగ్గరవ్వడం” మనకు మంచిది!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘దేవునికి దగ్గరైతే’ సంతోషం మన సొంతం
  • ‘దేవునికి దగ్గరైతే’ జీవితానికి ఒక అర్థం, భవిష్యత్తు మీద ఒక ఆశ ఉంటాయి!
  • మనం ఎలా ‘దేవునికి దగ్గరౌతూ’ ఉండవచ్చు?
  • మనం పొరపాట్లు చేసినా యెహోవాకు ‘దగ్గరవ్వచ్చు’
  • ఎప్పటికీ ‘దేవునికి దగ్గరౌతూ’ ఉండండి
  • మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి దగ్గరవ్వడం మనకు మంచిది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • నిరాశపర్చే సందేహాలు వస్తే ఏం చేయాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యెహోవా గురించి తెలుసుకుంటూనే ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఏప్రిల్‌ పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 15

పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు

“దేవునికి దగ్గరవ్వడం” మనకు మంచిది!

“నా విషయానికొస్తే, దేవునికి దగ్గరవ్వడం నాకు మంచిది.”—కీర్త. 73:28.

ముఖ్యాంశం

యెహోవాకు మనం ఇంకా ఎలా దగ్గరవ్వచ్చు? దానివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి?

1-2. (ఎ) ఎవరితోనైనా మంచి స్నేహం కావాలంటే ఏం చేయాలి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

మీకెవరైనా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉన్నాడా? అసలు మీ స్నేహం ఎలా స్టార్ట్‌ అయ్యింది? బహుశా మీరు అతనితో టైం గడిపి ఉంటారు. అప్పుడు అతని ఇష్టాయిష్టాలు, కష్టాలు మీకు తెలిసుంటాయి. అలాగే అతనిలో చాలా మంచి లక్షణాల్ని మీరు చూశారు. మీకు కూడా అతనిలా ఉండాలని అనిపించింది. అతని మీద మీకు ఇష్టం పెరిగింది.

2 ఎవరితోనైనా ఒక సన్నిహిత స్నేహం కావాలంటే వాళ్లతో మనం సమయం గడపాలి. అదేవిధంగా, యెహోవా దేవునితో మనకు ఒక మంచి స్నేహం కావాలంటే మనం కూడా ఆయనతో సమయం గడపాలి. అయితే, ఈ ఆర్టికల్‌లో యెహోవాకు మనం ఇంకా ఎక్కువ ఎలా దగ్గరవ్వవచ్చో, అలా దగ్గరైనప్పుడు మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో చూస్తాం. ముందుగా, మన బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన యెహోవాకు దగ్గరవ్వడం ఎందుకు మంచిదో చూద్దాం.

3. యెహోవాకు దగ్గరవ్వడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి ఎందుకు ఆలోచించాలో ఉదాహరణతో చెప్పండి.

3 యెహోవాకు దగ్గరవ్వడం మంచిదని అందరికీ తెలుసు. కానీ అది ఎంత మంచిదో ఆలోచిస్తేనే మనం ఆయనకు ఇంకా దగ్గరవ్వాలని అనిపిస్తుంది. (కీర్త. 63:6-8) ఉదాహరణకు మంచి ఆహారం, ఎక్సర్‌సైజ్‌, కంటినిండా నిద్ర, సరిపడా నీళ్లు తాగడం మంచిదని అందరికీ తెలుసు. కానీ చాలామంది వాటిగురించి ఆలోచించకుండా ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారు. కానీ ఆ అలవాట్ల వల్ల మనకు జరిగే మంచి గురించి ఎంతెక్కువ ఆలోచిస్తే, వాటిని పాటించాలని అంతెక్కువ కోరుకుంటాం. అదేవిధంగా, యెహోవాకు దగ్గరవ్వడం మంచిదని మనందరికీ తెలుసు. కానీ అలా దగ్గరవ్వడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి ఆలోచిస్తేనే, మన స్నేహితుడైన యెహోవాకు మనం ఇంకా దగ్గరవ్వగలుగుతాం.—కీర్త. 119:27-30.

4. కీర్తన 73:28 లో కీర్తనకర్త ఏం చెప్పాడు?

4 కీర్తన 73:28 చదవండి. 73వ కీర్తన రాసిన వ్యక్తి యెహోవా ఆలయంలో సంగీతకారునిగా సేవ చేయడానికి నియమించబడిన ఒక లేవీయుడు. బహుశా ఆయన యెహోవాకు చాలాకాలం నమ్మకంగా సేవచేసి ఉంటాడు. అయినా, “దేవునికి దగ్గరవ్వడం” తనకు మంచిదని గుర్తు చేసుకోవడం అలాగే అది వేరేవాళ్లకు కూడా మంచిదని గుర్తు చేయడం ప్రాముఖ్యమని ఆ లేవీయుడు అనుకున్నాడు. అయితే, అలా గుర్తుచేసుకోవడం వల్ల వచ్చే కొన్ని ఉపయోగాలు ఏంటి?

‘దేవునికి దగ్గరైతే’ సంతోషం మన సొంతం

5. (ఎ) యెహోవాకు దగ్గరైతే సంతోషంగా ఉంటామని ఎందుకు చెప్పవచ్చు? (బి) సామెతలు 2:6-16 ప్రకారం, యెహోవా ఇచ్చే తెలివి మనల్ని ఎలా కాపాడుతుంది?

5 యెహోవా దేవునికి ఎంత దగ్గరైతే మనం అంత సంతోషంగా ఉంటాం. (కీర్త. 65:4) మనం సంతోషంగా ఉంటాం అనడానికి చాలా కారణాలున్నాయి. ఒకటేంటంటే, బైబిల్లో తను చెప్పిన మాటల్ని చదివి, వాటికి లోబడితే మనం తెలివిని సంపాదించుకుంటాం. ఆ తెలివి వల్ల మనకు హాని చేసే వాటినుండి దూరంగా ఉండగలుగుతాం. అలాగే పెద్దపెద్ద తప్పులు చేయకుండా ఉండగలుగుతాం. (సామెతలు 2:6-16 చదవండి.) అందుకే బైబిలు సరిగ్గానే ఇలా చెప్తుంది: “తెలివిని కనుగొన్నవాళ్లు, వివేచనను సంపాదించినవాళ్లు సంతోషంగా ఉంటారు.”—సామె. 3:13.

6. కీర్తనకర్త తన సంతోషాన్ని ఎందుకు కోల్పోయాడు?

6 నిజమే, యెహోవా స్నేహితుల జీవితాల్లో కూడా బాధ అలుముకోవచ్చు. 73వ కీర్తన రాసిన వ్యక్తి తన కళ్లముందు అన్యాయం జరుగుతున్నట్టు అనిపించిన విషయాల గురించి ఆలోచించి తన సంతోషాన్ని కోల్పోయాడు. తన మనసులో కోపం, అసూయ మొదలైంది. దేవున్ని గానీ, ఆయన ప్రమాణాల్ని గానీ ఏమాత్రం పట్టించుకోని చెడ్డవాళ్లే బాగుపడుతున్నట్టు ఆయనకు అనిపించింది. క్రూరంగా, గర్వంగా ఉన్నవాళ్లే బాగా ధనవంతులు అవుతున్నారనీ, ఏ రోగాలు లేకుండా, ఏ బాధా బందీ లేకుండా ఉంటున్నారనీ తప్పుగా అనుకున్నాడు. (కీర్త. 73:3-7, 12) ఆ కీర్తనకర్త ఎంత బాధపడ్డాడంటే, ఒకానొక సమయంలో అసలు యెహోవా సేవ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనుకున్నాడు. బాధ-దుఃఖంతో నిండిన మనసుతో ఆయనిలా అన్నాడు: “నిజంగా, నేను నా హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం, నిర్దోషినని నా చేతులు కడుక్కోవడం వృథా.”—కీర్త. 73:13.

7. మన సంతోషాన్ని మింగేసే బాధ నుండి మనం ఎలా తేరుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

7 ఆ కీర్తనకర్త బాధపడుతూ అక్కడే ఆగిపోలేదు, ఆయన ఒక పని చేశాడు. ఆయన “దేవుని మహిమాన్విత పవిత్రమైన స్థలంలోకి” అడుగుపెట్టాడు. అక్కడ యెహోవా ఆయన ఆలోచనల్ని సరిచేశాడు. (కీర్త. 73:17-19) మన బాధను ఎవ్వరూ చూడకపోయినా మన బెస్ట్‌ ఫ్రెండ్‌ యెహోవా చూస్తాడు. నిర్దేశం కోసం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు బైబిలు ద్వారా, సంఘం ద్వారా ఆయనిచ్చే సహాయాన్ని తీసుకున్నప్పుడు బాధను తట్టుకోవడానికి కావాల్సిన మనోధైర్యం మనకు వస్తుంది. ఒకవేళ మనం ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అయినా యెహోవా మనల్ని ఓదారుస్తాడు, ఊరడిస్తాడు.—కీర్త. 94:19.a

రాగి బలిపీఠానికి, ఆలయ ప్రవేశ ద్వారానికి మధ్యలో ఒక లేవీయుడు నిలబడి ఉన్నాడు.

73వ కీర్తన రాసిన వ్యక్తి, “దేవుని మహిమాన్విత పవిత్రమైన స్థలంలో” నిలబడ్డాడు (7వ పేరా చూడండి)


‘దేవునికి దగ్గరైతే’ జీవితానికి ఒక అర్థం, భవిష్యత్తు మీద ఒక ఆశ ఉంటాయి!

8. దేవునికి దగ్గరవ్వడం వల్ల మనకు జరిగే ఇంకో రెండు మంచి విషయాలు ఏంటి?

8 దేవునికి దగ్గరవ్వడం వల్ల ఇంకో రెండు రకాలుగా మంచి జరుగుతుంది. ఒకటి, జీవితానికి ఓ అర్థం ఉంటుంది. రెండు, భవిష్యత్తు మీద చెక్కుచెదరని ఆశ ఉంటుంది. (యిర్మీ. 29:11) ఈ ఉపయోగాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం.

9. యెహోవాకు దగ్గరవ్వడం వల్ల మన జీవితానికి ఒక అర్థం ఉంటుందని ఎలా చెప్పవచ్చు?

9 యెహోవాకు దగ్గరవ్వడం జీవితానికి ఒక అర్థాన్నిస్తుంది. దేవుడే లేడు అనుకునే చాలామందికి, భూమ్మీద అసలు ఎందుకు పుట్టామో కూడా తెలీదు. భవిష్యత్తులో అసలు మనిషి అనేవాడే ఉండడని కూడా వాళ్లు అనుకుంటారు. కానీ మనం బైబిలు అధ్యయనం చేయడం వల్ల, దేవుడు “ఉన్నాడని, తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని” నమ్మకం కుదిరింది. (హెబ్రీ. 11:6) ఇప్పుడు కూడా మనందరం సంతోషంగా బ్రతుకుతున్నాం. ఎందుకంటే, దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో చేశాడో ఆ పని మనం చేస్తున్నాం. అదేంటంటే, మన పరలోక తండ్రి యెహోవాకు సేవ చేయడం.—ద్వితీ. 10:12, 13.

10. యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాళ్ల భవిష్యత్తు గురించి కీర్తన 37:29 ఏం చెప్తుంది?

10 చాలామందికి జీవితంలో ఆశ అంటే ఒక మంచి ఉద్యోగం, పిల్లలు, మంచి కుటుంబం, రిటైర్‌మెంట్‌ టైంకి నాలుగు డబ్బులు వెనకేసుకోవడం ఇంతే! వాళ్లు ఇక్కడి వరకే ఆలోచిస్తారు. వాళ్ల జీవితంలో ఇక దేవుడు ఉండడు. మరోవైపు, యెహోవా సేవకులు మాత్రం ఆయన మీదే ఆశ పెట్టుకుంటారు. (కీర్త. 25:3-5; 1 తిమో. 6:17) మనం దగ్గరైన దేవున్ని మనం నమ్ముతాం, ఆయన మాటిచ్చినవి నిజం చేస్తాడని నమ్ముతాం. భవిష్యత్తులో మనం చాలా మంచి విషయాల గురించి ఎదురుచూడవచ్చు. అందులో ఒకటి పరదైసు భూమ్మీద శాశ్వతకాలం యెహోవాను ఆరాధించడం.—కీర్తన 37:29 చదవండి.

11. దేవునికి దగ్గరవ్వడం వల్ల మనకు ఏం జరుగుతుంది? యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

11 దేవునికి దగ్గరవ్వడం వల్ల మనకు ఇంకా చాలా రకాలుగా మంచి జరుగుతుంది. ఉదాహరణకు, తనకు దగ్గరగా ఉన్నవాళ్లు ఎవరైనా పాపం చేసి పశ్చాత్తాపం చూపిస్తే వాళ్లను క్షమిస్తానని యెహోవా మాటిచ్చాడు. (యెష. 1:18) దానివల్ల, గతంలో మన పాపాల తాలూకు బరువు మోస్తూ ఉండాల్సిన అవసరంలేదు. (కీర్త. 32:1-5) అంతేకాదు, మనం యెహోవా మనసును కూడా సంతోషపెట్టే అవకాశం ఉంది. (సామె. 23:15) యెహోవాకు సన్నిహిత స్నేహితులుగా ఉండడం వల్ల ఇంకా చాలా దీవెనలు ఉన్నాయి. అయితే, మనం ఆయనకు దగ్గరౌతూ ఎలా ఉండవచ్చు?

మనం ఎలా ‘దేవునికి దగ్గరౌతూ’ ఉండవచ్చు?

12. దేవునికి దగ్గరవ్వడానికి మీరేం చేశారు?

12 మీరు బాప్తిస్మం తీసుకున్న వాళ్లయితే యెహోవాకు దగ్గరవ్వడానికి మీరు ఇప్పటికే చాలా పనులు చేసి ఉంటారు. యెహోవా గురించి, యేసుక్రీస్తు గురించి ఎన్నో సత్యాలు తెలుసుకున్నారు. గతంలో చేసిన పాపాలకు పశ్చాత్తాపపడ్డారు. దేవుని మీద బలమైన విశ్వాసం చూపించారు. ఆయన ఇష్టానికి తగ్గట్టు పనిచేయడానికి ఎంతో కష్టపడ్డారు. అయితే, మనం ఆయనకు ఇంకా దగ్గరవ్వాలంటే ఆ పనులన్నీ ఆపకుండా చేస్తూనే ఉండాలి.—కొలొ. 2:6.

13. యెహోవాకు దగ్గరౌతూ ఉండడానికి మనం చేయాల్సిన మూడు పనులు ఏంటి?

13 యెహోవాకు దగ్గరౌతూ ఉండడానికి మనం ఏం చేయాలి? (1) బైబిల్ని చదువుతూ, అధ్యయనం చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు కేవలం దేవుని గురించిన వాస్తవాలు తెలుసుకోవడమే కాదు. మన విషయంలో ఆయన ఇష్టాన్ని అంటే మనం ఎలాంటి పనులు చేయాలని, ఎలా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడో తెలుసుకుంటూ ఉండాలి. (ఎఫె. 5:15-17) (2) ఆయన మన మీద చూపించిన ప్రేమకున్న ఎన్నో రుజువుల్ని ఆలోచిస్తూ, మన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. (3) యెహోవా అసహ్యించుకునే పనుల్ని మనమూ అసహ్యించుకుంటూ అలాంటి పనులు చేసేవాళ్లకు దూరంగా ఉండాలి.—కీర్త. 1:1; 101:3.

14. మొదటి కొరింథీయులు 10:31 ప్రకారం, మనం ప్రతీరోజు చేసే ఎలాంటి పనుల్లో కూడా యెహోవా మనసును సంతోషపెట్టవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

14 1 కొరింథీయులు 10:31 చదవండి. మనం ఏం చేస్తే యెహోవా హ్యాపీ అవుతాడో ఆ పనులు చేయడం చాలా ప్రాముఖ్యం. అంటే కేవలం ప్రీచింగ్‌లో, మీటింగ్‌లో ఉన్నప్పుడు మనం చేసే పనులే కాదు. మనం ప్రతీరోజు చేసే పనుల్లో కూడా యెహోవా మనసును సంతోషపెట్టాలి. ఉదాహరణకు, మనం ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలి, పిసినారిగా ఉండకూడదు. అప్పుడు యెహోవా హ్యాపీ అవుతాడు. (2 కొరిం. 8:21; 9:7) అంతేకాదు, ఆయన మనకు ఇచ్చిన జీవం మీద కూడా మనం గౌరవం చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. తినే విషయంలో, తాగే విషయంలో, మంచి అలవాట్లు మనకు ఉంటే మన ఆరోగ్యాన్ని చక్కగా పట్టించుకుంటే జీవాన్నిచ్చిన దేవునికి మనం దగ్గరౌతాం. ఆయన మనసును సంతోషపెట్టే ఏ చిన్న పని చేసినా, మనం ఆయన మనసు గెలిచినవాళ్లం అవుతాం.—లూకా 16:10.

చిత్రాలు: దేవున్ని సంతోషపెట్టాలంటే చేయాల్సిన కొన్ని పనులు: 1. జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయడం: ఒక బ్రదర్‌ రెడ్‌ లైట్‌ చూసి కారు ఆపాడు. 2. ఎక్సర్‌సైజ్‌ చేయడం: ఒక బ్రదర్‌ వాకింగ్‌ చేస్తున్నాడు. 3. మంచి ఆహారం తినడం: ఒక గిన్నెలో పౌష్టిక ఆహారం ఉంది. 4. మనకు ఉన్నవాటిని వేరేవాళ్లతో పంచుకోవడం: చేతికి కట్టు కట్టుకున్న ఒక వృద్ధ సిస్టర్‌కి పువ్వులు, ఆహారం తెచ్చిస్తున్న ఒక సిస్టర్‌.

దేవున్ని సంతోషపెట్టాలంటే చేయాల్సిన కొన్ని పనులు: జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయడం, ఎక్సర్‌సైజ్‌ చేయడం, మంచి ఆహారం తినడం, మనకు ఉన్నవాటిని వేరేవాళ్లతో పంచుకోవడం (14వ పేరా చూడండి)


15. మనం వేరేవాళ్లతో ఎలా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు?

15 యెహోవా నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద దయ చూపిస్తున్నాడు. (మత్త. 5:45) మనం కూడా వేరేవాళ్ల మీద దయ చూపించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఉదాహరణకు, మనం ‘ఎవరి గురించీ చెడుగా మాట్లాడొద్దు, గొడవలు పెట్టుకోవద్దు, అందరి పట్ల పూర్తి సౌమ్యతతో మెలగాలి.’ (తీతు 3:2) దీన్ని మనసులో ఉంచుకొని, మనలాంటి నమ్మకాలు లేనివాళ్లను మనం తక్కువగా చూడం. (2 తిమో. 2:23-25) మనం ఎప్పుడూ వేరేవాళ్లతో దయగా, అర్థం చేసుకుంటూ ప్రవర్తిస్తే మనం యెహోవాకు ఇంకా దగ్గరౌతాం.

మనం పొరపాట్లు చేసినా యెహోవాకు ‘దగ్గరవ్వచ్చు’

16. చాలాకాలం యెహోవా సేవ చేశాక, 73వ కీర్తన రాసిన వ్యక్తికి ఎలా అనిపించింది?

16 అయితే కొన్నిసార్లు, యెహోవా ప్రేమకు మీరు అర్హులు కాదని అనిపించవచ్చు. మనం ముందే మాట్లాడుకున్నట్టు, 73వ కీర్తన రాసిన వ్యక్తికి అలాగే అనిపించింది. ఆయనిలా అన్నాడు: “నా పాదాలు దాదాపు దారితప్పాయి; నా అడుగులు జారినంత పనైంది.” (కీర్త. 73:2) ఆయన “దుఃఖంతో” నిండిపోయాడని, “బుద్ధి, అవగాహన లేకుండా” పోయాడని, యెహోవా ముందు “తెలివిలేని పశువులా” ఉన్నాడని ఒప్పుకున్నాడు. (కీర్త. 73:21, 22) చేసిన తప్పుల వల్ల ఇక యెహోవా తనను ప్రేమించడని, క్షమించడని ఆయన చేతులు ఎత్తేశాడా?

17. (ఎ) బాధతో డీలా పడిపోయినప్పుడు కీర్తనకర్త ఏం చేశాడు? (బి) ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

17 యెహోవా తన ముఖం తిప్పేసుకున్నాడని కీర్తనకర్త అనుకున్నాడు. కానీ ఆ ఫీలింగ్‌ ఆయనకు ఎక్కువ రోజులు లేదు. బహుశా ఆయన బాధలో డీలా పడిపోయినప్పుడు దేవునికి ఇంకా దగ్గరవ్వాలని గుర్తించాడు. అది ఆయన చెప్పిన ఈ మాటల్లో తెలుస్తుంది: “ఇప్పుడు మాత్రం నేను నీతోనే ఉంటున్నాను; నువ్వు నా కుడిచేతిని పట్టుకున్నావు. నీ సలహాతో నువ్వు నాకు నిర్దేశమిస్తావు, తర్వాత మహిమ వైపు నన్ను నడిపిస్తావు.” (కీర్త. 73:23, 24) మనం కూడా బలహీనంగా లేదా బాగా డీలా పడిపోయినప్పుడు స్థిరంగా ఉండడానికి, మన ఆశ్రయదుర్గమైన యెహోవా వైపు చూడాలి. (కీర్త. 73:26; 94:18) ఒకవేళ మనం తప్పటడుగులు వేసినా, యెహోవా పెద్ద మనసుతో “క్షమించడానికి సిద్ధంగా” ఉంటాడని తెలుసుకుని ఆయన దగ్గరికి తిరిగిరావచ్చు. (కీర్త. 86:5) ముఖ్యంగా, మన జీవితంలో చీకటి అలుముకున్నప్పుడు మనం యెహోవాకు ఇంకా దగ్గరవ్వాలి.—కీర్త. 103:13, 14.

చిత్రాలు: 1. బాధపడుతూ బెడ్‌ మీద కూర్చున్న ఒక బ్రదర్‌. 2. తర్వాత, మీటింగ్‌లో ఒక జంట ఆయన్ని పలకరించిన్నప్పుడు ముఖం చిరునవ్వుతో వెలిగిపోతుంది.

ఆధ్యాత్మికంగా బలహీనంగా అనిపించినప్పుడు, యెహోవా ఆరాధనకు సంబంధించిన పనులు ఎక్కువ చేసి ఆయనకు దగ్గరవ్వాలి (17వ పేరా చూడండి)


ఎప్పటికీ ‘దేవునికి దగ్గరౌతూ’ ఉండండి

18. యెహోవాకు దగ్గరవ్వడానికి అంతులేదని ఎందుకు చెప్పవచ్చు?

18 యెహోవాకు మనం ఎంత దగ్గరవ్వచ్చు, ఆయన్ని ఎంతబాగా తెలుసుకోవచ్చు అనడానికి అంతులేదు. ఆయన మార్గాలు, తెలివి, జ్ఞానం “కనుక్కోవడం అసాధ్యం!” అని బైబిలు చెప్తుంది.—రోమా. 11:33.

19. కీర్తనల పుస్తకం మనకు ఏ అభయం ఇస్తుంది?

19 కీర్తన 79:13 లో ఇలా ఉంది: “నీ ప్రజలమూ నువ్వు మేపే గొర్రెలమూ అయిన మేము ఎప్పటికీ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం; తరతరాలు నిన్ను స్తుతిస్తాం.” మీరు కూడా దేవునికి దగ్గరౌతూ ఉన్నప్పుడు శాశ్వతకాల దీవెనలు సొంతం చేసుకుంటారనే అభయంతో ఉండవచ్చు. అప్పుడు చాలా ధైర్యంతో ఇలా చెప్తారు: “దేవుడే నా హృదయానికి ఆశ్రయదుర్గం, ఆయనే ఎప్పటికీ నా భాగం.”—కీర్త. 73:26.

మీరెలా జవాబిస్తారు?

  • “దేవునికి దగ్గరవ్వడం” వల్ల వచ్చే ఉపయోగాల గురించి ఎందుకు ఆలోచించాలి?

  • మనం “దేవునికి దగ్గరవ్వడం” ఏయే విధాలుగా మంచిది?

  • మనం ఎలా ‘దేవునికి దగ్గరౌతూ’ ఉండవచ్చు?

పాట 32 యెహోవా పక్షాన ఉండండి!

a చాలాకాలంగా ఉన్న ఒత్తిడి, ఆందోళన, లేదా బాధ పోవాలంటే డాక్టర్ల సహాయం అవసరం కావచ్చు. ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి కావలికోట, నం. 1 2023 చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి