అధ్యయన ఆర్టికల్ 12
పాట 119 మనకు విశ్వాసం ఉండాలి
విశ్వాసంతో నడుచుకుంటూ ఉండండి
“మనం కనిపించేవాటిని బట్టి కాదుగానీ విశ్వాసంతో నడుచుకుంటున్నాం.”—2 కొరిం. 5:7.
ముఖ్యాంశం
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు విశ్వాసంతో నడుచుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?
1. తన జీవితాన్ని ఒకసారి తిరగేసుకుంటే పౌలు ఎందుకు సంతృప్తిగా ఉండగలిగాడు?
అపొస్తలుడైన పౌలుకి జీవితంలో ఒక టైం వచ్చింది. అప్పుడు చావు ఆయన కళ్లముందు కనిపిస్తుంది. అయితే, ఆయన సంతృప్తితో కన్ను మూయడానికి మంచి కారణాలున్నాయి. ఎందుకంటే, ఆయన జీవితాన్ని ఒక్కసారి తిరగేసుకుంటూ ఇలా చెప్పాడు: “పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తాను, విశ్వాసాన్ని అనుసరించాను.” (2 తిమో. 4:6-8) అవును, పౌలు యెహోవా సేవలో ఎన్నో మంచిమంచి నిర్ణయాలు తీసుకున్నాడు. వాటినిబట్టి యెహోవా సంతోషించాడని కూడా ఆయనకు తెలుసు. మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకుని, యెహోవా మనసు గెలుచుకోవాలని అనుకుంటాం. మరి దాన్నెలా చేయవచ్చు?
2. విశ్వాసంతో నడుచుకోవడం అంటే ఏంటి?
2 పౌలు తన గురించి, ఇతర నమ్మకమైన క్రైస్తవుల గురించి ఇలా చెప్పాడు: “మనం కనిపించేవాటిని బట్టి కాదుగానీ విశ్వాసంతో నడుచుకుంటున్నాం.” (2 కొరిం. 5:7) పౌలు మాటలకు అర్థమేంటి? బైబిల్లో ‘నడుచుకోవడం’ అనే పదం కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడాన్ని సూచిస్తుంది. కాబట్టి కనిపించేవాటిని బట్టి నడుచుకునే వ్యక్తి తను చూసిన, విన్న, అనిపించిన విషయాల్ని బట్టే నిర్ణయాలు తీసుకుంటాడు. మరోపక్క, విశ్వాసంతో నడుచుకునే వ్యక్తి యెహోవా దేవుని మీద నమ్మకంతో నిర్ణయాలు తీసుకుంటాడు. దేవుడు తనకు ప్రతిఫలం ఇస్తాడని, బైబిల్లో యెహోవా ఇచ్చిన సలహాలు పాటిస్తే తనకే మంచిదని ఆయన తన పనుల్లో చూపిస్తాడు.—కీర్త. 119:66; హెబ్రీ. 11:6.
3. విశ్వాసంతో నడుచుకుంటే వచ్చే ఉపయోగాలు ఏంటి? (2 కొరింథీయులు 4:18)
3 కొన్నిసార్లు మనం చూసేదాన్నిబట్టి, వినేదాన్నిబట్టి, అనిపించేదాన్నిబట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే, కేవలం వాటిమీదే ఆధారపడి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే లేనిపోని సమస్యలు మనకు చుట్టుకోవచ్చు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే మన కళ్లు, మన చెవులు మనల్ని మోసం చేయవచ్చు. ఒకవేళ అలా కాకపోయినా, మనకు కనిపించేవాటిని బట్టి నడుచుకుంటే మనం దేవుని సలహాల్ని లేదా ఆయన ఇష్టాన్ని పెడచెవిన పెట్టే అవకాశం ఉంది. (ప్రసం. 11:9; మత్త. 24:37-39) కానీ మనం విశ్వాసంతో నడుచుకుంటే, “ప్రభువు” ఇష్టానికి తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. (ఎఫె. 5:10) దేవుని సలహాలు పాటిస్తే మనకే మనశ్శాంతి ఉంటుంది. దానివల్ల వచ్చే సంతోషానికి ఏదీ సాటిరాదు. (కీర్త. 16:8, 9; యెష. 48:17, 18) మనం విశ్వాసంతో నడుచుకుంటూ ఉంటే శాశ్వతకాల జీవితం మన సొంతం.—2 కొరింథీయులు 4:18 చదవండి.
4. ఒక వ్యక్తి కనిపించేవాటిని బట్టి నడుచుకుంటున్నాడా లేక విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటున్నాడా అనేది ఎలా తెలుస్తుంది?
4 మనం కనిపించేవాటిని బట్టి నడుచుకుంటున్నామా లేక విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటున్నామా అనేది ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే, మనం ఈ ప్రశ్న వేసుకోవాలి: మన నిర్ణయాలు దేని ఆధారంగా తీసుకుంటున్నాం? కేవలం మనకు కనిపించేవాటిని బట్టేనా? లేదా యెహోవా మీద, ఆయన ఇచ్చే సలహాల మీద ఆధారపడి తీసుకుంటున్నామా? అయితే, ఇప్పుడు ఈ మూడు ముఖ్యమైన సందర్భాల్లో మనం విశ్వాసాన్నిబట్టి నడుచుకుంటున్నామని ఎలా చూపిస్తామో పరిశీలిద్దాం: ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నప్పుడు, ఎవర్ని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకుంటున్నప్పుడు, సంస్థ నుండి నిర్దేశాలు వస్తున్నప్పుడు. ఆ మూడు సందర్భాల్లో మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఏ విషయాల గురించి ఆలోచించాలో కూడా పరిశీలిద్దాం.
ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నప్పుడు
5. ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నప్పుడు ఏం చేస్తే కనిపించేవాటిని బట్టే నడుచుకున్నట్టు అవుతుంది?
5 మనకూ, మన కుటుంబానికి ఎన్నో కొన్ని అవసరాలు ఉంటాయి. మనందరం వాటిని తీర్చుకోవాలని అనుకుంటాం. (ప్రసం. 7:12; 1 తిమో. 5:8) కొన్ని ఉద్యోగాలు కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. దాంట్లో మన రోజువారీ అవసరాలు తీరడమే కాదు, భవిష్యత్తు కోసం నాలుగురాళ్లు వెనకేసుకోగలుగుతాం. కానీ ఇంకొన్ని చిన్నాచితకా ఉద్యోగాల్లో కేవలం మన కుటుంబ అవసరాల్ని మాత్రమే తీర్చగలుగుతాం. అయితే, ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నప్పుడు జీతం ఎంతో ఆలోచించడం మంచి విషయమే. కానీ కేవలం దానిగురించే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, కనిపించేవాటిని బట్టే నడుచుకున్నట్లు అవుతుంది.
6. ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నప్పుడు విశ్వాసంతో నడుచుకుంటున్నామని ఎలా చూపిస్తాం? (హెబ్రీయులు 13:5)
6 మనం విశ్వాసంతో నడుచుకుంటే, మన ఉద్యోగం యెహోవాతో మనకున్న బంధాన్ని ఏమైనా చేసే అవకాశం ఉందా అని కూడా ఆలోచిస్తాం. మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఈ ఉద్యోగంలో నేను యెహోవా ఇష్టపడని పనులు ఏమైనా చేయాల్సి వస్తుందా?’ (సామె. 6:16-19) ‘నా ఆరాధనకు ఇది అడ్డొస్తుందా? బహుశా అప్పుడప్పుడు నా కుటుంబానికి చాలారోజుల పాటు దూరంగా ఉండాల్సి వస్తుందా?’ (ఫిలి. 1:10) ఒకవేళ అలాంటి ప్రశ్నలకు మీ జవాబు ‘అవును’ అయితే, ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉన్నాసరే ఆ ఉద్యోగంలో చేరకపోవడమే తెలివైన పని. మనం విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటాం కాబట్టి మన అవసరాల్ని యెహోవా ఎలాగైనా తీర్చగలడనే నమ్మకంతో నిర్ణయాలు తీసుకోవాలి.—మత్త. 6:33; హెబ్రీయులు 13:5 చదవండి.
7-8. సౌత్ అమెరికాలో ఉంటున్న ఒక బ్రదర్ ఎలా విశ్వాసాన్ని బట్టి నడుచుకున్నాడు? (చిత్రం కూడా చూడండి.)
7 సౌత్ అమెరికాలో ఉంటున్న జేవియర్ a అనే బ్రదర్ విశ్వాసంతో నడుచుకోవడం అవసరమని గుర్తించాడు. ఆయన ఇలా చెప్పాడు: “ఇంతకుముందున్న ఉద్యోగం కన్నా నాకు రెండింతలు జీతం వచ్చే ఉద్యోగానికి అప్లై చేశాను. ఆ ఉద్యోగం చేస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుందని అనుకున్నాను.” అయితే, జేవియర్‌కి ఎప్పటినుండో పయినీరు సేవ చేయాలనే కోరిక ఉండేది. ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు: “నేను ఆ కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకున్నాను. అయితే, నాకు ఏది మంచిదో యెహోవాకు తెలుసు. కాబట్టి, సహాయం కోసం ఆయనకు ప్రార్థన చేశాను. నాకు నా కెరీర్‌లో ఎదగాలని ఉంది. కానీ ఒకవేళ ఈ ఉద్యోగం నా ఆధ్యాత్మిక విషయాలకు అడ్డొస్తే మాత్రం, నాకది వద్దు.”
8 జేవియర్ ఇంకా ఇలా చెప్తున్నాడు: “ఆ ఉద్యోగంలో రోజూ ఓవర్ టైం చేయాల్సి వస్తుందని మేనేజరు చెప్పాడు. ఇక అది నా ఆరాధనకు అడ్డురావచ్చు కాబట్టి దయగా నో చెప్పాను.” అవును, జేవియర్ ఆ ఉద్యోగం వద్దనుకున్నాడు. రెండు వారాల తర్వాత ఆయన పయినీరు సేవ మొదలుపెట్టాడు. అదే సంవత్సరం చివర్లో ఆయనకు ఒక పార్ట్‌టైమ్ ఉద్యోగం దొరికింది. ఆయనిలా చెప్తున్నాడు: “యెహోవా నా ప్రార్థన విన్నాడు. నా పయినీరు సేవకు సరిగ్గా సరిపోయే ఉద్యోగం ఇప్పించాడు. యెహోవాకు అలాగే బ్రదర్స్‌సిస్టర్స్‌కి సేవచేయడానికి ఎక్కువ టైం దొరికే ఉద్యోగం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.”
ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తామంటే, మీకు ఏది మంచిదో యెహోవాకు తెలుసనే నమ్మకం మీ నిర్ణయంలో కనిపిస్తుందా? (7-8 పేరాలు చూడండి)
9. ట్రేసర్ నుండి మీరు ఏం నేర్చుకున్నారు?
9 ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం, విశ్వాసాన్ని బట్టి నడుచుకునేలా అనుమతించట్లేదని మీకు అనిపిస్తే అప్పుడేంటి? కాంగోలో ఉంటున్న ట్రేసర్ అనే బ్రదర్ అనుభవాన్ని పరిశీలించండి. ఆయనిలా చెప్తున్నాడు: “నాకు వచ్చిన కొత్త ఉద్యోగం జీవితంలో ఒక్కసారే వచ్చే బంపర్ ఆఫర్. ముందటి ఉద్యోగం కన్నా దీంట్లో నాకు మూడింతలు ఎక్కువ జీతం వస్తుంది. మంచి పేరు, గౌరవం కూడా దక్కింది.” అయితే, తరచూ ఓవర్ టైం చేయడం వల్ల ట్రేసర్ మీటింగ్ మిస్సయ్యేవాడు. అంతేకాదు, కంపెనీలో ఉన్న లొసుగులు కూడా కప్పి పెట్టాలనే ఒత్తిడి వచ్చేది. ట్రేసర్ ఆ ఉద్యోగాన్ని వదిలేయాలని అనుకున్నాడు గానీ మళ్లీ ఉద్యోగం దొరికిద్దో లేదో అని భయపడ్డాడు. మరి ఆయనకు ఏది సహాయం చేసింది? ఆయనిలా చెప్తున్నాడు: “ఉద్యోగం పోయినా యెహోవా నన్ను ఎలాగోలా చూసుకుంటాడని అర్థం చేసుకోవడానికి హబక్కూకు 3:17-19 సహాయం చేసింది. అందుకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేశాను. సాధారణంగా, ఉద్యోగం ఇచ్చేవాళ్లు ఎక్కువ జీతం ఇస్తే ఒకవ్యక్తి దేన్నైనా ఆఖరికి కుటుంబాన్ని, ఆధ్యాత్మిక పనుల్ని కూడా త్యాగం చేస్తారు అనుకుంటారు. కానీ నేను నా కుటుంబంతో, యెహోవాతో నాకున్న బంధాన్ని పదిలంగా కాపాడుకున్నందుకు సంతోషంగా ఉంది. ఒక సంవత్సరం తర్వాత నా అవసరాలన్నీ తీర్చుకుని, యెహోవా సేవకు కూడా టైం పెట్టేంత మంచి ఉద్యోగం దొరికింది. మనం యెహోవాను ముందు పెడితే బహుశా ఆర్థికంగా కొన్ని రోజులు ఇబ్బందిపడతామేమో గానీ, ఆయన మన అవసరాల్ని తప్పకుండా తీరుస్తాడు.” అవును యెహోవా సలహాల మీద, ఆయన ఇచ్చిన మాట మీద నమ్మకం ఉంచితే విశ్వాసాన్ని బట్టి నడుచుకోగలుగుతాం. దానివల్ల ఆయన దీవెనలు కూడా సొంతం చేసుకుంటాం.
ఎవర్ని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకుంటున్నప్పుడు
10. ఎవర్ని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకుంటున్నప్పుడు కనిపించే వాటినిబట్టే నడుచుకునే అవకాశం ఎలా ఉంది?
10 పెళ్లి యెహోవా ఇచ్చిన బహుమతి. అలాగే పెళ్లి చేసుకోవాలని అనిపించడం సహజం. అయితే, ఎవర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఒక సిస్టర్ బహుశా ఫలానా బ్రదర్ చూడడానికి ఎలా ఉన్నాడు? ఎలాంటి పనులు చేస్తాడు? ఇతరులు ఆయన్ని ఎలా చూస్తారు? ఆయన డబ్బును ఎలా చూస్తాడు? ఆయనకు ఏవైనా కుటుంబ బాధ్యతలు ఉన్నాయా? మిమ్మల్ని సంతోషంగా చూసుకోగలడా? లాంటి విషయాలు ఆలోచించవచ్చు.b ఇవి ముఖ్యమైన విషయాలే. కానీ ఒకవేళ ఆ సిస్టర్ కేవలం వీటిని మాత్రమే ఆలోచిస్తే, ఆమె కనిపించిన వాటినిబట్టి నడుచుకున్నట్టు అవుతుంది.
11. ఎవర్ని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకుంటున్నప్పుడు మనం విశ్వాసాన్ని బట్టి ఎలా నడుచుకోవచ్చు? (1 కొరింథీయులు 7:39)
11 ఎవర్ని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకుంటున్నప్పుడు తన సలహాను పాటించే బ్రదర్స్‌సిస్టర్స్‌ని చూసి యెహోవా గర్వపడతాడు. ఉదాహరణకు, పెళ్లి గురించి ఆలోచించడానికి ముందు “యౌవనప్రాయం” దాటిపోయేవరకు ఆగాలి అనే సలహాను అలాంటివాళ్లు మనసులోకి తీసుకుంటారు. (1 కొరిం. 7:36) అంతేకాదు, ఒక మంచి భర్తకు లేదా భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలని యెహోవా చెప్తున్నాడో వాటిని మాత్రమే ఆలోచిస్తారు. (సామె. 31:10-13, 26-28; ఎఫె. 5:33; 1 తిమో. 5:8) ఒకవేళ యెహోవాసాక్షికాని ఎవరైనా తమమీద ఆసక్తి చూపిస్తే వాళ్లు 1 కొరింథీయులు 7:39 లో “ప్రభువును అనుసరించే” వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనే సలహాను పాటిస్తారు. (చదవండి.) వేరే ఎవ్వరికన్నా కూడా యెహోవాయే తమ ఫీలింగ్స్‌ని, తమ అవసరాల్ని పట్టించుకుంటాడనే విశ్వాసంతో నడుచుకుంటారు.—కీర్త. 55:22.
12. రోసా నుండి మీరేం నేర్చుకున్నారు?
12 కొలంబియాలో పయినీరు సేవ చేస్తున్న రోసా అనే సిస్టర్ అనుభవాన్ని పరిశీలించండి. ఆమె ఉద్యోగం చేసే దగ్గర యెహోవాసాక్షికాని ఒక వ్యక్తితో దగ్గరగా పనిచేయాల్సి వచ్చింది. కొన్ని రోజులకు అతను ఆమె మీద ఆసక్తి చూపించడం మొదలుపెట్టాడు. రోసా కూడా అతన్ని ఇష్టపడింది. ఆమె ఇలా చెప్తుంది: “అతను చాలా మంచోడు. చుట్టుపక్కల వాళ్లకు సహాయం చేస్తాడు. మందు, సిగరెట్ లాంటి అలవాట్లు లేవు. నాతో చాలా పద్ధతిగా ఉంటాడు. ఒక భర్తలో నాకు ఏమేమి కావాలో అవన్నీ ఆయనలో ఉన్నాయి. కాకపోతే ఒకేఒక్కటి, ఆయన యెహోవాసాక్షి కాదు! ఆయనకు నో చెప్పడం చాలా కష్టమనిపించింది. ఎందుకంటే ఆ టైంలో నాకు చాలా ఒంటరిగా అనిపించింది. సత్యంలో ఉన్నవాళ్లు ఎవ్వరూ నాకు దొరకలేదు కాబట్టి నా మనసుకు దగ్గరగా ఉండే ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను.” కానీ రోసా, కంటికి కనిపించే దానిమీదే మనసుపెట్టలేదు. ఒకవేళ అతన్ని పెళ్లి చేసుకుంటే యెహోవాతో తనకున్న బంధం ఏమౌతుందో ఆమె ఆలోచించింది. అందుకే, ఆమె అతనితో మాట్లాడడం ఆపేసి, యెహోవా సేవలో బిజీగా గడపడం మొదలుపెట్టింది. ఎన్నో రోజులు గడవకముందే ఆమెకు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు హాజరయ్యే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తుంది. రోసా ఇలా చెప్తుంది: “యెహోవా దేవుడు నా మనసును చెప్పలేనంత సంతోషంతో నింపాడు.” నిజమే, మన మనసుకు దగ్గరగా ఉన్న విషయాల్లో విశ్వాసాన్ని బట్టి నడుచుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. కానీ అలా నడుచుకుంటే వచ్చే ప్రయోజనాల్ని దేనితో పోల్చలేం!
సంస్థ నుండి నిర్దేశాలు వస్తున్నప్పుడు
13. సంస్థ నుండి ఏదైనా ఒక నిర్దేశం వచ్చినప్పుడు, కనిపించేవాటిని బట్టే నడుచుకునే అవకాశం ఎలా ఉంది?
13 మనకు పెద్దల ద్వారా, ప్రాంతీయ పర్యవేక్షకుల ద్వారా, బ్రాంచి కార్యాలయం నుండి, పరిపాలక సభ నుండి ఎప్పటికప్పుడు నిర్దేశాలు వస్తుంటాయి. వాటివల్ల మనం యెహోవా సేవచేస్తూ ముందుకెళ్లగలుగుతాం. అయితే ఏదోక సందర్భంలో మనకు వచ్చిన నిర్దేశం సరిగ్గా అర్థం కాకపోతే, ఏంటి పరిస్థితి? బహుశా ఆ నిర్దేశం సరైంది కాదేమో అనే అనుమానాలు మనకు రావచ్చు. అంతేకాదు, ఆ నిర్దేశం ఇచ్చిన బ్రదర్స్‌లో ఉన్న లోపాల మీదే మనసుపెట్టడం మొదలుపెట్టే అవకాశం ఉంది.
14. సంస్థ నుండి ఏదైనా నిర్దేశం వచ్చినప్పుడు, విశ్వాసాన్నిబట్టి నడుచుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? (హెబ్రీయులు 13:17)
14 మనం విశ్వాసాన్నిబట్టి నడుచుకుంటే సంస్థను యెహోవా నడిపిస్తున్నాడని, మన పరిస్థితులు ఆయనకు తెలుసని నమ్ముతాం. దానివల్ల మంచి మనసుతో, వెంటనే లోబడతాం. (హెబ్రీయులు 13:17 చదవండి.) మనం లోబడి ఉంటే సంఘ ఐక్యతకు అది సహాయపడుతుందని గుర్తిస్తాం. (ఎఫె. 4:2, 3) నాయకత్వం వహించే బ్రదర్స్ అపరిపూర్ణులైనాసరే, మనం లోబడి ఉంటే యెహోవా అందర్నీ దీవిస్తాడని నమ్ముతాం. (1 సమూ. 15:22) ఈలోపు, దేన్నైనా నిజంగా సరిదిద్దాల్సిన అవసరం ఉంటే, యెహోవా సరైన సమయంలో దాన్ని చేస్తాడు.—మీకా 7:7.
15-16. సంస్థ నుండి వచ్చిన నిర్దేశం విషయంలో సందేహాలున్నా, ఒక బ్రదర్ విశ్వాసాన్నిబట్టి ఎలా నడుచుకోగలిగాడు? (చిత్రం కూడా చూడండి.)
15 విశ్వాసాన్నిబట్టి నడుచుకోవడం వల్ల ప్రయోజనాల్ని చూపించే ఈ అనుభవం గమనించండి. పెరూలో ఎక్కువ శాతం మంది స్పానిష్ భాష మాట్లాడేవాళ్లు ఉన్నారు. కానీ అక్కడున్న చాలామంది స్థానిక భాషల్లో కూడా మాట్లాడతారు. అందులో ఒకటి క్వెచువా భాష. చాలా సంవత్సరాలుగా క్వెచువా భాష మాట్లాడే బ్రదర్స్‌సిస్టర్స్ ఆ భాష మాట్లాడే వాళ్లకోసం టెరిటరీల్లో వెదికారు. కానీ ప్రభుత్వ నియమాలకు లోబడుతూ ఆ భాష మాట్లాడే వాళ్లను వెదికే పద్ధతిని సంస్థ మార్చింది. (రోమా. 13:1) దానివల్ల, ఇక ప్రీచింగ్ కుంటుపడుతుందేమో అని కొంతమంది అనుకున్నారు. కానీ బ్రదర్స్‌సిస్టర్స్ ఆ కొత్త నిర్దేశాలకు లోబడినందుకు ఎక్కువమంది క్వెచువా భాషా ప్రజలు దొరికేలా యెహోవా వాళ్ల ప్రయత్నాల్ని దీవించాడు.
16 ఆ మార్పు గురించి కంగారుపడ్డ వాళ్లలో క్వెచువా భాష సంఘంలో పెద్దగా సేవచేస్తున్న కెవిన్ కూడా ఉన్నాడు. ఆయనిలా అన్నాడు: “‘అసలు క్వెచువా మాట్లాడేవాళ్లను ఇప్పుడు ఎలా కనుక్కోవాలి?’ అని నేను అనుకున్నాను.” మరి కెవిన్ ఏం చేశాడు? దానికి ఆయన ఇలా చెప్పాడు: “నేను సామెతలు 3:5ను గుర్తుచేసుకున్నాను. అలాగే మోషే గురించి ఆలోచించాను. ఆయన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి నడిపించినప్పుడు ఇక అన్ని దారులు మూసుకుపోయి, ఐగుప్తీయుల చేతికి చిక్కామని కంగారుపడ్డాడు. అయినాసరే, ఆయన యెహోవాకు లోబడ్డాడు కాబట్టి దేవుడు అద్భుతరీతిగా వాళ్లందర్నీ కాపాడాడు.” (నిర్గ. 14:1, 2, 9-11, 21, 22) కెవిన్ కూడా మారిన పద్ధతికి అలవాటుపడడానికి ఇష్టపడ్డాడు. దానివల్ల ఏమైంది? తన మాటల్లోనే ఇలా చెప్పాడు: “యెహోవా మమ్మల్ని ఎలా దీవించాడో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతకుముందైతే, ప్రీచింగ్‌లో మేము చెప్పులు అరిగిపోయేలా తిరిగినా క్వెచువా భాష మాట్లాడేవాళ్లు ఒకరో ఇద్దరో దొరికేవాళ్లు. కానీ ఇప్పుడు మేము క్వెచువా భాష మాట్లాడేవాళ్లు ఒక గుంపుగా ఉన్న టెరిటరీల మీద దృష్టిపెట్టాం. దానివల్ల ఎక్కువమందితో కలిసి మాట్లాడగలుగుతున్నాం. రిటర్న్ విజిట్‌లు, బైబిలు స్టడీలు చేయగలుగుతున్నాం. మా మీటింగ్ అటెండెన్స్ కూడా చాలా పెరిగింది.” అవును, మనం విశ్వాసాన్నిబట్టి నడుచుకుంటే యెహోవా ఎప్పుడూ దీవిస్తూనే ఉంటాడు.
ఆ భాష మాట్లాడే చాలామంది ప్రజలు ఎక్కడుంటారో ప్రీచింగ్‌లో కలిసే వాళ్లే చూపిస్తారని బ్రదర్స్‌కి అర్థమైంది (15-16 పేరాలు చూడండి)
17. ఈ ఆర్టికల్‌లో మీరు ఏం నేర్చుకున్నారు?
17 మన జీవితంలో మూడు ముఖ్యమైన సందర్భాల్లో విశ్వాసాన్నిబట్టి ఎలా నడుచుకుంటూ ఉండాలో ఈ ఆర్టికల్‌లో చూశాం. కానీ మన జీవితంలో ప్రతీ విషయంలో అంటే వినోదం, సరదాగా సమయం గడపడం, చదువు లేదా పిల్లల్ని పెంచడం లాంటి అన్ని విషయాల్లో మనం విశ్వాసాన్నిబట్టి నడుచుకుంటూ ఉండాలి. మనం ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా కనిపించేవాటిని బట్టి కాదుగానీ, యెహోవాతో మనకున్న బంధాన్ని బట్టి, ఆయన సలహాల్ని బట్టి, మనల్ని చూసుకుంటానని ఆయన ఇచ్చిన మాటనుబట్టి తీసుకోవాలి. అలా చేసినప్పుడు “శాశ్వతకాలం మన దేవుడైన యెహోవాను అనుసరిస్తాం.”—మీకా 4:5.
పాట 156 విశ్వాసంతో భవిష్యత్తును చూడండి
a కొన్ని పేర్లను మార్చాం.
b ఈ పేరాలో భర్త కోసం చూసే సిస్టర్స్ గురించి మాట్లాడినా, అందులో ఉన్న సూత్రాలు భార్య కోసం చూసే బ్రదర్స్‌కి కూడా వర్తిస్తాయి.