అధ్యయన ఆర్టికల్ 13
పాట 4 “యెహోవా నా కాపరి”
యెహోవా చెయ్యి ఎప్పుడూ చిన్నది కాదు
“యెహోవా చెయ్యి అంత చిన్నదా?”—సంఖ్యా. 11:23.
ముఖ్యాంశం
మనం బ్రతకడానికి కావాల్సిన ప్రతీది యెహోవా ఇస్తాడనే మన నమ్మకాన్ని పెంచడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
1. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటకు నడిపిస్తున్నప్పుడు మోషే యెహోవా మీద నమ్మకాన్ని ఎలా చూపించాడు?
హెబ్రీయులు పుస్తకంలో విశ్వాసం చూపించిన చాలామంది గురించి ఉంది. అందులో మోషే, అసాధారణమైన విశ్వాసం చూపించిన వ్యక్తి. (హెబ్రీ. 3:2-5; 11:23-25) ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటకు నడిపించినప్పుడు ఆయన విశ్వాసం చూపించాడు. ఫరోకు, ఆయన సైన్యానికి ఆయన అస్సలు భయపడలేదు. యెహోవా మీద నమ్మకంతో ప్రజల్ని ఎర్రసముద్రం దాటించాడు, ఎడారిలోకి నడిపించాడు. (హెబ్రీ. 11:27-29) తమ అవసరాల్ని యెహోవా తీర్చగలడనే నమ్మకం చాలామంది ఇశ్రాయేలీయుల్లో తగ్గిపోయింది, కానీ మోషే మాత్రం దేవుని మీద నమ్మకాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఆయన విశ్వాసం అస్సలు చెక్కు చెదర్లేదు. ఎందుకంటే, అసలు ఏ పంటా లేని ఎడారిలో యెహోవా అద్భుతరీతిగా వాళ్లకు ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్లను ఇచ్చాడు.a—నిర్గ. 15:22-25; కీర్త. 78:23-25.
2. “యెహోవా చెయ్యి అంత చిన్నదా?” అని దేవుడు మోషేని ఎందుకు అడిగాడు? (సంఖ్యాకాండం 11:21-23)
2 మోషే అంత విశ్వాసం చూపించినా, యెహోవా ఇశ్రాయేలీయుల్ని అద్భుతరీతిలో విడుదల చేసిన సంవత్సరం తర్వాత తన ప్రజలకు మాంసం ఇవ్వగలిగే ఆయన సామర్థ్యాన్ని మోషే ప్రశ్నించాడు. అసలే అది తినడానికి ఏం దొరకని ఒక కారు అడవి. మరి, అన్ని లక్షల మందికి మాంసాన్ని యెహోవా ఎక్కడ నుండి తెస్తాడని మోషే అనుకున్నాడు. దానికి జవాబుగా యెహోవా మోషేని ఇలా అడిగాడు: “యెహోవా చెయ్యి అంత చిన్నదా?” (సంఖ్యాకాండం 11:21-23 చదవండి.) ఇక్కడ, “యెహోవా చెయ్యి” ఆయన ఏదైనా పని చేయడానికి ఉపయోగించే తన పవిత్రశక్తిని సూచిస్తుంది. ఒకరకంగా యెహోవా మోషేని ఇలా అడుగుతున్నాడు, ‘నేను చెప్పింది చేయలేనని నువ్వు అనుకుంటున్నావా?’
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 మీ అవసరాల్ని, మీ కుటుంబ అవసరాల్ని యెహోవా తీర్చగలడా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ మీకు వచ్చినా, రాకపోయినా తమ అవసరాల్ని యెహోవా తీరుస్తాడనే నమ్మకం తగ్గిపోయిన ఇశ్రాయేలీయుల గురించి అలాగే మోషే గురించి మనం పరిశీలిస్తాం. అంతేకాదు, యెహోవా చెయ్యి ఎప్పుడూ చిన్నది కాదు అనే మన నమ్మకాన్ని పెంచే కొన్ని లేఖనాల్ని కూడా పరిశీలిస్తాం.
మోషే అలాగే ఇశ్రాయేలీయుల నుండి నేర్చుకోండి
4. తమ అవసరాల్ని యెహోవా తీర్చగలడా అనే అనుమానం చాలామంది ఇశ్రాయేలీయులకు ఎందుకు వచ్చి ఉంటుంది?
4 ఇప్పుడు సందర్భాన్ని చూద్దాం. ఇశ్రాయేలీయుల జనాంగం అలాగే “చాలామంది విదేశీయులు” ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ప్రయాణిస్తూ కొంతకాలం ఎడారిలో ఉన్నారు. (నిర్గ. 12:38; ద్వితీ. 8:15) అయితే, ఆ విదేశీయులకు మన్నా తినీ తినీ వెగటు వచ్చేసింది. వాళ్లతోపాటు చాలామంది ఇశ్రాయేలీయులు చేతులు కలిపి, దాని గురించి ఫిర్యాదు చేశారు. (సంఖ్యా. 11:4-6) వాళ్లందరూ ఐగుప్తులో దొరికే ఆహారానికి కరువాసిపోయారు. వాళ్లు పెట్టిన ఒత్తిడికి, వాళ్లకు మాంసం ఎక్కడ నుండి తెచ్చిపెట్టాలా అని మోషే తల పట్టుకున్నాడు.—సంఖ్యా. 11:13, 14.
5-6. చాలామంది ఇశ్రాయేలీయులు, విదేశీయులతో చేతులు కలిపిన దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?
5 యెహోవా ఇచ్చిన వాటిమీద ఇశ్రాయేలీయులుకాని వాళ్లకు కృతజ్ఞత కరువైంది. వాళ్ల చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులు కూడా వాళ్లలాగే ఆలోచించడం మొదలుపెట్టారు. బహుశా మనచుట్టూ కూడా కృతజ్ఞత లేనివాళ్లు, యెహోవా ఇచ్చే వాటితో తృప్తిపడనివాళ్లు ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఆలోచించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఒకప్పుడు మనకున్న వాటిగురించి బాధపడినా, లేక వేరేవాళ్లకు ఉన్నవాటిని బట్టి ఈర్ష్యపడినా మనకూ అలా జరగవచ్చు. అయితే, మన పరిస్థితులు ఏవైనా మనం సంతృప్తిగా ఉండడం నేర్చుకుంటే సంతోషం మన సొంతం!
6 ఇశ్రాయేలీయులు తమ కొత్త ఇంటికి అంటే, వాగ్దాన దేశానికి వెళ్లిన తర్వాత యెహోవా వాళ్లకు కావాల్సినవన్నీ ఏ కొదువ లేకుండా పుష్కలంగా ఇస్తానని చెప్పిన మాటను గుర్తుంచుకోవాల్సింది. ఆ మాట నిజమయ్యేది వాగ్దాన దేశంలో గానీ ఎడారిలో ఉన్నప్పుడు కాదు. అదేవిధంగా ఈ వ్యవస్థలో మనకు లేని వాటిమీద మనసు పెట్టే బదులు, కొత్తలోకంలో యెహోవా మనకు ఏమేం ఇస్తాడనే దానిమీద మనం మనసుపెట్టాలి. అంతేకాదు, యెహోవా మీద మన నమ్మకాన్ని పెంచే బైబిలు లేఖనాల గురించి లోతుగా ఆలోచించాలి.
7. యెహోవా చెయ్యి చిన్నది కాదు అనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?
7 అయితే, దేవుడు మోషేను ఇలా ఎందుకు అడిగాడని మనకు అనిపించవచ్చు: “యెహోవా చెయ్యి అంత చిన్నదా?” ఇక్కడ యెహోవా తన బలమైన చేతికున్న శక్తి గురించి మాత్రమే కాదుగానీ, ఆయన ఏ స్థాయిలో సహాయం చేయగలడో కూడా మోషే అర్థం చేసుకోవాలని కోరుకున్నాడు. కాకులు దూరని కారడవిలో కూడా యెహోవా ఇశ్రాయేలీయులకు కడుపు నిండా మాంసం పెట్టగలడు. “తన బలమైన చేతితో, చాచిన బాహువుతో” యెహోవా తన శక్తిని చూపించాడు. (కీర్త. 136:11, 12) కాబట్టి మనం కష్టాల్లో ఉన్నప్పుడు, యెహోవా చెయ్యి లేదా సహాయం మన దాకా వస్తుందా అనే డౌట్ అవసరం లేదు.—కీర్త. 138:6, 7.
8. ఎడారిలో చాలామంది చేసిన ఏ తప్పును మనం చేయకుండా జాగ్రత్తపడాలి? (చిత్రం కూడా చూడండి.)
8 యెహోవా చెప్పినట్టే వాళ్లకు మాంసాన్ని ఇచ్చాడు. వాళ్ల చుట్టూ చాలా పూరేడు పిట్టలు పడేలా చేశాడు. అయితే, ఆ అద్భుతానికి ఇశ్రాయేలీయులు యెహోవాకు కృతజ్ఞత చెప్పే బదులు అత్యాశతో, రాత్రనకా-పగలనకా ఆ పూరేడు పిట్టలను ఏరుకోవడంలో పడిపోయారు. అలా “కక్కుర్తిపడిన” వాళ్లందరి మీద యెహోవాకు చాలా కోపం వచ్చి, వాళ్లను శిక్షించాడు. (సంఖ్యా. 11:31-34) ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది. మనం కూడా అత్యాశకు పోకుండా జాగ్రత్తపడాలి. మనం డబ్బు ఉన్నవాళ్లమైనా, పేదవాళ్లమైనా యెహోవాతో, యేసుతో దగ్గరి స్నేహాన్ని పెంచుకుంటూ పరలోకంలో “సంపదలు” కూడబెట్టుకోవడానికే మొదటి స్థానం ఇవ్వాలి. (మత్త. 6:19, 20; లూకా 16:9) అలా చేసినప్పుడు, మనకు కావాల్సినవి యెహోవా ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.
ఎడారిలో ఉన్నప్పుడు చాలామంది ఎలాంటి స్ఫూర్తి చూపించారు? దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (8వ పేరా చూడండి)
9. యెహోవా ఏం చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు?
9 యెహోవా ఇప్పటికీ తన ప్రజలకు సహాయం చేయడానికి తన చెయ్యి చాపి ఉంచాడు. అయితే, తన ప్రజల దగ్గర ఎప్పుడూ డబ్బులు గలగలలాడతాయని లేదా వాళ్లు ఎప్పుడూ పస్తులు ఉండాల్సిరాదని కాదు.b కానీ యెహోవా మన చెయ్యి ఎప్పుడూ వదిలేయడు. కష్టాలన్నిటినీ గట్టెక్కడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. అయితే, మనకు కావాల్సినవి ఇవ్వడానికి యెహోవా తన చెయ్యి చాపే ఉంచుతాడనే నమ్మకాన్ని ఈ రెండు సందర్భాల్లో ఎలా చూపించవచ్చో ఇప్పుడు చూద్దాం: (1) ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు (2) భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
10. మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావచ్చు?
10 ఈ వ్యవస్థ నాశనానికి టైం దగ్గర పడుతుండగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు తలకిందులు అవ్వొచ్చు. అస్థిరమైన ప్రభుత్వాలు, అర్థంపర్థంలేని యుద్ధాలు, అకాలంగా వచ్చే ప్రకృతి విపత్తులు లేదా కొత్తకొత్త మహమ్మారులు వీటన్నిటి వల్ల ఊహించని ఖర్చులు మన నెత్తినపడవచ్చు. బహుశా మన ఉద్యోగం పోవచ్చు, ఆస్తిపాస్తులు పోవచ్చు, మన ఇంటిని కూడా కోల్పోవచ్చు. ప్రస్తుతం మనం ఉంటున్న ప్రాంతంలోనే ఒక కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి రావచ్చు లేదా కుటుంబాన్ని పోషించడానికి మనం కుటుంబంతో సహా వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి రావచ్చు. మరి యెహోవా మీద మనకు నమ్మకం ఉందని చూపించే నిర్ణయాలు తీసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?
11. ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకురావడానికి మీకేది సహాయం చేస్తుంది? (లూకా 12:29-31)
11 అన్నిటికన్నా ముఖ్యమైన, చక్కని పద్ధతి ఏంటంటే మీ మనసులో ఉన్నదంతా యెహోవాకు చెప్పుకోవడమే. (సామె. 16:3) మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన తెలివిని ఇవ్వమని ఆయన్ని అడగవచ్చు. మన పరిస్థితి గురించి “అతిగా చింతించడం” ఆపేసి ప్రశాంతంగా ఉండడానికి సహాయం అడగవచ్చు. (లూకా 12:29-31 చదవండి.) మనం బ్రతకడానికి కావాల్సిన వాటితో తృప్తిపడేలా సహాయం చేయమని కూడా ఆయన్ని అడగవచ్చు. (1 తిమో. 6:7, 8) ఆర్థిక ఇబ్బందులతో ఎలా నెట్టుకురావచ్చో మన ప్రచురణలో పరిశోధన చేయండి. వాటికి సంబంధించి jw.orgలో ఉన్న సమాచారం చాలామందికి ఉపయోగపడింది.
12. ఒకవ్యక్తి తన కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయం తీసుకోవడానికి ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?
12 కొంతమంది కుటుంబానికి దూరంగా ఉండే ఉద్యోగాల్ని ఒప్పుకుంటున్నారు. కానీ అది తెలివి తక్కువ నిర్ణయం అని ఆ తర్వాత గుర్తిస్తున్నారు. కాబట్టి ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరే ముందు కేవలం ఆర్థిక లాభాల గురించే కాదు, ఆధ్యాత్మిక నష్టం గురించి కూడా ఆలోచించండి. (లూకా 14:28) ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఉద్యోగం కోసం దూరంగా ఉంటే నా భార్య లేదా భర్త పరిస్థితి ఏంటి? మీటింగ్స్, ప్రీచింగ్ పరిస్థితి ఏంటీ?’ ఒకవేళ మీకు పిల్లలు ఉంటే, ఈ ముఖ్యమైన ప్రశ్న కూడా వేసుకోవాలి: ‘నేను నా పిల్లల దగ్గర లేకపోతే వాళ్లకు “యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని” ఎలా ఇవ్వగలను?’ (ఎఫె. 6:4) కాబట్టి బైబిలు సూత్రాల్ని ఏ మాత్రం పట్టించుకోని కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల మాట వినే బదులు దేవుని ఆలోచనల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.c పడమర ఆసియాలో ఉంటున్న టోనికి విదేశాల్లో పనిచేసే మంచి అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన దానిగురించి ప్రార్థన చేసుకుని, తన భార్యతో మాట్లాడుకున్న తర్వాత అక్కడికి వెళ్లొద్దని నిర్ణయించుకుని వాళ్ల ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, తన జీవితం గురించి టోని ఇలా చెప్తున్నాడు: “చాలామంది యెహోవా గురించి తెలుసుకునేలా సహాయం చేసే అవకాశం నాకు దొరికింది. మా పిల్లలు కూడా యెహోవాను ప్రేమిస్తున్నారు. ఆయన సేవలో ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. మత్తయి 6:33 లో ఉన్న మాటల్ని పాటించినంత కాలం యెహోవా మనల్ని చూసుకుంటాడని మేమందరం తెలుసుకున్నాం.”
భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు
13. భవిష్యత్తు అవసరాల కోసం మనం ఇప్పటి నుండే ఏం చేయవచ్చు?
13 మనం ముసలివాళ్లం అయ్యాక మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా యెహోవా మీద మన నమ్మకానికి ఒక పరీక్షగా మారవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడే కష్టపడి పనిచేయాలని బైబిలు చెప్తుంది. (సామె. 6:6-11) అంతేకాదు, భవిష్యత్తు కోసం ఎంతో కొంత పొదుపు చేయడం కూడా మంచిదే. ఎందుకంటే డబ్బు కొంతవరకు మనకు భద్రత ఇస్తుంది. (ప్రసం. 7:12) అలాగని, డబ్బే జీవితంగా మారకూడదు.
14. మన భవిష్యత్తు అవసరాల కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు హెబ్రీయులు 13:5 ఎందుకు పరిశీలించాలి?
14 “దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండడానికి” ఏ మాత్రం కృషి చేయకుండా కేవలం డబ్బును మాత్రమే పోగేసుకోవడం తెలివితక్కువతనం అని యేసు ఒక ఉదాహరణతో చెప్పాడు. (లూకా 12:16-21) ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. (సామె. 23:4, 5; యాకో. 4:13-15) అయితే, క్రీస్తు అనుచరులందరికీ ముఖ్యమైన సవాలు ఎదురౌతుంది. తన శిష్యులుగా ఉండాలనుకునే వాళ్లు తమకు ఉన్నవన్నీ వదిలేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పాడు. (లూకా 14:33) యూదయలో ఉన్న మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమకున్న వాటిని సంతోషంగా వదిలేశారు. (హెబ్రీ. 10:34) మన కాలంలో కూడా చాలామంది బ్రదర్స్ ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల తమకున్న మంచిమంచి ఉద్యోగాల్ని పోగొట్టుకున్నారు. (ప్రక. 13:16, 17) అవన్నీ చేయడానికి వాళ్లకు ఏది సహాయం చేసింది? యెహోవా ఇచ్చిన ఈ మాటమీద వాళ్లకున్న కొండంత నమ్మకం: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” (హెబ్రీయులు 13:5 చదవండి.) అవును, మన భవిష్యత్తు అవసరాల కోసం మనం చేయగలిగినదంతా చేస్తూ చక్కగా ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ ఊహించని సంఘటనలు జరిగితే భారమంతా యెహోవా మీద వేస్తాం.
15. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఆలోచన ఉండాలి? (చిత్రం కూడా చూడండి.)
15 కొన్ని సంస్కృతుల్లో దంపతులు పిల్లలు కావాలని బాగా కోరుకుంటారు. ఎందుకంటే, వృద్ధులైన తర్వాత ఆ పిల్లలు వాళ్లకు కావాల్సిన ఆర్థిక సహాయం చేయగలుగుతారు. కానీ బైబిలు తల్లిదండ్రులే పిల్లలకు కావాల్సినవి సమకూర్చాలని చెప్తుంది. (2 కొరిం. 12:14) నిజమే పిల్లల నుండి కాస్త డబ్బు, ఇతర సహాయం అవసరమవ్వవచ్చు. చాలామంది పిల్లలు కూడా అవసరమైన సహాయాన్ని ఇష్టంగా చేస్తారు. (1 తిమో. 5:4) పిల్లలు వాళ్లకు ఆర్థికంగా సహాయం చేసేలా పెంచడంలో కాదు గానీ, వాళ్లు యెహోవా సేవకులు అయ్యేలా తీర్చిదిద్దడంలోనే తమకు నిజమైన సంతోషం ఉందని తల్లిదండ్రులు గుర్తిస్తారు.—3 యోహా. 4.
భక్తిగల దంపతులు బైబిలు సూత్రాల్ని ఉపయోగించి, తమ భవిష్యత్తుకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు (15వ పేరా చూడండి)d
16. పిల్లలు తమ కాళ్లమీద తాము నిలబడేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు? (ఎఫెసీయులు 4:28)
16 పిల్లలు తమ కాళ్లమీద తాము నిలబడేలా సహాయం చేస్తున్నప్పుడు, యెహోవా మీద నమ్మకం ఉంచేలా మీరు మంచి ఆదర్శం ఉంచండి. వాళ్లకు చిన్నప్పటి నుండే కష్టపడి పనిచేయడం నేర్పించండి. (సామె. 29:21; ఎఫెసీయులు 4:28 చదవండి.) వాళ్లు ఎదుగుతున్నప్పుడు స్కూల్లో చక్కగా చదువుకునేలా సహాయం చేయండి. మీ పిల్లలు ఏం చదువుకోవాలి అనే దానికి సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకునేలా సహాయపడే బైబిలు సూత్రాల్ని వెతకండి. మీ పిల్లలు తమ కాళ్లమీద తాము నిలబడుతూనే, ఎక్కువ ప్రీచింగ్ చేసేలా లేదా పయినీరు సేవ చేసేలా అది వాళ్లకు సహాయం చేస్తుంది.
17. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
17 తమ నమ్మకమైన సేవకుల అవసరాలు తీర్చే సామర్థ్యం, తీర్చాలనే కోరిక యెహోవాకు ఉన్నాయని మనకు ఖచ్చితంగా తెలుసు. ఈ వ్యవస్థ ముగింపు దగ్గర పడుతుండగా, మనం ఇంకా ఎక్కువగా యెహోవా మీద నమ్మకం ఉంచాలి. ఏం జరిగినా సరే, మన అవసరాలను తీర్చే శక్తి యెహోవాకు ఉందని గట్టి నమ్మకంతో ఉందాం. యెహోవా బలమైన చెయ్యి, మనకు సహాయం చేయడానికి చాపిన ఆయన చెయ్యి మనల్ని చేరుకోలేనంత చిన్నది కాదని గుర్తుపెట్టుకుందాం!
పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి
a 2023, అక్టోబరు కావలికోట పత్రికలో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.
b 2014, సెప్టెంబరు 15 కావలికోట పత్రికలో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.
c 2014, ఏప్రిల్ 15 కావలికోట పత్రికలో ఉన్న “ఎవ్వరూ, ఇద్దరు యజమానులను సేవించలేరు” అనే ఆర్టికల్ చూడండి.
d చిత్రం వివరణ: భక్తిగల దంపతుల కూతురు-అల్లుడు రాజ్యమందిర నిర్మాణ పనిలో సేవ చేస్తున్నారు. వాళ్లతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు.