యుద్ధాలకు, దాడులకు మనం ముగింపు పలకగలమా?
ప్రజలు వేర్వేరు కారణాల్ని బట్టి పోరాటాలు చేస్తుంటారు. కొంతమంది ప్రభుత్వంలో, ఆర్థిక వ్యవస్థలో మార్పు కోసం, న్యాయం కోసం పోరాడతారు. ఇంకొంతమందేమో వేరే దేశాల్ని ఆక్రమించుకోవాలని, వాటిలో దొరికే ప్రకృతి వనరుల్ని దోచుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇంకొన్ని గొడవలకేమో తరతరాలుగా వస్తున్న జాతి, మత భేదాలే కారణం. మరి వీటన్నిటికీ తెరదించి, శాంతిని తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? వాటివల్ల ఏమైనా ఫలితం వస్తోందా? ఇప్పుడు చూద్దాం.
Drazen_/E+ via Getty Images
ఆర్థిక అభివృద్ధి
లక్ష్యం: ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వడం. దాడుల వెనకున్న ఒక ముఖ్యమైన కారణాన్ని అరికట్టి, ధనవంతులు-పేదవాళ్లు అనే తేడాను పూర్తిగా తీసేయడం లేదా తగ్గించడమే దీని ఉద్దేశం.
ఎందుకు సాధించలేకపోతున్నారు? ప్రభుత్వాలు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాయో చూసుకోవాలి. 2022 లో, చాలా దేశాలు ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం, శాంతిని కాపాడడం కోసం దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయని అంచనా. అయితే, ఆ దేశాలు అదే సంవత్సరం మిలిటరీ కోసం ఖర్చు పెట్టిన డబ్బుతో పోలిస్తే, అది సముద్రంలో నీటి బొట్టంత.
“మన దగ్గరున్న డబ్బును, వనరుల్ని యుద్ధాల వల్ల నష్టపోయిన వాళ్లకు సహాయం చేయడానికే ఎక్కువ ఉపయోగిస్తున్నాం. దానికి బదులు వాటిని ఆపడం కోసం, శాంతిని పెంచడం కోసం ఆ డబ్బును ఉపయోగిస్తే బాగుంటుంది.”—ఆంటోనియో గుటెరెస్, యునైటెడ్ నేషన్స్ సెక్రెటరీ-జనరల్.
బైబిలు ఏం చెప్తుంది: ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు, సంస్థలు పేదలకు సహాయం చేస్తుండవచ్చు. కానీ అవి పేదరికాన్ని పూర్తిగా తీసేయలేవు.—ద్వితీయోపదేశకాండం 15:11; మత్తయి 26:11.
శాంతి ఒప్పందాలు
లక్ష్యం: సమస్యల్ని ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల వాళ్లు చర్చలు, ఒప్పందాలు చేసుకోవడం.
ఎందుకు సాధించలేకపోతున్నారు? ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ దేశాలు చర్చలు జరపడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి, రాజీపడడానికి ఇష్టపడకపోవచ్చు. కొన్నిసార్లు శాంతి ఒప్పందం చేసుకున్నా గానీ, దానికి కట్టుబడి ఉండకపోవచ్చు.
‘శాంతి ఒప్పందాలు ప్రతీసారి శాంతిని తీసుకురాకపోవచ్చు. యుద్ధానికి ముగింపు పలకడానికి చేసే ఒప్పందంలో ఉన్న లోపాలు, కొన్నిసార్లు గోరంత సమస్యని కొండంత పెద్దవి చేస్తాయి.’—రేమండ్ ఎఫ్. స్మిత్, అమెరికన్ డిప్లొమసీ.
బైబిలు ఏం చెప్తుంది: ప్రజలు ‘శాంతిని వెదకాలి.’ (కీర్తన 34:14) కానీ ఈరోజుల్లో ‘విశ్వసనీయత లేనివాళ్లు, మొండివాళ్లు, నమ్మకద్రోహులు’ ఎక్కువైపోయారు. (2 తిమోతి 3:1-4) కాబట్టి, దాడులు జరగకుండా ఆపడం నిజాయితీగల నాయకులకు కష్టమౌతుంది.
ఆయుధాల నియంత్రణ
లక్ష్యం: ఆయుధాల వాడకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం. ముఖ్యంగా అణ్వాయుధాలు, రసాయన ఆయుధాలు, జీవాయుధాలు లాంటివి.
ఎందుకు సాధించలేకపోతున్నారు? దేశాలు ఆయుధాల్ని పోగుచేసుకోకుండా ఉండలేవు. ఎందుకంటే, వేరే దేశాల ముందు వాటి బలం తగ్గిపోతుందని, దాడుల్ని ఎదుర్కొలేమని అవి భయపడతాయి. ఆయుధాల్ని వాడనంత మాత్రాన పోరాటాలు ఆగవు, వాటి వెనకున్న కారణాల్ని కూడా పరిష్కరించాలి.
“1991 తర్వాత, చాలా ప్రభుత్వాలు ఆయుధాల వాడకాన్ని ఆపేస్తామని ఒప్పందాలు చేసుకున్నాయి. అంతేకాదు, దేశాల మధ్య గొడవలు రాకుండా చూసుకుంటామని, ఒకవేళ గొడవలు జరిగినా రాజీపడతామని, శాంతి-భద్రతలు ఉండే ప్రపంచాన్ని తీసుకొస్తామని ఒప్పందం చేసుకున్నాయి. కానీ అవి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.”—“సెక్యూరింగ్ అవర్ కామన్ ఫ్యూచర్: యాన్ ఎజెండా ఫర్ డిస్‌ఆర్మమెంట్.”
బైబిలు ఏం చెప్తుంది: ప్రజలు ఆయుధాల్ని వదిలేయాలి, ‘తమ ఖడ్గాల్ని నాగలిగా సాగగొట్టాలి.’ (యెషయా 2:4) యుద్ధాల్ని ఆపడానికి అది ఒకటే సరిపోదు. ఎందుకంటే, హింస ఆగిపోవాలంటే మనిషి హృదయంలో మార్పు రావాలి.—మత్తయి 15:19.
ఐకమత్యమే మహాబలం
లక్ష్యం: దేశాలు ఐక్యంగా ఉంటూ శత్రువుల నుండి ఒకరినొకరు కాపాడుకోవడం. ఒక దేశం మీద దాడిచేస్తే, దాని మిత్ర దేశాలతో కూడా పోరాడాల్సి వస్తుందనే భయంతో శత్రు దేశం దాడి చేయదని వాళ్ల అభిప్రాయం.
ఎందుకు సాధించలేకపోతున్నారు? దేశాలు కలిసికట్టుగా ఉన్నంత మాత్రాన శత్రు దేశం దాడికి దిగదని చెప్పలేం. అంతేకాదు, కలిసికట్టుగా ఉంటామని చేసుకున్న ఒప్పందానికి కొన్ని దేశాలు కట్టుబడి ఉండకపోవచ్చు. శత్రు దేశం మీద ఎప్పుడు, ఎలా దాడి చేయాలనే విషయంలో ఆ దేశాలన్నీ ఒకే అభిప్రాయానికి రాకపోవచ్చు.
‘దేశాలన్నిటినీ ఐక్యంగా ఉంచడానికి లీగ్ ఆఫ్ నేషన్స్ (నానాజాతి సమితి) అలాగే ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్య సమితి) ఎంతో కష్టపడ్డాయి. కానీ యుద్ధాలు మాత్రం ఆగలేదు.’—“ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.”
బైబిలు ఏం చెప్తుంది: సాధారణంగా కలిసికట్టుగా ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. (ప్రసంగి 4:12) అయితే మనుషులు నడిపించే ప్రభుత్వాలు, సంస్థలు ఎల్లప్పుడూ శాంతి-భద్రతలు ఉండేలా చేయగలవని ఆశించలేం. “రాజుల మీద గానీ, మనుషుల మీద గానీ నమ్మకం పెట్టుకోకండి, వాళ్లు రక్షణను తీసుకురాలేరు. వాళ్ల ఊపిరి వెళ్లిపోతుంది, వాళ్లు తిరిగి మట్టికి చేరుకుంటారు; ఆ రోజే వాళ్ల ఆలోచనలు కూడా నశించిపోతాయి.”—కీర్తన 146:3, 4.
శాంతిని తీసుకురావాలని, అది ఎప్పటికీ ఉండేలా చేయాలని దేశాలు ప్రయత్నిస్తున్నా జరిగే యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.