కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 ఆగస్టు పేజీలు 26-31
  • సంఘం నుండి తొలగించబడిన వాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంఘం నుండి తొలగించబడిన వాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఆ దుష్టుణ్ణి మీ మధ్య నుండి తొలగించండి”
  • సంఘం నుండి తొలగించబడిన వాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?
  • సంఘం ఏం చేయవచ్చు?
  • యెహోవాలా కనికరం, కరుణ చూపించండి
  • పాపం చేసినవాళ్ల మీద పెద్దలు ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఘోరమైన పాపం చేసినవాళ్లను యెహోవా చూసినట్టే చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఒకప్పుడు వాళ్ల మతంలో ఉండి బయటికి వెళ్లినవాళ్లను యెహోవాసాక్షులు ఎలా చూస్తారు?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • ‘పెద్దల్ని పిలవండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 ఆగస్టు పేజీలు 26-31

అధ్యయన ఆర్టికల్‌ 35

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

సంఘం నుండి తొలగించబడిన వాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?

“పశ్చాత్తాపపడాల్సిన అవసరంలేని 99 మంది నీతిమంతుల కన్నా, పశ్చాత్తాపపడిన ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది.”—లూకా 15:7.

ముఖ్యాంశం

కొంతమందిని సంఘం నుండి ఎందుకు తొలగించాల్సి వస్తుంది? అలాంటివాళ్లు పశ్చాత్తాపపడేలా, మళ్లీ యెహోవాకు దగ్గరయ్యేలా పెద్దలు ఎలా సహాయం చేస్తారో చూస్తాం.

1-2. (ఎ) కావాలనే తప్పుచేసేవాళ్లను యెహోవా ఎలా చూస్తాడు? (బి) తప్పుచేసినవాళ్ల విషయంలో యెహోవా ఏం కోరుకుంటున్నాడు?

యెహోవా తప్పును చూసీచూడనట్లు వదిలేసే దేవుడు కాదు; ఆయన అన్నిరకాల పాపాల్ని అసహ్యించుకుంటాడు. (కీర్త. 5:4-6) బైబిల్లోని నియమాల్ని మనం పాటించాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజమే, ఆయన అపరిపూర్ణ మనుషుల నుండి పరిపూర్ణతను ఆశించడు. (కీర్త. 130:3, 4) అలాగని “దేవుని అపారదయను అలుసుగా తీసుకుని లెక్కలేనట్టు” ప్రవర్తిస్తే సహించడు. (యూదా 4) హార్‌మెగిద్దోన్‌ యుద్ధంలో ‘భక్తిహీనులు నాశనమౌతారని’ బైబిలు చెప్తుంది.—2 పేతు. 3:7; ప్రక. 16:16.

2 అయితే, యెహోవాకు ఎవ్వరూ నాశనమవ్వడం ఇష్టంలేదు. మనం ముందటి ఆర్టికల్స్‌లో చూసినట్టు ఆయన “అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.” (2 పేతు. 3:9) పాపం చేసినవాళ్లు తమ ప్రవర్తనను మార్చుకుని, మళ్లీ దేవునికి దగ్గరవ్వడానికి సంఘపెద్దలు యెహోవాలా ఓర్పుగా సహాయం చేస్తారు. కానీ పాపం చేసిన ప్రతీ వ్యక్తి మారకపోవచ్చు. (యెష. 6:9) పెద్దలు ఎన్నిసార్లు వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నించినా కొంతమంది పశ్చాత్తాపం చూపించకపోవచ్చు. అలాంటప్పుడు పెద్దలు ఏం చేస్తారు?

“ఆ దుష్టుణ్ణి మీ మధ్య నుండి తొలగించండి”

3. (ఎ) ఒకవ్యక్తి పశ్చాత్తాపపడకపోతే ఏం చేయాలని బైబిలు చెప్తుంది? (బి) అది అతను ఏరికోరి తెచ్చుకున్న పర్యవసానం అని ఎందుకు చెప్పొచ్చు?

3 తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాపపడకపోతే ఇక పెద్దలు చేసేదేం లేదు, వాళ్లు 1 కొరింథీయులు 5:13 లో ఉన్న నిర్దేశాన్ని పాటిస్తారు. అక్కడ ఇలా ఉంది: “ఆ దుష్టుణ్ణి మీ మధ్య నుండి తొలగించండి.” అది తప్పుచేసిన వ్యక్తి ఏరికోరి తెచ్చుకున్న పర్యవసానం; అతనుa ఏం విత్తాడో అదే కోస్తున్నాడు. (గల. 6:7) అలాగని ఎందుకు చెప్పొచ్చు? పెద్దలు అతన్ని పశ్చాత్తాపం వైపు నడిపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, అతను వాళ్ల సహాయాన్ని తీసుకోలేదు. (2 రాజు. 17:12-15) అతని పనులు యెహోవా ప్రమాణాలంటే లెక్కలేదన్నట్టు చూపిస్తున్నాయి.—ద్వితీ. 30:19, 20

4. పశ్చాత్తాపపడని వ్యక్తి సంఘం నుండి తొలగించబడినప్పుడు ఎందుకు ప్రకటన చేస్తారు?

4 తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాపం చూపించనప్పుడు అతన్ని సంఘం నుండి తొలగిస్తారు. అప్పుడు సంఘంలో, ఇక నుండి అతను యెహోవాసాక్షి కాదని ప్రకటన చేస్తారు.b ఆ ప్రకటన ఉద్దేశం అతన్ని అవమానించడం కాదు. లేఖనాలు చెప్తున్నట్లు బ్రదర్స్‌-సిస్టర్స్‌ అతనితో “సహవాసం మానేయాలి, కనీసం అతనితో కలిసి భోజనం కూడా చేయకూడదు” అని అర్థం చేసుకోవడానికి అలా చేస్తారు. (1 కొరిం. 5:9-11) బైబిలు మంచి కారణంతోనే ఆ నిర్దేశాన్ని ఇస్తుంది. ఎందుకంటే, అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “కొంచెం పులిసిన పిండి, ముద్ద అంతటినీ పులిసేలా చేస్తుంది.” (1 కొరిం. 5:6) పశ్చాత్తాపం చూపించని వ్యక్తి యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం జీవిస్తున్న వాళ్లమీద చెడు ప్రభావం చూపించవచ్చు.—సామె. 13:20; 1 కొరిం. 15:33.

5. సంఘం నుండి తొలగించబడిన వాళ్లను మనం ఎలా చూడాలి? ఎందుకు?

5 సంఘం నుండి తొలగించబడిన వాళ్లను మనమెలా చూడాలి? నిజమే అతనితో మనం ఇంతకుముందులా సమయం గడపం. అయితే, మనం అతన్ని తప్పిపోయిన గొర్రెలా చూస్తాం గానీ తిరిగి రాలేని గొర్రెలా చూడం. మంద నుండి తప్పిపోయిన గొర్రె ఎప్పుడైనా తిరిగి రావచ్చు. తప్పిపోయిన గొర్రెలాంటి ఆ వ్యక్తి యెహోవాకు సమర్పించుకున్నాడని గుర్తుంచుకోండి. ప్రస్తుతం అతను తన సమర్పణకు తగ్గట్టు జీవించట్లేదు, అది అతనికే ప్రమాదం. (యెహె. 18:31) అయితే, యెహోవా అతని మీద కరుణ చూపించాలని అనుకుంటున్నాడు, కాబట్టి అతను తిరిగి వస్తాడనే ఆశతో మనం ఉండొచ్చు. సంఘం నుండి తొలగించబడిన వాళ్లమీద పెద్దలు అలాంటి ఆశను ఎలా చూపిస్తారు?

సంఘం నుండి తొలగించబడిన వాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?

6. సంఘం నుండి తొలగించబడిన వాళ్లకు సహాయం చేయడానికి పెద్దలు ఏ పనులు చేస్తారు?

6 సంఘం నుండి తొలగించబడిన వ్యక్తి యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి పెద్దలు ఇక ఏ సహాయం చేయరా? తప్పకుండా చేస్తారు! పెద్దల కమిటీ పశ్చాత్తాపం చూపించని వ్యక్తితో, సంఘం నుండి తొలగిస్తున్నామని చెప్తున్నప్పుడే, సంఘానికి తిరిగి రావడానికి ఏమేం చేయాలో కూడా వివరిస్తారు. కానీ పెద్దలు అక్కడితోనే ఆగిపోరు, ఇంకా ఎక్కువే చేస్తారు. చాలా సందర్భాల్లో అతని మనసు మారిందో లేదో తెలుసుకోవడానికి ఇంకొన్ని నెలల్లోనే అతన్ని కలుస్తామని చెప్తారు. ఒకవేళ అతను కలవడానికి ఇష్టపడుతుంటే పెద్దలు అతన్ని మళ్లీ కలిసినప్పుడు, అతన్ని పశ్చాత్తాపపడి తిరిగి రమ్మని ఆప్యాయంగా పిలుస్తారు. ఒకవేళ ఆ సమయంలో అతని మనసు మారకపోయినా, భవిష్యత్తులో అతన్ని అప్పుడప్పుడు కలవడానికి పెద్దలు ప్రయత్నిస్తారు.

7. సంఘం నుండి తొలగించబడిన వ్యక్తి మీద పెద్దలు యెహోవాలా ఎలా కనికరం చూపిస్తారు? (యిర్మీయా 3:12)

7 సంఘం నుండి తొలగించబడిన వ్యక్తి మీద పెద్దలు యెహోవాలా కనికరం చూపించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, దారితప్పిన ఇశ్రాయేలీయులు వాళ్లంతటవాళ్లే తన దగ్గరికి రావాలని యెహోవా ఎదురుచూడలేదు. పశ్చాత్తాపం చూపించాలని వాళ్లకు ఏ కోశానా లేకపోయినా, యెహోవాయే చొరవ తీసుకుని వాళ్ల దగ్గరికి ప్రవక్తల్ని పంపించాడు. ఈ పత్రికలోని రెండో ఆర్టికల్‌లో చూసినట్టు, యెహోవా తనకు ఎంత కనికరం ఉందో చూపించడానికి హోషేయ ప్రవక్తను ఒక పని చేయమని చెప్పాడు. అతని భార్య ఇంకా పాపం చేస్తుండగానే ఆమెను క్షమించి, తన దగ్గరికి తిరిగి తెచ్చుకోమని యెహోవా చెప్పాడు. (హోషే. 3:1; మలా. 3:7) యెహోవాలా సంఘపెద్దలు కూడా తప్పుచేసిన వ్యక్తి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కాబట్టి, తప్పుచేసిన వ్యక్తి తిరిగి రావడం కష్టమయ్యేలా చేయరు.—యిర్మీయా 3:12 చదవండి.

8. యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ యెహోవా కనికరాన్ని, కరుణను ఇంకా ఎలా చూపిస్తుంది? (లూకా 15:7)

8 అదే రెండో ఆర్టికల్‌లో, యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుడి ఉదాహరణను చూశాం. తిరిగి వస్తున్న కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఏం చేశాడో గుర్తుతెచ్చుకోండి. తండ్రి ‘పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కౌగిలించుకొని, ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు.’ (లూకా 15:20) కుమారుడు క్షమించమని అడిగే వరకు తండ్రి ఆగలేదు కానీ, ప్రేమగల తండ్రిలా ఆయనే చొరవ తీసుకున్నాడని గమనించండి. తప్పిపోయిన గొర్రెల విషయంలో పెద్దలు కూడా అలాంటి స్ఫూర్తినే చూపించడానికి ప్రయత్నిస్తారు. తప్పుచేసిన వాళ్లు తిరిగి రావాలని పెద్దలు కోరుకుంటారు. (లూకా 15:22-24, 32) అలా వాళ్లు తిరిగొచ్చినప్పుడు పరలోకంలో, భూమ్మీద పట్టలేనంత సంతోషం కలుగుతుంది!—లూకా 15:7 చదవండి.

9. తప్పుచేసిన వాళ్లకు యెహోవా ఆప్యాయంగా ఏం చెప్తున్నాడు?

9 మనం ఇప్పటివరకు నేర్చుకున్న దాన్నిబట్టి, యెహోవా పశ్చాత్తాపం చూపించని వాళ్లను తన సంఘంలో ఉండనివ్వడు. అలాగని ఆయన వాళ్లనుండి తన ముఖం తిప్పేసుకోడు. వాళ్లు తిరిగి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవ్యక్తి పశ్చాత్తాపపడితే యెహోవాకు ఎలా అనిపిస్తుందో హోషేయ 14:4 చెప్తుంది. అక్కడ ఇలా ఉంది: “నేను వాళ్లను బాగుచేస్తాను, ఇకమీదట వాళ్లు నమ్మకద్రోహం చేయరు. నేను మనస్ఫూర్తిగా వాళ్లను ప్రేమిస్తాను, ఎందుకంటే, నా కోపం వాళ్ల మీద నుండి పక్కకు మళ్లింది.” తప్పుచేసిన వాళ్లలో పశ్చాత్తాపానికి సంబంధించి ఏ చిన్న సూచన కనిపించినా, దానికి పెద్దలు స్పందించాలని ఇది చూపిస్తుంది. అలాగే తప్పుచేసిన వాళ్లు ఇక ఏ ఆలస్యం చేయకుండా యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి మంచి కారణాన్ని ఇస్తుంది.

10-11. సంఘం నుండి గతంలో తొలగించబడిన వాళ్లకు సహాయం చేయడానికి సంఘపెద్దలు ఎలా ప్రయత్నిస్తారు?

10 అయితే గతంలో, బహుశా చాలా ఏళ్ల క్రితం సంఘం నుండి తొలగించబడిన వాళ్ల సంగతేంటి? అలాంటి వాళ్లు, చాలా సంవత్సరాల క్రితమే చేసిన తప్పును మానేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో, వాళ్లు ఏ కారణం వల్ల సంఘం నుండి తొలగించబడ్డారో కూడా మర్చిపోయి ఉండొచ్చు. ఏదేమైనా, అలాంటి వాళ్లు ఎక్కడ ఉన్నారో కనుక్కుని, సంఘపెద్దలు వాళ్లని కలుస్తారు. అలా కలిసినప్పుడు పెద్దలు వాళ్లతో కలిసి ప్రార్థన చేస్తారు, సంఘానికి తిరిగి రమ్మని ఆప్యాయంగా పిలుస్తారు. నిజమే, ఒకవ్యక్తి సంఘానికి చాలాకాలం పాటు దూరంగా ఉన్నాడంటే, అతను ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తి సంఘానికి తిరిగి రావాలని ఇష్టపడితే, ఎవరైనా అతనితో బైబిలు స్టడీ చేసేలా పెద్దలు ఏర్పాటు చేయవచ్చు. అతను సంఘానికి తిరిగి చేర్చుకోబడక ముందు కూడా ఇలా చేయవచ్చు. అయితే, అన్ని సందర్భాల్లో అలాంటి ఒక బైబిలు స్టడీని సంఘపెద్దలే ఏర్పాటు చేస్తారు.

11 పెద్దలు యెహోవాలా కనికరం చూపిస్తూ చొరవ తీసుకుంటారు. తిరిగి రావడానికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తారు. తప్పుచేసిన వ్యక్తి తన తప్పు మానేసి, పశ్చాత్తాపం చూపిస్తే ఇక అతన్ని సంఘంలోకి తిరిగి చేర్చుకోవడానికి ఆలస్యం చేయరు.—2 కొరిం. 2:6-8.

12. (ఎ) ఎలాంటి సందర్భాల్లో పెద్దలు జాగ్రత్తగా ఉండాలి? (బి) కొన్ని రకాల పాపాలు చేసినవాళ్లు యెహోవా కరుణకు అర్హులు కాదనే ముగింపుకు ఎందుకు రాకూడదు? (అధస్సూచి కూడా చూడండి.)

12 కొన్ని సందర్భాల్లో, ఒక వ్యక్తిని తిరిగి సంఘంలోకి చేర్చుకోవాలని అనుకున్నప్పుడు పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, పిల్లలపై దాడి చేసినవాళ్లు లేదా మతభ్రష్టులు లేదా వివాహజతను వదిలించుకోవడానికి కుట్ర పన్నినవాళ్లు నిజంగా పశ్చాత్తాపపడ్డారో లేదో పెద్దలు నిర్ధారించుకోవాలి. (మలా. 2:14; 2 తిమో. 3:6) పెద్దలు మందను కాపాడాలి, అదే సమయంలో తప్పును మానేసి, నిజంగా పశ్చాత్తాపం చూపించిన ఎవ్వరినైనా యెహోవా తిరిగి చేర్చుకుంటాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇతరులతో మోసపూరితంగా వ్యవహరించిన వాళ్ల విషయంలో పెద్దలు జాగ్రత్త వహిస్తూనే, ఇక వాళ్లు ఎప్పటికీ యెహోవా కరుణకు అర్హులు కాదనే ముగింపుకు రాకూడదు.c—1 పేతు. 2:10.

సంఘం ఏం చేయవచ్చు?

13. మనం గద్దించబడిన వాళ్లతో ఎలా ఉంటాం? సంఘం నుండి తొలగించబడిన వాళ్లతో ఎలా ఉంటాం?

13 ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు కొన్నిసార్లు ఒక వ్యక్తి గద్దించబడ్డాడు అని ప్రకటన చేస్తారు. అలాంటి సందర్భాల్లో, మనం అతనితో ఇంతకుముందులాగే సహవసిస్తాం. ఎందుకంటే, అతను తన తప్పు మానేసి, పశ్చాత్తాపం చూపించాడు. (1 తిమో. 5:20) అతను ఇంకా మనలో ఒకడు, కాబట్టి అతను సరైంది చేస్తూ ఉండడానికి మన ప్రోత్సాహం అవసరం. (హెబ్రీ. 10:24, 25) మరోవైపు సంఘం నుండి తొలగించబడిన వాళ్ల విషయంలో పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. వాళ్లతో మనం “సహవాసం మానేయాలి, కనీసం కలిసి భోజనం కూడా చేయకూడదు.”—1 కొరిం. 5:11.

14. సంఘం నుండి తొలగించబడిన వ్యక్తితో వ్యవహరించే విషయంలో మన బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఎలా ఉపయోగించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

14 అంటే సంఘం నుండి తొలగించబడిన వ్యక్తిని మనం పూర్తిగా పట్టించుకోమని దానర్థమా? కాదు. నిజమే మనం అతనితో సహవసించం. కానీ సంఘం నుండి తొలగించబడిన వ్యక్తి మన బంధువో లేదా మన స్నేహితుడో అయితే, మనం వాళ్లని మీటింగ్స్‌కి రమ్మని పిలవాలా లేదా అనేది మన బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించి నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ వాళ్లు మీటింగ్‌కి వస్తే, అప్పుడు ఏం చేయాలి? గతంలోనైతే, మనం వాళ్లను అస్సలు పలకరించేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ప్రతీ క్రైస్తవుడు తన బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించాలి. కొంతమంది వాళ్లను పలకరించాలని అనుకోవచ్చు, లేదా మీటింగ్‌కి వచ్చినప్పుడు లోపలికి ఆహ్వానించాలని అనుకోవచ్చు. అయితే, మనం వాళ్లతో మరీ ఎక్కువ మాట్లాడం, అతిగా సహవసించం.

చిత్రాలు: 1. సంఘం నుండి తొలగించబడిన ఒకావిడకు ఫోన్‌ చేసి మీటింగ్‌కి పిలుస్తున్న ఒక సిస్టర్‌. 2. మీటింగ్‌కి వచ్చినప్పుడు ఆ సిస్టర్‌ అలాగే ఆమె భర్త కలిసి ఆవిడను పలకరిస్తున్నారు.

సంఘం నుండి తొలగించబడిన వ్యక్తిని మీటింగ్‌కి పిలవాలా వద్దా, ఒకవేళ మీటింగ్‌కి వస్తే పలకరించాలా వద్దా అనేది క్రైస్తవులు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించి నిర్ణయించుకోవచ్చు (14వ పేరా చూడండి)


15. రెండో యోహాను 9-11లో ఎలాంటి వాళ్ల గురించి ఉంది? (“యోహాను, పౌలు ఒకేలాంటి పాపం గురించి మాట్లాడుతున్నారా?” అనే బాక్స్‌ కూడా చూడండి)

15 కానీ, ‘అలాంటి వ్యక్తిని పలకరించే వాళ్లు అతని చెడ్డపనులకు మద్దతు ఇచ్చినట్టే’ అని బైబిలు చెప్తుంది కదా అని కొంతమంది అనొచ్చు? (2 యోహాను 9-11 చదవండి.) ఆ వచనాల్లోని సందర్భాన్ని గమనిస్తే, అపొస్తలుడైన యోహాను నిజానికి మతభ్రష్టుల గురించి, తప్పుడు ప్రవర్తనను ప్రోత్సహించే వాళ్ల గురించి మాట్లాడుతున్నాడు. (ప్రక. 2:20) కాబట్టి ఒకవ్యక్తి మతభ్రష్ట బోధల్ని లేదా తప్పుడు ప్రవర్తనను ప్రోత్సహిస్తూ ఉంటే సంఘపెద్దలు అతన్ని కలవరు. నిజమే, అతను తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. కానీ అది జరిగే వరకు మనం అతన్ని పలకరించం, మీటింగ్స్‌కి రమ్మని ఆహ్వానించం.

యోహాను, పౌలు ఒకేలాంటి పాపం గురించి మాట్లాడుతున్నారా?

అపొస్తలుడైన యోహాను రాసిన రెండో ఉత్తరంలో ఇలా చెప్పాడు: “ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఆ బోధలకు అనుగుణంగా బోధించకపోతే, అతన్ని మీ ఇంట్లోకి రానివ్వకండి, అతన్ని పలకరించకండి. ఎందుకంటే, అతన్ని పలకరించే వ్యక్తి అతని చెడ్డపనులకు మద్దతు ఇచ్చినట్టే.”—2 యోహా. 10, 11.

క్రైస్తవులు అతన్ని ‘పలకరించకూడదు’ అని యోహాను చెప్తున్నప్పుడు, సంఘం నుండి తొలగించబడిన వ్యక్తితో “సహవాసం మానేయాలి” అని 1 కొరింథీయులు 5:11 లో పౌలు చెప్పినదానికి ఇంకో మాటను జోడిస్తున్నాడా? యోహాను, పౌలు ఒకేలాంటి పాపం గురించి మాట్లాడుతున్నారా? కాదని అర్థమౌతుంది.

ఆ ఇద్దరు అపొస్తలులు వేర్వేరు పాపాల గురించి మాట్లాడుతున్నారు. పౌలు, లైంగిక పాపం చేసిన వ్యక్తి గురించి రాశాడు. దాదాపు 43 ఏళ్ల తర్వాత యోహాను మతభ్రష్టుల గురించి అలాగే తప్పుడు బోధల్ని-ప్రవర్తనను ప్రోత్సహిస్తున్న ఇతరుల గురించి రాశాడు. ఉదాహరణకు, ఆ కాలంలో యేసు అసలు క్రీస్తే కాదని కొంతమంది బోధించారు.—1 యోహా. 2:22; 4:2, 3.

యోహాను ఉత్తరాలు రాసే సమయానికి మతభ్రష్టత్వం బాగా వ్యాపించింది. అతను దాన్ని ఆపలేడని తెలిసినా, మిగతా అపొస్తలుల్లాగే సంఘం మతభ్రష్టుల వల్ల పాడవ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.—2 థెస్స. 2:7.

కాబట్టి అబద్ధ బోధకుల చేతుల్లో మోసపోవద్దని తోటి క్రైస్తవుల్ని యోహాను హెచ్చరించాడు. అంతేకాదు, వాళ్లను తమ ఇంటికి పిలవద్దని, ఆఖరికి వాళ్లను పలకరించొద్దని కూడా చెప్పాడు. అలా పలకరిస్తే, వాళ్ల బోధలకు స్వాగతం పలికినట్టే అవుతుంది. నేడు మనం వాళ్లకు సంబంధించిన సోషల్‌ మీడియాలో, వెబ్‌సైట్లలో ఏదైనా కామెంట్‌ పెట్టినా అలాంటిదే జరగవచ్చు. ఎవరైనా వాళ్లను పలకరిస్తే, వాళ్లు చేసే “చెడ్డపనులకు మద్దతు ఇచ్చినట్టే.”

దానికి భిన్నంగా, లైంగిక పాపం చేసి సంఘం నుండి తొలగించబడిన వ్యక్తి గురించి పౌలు 1 కొరింథీయులు 5వ అధ్యాయంలో రాశాడు. ఆ వ్యక్తి మతభ్రష్టుడు కాదని, దేవుని ప్రమాణాలను మీరమని ఇతరుల్ని ప్రోత్సహించేవాడు కాదని అర్థమౌతుంది. (ప్రకటన 2:20 తో పోల్చండి.) కాబట్టి పౌలు అతనితో సహవాసం చేయకూడదని, కనీసం అతనితో కలిసి భోజనం చేయకూడదని చెప్పాడే గానీ, అతన్ని అస్సలు పలకరించకూడదని చెప్పలేదు.

యెహోవాలా కనికరం, కరుణ చూపించండి

16-17. (ఎ) పాపులు ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు? (యెహెజ్కేలు 18:32) (బి) తప్పుచేసిన వాళ్లకు సహాయం చేస్తున్నప్పుడు సంఘపెద్దలకు ఏ అవకాశం ఉంది?

16 ఈ ఐదు అధ్యయన ఆర్టికల్స్‌ నుండి మనం ఏం నేర్చుకున్నాం? యెహోవాకు ఎవ్వరూ నాశనమవ్వడం ఇష్టంలేదు! (యెహెజ్కేలు 18:32 చదవండి.) పాపులందరూ తిరిగి తనతో శాంతియుత సంబంధాన్ని ఏర్పర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (2 కొరిం. 5:20) అందుకే చరిత్ర అంతటిలో, ఆయన దారితప్పిన తన ప్రజల్ని పశ్చాత్తాపపడి, తన దగ్గరికి రమ్మని పదేపదే చెప్పాడు. తప్పుచేసిన వాళ్లను పశ్చాత్తాపం వైపు నడిపించేటప్పుడు, సంఘపెద్దలు యెహోవాకు తోటి పనివాళ్లుగా ఉండే మంచి అవకాశం ఉంది.—రోమా. 2:4; 1 కొరిం. 3:9.

17 తప్పుచేసిన వాళ్లు పశ్చాత్తాపం చూపించినప్పుడు పరలోకంలో ఎంత సంతోషం ఉంటుందో ఊహించండి! తప్పిపోయిన గొర్రె సంఘానికి తిరిగి వచ్చిన ప్రతీసారి, మన పరలోక తండ్రైన యెహోవా ఎంత మురిసిపోతాడో కదా! ఆయనకున్న కనికరం, కరుణ, అపారదయ గురించి మనం ఆలోచించే కొద్దీ యెహోవా మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది.—లూకా 1:78.

మీరెలా జవాబిస్తారు?

  • సంఘం నుండి కొంతమందిని ఎందుకు తొలగించాల్సి వస్తుంది?

  • యెహోవాలా పెద్దలు ఎలా కనికరం చూపించవచ్చు?

  • సంఘం నుండి తొలగించబడిన వాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు క్రైస్తవులు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఎలా ఉపయోగించవచ్చు?

పాట 111 మన సంతోషానికి కారణాలు

a ఈ ఆర్టికల్‌లో తప్పుచేసిన వ్యక్తి పురుషుడు అని చెప్పినా, ఈ సమాచారం ఆడవాళ్లకు కూడా వర్తిస్తుంది.

b ఇక నుండి ఇలాంటివాళ్లను బహిష్కరించబడినవాళ్లు అని అనం. 1 కొరింథీయులు 5:13 లో పౌలు చెప్పినట్టు, ఇప్పటి నుండి వాళ్లను సంఘం నుండి తొలగించబడినవాళ్లు అని అంటాం.

c క్షమాపణ లేని పాపం గురించి కూడా బైబిలు చెప్తుంది. అలాంటి పాపం చేసేవాళ్లు దేవున్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉండాలని మొండిగా నిర్ణయించుకుంటారు. ఒకవ్యక్తి చేసింది క్షమాపణ లేని పాపమా కాదా అన్నది కేవలం యెహోవా, యేసు మాత్రమే నిర్ణయించగలరు.—మార్కు 3:29; హెబ్రీ. 10:26, 27.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి