కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 ఆగస్టు పేజీలు 20-25
  • పాపం చేసినవాళ్ల మీద పెద్దలు ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాపం చేసినవాళ్ల మీద పెద్దలు ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఘోరమైన పాపం చేసిన వ్యక్తికి సంఘపెద్దలు ఎలా సహాయం చేస్తారు?
  • “చూసేవాళ్లందరి ముందు గద్దించు”
  • “యెహోవా ఎంతో వాత్సల్యం గలవాడు, కరుణామయుడు”
  • సంఘం నుండి తొలగించబడిన వాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ‘పెద్దల్ని పిలవండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఘోరమైన పాపం చేసినవాళ్లను యెహోవా చూసినట్టే చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • క్రైస్తవ సంఘం ఎలా పనిచేస్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 ఆగస్టు పేజీలు 20-25

అధ్యయన ఆర్టికల్‌ 34

పాట 107 దేవునిలా ప్రేమ చూపిద్దాం

పాపం చేసినవాళ్ల మీద పెద్దలు ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?

“ఆయన తన దయతో నిన్ను పశ్చాత్తాపం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు.”—రోమా. 2:4.

ముఖ్యాంశం

సంఘంలో ఘోరమైన పాపం చేసినవాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారో తెలుసుకుంటాం.

1. ఘోరమైన పాపం చేసిన వ్యక్తికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు?

కొరింథు సంఘంలో ఘోరమైన తప్పుచేసిన వ్యక్తిని అపొస్తలుడైన పౌలు ఏం చేయమన్నాడో ముందటి ఆర్టికల్‌లో చూశాం. పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం చూపించలేదు, కాబట్టి సంఘం నుండి తొలగించాల్సి వచ్చింది. కానీ ఈ ఆర్టికల్‌ ముఖ్య లేఖనం చెప్తున్నట్లు, తప్పుచేసిన వ్యక్తిని దేవుడు పశ్చాత్తాపం వైపు నడిపిస్తాడు. (రోమా. 2:4) మరి, సంఘపెద్దలు ఒకవ్యక్తి పశ్చాత్తాపపడేలా ఎలా సహాయం చేస్తారు?

2-3. ఒక బ్రదర్‌ గానీ సిస్టర్‌ గానీ ఘోరమైన పాపం చేశారని మనకు తెలిస్తే ఏం చేయాలి? ఎందుకు?

2 ఒకవ్యక్తికి సంఘపెద్దలు సహాయం చేయాలంటే, ఆ వ్యక్తి ఘోరమైన పాపం చేశాడనే విషయం వాళ్లకు తెలియాలి. కాబట్టి మన తోటి బ్రదర్‌ గానీ సిస్టర్‌ గానీ సంఘం నుండి తొలగించబడేంత పెద్ద పాపం చేశారని తెలిస్తే, మనం ఏం చేయాలి? ముందుగా, వాళ్లను వెళ్లి సంఘపెద్దల సహాయం తీసుకోమని చెప్పాలి.—యెష. 1:18; అపొ. 20:28; 1 పేతు. 5:2.

3 అయితే, తప్పుచేసిన వ్యక్తి సంఘపెద్దలతో మాట్లాడడానికి ఇష్టపడకపోతే, అప్పుడేంటి? అలాంటి సందర్భాల్లో మనమే వెళ్లి సంఘపెద్దలతో చెప్పాలి. అప్పుడే వాళ్లు ఆ వ్యక్తికి సహాయం చేయగలుగుతారు. మనం ఆ పని ప్రేమ ఉంటేనే చేస్తాం, ఎందుకంటే మనం అలా చేయకపోతే మన బ్రదర్‌ని గానీ, సిస్టర్‌ని గానీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ వ్యక్తి ఆ తప్పు చేస్తూనే ఉంటే, యెహోవాతో అతనికున్న సంబంధం ఇంకా దెబ్బతింటుంది, సంఘానికి ఉన్న మంచిపేరు కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం యెహోవా మీద, తప్పుచేసిన వ్యక్తి మీద ప్రేమతో ధైర్యంగా ముందుకొచ్చి సంఘపెద్దలకు చెప్తాం.—కీర్త. 27:14.

ఘోరమైన పాపం చేసిన వ్యక్తికి సంఘపెద్దలు ఎలా సహాయం చేస్తారు?

4. ఘోరమైన పాపం చేసిన వ్యక్తిని కలుస్తున్నప్పుడు సంఘపెద్దల లక్ష్యం ఏంటి?

4 సంఘంలో ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేసినప్పుడు, పెద్దల సభ తమలో అర్హులైన ముగ్గురు పెద్దల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేస్తుంది.a వీళ్లకు అణకువ, వినయం ఉండాలి. వాళ్లు తప్పుచేసిన వ్యక్తిని పశ్చాత్తాపం వైపు నడిపించేలా సహాయం చేస్తారే గానీ మారమని బలవంతం చేయరు. (ద్వితీ. 30:19) తప్పుచేసిన ప్రతీఒక్కరు దావీదు రాజులా చక్కగా స్పందించకపోవచ్చని సంఘపెద్దలు గుర్తుపెట్టుకుంటారు. (2 సమూ. 12:13) తప్పుచేసిన కొంతమంది యెహోవా ఉపదేశాన్ని వినకూడదని నిర్ణయించుకొని ఉండొచ్చు. (ఆది. 4:6-8) అయితే, వీలైనంతవరకు తప్పుచేసిన వ్యక్తిని పశ్చాత్తాపం వైపు నడిపించడమే సంఘపెద్దల లక్ష్యం. మరి, తప్పుచేసిన వ్యక్తిని కలుస్తున్నప్పుడు వాళ్లు ఏ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి?

5. తప్పుచేసిన వ్యక్తిని కలుస్తున్నప్పుడు సంఘపెద్దలు ఏ విషయాల్ని గుర్తుపెట్టుకుంటారు? (2 తిమో. 2:24-26) (చిత్రం కూడా చూడండి.)

5 పాపం చేసిన వ్యక్తి యెహోవాకు ఇంకా విలువైనవాడే అని సంఘపెద్దలు గుర్తుపెట్టుకుంటారు. (లూకా 15:4, 6) కాబట్టి తప్పుచేసిన వ్యక్తిని కలుస్తున్నప్పుడు వాళ్లు అతనితో కఠినంగా మాట్లాడరు, కటువుగా వ్యవహరించరు. అలాగే అతన్ని కలిసి ప్రశ్నలు అడిగి, వాస్తవాలు తెలుసుకోవడం మాత్రమే తమ పని కాదని సంఘపెద్దలు గుర్తుపెట్టుకుంటారు. వాళ్లు 2 తిమోతి 2:24-26 లో ఉన్న లక్షణాల్ని చూపిస్తారు. (చదవండి.) సంఘపెద్దలు సౌమ్యంగా, మృదువుగా, దయగా వ్యవహరిస్తూ ఆ వ్యక్తి తన ఆలోచనల్ని మార్చుకునేలా సహాయం చేస్తారు.

తప్పిపోయిన గొర్రెను వెతుకుతున్న గొర్రెల కాపరి. తప్పిపోయిన గొర్రె చెట్ల మధ్యలో ఇరుక్కుంది, దాని కాలికి దెబ్బ తగిలింది.

ప్రాచీనకాల కాపరుల్లాగే, పెద్దలు తప్పిపోయిన గొర్రెను తిరిగి సంపాదించుకోవడానికి కృషి చేస్తారు (5వ పేరా చూడండి)


6. తప్పుచేసిన వ్యక్తిని కలవడానికి ముందు సంఘపెద్దలు తమ హృదయాల్ని ఎలా సిద్ధం చేసుకుంటారు? (రోమీయులు 2:4)

6 సంఘపెద్దలు తమ హృదయాల్ని సిద్ధం చేసుకుంటారు. తప్పుచేసిన వ్యక్తితో వ్యవహరిస్తున్నప్పుడు వాళ్లు యెహోవాను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే పౌలు చెప్పిన ఈ మాటల్ని గుర్తుపెట్టుకుంటారు: “ఆయన తన దయతో నిన్ను పశ్చాత్తాపం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు.” (రోమీయులు 2:4 చదవండి.) సంఘపెద్దలు, తాము ముఖ్యంగా క్రీస్తు నిర్దేశం కింద పనిచేసే కాపరులమని గుర్తుంచుకోవాలి. (యెష. 11:3, 4; మత్త. 18:18-20) తప్పుచేసిన వ్యక్తిని కలిసే ముందు కమిటీ ప్రార్థనాపూర్వకంగా తమ లక్ష్యం గురించి ఆలోచిస్తారు, వాళ్ల లక్ష్యం ఏంటంటే: తప్పుచేసిన వ్యక్తిని పశ్చాత్తాపం వైపు నడిపించడం. వాళ్లు లేఖనాల్లో-ప్రచురణల్లో పరిశోధన చేస్తారు, వివేచన కోసం ప్రార్థన చేస్తారు. వాళ్లు ఆ వ్యక్తి గురించి ఏం తెలుసుకోవాలో ఆలోచిస్తారు. ఆ వ్యక్తి తప్పు చేయడానికి, అలా ఆలోచించడానికి ఏది నడిపించిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.—సామె. 20:5.

7-8. తప్పుచేసిన వ్యక్తితో వ్యవహరిస్తున్నప్పుడు సంఘపెద్దలు యెహోవాలా ఓర్పుగా ఎలా ఉండొచ్చు?

7 సంఘపెద్దలు యెహోవాలా ఓర్పు చూపిస్తారు. తప్పుచేసిన వాళ్లతో యెహోవా ఎలా వ్యవహరించాడో వాళ్లు గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకు, యెహోవా కయీనుతో చాలా ఓర్పుగా ఉన్నాడు, ఆయన మారకపోతే ఏం జరుగుతుందో, మారి తన మాట వింటే ఎలా దీవెనలు వస్తాయో యెహోవా చెప్పాడు. (ఆది. 4:6, 7) అలాగే నాతాను ప్రవక్తను పంపించి దావీదు రాజుకు సలహా ఇచ్చాడు, అప్పుడు నాతాను ప్రవక్త దావీదు హృదయాన్ని తాకే ఒక ఉదాహరణ చెప్పాడు. (2 సమూ. 12:1-7) అంతేకాదు, యెహోవా దారితప్పిన ఇశ్రాయేలీయుల దగ్గరికి ప్రవక్తల్ని “పదేపదే” పంపిస్తూ వచ్చాడు. (యిర్మీ. 7:24, 25) ప్రజలు పశ్చాత్తాపపడ్డాకే సహాయం చేయాలని యెహోవా అనుకోలేదు. బదులుగా, వాళ్లు ఇంకా పాపం చేస్తుండగానే ఆయన చొరవ తీసుకుని పశ్చాత్తాపపడమని అడిగాడు.

8 ఘోరమైన పాపం చేసిన వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సంఘపెద్దలు యెహోవాను అనుకరిస్తారు. 2 తిమోతి 4:2 చెప్తున్నట్లు పెద్దలు తప్పుచేసిన వ్యక్తితో “సంపూర్ణమైన ఓర్పుతో” వ్యవహరిస్తారు. కాబట్టి, ఒక సంఘపెద్ద ఎప్పుడూ ప్రశాంతంగా, ఓర్పుగా ఉంటే తప్పుచేసిన వ్యక్తి సరైంది చేసేలా సహాయం చేయగలుగుతాడు. ఒకవేళ ఆ సంఘపెద్ద కోప్పడినా లేదా చిరాకు పడినా తప్పుచేసిన వ్యక్తి ఆయన చెప్పేది వినకపోవచ్చు, పశ్చాత్తాపపడడానికి ఇష్టపడకపోవచ్చు.

9-10. ఒకవ్యక్తి తన తప్పు తెలుసుకునేలా చేయడానికి సంఘపెద్దలు ఏం చేస్తారు?

9 పాపం చేయడానికి ముందు అతను ఏయే పనులు చేశాడో తెలుసుకోవడానికి సంఘపెద్దలు ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, యెహోవాతో అతనికున్న బంధం ఏది కుంటుపడేలా చేసింది? అతను క్రమంగా బైబిలు చదవడం, ప్రీచింగ్‌కి వెళ్లడం ఆపేశాడా? అతను క్రమంగా ప్రార్థన చేయట్లేదా? తప్పుడు కోరికల్ని తిప్పికొట్టట్లేదా? అతను ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాడు? ఎలాంటి వినోదం ఎంచుకుంటున్నాడు? అతని నిర్ణయాలు అతని ఆలోచనల్ని, కోరికల్ని మార్చేశాయా? అతను చేసిన పని వల్ల యెహోవాకు ఎలా అనిపిస్తుందో అతను అర్థంచేసుకున్నాడా?

10 యెహోవాతో తనకున్న బంధం కుంటుపడేలా చేసి, పాపానికి నడిపించిన పనులు ఏంటో తప్పుచేసిన వ్యక్తి అర్థంచేసుకునేలా సంఘపెద్దలు కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. అయితే వాళ్లు వాటిని చాలా దయగా అడుగుతారు, అనవసరమైన వ్యక్తిగత వివరాల్ని అడగరు. (సామె. 20:5) దావీదు తన తప్పు తెలుసుకోవడానికి నాతాను ప్రవక్త ఒక ఉదాహరణ ఉపయోగించాడు. సంఘపెద్దలు కూడా ఆయనలాగే కొన్ని ఉదాహరణలు ఉపయోగించవచ్చు. బహుశా మొదటిసారి కలిసినప్పుడే, అతను తన తప్పు తెలుసుకుని, బాధపడడం మొదలుపెట్టవచ్చు, పశ్చాత్తాపం కూడా చూపించవచ్చు.

11. తప్పుచేసిన వాళ్లతో యేసు ఎలా వ్యవహరించాడు?

11 సంఘపెద్దలు యేసులా ఉండడానికి ప్రయత్నిస్తారు. తార్సువాడైన సౌలుతో వ్యవహరిస్తున్నప్పుడు పునరుత్థానమైన యేసు ఆలోచింపజేసే ఈ ప్రశ్న వేశాడు: “సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు?” అలా అడగడం వల్ల అతను తన తప్పు తెలుసుకునేలా యేసు సహాయం చేశాడు. (అపొ. 9:3-6) అంతేకాదు, “యెజెబెలు అనే స్త్రీ” గురించి యేసు ఇలా చెప్పాడు: “పశ్చాత్తాపపడేందుకు నేను ఆమెకు సమయమిచ్చాను.”—ప్రక. 2:20, 21.

12-13. తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాపపడేంత సమయాన్ని సంఘపెద్దలు ఎలా ఇవ్వవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

12 సంఘపెద్దలు యేసును అనుసరిస్తూ, తప్పుచేసిన వ్యక్తి ఇక పశ్చాత్తాపం చూపించడని తొందరపడి ఒక ముగింపుకు వచ్చేయరు. బహుశా కమిటీ మొదటిసారి కలిసినప్పుడే కొంతమంది పశ్చాత్తాపపడొచ్చు. ఇంకొంతమందికి, ఎక్కువ సమయం అవసరం కావచ్చు. కాబట్టి తప్పుచేసిన వ్యక్తిని ఒకటికంటే ఎక్కువసార్లు కలవడానికి పెద్దలు ఏర్పాటు చేసుకోవచ్చు. బహుశా కమిటీ మొదటిసారి కలిసి వెళ్లిపోయిన తర్వాత, తప్పుచేసిన వ్యక్తి పెద్దలు తనకు చెప్పిన విషయాల గురించి లోతుగా ఆలోచించడం మొదలుపెట్టి ఉండొచ్చు. అతను వినయం చూపించి, క్షమించమని యెహోవాకు ప్రార్థన చేసి ఉండొచ్చు. (కీర్త. 32:5; 38:18) అలా కమిటీ మళ్లీ కలిసినప్పుడు, అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉండొచ్చు.

13 తప్పుచేసిన వ్యక్తిని పశ్చాత్తాపం వైపు నడిపించడానికి సంఘపెద్దలు దయను, సహానుభూతిని చూపిస్తారు. వాళ్లు చేసే ప్రయత్నాలను దీవించమని యెహోవాకు ప్రార్థన చేస్తారు. అతను తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపం చూపిస్తాడనే ఆశతో ఉంటారు.—2 తిమో. 2:25, 26.

చిత్రాలు: 1. ముగ్గురు పెద్దలు ఒక బ్రదర్‌ని కలుస్తున్నారు. పెద్దలు మాట్లాడుతుంటే ఆ బ్రదర్‌ ఎటో చూస్తున్నాడు. 2. తర్వాత, పెద్దలు ఆ బ్రదర్‌ని మళ్లీ కలుస్తారు. ఈసారి పెద్దలు మాట్లాడుతుంటే ఆ బ్రదర్‌ శ్రద్ధగా వింటున్నాడు.

పశ్చాత్తాపపడేంత సమయం ఇవ్వడానికి పెద్దలు తప్పుచేసిన వ్యక్తిని ఒకటికన్నా ఎక్కువసార్లు కలవచ్చు (12వ పేరా చూడండి)


14. ఒక పాపి పశ్చాత్తాపపడితే దాని ఘనత ఎవరికి వెళ్లాలి? ఎందుకు?

14 తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాపపడితే అది చాలా సంతోషించాల్సిన విషయం! (లూకా 15:7, 10) మరి దాని ఘనత ఎవరికి వెళ్లాలి? సంఘపెద్దలకా? తప్పుచేసినవాళ్ల గురించి పౌలు రాస్తూ ఏమన్నాడో గుర్తుచేసుకోండి: ‘బహుశా, దేవుడు వాళ్లలో పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు.’ (2 తిమో. 2:25) ఆ లేఖనానికి ఉన్న స్టడీ నోట్‌లో ఇలా ఉంది: “అలాంటి ఆలోచనా విధానంలో, వైఖరిలో వచ్చిన మార్పుకు ఘనత ఏ మనిషికీ చెందదు, దారి తప్పిన క్రైస్తవుడు ఈ ముఖ్యమైన మార్పు చేసుకోవడానికి సహాయం చేసిన యెహోవాకే చెందుతుంది. అలాంటి పశ్చాత్తాపం వల్ల కలిగే కొన్ని మంచి ఫలితాల గురించి పౌలు చెప్పాడు. అది, సత్యం గురించిన మరింత ఖచ్చితమైన జ్ఞానం తెలుసుకునేలా పాపిని కదిలిస్తుంది, అతని కళ్లను తెరుస్తుంది, సాతాను ఉచ్చుల నుండి తప్పించుకోవడానికి అతనికి సహాయం చేస్తుంది.—2 తిమో 2:26.”

15. పశ్చాత్తాపం చూపించిన వ్యక్తికి సంఘపెద్దలు ఇంకా ఎలా సహాయం చేస్తూనే ఉంటారు?

15 ఒకవ్యక్తి పశ్చాత్తాపపడితే కమిటీ అతనికి కాపరి సందర్శనాల్ని ఏర్పాటు చేస్తుంది. దానివల్ల అతను సాతాను తీసుకొచ్చే ఒత్తిళ్లను తిప్పికొట్టగలుగుతాడు, తన మార్గాల్ని సరి చేసుకోగలుగుతాడు. (హెబ్రీ. 12:12, 13) నిజమే సంఘపెద్దలు అతను చేసిన పాపం గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ చెప్పరు. కానీ సంఘానికి ఏ విషయాలు చెప్పొచ్చు?

“చూసేవాళ్లందరి ముందు గద్దించు”

16. 1 తిమోతి 5:20 ప్రకారం ‘చూసేవాళ్లందరూ’ అంటున్నప్పుడు పౌలు ఎవర్ని సూచిస్తున్నాడు?

16 1 తిమోతి 5:20, అధస్సూచి కూడా చదవండి. పౌలు ఈ మాటల్ని తన తోటి సంఘపెద్ద అయిన తిమోతికి రాశాడు. ఆయన “పాపం చేసేవాళ్లను చూసేవాళ్లందరి ముందు గద్దించు” అని చెప్పాడు. దానర్థం ఏంటి? ‘చూసేవాళ్లందరూ’ అంటున్నప్పుడు సంఘమంతా అని ఆయన ఉద్దేశం కాదు. బదులుగా, ఆ పాపం గురించి అప్పటికే ఎవరెవరికి తెలుసో ఆ కొంతమందిని ఆయన సూచిస్తున్నాడు. బహుశా దాంట్లో ప్రత్యక్ష సాక్షులు ఉండొచ్చు, లేదా తప్పుచేశానని ఆ వ్యక్తి ఎవరికైతే చెప్పాడో వాళ్లు ఉండొచ్చు. కాబట్టి తప్పుచేసిన వ్యక్తికి సహాయం చేశామని, దిద్దుబాటు ఇచ్చామని సంఘపెద్దలు వాళ్లకు మాత్రమే చెప్తారు.

17. ఒక ఘోరమైన పాపం గురించి సంఘంలో చాలామందికి తెలిసినా లేదా తెలిసే అవకాశం ఉన్నా ఏ ప్రకటన చేస్తారు? ఎందుకు?

17 కొన్ని సందర్భాల్లో, ఆ తప్పు గురించి సంఘంలో చాలామందికి తెలిసి ఉండొచ్చు లేదా తెలిసే అవకాశం ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ‘చూసేవాళ్లందరూ’ అన్నప్పుడు సంఘమంతా వస్తుంది. కాబట్టి ఫలానా బ్రదర్‌ లేదా సిస్టర్‌ గద్దించబడ్డారు అని ఒక సంఘపెద్ద సంఘానికి ప్రకటన చేస్తాడు. ఎందుకు? పౌలు దానికి జవాబిస్తూ, ఘోరమైన పాపం చేయకుండా అది “మిగతావాళ్లకు హెచ్చరికగా ఉంటుంది” అన్నాడు.

18. బాప్తిస్మం తీసుకున్న మైనర్లు తప్పు చేసినప్పుడు పెద్దలు ఏం చేస్తారు? (చిత్రం కూడా చూడండి.)

18 బాప్తిస్మం తీసుకున్న మైనరు, అంటే 18 ఏళ్లలోపు పిల్లలు ఘోరమైన తప్పుచేస్తే, అప్పుడేంటి? ఇద్దరు పెద్దలు, అతని క్రైస్తవ తల్లిదండ్రులb సమక్షంలో అతనితో మాట్లాడేలా పెద్దల సభ ఏర్పాటు చేస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లవాడికి సహాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ఆ పెద్దలు తెలుసుకుంటారు. మైనరు మంచి వైఖరి కలిగి ఉండి, ఆ పరిస్థితిని తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోగలిగితే, మైనరు అలాగే అతని క్రైస్తవ తల్లిదండ్రులు ఒక కమిటీని కలవాల్సిన అవసరం లేదని ఇద్దరు పెద్దలు నిర్ణయించవచ్చు. ఎంతైనా పిల్లలకు ప్రేమగా దిద్దుబాటు ఇవ్వాల్సిన బాధ్యత దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు. (ద్వితీ. 6:6, 7; సామె. 6:20; 22:6; ఎఫె. 6:2-4) మైనరుకు కావాల్సిన ఆధ్యాత్మిక సహాయం అందుతుందని నిర్ధారించుకోవడానికి, పెద్దలు అప్పుడప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడతారు. అయితే, ఒక బాప్తిస్మం తీసుకున్న మైనరు పశ్చాత్తాపం చూపించకుండా పాపం చేస్తూనే ఉంటే, అప్పుడేంటి? అలాంటి సందర్భాల్లో కమిటీ అతని క్రైస్తవ తల్లిదండ్రుల సమక్షంలో అతన్ని కలుస్తారు.

ఇద్దరు పెద్దలు బాప్తిస్మం తీసుకున్న ఒక మైనరును, అతని తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ల ఇంట్లో కలిసి మాట్లాడుతున్నారు. ఒక సంఘపెద్ద లేఖనాన్ని చూపిస్తున్నాడు.

మైనర్లు ఘోరమైన పాపం చేస్తే, ఇద్దరు పెద్దలు ఆ మైనరును అతని క్రైస్తవ తల్లిదండ్రుల సమక్షంలో కలుస్తారు (18వ పేరా చూడిండి)


“యెహోవా ఎంతో వాత్సల్యం గలవాడు, కరుణామయుడు”

19. తప్పుచేసిన వాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు సంఘపెద్దలు యెహోవాను ఎలా అనుకరిస్తారు?

19 కమిటీలో సేవ చేసే సంఘపెద్దలు సంఘాన్ని పవిత్రంగా ఉంచాలని యెహోవా ఆశిస్తున్నాడు. (1 కొరిం. 5:7) వాళ్లు తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాపపడేలా సహాయం చేయడానికి చేయగలిగినదంతా చేస్తారు. అలాగే తప్పుచేసిన వ్యక్తి మారతాడనే నమ్మకంతో ఉంటారు. ఎందుకంటే, ‘ఎంతో వాత్సల్యం, కరుణ’ ఉన్న యెహోవాను వాళ్లు అనుకరించాలనుకుంటారు. (యాకో. 5:11) అపొస్తలుడైన యోహాను అలాంటి స్ఫూర్తిని ఎలా చూపించాడో గమనించండి. ఆయన ఇలా రాశాడు: “నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, తండ్రి దగ్గర మనకు ఒక సహాయకుడు ఉన్నాడు, ఆయనే నీతిమంతుడైన యేసుక్రీస్తు.”—1 యోహా. 2:1.

20. చివరి ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

20 బాధాకరమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాపం చూపించడానికి ఇష్టపడడు. అప్పుడు అతన్ని సంఘం నుండి తొలగించాలి. మరి, అలాంటి సందర్భాల్లో సంఘపెద్దలు ఏం చేస్తారు? చివరి ఆర్టికల్‌లో దాని గురించి చూస్తాం.

మీరెలా జవాబిస్తారు?

  • రోమీయులు 2:4 ప్రకారం తప్పుచేసిన వ్యక్తిని కలుస్తున్నప్పుడు సంఘపెద్దల లక్ష్యం ఏంటి?

  • 2 తిమోతి 2:24-26 లో సంఘపెద్దలకు ఏ నిర్దేశం ఉంది?

  • “చూసేవాళ్లందరి ముందు గద్దించు” అనే మాటకు అర్థమేంటి?

పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు

a గతంలో, ఇలాంటి కమిటీని న్యాయనిర్ణయ కమిటీ అనేవాళ్లం. కానీ ఆ కమిటీ చేసే పనుల్లో తీర్పుతీర్చడం ఒక్కటే లేదు. కాబట్టి ఆ పదాన్ని ఇక నుండి ఉపయోగించం. బదులుగా, ఆ కమిటీని పెద్దల కమిటీ అని పిలుస్తాం.

b తల్లిదండ్రుల గురించి చెప్పబడిన విషయాలు చట్టపరమైన సంరక్షులకు (లీగల్‌ గార్డియన్‌లు) లేదా ఆ మైనరు పిల్లవాడి బాధ్యతను తీసుకున్నవాళ్లకు కూడా వర్తిస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి