కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 నవంబరు పేజీలు 20-25
  • యెహోవా నా ప్రార్థనల్ని వింటున్నాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా నా ప్రార్థనల్ని వింటున్నాడా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం యెహోవా నుండి ఏం ఆశించవచ్చు?
  • యెహోవా మన నుండి ఏం ఆశిస్తున్నాడు?
  • ప్రార్థనలో మనం అడిగే విషయాల్ని కొన్నిసార్లు ఎందుకు మార్చుకోవాల్సి రావచ్చు?
  • ప్రార్థనలు—వాటికి యెహోవా ఎలా జవాబిస్తాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • దేవుడు అన్నీ ప్రార్థనలకు ఎందుకు జవాబివ్వడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ప్రార్థన—దాన్ని మీరు ఇంకా బాగా చేయవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 నవంబరు పేజీలు 20-25

అధ్యయన ఆర్టికల్‌ 49

యెహోవా నా ప్రార్థనల్ని వింటున్నాడా?

“మీరు నాకు మొరపెడతారు, వచ్చి నాకు ప్రార్థిస్తారు, నేను మీ ప్రార్థన వింటాను.”—యిర్మీ. 29:12.

పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు

ఈ ఆర్టికల్‌లో …a

1-2. యెహోవా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదని ఎందుకు అనిపించవచ్చు?

“యెహోవాను బట్టి అధికంగా సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ కోరికల్ని తీరుస్తాడు.” (కీర్త. 37:4) ఆ మాట మనలో ఎంత ఆశను నింపుతుందో కదా! అయితే, మనం అడిగిన వెంటనే యెహోవా జవాబు ఇవ్వాలని ఆశించవచ్చా? ఈ ప్రశ్న గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఈ కింది సందర్భాల్ని గమనించండి. పెళ్లికాని ఒక సిస్టర్‌ రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలని యెహోవాకు ప్రార్థన చేస్తుంది. అయితే, సంవత్సరాలు-సంవత్సరాలు గడుస్తున్నాయి గానీ ఆమెకు మాత్రం ఆహ్వానం రావట్లేదు. యౌవనస్థుడైన ఒక బ్రదర్‌ సంఘంలో ఇంకా ఎక్కువ సేవచేయడానికి వీలుగా తనకున్న పెద్ద జబ్బును తీసేయమని యెహోవాను అడుగుతూ ఉన్నాడు. కానీ, ఆయన జబ్బు మాత్రం తగ్గట్లేదు. తల్లిదండ్రులు తమ పిల్లవాడు సత్యంలో ఉండాలని యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. కానీ, ఆ పిల్లవాడు యెహోవా సేవ ఆపేయాలని నిర్ణయించుకున్నాడు.

2 బహుశా మీరు కూడా యెహోవాను ఏదో అడిగివుంటారు. కానీ ఆయన ఇంకా జవాబు ఇచ్చి ఉండకపోవచ్చు. దానివల్ల ‘యెహోవా నాది తప్ప అందరి ప్రార్థనలు వింటాడు’ అని మీకు అనిపించి ఉండవచ్చు. లేదా ‘నేను ఏదైనా తప్పు చేసుంటానేమో అందుకే యెహోవా జవాబివ్వట్లేదు’ అని అనుకొని ఉంటారు. జానిస్‌b అనే సిస్టర్‌కి అలాగే అనిపించింది. ఆమె, ఆమె భర్త బెతెల్‌కి వెళ్లాలని చాలా కలలు కన్నారు. దాని గురించి యెహోవాను కూడా అడిగారు. ఆమె ఇలా చెప్తుంది: “ఇంకొన్ని రోజుల్లో ఇక బెతెల్‌కి వెళ్లిపోతామని నాకు బలంగా అనిపించింది.” అయితే నెలలు గడిచాయి, ఆ నెలలు కాస్తా సంవత్సరాలు అయ్యాయి కానీ, ఆ దంపతులకు బెతెల్‌కి ఆహ్వానం రాలేదు. జానిస్‌ ఇలా అంటుంది: “ఏం జరుగుతుందో అర్థంకాక నేను చాలా దిగులుపడ్డాను. యెహోవాను బాధపెట్టేంత తప్పేమైనా చేశానా అని నాకు అనిపించింది. నాకు బెతెల్‌కి వెళ్లాలనే కోరిక ఉందని యెహోవాకు ప్రత్యేకంగా ప్రార్థించాను. అయినా, ఆయన నా ప్రార్థనకు ఎందుకు జవాబివ్వలేదు?”

3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 కొన్నిసార్లు యెహోవా మన ప్రార్థనలు వింటున్నాడా అని మనకు అనిపించవచ్చు. మనకే కాదు బైబిలు కాలాల్లో ఉన్న కొంతమంది నమ్మకమైన సేవకులకు కూడా అలాగే అనిపించింది. (యోబు 30:20; కీర్త. 22:2; హబ. 1:2) అయితే, యెహోవా మీ ప్రార్థనలకు జవాబిస్తాడు అనే నమ్మకంతో మీరెందుకు ఉండవచ్చు? (కీర్త. 65:2) ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే ముందు ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలి: (1) మనం యెహోవా నుండి ఏం ఆశించవచ్చు? (2) యెహోవా మన నుండి ఏం ఆశిస్తున్నాడు? (3) ప్రార్థనలో మనం అడిగే విషయాల్ని కొన్నిసార్లు ఎందుకు మార్చుకోవాల్సి రావచ్చు?

మనం యెహోవా నుండి ఏం ఆశించవచ్చు?

4. యిర్మీయా 29:12 ప్రకారం, యెహోవా ఏమని మాటిస్తున్నాడు?

4 మన ప్రార్థనలు వింటానని యెహోవా మాటిస్తున్నాడు. (యిర్మీయా 29:12 చదవండి.) యెహోవాకు తన నమ్మకమైన ఆరాధకులు అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ల ప్రార్థనల్ని ఆయన ఎప్పుడూ వింటాడు. (కీర్త. 10:17; 37:28) అయితే, మనం అడిగే ప్రతీది ఆయన ఇస్తాడని దానర్థం కాదు. ఎందుకంటే, యెహోవా మనం అడిగేవి కొన్ని ఇవ్వాలంటే కొత్తలోకం వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే!

5. మన ప్రార్థనల్ని వింటున్నప్పుడు యెహోవా దేన్ని మనసులో ఉంచుకుంటాడు? వివరించండి.

5 యెహోవా మన ప్రార్థనల్ని వింటున్నప్పుడు తన సంకల్పాన్ని మనసులో ఉంచుకుంటాడు. (యెష. 55:8, 9) తన పరిపాలనకు లోబడే మనుషులతో ఈ భూమి కళకళలాడడం యెహోవా సంకల్పంలో ఒక భాగం. కానీ మనుషులు తమనుతాము పరిపాలించుకుంటేనే చాలా బాగుంటారని సాతాను అన్నాడు. (ఆది. 3:1-5) అది పచ్చి అబద్ధమని నిరూపించడానికే యెహోవా మనుషుల పరిపాలనను అనుమతించాడు. అయితే, మనుషుల పరిపాలనలో అష్టకష్టాలు పడుతున్నామని మనకు తెలుసు. (ప్రసం. 8:9) యెహోవా మనకున్న ప్రతీ సమస్యని ఇప్పుడు తీసేయడు. ఒకవేళ యెహోవా అలా చేస్తే, మనుషుల పరిపాలన బానే ఉంది, మన సమస్యల్ని మనం బానే పరిష్కరించుకుంటున్నాం అని ప్రజలు అపోహపడే ప్రమాదం ఉంది.

6. యెహోవా చేసే ప్రతీది ప్రేమగా, న్యాయంగా చేస్తాడనే నమ్మకంతో మనం ఎందుకు ఉండవచ్చు?

6 యెహోవా ఒకేలాంటి ప్రార్థనకు రకరకాలుగా జవాబు ఇవ్వవచ్చు. ఒక ఉదాహరణ గమనించండి. హిజ్కియా రాజుకు బాగా జబ్బు చేసి, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తనను బాగుచేయమని యెహోవాను అడిగాడు. దానికి యెహోవా హిజ్కియాను బాగుచేశాడు. (2 రాజు. 20:1-6) మరోవైపు, అపొస్తలుడైన పౌలు తన “శరీరంలో” ఉన్న ముల్లు, అంటే బహుశా ఒక అనారోగ్య సమస్య అయ్యుండవచ్చు, దాన్ని తీసేయమని యెహోవాను బ్రతిమాలాడు. కానీ ఆయన దాన్ని తీసేయలేదు. (2 కొరిం. 12:7-9) అపొస్తలుడైన యాకోబు, పేతురు ఉదాహరణల్ని కూడా పరిశీలించండి. హేరోదు రాజు వాళ్లిద్దర్నీ చంపడానికి చూశాడు. అయితే సంఘం పేతురు కోసం ప్రార్థన చేసింది. బహుశా వాళ్లు యాకోబు కోసం కూడా ప్రార్థన చేసుంటారు. కానీ యాకోబు చనిపోయాడు, పేతురుని మాత్రం యెహోవా అద్భుతరీతిలో కాపాడాడు. (అపొ. 12:1-11) ‘అదేంటి! యెహోవా పేతురును కాపాడి యాకోబును ఎందుకు కాపాడలేదు?’ అని మనకు అనిపించవచ్చు. దానిగురించి బైబిలు ఏమీ చెప్పట్లేదు.c కానీ యెహోవా “మార్గాలన్నీ న్యాయమైనవి” అనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (ద్వితీ. 32:4) అలాగే యెహోవాకు పేతురు, యాకోబు ఇద్దరూ ఇష్టమే అని మనకు తెలుసు. (ప్రక. 21:14) అయితే, కొన్నిసార్లు యెహోవా మనం అనుకున్నట్టుగా జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన మన ప్రార్థనలకు ఎప్పుడూ ప్రేమగా, న్యాయంగా జవాబిస్తాడనే నమ్మకంతో ఉంటాం కాబట్టి, ఆయన ఫలానా విధంగా ఎందుకు జవాబిచ్చాడని ప్రశ్నించం!—యోబు 33:13.

7. మనమేం చేయకూడదు? ఎందుకు?

7 మనం వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. ఉదాహరణకు, మనం ఫలానా విధంగా సహాయం చేయమని యెహోవాను అడిగినప్పుడు ఆయన దానికి జవాబు ఇచ్చుండకపోవచ్చు. కానీ అదే విషయాన్ని వేరేవాళ్లు అడిగినప్పుడు ఆయన దానికి జవాబు ఇచ్చుండవచ్చు. యానా అనే సిస్టర్‌కి అలాగే జరిగింది. ఆమె భర్త మాథ్యూ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆయన్ని బాగుచేయమని యానా యెహోవాను చాలా అడిగింది. అదే సమయంలో తన సంఘంలో ఉన్న ఇద్దరు వృద్ధ సహోదరీలు కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. యానా తన భర్తను అలాగే ఆ ఇద్దరి సిస్టర్స్‌ని బాగుచేయమని యెహోవాను ప్రాధేయపడింది. అయితే, ఆ ఇద్దరు సిస్టర్స్‌ బాగయ్యారు గానీ తన భర్త మాత్రం చనిపోయాడు. అయితే ఆ ఇద్దరి సిస్టర్స్‌ని బాగుచేసిన యెహోవా తన భర్తను ఎందుకు బాగుచేయలేదని యానా మొదట్లో అనుకుంది. నిజానికి ఆ ఇద్దరు సిస్టర్స్‌ ఎలా బాగయ్యారో మనకు తెలీదు. కానీ మనకు తెలిసింది ఏంటంటే, మనకున్న ప్రతీ సమస్యను యెహోవా త్వరలో పూర్తిగా తీసేయబోతున్నాడు. అలాగే చనిపోయిన తన స్నేహితులందర్నీ తిరిగి లేపాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు.—యోబు 14:15.

8. (ఎ) యెషయా 43:2 ప్రకారం, యెహోవా మన చెయ్యి విడిచిపెట్టడని ఎలా చెప్పవచ్చు? (బి) కష్టాల్ని తట్టుకోవడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది? (కష్టాల్ని తట్టుకోవడానికి ప్రార్థన సహాయం చేస్తుంది వీడియో చూడండి.)

8 యెహోవా మన చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టడు. ఒక ప్రేమగల తండ్రిగా మనం బాధపడుతుంటే యెహోవా చూసి తట్టుకోలేడు. (యెష. 63:9) అలాగని మనకొచ్చే ప్రతీ కష్టానికి ఆయన అడ్డుపడడు. మనకొచ్చే కష్టాల్ని నదులతో, అగ్నిజ్వాలలతో బైబిలు పోలుస్తుంది. (యెషయా 43:2 చదవండి.) అయితే, మనం వాటన్నిటిని దాటడానికి యెహోవా సహాయం చేస్తానని మాటిస్తున్నాడు. అంతేకాదు, మన కష్టాల వల్ల మనకు శాశ్వతంగా హాని జరిగేలా ఆయన అనుమతించడు. వాటిని తట్టుకోవడానికి కావల్సిన శక్తిని తన పవిత్రశక్తి ద్వారా మనకు ఇస్తాడు. (లూకా 11:13; ఫిలి. 4:13) దానివల్ల యెహోవాకు నమ్మకంగా ఉండడానికి, మన కష్టాల్ని తట్టుకోవడానికి సరిగ్గా అవసరమైనవి యెహోవా ఇస్తాడు.d

యెహోవా మన నుండి ఏం ఆశిస్తున్నాడు?

9. యాకోబు 1:6, 7 ప్రకారం, యెహోవా మనకు సహాయం చేస్తాడని ఎందుకు నమ్మాలి?

9 మనం ఆయన్ని నమ్మాలని యెహోవా ఆశిస్తున్నాడు. (హెబ్రీ. 11:6) కొన్నిసార్లు మన కష్టాలు మనల్ని ఊపిరాడకుండా చేయవచ్చు. ఇక వాటిని ఎవ్వరూ తీర్చలేరని మనకు అనిపించవచ్చు. యెహోవా అయినా దీన్ని తీర్చగలడా అనే సందేహం కూడా రావచ్చు. కానీ దేవుని పవిత్రశక్తి సహాయంతో మనం “ప్రాకారం” కూడా ‘దూకగలం’ అని బైబిలు అభయమిస్తుంది. (కీర్త. 18:29) కాబట్టి మన కష్టాల్ని ఎవ్వరూ తీర్చలేరని కుమిలిపోయే బదులు, యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తాడనే పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఆయనకు ప్రార్థన చేయాలి.—యాకోబు 1:6, 7 చదవండి.

10. మన ప్రార్థనలకు తగ్గట్టు పనులు ఎలా చేయవచ్చో ఉదాహరణతో చెప్పండి.

10 మన ప్రార్థనలకు తగ్గట్టు పనులు చేయాలని కూడా యెహోవా ఆశిస్తాడు. ఉదాహరణకు, ఒక బ్రదర్‌ సమావేశానికి హాజరవ్వడానికి తన బాస్‌ సెలవిచ్చేలా సహాయం చేయమని యెహోవాను అడగొచ్చు. మరి ఆ ప్రార్థనకు యెహోవా ఎలా జవాబిస్తాడు? ఆ బ్రదర్‌ తన బాస్‌ దగ్గరకు వెళ్లి సెలవు అడిగేంత ధైర్యం యెహోవా అతనికి ఇస్తాడు. కానీ బాస్‌ దగ్గరికి వెళ్లి, సెలవు అడగాల్సింది ఆ బ్రదరే. బహుశా బాస్‌ దానికి ఒప్పుకోకపోవచ్చు. అతను పదేపదే అడగాల్సిరావచ్చు. అలాగే తనకు బదులుగా ఆ సెలవు రోజుల్లో వేరే ఉద్యోగి పనిచేసేలా మాట్లాడుకోవాల్సి రావచ్చు, లేదా ఆ సెలవుకు బదులు అదనంగా వేరే రోజుల్లో పని చేస్తానని చెప్పాల్సి రావచ్చు. అవసరమైతే ఆ సెలవు రోజుల్లో జీతాన్ని కూడా కట్‌ చేసుకోమని చెప్పాల్సి రావచ్చు.

11. మనం ఏదైనా ఒక విషయం గురించి ఎందుకు పదేపదే అడగాలి?

11 ఏదైనా ఒక విషయాన్ని పదేపదే అడగాలని యెహోవా ఆశిస్తాడు. (1 థెస్స. 5:17) మనం ఏదైనా అడిగీ అడగ్గానే యెహోవా జవాబు ఇవ్వకపోవచ్చని యేసు మాటల్నిబట్టి అర్థమౌతుంది. (లూకా 11:9) కాబట్టి మనం వెనకడుగు వేయకుండా పట్టుదలగా పదేపదే యెహోవాను అడుగుతూ ఉండాలి! (లూకా 18:1-7) అలా ఒక విషయం గురించి పదేపదే అడిగినప్పుడు, మనం అడిగేవి ఉత్తుత్తి విషయాలు కావని, వాటిని మనం నిజంగానే కోరుకుంటున్నామని చూపిస్తాం. అంతేకాదు, మనకు సహాయం చేసే సామర్థ్యం యెహోవాకు ఉందని నమ్ముతున్నట్టు చూపిస్తాం.

ప్రార్థనలో మనం అడిగే విషయాల్ని కొన్నిసార్లు ఎందుకు మార్చుకోవాల్సి రావచ్చు?

12. (ఎ) మనం ప్రార్థనలో అడిగే విషయం గురించి ఏమని ప్రశ్నించుకోవాలి? ఎందుకు? (బి) యెహోవా మీద గౌరవం ఉందని మనం ప్రార్థనలో అడిగేవాటిని బట్టి ఎలా చూపించవచ్చు? (“ప్రార్థనలో నేను అడిగేవి యెహోవా మీద గౌరవం ఉందని చూపిస్తున్నాయా?” అనే బాక్సు చూడండి.)

12 మనం ప్రార్థనలో అడిగిన దానికి జవాబు రాకపోతే, ఈ మూడు ప్రశ్నల్ని వేసుకోవచ్చు: మొదటిది, ‘నేను సరైన విషయం గురించే ప్రార్థిస్తున్నానా?’ సాధారణంగా, మనకేది మంచిదో మనకు తెలుసని మనకు అనిపించవచ్చు. కానీ మనం అడిగే విషయం ప్రస్తుతానికి బాగానే ఉండవచ్చు గానీ, రాబోయే రోజుల్లో అది మనకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. మనం ఏదైనా ఒక సమస్య గురించి ప్రార్థిస్తున్నప్పుడు మనం అడిగే దానికన్నా ఇంకా మెరుగైన పరిష్కారం ఉండివుండవచ్చు. అంతేకాదు, మనం అడిగేది యెహోవా ఇష్టానికి విరుద్ధంగా కూడా ఉండివుండవచ్చు. (1 యోహా. 5:14) ఉదాహరణకు, మొదటి పేరాలో ప్రస్తావించబడిన తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. వాళ్లబ్బాయి సత్యంలో ఉండేలా సహాయం చేయమని వాళ్లు యెహోవాను అడిగారు. అది సరైన కోరికే అని మనకు అనిపించవచ్చు. కానీ, తనను ఆరాధించమని యెహోవా ఎవ్వర్నీ బలవంతపెట్టడు. మనమైనా సరే, మన పిల్లలైనా సరే యెహోవాను ఆరాధించాలని సొంతగా నిర్ణయించుకోవాలి. (ద్వితీ. 10:12, 13; 30:19, 20) కాబట్టి ఆ తల్లిదండ్రులు, వాళ్లబ్బాయి హృదయాన్ని చేరుకొని ఆ అబ్బాయే స్వయంగా యెహోవాను ప్రేమించి, ఆయనకు స్నేహితుడు అవ్వాలనే కోరికను పెంచుకునేలా సహాయం చేయాలని అడిగి ఉంటే ఇంకా బాగుండేది.—సామె. 22:6; ఎఫె. 6:4.

ప్రార్థనలో నేను అడిగేవి యెహోవా మీద గౌరవం ఉందని చూపిస్తున్నాయా?

ఒక ప్రేమగల తండ్రిగా యెహోవా మనం కోరుకునేవన్నీ ఇవ్వాలనే అనుకుంటాడు. అయితే, ఆయన మన సృష్టికర్త కూడా కాబట్టి మన గౌరవానికి పూర్తిగా అర్హుడు. (ప్రక. 4:11) మరి, మనం ప్రార్థనలో ఏదైనా అడుగుతున్నప్పుడు ఆయనపై గౌరవం ఉందని ఎలా చూపించవచ్చు?

  • మనం ప్రార్థనలో ఏదైనా అడుగుతున్నప్పుడు సరైన ఉద్దేశంతో, యెహోవా ఇష్టానికి తగ్గట్టుగా అడగాలి. (1 యోహా. 5:14) కేవలం మన సొంత కోరికలు, అవసరాలు మాత్రమే అడిగితే అది స్వార్థం అవుతుంది. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని యాకోబు ఈ విషయం గురించే హెచ్చరించాడు. ఒకవేళ వాళ్ల ప్రార్థనలు పూర్తిగా సొంత కోరికలతో, స్వార్థంతో నిండిపోతే వాటికి జవాబు రాదని ఆయన తేల్చి చెప్పాడు.—యాకో. 4:3.

  • ప్రార్థనలో డిమాండ్‌ చెయ్యకండి. (మత్త. 4:7) మీ ప్రార్థనలకు సరిగ్గా ఎలా జవాబివ్వాలో యెహోవాకు బాగా తెలుసని నమ్మకం ఉంచండి. కొన్నిసార్లు ఆయనిచ్చే జవాబు మీరు ఆశించినట్టు ఉండకపోవచ్చు.—ఎఫె. 3:20.

  • ప్రతీరోజు యెహోవా మీకిస్తున్న వాటికోసం థ్యాంక్స్‌ చెప్పడం మర్చిపోకండి. అలా థ్యాంక్స్‌ చెప్పడం వల్ల యెహోవాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఆలోచించండి.—కొలొ. 3:15; 1 థెస్స. 5:17, 18.

13. హెబ్రీయులు 4:16 ప్రకారం, యెహోవా ఎప్పుడు సహాయం చేస్తాడు? వివరించండి.

13 మనం వేసుకోవాల్సిన రెండో ప్రశ్న, ‘మనం అడిగింది ఇవ్వడానికి యెహోవా అనుకున్న సమయం ఇదేనా?’ బహుశా మన ప్రార్థనలకు ఇప్పటికిప్పుడే జవాబు రావాలని మనకు అనిపించవచ్చు. కానీ మనకు సహాయం చేయడానికి ఏది సరైన సమయమో యెహోవాకు బాగా తెలుసు. (హెబ్రీయులు 4:16 చదవండి.) ఒకవేళ మనం అడిగిన వాటికి వెంటనే జవాబు రాకపోతే, బహుశా యెహోవా జవాబు ‘కాదు’ అని మనకు అనిపించవచ్చు. కానీ నిజానికి, యెహోవా జవాబు ‘ఇప్పుడే కాదు’ అయ్యుంటుంది. ఉదాహరణకు, మొదటి పేరాలో ప్రస్తావించిన యువకుడి గురించి ఆలోచించండి. తన జబ్బు నయం చేయమని అతను యెహోవాను అడిగాడు. ఒకవేళ యెహోవా ఆ జబ్బును అద్భుతరీతిలో నయం చేసుంటే, అలా చేసినందుకే అతను యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తున్నాడని సాతాను నిందించే అవకాశం ఉంది. (యోబు 1:9-11; 2:4) అంతేకాదు, జబ్బులన్నిటినీ నయం చేయడానికి యెహోవా ఇప్పటికే ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు. (యెష. 33:24; ప్రక. 21:3, 4) కాబట్టి అప్పటివరకు అద్భుతరీతిగా యెహోవా బాగుచేయాలని మనం ఎదురుచూడం. కాబట్టి ఆ సహోదరుడు తన అనారోగ్యాన్ని తట్టుకోవడానికి, యెహోవాకు నమ్మకంగా సేవచేయడానికి కావల్సిన బలాన్ని, మనశ్శాంతిని ఇవ్వమని అడిగి ఉంటే ఇంకా బాగుండేది.—కీర్త. 29:11.

14. జానిస్‌ అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

14 బెతెల్‌లో సేవచేయడం గురించి ప్రార్థన చేసిన జానిస్‌ అనుభవాన్ని ఒకసారి గుర్తుచేసుకోండి. యెహోవా ఇచ్చిన జవాబును అర్థం చేసుకోవడానికి ఆమెకు ఐదు సంవత్సరాలు పట్టింది. ఆమె ఇలా చెప్తుంది: “ఈ ఐదు సంవత్సరాల్లో యెహోవా నాకు ఎన్నో నేర్పించాడు. నన్ను మెరుగుదిద్దాడు. ఎందుకంటే ఆయన మీద నాకున్న నమ్మకం అలాగే నా వ్యక్తిగత అధ్యయన అలవాట్లు పెంచుకోవాలని నాకు అర్థమైంది. అంతేకాదు, చుట్టూ ఉన్న పరిస్థితుల మీద నా సంతోషం ఆధారపడకూడదని కూడా అర్థం చేసుకోవాల్సి వచ్చింది.” తర్వాత జానిస్‌, ఆమె భర్త ప్రాంతీయ సేవ చేయడానికి ఆహ్వానించబడ్డారు. గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె ఇలా చెప్తుంది: “నిజానికి యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడు, కానీ నేను అనుకున్న విధంగా కాదు. ఆయన ఇచ్చిన జవాబు ఒక అపురూపమైన బహుమతి అని అర్థం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. అలా యెహోవా ప్రేమను, ఆయన కనికరాన్ని రుచిచూసే అవకాశం నాకు దొరికింది. దానికి యెహోవాకు నేనెంతో రుణపడి ఉన్నాను!”

చిత్రాలు: 1. ఇద్దరు సిస్టర్స్‌ రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లికేషన్‌ నింపుతున్నారు. వాళ్లిద్దరూ అప్లికేషన్‌ నింపే ముందు ప్రార్థన చేసుకున్నారు. 2. ఒక సిస్టర్‌కి ఆ పాఠశాలకు ఆహ్వానం వచ్చింది. ఆ ఆహ్వానాన్ని రాజ్యమందిరంలో ఉన్న తన ఫ్రెండ్స్‌కి చూపిస్తుంది. అందులోనే ఆ పాఠశాలకు అప్లికేషన్‌ పెట్టుకున్న మరో సిస్టర్‌ కూడా ఉన్నారు. 3. పాఠశాలకు ఆహ్వానం రాని సిస్టర్‌, యెహోవాకు ప్రార్థించుకొని ఒక ఉత్తరాన్ని టైపు చేస్తున్నారు. తర్వాత, ఆమె వేరే దేశంలో ప్రీచింగ్‌ చేస్తుంది. అలాగే నిర్మాణ పనిలో కూడా పాల్గొంటుంది.

యెహోవా నుండి మీకు జవాబు రాలేదు అనిపిస్తే, మీరు ప్రార్థన చేసే విషయాన్ని మార్చాలేమో ఆలోచించండి (15వ పేరా చూడండి)f

15. మనకు సరిగ్గా ఏం కావాలో అది ప్రార్థనలో అడుగుతూనే యెహోవా ఇష్టానికి కూడా అవకాశాన్ని ఎలా ఇవ్వొచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

15 మనం వేసుకోవాల్సిన మూడో ప్రశ్న, ‘నేను ప్రార్థించే విషయాన్ని మార్చుకోవాలా?’ మనకు సరిగ్గా ఏం కావాలో అది యెహోవాను అడగడం మంచిదే. కానీ మనం కోరుకున్నదే జరగాలన్నట్టు కాకుండా, మన విషయంలో యెహోవా ఇష్టానికి చోటిచ్చేలా మన విన్నపం ఉండాలి. మొదటి పేరాలో ప్రస్తావించబడిన పెళ్లికాని సిస్టర్‌ ఉదాహరణను గుర్తుచేసుకోండి. అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేయాలనే కోరిక ఆమెకు ఉంది. అందుకే ఆమె రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలని ప్రార్థనలో అడుగుతూ ఉంది. అయితే, ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాఠశాలకు హాజరవ్వాలనే కోరిక గురించి యెహోవాకు చెప్తూనే, తన పరిచర్యను విస్తృతం చేసుకునే అవకాశాలు చూసేలా సహాయం చేయమని అడగవచ్చు. (అపొ. 16:9, 10) తర్వాత, ఆ ప్రార్థనలకు తగ్గట్టుగా ఆమె ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి కలిసి బహుశా దగ్గర్లో ఏదైనా సంఘంలో పయినీర్ల అవసరం ఉందేమో అడగవచ్చు, లేకపోతే బ్రాంచికి ఉత్తరం రాయవచ్చు.e

16. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

16 ఈ ఆర్టికల్‌లో మనం నేర్చుకున్నట్టుగా యెహోవా మన ప్రార్థనలన్నిటికి ప్రేమగా, న్యాయంగా జవాబిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (కీర్త. 4:3; యెష. 30:18) అయితే, కొన్నిసార్లు మనం ఆశించిన జవాబునే యెహోవా ఇవ్వకపోవచ్చు. అంతమాత్రాన ఆయన మన ప్రార్థనల్ని పెడచెవిన పెడతాడని అనుకోకూడదు. ఆయనకు మనమంటే ఎనలేని ప్రేమ! ఆయన మన చెయ్యిని ఎప్పటికీ వదిలిపెట్టడు. (కీర్త. 9:10) కాబట్టి “అన్ని సమయాల్లో ఆయన్ని నమ్ముకోండి.” ఆయన ముందు మీ హృదయాల్ని కుమ్మరించండి.—కీర్త. 62:8.

ప్రార్థనల విషయంలో . . .

  • మనం యెహోవా నుండి ఏం ఆశించవచ్చు?

  • యెహోవా మన నుండి ఏం ఆశిస్తున్నాడు?

  • మనం అడిగే వాటిని ఎందుకు మార్చుకోవాల్సి రావచ్చు?

పాట 43 కృతజ్ఞతా ప్రార్థన

a యెహోవా మన ప్రార్థనలకు ఎప్పుడూ ప్రేమగా, న్యాయంగా జవాబిస్తాడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.

b కొన్ని అసలు పేర్లు కావు.

c 2022, ఫిబ్రవరి కావలికోట సంచికలోని “యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని మీరు నమ్ముతారా?” అనే ఆర్టికల్‌లో 3-6 పేరాలు చూడండి.

d కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఇంకా ఎలా సహాయం చేస్తాడో తెలుసుకోవడానికి jw.orgలో కష్టాల్ని తట్టుకోవడానికి ప్రార్థన సహాయం చేస్తుంది అనే వీడియో చూడండి.

e వేరే బ్రాంచి క్షేత్రంలో సేవ చేయడానికి మిమ్మల్ని మీరు ఎలా అందుబాటులో ఉంచుకోవచ్చో తెలుసుకోవడానికి యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ పుస్తకంలో 10వ అధ్యాయం, 6-9 పేరాలు చూడండి.

f చిత్రాల వివరణ: రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లికేషన్‌ నింపే ముందు సిస్టర్స్‌ ఇద్దరూ ప్రార్థించారు. తర్వాత ఒకరికి ఆహ్వానం వచ్చింది, ఒకరికి రాలేదు. ఆహ్వానం రాని సిస్టర్‌ బాగా డీలాపడిపోయి, బాధపడే బదులు తన పరిచర్యను విస్తృతం చేసుకునే అవకాశాల గురించి ఆలోచించేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిస్తుంది. ఆ తర్వాత, ఆమెకు అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయాలనే కోరిక ఉందని బ్రాంచికి ఒక ఉత్తరం రాస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి