అధ్యయన ఆర్టికల్ 48
కష్టాలు ముంచెత్తినా యెహోవా మీద నమ్మకం ఉంచండి
‘“ధైర్యంగా ఉండండి! ఎందుకంటే, నేను మీకు తోడుగా ఉన్నాను” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.’—హగ్గ. 2:4.
పాట 118 ‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’
ఈ ఆర్టికల్‌లో …a
1-2. (ఎ) యెరూషలేముకు తిరిగొచ్చిన యూదుల పరిస్థితికి, మన పరిస్థితికి ఉన్న పోలికలు ఏంటి? (బి) యూదులు ఎదుర్కొన్న కొన్ని సమస్యల గురించి వివరించండి. (“హగ్గయి, జెకర్యా, ఎజ్రా కాలంలోని సంఘటనలు” అనే బాక్సు చూడండి.)
రేపేమి జరుగుతుందో అని మీరెప్పుడైనా దిగులుపడ్డారా? బహుశా మీ ఉద్యోగం పోవడం వల్ల కుటుంబాన్ని ఏం పెట్టి పోషించాలా అని ఆలోచించి ఉండవచ్చు. ఒకవేళ రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తే, ప్రీచింగ్‌లో హింస, వ్యతిరేకత ఎదురైతే మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలా అని టెన్షన్ పడివుండవచ్చు. వీటిలో ఏదైనా మీకు ఎదురైందా? అలాగైతే, ఇశ్రాయేలీయులకు ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు యెహోవా ఎలా కాపాడాడో తెలుసుకోవడం మీకు సహాయం చేస్తుంది.
2 బబులోనులో పుట్టిపెరిగిన యూదులు అక్కడున్న సిరిసంపదలకు, సౌకర్యాలకు అలవాటుపడిపోయారు. వాళ్లు వెళ్తున్న దేశం గురించి అంతగా తెలీదు కాబట్టి అక్కడికి వెళ్లడానికి చాలా విశ్వాసం అవసరమైంది. పైగా వచ్చీరాగానే ఆర్థిక సమస్యలు, రాజకీయ పరిస్థితుల్లో మార్పులు, హింస, వ్యతిరేకత వల్ల వాళ్లు ఇబ్బందులు పడ్డారు. దానివల్ల కొంతమంది యెహోవా ఆలయాన్ని తిరిగి కట్టడం మీద మనసు పెట్టలేకపోయారు. కాబట్టి దాదాపు క్రీ.పూ. 520 లో ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి యెహోవా హగ్గయి, జెకర్యా ప్రవక్తల్ని పంపించాడు. (హగ్గ. 1:1; జెక. 1:1) ఈ ఇద్దరు ప్రవక్తలు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అయితే, దాదాపు 50 ఏళ్ల తర్వాత యూదులకు మళ్లీ ప్రోత్సాహం అవసరమైంది. ఈసారి, సత్యారాధన మీద మనసుపెట్టమని వాళ్లను ప్రోత్సహించడానికి బబులోను నుండి ఎజ్రా వచ్చాడు. ఈయన ధర్మశాస్త్రాన్ని నకలు రాయడంలో ఆరితేరినవాడు.—ఎజ్రా 7:1, 6.
3. మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం? (సామెతలు 22:19)
3 వ్యతిరేకత వచ్చినప్పుడు గతంలోని దేవుని ప్రజలు యెహోవా మీద నమ్మకం ఉంచేలా హగ్గయి, జెకర్యా ప్రవచనాలు ఎలా సహాయం చేశాయో, మనకు కూడా కష్టాలు ముంచెత్తినప్పుడు యెహోవా మీద నమ్మకం ఉంచడానికి అవి సహాయం చేస్తాయి. (సామెతలు 22:19 చదవండి.) హగ్గయి, జెకర్యాలు ప్రకటించిన దేవుని సందేశం గురించి అలాగే ఎజ్రా ఆదర్శం గురించి ఇప్పుడు చూద్దాం. అలా పరిశీలిస్తున్నప్పుడు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: కష్టాలు వచ్చినప్పుడు యూదుల పరిస్థితి ఎలా మారిపోయింది? అలాంటి పరిస్థితే మనకు ఎదురైతే యెహోవా ఇష్టం చేయడం మీద ఎలా మనసు పెట్టవచ్చు? కష్టాల్లో కూడా యెహోవా మీద నమ్మకాన్ని ఎలా పెంచుకుంటూ ఉండవచ్చు?
కష్టాలు వచ్చినప్పుడు యూదుల పరిస్థితి ఎలా మారిపోయింది?
4-5. ఆలయం కట్టే విషయంలో యూదుల ఉత్సాహం ఎందుకు చల్లారిపోయింది?
4 యూదులు యెరూషలేములోకి అడుగుపెట్టగానే క్షణం తీరికలేకుండా వాళ్ల పాదాలు పనుల కోసం పరుగులు తీశాయి. వాళ్లు యెహోవా బలిపీఠాన్ని తిరిగి కట్టారు. ఆలయానికి పునాదులు వేశారు. (ఎజ్రా 3:1-3, 10) కానీ వాళ్ల ఉత్సాహం చాలా త్వరగా చల్లారిపోయింది. ఎందుకు? ఎందుకంటే, వాళ్లు ఆలయం కట్టడంతో పాటు వాళ్లకోసం ఇళ్లు కట్టుకోవాలి, పంటలు పండించుకోవాలి, కుటుంబాల్ని పోషించుకోవాలి. (ఎజ్రా 2:68, 70) దానికితోడు, ఆలయం కట్టే పనిని ఆపడానికి శత్రువులు ఎన్నో పన్నాగాలు పన్నారు. అలా వాళ్ల నుండి వ్యతిరేకత కూడా వచ్చింది.—ఎజ్రా 4:1-5.
5 తిరిగొచ్చిన యూదులు ఆర్థిక సమస్యల వల్ల, మారుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ల దేశం పర్షియా రాజు గుప్పిట్లోకి వెళ్లిపోయింది. క్రీ.పూ. 530 లో పర్షియా రాజైన కోరెషు చనిపోయిన తర్వాత క్యాంబైసీస్ రాజయ్యాడు. ఆయన తన సైనిక దళంతో ఐగుప్తును ఆక్రమించుకోవాలని అనుకున్నాడు. అలా ఆక్రమించుకుంటున్నప్పుడు అతని సైన్యం ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఆహారాన్ని, నీళ్లను, ఇళ్లను బలవంతంగా లాక్కొని ఉంటారు. దాంతో వాళ్ల కష్టాలు మరింత పెరిగాయి. అంతేకాదు, క్యాంబైసీస్ తర్వాత దర్యావేషు I రాజయ్యాడు. అతని పరిపాలన తిరుగుబాటుకు, రాజకీయ అస్థిరత్వానికి పెట్టింది పేరు. వీటన్నిటినిబట్టి తిరిగొచ్చిన యూదులు తమ కుటుంబాల్ని ఏం పెట్టి పోషించుకోవాలా అని ఆలోచించారనడంలో సందేహమే లేదు! అలాగే, యూదుల్లో కొంతమంది యెహోవా ఆలయాన్ని కట్టడానికి ఇది సరైన సమయం కాదని అనుకున్నారు.—హగ్గ. 1:2.
6. జెకర్యా 4:6, 7 ప్రకారం, యూదులు ఇంకా ఏ ఇబ్బందులు పడ్డారు? జెకర్యా వాళ్లకు ఏ భరోసాను ఇచ్చాడు?
6 జెకర్యా 4:6, 7 చదవండి. యూదులు ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ పరిస్థితుల్లో మార్పులతో పాటు హింసను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రీ.పూ. 522 లో ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని నిషేధించేలా శత్రువులు ఉసిగొల్పారు. అలా నిర్మాణ పని పూర్తిగా ఆగిపోయింది. కానీ యెహోవా తన పవిత్రశక్తితో ఏ అడ్డంకునైనా తీసేయగలడని జెకర్యా యూదులకు భరోసాను ఇచ్చాడు. క్రీ.పూ. 520 లో రాజైన దర్యావేషు ఆలయ నిర్మాణానికి ఉన్న నిషేధాన్ని తీసేసి, దానికి కావల్సిన డబ్బును కూడా ఏర్పాటు చేశాడు. అంతేకాదు, ఆ పని ముందుకెళ్లడానికి స్థానిక అధికారుల్ని సహాయం చేయమని కూడా ఆజ్ఞాపించాడు.—ఎజ్రా 6:1, 6-10.
7. యూదులు యెహోవా ఇష్టాన్ని చేయడం మీద మనసుపెట్టడం వల్ల ఎలాంటి దీవెనల్ని పొందారు?
7 ఆలయాన్ని తిరిగి కట్టే పనికి యూదులు మొదటిస్థానం ఇస్తే, యెహోవా వాళ్ల వెన్నంటే ఉంటానని హగ్గయి, జెకర్యా ద్వారా మాటిచ్చాడు. (హగ్గ. 1:8, 13, 14; జెక. 1:3, 16) ప్రవక్తల ప్రోత్సాహంతో యూదులు ఆలయాన్ని తిరిగి కట్టే పనిని క్రీ.పూ. 520 లో ప్రారంభించారు. ఎన్ని ఇబ్బందులున్నా, వాళ్లు యెహోవా ఇష్టం చేయడం మీదే మనసు పెట్టారు కాబట్టి, దాన్ని ఐదు సంవత్సరాల లోపే పూర్తి చేయగలిగారు. యెహోవా మాటిచ్చినట్టే ఆ పని జరిగినంత కాలం ఆయన వాళ్ల అవసరాల్ని చూసుకున్నాడు, తనకు దగ్గరయ్యేలా కూడా సహాయం చేశాడు. దానివల్ల యూదులు యెహోవాను సంతోషంగా ఆరాధించగలిగారు.—ఎజ్రా 6:14-16, 22.
దేవుని ఇష్టం చేయడం మీదే మనసుపెట్టండి
8. హగ్గయి 2:4 లో ఉన్న మాటలు దేవుని ఇష్టం మీదే మనసు పెట్టడానికి ఎలా సహాయం చేస్తాయి? (అధస్సూచి కూడా చూడండి.)
8 మహాశ్రమ దగ్గరపడేకొద్దీ ప్రీచింగ్ చేయడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని మనం గుర్తుంచుకోవాలి. (మార్కు 13:10) కానీ కొన్నిసార్లు మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్లో, ప్రకటన పనిలో ఎదురయ్యే వ్యతిరేకత వల్లో ప్రీచింగ్‌కి మొదటిస్థానం ఇవ్వడం కష్టంగా అనిపించవచ్చు. మరి, యెహోవా పనికి మొదటిస్థానం ఇవ్వడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? “సైన్యాలకు అధిపతైన యెహోవా”b మన పక్కనే ఉంటాడని నమ్మకాన్ని ఉంచాలి. మన పనుల కన్నా ఆయన పనులకే మొదటిస్థానం ఇస్తే, ఆయన మనల్ని తప్పకుండా ఆదుకుంటాడు. కాబట్టి మనం దేనికీ భయపడాల్సిన అవసరంలేదు!—హగ్గయి 2:4 చదవండి.
9-10. మత్తయి 6:33 లో ఉన్న యేసు మాటలు నిజమని ఒక జంట అనుభవం ఎలా చూపిస్తుంది?
9 ఒలేగ్, ఇరినా ఉదాహరణ గమనించండి.c ఈ పయినీరు జంట అవసరమున్న వేరే సంఘానికి వెళ్లి సేవ చేస్తున్నారు. ఆ దేశంలోని ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడంతో వాళ్ల ఉద్యోగం పోయింది. కానీ యెహోవా ప్రేమ వల్ల, బ్రదర్స్-సిస్టర్స్ సహాయం వల్ల దాదాపు ఒక సంవత్సరం పాటు ఉద్యోగం లేకపోయినా ఇల్లు గడిచింది. మరి, ఆ కష్టాల్ని వాళ్లు ఎలా తట్టుకోగలిగారు? దానికి ఒలేగ్ ఇలా చెప్తున్నాడు: “మొదట్లో కొంచెం దిగులుగా అనిపించినా, ప్రీచింగ్ చేయడంలో బిజీగా ఉండడంవల్ల జీవితంలో ముఖ్యమైన విషయాల మీద మనసు పెట్టగలిగాను.” ఒలేగ్, ఆయన భార్య ఉద్యోగం వెతుక్కుంటునే ప్రీచింగ్ కూడా చేశారు.
10 ఒకరోజు వాళ్లు ప్రీచింగ్ నుండి ఇంటికొచ్చేసరికి రెండు బ్యాగుల నిండా సరుకులు కనిపించాయి. అవి 160 కి.మీ. దూరం నుండి ఒక బ్రదర్ తీసుకొచ్చాడని వాళ్లకు తెలిసింది. ఒలేగ్ ఇలా చెప్తున్నాడు: “యెహోవాకు మామీద ఎంత శ్రద్ధ ఉందో సంఘం మమ్మల్ని ఎంత పట్టించుకుంటుందో ఆరోజు మళ్లీ మేము కళ్లారా చూడగలిగాం. పరిస్థితులు చేయి దాటిపోయినట్టు అనిపించినా, యెహోవా మాత్రం తన సేవకుల్ని ఎప్పుడూ మర్చిపోడని నాకు అర్థమైంది.”—మత్త. 6:33.
11. యెహోవా చెప్పిన పని చేయడంలో ముందుంటే ఆయన ఏం చేస్తాడు?
11 శిష్యుల్ని చేయడం ప్రాణాలు రక్షించే పని కాబట్టి మనం దానిమీద మనసుపెట్టాలని యెహోవా కోరుకుంటున్నాడు. 7వ పేరాలో చూసినట్లుగా ఆలయాన్ని కట్టడం మళ్లీ మొదలుపెట్టమని హగ్గయి యూదుల్ని ప్రోత్సహించాడు. అలా చేస్తే వాళ్లను “దీవిస్తాను” అని యెహోవా మాటిచ్చాడు. (హగ్గ. 2:18, 19) అలాగే మనం కూడా యెహోవా చెప్పిన పని చేయడంలో ముందుంటే, మనం చేసే ప్రయత్నాల్ని ఆయన తప్పకుండా దీవిస్తాడు.
యెహోవా మీద నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు?
12. ఎజ్రాకు, ఆయనతోపాటు ఉన్నవాళ్లకు ఎందుకు విశ్వాసం అవసరమైంది?
12 క్రీ.పూ. 468 లో బబులోను నుండి యెరూషలేముకు తిరిగొస్తున్న రెండో గుంపుతోపాటు ఎజ్రా వచ్చాడు. ఆ ప్రయాణం మొదలుపెట్టడానికి ఎజ్రాకు, ఆయనతోపాటు ఉన్నవాళ్లకు ఎంతో విశ్వాసం అవసరమైంది. ఎందుకంటే, వాళ్లకు అడుగడుగునా ప్రమాదాలు పొంచివున్నాయి. వాళ్లు వెళ్లే దారి సరిగ్గా లేదు, పైగా ఆలయాన్ని కట్టడానికి రాజు ఇచ్చిన బంగారం, వెండి వాళ్ల దగ్గర ఉంది. కాబట్టి దొంగలు వాటిని ఇట్టే దోచుకెళ్లిపోవచ్చు. (ఎజ్రా 7:12-16; 8:31) అంతేకాదు, వాళ్లు తిరిగొస్తున్న యెరూషలేములో కూడా పెద్దగా జనాలు లేరు. గోడలు, గేట్లు బాగుచేయాల్సి ఉంది. కాబట్టి ఆ ప్రాంతం అంత సురక్షితమైంది కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవా మీద నమ్మకం ఉంచిన ఎజ్రా నుండి మనమేం నేర్చుకోవచ్చు?
13. ఎజ్రాకు యెహోవాపై ఉన్న నమ్మకం ఎలా పెరిగింది? (అధస్సూచి కూడా చూడండి.)
13 కష్టాలు వచ్చినప్పుడు తన ప్రజల్ని యెహోవా ఎలా ఆదుకుంటాడో ఎజ్రా కళ్లారా చూశాడు. క్రీ.పూ. 484 లో బబులోనులోని యూదులందర్నీ చంపేయమని అహష్వేరోషు రాజు ఆజ్ఞ జారీచేశాడు. (ఎస్తే. 3:7, 13-15) దానివల్ల ఎజ్రాతో పాటు యూదులందరి జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఆ ఆజ్ఞ గురించి విన్నప్పుడు యూదులందరూ ఉపవాసముండి, కన్నీళ్లతో యెహోవాకు ప్రార్థన చేశారు. (ఎస్తే. 4:3) ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్లు యూదుల్ని ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో వాళ్లే నాశనమయ్యారు! (ఎస్తే. 9:1, 2) ఇలాంటి కష్టమైన పరిస్థితులు రాబోయే పరీక్షలన్నిటిని ఎదుర్కోడానికి ఎజ్రాను సిద్ధం చేశాయి. అలాగే, యెహోవా తన ప్రజల్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడగలడనే నమ్మకం ఆయనకు పెరిగింది.d
14. కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవా సహాయాన్ని రుచి చూసిన ఒక సిస్టర్ ఏం నేర్చుకుంది?
14 కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవా సహాయాన్ని రుచిచూస్తే, ఆయన మీద మనకున్న నమ్మకం మరింత పెరుగుతుంది. తూర్పు యూరప్‌లో ఉంటున్న అనస్తిషియా అనే సిస్టర్ అనుభవాన్ని పరిశీలించండి. ఆమె పని చేసే చోట రాజకీయ పార్టీలకు మద్దతివ్వమనే ఒత్తిడి ఎక్కువైందని ఆమె జాబ్ మానేసింది. ఆమె ఏమంటుందంటే: “నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేకుండా ఉండడం ఇదే మొదటిసారి. ఇక నా భారాన్నంతా యెహోవా మీదే వదిలేశాను. నిజానికి ఆయన నన్ను ఎంత బాగా పోషించాడో కళ్లారా చూశాను. ఈసారి మళ్లీ నా ఉద్యోగం పోయినా, నేను అస్సలు భయపడను. యెహోవా ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటున్నాడంటే, ఎప్పుడూ అలాగే చూసుకుంటాడు.”
15. యెహోవాపై నమ్మకం పెంచుకోవడానికి ఎజ్రాకు ఏం సహాయం చేసింది? (ఎజ్రా 7:27, 28)
15 యెహోవా తనకు తోడుగా ఉన్నాడని ఎజ్రా అర్థం చేసుకున్నాడు. గతంలో యెహోవా తనకు సహాయం చేసిన సందర్భాల్ని గుర్తుచేసుకున్నప్పుడు, ఎజ్రాకు యెహోవాపై ఉన్న నమ్మకం మరింత పెరిగి ఉంటుంది. “నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు” అనే మాటల్ని గమనించండి. (ఎజ్రా 7:27, 28 చదవండి.) ఇలాంటి మాటల్నే ఎజ్రా తన పేరుతో ఉన్న పుస్తకంలో ఆరుసార్లు రాశాడు.—ఎజ్రా 7:6, 9; 8:18, 22, 31.
ఏయే పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చూసే అవకాశం దొరుకుతుంది? (16వ పేరా చూడండి)e
16. మనకు ఏయే పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉంటాడు? (చిత్రం కూడా చూడండి.)
16 కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా మనకు కూడా సహాయం చేయగలడు. ఉదాహరణకు, సమావేశానికి వెళ్లడానికో లేదా మీటింగ్స్‌కు వెళ్లడానికో మీ బాస్‌ను పర్మిషన్ అడగడానికి ప్రయత్నించండి. అప్పుడు యెహోవా మీకు తోడుగా ఉన్నాడని చూసే అవకాశం దొరుకుతుంది. బహుశా మనం అనుకున్న దానికన్నా మంచి ఫలితాలే రావచ్చు. దానివల్ల, యెహోవా మీద మన నమ్మకం ఇంకా బలపడుతుంది.
ప్రజల పాపాల్ని బట్టి ఆలయం దగ్గర ఎజ్రా గుండె పగిలేలా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడున్న ప్రజలు కూడా ఏడుస్తున్నారు. అప్పుడు షెకన్యా ఎజ్రాను ఓదారుస్తూ ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులకు ఇంకా ఆశ మిగిలేవుంది. . . . మేము నీకు మద్దతిస్తాం.”—ఎజ్రా 10:2, 4. (17వ పేరా చూడండి)
17. కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎజ్రా వినయాన్ని ఎలా చూపించాడు? (కవర్ పేజీ మీదున్న చిత్రం చూడండి.)
17 సహాయం కోసం ఎజ్రా యెహోవాకు వినయంగా ప్రార్థించాడు. బాధ్యతలు తనను ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రతీసారి ఎజ్రా యెహోవాకు ప్రార్థించాడు. (ఎజ్రా 8:21-23; 9:3-5) అలా చేయడం వల్ల, వేరేవాళ్లు కూడా ఎజ్రాకు మద్దతిచ్చారు, ఆయన్ని అనుకరించారు. (ఎజ్రా 10:1-4) కనీస అవసరాలు తీర్చుకునే విషయంలో లేదా కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో సతమతమౌతున్నప్పుడు మనం కూడా పూర్తి నమ్మకంతో యెహోవాకు ప్రార్థించాలి.
18. యెహోవాపై మన నమ్మకాన్ని పెంచుకోవడానికి ఏం సహాయం చేస్తుంది?
18 యెహోవా సహాయాన్ని, తోటి బ్రదర్స్-సిస్టర్స్ సహాయాన్ని వినయంగా తీసుకుంటే దేవుని మీద మనకున్న నమ్మకం మరింత పెరుగుతుంది. ముగ్గురు పిల్లల తల్లియైన ఎరికా అనే సిస్టర్ అనుభవాన్ని పరిశీలించండి. ఆమె జీవితంలో హృదయాన్ని పిండేసే కొన్ని సంఘటనలు వెంటవెంటనే జరిగాయి. ఆమెకు ఒక బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఎంతోకాలం గడవకముందే, ఆమె భర్త కూడా చనిపోయాడు. గతాన్ని తలుచుకుంటూ ఆమె ఇలా చెప్తుంది: “యెహోవా ఎలా సహాయం చేస్తాడో మీరు అస్సలు ఊహించలేరు. ఆయన ఏవైపు నుండైనా సహాయం చేస్తాడు. బ్రదర్స్-సిస్టర్స్ మాటల ద్వారా, పనుల ద్వారా ఆయన నా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చాడు. అయితే, నేను మనసువిప్పి మాట్లాడినప్పుడే వాళ్లు నాకు సహాయం చేయడం తేలికౌతుంది.”
చివరివరకు యెహోవా మీద నమ్మకం వదులుకోకండి
19-20. యెరూషలేముకు తిరిగి రాలేకపోయిన యూదుల నుండి మనమేం నేర్చుకోవచ్చు?
19 యెరూషలేముకు తిరిగి వెళ్లలేని యూదుల నుండి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్లలో కొంతమంది వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు లేదా కుటుంబ బాధ్యతల వల్ల అక్కడే ఆగిపోయి ఉండవచ్చు. అయినాసరే, ఆలయం కట్టడానికి వాళ్లకు చేతనైనంత సహాయం చేశారు. (ఎజ్రా 1:5, 6) నిజానికి అలా ఆగిపోయినవాళ్లు, మొదటి గుంపు యెరూషలేముకు తిరిగి వచ్చిన దాదాపు 19 సంవత్సరాల తర్వాత కూడా తమ విరాళాల్ని పంపిస్తూనే ఉన్నారని అర్థమౌతుంది.—జెక. 6:10.
20 ఒకవేళ మనం కూడా యెహోవా సేవలో అనుకున్నంత చేయలేకపోతున్నాం అనిపిస్తే, అప్పుడేంటి? ఆయన్ని సంతోషపెట్టడానికి మనం చేసే ఏ చిన్న ప్రయత్నమైనా యెహోవా విలువైనదిగా చూస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే, జెకర్యా రోజుల్లో బబులోనులో ఉన్న బందీలు ఇచ్చిన వెండిబంగారాలతో ఒక కిరీటాన్ని చేయమని యెహోవా జెకర్యాకు చెప్పాడు. (జెక. 6:11) వాళ్లు పెద్దమనసుతో ఇచ్చిన విరాళాలకు ఆ “గొప్ప కిరీటం” ఒక “జ్ఞాపికగా” ఉంటుంది. (జెక. 6:14, అధస్సూచి) దీన్నిబట్టి మన జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా, యెహోవా సేవ చేయడానికి మనం చేసే ప్రయత్నాలన్నిటినీ ఆయన ఎన్నడూ మర్చిపోడనే నమ్మకంతో ఉండవచ్చు.—హెబ్రీ. 6:10.
21. భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవడానికి మనకేది సహాయం చేస్తుంది?
21 ఈ చివరి రోజుల్లో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ముందుముందు పరిస్థితి ఇంకా ఘోరంగా కూడా మారవచ్చు. (2 తిమో. 3:1, 13) అయితే, ఈ ఆందోళనలు మనల్ని నిలువెత్తున ముంచేయకుండా చూసుకుందాం. “ధైర్యంగా ఉండండి . . . నేను మీకు తోడుగా ఉన్నాను” అని హగ్గయి కాలంలోని తన ప్రజలకు యెహోవా చెప్పిన మాటల్ని మర్చిపోవద్దు. (హగ్గ. 2:4, 5) తన ఇష్టం చేయడానికి కృషి చేసినంత కాలం యెహోవా మన చేయి విడిచిపెట్టడనే నమ్మకంతో ఉండవచ్చు. హగ్గయి, జెకర్యా ప్రవచనాల నుండి అలాగే ఎజ్రా ఉదాహరణ నుండి మనం ఎన్నో పాఠాల్ని నేర్చుకున్నాం. భవిష్యత్తులో మనకు ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా, మనం నేర్చుకున్నవి పాటించినప్పుడు యెహోవా మీద మనకున్న నమ్మకం చెక్కుచెదరదు.
పాట 122 స్థిరంగా, నిలకడగా ఉందాం!
a ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ పరిస్థితుల్లో మార్పులు, ప్రీచింగ్‌లో వ్యతిరేకత లాంటి కష్టాలు ఎదురైనా యెహోవా మీద మన నమ్మకాన్ని ఎలా బలపర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
b యెహోవా “సైన్యాలకు అధిపతి” అని హగ్గయి పుస్తకంలో 14 సార్లు ఉంది. అంటే ఆయనకు అంతులేని శక్తి ఉందని, పరలోకంలో ఉన్న సైన్యాలన్నీ తన చేతిలో ఉన్నాయని యూదులకు అలాగే మనకు ఆ మాటలు గుర్తుచేస్తున్నాయి.—కీర్త. 103:20, 21.
c కొన్ని అసలు పేర్లు కావు.
d ఎజ్రా ధర్మశాస్త్రాన్ని నకలు రాయడంలో ఆరితేరిన వ్యక్తి. అందుకే ఆయన యెరూషలేముకు వెళ్లకముందే యెహోవా చెప్పిన ప్రవచనాల మీద నమ్మకాన్ని పెంచుకోగలిగాడు.—2 దిన. 36:22, 23; ఎజ్రా 7:6, 9, 10; యిర్మీ. 29:14.
e చిత్రం వివరణ: ఒక బ్రదర్ సమావేశం హాజరవ్వడానికి తన బాస్‌ను సెలవు అడుగుతున్నాడు. కానీ ఆయన దానికి ఒప్పుకోవట్లేదు. దాని గురించి ఆ బ్రదర్ పట్టుదలగా ప్రార్థనలో అడుగుతున్నాడు. ఆ సమావేశానికి హాజరవ్వడం వల్ల తను ఒక మంచి ఉద్యోగిగా తయారవ్వడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో ఆహ్వాన పత్రాన్ని ఇచ్చి వివరించినప్పుడు ఆ బాస్ మెత్తబడి, సెలవు ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నాడు.