అనుభవం ఉన్న ప్రచారకుల నుండి నేర్చుకోండి
సంఘంలో ఉన్న అనుభవంగల ప్రచారకులను మనం విలువైనవాళ్లుగా చూస్తాం. కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తున్నారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే పరిచర్యలో మంచి నైపుణ్యాలు సంపాదించుకున్నారు. ప్రకటనా పనిని, శిష్యులను చేసే పనిని మరింత విస్తృతం చేస్తూ క్రైస్తవ సంఘాన్ని ఈ చివరి రోజుల్లో యేసు ఎలా నడిపించాడో వీళ్లు చూశారు. (మత్త. 28:19, 20) పరిచర్య చేయడంతో పొందిన “బలాధిక్యము” వల్ల వాళ్లు తమ జీవితంలో వచ్చిన ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. (2 కొరిం. 4:7) ఎంతో అనుభవం ఉన్న ఈ ప్రచారకుల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. మనం అవకాశం ఇస్తే వాళ్లు నేర్చుకున్నవి మనకు చెప్పడానికి సంతోషిస్తారు. (కీర్త. 71:18) కాబట్టి, వాళ్లనుండి నేర్చుకోవడానికి మనం అవకాశాలు వెదకాలి. ఎలా?
పరిచర్యలో: పరిచర్య బాగా చేయడానికి, కొత్త ప్రచారకులకు లేదా తక్కువ అనుభవం ఉన్న ప్రచారకులకు సహాయం అవసరం. అనుభవం ఉన్న ప్రచారకులు పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్లను చూసి చాలా నేర్చుకోవచ్చు. (ఫిబ్రవరి 15, 2015, కావలికోటలో “పరిచర్యలో మీ ఉత్సాహాన్ని కాపాడుకోండి” అనే ఆర్టికల్లో “కొత్త ప్రచారకులకు సహాయం చేయండి” కింద ఉన్న మూడవ పేరా చూడండి.) పరిచర్యలో ఇలాంటి ప్రచారకులతో పని చేయడం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు?
పరిచర్య బాగా చేసే ఒక ప్రచారకున్ని మీతోపాటు పని చేయడానికి మీరు పిలవవచ్చు. ఆ ప్రచారకుడు అనారోగ్యం వల్ల ఇంటినుండి కదల్లేని పరిస్థితిలో ఉంటే, అప్పుడప్పుడు మీరు మీ బైబిలు అధ్యయనాలను ఆ ప్రచారకుని ఇంట్లోనే చేయవచ్చు. అధ్యయనం అయిపోయాక, ఆ ప్రచారకున్ని సలహాలు అడగండి.
వాళ్లతో సమయం గడపండి: అనుభవం ఉన్న ప్రచారకులతో సమయం గడిపి వాళ్ల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి. మీ కుటుంబ ఆరాధనకు వాళ్లను పిలిచి, ఇంటర్వూ చేయండి. అనారోగ్యం వల్ల ఇంటినుండి కదల్లేని పరిస్థితిలో ఉంటే, మీ కుటుంబ ఆరాధనను వాళ్ల ఇంట్లో చేసుకోగలరేమో చూడండి. వాళ్లు సత్యంలోకి ఎలా వచ్చారు? ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు? మీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని చూశారు? యెహోవా సేవలో ఎలాంటి ఆనందాన్ని పొందారు? లాంటి ప్రశ్నలు అడగండి.
మరీ ఎక్కువ ఆశించకండి. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోండి. మనందరిలానే, ఎంతో కాలం నుండి ప్రచారకులుగా ఉన్నవాళ్లకు కూడా పరిచర్య విషయంలో వేర్వేరు వరాలు ఉన్నాయి. (రోమా. 12:6-8) కొంతమంది వయసులో చాలా పెద్దవాళ్లు అయ్యుంటారు, కాబట్టి వాళ్లు మనతో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. అయినా, యెహోవాకు నమ్మకంగా సేవ చేసే విషయంలో వాళ్ల అనుభవం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు.