“దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి” ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి
1. పరిచర్య కోసం మనం ఏ కొత్త పరికరాన్ని పొందాం?
1 “దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి!” ప్రాదేశిక సమావేశంలో, “దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి” అనే చిన్నపుస్తకాన్ని అందుకున్నాం. పరిచర్యలో మాట్లాడడానికి సిద్ధపడుతున్నప్పుడు ఈ కొత్త పరికరాన్ని ఎలా ఉపయోగించవచ్చు? తర్కించడం (ఇంగ్లీషు) పుస్తకంలో ఉన్నట్టే ఇందులో కూడా అనేక బైబిలు అంశాలు, వాటికి సంబంధించిన లేఖనాలు ఉన్నాయి. సంభాషణ మొదలుపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
2. “దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి” అనే పరికరాన్ని మన పరిచర్యలో ఎలా ఉపయోగించవచ్చు?
2 మీరు ఎనిమిదవ ప్రశ్న ఉపయోగిస్తూ ఇలా చెప్పవచ్చు: “‘మనుషులు పడే బాధలకు దేవుణ్ణి నిందించాలా?’ అని చాలామంది అనుకుంటున్నారు దాని గురించే మేము మా పొరుగువాళ్లతో కాసేపు మాట్లాడుతున్నాం. [కొన్ని ప్రాంతాల్లో ఇంటివాళ్లకు ఆ ప్రశ్న చూపిస్తే ఇంకా బాగుంటుంది.] మీరు ఏమనుకుంటున్నారు? [వాళ్లను జవాబు చెప్పనివ్వండి.] ఆ ప్రశ్నకు బైబిలు నమ్మదగిన జవాబు ఇస్తుంది.” అక్కడ ఇచ్చిన ఒకటి లేదా కొన్ని లేఖనాలను నేరుగా బైబిలు నుండి చదివి, చర్చించండి. వాళ్లు ఇంకా ఆసక్తి చూపిస్తే, మొదట్లో ఉన్న 20 ప్రశ్నలు చూపించి ఈసారి కలిసినప్పుడు చర్చించడానికి ఒక ప్రశ్నను ఎంపిక చేసుకోమనండి.
3. క్రైస్తవులుకాని వాళ్లు ఉన్న ప్రాంతాల్లో సంభాషణ మొదలుపెట్టడానికి “దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి” అనే పరికరాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
3 క్రైస్తవులుకాని వాళ్లు ఉన్న ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు 4వ ప్రశ్న, 13-17 ప్రశ్నలు సహాయకరంగా ఉంటాయి. ఉదాహరణకు, 17వ ప్రశ్నలోని సమాచారాన్ని ఉపయోగించి ఇలా చెప్పవచ్చు: “కుటుంబాలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము కాసేపు అందరిని కలుస్తున్నాం. ఈ రోజుల్లో కుటుంబాలకు చాలా సమస్యలు ఎదురౌతున్నాయి కదా? [వాళ్లను జవాబు చెప్పనివ్వండి.] జ్ఞానంగల ఈ మాటలు సహాయకరంగా ఉన్నాయని చాలామంది దంపతులు గుర్తించారు, “భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” [ఇవి ఎఫెసీయులు 5:33లోని మాటలని మీరు చెప్పనక్కర్లేదు. మీరు మహిళతో మాట్లాడుతున్నట్లైతే ఎఫెసీయులు 5:28లోని మాటలను చెప్పవచ్చు.] ఈ సలహా పాటిస్తే వైవాహిక జీవితం బాగుంటుందని మీకు అనిపిస్తుందా?”
4. క్రైస్తవులుకాని వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, సంభాషణ చివర్లో మీరేమి చేయవచ్చు?
4 ముగింపులో, మరోసారి వాళ్లను కలిసి సంభాషణ కొనసాగించడానికి ఏర్పాట్లు చేసుకోండి. బహుశా మీరు ఉపయోగించిన ప్రశ్నలోని మరో లేఖనం గురించి మాట్లాడాలని అనుకోవచ్చు. సరైన సమయం చూసుకొని, మీరు వాళ్లతో పంచుకుంటున్న జ్ఞానంగల మాటలు బైబిల్లోనివని చెప్పండి. ముందు జరిపిన చర్చల ఆధారంగా, బైబిలు పట్ల ఆ వ్యక్తికి ఉన్న అభిప్రాయం ఆధారంగా ఆయనకు ఏ ప్రచురణ నచ్చుతుందని మీకనిపిస్తే అది ఇవ్వండి.—డిసెంబరు 2013 మన రాజ్య పరిచర్యలోని మధ్య పేజీలను చూడండి.